
రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరులలో ఒకరు. ఈయన సంపద కొన్ని చిన్న దేశాల జీడీపీ(GDP)ల కంటే ఎక్కువ. ఇంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తన పర్సులో ఎంత డబ్బు పెట్టుకుంటారో బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే దీనికి అంబానీ సమాధానం ఇచ్చారు.
ముకేశ్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే.. వీరు ఖరీదైన ఇంట్లో నివసించడం, అత్యంత లగ్జరీ కార్లను తమ రోజువారీ వినియోగిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా కూడా విలువైన ఆభరణాలు ధరించడం.. అనంత్ అంబానీ బ్రాండెడ్ గడియారాలు ధరించిన సన్నివేశాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ముఖేష్ అంబానీ మాత్రం.. ఎక్కువగా సాధారణ దుస్తులు ధరించి, ఫార్మల్ ప్యాంటుతో కనిపిస్తారు.
డబ్బు ఒక వనరు మాత్రమే
ముకేశ్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు, డబ్బు కేవలం ఒక వనరు మాత్రమే అని వెల్లడించారు. నేను ఎప్పుడూ పర్సులో నగదు లేదా క్రెడిట్ కార్డులను తీసుకెళ్లనని స్వయంగా వెల్లడించారు. అయితే బిల్లులు చెల్లించడానికి ఎల్లప్పుడూ నాతో ఎవరైనా ఉంటారని పేర్కొన్నారు. తాను స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ తనతో డబ్బు తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్‌ఫ్లిక్స్‌కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
బిరుదులు ఇష్టం ఉండదు
మీడియా లేదా ఏదైనా ప్రత్యేక వార్తాపత్రిక తనను ఏదైనా బిరుదుతో సత్కరించడం తనకు ఇష్టం ఉండదని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ ధనవంతులలో ఒకరైన ఈయన.. తన వ్యక్తిగత జీవితంలో చాలా నిశ్చింతగా ఉండటానికి ఇష్టపడతారని వీటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అతను సరళమైన జీవనశైలిని ఆస్వాదిస్తాఋ, ఉదయాన్నే నిద్రలేవడం.. ఎక్కడికీ వెళ్ళే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు.