
రైతుబంధు
సాక్షి, హైదరాబాద్ : ‘రైతుబంధు’చెక్కుల పంపిణీకి ఆధార్, పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి నిబంధనను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామాల్లో కొందరు రైతులకు ఇప్పటికీ ఆధార్ కార్డు లేకపోవడంతో ఓటరు గుర్తింపు కార్డున్నా చెక్కులివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించనట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఓటరు కార్డు కూడా లేకున్నా బ్యాంకు ఖాతా, గ్యాస్ బుక్ తదితర ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు వెల్లడించాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదం తీసుకొని ప్రకటన జారీ చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు గుర్తింపు కార్డుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కొత్త పాసు పుస్తకం జారీ కాకపోతే రెవెన్యూ అధికారులే పాసు పుస్తకం మొదటి పేజీని ముద్రించి రైతులకు అందజేయనున్నారు. పాసు పుస్తకం సహా గుర్తింపు కార్డు చూపించిన రైతులకే చెక్కులు పంపిణీ చేయనున్నారు.
100 ఎకరాలు దాటితే..
100 ఎకరాలు మించి పొలాలున్న రైతులకు పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. చెక్కుల ముద్రణకు ముందే వంద ఎకరాలకు మించిన పొలాలున్న రైతుల పేర్లను బ్లాక్ లిస్టులో ఉంచారు. భూ సీలింగ్ చట్టం ప్రకారం 54 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. అంతకు మించి ఉంటే ఆ అదనపు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి వారికి పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదు. అయితే 54 ఎకరాలకు మించి కాకుండా వందెకరాలకు మించిన భూములను అధికారులు ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. 54 నుంచి వందెకరాల వరకున్న రైతులకు పెట్టుబడి సొమ్ముపై ఎవరైనా కోర్టుకెళితే వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఇబ్బందుల్లో పడే అవకాశముంది.
23 వేల చెక్కుల్లో తప్పులు
23 వేల చెక్కుల్లో గ్రామం, రైతు పేర్లలో తప్పులు దొర్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. 14 వేల చెక్కులను జిల్లాలకు పంపకముందే హైదరాబాద్‌లోనే గుర్తించగా.. మరో 9 వేల చెక్కులను జిల్లాలకు పంపాక గుర్తించారు. తప్పులు దొర్లిన చెక్కులను వెనక్కి తెప్పించామని, వాటి ముద్రణ కూడా దాదాపు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా అన్ని చెక్కుల ముద్రణ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు.
40.92 లక్షల మంది రెండున్నర ఎకరాల్లోపే..
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు సొమ్మును అందుకునే వారిలో ఎక్కువ సంఖ్యలో సన్నకారు రైతులే ఉన్నారు. సన్నకారు అంటే రెండున్నర ఎకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులే. వారి సంఖ్య 40.92 లక్షలుగా ఉంది. రెండున్నర నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతుల సంఖ్య 11.02 లక్షలు, 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతుల సంఖ్య 4.44 లక్షలుగా ఉంది. 10 నుంచి 25 ఎకరాల మధ్య ఉన్న రైతుల సంఖ్య 94,551 కాగా, 25 ఎకరాల పైన వ్యవసాయ భూమి ఉన్న రైతుల సంఖ్య 6,488 గా ఉన్నట్లు వ్యవసాయ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.