revolution
-
అమెరికా విప్లవం ముందునాటిది.. అదిరిపోయే ధర పలికింది
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే. బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి.. నెదర్లాండ్స్‌లో 2016లో ఒక పేస్ట్బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్‌కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి. 2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఏఐ, డిజిటల్ మార్కెటింగ్‌తో వ్యవసాయ విప్లవం'
విజయనగరం : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్‌తో ఉత్తరాంధ్రలో వ్యవసాయ, వ్యాపార విప్లవం సాధ్యమవుతుందని ఉత్తరాంధ్ర వాణిజ్య దిగ్గజం, పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు ధీమా వ్యక్తం చేశారు. కళలు, సాహిత్య, సంస్కృతికి ఆలవాలమైన విజయనగరంలో ఆదివారం నిర్వహించిన నార్త్ ఆంధ్ర బిజినెస్ మీట్లో విశిష్ట సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్రలో సహజవనరులకి ధీటుగా మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఉత్సాహం ఉరకలెత్తే యువత ప్రతిభను పెంపొందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంతోపాటు ఉత్తరాంధ్రలో వెయ్యి మంది పారిశ్రామికవేత్తలు తయారై, లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఉత్తరాంధ్ర స్వయం సమృద్ధి దిశగా ప్రయాణం సాగించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఎరీనాలో లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు విపరీతంగా పెరిగాయని , వాటిని స్థానికంగా ఉంటూనే అందిపుచ్చుకునే అద్భుత నైపుణ్యం ద్వారా ఉత్తరాంధ్ర పరిపుష్టికి అవకాశం కలుగుతుందన్నారు. ప్రపంచీకరణ ద్వారా వచ్చిన విస్తృత అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. గ్లోబల్ ఎరీనాలో లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఉందన్నారు. థింకింగ్ గ్లోబల్, స్టార్టింగ్ లోకల్ నినాదంతో విశ్వవ్యాప్తంగా ఉత్పత్తులు గురించి ఆలోచిస్తూ..అవి వద్దే ఎందుకు తయారు చేయకూడదు, మనమే ఆ సేవలు ఎందుకు అందించకూడదు అనే ఆలోచనే ఎంట్రప్రెన్యూర్స్ కావడానికి తొలి మెట్టు అని సూచించారు. ప్రపంచస్థాయిలో పేరు రావాలంటే స్థానిక వ్యాపారాలదే కీలక పాత్ర అని నొక్కిచెప్పారు. పరిశ్రమల వ్యవస్థాపకులు స్థానికంగా తమ సంస్థలు ప్రారంభించినా ప్రపంచవ్యాప్తంగా ఆ ఉత్పత్తులు-సేవలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలు ఆరంభించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి రంగం సిద్ధమైందని సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయమే ఉత్తరాంధ్ర ఊపిరి సేంద్రీయ, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులకు స్వర్గధామం ఉత్తరాంధ్ర అని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఒక్క వ్యవసాయరంగంలోనే 30కి పైగా అంశాలతో విస్తృత వ్యాపార అవకాశాలను డాక్టర్ గేదెల వ్యూహాత్మక దృష్టితో వివరించారు. దేశవ్యాప్తంగా ఉత్తరాంధ్రలో పండే పైనాపిల్, తయారయ్యే బెల్లం వరకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోందన్నారు డిజిటల్ మార్కెటింగ్ , AI టెక్నాలజీ వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ వ్యాపారం తిరుగులేని విధంగా లాభసాటిగా మారుతుందన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ సంపదను వినియోగించుకోవడానికి ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలంతా సిద్ధం కావాలన్నారు. ప్రపంచీకరణ నుండి స్థానిక సాధికారత సాంకేతిక పరివర్తన శక్తికి ఆమోదం తెలుపుతూ, డిజిటల్ మార్కెటింగ్, AIతో కలిసి ప్రపంచీకరణ వ్యాపారాన్ని ఎలా ప్రజాస్వామ్యీకరించిందో డాక్టర్ గేదెల కూలంకుషంగా వివరించారు. ఒకప్పుడు వ్యాపారం అంటే భారీ పెట్టుబడులు, విస్తృతమైన నెట్‌వర్క్‌లు అవసరమయ్యేవని, ఇప్పుడు అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇది స్థానిక వ్యాపారాలు ప్రపంచ వేదికపై పోటీ పడేలా చేస్తుందన్నారు. మేధోవలసలు ఆపాలంటే స్థానిక ప్రతిభని ప్రోత్సహించాల్సిందే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మేథోవలసలు ఇటు రాష్ట్రానికి అటు విద్యావ్యవస్థకి, ముఖ్యంగా స్థానిక వ్యాపారరంగానికి తీరని చేటు చేస్తున్నాయన్నారు. పదిహేనేళ్లలో ప్రతిభావంతులైన 60 శాతం విద్యార్థులు మెరుగైన ఉద్యోగఉపాధి అవకాశాల కోసం ఇతరరాష్ట్రాలు, దేశాలకి వలసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులతో విద్యావంతులుగా తీర్చిదిద్దితే...