amount
-
ఆస్తి అమ్మిన డబ్బుతో.. అలా వద్దండి!
అన్ని జాగ్రత్తలు తీసుకుని, సంబంధిత కాగితాలు భద్రపర్చుకుని, బ్యాంకులో జమ అయిన మొత్తంతో ఏం చేయాలి అనేది ఆలోచించాలి. కాస్సేపు ఇలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘ప్రతిఫలం’ అని అందాం. ఈ ప్రతిఫలం నగదు రూపంలో వద్దండి! బ్యాంకులోనే జమ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమాచారం వెనువెంటనే కాకపోయినా .. త్వరగా కాకపోయినా.. అంతిమంగా సబ్ రిజిస్ట్రార్‌కి విధించిన గడువులోగా ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారికి చేరుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతిఫలాన్ని ఏం చేయాలన్న ప్రశ్నకు జవాబుగా ఆదాయపు పన్ను చట్టప్రకారం మరీ ఎక్కువగా ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యుల అవసరం ఏమిటి అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చి హాయిగా కాలం గడుపుతున్న కొంత మందిని ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం. ➤ ఆ ఊళ్లో సాంబశివరావుగారు మంచి టీచర్. మానవతా విలువలతో పాటు విద్యావిలువలు తెలిసిన పెద్ద మనిషి. స్థిరాస్తి అమ్మకంతో వచ్చిన ప్రతిఫలంతో ఏర్పడ్డ పన్ను భారాన్ని చెల్లించేసి, మిగతా మొత్తంతో పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఆ మొత్తాన్ని వారి వారి చదువులకు ఖర్చు పెట్టి వారిని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అందరూ భారత్‌లోనే ఉన్నారు. ➤ పిల్లలను విదేశాల్లో చదివించాలన్న విశ్వేశ్వరరావు కూడా అదే బాటని ఆశ్రయించారు. పన్ను భారం చెల్లించాక మిగిలిన మొత్తంతో కొడుకుని విదేశాల్లో ఉన్నత విద్యల కోసం పంపించి హాయిగా ఉన్నారు. ➤ చెల్లి పెళ్లి అప్పులతో తండ్రి చేశాడు. క్రమేణా కాలం కలిసొచ్చింది కల్యాణరావుకి. మావగారు ఇచ్చిన ఇల్లుకి రింగ్ రోడ్ ధర్మమా అని రేటు రాగానే అమ్మేశాడు, పన్ను కట్టాకా మిగిలిన మొత్తంతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి చేసేసి, మనవళ్ళతో ఆడుకుంటున్నాడు. ➤ శివరావుగారి తాతగారు ఎప్పుడో గుడి కట్టించారు. అది శిథిలం అయ్యింది. తండ్రి ఏమి చేయలేకపోయాడు. కానీ గుడిని పునరుద్ధరించాలనేది ఆయన చిరకాల కోరిక. శివరావుగారు తనకు వచ్చిన ‘ప్రతిఫలం’లో మిగిలిన మొత్తంతో గుడిని బాగుచేయించారు. తన శ్రమ శక్తి వల్ల ఏర్పడ్డ స్థిరాస్తి అమ్మకం.. శివభక్తికి అలా ఉపకరించింది. భార్య పార్వతమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. ➤ తన స్కూలు చదువంతా ఎండా, వానల్లోనే. కాలేజీకి వచ్చే వరకు బెంచీలు చూడని విద్యాధరరావు డబ్బు సంపాదించి, ఇల్లు కొన్నాడు. అమ్మవలసినప్పుడు, అన్ని బాధ్యతలను తీర్చివేసి ఊళ్లో స్కూల్లో అన్ని తరగతులవారికి బెంచీలు కొన్నాడు. ➤ బంగార్రాజు పేరుకే బంగార్రాజు. పెళ్లాం లక్ష్మీ ప్రతిరోజూ పేచీయే బంగారం కొనమని. అనుకోకుండా అన్నదమ్ముల స్థిరాస్తి పంపకాల్లో ఆస్తి అమ్మాల్సి వచ్చింది. పన్ను కట్టేసి మిగిలిన మొత్తంతో పెళ్లాం లక్ష్మమ్మని ఏడువారాల నగలు, వడ్డాణం కొని ‘లక్ష్మీదేవి’గా చేశాడు బంగార్రాజు. ➤ అమీర్‌పేటలో ఇరుకు ఇంట్లో నలభై ఏళ్లు కాపురం చేసి విసిగిపోయిన రాజారావు.. ’ప్రతిఫలం’తో ఓ విల్లా కొనుక్కుని, నార్సింగిలో సరదాగా ఉన్నాడు. పన్ను మినహాయింపులు కూడా పొందాడు. ➤ మొదటి నుంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వల్ల ’ప్రతిఫలం’ మొత్తాన్ని నిర్దేశిత బాండ్లలో ఇన్వెస్ట్ చేసి, ఆ వడ్డీలతో ఏ అప్పు లేకుండా పబ్బం గడుపుతున్నాడు ’లక్ష్మీపతి’. ➤ పాత ఇండస్ట్రీ షెడ్డుని అమ్మేసి, ఆ డబ్బుతో కొత్త షెడ్డు కొని వ్యాపారం చేస్తున్నారు నాయుడుగారు. ➤ అన్ని ఆస్తులు అమ్మినా, సరైన ప్లానింగ్ లేకుండా అప్పుల పాలైన అప్పారావూ ఉన్నారు. ఏదేమైనా ‘ప్రతిఫలం’ మొత్తాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఓటేయకుంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.350 కట్! నిజమేనా?
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. (అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!) దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది. కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది. क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓ जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck: 🔶 यह ख़बर #फ़र्ज़ी है। 🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है। 🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!! 🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh — PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023 -
శోభ.. 'నిజాయితీ' కి మారుపేరు..!
