
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) తరహాలో తదుపరి విప్లవాన్ని భారత ఇంధన రంగం చూస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా ఎదిగేందుకు వీలుగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను విస్తృతంగా అమలు చేస్తున్న విషయాన్ని పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ వివరించారు.
"మనం సాధారణంగా తక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంటాం.. నిల్వ చేస్తుంటాం. మీరు ఎల్‌పీజీ సిలిండర్ కొంటున్నారంటే ప్యాకేజింగ్ చేసిన ఇంధనాన్ని కొంటున్నట్టు. కానీ విద్యుత్ మాత్రం గ్రిడ్ నుంచి వస్తుందని ఎప్పుడూ అనుకునేవాళ్లం. విద్యుత్ అందుబాటులో లేకపోతే జనరేటర్ కొనుక్కోవడమో, నూనె దీపాలు వెలిగించడమో చేస్తుంటాం'' అని నీలేకని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ‘రూఫ్ టాప్ సోలార్ ఉండటం వల్ల ప్రతి ఇంటికి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈవీ బ్యాటరీ ఉండటం వల్ల ప్రతి ఇల్లు ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాబట్టి, ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారు, అమ్మకందారు అలాగే కొనుగోలుదారు కూడా. కాబట్టి, యూపీఐ మాదిరిగా, మీరు ఇప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు" అన్నారాయన. ఇంధన ఉత్పత్తి, వినియోగం వికేంద్రీకరణ వల్ల లక్షలాది మంది సూక్ష్మ ఇంధన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని, ఇది ఆర్థిక ఆవిష్కరణలు, వృద్ధికి దోహదపడుతుందని నీలేకని అన్నారు.
యూపీఐ విజయ ప్రస్థానం
దశాబ్దం క్రితం ప్రారంభించిన యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మూలస్తంభంగా మారింది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతన్నాయి. గత జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లు దాటాయి. అలాగే వాటి విలువ రూ .23.48 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లతో సహా ఏడు దేశాల్లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.