Corporate
-
ఐజీఎల్ 1:1 బోనస్.. ప్రతి షేరుకీ మరో షేరు ఉచితం
న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ రిటైల్ పీఎస్‌యూ.. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) తొలిసారి వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఇందుకు కంపెనీ నిర్వహించిన తాజా సమావేశంలో బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా కేటాయించనుంది.తద్వారా వాటాదారులకు రివార్డుతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. బోనస్ షేర్ల జారీతో కంపెనీ వాటా మూలధనం రెట్టింపు కానుంది. రూ. 140 కోట్ల నుంచి రూ. 280 కోట్లకు పెరగనుంది. కంపెనీ వద్దగల రూ. 8,412 కోట్ల రిజర్వు నిధుల నుంచి బోనస్ ఈక్విటీ(రూ. 140 కోట్లు) నిధులను సమకూర్చుకోనుంది. తదుపరి దశలో ప్రకటించనున్న రికార్డ్ డేట్ ప్రకారం రెండు నెలల్లోగా బోనస్ షేర్లను కేటాయించే వీలున్నట్లు ఐజీఎల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. గ్యాస్ పంపిణీ ఇలా దేశీయంగా సిటీ గ్యాస్ పంపిణీలో అతిపెద్ద రిటైలర్‌గా నిలుస్తున్న ఐజీఎల్ ఆటోమొబైల్స్‌కు సీఎన్జీ, పరిశ్రమలు, గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ను సరఫరా చేస్తోంది. ఢిల్లీసహా సమీప ప్రాంతాలైన నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో సిటీ గ్యాస్ పంపిణీ బిజినెస్‌ను నిర్వహిస్తోంది. వీటితోపాటు హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ రిటైల్ గ్యాస్ సర్వీసులు అందిస్తోంది.ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియా షేర్ల జారీసుమారు 882 స్టేషన్ల ద్వారా 1.7 మిలియన్ వాహనాలకు సీఎన్జీ సరఫరా చేస్తోంది. 2.5 మిలియన్ గృహాలకు పీఎన్జీ అందిస్తోంది. పీఎస్‌యూ దిగ్గజాలు గెయిల్(ఇండియా), బీపీసీఎల్‌తోపాటు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ ఇది! బోనస్ వార్తల నేపథ్యంలో ఐజీఎల్ షేరు 1.6 శాతం లాభంతో రూ. 392 వద్ద ముగిసింది. -
ఆరోగ్య రంగంలో అధిక నియామకాలు
ముంబై: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో నియామకాలు పెరగనున్నాయని టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. ఈ రంగంలో 47 శాతం సంస్థలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. అత్యాధునిక టెలీహెల్త్ సేవల విస్తరణ, ముందస్తు వ్యాధి నివారణ సేవలకు పెరుగుతున్న ఆదరణతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నట్టు పేర్కొంది.ఈ రంగంలోని కీలక పోస్ట్‌లకు ఢిల్లీ, చైన్నై నగరాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ కేంద్రాలుగా అవతరించాయని, వైద్య పరిశోధన, అనుబంధ క్లినికల్ పరీక్షలు, డేటా నిర్వహణ విధులు ఇందులో కీలకమని పేర్కొంది. ‘‘వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి చికిత్సలు తీసుకోవడం కంటే, అవి రాక ముందే రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంశాల కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది’’అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ అన్నారు. ఆన్లైన్ వైద్య సేవలకు డిమాండ్‘‘వృద్ధ జనాభా పెరుగుదల, దీర్ఘకాలిక అనారోగ్యాలు నిరంతరం వైద్య సహకారం, వినూత్నమైన చికిత్సల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. కానీ, ఆరోగ్య సంరక్షణ రంగం వినూత్నంగా నిలుస్తోంది. కరోనా తర్వాత నుంచి వర్చువల్ కన్సల్టేషన్ (ఆన్లైన్లో వైద్య సలహా), రిమోట్ హెల్త్‌కేర్ సేవలు సాధారణంగా మారిపోయాయి’’అని శంతను రూజ్ తెలిపారు. నర్సింగ్ అసిస్టెంట్లకు హైదరాబాద్, చండీగఢ్, గురుగ్రామ్‌లో ఎక్కువ డిమాండ్ నెలకొన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది.వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్లకు ముంబై, హైదరాబాద్, ఇండోర్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. డయాగ్నోస్టిక్స్ సేవల విస్తరణ, ఇంటర్నెట్ సాయంతో మారుమూల ప్రాంతాల నుంచే వైద్య సహకారం పొందడం వంటివి ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్టు రూజ్ తెలిపారు. ల్యాబ్ టెక్నిక్, డయాగ్నోస్టిక్స్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్, రోగుల సంరక్షణ, డేటా అనలైసిస్లో నైపుణ్యాలున్న వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. -
అనిల్ అంబానీ ‘పవర్’ పెరుగుతోంది!
పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. మయాంక్ బన్సల్‌ను సీఈవోగా, రాకేశ్ స్వరూప్‌ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ సంస్థ ప్రధానంగా సౌర, పవన విద్యుదుత్పత్తి.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం మొదలైన సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతుంది.పునరుత్పాదక విద్యుత్ విభాగంలో బన్సల్‌కి 25 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఆయన రెన్యూ పవర్‌కి చెందిన ఇండియా ఆర్ఈ బిజినెస్‌కి గ్రూప్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇంధన రంగం, స్టార్టప్‌ల విభాగంలో స్వరూప్నకు 17 ఏళ్ల పైగా అనుభవం ఉంది. ఆయన గతంలో రెన్యూ పవర్, పీఆర్ క్లీన్ ఎనర్జీ మొదలైన సంస్థల్లో కీలక హోదాల్లో పని చేశారు. కాగా రిలయన్స్ పవర్ మరో అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యూ సన్‌టెక్ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఈ-రివర్స్ వేలంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్ కోసం 930 మెగా వాట్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్‌ను పొందింది. -
లైఫ్‌కి బీమా తప్పనిసరి
జీవిత బీమా అవసరంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నామని, తక్కువ ప్రీమియంతోనైనా ప్రతి కుటుంబం ఎంతో కొంత బీమాను కలిగి ఉండాలన్నదే తమ ఉద్దేశమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ కాస్పరస్ జేహెచ్ క్రామ్హూట్ చెప్పారు. ఈ వైఖరి వల్లే వ్యాపార పరిమాణం పరంగా తాము దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ పాలసీదారుల సంఖ్యను బట్టి చూస్తే 7వ స్థానంలో ఉన్నామని స్పష్టంచేశారు.పాలసీదారుల అవసరాలు తెలుసుకోవటానికి, క్లెయిమ్‌ల పరిష్కారానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నామని, అందుకే తమ సంస్థ లాభదాయకతలోనూ ముందుందని వివరించారు. మంగళవారం ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి బీమా ఇచ్చి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించటమే జీవిత బీమా లక్ష్యం. కానీ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యమివ్వటం లేదు. మరి ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? నిజమే! దేశంలో 4 శాతం మందికే జీవిత బీమా కవరేజీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్‌ను చాలామంది అవసరం లేనిదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. తెలంగాణలో లీడ్ ఇన్సూరర్‌గా ఉన్నాం కనక మేం రకరకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బీమా పరిశ్రమ 24 శాతం పెరిగితే మేం 57 శాతం వృద్ధి సాధించాం. మా వ్యాపారంలో గ్రామీణుల వాటా 40 శాతానికిపైగా ఉండటమే మా నిబద్ధతకు నిదర్శనం. బీమా కంపెనీలు ‘టర్మ్’పై కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన ఎండోమెంట్, యులిప్ పాలసీలపై ఫోకస్ పెడుతున్నాయెందుకు? 30 ఏళ్ల వ్యక్తికీ 10 ఏళ్ల కాలపరిమితితో జీవితబీమా పాలసీ అమ్మటం మోసం కాదా? నిజమే! ఇలాంటి మిస్ సెల్లింగ్ జరగకూడదు. కాకపోతే తక్కువ ప్రీమియమే అయినా కొన్నేళ్ల పాటు కట్టి... చివరకు పాలసీ గడువు ముగిశాక ఏమీ తిరిగి రాని టర్మ్ పాలసీలపై కస్టమర్లు ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లను ఆకర్షించటానికే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు, రాబడులతో ముడిపడ్డ ఎండోమెంట్ పాలసీలను తెచ్చాయి. లాభదాయకత కూడా ముఖ్యమే కనక ఈ పాలసీలను విక్రయిస్తున్నాయి. మరి 30 ఏళ్ల వ్యక్తికి 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవిత బీమా పాలసీ విక్రయిస్తే... గడువు తీరాక తనకు కవరేజీ ఉండదు కదా? లేటు వయసులో కవరేజీ కావాలంటే భారీ ప్రీమియం చెల్లించాలి కదా? నిజమే. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారే ప్యూర్ టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది అట్టడుగు స్థాయికి వెళ్లటం లేదు. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందన్న విశ్వాసం నాకుంది.మీరూ ఇదే దార్లో వెళుతున్నారా... లేక? అలాంటిదేమీ లేదు. మేం ప్రధానంగా ఏడాదికి 4–15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి ఎంతోకొంత కవరేజీ ఉండేలా పాలసీలను తెచ్చాం. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98 శాతానికిపైనే ఉంది. పైపెచ్చు ఎక్కువ శాతం చిన్న పాలసీలే కనక... సెటిల్మెంట్కు డాక్యుమెంట్లన్నీ అందజేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తున్నాం. దీనికి టెక్నాలజీని వాడుతున్నాం. మీ వ్యాపారంలో ఆన్లైన్ శాతమెంత? మాకు దేశవ్యాప్తంగా విస్తరించిన శ్రీరామ్ గ్రూప్ కంపెనీల ఔట్లెట్ల నుంచే 40 శాతం వరకూ వ్యాపారం వస్తోంది. ఏజెన్సీల నుంచి మరో 40 శాతం వస్తోంది. మిగిలినది ఆన్లైన్, పాత కస్టమర్ల రిఫరెన్సులు సహా ఇతర చానళ్ల ద్వారా వస్తోంది. ఆన్లైన్లో ఎంక్వయిరీలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చటం తక్కువ. ఆన్లైన్ ప్రచారానికి ఖర్చు కూడా ఎక్కువే. మాకు అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘సన్ లామ్’తో భాగస్వామ్యం ఉంది కనక ఎప్పటికఫ్పుడు కొత్త టెక్నాలజీలని అందుబాటులోకి తేగలుగుతున్నాం. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి కనక దేశంలోని 15 రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి అడుగులు వేస్తున్నాం. మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? వ్యాపార విలువ పరంగా ప్రస్తుతం దేశంలో 13వ స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి 12వ స్థానానికి... మూడేళ్లలో టాప్–1లోకి రావాలనేది లక్ష్యం. ఇక పాలసీదార్ల సంఖ్య పరంగా 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో టాప్–3లోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. -
విమాన రంగం ఆశావహం
భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. -
అదిరిపోయే బెనిఫిట్స్.. జియో న్యూ ఇయర్ ప్లాన్
రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా నూతన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025’ గడువు డిసెంబర్ 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రీఛార్జ్ ప్లాన్‌తోపాటు కూపన్లను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ.2025తో రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ప్లాన్ వివరాలు200 రోజుల పాటు అన్లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్.500 జీబీ 4జీ డేటా (రోజుకు 2.5 GB).అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయం.పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.రూ.500 అజియో కూపన్. రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఈ కూపన్ ఉపయోగించవచ్చు.స్విగ్గీపై రూ.150 తగ్గింపు. కనిష్ట ఆర్డర్ రూ.499 పై వర్తిస్తుంది.ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తే ఈ కూపన్ వినియోగించుకోవచ్చు.ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే మొత్తంగా రూ.468 సేవింగ్స్‌ను అందిస్తుంది. -
3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్‌పై క్లారిటీ
పాలసీదారుల కీలక సమాచారం లీక్ కావడంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ తన భద్రతను పటిష్టం చేసుకునేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ తరహా డేటా లీకేజీ ఘటన మరోసారి చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన డేటా లీకేజీ ఘటనలో 3.1 కోట్ల స్టార్ హెల్త్ కస్టమర్ల మొబైల్ ఫోన్, పాన్, చిరునామా తదితర సున్నిత సమాచారం బయటకు రావడం గమనార్హం. షెంజెన్ అనే హ్యాకర్ ఈ సమాచారాన్ని ఏకంగా ఒక పోర్టల్‌లో విక్రయానికి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందే..‘ఒకరితో ఒకరు అనుసంధానమై పనిచేయాల్సిన ప్రపంచం ఇది. ఏజెంట్లు, ఆసుపత్రులు, బీమా కంపెనీలు అన్ని అనుసంధానమై పని చేసే చోట తమ వంతు రక్షణలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బలహీన పాస్వర్డ్లు తదితర వాటిని హ్యాకర్లు సులభంగా గుర్తించగలరు. కేవలం అంతర్గతంగానే కాకుండా, స్వతంత్ర నిపుణుల సాయంతో మేము ఇందుకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకున్నాం’ అని ఆనంద్‌రాయ్ వివరించారు. ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయంటూ, బీమా కంపెనీలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..అసలేం జరిగింది..?స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి ఉంచినట్లు గతంలో గుర్తించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్ల అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం. మద్రాస్ హైకోర్ట్ ఆదేశాల మేరకు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. -
ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్‌లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్‌గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్‌గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
హల్దీరామ్‌లో వాటాపై కన్ను.. రేసులో మూడు కంపెనీలు
న్యూఢిల్లీ: ప్యాక్డ్ స్వీట్లు, స్నాక్స్, రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్‌లో మైనారిటీ వాటా కొనుగోలుపై మూడు కంపెనీలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 15–20 శాతం వాటా కొనుగోలు రేసులో బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం ముందుంది.అయితే అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం ఆసక్తి చూపడతో ప్రస్తుతం మూడు సంస్థల మధ్య పోటీ నెలకొంది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,400 కోట్లు) విలువైన బైండింగ్ ఆఫర్ ద్వారా అల్ఫా వేవ్ పోటీని తీవ్రతరం చేసింది. హల్దీరామ్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం కొత్త ఏడాది జనవరిలో వాటా విక్రయాన్ని పూర్తిచేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియా షేర్ల జారీతొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికి కట్టుబడ్డారు. తద్వారా సమీకరించిన నిధులను విస్తరణకు వినియోగించే యోచనలో ఉన్నారు. అంతేకాకుండా తదుపరి దశలో ఐపీవోవైపు సైతం దృష్టిసారించనున్నట్లు అంచనా. టెమాసెక్ భాగస్వామ్యంతో బెయిన్ క్యాపిటల్, అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీ వాటా కొనుగోలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెజాన్ కొత్త అడుగు..
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీయంగా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ’15 నిమిషాల లోపే’ నిత్యావసరాలను డెలివరీ చేసేలా బెంగళూరులో పైలట్ ప్రాజెక్టును ఈ నెలలో మొదలుపెట్టబోతున్నట్లు అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ తెలిపారు. దేశీయంగా ఇప్పటికే క్విక్ కామర్స్ మార్కెట్లో బ్లింకింట్, జెప్టో మొదలైనవి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఈ–కామర్స్ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ వివరించారు. ఇక్కడ విక్రేతలు.. ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతుండటం, నాణ్యమైన తయారీ, సానుకూల పాలసీలు, టెక్నాలజీ మొదలైనవన్నీ ఇందుకు దోహదపడే అంశాలని పేర్కొన్నారు.భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తోందంటూ అమెజాన్‌పై వచ్చే ఆరోపణల మీద స్పందిస్తూ.. తమ కంపెనీ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా, నిబంధనల మేరకు వ్యాపారం నిర్వహిస్తోందని కుమార్ చెప్పారు. చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు కూడా మనుగడ సాగించేలా తోడ్పాటు అందించడమనేది ఒక పెద్ద కంపెనీగా తన బాధ్యతగా అమెజాన్ భావిస్తుందని పేర్కొన్నారు. 80 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెజాన్ 2030 నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 80 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్టు ప్రకటించింది. 2015 నుంచి కంపెనీ ఎగుమతులు చేపడుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం, లక్షలాది భారతీయ చిన్న వ్యాపారులు, డైరెక్ట్ టు కంజ్యూమర్ బ్రాండ్లతోపాటు ఇతర కీలక వాటాదారులతో కలిసి పనిచేస్తున్నట్టు అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎస్వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు.సంస్థ ఏటా నిర్వహించే సంభవ్ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి మొత్తం 80 బిలియన్ డాలర్ల ఎగుమతులను అందుకునేందుకు నిబద్ధతతో ఉన్నట్టు వివరించారు. 2015లో ప్రారంభించినప్పటి నుండి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ భారత్‌లోని 200లకుపైగా నగరాల నుండి 1,50,000 పైచిలుకు నమోదిత విక్రేతలను కలిగి ఉందని చెప్పారు. 2025 చివరి నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 20 బిలియన్ డాలర్లను అధిగమించబోతున్నాయని కంపెనీ బ్లాగ్ తెలిపింది. గడువు కంటే ముందుగానే.. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా స్థాపించడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్‌తో (డీపీఐఐటీ) అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తయారీ స్టార్టప్స్‌లో 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. అమెజాన్ ఒక కోటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలీకరణ చేస్తామని, 2025 నాటికి భారత్ నుండి మొత్తం 20 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించి.. దేశంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని గతంలో హామీ ఇచ్చింది. గడువు కంటే ఏడాది ముందుగానే డిజిటలీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు అమెజాన్ తెలిపింది. 1.2 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటలైజ్ చేశామని, మొత్తం ఎగుమతులు 13 బిలియన్ డాలర్లు నమోదయ్యాయని, 14 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించామని వివరించింది. లాజిస్టిక్స్ సేవలు.. దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) బ్రాండ్స్ కోసం అమెజాన్ షిప్పింగ్, అమెజాన్ ఫ్రైట్ పేరుతో సరుకు రవాణా సేవలను ప్రారంభించినట్లు అమిత్ అగర్వాల్ ప్రకటించారు. అమెజాన్ ఫ్రైట్ కింద నగరాల మధ్య, నగరాల్లో రవాణా కోసం పూర్తి ట్రక్లోడ్ సరుకు రవాణా సేవలను అందిస్తారు. అలాగే అమెజాన్ షిప్పింగ్ కింద బిజినెస్ టు కంజ్యూమర్ (బీ2సీ) పార్సిల్ డెలివరీలను చేపడతారు. -
వొడాఫోన్ ఐడియా షేర్ల జారీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 175.53 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. షేరుకి రూ. 11.28 ధరలో వొడాఫోన్ గ్రూప్ సంస్థలకు వీటిని కేటాయించనుంది. తద్వారా రూ. 1,980 కోట్లు సమకూర్చుకోనుంది. ఒమెగా టెలికం హోల్డింగ్స్‌కు రూ. 1,280 కోట్లు, ఉషా మార్టిన్ టెలిమాటిక్స్‌కు రూ. 700 కోట్లు విలువైన షేర్లను జారీ చేయనుంది.2025 జనవరి 7న నిర్వహించనున్న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఈ అంశాలను బోర్డు చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ వాటా 22.56 శాతంకాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వం 23.15 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 8,747 కోట్ల నుంచి తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం సహకరించింది.మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం మెరుగుపడి రూ. 10,918 కోట్లను తాకింది. కాగా.. ఇటీవల టెలికం దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్తో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం సుమారు రూ. 30,000 కోట్ల(3.6 బిలియన్ డాలర్లు) విలువైన డీల్‌ను వొడాఫోన్ ఐడియా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు రూ. 8.11 వద్ద ముగిసింది. -
మరో 100 విమానాలకు ఎయిరిండియా ఆర్డరు
విమానయాన సంస్థ ఎయిరిండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వైడ్–బాడీ ఏ350 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లు 10, ప్రాంతీయ రూట్లలో ఉపయోగించే నారో–బాడీ ఎ320 రకం విమానాలు 90 ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు ఇచ్చిన 470 విమానాలకు ఇవి అదనం.అలాగే ఎ350 ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలు, నిర్వహణ సహకారం కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తాజా ఆర్డరుతో కలిపి ఎయిర్‌బస్ నుంచి ఎయిరిండియా కొనుగోలు చేసే మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 350కి చేరుతుంది. 2023లో కంపెనీ 250 విమానాల కోసం ఆర్డరిచ్చింది."భారత ప్రయాణికుల వృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలను అధిగమించడం, గణనీయంగా మెరుగుపడుతున్న దేశ మౌలిక సదుపాయాలు, ఆకాంక్షతో కూడిన యువ జనాభా అంతర్జాతీయంగా ఎదుగుతుండటం వంటి పరిణామాలతో ఎయిర్ ఇండియా విస్తరణకు స్పష్టమైన సందర్భాన్ని చూస్తున్నాం" టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