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది. ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది. -
బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది చూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. దీనిలో షేర్ అయ్యే వీడియోలు, ఫొటోలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు అవి మన మనసుకు హత్తుకుపోతాయి. కొన్ని వీడియోలు, ఫొటోలు మనల్ని తెగ నవ్విస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఇమేజ్‌లో ఒక బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్ స్లిప్ కనిపిస్తోంది. దీనిలో ఒక వినియోగదారుడు.. రాశి(అమౌంట్) కాలమ్‌లో ఏమి నింపాడో తెలిస్తే ఎవరికైనా తెగ నవ్వు వస్తుంది. దీనిని చూసిన కొందరు తమ తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు తమ పొట్టపట్టుకుని పడీపడీ నవ్వుతున్నారు. వైరల్ అవుతున్న ఈ ఫొటో పాతదే అయినప్పటికీ, సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ అవుతూ, తెగ వైరల్ అవుతోంది.సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్విట్టర్లో @NationFirst78 అనే ఖాతా కలిగిన యూజర్ తొలుత దీనిని షేర్ చేశారు. దీనిలో ఒక బ్యాంకు డిపాజిట్ స్లిప్ కనిపిస్తోంది. వినియోగదారుడు ఆ ఫారంలోని అన్ని కాలమ్‌లను సరిగానే పూరించాడు. అయితే ‘రాశి’(అమౌంట్) కాలమ్‌లో తులారాశి అని రాశాడు. ఈ ఫారం హిందీ, ఇంగ్లీషు రెండు భాషలలో ఉంది. హిందీలో ‘రాశి’ అంటే ఇంగ్లీషులో అమౌంట్ అని అర్థం. అయితే ఆ మహాశయుడు రాశి అనగానే తన జన్మరాశి అనుకుని దానిని ఆ కాలమ్‌లో నింపాడు. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఫారాన్ని పరిశీలించి చూస్తే, ఇది ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందిన ఒక బ్యాంకుదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
10 రోజుల్లో ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ రైతుబంధు సొమ్మును వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబి్ధదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూములకు చెందిన రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని తెలిపాయి. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, మొదటిసారి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనే రైతులు ఏఈవోలను సంప్రదించి ఆయా వివరాలు సమర్పించాలని సూచించాయి. సమీకరించిన నిధుల్లోంచి నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొ న్నాయి. మొదటి రోజున ఎకరాలోపున్న వారికే మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా మర్నాటి నుంచి ఒక్కో ఎకరా పెంచుకుంటూ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. -
ఏపీ: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవడమే కాకుండా.. పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశిస్తూ వస్తున్నారాయన. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదును అందించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 రోజులకే ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. ఈరోజు ఒక్కరోజే 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ సీజన్‌కి సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేసింది జగన్ సర్కార్. ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయమున్నా.. 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇదీ చదవండి: జగనన్నకు చెబుదాంపైనా అక్కసు.. ఆయనగారి పైత్యం -
పొరపాటుగా అకౌంట్లో రూ.2 కోట్లు.. వ్యక్తి ఏం చేశాడంటే..
సాక్షి, వైరా(ఖమ్మం) : ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటుగా రూ.2 కోట్ల నగదు జమ కాగా.. తిరిగి జమ చేసిన కంపెనీకి అప్పగించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన గంధం వెంకటేశ్వర్లు ఖాతాలో ఈనెల 11న రూ.2 కోట్లు జమ అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చూడగా ఖాతాలో రూ.2కోట్లు జమ అయి ఉన్నాయి. కాగా, వెంకటేశ్వర్లు వైరా తహసీల్ ఎదుట నిర్మించిన భవనంలో సాబూ ఆటో జోన్ కంపెనీ(అశోక్ లేలాండ్ కంపెనీ) డీలర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. నెలనెలా సదరు డీలర్ వెంకటేశ్వర్లుకు ఇంటి అద్దెను బ్యాంకు అకౌంట్లో జమ చేసేవాడు. ఈక్రమంలోనే పొరపాటున కంపెనీకి చెల్లించాల్సిన రూ.2కోట్లను ఈయన ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ జీఎం శేషాచారి వైరాకు చేరుకోగా.. అప్పటికే వెంకటేశ్వర్లు డీలర్‌తో చర్చిస్తున్నాడు. దీంతో మంగళవారం ఖమ్మంలోని రోటరీనగర్ ఎస్బీఐ శాఖ ద్వారా ప్రతి నిధులకు రూ.2కోట్ల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు అభినందించారు. -
మహిళ అకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు!
యూకే: ఓ మహిళ అకౌంటుకు పొరబాటున ఏకంగా 7.7 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఐతే జమ చేసిన సంస్థ పొరపాటున ఈ తప్పు చేసినప్పటికీ సదరు మహిళ పిర్యాదు చేసేంత వరకూ దానిని గమనించలేదట. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. యూకేకు చెందిన మహిళ అకౌంటుకు ఆగస్టు 2020న హర్ మెజెస్టీస్ రెవెన్యూ అండ్ కస్టమ్స్ (హెచ్‌ఎమ్‌ఆర్సీ) నుంచి 7,74,839 పౌండ్లు (సుమారు 7.7 కోట్ల రూపాయలు) జమ అయ్యాయి. అంతేకాదు ఈ మిస్టరీ డిపాజిట్ నుంచి అప్పటికే 20 వేల పౌండ్లు ఖర్చు చేసింది కూడా. ఐతే ఖర్చుచేసిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో ప్రస్తుతం ఆమె లేదు. తర్వాత అకౌంటును చెక్ చేసుకున్న సదరు మహిళ మిస్టరీ డిపాజిట్ గురించి తీవ్ర ఆందోళనకు గురైంది. నిజానికి ఈ విధమైన పొరబాట్లు యూకేలో సెక్షన్ 24ఎ దొంగతనం చట్టం 1968 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున జమ అయిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులకు చెల్లించవల్సిన బాధ్యత అకౌంటుదారులే నిర్వర్తించాలి. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ఐతే నవంబర్ 2020లో పన్ను చెల్లించినప్పుడు హెచ్‌ఎమ్‌ఆర్సీ సిబ్బంది తమ తప్పును గమనిస్తారని మహిళ భావించింది. కానీ అలా జరగలేదు. డబ్బు ఆమె ఖాతాకు మాత్రమే కేటాయించబడినందున, ఆమె ముందుకు రాకపోతే అది ఎప్పటికీ గుర్తించబడకపోవచ్చు. దీంతో ఆమె ఫోను ద్వారా హెచ్ఎమ్ఆర్సీని సంప్రదించి పొరపాటును గుర్తుచేసింది. పార్శిల్ కస్టమ్స్ డ్యూటీ రాయితీని చెల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిబ్బంది పొరపాటున 23.39 పౌండ్లకు బదులు అధికమొత్తాన్ని జమ చేసినట్లు హెచ్‌ఎమ్‌ఆర్సీ ఎట్టకేలకు కనుగొంది. దీని గురించి హెచ్‌ఎంఆర్‌సి ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాము. చెల్లింపును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. ఐతే ఇంత పెద్ద మొత్తం పొరబాటున క్రెడిట్ అవ్వడం ఇంతవరకూ జరగలేద’ని మీడియాకు తెలిపారు. దాదాపుగా 15 నెలల తర్వాత ఈ విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వర్షాలు పడుతున్న కీలకమైన సమయంలో రైతులకు నగదు జమ కావడం ఎంతో ఊరటనిచ్చే అంశం. మంగళవారం ఒక ఎకరా వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుబంధు నిధులు వేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్రావు తెలిపారు. గత సీజన్లో మాదిరిగానే జమ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 వరకు రైతుబంధు సొమ్ము అందరికీ అందుతుందన్నారు. ఈ సీజన్లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.7,508 కోట్ల నిధులు అందుతాయి. గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది కొత్తగా రైతులు పెరిగిన సంగతి తెలిసిందే. -