వీరంతా వలస బాట పడుతున్నారు. వీరి విద్య కోసం ప్రభుత్వం చేసిన అప్పులు నిరుపేద కుటుంబాలపై పన్నుల రూపంలో వివిధ భారాలుగా పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ మొత్తం జనాభా 5 కోట్లలో 2 కోట్ల మంది శ్రామికులు, వ్యవసాయ శ్రామిక శక్తి దాదాపు 1 కోటి, మరియు ఇతర రంగాలలో 1 కోటి మంది ఉంటారని, ప్రతి ఏటా 5 లక్షల మంది నాణ్యమైన విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేస్తారని, సరైన మద్దతుతో రాబోయే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగావకాశాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. AI, డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి స్థానిక మరియు గ్లోబల్ మార్కెటింగ్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు స్థానిక ఉద్యోగులు ఉపయోగపడతారన్నారు. ఈ మార్పు ద్వారా స్థానిక యువతకి స్థానికంగా ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం, వ్యాపార వృద్ధితో మూడురంగాలు గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు కల్పన విద్యావ్యవస్థ నుంచి వ్యాపారరంగం వరకూ అందరూ కలిసి సమష్టిగా పనిచేస్తేనే ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలో మేథోవలసలు ఆపగలమని డాక్టర్ గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులకి శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలలు, వృత్తిపరమైన సంస్థలు, డిగ్రీ కళాశాలలు ఏకమై ఒక సహకార వేదికగా పనిచేయాలని సూచించారు. రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉత్తర ఆంధ్రలో 500,000 మరియు రాష్ట్రవ్యాప్తంగా ఒక మిలియన్ ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన ఆవశ్యకతని వివరించారు. ఇది ఎందుకు అవసరం అంటే...అని కొన్ని గణాంకాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సుమారు 40లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఏపీలోనే పనిచేసే ఏపీ సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 40 వేలు దాటదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో జరిగిన ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ సదస్సులో ఈ అంతరాన్ని పూడ్చాల్సిన ఆవశ్యకతను డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు. స్థానిక ఆకాంక్షలు, ప్రపంచ విజయాలు ఈ సమావేశానికి 1000 మంది పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, స్థానిక వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఇది కేవలం ఎవరో ఒకరు ఏర్పాటు చేసిన సమావేశం కాదు, ఇది స్థానిక ఆకాంక్షలకి నిదర్శనంగా నిలిచింది. ఒక సుదీర్ఘ లక్ష్యంతో ప్రయాణం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర స్వయంసమృద్ధి సాధనకి తొలి అడుగు పడింది. ఇది దేశానికే ఆదర్శం కానుందని గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ఏఐసీటీఈలో ఇండస్ట్రీ కోఆర్డినేటర్ బుద్దా చంద్ర శేఖర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. -
బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమరవీరులు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరేకాదు షాజహాన్‌పూర్ చీమలు కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు యుద్ధం చేసి, విజయం సాధించాయి. ఈ ఘటన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ సమయంలో జరిగింది. చీమల దండు జరిపిన దాడి కారణంగా బ్రిటీషర్లు షాజహాన్పూర్లో స్థాపించిన కేరు అండ్ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా రచించిన ‘షాజహాన్‌పూర్ కా ఇతిహాస్ 1857’ పుస్తకంలోని వివరాల ప్రకారం బ్రిటీష్ వారు 1805లో కాన్పూర్‌లో కేరు అండ్ కంపెనీని తొలిసారిగా స్థాపించారు. దానిలో క్రిస్టల్ షుగర్, స్పిరిట్, రమ్ తయారు చేసేవారు. ఈ ఉత్పత్తులను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కాన్పూర్‌లో ఈ వ్యాపారం విజయవంతం కావడంతో బ్రిటీషర్లు 1811లో షాజహాన్‌పూర్‌లోని రామగంగా సమీపంలో మరో యూనిట్ ఏర్పాటు చేశారు. 1834లో బ్రిటీషర్లు.. రౌసర్ కోఠి వద్ద మరో యూనిట్‌ను స్థాపించారు. షాజహాన్‌పూర్‌లోని రౌజర్ కోఠి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. దీనికితోడు గర్రా, ఖన్నాత్ నదుల నుండి వాణిజ్యానికి నౌకాయాన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి. 1857లో విప్లవ తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఫ్యాక్టరీని కొల్లగొట్టి, తగలబెట్టారని డాక్టర్ వికాస్ ఖురానా తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ యజమాని జీబీ కెరు ఇక్కడ నుండి తప్పించుకొని మిథౌలీ రాజు సహాయంతో లక్నోకు తరలివెళ్లిపోయాడు. అక్కడ అతను హత్యకు గురయ్యాడు. తిరుగుబాటు ఆందోళనల తర్వాత ఫ్యాక్టరీ పునఃప్రారంభించారు. వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. అయితే ఆ సమయంలో చీమలు ఆ కంపెనీపై దాడి చేశాయని చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా, సాహితీవేత్త సుశీల్ తెలిపారు చెప్పారు. కాగా చీమలను తరిమికొట్టేందుకు కంపెనీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రయత్నాలు వృథాగా మారాయి. చివరికి బ్రిటీషర్లు కెరుగంజ్లో కంపెనీ పనులను నిలిపివేయవలసి వచ్చింది. కాగా కంపెనీ ఇక్కడ భారీ మార్కెట్‌ను సృష్టించిందని డాక్టర్ ఖురానా తెలిపారు. నేటికీ షాజహాన్‌పూర్‌లోని కెరుగంజ్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి, వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లకు కసరత్తు
సాక్షి, విజయవాడ: ఇంధన భద్రతను పెంచడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వాతావరణంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అత్యంత ఆశాజనక మార్గాలలో ఒకటైన ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) రాష్ట్రంలో 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించిందని ఇంధన, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడ భవానీపురంలోని రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ ద్వారా పనిచేసే సైన్స్ ఎగ్జిబిడ్స్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారని ఏపీసమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కోస్ట్) సహకారంతో ఎన్ఆర్ఈడీసీఏపీ ఏర్పాటు చేసిన పునరుత్పాదక ఇంధన వనరుల కేంద్రాన్ని(ఆర్ఈఆర్సీ) మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఈ-మొబిలిటీకి ఒక నమూనాగా, పునరుత్పాదక ఇంధనానికి నాలెడ్జ్ హబ్ గా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీ రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేయడం, రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ఈ -మొబిలిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను మంత్రి అభినందించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందన్నారు. భారతదేశం బయో ఇంధనాలు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ఇంధన దిగుమతులపై ఆధారపడకుండా తదుపరి స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుందని గుర్తుచేశారు. ఈ -మొబిలిటీని స్వీకరించడానికి దోహదపడే ఛార్జింగ్ స్టేషన్ల యొక్క బలమైన ఇంధన నెట్ వర్క్ ను నిర్మించే లక్ష్యంతో 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగా నగర పరిధిలో 3 కి.మీ x 3 కి.