Punjab Farmers
-
‘కనీస’ చట్టబద్ధతే సంజీవని!
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది. అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు. రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్‌తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది. దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -
దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
చండీగఢ్: పంజాబ్‌లోని ఖానౌరీ బోర్డర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు కేంద్రం పంజాబ్ రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో జగ్జీత్ సింగ్ దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు నేత సుఖ్జీత్ సింగ్ హర్డోజండే మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.రైతు నేత దల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) 54వ రోజుకు చేరుకుందని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ లభించేంత వరకు జగ్జీత్ సింగ్ నిరవధిక నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారన్నారు. ఉపవాస దీక్ష సమయంలో అతని ఆరోగ్యం క్షీణించిందని, దాదాపు 20 కిలోగ్రాముల బరువు తగ్గారని, ఈ నేపధ్యంలో వైద్య సహాయాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారని జండే తెలియజేశారు.మరోవైపు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తొలుత ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు నిరాకరించారు. తాజాగా జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్(Joint Secretary Priya Ranjan) నేతృత్వంలోని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రతినిధి బృందం దల్లెవాల్‌ను కలుసుకుని, యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇదే సమయంలో ఖనౌరి సరిహద్దు వద్ద మరో 10 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో మొత్తం నిరాహార దీక్ష చేస్తున్న రైతుల సంఖ్య 121కి చేరింది.ఫిబ్రవరి 14న చండీగఢ్(Chandigarh)లో పంజాబ్ రైతుల సమావేశమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులతో కేంద్రం తిరిగి చర్చలు జరపనుంది. దీంతో ఈ పంజాబ్ రైతుల సమస్యలపై ప్రతిష్టంభన తొలగిపోనున్నదని రైతులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
ఎంఎస్పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కేవలం పంజాబ్‌కే కాదు, దేశంలోని రైతులందరికీ అవసరమేనని నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్(70) పేర్కొన్నారు. ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద దలేవాల్ చేపట్టిన దీక్షకు శనివారంతో 40 రోజులు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఖనౌరీలో ఏర్పాటైన ‘కిసాన్ మహాపంచాయత్’నుద్దేశించి దలేవాల్ మాట్లాడారు. కార్యక్రం వేదికపైకి దలేవాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు. బెడ్‌పై పడుకుని సుమారు 11 నిమిషాలపాటు మాట్లాడారు. ‘ఎంఎస్పీ పంజాబ్ రైతులకు మాత్రమే దేశమంతటికీ అవసరమే. ఎంఎస్పీకి గ్యారెంటీ సహా మనం చేస్తున్న డిమాండ్లు సాధారణమైనవి కావన్న విషయం నాకు తెలుసు. వీటిని సాధించుకోవడం ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు కూడా. ఇప్పటి ఆందోళనల్లో రెండు రైతు సంఘాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి. పంజాబ్ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ పోరులో పాల్గొనాలి. ఇది కేవలం పంజాబ్ డిమాండ్ మాత్రమే కాదు, యావద్దేశానిది. అనే సందేశాన్ని కేంద్రానికి వినిపించేలా చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు. ‘మనం గెలుస్తామనే విశ్వాసం నాకుంది. బల ప్రయోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచినా మనల్ని మాత్రం ఓడించలేదు. నాకేమైనా పట్టించుకోను. మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవసరం రాకూడదనే నా ప్రయత్నమంతా’అని వివరించారు. ‘దలేవాల్ ప్రాణాలు ముఖ్యమని సుప్రీంకోర్టు అంటోంది. నేనూ మనిషిని సరే, దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడిన 7 లక్షల మంది సంగతేమిటని గౌరవ సుప్రీంకోర్టును అడుగుతున్నా’అని దలేవాల్ అన్నారు. -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
దలేవాల్ బతికుండాలా? చనిపోవాలా?
న్యూఢిల్లీ: రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్‌కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. దలేవాల్‌ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్‌కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీక్షలో ఉన్న దలేవాల్ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. చికిత్స తీసుకోవడానికి దలేవాల్ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్ సింగ్ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. సెలవు రోజునా ప్రత్యేక విచారణ సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. -
రైతులపైకి టియర్‌గ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో రైతు సంఘాలకు చెందిన 101 మంది రైతులు మధ్యాహ్నం మరోసారి శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడం గత పది రోజుల్లో ఇది మూడోసారి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అంబాలా డిప్యూటీ కమిషనర్ రైతులతో సుమారు 40 నిమిషాలసేపు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు సంయమనం పాటించాలని కోరారు. అయినా రైతులు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో 17 మంది రైతులు గాయాలపాలైనట్లు సమాచారం. రైతులు తమ సొంత వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శంభు చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈనెల 17 వరకు మొబైల్, ఇంటర్నెట్‌సేవలు నిలిపివేసింది. హరియాణాకు చెందిన రెజ్లర్, కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా శంభు సరిహద్దు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. డల్లేవాల్ ఆరోగ్యం విషమం ఖన్నౌరీలో 19 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా మారిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆయనకు చికిత్స అందించాలని కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. కానీ చికిత్స తీసుకునేందుకు డల్లేవాల్ నిరాకరిస్తున్నారు. ‘రైతుల కోసం దీక్ష చేస్తున్నా. వారి నడుమే చివరి శ్వాస తీసుకుంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఆయన బెడ్‌ను శుక్రవారం ఆందోళన వేదిక వద్దకే మార్చారు.16న ట్రాక్టర్ ర్యాలీ రైతులపై పోలీసుల బలప్రయోగాన్ని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ తీవ్రంగా ఖండించారు. ‘’మార్చ్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లే 101 మంది రైతుల కారణంగా శాంతి భద్రతలకు భంగమెలా కలుగుతుంది? పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చిస్తున్నారు. రైతుల ఆందోళనలను అణచివేయాలని ఏ రాజ్యాంగం చెప్పింది?’’ అని మీడియాతో ఆయన అన్నారు. పార్లమెంట్లో రైతుల సమస్యలపై చర్చనే జరగలేదని ఆక్షేపించారు. ‘‘మా కార్యాచరణలో భాగంగా సోమవారం పంజాబ్ మినహా మిగతా చోట్ల ట్రాక్టర్ మార్చ్ ఉంటుంది. 18న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పంజాబ్‌లో రైల్ రోకో చేపడతాం’’ అని ప్రకటించారు. -
ఢిల్లీలో రైతుల పోరుబాట
-
నేడు పంజాబ్ రైతుల ఢిల్లీ ఛలో మార్చ్
-
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
రైతుల డిమాండ్లకు చెవి ఒగ్గాలి!