దారుణం: రూ.6.50 లక్షలు డబ్బు కట్టు.. శవాన్ని తీసుకెళ్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి శవాన్ని రూ.6.5 లక్షలు కడితేనే అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం.. మూడురోజుల పాటు మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన దారుణ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (41) కరోనా లక్షణాలతో ఈ నెల 17వ తేదీన నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఆస్పత్రిలో చేరాడు. చేరే సమయంలో రూ.1.40 లక్షలు, ఆ తర్వాత పరీక్షలంటూ రూ.53,800, మందుల పేరిట అదనంగా వసూలు చేశారు. ఇంతజేసినా ఫలితం దక్కలేదు. ఈ నెల 25వ తేదీన అతను మరణించినట్లు కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు రాగా, తమకు ఇంకా రావాల్సిన రూ.6.5 లక్షలు కడితే కానీ మృతదేహం అప్పగించబోమని తేల్చిచెప్పింది. తమ వద్ద ఇప్పుడు అంత డబ్బులు లేవని, మృతదేహాన్ని ఇస్తే రెండురోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు చెప్పారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు. డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బాక్సులో పెట్టి హాస్పిటల్ సెల్లార్లో ఉంచారు. డబ్బుల కోసం ప్రయత్నించినా.. తెలిసిన వారి దగ్గర డబ్బుల కోసం విఫల ప్రయత్నం చేసిన కుటుంబసభ్యులు మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని తాము చేసిన ప్రయత్నాలు వివరించారు. మృతదేహాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఆస్పత్రి యాజమాన్యం కనికరించకపోవడంతో బంధువులతో పాటు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి. మానవత్వం మరిచిపోయారు మృతదేహాన్ని మూడురోజులు ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన యాజమాన్యం మానవత్వం మరిచి వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన తాము, మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో మరింత మనోవేదనకు గురయ్యామని వాపోయారు. రోగులను ఆదుకోవాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐసీయూలో పది మంది కరోనా పేషెంట్లకు ఒకే నర్స్ చికిత్స చేస్తోందని తెలిపారు. సరైన చికిత్స చేయకపోగా, రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి చదవండి: మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్ -
ఆదర్శ వివాహాలకు నజరానా పెంపు
సాక్షి, తాండూరు(రంగారెడ్డి) : కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహం చేసుకున్న వారికి నజరానా పెంచింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల అమలు బాధ్యతలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించారు. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.50 వేల ప్రోత్సాహకం అందేది. ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెంచారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో పరిమాణాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎస్సీలకు బాసటగా నిలుస్తోంది. జంటకు రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డును అందించనున్నారు. ఇందుకు సంబంధిత శాఖ అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రోత్సాహకం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ ఈ పీఏఎస్ఎస్.సీజీజీ జీఓవీ.ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్హతలివీ.. ► ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు, లేదా వరుడు కులాంతర వివాహం చేసుకొని ఉండాలి. ► వధువు, వరుడు రూ.2లక్షలలోపు ఆదాయం కలిగి ఉండాలి. ► గత అక్టోబర్ 30 తర్వాత చేసుకున్న కులాంతర వివాహాలకు ఈ ఇన్సెంటివ్ అవార్డును అందించనున్నారు. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు.. ► కులాంతర వివాహ ప్రోత్సాహక అవార్డుకు ధ్రువీకరణ పత్రాలు తప్పని సరిగా జతపర్చాలి. ఇద్దరికీ సంబంధించిన ఆధార్‌కార్డులు జత చేయాలి. ► వధూవరులు బ్యాంకులో జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. ► వధూవరుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ► వివాహం జరిగినట్లు రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ► కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్ కార్డులు సైతం జత చేయాలి. ► వధూవరుల పూర్తి చిరునామాను పొందు పర్చాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వికారాబాద్ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన యువతి యువకులు కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డు అందుతుంది. గత అక్టోబర్ 30 తర్వాత వివాహం చేసుకున్న జంటలు అర్హులు. వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రంతో పాటు కుల, ఆదాయ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ చేసిన అనంతరం నజరానాను వారి జాయింట్ అకౌంట్లో జమ చేస్తాం. – విజయలక్ష్మి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, వికారాబాద్ జిల్లా -
రైతన్నకు శుభవార్త
కల్వకుర్తి : రైతన్నకు ప్రభుత్వం మరో శుభవార్త ఇచ్చింది. బ్యాంకులిచ్చే పంట రుణాలు పెరిగాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరానికి 2 నుంచి 5 శాతం పెంచింది. ధాన్యం, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలకు రుణాలు పెరిగాయి. బ్యాంకు అధికారులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో రైతులు వేసుకున్న పంటల ఆధారంగా రుణాలు ఇస్తుంటారు. వాటికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2018–19 ఏడాదికి పెంచిన దాని ప్రకారం రుణాలివ్వాలని ప్రభుత్వం ఇటీవలే అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. పంట పెట్టుబడికి రుణాలు రైతులు పంటలు సాగు చేసే ముందు పెట్టుబడికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. పంట సాగును పరిగణలోకి తీసుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇస్తుంటారు. ఖరీఫ్, రబీల ముందు రైతులకు పహాణి, పాసుపుస్తకాలు పరిశీలించి రుణాలు అందజేస్తారు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ సైతం ఉంటుంది. బ్యాంకులు రైతులకు అందించే రుణాలును పంటల పెట్టుబడి వ్యయం దృష్టిలో ఉంచుకొని రుణం పెంచుతుంటారు. ఏటా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వివిధ పంటలకు ఇచ్చే రుణాలను వివరిస్తూ ఖరీఫ్ ముందు ఉత్తర్వులు అందిస్తుంది. ఇదీ.. ప్రయోజనం ప్రధాన పంటైన వరికి గతేడాది ఎకారానికి రూ.30వేలు రుణం ఇచ్చేవారు. ఈ ఏడాది రూ.34 వేలు ఇవ్వనున్నారు. వరిసీడ్కు రూ.40వేల నుంచి రూ.42వేలకు పెంచారు. అలాగే పత్తి పంటకు రూ.30వేల నుంచి రూ.35వేలకు పెంచారు. అదేవిధంగా పత్తి సీడ్ పంట సాగుకు రూ.1.26 లక్షలు ఇవ్వనున్నారు. మొక్కజొన్నకు రూ.28వేలు, మిర్చికి రూ.58వేలు, వేరుశెనగకు ఎకరానికి రూ. 23వేలు, జొన్న పంటకు రూ.16వేలు, వర్షాధార కంది పంటకు రూ.14వేలు, బోరుకింద సాగు పంటకు రూ.18వేలు ఇవ్వనున్నారు. ఆముదం పంటకు రూ.11వేల వరకు పెంచారు. ఉల్లిగడ్డకు రూ.25వేల నుంచి రూ.30వేలకు పెరిగింది. సన్‌ప్లవర్ పంటకు రూ.18వేలు ఇవ్వనున్నారు. పండ్ల తోటలు, కూరగాయలు పెంచిన రుణం పండ్ల తోటలు, కూరగాయలకు సైతం వర్తిస్తుంది. బోరు కింద సాగు చేసే టమాటాకు ఎకరానికి రూ.35వేలు, వర్షాదారానికి సాగు చేసే టమాటాకు రూ.30వేలు, పండ్ల తోటలు మామిడికి రూ.35వేలు, బత్తాయికి రూ.38వేలు, సపోటా తోటకు రూ.30వేలు, జామ రూ30వేలు, గ్రేప్స్ రూ.90వేలు, పుచ్చకాయలు రూ.22వేలు బొప్పాయికి రూ. 52వేలు ఇవ్వనున్నారు. పెరిగిన రుణసాయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆధార్ లేకున్నా రైతుబంధు చెక్కులు!