42 గంటలే ప్రయాణం.. మూడేళ్లకు స్టేషన్ చేరింది
రైలు ఆలస్యంగా రావడం సర్వసాధారణమే. ఆలస్యం అంటే ఒక గంట, రెండు గంటలు.. మహా అయితే ఒక రోజు అనుకుందాం. కానీ 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సిన రైలు.. తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి వెళుతున్న గూడ్స్ రైలు 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సి ఉంది. 2014లో బస్తీలోని వ్యాపారవేత్త 'రామచంద్ర గుప్తా' తన వ్యాపారం కోసం విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం ఆర్డర్ ఇచ్చాడు.నవంబర్ 10, 2014న, షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన గూడ్స్ రైలులో 1,316 బస్తాల డీఏపీ లోడ్ చేశారు. కానీ చేరుకోవాల్సిన సమయానికి ట్రైన్ చేరలేదు. రామచంద్ర గుప్తా అనేక ఫిర్యాదుల తరువాత, రైలు మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?2014 నవంబర్ 10న బయలుదేరిన గూడ్స్ ట్రైన్.. జూలై 25, 2018న బస్తీ స్టేషన్‌కు చేరింది. కానీ రామచంద్ర గుప్తా ఆర్డర్ చేసిన డీఏపీ మొత్తం పాడైపోయింది. అయితే ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఇంత ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు కూడా ఏ ట్రైన్ ఇంత ఆలస్యంగా ప్రయాణించలేదు. -
ఒకప్పుడు భర్త, ఇప్పుడు తండ్రి మరణం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఎం కృష్ణ ఇటీవల కన్నుముశారు. ఆయన కుమార్తె మాళవిక హెగ్డే ప్రముఖ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణి. మంగళూరు కాఫీ ఘుమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టిన విషయం తెలిసిందే.భర్త మరణం.. చెదరని విశ్వాసం2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.సగానికిపైగా అప్పులు క్లియర్కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్భర్త, తండ్రిని కోల్పోయిన మాళవిక అధైర్య పడకుండా రెట్టించిన ఉత్సాహాంతో పని చేసి కంపెనీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసి లాభాల్లోకి తీసుకురావాలని శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. -
బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్
ఏదైనా ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆదరణ పొందేలా చేసేది ప్రచారాలే. తమ వ్యాపారాలను మరింత మందికి చేరువ చేసేందుకు చాలామంది విభిన్న ప్రచారపంథాను ఎంచుకుంటారు. కొందరు ఫ్లెక్సీలపై అందరికీ కనిపించేలా తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తే.. ఇంకొందరు టీవీల్లో అడ్వర్టైజ్ ఇస్తారు. ఇలా చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే, దాదాపు అన్ని ప్రచార హోర్డింగ్‌లపై ప్రముఖుల ఫొటోలను మాత్రం కామన్‌గా చూస్తూంటాం. ఓ క్రికెటర్, సినీ యాక్టర్, మోడల్.. ఇలా మన సమాజంలో బాగా పేరున్న వారిని కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు వాడుతుంటాయి. అందుకు కొంత పారతోషికం చెల్లిస్తుంటాయి. భారత్‌లో గతేడాదితో పోలిస్తే తమ బ్రాండ్ ప్రమోషన్లు పెరిగిన వ్యక్తుల వివరాలను టామ్ మీడియా రిసెర్చ్ విడుదల చేసింది. ఈ సంస్థ యూఎస్ఏ నీల్సెన్, యూకే కాంటర్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ వివరాలు ప్రకటించింది.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?ఈ లిస్ట్‌లో గతేడాది టాప్‌లో నిలిచిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (40 బ్రాండ్లకు ఎండార్స్మెంట్)ను ఈసారి కెప్టెన్ కూల్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ(42 బ్రాండ్లకు ఎండార్స్మెంట్) వెనక్కినెట్టారు. -
రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్‌తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్‌తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్‌ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?సౌకర్యవంతమైన లెగ్స్పేస్ ఉంటుంది.దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్‌లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి. -
రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఐదేళ్లలో నైపుణ్యాలు నిరుపయోగం!
భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ (జీఎల్ఎంసీ) నివేదిక విడుదల చేసింది. సాంకేతిక విభాగాల్లో గ్లోబల్ సౌత్‌లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ‘నేవిగేటింగ్ టుమారో’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో భారత్ జాబ్ మార్కెట్ వైవిధ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే భారతీయ నిపుణుల్లో సగానికిపైగా వచ్చే ఐదేళ్లలో తమ నైపుణ్యాలు ఉపయోగంలో లేకుండా పోతాయని ఆందోళన చెందుతున్నట్లు నివేదిక తెలియజేసింది.నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తమ నైపుణ్యాలు వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా వాడుకలో లేకుండా పోతాయనే భయంతో ఉన్నారు.ఈ ధోరణి యూకేలో 44 శాతం, ఆస్ట్రేలియాలో 43 శాతంతో కనిష్టంగా, బ్రెజిల్లో అధికంగా 61 శాతం, చైనాలో 60 శాతంగా ఉంది.భారత్‌లో 32 శాతం మంది రాబోయే ఐదేళ్లలో రీస్కిల్లింగ్ అవసరాలను గుర్తించారు. ఇది చైనాలో 41 శాతం, వియత్నాం 36 శాతం, యూకే 14 శాతం, యూఎస్ఏ 18 శాతంగా ఉంది.రానున్న రోజుల్లో సాంకేతికత అవసరాలు పెరుగుతాయి. అందుకు అనుగుణంగా భారత యువత నైపుణ్యాలు పెంచుకుంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి సాంకేతిక రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని ఆసక్తిగా ఉంది.ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణా వ్యవస్థలు మరింత మెరుగుపడాలి.19 శాతం మంది ప్రస్తుతం కొత్త నైపుణ్యాలకు అనువైన విద్యా విధానం లేదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ముఖ్యంగా 21 శాతం మంది యువకులలో (18-34) ఉంది.భారత్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి సమయాభావం-40 శాతం మంది, ఆర్థిక పరిమితులు-38 శాతం మందికి అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌తో సమానంగా బ్రెజిల్లో సమయం లేకపోవడం, ఆర్థిక పరిమితులు వరుసగా 43 శాతం, 39 శాతంగా, దక్షిణాఫ్రికాలో 45 శాతం, 42 శాతంగా ఉంది. నార్వే, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిని పెద్దగా అడ్డంకులుగా భావించడంలేదు. నార్వేలో ఇది వరుసగా 27 శాతం, 28 శాతంగా ఉంది. యూకేలో 31 శాతం, 24 శాతంగా ఉంది.భారతీయ నిపుణులు సాంకేతికంగా స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను వెతుకుతున్నారు. -
ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని కంపెనీ ఫంక్షన్ హెడ్ (కార్పొరేట్ ప్లానింగ్ విభాగం) జేవాన్ రియూ తెలిపారు.చార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కస్టమర్లు జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి సంకోచిస్తున్నట్లుగా తమ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాలతో పాటు కీలక హైవేలపై కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రియూ తెలిపారు.ఇదీ చదవండి: యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానాఇదిలాఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రకటించింది. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్‌బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్‌బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌బస్‌తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
ఫుడ్ డెలివరీ యాప్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రచారం చేయడానికి బిల్‌బోర్డ్‌లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానా
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు బెంగళూరు వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ రూ.5,000 జరిమానా విధించింది. కొత్తగా ఫోన్ కొనుగోలు చేసిన మొబైల్ ప్యాక్‌లో యూజర్ మాన్యువల్ రానందుకు కస్టమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారణ జరిపిన కమిషన్ ఇటీవల తీర్పునిచ్చింది.బెంగళూరులోని సంజయ్ నగర్‌కు చెందిన ఎంస్‌ఎం రమేష్ అనే వినియోగదారుడు వన్‌ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నార్డ్ సీఈ 3 మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఫోన్ విక్రయించిన ఆరు నెలల తర్వాత, జూన్‌లో వినియోగదారుల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేశాడు. తాను రూ.24,598కి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నానని, అయితే అందులో యూజర్ మాన్యువల్ లేదని ఫిర్యాదులో తెలిపాడు. ఫోన్ వారంటీ సమాచారం, కంపెనీ చిరునామాను తెలుసుకోవడంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి కంపెనీని ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్‌లో వన్‌ప్లస్ మాన్యువల్‌ను అందించిందన్నారు. ఫోన్ కొనుగోలు చేసిన నాలుగు నెలల తర్వాత ‘సేవలో లోపం’ కారణంగా ఇలా చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంవినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వన్‌ప్లస్ ఇండియా వ్యవహారం పూర్తిగా నిర్లక్ష్యం, ఉదాసీనతను చూపుతుందని పేర్కొంటూ రూ.5,000 జరిమానా విధించింది. -
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.