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి. రానున్న 2024 పార్లమెంటరీ ఎన్నికలు విరుద్ధమైన అవగాహనలకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ప్రతిపక్షాల కుల గణన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గు తుందనే భావన పోయి, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ ప్రయోజనం పొందుతుందనే అభిప్రాయం వైపు లోలకం సూచీ కదిలింది. అయితే, సమాఖ్య నిధుల్లో తమ వాటా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ కథనాన్ని సవాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్యనే పంజాబ్ రైతులు ఢిల్లీ వైపు కవాతు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనకు పలు రైతు సంఘాలు మద్దతు తెలుపడంతో ఎన్నికముందు మరోసారి రంగం సిద్ధమైంది. ఢిల్లీ సరిహద్దులో బలగాలను మోహరించి, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, డిమాండ్ల స్వభావం, పాల్గొంటున్న సంఘాలు, ప్రభుత్వ ప్రతిస్పందన వంటి అనేక అంశాలలో, 2020 రైతుల నిరసనలకు ప్రస్తుత నిరసనభిన్నంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలకు జగ్జీత్ సింగ్ డల్లేవాల్, సర్వన్ సింగ్ పంఢేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహిస్తోంది. వీరు మునుపటి రైతుల నిరసనలో ప్రముఖులు కాదు. దర్శన్ పాల్, బల్బీర్ సింగ్ రాజేవాల్ నేతృత్వం వహిస్తున్న రెండు గ్రూపులు భారత్ బంద్‌కు వేర్వేరుగా పిలుపు నిచ్చాయి. హరియాణాలో మితిమీరిన ప్రభుత్వాధికార వినియోగానికి వ్యతిరేకంగా భారత్ కిసాన్ యూనియన్(ఉగ్రాహాన్) రైల్ రోఖోకు ప్రత్యేక పిలుపునిచ్చింది. 2020లో మొదలైన రైతుల ఆందోళనకు సైద్ధాంతికంగా సమ ర్థమైన 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. పైగా అది పంజాబ్ కేంద్రంగా మాత్రమే జరగలేదు. అందులో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికి చాలావరకు మౌనంగా ఉన్నాయి. అలాగే రాకేశ్ టికైత్, గుర్నామ్ సింగ్ చఢూనీ నేతృత్వంలోని యూనియన్లు ప్రస్తుతం ఆందోళనలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాయి. అంతకుముందటి నిరసన ఉద్యమం... పౌర సమాజ కార్య కర్తలు, కళాకారులు, నిపుణులు, పదవీ విరమణ చేసిన పౌర సేవ కులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి విస్తృత మద్దతునుపొందింది. రాడికల్ మితవాదులు కూడా తమ సొంత కథనాలతోఅందులోకి వచ్చారు కానీ వారు కేంద్రస్థానంలోకి ప్రవేశించలేదు. ఉద్యమానికి ప్రగతిశీల రైతులు నాయకత్వం వహించడం, వారికి మత కుల అనుబంధాలకు అతీతంగా ఉదారవాదులు మద్దతునివ్వడం వల్ల రాడికల్ మితవాద రాజకీయాల పాత్ర పరిమితమైంది. కానీ ప్రస్తుత నిరసనకు విస్తృతమైన మద్దతు లేదు. పైగా గుర్తింపు రాజకీయాలవెంపర్లాట కూడా దీని వెనుక ఉంటోంది. నేడు రైతు సంఘాలలోని మూడు ప్రధాన వర్గాలు ఒకే బ్యానర్ కింద ఐక్యం కాలేదు. అవి ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా (రాజ కీయేతరమైన గ్రూప్) ఇతర యూనియన్లను అధిగమించి నాయకత్వ స్థానంలోకి ప్రవేశించింది. పంజాబ్ ప్రభుత్వ మద్దతుతో కేంద్ర ప్రభు త్వంతో చర్చలు జరపడానికి సిద్ధమైంది. డిమాండ్ల విషయానికొస్తే, ప్రస్తుత నిరసనలు మునుపటి కంటే నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారతదేశం వైదొలగడం, వ్యవసాయ రుణాల మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులు– రైతు కూలీలకు పెన్షన్లు, 2020–21 నిరసనల సంద ర్భంగా రైతులపై దాఖలైన కేసుల ఉపసంహరణ, నష్టపరిహారంవంటివి ఇందులో ఉన్నాయి. నిరసన కాలంలో మరణించిన రైతు లకూ, ‘లఖీంపూర్ ఖీరీ ఘటన’ బాధితులకూ న్యాయం జరిగేలా చూడటం, వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత 2021లో బీజేపీ చేసిన వాగ్దానాలపై దృష్టి పెట్టడం కూడా డిమాండ్లలో ఉన్నాయి. మరోవైపు, సరిహద్దుల్లో భారీగా కంచెలు వేయడం, ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించడం చూస్తుంటే ప్రస్తుత నిరసనపై ప్రభుత్వ ప్రతిస్పందన ఇప్పుడు కూడా ప్రతిచర్యగానే కని పిస్తోంది. పంజాబ్, హరియాణాల్లో అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంజాబ్, హరియాణా సరిహద్దులను రాజ స్థాన్ మూసివేసింది. అనేక జిల్లాలలో నిషేధాజ్ఞలను విధించింది. వారి ‘ఢిల్లీ ఛలో’ ప్రకటనకు ముందే, రైతులతో చర్చలు ప్రారంభించినప్ప టికీ, 2021లో చేసిన వాగ్దానాలపై కేంద్రప్రభుత్వం ఇంకా స్పందించ లేదు.అలాగే, నిరసన ప్రదేశంలో టియర్ గ్యాస్ వాడకం, డ్రోన్ల ద్వారా పొగ బాంబులు వేయడం, రాళ్లు రువ్వడం, వాహనాలను సీజ్ చేయడం, రైతులను పోలీసులు నిర్బంధించడం వంటి ఘటనలు అలాగే కొనసాగుతున్నాయి. క్రితంసారి మితిమీరిన బలప్రయోగం జరిపిన అనుభవం నుంచి ప్రభుత్వం పాఠాలేమీ నేర్చుకున్నట్టు లేదు. ఎందుకంటే, మితిమీరిన బలప్రయోగం చేయడం... నిరసనను తీవ్ర దారుల్లోకి మళ్లించాలనుకునేవారికి ఊతమిస్తుంది. 2020లో జరిగిన రైతుల నిరసన నుండి ఇతర పాఠాలు కూడా ఉన్నాయి. అది రైతుల విజయంతో ముగిసింది, అయితే 700 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఎజెండాకు వ్యతిరేకంగా ఇది మొదటి, సుదీర్ఘ పోరాటం. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్న వేళ వ్యవసాయ వ్యాపారం (అగ్రి బిజినెస్) మాత్రం విపరీతంగా లాభాలు ఆర్జించడం విడ్డూరం. ఆహార ధాన్యాలకు కొత్త మార్కెట్లు లేకపోవడం, నీటి మట్టం తగ్గడం లాంటి కారణాలనే వ్యవసాయ సంక్షోభానికి కారణా లుగా చూపడం పరిస్థితి తీవ్రతను తగ్గించడమే అవుతుంది. ఆహారమే ఇప్పుడు రాజకీయం. ఇది కేవలం పరిపాలన, చట్ట పరమైన చర్యల ద్వారా మాత్రమే పరిష్కారం కాదు. ఆహార సార్వ భౌమాధికారం, ఆహార భద్రత, రైతుల జీవనోపాధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాజకీయ సంకల్పం అవసరం. కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను భాగం చేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొన డంలో నిమగ్నం కావాలి. దీన్నొక ఓట్ల వ్యవహారంగా చూడకూడదు. వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేయాలంటే, సబ్సిడీలు ఇవ్వాలి. తమ వాణిజ్య వ్యవసాయాన్ని నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి. క్రితంసారి రైతులు వీధుల్లోకి వచ్చిన ఘటన నుండి మరొక పాఠం ఏమిటంటే, ప్రభుత్వం అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే చట్టాలను రూపొందించాలి. లేకపోతే, అది ప్రజలకు విషాదాన్నీ, నాయకత్వానికి ఇబ్బందినీ కలిగిస్తుంది. మూడు వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన మద్దతును అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ వాగ్దానంపై చొరవ విషయంలో ఆలస్యమే ఇప్పుడు తమ నిరసనను ప్రారంభించేందుకు రైతులకు తగిన కారణాన్ని అందించింది. రాజకీయ నాయకత్వం కేవలం నిరసనలకు మాత్రమే స్పందిస్తుందనీ, ఎన్నికల వేళ మాత్రమే ప్రజల వాణిని వింటుందనే భావన ట్రిగ్గర్‌గా పనిచేసింది. - వ్యాసకర్త చండీగఢ్‌లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్_ -ప్రొ‘‘ ప్రమోద్ కుమార్ -
కేంద్రంపై పోరాడండి..తోడుంటాం