సాక్షి, హైదరాబాద్ : ‘రైతుబంధు’చెక్కుల పంపిణీకి ఆధార్, పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి నిబంధనను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామాల్లో కొందరు రైతులకు ఇప్పటికీ ఆధార్ కార్డు లేకపోవడంతో ఓటరు గుర్తింపు కార్డున్నా చెక్కులివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించనట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఓటరు కార్డు కూడా లేకున్నా బ్యాంకు ఖాతా, గ్యాస్ బుక్ తదితర ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు వెల్లడించాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదం తీసుకొని ప్రకటన జారీ చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు గుర్తింపు కార్డుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కొత్త పాసు పుస్తకం జారీ కాకపోతే రెవెన్యూ అధికారులే పాసు పుస్తకం మొదటి పేజీని ముద్రించి రైతులకు అందజేయనున్నారు. పాసు పుస్తకం సహా గుర్తింపు కార్డు చూపించిన రైతులకే చెక్కులు పంపిణీ చేయనున్నారు. 100 ఎకరాలు దాటితే.. 100 ఎకరాలు మించి పొలాలున్న రైతులకు పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. చెక్కుల ముద్రణకు ముందే వంద ఎకరాలకు మించిన పొలాలున్న రైతుల పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచారు. భూ సీలింగ్ చట్టం ప్రకారం 54 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. అంతకు మించి ఉంటే ఆ అదనపు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి వారికి పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదు. అయితే 54 ఎకరాలకు మించి కాకుండా వందెకరాలకు మించిన భూములను అధికారులు ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. 54 నుంచి వందెకరాల వరకున్న రైతులకు పెట్టుబడి సొమ్ముపై ఎవరైనా కోర్టుకెళితే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఇబ్బందుల్లో పడే అవకాశముంది. 23 వేల చెక్కుల్లో తప్పులు 23 వేల చెక్కుల్లో గ్రామం, రైతు పేర్లలో తప్పులు దొర్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. 14 వేల చెక్కులను జిల్లాలకు పంపకముందే హైదరాబాద్‌లోనే గుర్తించగా.. మరో 9 వేల చెక్కులను జిల్లాలకు పంపాక గుర్తించారు. తప్పులు దొర్లిన చెక్కులను వెనక్కి తెప్పించామని, వాటి ముద్రణ కూడా దాదాపు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా అన్ని చెక్కుల ముద్రణ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. 40.92 లక్షల మంది రెండున్నర ఎకరాల్లోపే.. సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు సొమ్మును అందుకునే వారిలో ఎక్కువ సంఖ్యలో సన్నకారు రైతులే ఉన్నారు. సన్నకారు అంటే రెండున్నర ఎకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులే. వారి సంఖ్య 40.92 లక్షలుగా ఉంది. రెండున్నర నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతుల సంఖ్య 11.02 లక్షలు, 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతుల సంఖ్య 4.44 లక్షలుగా ఉంది. 10 నుంచి 25 ఎకరాల మధ్య ఉన్న రైతుల సంఖ్య 94,551 కాగా, 25 ఎకరాల పైన వ్యవసాయ భూమి ఉన్న రైతుల సంఖ్య 6,488 గా ఉన్నట్లు వ్యవసాయ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. -
రైతుకు అందని... పెట్టుబడి రాయితీ
- మూడు తుపాన్ల సొమ్ముల ప్రభుత్వం వద్దే - హెలిన్..భారీ వర్షాల పెట్టుబడి రాయితీ ఇవ్వనంటున్న బాబు సర్కార్ - రెండేళ్ల క్రితం తుపాను రాయితీ కూడా అందని తీరు - పెట్టుబడుల కోసం మళ్లీ బయట అప్పులే - కోనసీమలో రైతుల ఆందోళన అమలాపురం : ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్ల రూపాయిల పెట్టుబడి రాయితీ సొమ్ములు హామీలకే పరిమితమైంది. తుపాన్లు రావడం.. పంట నష్టపోవడం.. ఆనక కనీసం పెట్టుబడి రాయితీ సొమ్ములు కూడా రాకపోవడం రైతులకు పరిపాటిగా మారింది. పంట నష్టపోతే పరిహారం భరోసా లేకపోవడం వల్లే డెల్టాలో ముంపు ప్రాంత రైతులు ఖరీఫ్ సాగుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో గడిచిన ఆరేళ్లలో మూడుసార్లు భారీ తుపాన్లు వచ్చి రైతులు రూ.వందల కోట్ల రూపాయిల పంటను కోల్పోయారు. ఆయా సందర్భాలలో సందర్భాలలో ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వేలు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో హెలెన్ తో పాటు భారీ వర్షాలు కారణంగా జిల్లాలో వరితోపాటు వాణిజ్య, కూరగాయ పంటలను రైతులు ఎక్కువగా నష్టపోయారు. హెలెన్‌కు సంబంధించి 1.23 లక్షల మంది రైతులకు రూ.53 కోట్లు, 2013లో భారీ వర్షాలకు సంబంధించి 1.50 లక్షల మంది రైతులకు రూ.71 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ రావాల్సి ఉంది. అంతకుముందు నీలం పరిహారం 3.09 లక్షల మంది రైతులకు రూ.144 మంజూరైనా ఇప్పటికీ సుమారు 12 వేల మందికి రూ.ఆరు కోట్లు చెల్లించాల్సి ఉండడం గమనార్హం. వీటికి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలు రావడంతో జీవో జారీ చేయలేదు. కొత్త రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రచారంలో పెట్టుబడి రాయితీని అటకెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిహారం ఇప్పుడెలా ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకుంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత 2015–16 తుపాను పరిహారం రూ.162 కోట్లు వరకు జిల్లాకు పెట్టుబడి రాయితీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారాన్ని జూన్ 20 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. తీరా గత ఏడాది కరువు పరిహారం ఇస్తామని చెప్పి అంతకుముందు ఏటా తుపాను పరిహారాన్ని అటకెక్కించే యత్నం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబు ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాయితీగా రైతులకు అందకపోవడం విశేషం. సాధారణం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకూడదని, తరువాత పంటను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీగా సొమ్ములు చెల్లిస్తారు. పంట తరువాత పంటకు అటుంచి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా రైతులను గాలికి వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కనీసం పాత బకాయిలన్నా సాగు ఆరంభానికి ముందు ఇస్తే ఖరీఫ్‌కు కొంత వరకు పెట్టుబడి సొమ్ములు వస్తాయని ఆశించిన రైతులు ప్రభుత్వం మరోసారి నిరాశ పరిచింది. దీంతో వారు బయట అప్పులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వకూడదనే జీవో ఇచ్చి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. రైతులు ఆందోళనలు... పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు బుధవారం కోనసీమలో ఆందోళన చేపట్టారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంతోపాటు కోనసీమలోని 16 తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీ, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు నాయకత్వం వహించారు. పెట్టుబడి రాయితీలను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంఘం నాయకులు అప్పారి చిన వెంకటరమణ, అడ్డాల గోపాలకృష్ణ, రేకపల్లి ప్రసాద్, అబ్బిరెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులపై దళారుల పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక రైతు తనకున్న 40 ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇంతలో ఓ దళారి రంగప్రవేశం చేశాడు. సొమ్ములు ఇస్తేనే ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారం అందుతుందని.. లేదంటే నీ సంగతి అంతేనంటూ భయపెట్టాడు. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఆ రైతుతో సంతకం చేయించుకున్నాడు. మూడు ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నాడు. భూసేకరణ జరిపిన ఐటీడీఏ పీఓ షణ్మోహ¯ŒS నేరుగా ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేయించారు. అయినా.. దళారి ఊరుకోలేదు. తనవల్లే ఆ పని అయ్యిందని, ఎకరానికి రూ.50 వేల చొప్పున 40 ఎకరాలకు రూ.20 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాడు. లేదంటే తనవద్ద ఉన్న స్టాంప్ పేపర్, బ్యాంకు చెక్కులను వినియోగించి రకరకాల కేసులు వేయిస్తానని బెదిరించాడు. దిక్కులేని పరిస్థితిలో ఆ దళారికి రైతు రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. ఈ విషయం బయటపడితే తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాడోననే భయంతో నోరు మెదపటం లేదు. ఇదిలావుంటే.. దర్భగూడెం గ్రామానికి చెందిన మరో రైతుకు అదే గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆ భూమిని మరొకరు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో ఏజెన్సీలో తలెత్తిన ఘర్షణల కారణంగా ఆ రైతు ఊరొదిలి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేశారు. అంతకుముందే దళారులు అతని నుంచి చెక్కులు తీసుకున్నారు. అతనికి అందిన పరిహారంలో సగం సొమ్ము తీసుకున్నారు. అందులో కొంత సొమ్మును అనుభవదారుకు ఇచ్చారు. దీంతో లబోదిబోమనడం అటు రైతు, ఇటు భూమి అనుభవదారుల వంతయ్యింది. పెచ్చుమీరిన పర్సంటేజీల దందా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే వారి కోసం సేకరిస్తున్న భూముల విషయంలో దళారుల దందా పెచ్చుమీరింది. భూములిచ్చిన రైతులకు చెల్లించే పరిహారం వారికి అందాలంటే తాము అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపుబారిన పడే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు జీలుగుమిల్లి మండలం లోని దర్భగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం, పి.అంకంపాలెం, పి.నారాయణపురం, రాచన్నగూడెం, బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో 4,035 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశారు. అప్పటికే వారినుంచి ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్న దళారులు తాము అడిగినంత సొమ్ములు ఇవ్వకపోతే పరిహారం సొమ్ము వెనక్కి వెళ్లిపోయేలా చేస్తామని బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెగబడుతున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. దర్భగూడెంలో 230 ఎకరాలు సేకరించగా.. ఒక చోటా నాయకుడు రైతుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. కేసులు తప్పవు పరిహారం అందిన రైతుల నుంచి ఎవరైనా కమీషన్ల రూపంలో సొమ్ములు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని భూసేకరణ అధికారి షణ్మోహన్ తెలిపారు. బాధితులు తనకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. -
వసంతోత్సవం.. వనరులు భారం
తణుకు అర్బన్ : సర్కారీ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతాం.. దీనిలో భాగంగా వసంతోత్సవాలు (వార్షికోత్సవం) నిర్వహిస్తున్నాం.. అని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం, తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు వసంతోత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతనెల 15వ తేదీ నుంచి ఆయా పాఠశాలల్లో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అయి తే ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో ఉపాధ్యాయులను దాతల సాయం అభ్యర్థించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నామమాత్రంగా వార్షికోత్సవంతో సరిపెట్టాల్సి వస్తోంది. 3,237 పాఠశాలలు.. రూ.32.11 లక్షల మంజూరు జిల్లాలోని 433 ఉన్నత పాఠశాలలకు రూ.8.66 లక్షలు, 266 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.3.99 లక్షలు, 2,538 ప్రాథమిక పాఠశాలలకు రూ.19.46 లక్షలు మొత్తం 3,237 పాఠశాలలకు రూ.32.11 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులు ఎంతమంది ఉన్నా అతిథులందరినీ పిలవాల్సిందేనని ఖర్చులు ఒకటే అయినా విద్యార్థుల సంఖ్యను బట్టి సొమ్ము కుదించడం దారుణమని ఉపాధ్యాయ సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి. వసంతోత్సవం నిధులు ఉన్నత పాఠశాల రూ.2,000 ప్రాథమికోన్నత పాఠశాల రూ.1,500 ప్రాథమిక పాఠశాల రూ.1,000 50లోపు విద్యార్థులు ఉంటే రూ.500 పాఠశాలకు రూ.10 వేలు పైనే.. ఉన్నత పాఠశాలకు రూ.2 వేలు చొప్పున ఇస్తుండగా ఇది కనీసం షామియానా ఖర్చుకు కూడా సరిపోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పాలకులను, పూర్వ విద్యార్థులను పిలిచి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలంటే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతోందని అంటున్నారు. నిధులు సరిపోక దాతల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు తలో కొంత వేసుకుని వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వసంతోత్సవాలు జరిగిన తీరును ఫొటోల ద్వారా ఉన్నతాధికారులకు చూపించాలన్న ఆదేశాలు కూడా ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్నాయి. సొమ్ములు సరిపోవడం లేదు ప్రభుత్వ పాఠశాలల్లో వసంతోత్సవాలు నిర్వహించేందుకు సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన నిధులు సరిపోవడంలేదు. ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.500 నుంచి రూ.1,000 లోపు ఇవ్వడం సరికాదు. ఖర్చులు రూ.వేలల్లో అవుతున్నాయి. –ఆర్.కర్నేలు, యూటీఎఫ్ పట్టణ కార్యదర్శి, తణుకు రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది వసంతోత్సవాల నిర్వహణకు హైస్కూల్‌కు రూ.2 వేలు, ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.500, రూ.1,000 ఇస్తున్నారు. కానీ ఒక్కో పాఠశాలలో రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. షామియానా, ఇతర ఖర్చులు పెరిగాయి. నగదు మొత్తం పెంచితే బావుండేది. – వి.రామమోహన్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, తణుకు కార్పొరేట్‌కు దీటుగా అంటే ఇదేనా.. కార్పొరేట్‌కు దీటుగా అంటే ఇదేనా. వసంతోత్సవాలకు నిధుల కొరత వేధిస్తోంది. గ్రామపెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లితండ్రులను ఆహ్వానించి పాఠశాల స్థితిగతులు వివరించడానికి వసంతోత్సవం వేదిక. మెమెంటోలు, స్నాక్స్, షామియానా, మైకు ఖర్చులకు రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. –పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు, తణుకు -
డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లి మృత్యువాత
ఎమ్మిగనూరురూరల్: డబ్బు డ్రా చేసుకునేందుకు పట్టణంలో ఆంధ్రా బ్యాంక్‌కు వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. సోమప్ప నగర్లో నివాసముంటున్న దస్తగిరి(45) పోస్టాఫీసు ఎదురుగా మున్సిపల్ బిల్డింగ్‌లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. ఉదయం కుమార్తె షకీలాతో కలసి ఆం«ద్రాబ్యాంక్కు డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. జనం ఎక్కువగా ఉండటంతో బ్యాంకు అధికారులు టోకెన్లు ఇచ్చారు, క్యూలో చాలా సేపు నిల్చున్నాడు. నీళ్లు దప్పిక కావటంతో బ్యాంకు మెట్లు దిగి కిందకు వచ్చి హోటల్ దగ్గర నీళ్లు తాగి మళ్లీ బ్యాంకు లోపలికి వెళ్లేందుకు మొట్లు ఎక్కుతుండగా అస్వస్థతుకు గురై గుండె పోటు రావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య షైనాబాను, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
నమ్మిన బంటే హంతకుడు
– ప్రాణం తీసిన ఈ- పాస్ కుంభకోణం – వెంకటేష్ గౌడ్ హత్యకు కారణం ఆర్థిక లావాదేవీలు – విజిలెన్స్, సీసీఎస్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష – విచారణలో తేల్చిన పోలీసులు – నలుగురు నిందితుల అరెస్టు.. ఎస్పీ ఎదుట హాజరు – మరో ఐదుగురి కోసం ముమ్మర గాలింపు కర్నూలు : డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ దారుణ హత్య వెనుక కారణాలు ఆర్థిక లావాదేవీలేనని పోలీసులు విచారణలో తేల్చారు. దారుణానికి ఒడిగట్టిన శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, సయ్యద్ చిన్న మౌలాలి అలియాస్ గిడ్డు, దేవావత్ శివుడు నాయక్‌లను పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావుతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఏడాది కాలంగా వెంకటేష్ గౌడ్‌కు రక్షణ కవచంగా ఉన్న ఎరుకలి శ్రీనివాసులు మరి కొందరి సహకారంతో అతిదారుణంగా వేట కొడవళ్లతో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ-పాస్ కుంభకోణం సమాచారం లీక్ చేశాడని కక్ష ఈ-పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి రేషన్ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠాలోని కొంతమంది డీలర్ల ప్రోత్సాహానికి తోడు డీలర్షిప్ ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడంతో ఎరుకలి శ్రీనివాసులు.. వెంకటేష్ గౌడ్‌పై కక్ష కట్టాడు. డీలర్ల సంక్షేమ సంఘం ఏర్పాటులో కొంతమంది డీలర్లతో వెంకటేష్‌గౌడ్‌కు విభేదాలు ఉన్నాయి. కొంతమంది డీలర్‌షిప్‌లను తీయించాడని అతనిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శరీన్‌నగర్‌కు చెందిన ఎరుకలి శ్రీనివాసులును చేరదీసి డీలర్షిప్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి, ప్రత్యర్థుల నుంచి ముప్పు లేకుండా రక్షణ కవచంగా వినియోగించుకున్నాడు. ఈ-పాస్ కుంభకోణంలో భాగంగా నగరంలో సుమారు 100 మందికిపైగా డీలర్‌షిప్‌లు రద్దు అయ్యాయి. అందులో ఎరుకలి శ్రీను స్వయాన సోదరుడైన చంద్రశేఖర్ పేరుతో ఉన్న డీలర్షిప్ కూడా రద్దు అయింది. కొత్తగా డీలర్షిప్ ఇప్పిస్తానని చెప్పి రూ.2.50 లక్షలు శ్రీను వద్ద నుంచి వెంకటేష్‌గౌడ్ తీసుకున్నాడు. డీలర్షిప్ కోసం తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరుతూ హత్యకు పది రోజుల ముందు కలెక్టర్ ఆఫీసులో ఇరువురు గొడవపడ్డారు. డబ్బులు ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ తెగేసి చెప్పడంతో వివాదం ముదిరింది. వారం రోజుల పాటు రెక్కీ.. డీలర్షిప్ కోసం డబ్బులు తీసుకోవడమే కాక సంవత్సరం పాటు తన సహకారం తీసుకొని నిర్లక్ష్యం చేయడంతో ఎరుకలి శ్రీను.. వెంకటేష్ గౌడ్‌ను హత్య చేసేందుకు మేనమామ ఎరుకలి రాము, అతని బావమరిది చిన్న మౌలాలి, ఆటో డ్రైవర్ శివుడు నాయక్‌తో కలిసి రెక్కీ నిర్వహించారు. వారం రోజుల పాటు గౌడు కదలికలపై నిఘా వేసి హత్య చేశారు. వెంకటేష్ గౌడ్‌కు ఇద్దరు భార్యలు. రెండో భార్య కర్నూలు శివారుల్లోని జొహరాపురంలో ఉంటుంది. ఇంటి నుంచి ప్రతి రోజు లక్ష్మి గార్డెన్ మీదుగా కర్నూలులోని మొదటి భార్య ఇంటికి వస్తుంటాడు. ఇందులో భాగంగా 24వ తేదీ హత్య చేసేందుకు ఎరుకలి శ్రీను పతకం రచించాడు. జొహరాపురంలోని లక్ష్మిగార్డెన్ వద్ద మౌలాలి, రాము, డ్రైవర్ శివుడుతో కలిసి ఏపీ 21 టీయూ 9180 ఆటోలో మాటు వేశారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటేష్‌గౌడ్ మోటర్ సైకిల్‌పై అటుగా అదే మార్గం గుండా కర్నూలులోకి వెళ్లాడు. డీలర్ జలంధర్‌గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆటోలో అతన్ని అనుసరించి మద్దూరునగర్‌లోని జిరాక్సు సెంటర్ వద్ద కాపుకాశారు. స్టూలుపై కూర్చొని ఉన్న అతనిపై నలుగురు ఒకే సారి వేట కొడవళ్లతో దాడి చేసి నరికి హత్య చేశారు. అక్కడి నుంచి కల్లూరు ఎస్టేట్, చెన్నమ్మ సర్కిల్ మీదుగా ఆటోలో వెళ్లి రాము ఇంటి వద్ద రక్తపు మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని, వేట కొడవళ్లను ఇంట్లో దాచిపెట్టి పరారయ్యారు. హతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం గాలిస్తుండగా శ్రీనివాసులుతో పాటు, మిగిలిన ముగ్గురు నిందితులు కల్లూరు తహసీల్దారు ఎదుట లొంగిపోయారు. నిందితుల స్టేట్మెంటును రికార్డు చేసి, వారిని పోలీసు స్టేషన్లో హాజరు పరిచారు. వారి ఒప్పందం మేరకు పంచనామా రికార్డు చేసి రాము ఇంటి వద్ద ఉన్న ఆటోను, రక్తపు మరకలు గల బట్టలను, వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హత్యకు ప్రోత్సహించిన రేషన్ డీలర్లు జలంధర్‌గౌడ్, గనిబాషా అలియాస్ టోపి బాషా, గిడ్డయ్య, పక్కీరయ్య, మాజీ డీలరు కాంతారావు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులు లొంగిపోయేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ మధుసూదన్‌రావు, ఎస్ఐలు శ్రీనివాసులు, మల్లికార్జున, ఏఎస్ఐ భాస్కర్, హెడ్ కానిస్టేబుళ్లు దైవప్రసాద్, శంకర్‌నాయక్, కానిస్టేబుళ్లు దేవదాస్, కిషోర్, విశ్వనాథ్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
శేఖర్‌రెడ్డి కారులో భారీగా నగదు స్వాధీనం
-
సార్.. కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు
- ఆపరేషన్‌కు డబ్బులిచ్చి ఆదుకోండి - బ్యాంక్ వద్ద ఖాతాదారుడు ఆవేదన గూడూరు: చిత్రంలో బ్యాంక్ పాసు పుస్తకం పట్టుకుని కనిపిస్తున్న వ్యక్తి పేరు కుర్వ నరసింహులు. పొన్నకల్లు గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన కుమారుడు 11 ఏళ్ల విజయ్ నెల రోజుల క్రితం ఇంటి దగ్గర ఆట ఆడుకుంటూ కిందపడటంతో చేతికి గాయమైంది. గూడూరులోని ఓ డాక్డర్‌కు చూపించి మందులు ఇప్పించారు. అయితే గాయం మానకపోవడంతో వారం రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వెల్లి చూపించగా చేయి విరిగిందని శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. ఇందుకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుతో తన దగ్గరున్న రూ. 60 వేలను ఇటీవల స్థానిక ఎస్బీఐలోని ఖాతాలో వేశాడు. ప్రసుత్తం కుమారుడి ఆపరేషన్ కోసం డబ్బులు అవసరం కావడంతో స్థానిక ఎస్బీఐ చుట్టూ వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు. బ్యాంక్‌లో డబ్బులు లేకపోవడంతో రేపు, మాపు అంటూ తిప్పుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు గురువారం నాటికంతా డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ చేయమని చెప్పారు. బుధవారం స్థానిక ఎస్బీఐ దగ్గర పాసు పుస్తకం చేతిలో పట్టుకుని కనిపించిన వారినంతా సాయం చేయమని అడుగుతున్నాడు. బ్యాంక్ సిబ్బంది మాత్రం రూ.2 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. ఉన్నతాధికారులు స్పందించి తన డబ్బు తనకి ఇప్పించాలని వేడుకుంటున్నాడు. -
బోల్తా కొట్టించి.. బంగారంతో ఉడాయించి
బనగానపల్లె: బంగారు నగల దుకాణ యజమానిని ఓ దొంగ బోల్తా కొట్టించి రూ.1.35 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటన బనగానపల్లెలో గురువారం చోటు చేసుకుంది. సినిమా సన్నివేశాన్ని తలపించేలా షాపు యజమానిని, గుమస్తాను నమ్మించి ఓ దొంగ బంగారంతో పరారయ్యాడు. ఈ చోరీలో మహిళ కూడా పాల్గొంది. పట్టణంలోని ఆసా్థనం రోడ్డులోని జాఫర్ బంగారు దుకాణానికి రాత్రి 7.30 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి తాను తహశీల్దారకార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్నానని మాటలు కలిపాడు. మంచి నాణ్యమైన బంగారంతో తయారు చేసిన చైన్, ఉంగారం చూయించాలని కోరాడు. అలాగే ధర తగ్గించుకోవాలని, నీకు ఏదైనా తమ కార్యాలయంలో పని ఉంటే సహకరిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేస్తున్నట్లు నటించాడు. బంగారం చైన్ తీసుకున్నానని, డబ్బు సిద్ధం చేయాలని చెప్పాడు. కొద్ది సేపటికి తర్వాత గుమస్తాను తనతో పంపిస్తే డబ్బు ఇస్తానని యజమానికి చెప్పాడు. ఈ మాటలను షాపు యజమాని నమ్మి 45 గ్రాముల లాంగ్‌చైన్, ఉంగరాన్ని ఇచ్చాడు. డబ్బు కోసం ఆయన వెంట గుమస్తాను పంపారు. పట్టణంలోని పోలీసు క్వార్టర్స్ సమీపంలోని ఓ ఇంటి వద్ద అప్పటికే ప్రణాళిక మేరకు అక్కడ ఉన్న మహిళతో మాట్లాడుతూ చైన్, ఉంగరాన్ని ఆమెకు ఇవ్వాలనిగుమస్తాకు చెప్పి ఇప్పించాడు. ఇంటిలో కొంత మొత్తం తక్కువగా ఉందని తన వెంట హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్దకు వస్తే ఏటీఎంలో డ్రా చేసి ఇస్తానని చెప్పి గుమస్తాను నమ్మించి బ్యాంకు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఏటీఎం కార్డును మరచిపోయాను.. నీవు ఇక్కడే ఉంటే ఇప్పుడే ఇంటికి వెళ్లి తీసుకువస్తానని గుమస్తాను నమ్మించి పరారయ్యారు. ఎంతసేపటికి బ్యాంకు వద్దకు రాకపోవడంతో ఇంటి వద్దకు వెళ్లి చూస్తే ఆ ప్రాంతంలో ఆ ఇద్దరి ఆచూకీ లేదు. ఇదంతా మోసంగా భావించి షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ రాకేష్ శుక్రవారం బంగారు షాపు వద్దకు వచ్చి సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రామాలయ హుండీ ఆదాయం రూ.46.71 లక్షలు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా 46,71,553 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు తెలిపారు. 31 గ్రాముల బంగారం, 590 గ్రాముల వెండి వచ్చింది. 713 యూఎస్ఏ డాలర్లు, 108 సౌదీ రియాల్స్, 3 క్వార్టర్, 10 మలేషియా, 5 యూనా, 1 మానట్ , 1 దినా డాలర్లు వచ్చినట్లుగా వివరించారు. 30 రోజులుకు గాను హుండీల ద్వారా ఈ ఆదాయం లభించిందన్నారు. -
‘ఉపాధి’ కొక్కులు..!
