కేంద్రంపై పోరాడండి..తోడుంటాం | Kcr Urges to Farmers to Protest on Bjp Decision on Agriculture | Sakshi
Sakshi News home page

కేంద్రంపై పోరాడండి..తోడుంటాం

Published Mon, May 23 2022 1:27 AM | Last Updated on Mon, May 23 2022 7:29 AM

Kcr Urges to Farmers to Protest on Bjp Decision on Agriculture - Sakshi

ఆదివారం చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ఓ రైతు కుటుంబ సభ్యురాలికి ఆర్థిక సాయం చెక్కు అందిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏది ఏమైనా తాము రైతుల వెంట ఉంటామని.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం కొనసాగించాలని రైతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలను మార్చేసే శక్తి రైతులకు ఉందని.. ఈ విషయంగా దేశంలోని రైతులంతా ఏకం కావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో నిర్వహించిన రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలను, గల్వాన్‌లో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదివారం చండీగఢ్‌లో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లతో కలిసి సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున.. నలుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. దేశవ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

రైతులంతా ఉద్యమంలోకి రావాలి
‘‘రైతుల సంక్షేమం కోసం మాట్లాడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే కొందరికి నచ్చదు. ఒత్తిడి తెస్తారు. రైతు ఉద్యమ సమయంలో మిమ్మల్ని ఖలిస్తానీలన్నారు. దేశ ద్రోహులన్నారు. ఇవన్నీ మేం విన్నాం. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని రైతు నాయకులను కోరుతున్నాను. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచే కాదు.. యావత్‌ భారత దేశం నుంచీ రైతు ఉద్యమం సాగాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులన్నింటి నుంచి రైతులు ఉద్యమంలో పాల్గొనాలి. ఇది మన హక్కు. దేశానికి, ప్రపంచానికి మనం ఆహారం అందిస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రివాల్‌ తమ వంతు సాయం చేశారు. రైతులను రక్షించే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లన్నీ తీర్చే వరకు పోరాటానికి మేం సంపూర్ణ మద్దతునిస్తాం. ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కొన్ని మంచి మాటలు చెప్పి మీ మనసును శాంతపరిచేందుకు వచ్చాం.

ఇలాంటి పరిస్థితి ఏ దేశంలోనూ లేదు
కేంద్రం తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తలవంచి నమస్కరిస్తున్నాను. అమరులైన వారిని తిరిగి తీసుకురాలేం. కానీ రైతు కుటుంబాలు ఒంటరి కాదు. యావత్‌ దేశం వారి వెంట ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇలాంటి సమావేశాలు నిర్వహించాల్సి రావడం బాధాకరం. అమరులైన వారికోసం నిర్వహించే సభలను చూసినప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. దుఃఖం వస్తుంది. దేశం ఎందుకిలా ఉందనిపిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. భారత పౌరుడిగా దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో సమస్యల్లేని దేశం ఉండదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరెక్కడా ఉండవు.

దేశానికి అన్నం పెట్టిన పంజాబ్‌
దేశానికి పంజాబ్‌ చేసిన సేవలు అసామాన్యం. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులను కన్న పంజాబ్‌ను దేశం ఎన్నటికీ మర్చిపోదు. దేశం ఆహారం కోసం పరితపిస్తున్నప్పుడు హరిత విప్లవం ద్వారా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రమిది. దేశం కోసం చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోశ్‌బాబుది మా తెలంగాణ. ఆయనతోపాటు పంజాబ్‌ సైనికులు కూడా వీర మరణం పొందారు. వీర మరణం పొందిన పంజాబ్‌ సైనికుల కుటుంబాలను పరామర్శించాలని అనుకున్నాను. కానీ ఎన్నికల కారణంగా రాలేకపోయిన. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో చెప్తే.. ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి, నా కార్యక్రమానికి మద్దతిచ్చారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమంటోంది..
దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా రైతుల కోసం ఎంతో చేస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఒక్కోరోజు 10, 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాత్రిపూట వ్యవసాయ మోటర్లు వేసేందుకు వెళ్తే పాములు కుట్టేవి. ఆ బాధలు వినేవాళ్లే ఉండేవారు కాదు. తెలంగాణ ఏర్పడ్డాక భగవంతుడి దయతో విద్యుత్‌ సమస్యను అధిగమించాం. అన్ని రంగాలతో పాటు వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నాం. కేంద్రం రైతుల కరెంట్‌ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటోంది. రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోంది. మా ప్రాణాలు పోయినా.. మేం మాత్రం మీటర్లు బిగించబోమని అసెంబ్లీ నుంచే తీర్మానం చేసేశాం’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement