హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.
తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్‌లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు.
ఈ పంట అమ్మటం కోసం కాదు
ఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.
ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.
మా కోసం ఆర్గానిక్ పంటలు
‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.
చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?
కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.
దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి?
Comments
Please login to add a commentAdd a comment