– పనులకు వెళ్లకపోయినా మస్టర్లు సృష్టి – వేతనాల పంపిణీలోనూ చేతివాటం – చిన్నతుంబళంలో వెలుగు చూసిన అక్రమాలు పెద్దకడబూరు/మంత్రాలయం : ఉపాధి పనుల్లో అక్రమాలు ఇవి. దొంగ మస్టర్లు సృష్టించి పేదల ధనాన్ని దండుకున్న అవినీతి బాగోతమిది. పేదల శ్రమను వీరు దోపిడీ చేశారు. తినమెరిగిన మేటీలు.. స్వార్థం మరిగిన బీపీఎం.. లాలూచీ అధికారులు..కుమ్మక్కై పాతిక లక్షల రూపాయలు కాజేశారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం ఉపాధి పనుల్లో సాగిన దందాపై ప్రత్యేక కథనం.. పనుల నిర్వహణ ఇలా.. గ్రామంలో ఈ ఏడాది పనులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.2.50 కోట్ల లక్ష్యంగా పెట్టింది. అందులో ఇప్పటి వరకు రూ.93 లక్షల మేర పనులు చేశారు. ఐదు నెలల కాలంలో కేవలం రెండు పర్యాయాలు వేతనాలు చెల్లించారు. ఇటీవల రూ.42 లక్షలు నిధులు డ్రా చేశారు. ఇంకా రూ.51 లక్షల వరకు నిధులు డ్రా కావాల్సి ఉంది. గ్రామంలో మొత్తం 2,700 జాబ్‌కార్డులు ఉన్నాయి. రోజుకు 800–900 వరకు కూలీలు పనులకు హాజరవుతూ వచ్చారు. ఇప్పటివరకు 42 వేల పనిదినాలు కల్పించారు. మస్టర్లలో మాయాజాలం : అవినీతి రుచి మెరిగిన మేటీలు మస్టర్లలో మాయాజాలం చేశారు. పనులకు రాకపోయినా వచ్చినట్లు, ఊళ్లో లేకున్నా పనులు చేసినట్లు మస్టర్లు సష్టించారు. గ్రామంలో అందరూ పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఎక్కించారు. గ్రామంలో బాబా (131772204006011667–01), జిలాన్ (131772204006011644–01), లక్ష్మి (131772204006011593–02), నరసింహ (131772204006010163–01), నారాయణమ్మ (131772204006010163–02) వీళ్లంతా ఏ ఒక్క రోజు పనికి వెళ్లలేదు. అయినా వాళ్ల పేర్లుపై వేతనాలు మంజూరు చేశారు. బాబాకు రూ.5,617, జిలాన్‌కు రూ.2,019, లక్ష్మికు రూ.2,234, నరసింహకు రూ.4,958, నారాయణమ్మకు రూ.4,958 వేతనం జమ చేశారు. నరసింహ, నారాయణమ్మ దంపతులు బతుకు తెరువు కోసం ముంబాయికి వలస వెళ్లారు. వారూ ఇక్కడ పనుల్లో పాల్గొన్నట్లు నమోదు చేశారు. దాదాపు 120 మందికిపైగా పనులకు వెళ్లలేకున్నా వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేగాక పనులకు వెళ్లిన వారి వేతనాల్లోనూ స్వాహాకార్యం చేశారు. ఉశేని(131772204006010782–03)కు రూ.9,772 గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010078–01) రూ.11,830 రావాల్సి ఉండగా రూ.1900, నల్లన్నకు (131772204006010717–02) రూ.14,484గానూ రూ.2 వేలు, పరిశప్పకు (131772204006010096–01) రూ.9,928కి గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010207–04)కు రూ.10,920కి గానూ రూ.340 చేతికి చ్చారు. మిగతా నిధులు ముట్టినట్లు ఖాతా పుస్తకంలో రాసి ముద్ర సైతం వేశారు. ఇలా మోసపోయిన కూలీలు 500 మందికిపైనే ఉన్నట్లు అంచనా. దందా సాగిన తీరు.. పనులు చేయిస్తున్న మేటీలు, పోస్ట్‌మన్ ఏకమై దందాకు పాల్పడ్డారు. మేటీలందరూ ఒక్కటై దొంగ మస్టర్లను రెడీ చేశారు. నిధులు రాగానే రాబట్టుకునేందుకు వ్యూహం పన్నారు. పనులకు రాని వ్యక్తులు వేలి ముద్రల కోసం కొంత డ్రామా కట్టారు. ఎక్కువ కాలం పనులకు రాకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని బుకాయించారు. పనులకు రాకున్నా వారం పనులకు ఉచితంగా డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. వేలి ముద్రలు వేసి డబ్బు తీసుకుపోవాలని పేస్లిప్లు చేతుల్లో పెట్టారు. పాపం అమాయక జనం నిజమేనేమో..అని పాట్మిషన్లలో వేలి ముద్రలు సేకరించారు. ఒక్కసారి కాకుండా ప్రతి వారానికో ముద్ర చొప్పున ఒకేసారి నొక్కించారు. పాస్ పుస్తకాల్లో ఇష్టమెచ్చిన లెక్కలు రాసేశారు. అంతేగాక పనులకు వచ్చిన కూలీలకు వారం వారం పేస్లిప్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం అలా సాగలేదు. ఒక్కటీ రెండు పేస్లిప్లు ఇవ్వడం మిగతా స్లిప్‌లు మేటీలతోనే ఉంచుకున్నారు. పనులకు వచ్చిన కూలీలకు వారం కూలితో సరిపెట్టారు. మిగతా కూలీలు సైతం ఇచ్చేసినట్లు ఖాతా పుస్తకాల్లో నమోదు చేశారు. రూ.25 లక్షల స్వాహా : తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కూలీల సొమ్మును కాజేశారు. రూ.93 లక్షల పనుల్లో రూ.25 లక్షలు స్వాహా చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకు మించే ఉందని గ్రామస్తులు ఆరోపణ. ఆరు నెలల దోపిడీనే ఇంత ఉంటే. గతంలో భారీ మొత్తంలో నిధులు దండుకున్నారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా వెనక ఎన్ఆర్ఈజీఎస్ మండలాధికారులు ఉన్నట్లు సమాచారం. నిధులు కాజేసే కథనంతా బీపీఎం షాషావలీ ద్వారా నడిపిసున్నట్లు స్పష్టమవుతోంది. అవినీతిని నిలదీస్తే మేటీలు మీరు పనికి రాకున్నా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం. తీసుకుపోండి ఎక్కువ మాట్లాడొద్దని ఎదురు తిరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వండని అడిగితే ఇంకోసారి పనుల్లో పెట్టుకోమంటూ భయపెడుతున్నారని వాపోయారు. -
దొంగ అరెస్ట్..రూ.12 లక్షల సొత్తు స్వాధీనం
మదనపల్లి రూరల్(చిత్తూరు జిల్లా): మదనపల్లి పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న మహ్మద్ రఫీక్(40) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో 13 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారం క్రితం ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చి దొరికిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు సొత్తును రికవరీ చేయడానికి విషయాన్ని గోప్యంగా ఉంచారు. మహ్మద్ రఫీక్ స్థానికంగా ఉన్న పైనాన్స్ కంపెనీలో రూ.45 లక్షలు తీసుకుని ఓ లారీ కొనుగోలు చేశాడు. తీసుకున్న లారీకి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, చెడు అలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. దీంతో తేలికగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చోరీలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. -
జోగుళాంబ ఆలయ హుండీ ఆదాయం రూ.19.73 లక్షలు
అలంపూర్‌రూరల్: అలంపూర్ జోగుళాంబ ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం దేవస్థాన ఈఓ గురురాజ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా ప్రేమ్‌కుమార్ హాజరయ్యారు. గత నాలుగు నెలల హుండీ ఆదాయం మొత్తం రూ.19లక్షల 73,873 లభించిందని, ఇందులో అమ్మవారి ఆలయం ద్వారా రూ.14లక్షల91వేలు, స్వామివారి ద్వారా రూ.4లక్షల82,883 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కొందరు భక్తులు బంగారు ముక్కు పుడక, వెండి వంటి వస్తువులు హుండీలో వేశారని వాటిని జ్యూవెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ సమక్షంలో లెక్కిస్తామని, పుష్కరాల సందర్భంగా సమక్క–సారక్క ఆలయం నుంచి అదనంగా హుండీలను తెప్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ మేనేజర్ కృపాదానం, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.