సాక్షి, హైదరాబాద్: ఏది ఏమైనా తాము రైతుల వెంట ఉంటామని.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం కొనసాగించాలని రైతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలను మార్చేసే శక్తి రైతులకు ఉందని.. ఈ విషయంగా దేశంలోని రైతులంతా ఏకం కావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో నిర్వహించిన రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలను, గల్వాన్‌లో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదివారం చండీగఢ్‌లో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లతో కలిసి సీఎం కేసీఆర్ పరామర్శించారు. 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున.. నలుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. దేశవ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. రైతులంతా ఉద్యమంలోకి రావాలి ‘‘రైతుల సంక్షేమం కోసం మాట్లాడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే కొందరికి నచ్చదు. ఒత్తిడి తెస్తారు. రైతు ఉద్యమ సమయంలో మిమ్మల్ని ఖలిస్తానీలన్నారు. దేశ ద్రోహులన్నారు. ఇవన్నీ మేం విన్నాం. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని రైతు నాయకులను కోరుతున్నాను. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచే కాదు.. యావత్ భారత దేశం నుంచీ రైతు ఉద్యమం సాగాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులన్నింటి నుంచి రైతులు ఉద్యమంలో పాల్గొనాలి. ఇది మన హక్కు. దేశానికి, ప్రపంచానికి మనం ఆహారం అందిస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రివాల్ తమ వంతు సాయం చేశారు. రైతులను రక్షించే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లన్నీ తీర్చే వరకు పోరాటానికి మేం సంపూర్ణ మద్దతునిస్తాం. ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కొన్ని మంచి మాటలు చెప్పి మీ మనసును శాంతపరిచేందుకు వచ్చాం. ఇలాంటి పరిస్థితి ఏ దేశంలోనూ లేదు కేంద్రం తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తలవంచి నమస్కరిస్తున్నాను. అమరులైన వారిని తిరిగి తీసుకురాలేం. కానీ రైతు కుటుంబాలు ఒంటరి కాదు. యావత్ దేశం వారి వెంట ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇలాంటి సమావేశాలు నిర్వహించాల్సి రావడం బాధాకరం. అమరులైన వారికోసం నిర్వహించే సభలను చూసినప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. దుఃఖం వస్తుంది. దేశం ఎందుకిలా ఉందనిపిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. భారత పౌరుడిగా దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో సమస్యల్లేని దేశం ఉండదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరెక్కడా ఉండవు. దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ దేశానికి పంజాబ్ చేసిన సేవలు అసామాన్యం. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులను కన్న పంజాబ్‌ను దేశం ఎన్నటికీ మర్చిపోదు. దేశం ఆహారం కోసం పరితపిస్తున్నప్పుడు హరిత విప్లవం ద్వారా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రమిది. దేశం కోసం చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్ సంతోశ్‌బాబుది మా తెలంగాణ. ఆయనతోపాటు పంజాబ్ సైనికులు కూడా వీర మరణం పొందారు. వీర మరణం పొందిన పంజాబ్ సైనికుల కుటుంబాలను పరామర్శించాలని అనుకున్నాను. కానీ ఎన్నికల కారణంగా రాలేకపోయిన. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో చెప్తే.. ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి, నా కార్యక్రమానికి మద్దతిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమంటోంది.. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా రైతుల కోసం ఎంతో చేస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఒక్కోరోజు 10, 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాత్రిపూట వ్యవసాయ మోటర్లు వేసేందుకు వెళ్తే పాములు కుట్టేవి. ఆ బాధలు వినేవాళ్లే ఉండేవారు కాదు. తెలంగాణ ఏర్పడ్డాక భగవంతుడి దయతో విద్యుత్ సమస్యను అధిగమించాం. అన్ని రంగాలతో పాటు వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. కేంద్రం రైతుల కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటోంది. రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోంది. మా ప్రాణాలు పోయినా.. మేం మాత్రం మీటర్లు బిగించబోమని అసెంబ్లీ నుంచే తీర్మానం చేసేశాం’’అని కేసీఆర్ స్పష్టం చేశారు. -
చతుర్ముఖ పోరులో... పంజాబ్ షేర్ ఎవరో?
వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్. ఎందుకంటే మిగతా మూడు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పంజాబ్ రైతులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తారు... అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయం బాగా వేడెక్కింది. శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలైతే ఏడాదికాలంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్వర్ణదేవాలయం, కపుర్తలాలలో సిక్కుల మతచిహ్నాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరగడం, లుథియానా కోర్టులో పేలుడు వెనుక ఖలిస్థాన్ గ్రూపుల హస్తమున్నట్లు వార్తలు రావడంతో... రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు, ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీని పెట్టి బీజేపీతో జట్టు కట్టడంతో పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారాయి. రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తాజా పరిస్థితిపై విశ్లేషణ... దళిత ఓటుపై గంపెడాశలు పదేళ్లు అధికారంలో ఉండి... తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాష్ట్రం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోవడంతో 2017లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. పంజాబ్ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని పసిగట్టిన అకాలీదళ్ 2020లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అకాలీదళ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. రాష్ట్ర జనాభాలో 32 శాతం దళితులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఈ ఏడాది జూన్‌లోనే పొత్తు పెట్టుకుంది. 20 సీట్లకు బీఎస్పీకి వదిలిపెట్టింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 111 స్థానాల్లో బరిలోకి దిగిన బీఎస్పీ 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. 1.59 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయితే అంతకుముందు 2007లో 4.17 శాతం, 2012లో 4.3 శాతం ఓట్లను బీఎస్పీ పొందింది. దళితులపై పట్టున్న డేరాల ప్రభావం తగ్గడం, డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ జైలుకెళ్లడంతో... దళితల ఓట్లను కూడగట్టడంతో మాయావతి తొడ్పడగలరని అకాలీదళ్ అంచనా. అయితే సొంత రాష్ట్రం యూపీలో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో పంజాబ్ ప్రచారానికి మాయావతి ఎంత సమయాన్ని కేటాయించగలరనేది ప్రశ్న. మరోవైపు సుఖ్బీర్ చాలా ముందునుంచే 2022లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 91 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. 21 కొత్త ముఖాలను దింపారు. ముందే ఖరారు కావడంతో నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి, తగినంత సమయం వెచ్చించడానికి అకాలీదళ్ అభ్యర్థులకు వీలు చిక్కింది. కొత్త పొత్తు... కాంగ్రెస్ పొమ్మనకుండా పొగబెట్టడం తో పాటియాలా రాజు.. అమరీందర్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంతకుంపటి పెట్టుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన కెప్టెన్ అన్నట్లుగానే పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలనేది ఇంకా తేల్చుకోలేదు. అకాలీ చీలికవర్గ నేతలను కూడా కూటమిలో చేర్చుకుంటామని కెప్టెన్ ఇదివరకే స్పష్టం చేశారు. అకాలీదళ్‌తో పొత్తులో భాగం గా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం మూడు స్థానాల్లో నెగ్గింది. 5.39 శాతం ఓట్లను సాధించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీచేసిన మూడింటిలో రెండు నెగ్గి...9.63 శాతం ఓట్లు పొందింది. అమరీందర్ కాంగ్రెస్ ఓట్లను ఎన్నింటిని చీల్చగలరు, సాగు చట్టాల రద్దు ఈ కూటమికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది, మోదీ కరిష్మా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాల్చ గలదు... ఇవన్నింటిపై ఈ కూటమి ఎన్ని చోట్ల గెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. సొంతగూటిని చక్కదిద్దాలి.. ఒత్తిడికి తలొగ్గి అనుభవజ్ఞుడైన ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చడం, తర్వాత అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌కు సొంత గూటిని సరిదిద్దుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతోంది. పీసీసీ అధ్యక్షుడే సొంత ప్రభుత్వంపై బౌన్సర్లు సంధిస్తుంటే... తలబొప్పి కట్టడం ఖాయం. ప్రస్తుతం సిద్ధూతో కాంగ్రెస్ పెద్దలు ఇదే అవస్థను ఎదుర్కొంటున్నారు. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళిత ఓట్లు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆ వర్గానికి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్. ఎన్నికల్లో దళిత కార్డుగా ఉపయోగించుకోవడానికే చన్నీని అందలం ఎక్కించారని.. ఆర్నెళ్ల సీఎంగా మిగిలిపోతారని... కాంగ్రెస్‌కు దమ్ముంటే 2022 ఎన్నికల్లో కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ అలా చేయలేదు. సర్వం తన కనుసన్నల్లో నడవాలనుకునే సిద్ధూకు కోపం తెప్పించే సాహసం కాంగ్రెస్ చేయలేదు. అలాగని ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తే... దళిత ఓటు పోటును ఎదుర్కోవాల్సిన సంకట స్థితి. సిద్ధూ మాటల మాంత్రికుడు. చక్కటి హావభావాలతో సూటిగా ప్రజల మనసుల్లో ముద్రవేయగల వాగ్భాణాలను సంధిస్తారు. పంజాబ్ లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్ లేని లోటును సిద్ధూ ఏమేరకు పూడ్చగలరు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి తన చరిష్మాతో మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలరా? వేచి చూడాలి. కేజ్రీవాల్‌పైనే భారం ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బల మైన పునాది కలిగిన అకాలీదళ్‌కు వెనక్కి నెట్టి... 20 స్థానాలతో ఆప్ పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 23.72 శాతం ఓట్లు రావడంతో గత ఐదేళ్లుగా ప్రణాళిక ప్రకారం పంజాబ్‌లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్ ఇన్సాఫ్ పార్టీకి ఆరుస్థానాలను (రెండు నెగ్గింది) వదిలిన ఆప్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రజాకర్షణపైనే ఆధారపడుతోంది. ఢిల్లీలో పాఠశాలల్లో నాణ్యత మెరుగుపడటం, మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడం, పేదలకు ఉచిత విద్యుత్... తదితర ఢిల్లీ మోడల్ పాలనను అందిస్తామని వాగ్ధానం చేస్తోంది. సిక్కునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. -
లాఠీఛార్జిపై రైతుల ఆగ్రహం
చండీగఢ్: కర్నాల్‌లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్‌లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్‌గా పేర్కొన్నారు. ‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్‌లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు. -
రైతుల ఉద్యమంలో నిరసనకారులు పెరగడానికి కారణమేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలుగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఢిల్లీ–హరియాణా సింఘు సరిహద్దులో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఉద్యమం నెమ్మదిగా చల్లబడుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, సింఘు సరిహద్దులో ఢిల్లీ వైపు నిరసనకారుల సంఖ్య ఈమధ్య కాలంలో నెమ్మదిగా పెరుగుతోంది. సింఘు బోర్డర్–నరేలా రహదారిపై పంజాబ్ నుంచి వస్తున్న నిరసనకారుల ట్రాక్టర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో జరుగుతున్న పరిణామాల వెనుక కొత్త కారణాలు బయటికి వస్తున్నాయని ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఇక్కడ కొందరు నిరసనకారులు ఆందోళన తమ హక్కుగా భావించి పాల్గొంటుంటే, మరికొంత మంది ఆందోళనలో పాల్గొనడాన్ని ఒక పనిగా భావిస్తూ పాల్గొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తున్న పంజాబ్‌లోని కొంతమంది రైతులు స్థానికంగా విధించే జరిమానాలకు భయపడి ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో సింఘు సరిహద్దులో నిరసనకారుల సంఖ్య పెరిగింది. పంజాబ్‌లోని సుమారు 75శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత వారిపై చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇటీవల పంజాబ్‌లోని గ్రామాధిపతులు అనధికారికంగా ఒక ఆదేశాన్ని జారీ చేశారు. దీని ప్రకారం పంజాబ్‌లోని ప్రతీ కుటుంబానికి చెందిన కనీసం ఒక సభ్యుడు నెలకు ఒకసారి అయినా ఉద్యమం జరుగుతున్న సింఘు సరిహద్దుకు వచ్చి కనీసం పది రోజుల పాటు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా చేయడంలో ఏ కుటుంబం అయినా విఫలమైతే వారికి జరిమానా విధిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడకు రావడానికి ఇష్టపడని వారిని కుటుంబ సభ్యులు జరిమానాలకు భయపడి బలవంతంగా పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సింఘు సరిహద్దులో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు విదేశాల నుంచి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ నిరసనలో పాల్గొంటున్న వారికి అవసరమైన ఖర్చు విషయంలో ఎవరూ వెనకడుగు వేయట్లేదు. దీంతో ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చినవారు 10 నుంచి 15 రోజుల పాటు అక్కడే నిరసన కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. సింఘు సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనల్లో కేవలం పంజాబ్‌కు చెందిన వారే పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలైన హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిరసనకారులు ఎవరూలేరు. గతంలో సింఘు సరిహద్దులో యువత ఎక్కువగా కనిపించేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా వృద్ధులే నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారిలో అనేకమందిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. దీంతో భవిష్యత్తులో ఈ కేసులు ప్రతిబంధకంగా మారుతాయనే భయంతో ఆందోళనలో పాల్గొనే యువత సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు. 50వేల మందితో జింద్‌లో మహా పంచాయత్ ఈనెల 4న హరియాణాలోని జింద్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన కిసాన్ మహాపంచాయత్ ర్యాలీని బహిష్కరిస్తున్నట్లు హరియాణా సంయుక్త మోర్చా ఇంఛార్జ్ ప్రదీప్ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. హరియాణాలో బీజేపీ–జేజేపీ ప్రభుత్వంపై రైతుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే 4న ఆప్ రాజ్యసభ సభ్యుడు సుశీల్ గుప్త సొంత ప్రాంతమైన జింద్‌లో 50వేల మందితో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సభలో ఎలాంటి జెండాలు కానీ, పార్టీ గుర్తులు వాడబోమని ఆప్ తెలిపింది. ఇక్కడ చదవండి: సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక హోలీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు -
కిసాన్ మహా ‘పంచాయితీ’
చండీగఢ్/కర్నాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొత్త సాగు చట్టాల ప్రయోజనాలను వివరించి, రైతన్నలను శాంతింపజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మహాపంచాయత్’ను నిరసనకారులు భగ్నం చేశారు. ఇందుకోసం వారు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. జల ఫిరంగులకు, బాష్ప వాయువుగోళాలకు ఎదురొడ్డి మరీ అనుకున్నది చేసి చూపించారు. హెలిప్యాడ్‌పై బైఠాయింపు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే లాభాలను రైతులకు స్వయంగా తెలియజేయడానికి కర్నాల్ జిల్లాలోని కైమ్లా గ్రామంలో మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని, కచ్చితంగా అడ్డుకొని తీరుతామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. ముందు నిర్ణయించినట్లుగానే ఆదివారం కైమ్లాలో కిసాన్ మహాపంచాయత్ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయ కిసాన్ యూనియన్(చారుణి) ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు కైమ్లాకు బయలుదేరారు. గ్రామ శివారులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని ముందుకు సాగకుండా ఆంక్షలు విధించారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు లెక్కచేయలేదు. బారికేడ్లను ఛేదించుకొని కిసాన్ మహాపంచాయత్ వేదిక వద్దకు పరుగులు తీశారు. అప్పటికే అక్కడికి కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. రైతులు అక్కడున్న కుర్చీలు, పూల కుండీలు, మైకులను విరగ్గొట్టారు. వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు. బీజేపీ హోర్డింగ్‌లు, బ్యానర్లను చించేశారు. నల్ల జెండాలు పట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలిప్యాడ్‌పై రైతులు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మహా పంచాయత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తమ గాయాలపై కారం చల్లేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతాం.. హరియాణాలో రైతులపై వాటర్ కేనన్లు, బాష్ప వాయువు ప్రయోగించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తేల్చిచెప్పారు. రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. హరియాణా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. శాసనసభను వెంటనే సమావేశపర్చాలని, ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. సీఎం ఖట్టర్ తలపెట్టిన మహా పంచాయత్‌కు ప్రజల మద్దతు లేదని హరియాణా పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జా చెప్పారు. మహా పంచాయత్ అసలు రంగును రైతులు బయటపెట్టారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలే బాధ్యులు: ఖట్టర్ కైమ్లా గ్రామంలో ఉద్రిక్తతకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులే బాధ్యత వహించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనను సహించబోమని చెప్పారు. కిసాన్ మహా పంచాయత్‌కు అడ్డంకులు సృష్టించబోమని హామీ ఇచ్చిన కొందరు రైతు సంఘాల నేతలు మాట తప్పారని విమర్శించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. నిజానికి రైతులు అనుచితంగా వ్యవహరించరని చెప్పారు. కొందరు వ్యక్తులు రైతులను అప్రతిష్టపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మహా పంచాయత్‌లో తాను చెప్పాలనుకున్న విషయాలను తమ పార్టీ నాయకులు ప్రజలకు తెలిపారన్నారు. తాజా ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఏమీ లేదన్నారు. కైమ్లాలో ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా హెలికాప్టర్‌ను కర్నాల్‌లో దింపాలని తానే సూచించానన్నారు. -
రైతు పోరాటంపై పంజాబ్ ముద్ర
దేశంలో ఏ ప్రాంతంలోని రైతు సంఘాలకంటే పంజాబ్ రైతు సంఘాలు, రైతులు కేంద్రప్రభుత్వ నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధరను డిమాండ్ చేయడం కంటే, తమ శ్రమశక్తిని అంగట్లో పెట్టి కొల్లగొట్టాలని చూస్తున్న భారతీయ కార్పొరేట్లను నిలువరించడానికే పంజాబ్ రైతులు ఇప్పుడు పోరాడుతున్నారు. న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతుల విశేష మద్దతును వారు కూడగట్టగలిగారు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్ రైతులు అప్రమత్తంగా ఉంటూవచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చయమే తమపై జరుగుతున్న హిందుత్వ దాడిని పంజాబ్ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న రైతుల నిరసన.. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని సాధించుకోవడానికి లేక మూడు కొత్త చట్టాల రద్దు కోసం మాత్రమే కాదు. తగిన విలువను చెల్లించకుండానే రైతుల శ్రమశక్తిని అపహరించుకుపోవాలని చూస్తున్న భారతీయ సంపన్న పెట్టుబడిదారులను నిలువరించడానికే ఇప్పుడు రైతుల పోరాటం జరుగుతోంది. ఈ పోరులో సిక్కు కమ్యూనిటీకి చెందిన రైతులే ఎక్కువగా ముందుపీఠిన నిలబడటానికి అనేక కారణాలు తోడవుతున్నాయి. ఎలాంటి చర్చలూ లేకుండా, రైతు సంఘాలను విశ్వాసంలోకి తీసుకోకుండానే.. కేంద్రప్రభుత్వం వివాదాస్పదమైన ఈ మూడు సాగు చట్టాలను పార్లమెంటులో హడావుడిగా ఆమోదింపజేసుకున్నప్పుడే దాంట్లోని ప్రమాదాన్ని పంజాబ్ రైతులే మొట్టమొదటగా గ్రహించారు. పంజాబ్‌లోకి సైనిక దళాలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ పాలనాయంత్రాంగం పంపించినప్పుడు అంటే 1980ల మొదట్లో పంజాబ్ సిక్కులు చివరిసారిగా కేంద్రంతో తలపడ్డారు. అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమానికి విస్తృత స్థాయిలో మద్దతు లేదు. కానీ ఇప్పుడు సిక్కు రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రైతులను సమీకరించడమే కాకుండా, వారి విశేష మద్దతును కూడా కూడగట్టగలిగారు. అందుకే రైతాంగ ఉద్యమంలో ముందుండి పోరాడిన హీరోలుగా వీరు భారతీయ చరిత్రలో స్థానం సంపాదించుకోనున్నారు. సిక్కు రైతులు ఖలిస్తాన్ ఉగ్రవాదులా? ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కలిసి కంగనా రనౌత్ వంటి ప్రచారకుల దన్నుతో, పంజాబ్ సిక్కు రైతులను ఖలిస్తానీ ఉగ్రవాదులుగా చిత్రించడానికి ప్రయత్నించాయి. కానీ సిక్కు రైతాంగ యువత ఉన్నత విద్యను పొందడమేకాదు.. వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున హిందుత్వ సైన్యానికి సరైన సమాధానం ఇవ్వగలిగారు. ఆరెస్సెస్, బీజేపీలు నియంత్రణలో లేని తమ బలగాలను ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీలపై ప్రయోగించినట్లు, పంజాబ్ రైతులపై ప్రయోగిస్తే ఒక జాతిగా భారత్ ప్రమాదంలో పడుతుంది. పైగా దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోని రైతాంగం కంటే సిక్కు రైతులు మెరుగైన పోరాటం చేయగలరు. అదే సమయంలో తమ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ముందుకొచ్చే రాజకీయ జిమ్మిక్కుల పట్ల కూడా పంజాబ్ రైతులు అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. ఈ అప్రమత్తత, దృఢనిశ్చ యమే తమపై జరుగుతున్న దాడిని పంజాబ్ రైతులు తిప్పికొట్టగలిగేలా చేసింది. పైగా దేశవ్యాప్తంగా రైతులు వారి ఉద్యమంలో భాగమయ్యేలా కూడా చేసింది. మరొకవైపు బాలీవుడ్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చిత్ర పరిశ్రమ కూడా న్యాయంకోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలబడింది. రైతులు భారతదేశ ఆహార సైనికులు అని చిత్రసీమ ప్రముఖులు వర్ణించారు. ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతు సైనికులు లేనిదే సరిహద్దుల్లో సైనికులు కూడా నిలబడలేరు. ఆరెస్సెస్, బీజేపీలు రైతు సైనికులను జాతీయవాదులుగా ఎన్నడూ గుర్తించలేదు పైగా దేశంలోని బడా వ్యాపార కుటుంబాలను మాత్రమే వారు నిజమైన జాతీయవాదులుగా ఆరాధిస్తున్నారు. శ్రమను గౌరవించడం సిక్కు రైతులు ఇలా ఇప్పుడు దుడ్డుకర్రలు ఎందుకు పట్టుకున్నారంటే తమ శ్రమను కాపాడుకోవడం కోసమే. సిక్కు మతంలో శ్రమించడానికి అపారమైన విలువ ఉంది. సాపేక్షికంగా చూస్తే సిక్కులలో కులతత్వం తక్కువగా ఉంటున్నందుకు తగిన మూలాలు ఇక్కడే ఉన్నాయి. సిక్కులలో మెజారిటీ ప్రజలు జాట్లు. చారిత్రకంగా వీరు శూద్ర వర్ణానికి చెందినవారు. ఐక్య పంజాబ్‌లో వీరు ద్విజుల చేతుల్లో నానా బాధలకు, అవమానాలకు గురయ్యారు. గురునానక్ సిక్కుమతం స్థాపిం చాక ఆయన, అనంతర సిక్కు గురువుల బోధనలను, శ్లోకాలను గురుగ్రంథ సాహిబ్ గ్రంథంలో పొందుపర్చారు. వర్ణ వ్యవస్థ నుంచి, శ్రమను అగౌరవపర్చడం నుంచి సిక్కు సమాజం విముక్తి పొందడానికి ఇది పునాది వేసింది. ఇది శూద్ర శ్రామికులలో ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది. వారి స్థాయిని మార్చి సమానమైన, గౌరవం కలిగిన సభ్యులుగా కలిపేసుకుంది. అయితే పంజాబ్‌లో దళిత సిక్కులు సామాజిక వివక్షను ఎదుర్కొనడం లేదని దీనర్థం కాదు. అయితే సిక్కు కమ్యూనిటీ హిందుత్వ వాదుల స్థాయి కులతత్వాన్ని కలిగిలేదు. అలాగే ఆ స్థాయిలో వీరు వర్ణధర్మాన్ని పాటించడంలేదు. దళిత సిక్కులకు ప్రపంచవ్యాప్తంగా తమవైన రవిదాసి గురుద్వారాలు ఉన్నాయి. పైగా దళిత సిక్కులు ఉన్నత విద్యావంతులై, సిక్కుమతంలో భాగంగా ఉంటూనే తమదైన స్వతంత్ర ఆధ్యాత్మిక, సామాజిక అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సిక్కు మతాన్ని హిందూ మతంలో భాగంగా చిత్రించడానికి హిందుత్వవాదులు ప్రయత్నిస్తున్నప్పటికీ తమను హిందూమతంలో కలిపేసుకోవడంలో భాగంగా అలా చేస్తున్నారని సిక్కులు స్పష్టంగా గ్రహించారు కాబట్టి హిందుత్వ వాదుల ఆటలు చెల్లడం లేదు. పైగా గురుగ్రంథ సాహిబ్ గురించి తగుమాత్రం జ్ఞానం కలిగి వున్న ఏ సిక్కు అయినా సరే లింగ భేదంతో పనిలేకుండా గ్రంథి అయిపోతారు. ఇది హిందూయిజానికి భిన్నమైనది. సిక్కుమతంలో ఉన్న అలాంటి లింగపరమైన ఆధ్యాత్మిక తటస్థత, ఉత్పత్తి క్రమం, వ్యవసాయ ఉత్పత్తిలో వారి సామూహిక శ్రమ భాగస్వామ్యం, సామర్థ్యత వంటివి పంజాబ్‌ను భారతదేశ ధాన్యాగారంగా మార్చాయి. వ్యవసాయ ఉత్పత్తిలో కులరహిత, లింగ తటస్థతతో కూడిన ఇలాంటి భాగస్వామ్యాన్ని ఆరెస్సెస్, బీజేపీ ఎన్నడూ కోరుకోలేదు. పైగా వర్ణ ధర్మ పరంపరను కొనసాగించడంపై వీరు నొక్కి చెబుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా పొలంలో పనిచేయడం అనే సామాజిక పునాదిలోనే పంజాబ్ వ్యవసాయ పురోగతికి మూలాలున్నాయి. ఇకపోతే గురుద్వారాలలో చేసే కరసేవ ఇప్పటికే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గురుద్వారాలు ప్రత్యేకించి అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించే ఏ వ్యక్తికైనా అక్కడ ఉచిత భోజనం లభిస్తుంది. కులపరమైన సాంస్కృతిక అగౌరవం చూపకుండానే సంపన్నులు సైతం ఆలయాల్లో శ్రామిక సేవను సాగించే ఇలాంటి సంస్కృతి.. తామే నిజమైన హిందూ జాతీయవాదులుగా ప్రచారం చేసుకుం టూండే ఆరెస్సెస్–బీజేపీ అజెండాలో ఎన్నడూ లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలను ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కానీ, ఆధ్యాత్మిక–మత వ్యవస్థలో శ్రమ గౌరవాన్ని చొప్పించకుండా ఈ పదాలకు అర్థమే ఉండదు. సజీవ వ్యత్యాసం సకల జనుల శ్రేయస్సుకోసం పనిచేయడం, కరసేవ (అందరి శ్రేయస్సు కోసం శారీరక పనిచేయడం) గురించి సిక్కుమతం నొక్కి చెబుతుంటుంది. ఈ రెండూ గురు గ్రంథ్ ఆధ్యాత్మిక సిద్ధాంతంలో రెండు విశిష్ట భావనలు. బ్రాహ్మణవాదానికి వీటి గురించి ఏమీ తెలీని సమయంలోనే సిక్కు గురువులు శ్రమగౌరవానికి చెందిన భావనను గొప్పగా నెలకొల్పారు. హిందుత్వ భావజాలంలో శూద్ర/దళిత రైతులు, కూలీలకు ఏమాత్రం గౌరవం ఉండదు. వీరిని మనుషులుగానే లెక్కించరు. కానీ పంజాబ్ వెలుపల భారతీయ ఆహార వ్యవస్థకు వీరే మూలస్తంభాలుగా ఉంటున్నారు. హిందూ ఆధ్యాత్మిక, సామాజిక వ్యవస్థలో వ్యవసాయ పనికి గౌరవం కల్పించే వైపుగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. దానికి బదులుగా సామాజిక, ఆర్థిక మార్పులకు ఎన్నడూ దోహదం చేయని, మేటపడిన తమ సంపదను విస్తృత ప్రజానీకం శ్రేయస్సు కోసం ఖర్చుపెట్టకుండా పేద రైతులను దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటున్న గుత్త పెట్టుబడిదారులను అనుమతించే తరహా సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సిక్కు రైతులు ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి జ్ఞానాన్ని తమ వెన్నెముకగా చేసుకున్న బలమైన ప్రపంచవ్యాప్త కమ్యూనిటీలో భాగమయ్యారు. అటవీ భూములను సాగు చేయడానికి వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో ఆయా దేశాల గౌరవనీయ పౌరులుగా మారిపోయారు. ఇప్పుడు వీరు కెనడాలో కీలకమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. భారతదేశం వినమ్రంగా వీరి నుంచి నేర్చుకోవాలి. అలాగే సిక్కు కమ్యూనిటీని కించపర్చడంకోసమే నిరంతరం ప్రయత్నిస్తున్న తన శక్తులకు ఆరెస్సెస్– బీజేపీ పగ్గాలు వేయాల్సి ఉంది. సిక్కు సమాజాన్ని కించపర్చడాన్ని వీరు ఎంత ఎక్కువగా కొనసాగిస్తే అంతగా వీరు దేశంలోనే కాకుండా ప్రపంచం ముందు కూడా పలచన అయిపోవడం ఖాయం. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
నిరసన గళం వారిదే
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. 20 రోజులు దాటిపోయింది. ఢిల్లీ వీధుల్లో నిరసనలు హోరెత్తిపోతున్నాయి. ఈ రైతు పోరాటంలో పంజాబ్ రైతులే ఎందుకు ముందున్నారు? వారే ఎందుకు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు ? హరిత విప్లవం వెల్లువెత్తిన రాష్ట్రం అది. దేశంలో ఆర్థిక సరళీకరణలు ప్రారంభమవడానికి ముందే అర్బన్ ఇండియా పురోగతికి బీజాలు వేసిన రాష్ట్రం అది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అత్యధికంగా పెట్టే రాష్ట్రంలోనూ పంజాబే ముందుంటుంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో దేశం మొత్తమ్మీద ఎక్కువగా లబ్ధి పొందేది పంజాబ్ రైతులే. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) దేశం మొత్తమ్మీద పండే పంటలో 10శాతాన్ని కొంటే పంజాబ్‌లో పండే పంటలో 90% శాతాన్ని కొనుగోలు చేస్తుంది. కొత్త సాగు చట్టాలు ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రాలు ఎలాంటి సెస్‌లు, పన్నులు విధించడానికి వీల్లేదు. దీంతో మండీ వ్యవస్థ నీరు కారిపోయి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కే ఎసరొస్తుందన్న ఆందోళనలు రైతుల్లో ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ ఉత్పాదకతలో 70శాతం పంజాబ్, ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, మహారాష్ట్రల నుంచి వస్తోంది. ఆ 8 రాష్ట్రాల్లో సాగు భూమి, వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వ్యవసాయ రంగంలో పెట్టే పెట్టుబడులు, చేసే ఆదా, ఎరువుల వినియోగం వంటి గణాంకాలన్నీ పంజాబ్ రైతులు ఈ పోరాటాన్ని ఎందుకంత ఉధృతంగా చేస్తున్నారో తేటతెల్లం చేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రైతు నిరసనల్లో మహిళలు అంతగా కనిపించడం లేదు. దీనికి కారణం పంజాబ్‌లో భూమిపై హక్కులు కలిగిన మహిళల సంఖ్య చాలా తక్కువ. దేశంలోని మహిళల్లో సగటున 12.9% మంది మాత్రమే భూమిపై యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. ఈ అంశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి. దక్షిణాదిన 15.4% మంది మహిళలకి భూమిపై హక్కులు ఉంటే, ఉత్తరాదిన 9.8 శాతంగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం వంటివి సాధించాలంటే మహిళలకు భద్రమైన జీవితం, భూమిపై హక్కులు ఉండాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం వ్యవసాయ కూలీల్లో 32% ఉన్న మహిళలు ఉత్పత్తి విషయానికొచ్చేసరికి 55–66శాతం వాటా ఇస్తున్నారు. -
‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!!
రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారేలా వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక చట్టాల్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్పుకున్నారు. కానీ ఆ చట్టాలను రద్దు చేయాలంటూ గత పది రోజులుగా ఢిల్లీ వీధుల్లో బైఠాయించిన రైతన్నలు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉండే పంజాబ్, హరియాణా రైతులు పోరాటానికి తొలి అడుగు వేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు వారి అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుతుందన్న ఆందోళన అన్నదాతల్ని వెంటాడుతోంది. అందుకే నిత్యావసర సరుకుల సవరణ చట్టం.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక చట్టం... రైతుల సాధికారత, రక్షణ ధరల హామీ సేవల ఒప్పంద చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరను చట్టంలో చేర్చాలని రేయింబగళ్లు నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాల లక్ష్యంలోనే తప్పులు ఉన్నాయని రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ‘ఏదైనా చట్టం లక్ష్యమే తప్పుగా ఉంటే దానిలో సవరణలు చేసినా అవి తప్పుదారి పడతాయి. దాని వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు’’ అని 40 మంది రైతులున్న ప్రతినిధి బృందంలోని ఏకైక మహిళా కవితా కురుగంటి తెలిపారు. పీట ముడి ఎక్కడ ? సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. ఎంఎస్పీపై రైతులను విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయనీ, అందుకే రైతులు ఆందోళన తీవ్ర చేస్తున్నారన్నది కేంద్రం ఆరోపిస్తోంది. రైతుల అభ్యంతరాలు, డిమాండ్లు.. వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం వల్ల భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుందంటున్నారు. అందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. కేంద్రం ఏమంటోంది ? ► వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా కుదరదని తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలకు అంగీకరించింది. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా బడా కంపెనీలు రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► మండీల్లో ప్రైవేటు వ్యక్తులు వస్తే పోటీ ఉండి రైతులకే ప్రయోజనమని వాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల పరిధిలో నడిచే మండీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒప్పుకుంది. ప్రైవేటు మార్కెట్లు, ప్రభుత్వ మార్కెట్ యార్డుల్లో పన్నులు సమానంగా వసూలు చేయడానికి అంగీకరించింది. ► ప్రైవేటు వ్యాపారులు పాన్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి బదులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ► కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని, దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది. -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్‌పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్‌ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్‌లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్‌సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్‌సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్‌లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
షరతులతో చర్చలకు ఒప్పుకోం
న్యూఢిల్లీ: షరతులతో కూడిన చర్చలకు సిద్ధంగా లేమని రైతులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే అన్ని మార్గాలను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రహదారులపై నిరసన విరమించి, బురాడీ గ్రౌండ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ సూచనపై ఆదివారం రైతులు పైవిధంగా స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు రోజులుగా రైతులు ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టలు రైతులకు కొత్త హక్కులను, కొత్త అవకాశాలని అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో పునరుద్ఘాటించారు. రైతుల సమస్యలు త్వరలోనే అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. రైతులు తాము చెప్పిన బురాడీ గ్రౌండ్‌కు తరలితే.. వారితో ఉన్నతస్థాయి మంత్రుల బృందం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ షరతుపై దాదాపు 30 రైతు సంఘాలు చర్చించి, షరతులతో కూడిన చర్చలకు వ్యతిరేకమని స్పష్టం చేశాయి. బురాడీ గ్రౌండ్‌ను ఓపెన్ జైలుగా అభివర్ణించాయి. ‘హోంమంత్రి పెట్టిన షరతుకు మేం అంగీకరించబోం. షరతులతో చర్చలకు మేం సిద్ధంగా లేం. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. మా నిరసన, రహదారుల దిగ్బంధం కొనసాగుతుంది. ఢిల్లీలోకి ప్రవేశానికి వీలు కల్పించే ఐదు మార్గాలకు కూడా మూసేస్తాం’ అని భారతీయ కిసాన్ యూనియన్ పంజాబ్ శాఖ అధ్యక్షుడు సుర్జీత్ ఎస్ ఫుల్ స్పష్టం చేశారు. చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం రైతులను అవమానించడమేనన్నారు. పంజాబ్, హరియాణాల నుంచి మరింత మంది రైతులు త్వరలో తమతో చేరనున్నారని వెల్లడించారు. రైతులతో చర్చలు జరపాలని విపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కోవిడ్–19 ముప్పు, పెరుగుతున్న చలి కారణాలుగా చూపుతూ రైతులు వెంటనే బురాడీ గ్రౌండ్‌కు తరలివెళ్లాలని, అలా వెళ్లిన మర్నాడే ఉన్నతాస్థాయి మంత్రుల బృందం వారితో చర్చలు జరుపుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా శనివారం నిరసనల్లో పాల్గొంటున్న 32 రైతు సంఘాలను ఉద్దేశించి ఒక లేఖ పంపించారు. కాగా, హరియాణాలోని పలు కుల సంఘాలు రైతుల నిరసనకు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ముఖ్యంగా..సింఘు, టిక్రి ప్రాంతాల్లో రైతులు చలిని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. వారికి ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆహారం అందజేస్తోంది. రైతుల నిరసనలకు మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ నేత, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. రైతులు హరియాణా నుంచి ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా హరియాణా సీఎం ఖట్టర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నిరసన తో కరోనా విజృంభిస్తే ఆ బాధ్యత అమరీందర్‌దేనని ఖట్టర్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మద్దతు తెలిపారు. మంత్రులు చర్చలు: రైతుల నిరసనలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి తోమర్ చర్చిం చారు. -
డిమాండ్లు నెరవేర్చేదాకా కదలం
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసే దాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానంలో శాంతియుతంగా ధర్నా చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వేలాది మంది పంజాబ్, హరియాణా రైతులు శనివారం ఢిల్లీ శివార్లలోని సింగూ, టిక్రీ సరిహద్దులోనే బైఠాయించారు. సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లే ప్రసక్తే లేదని, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవర్చే వరకూ ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వంట పాత్రలు సైతం తెచ్చుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలు, వాహనాల్లోనే నిద్రిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారు లెక్కచేయడం లేదు. ఆదివారం సమావేశమై, తదుపరి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్జీత్‌సింగ్ మహల్ చెప్పారు. పంజాబ్, హరియాణా రైతులకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్ రైతులు కూడా ఘాజీపూర్ సరిహద్దు వద్ద బైఠాయించారు. ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ–మీర్జాపూర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైతులు ధర్నా చేయాలనుకుంటే ఉత్తర ఢిల్లీలోని సంత్ నిరంకారీ మైదానానికి వెళ్లాలని జాయింట్ కమిషనర్ సురేందర్ సింగ్ యాదవ్ సూచించారు. అయితే, జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సంత్ నిరంకారీ గ్రౌండ్లో రైతుల నిరసన కొనసాగుతోంది. శనివారం రైతుల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 3న రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఉద్యమం వెనుక పంజాబ్ సీఎం కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కార్యాలయ సిబ్బంది రైతులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడికి వెళ్తే చర్చలకు సిద్ధం: అమిత్ షా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్న రైతులు ఢిల్లీలోని సంత్ నిరంకారీ గ్రౌండ్‌కు వెళ్లాలని హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అక్కడే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయవచ్చని చెప్పారు. తాము సూచించిన ప్రాంతానికి వెళ్లిన రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ శివార్లలో బైఠాయించిన రైతులు తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే వెంటనే నిరంకారీ మైదానానికి వెళ్లాలని అమిత్ షా హోంశాఖ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
భేటీకి కేంద్ర మంత్రుల గైర్హాజరు
న్యూఢిల్లీ/చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతుల ఆందోళనను తీర్చడానికి కేంద్ర వ్యవసాయ శాఖ దేశ రాజధాని ఢిల్లీలోని కృషి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అన్నదాతలు బహిష్కరించారు. ఈ భేటీకి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో పాటు, సహాయ మంత్రులు గైర్హాజరు కావడంతో 29 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశాన్ని వాకౌట్ చేసి, వ్యవసాయ చట్టం ప్రతుల్ని చించేశారు. సమావేశానికి పిలిచి అవమానిస్తారా..? వ్యవసాయ చట్టాలపై తమకున్న ఆందోళనల్ని తొలగిస్తామని ఢిల్లీ పిలిచి మరీ తమని పట్టించుకోలేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర మంత్రులెవరూ ఈ సమావేశానికి హాజరు కానప్పుడు, భేటీని ఎందుకు ఏర్పాటు చేశారు ? కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది’’ అని రైతు సంఘాల సమన్వయ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ చెప్పారు. తమ ప్రశ్నలకు సరైన సమా« ధానాలు ఇవ్వకపోవడంతో వాకౌట్ చేశా మన్నారు. దీనిపై వివాదం రేగడంతో ప్రభుత్వం వివరణ ఇస్తూ, షెడ్యూల్ ప్రకారం ఇది కార్యదర్శుల స్థాయి సమావేవమని పేర్కొంది. రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమేనని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. -
పంజాబ్‌లో రైతు రుణమాఫీ
సన్న, చిన్నకారు రైతులకు రూ. 2 లక్షల వరకూ మాఫీ చండీగఢ్: ఎన్నికల హామీ మేరకు పంజాబ్ రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు(5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు) రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వమే చెల్లించడంతో పాటు.. వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. సోమవారం అసెంబ్లీలో అమరీందర్ ప్రకటన చేస్తూ.. ప్రభుత్వ నిర్ణయంతో 10.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందులో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులు 8.75 లక్షలు ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రకటించిన రుణమాఫీ కంటే రెండింతలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త టీ హక్యూ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ప్రైవేట్ రుణాల మాఫీపై సబ్ కమిటీ రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాల మాఫీ కోసం ‘పంజాబ్ వ్యవసాయ రుణాల ఒప్పందం 2016’ను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కేబినెట్ సబ్ కమిటీకి ఆ పని అప్పగించామని అమరీందర్ చెప్పారు. రైతుల బలవన్మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తే మంచిదని స్పీకర్‌కు సూచించారు.