మీ గ్రిడ్ లోపల మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ మరియు ఎనర్జీ కన్జర్వేటివ్ కాన్సెప్ట్ ల గురించి సందర్శించే విద్యార్థులకు సౌలభ్యంగా సుమారు 30 పునరుత్పాదక ఇంధన గాడ్జెట్ లను ప్రదర్శించడానికి ఆర్ఈఆర్ సీ ఏర్పాటుకు చొరవ చూపినందుకు ఈ సందర్భంగా ఎన్ఆర్ఈడీసీఏపీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. నెట్ జీరో ఎమిషన్స్ టూరిస్ట్ ప్లేస్ గా తిరుపతిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుపతిలో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇప్పటివరకు తిరుపతి పట్టణంలో సుమారుగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయన్నారు. సంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రయోజనకరంగా ఉండటమేగాకుండా స్థానిక పర్యావరణాన్ని రక్షించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయని సూచించారు. ఆర్ ఈఆర్ సీ సెంటర్ గురించి మాట్లాడుతూ అన్ని వయసుల విద్యార్థులకు అభ్యసన అవకాశాలను పెంపొందించేందుకు ఆర్ఈఆర్సీ దోహదపడుతుందన్నారు. అంతకుముందు విద్యుత్ వాహనాలను వాడుదాం-స్వావలంబన సాధిద్దాం, దేశ ప్రగతికి తోడ్పడుదాం లాంటి ఫ్లకార్డుల ప్రదర్శనతో మంత్రి పెద్దిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైన్స్ వరల్డ్ లో ఏర్పాటు చేసిన సర్ సీవీ రామన్, జగదీష్ చంద్రబోస్, ఆర్కిమెడిస్, ఆల్ బర్ట్ ఐన్ స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, బెంజ్ మెన్ ఫ్రాంక్లిన్,ఐజాక్ న్యూటన్, విక్రమ్ సారాబాయి, హోమీ జహంగీర్ బాబా తదితర శాస్త్రవేత్తలు వారు చేసిన కృషిని వివరిస్తూ ఉన్న ఎగ్జిబిషన్ ను, రీజినల్ సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన మినియేటర్ న్యూక్లియర్ గ్యాలరీని మంత్రి తిలకించారు. అనంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా, డిజిటల్ టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. రీజినల్ సైన్స్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్థన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, సభ్య కార్యదర్శి డాక్టర్ వై. అపర్ణ, జనరల్ మేనేజర్లు కె.శ్రీనివాస్, జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్ రావు, ఎన్ఆర్ ఈడీసీఏపీ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. జిన్‌పింగ్ ప్రస్థానమిదే..
చైనా అధినేత షీ జిన్‌పింగ్ 1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగడ్తలు, తెగడ్తలు... 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగింది. -
రగిలింది విప్లవాగ్ని ఈరోజే!
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి అతివాద, మితవాద, విప్లవ వాద మార్గాలను ఎన్నుకున్న అనేకమంది దేశ భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. ఈ ఉద్యమ స్రవంతుల్లో ఆయుధం పట్టి బ్రిటిష్‌వాళ్ల భరతం పట్టాలన్న వర్గానికి చెందినవారు అల్లూరి సీతారామరాజు. అమాయక గిరిజనుల బాధలను దగ్గర నుంచి గమనించి, విజ్ఞాపనల ద్వారా వారి సమస్యలు పరిష్కారం కావని గ్రహించారు. అందుకే మన్యం ప్రాంతంలో అద్భుతమైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన ఈ సంచలన యుద్ధానికి నేటితో నూరు వసంతాలు. ► అడవి నుంచీ, పూర్వీకుల నుంచీ వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన అలాంటి ఉద్యమాలలో 1922–24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు (శ్రీరామరాజు) నిర్వహించిన పోరాటం ప్రత్యేకమైనది. అవన్నీ కొండా కోనా మీద హక్కు కోసం కొన్ని తరాల ఆదివాసీలు పడిన తపన, వేదనలే. స్థానిక సమస్యల మీద తలెత్తినట్టు కనిపించినా నిజానికి అవి ప్రభుత్వాల మీద యుద్ధాలే. విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. ► శ్రీరామరాజు ఉద్యమకారునిగా అవతరించడం ఒక చారిత్రక నేపథ్యంలో జరిగింది. మొదటి ప్రపంచయుద్ధం, గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం పిలుపు, ఉపసంహరణ; ఉత్తర భారత యాత్ర ఆ నేపథ్యాన్ని ఇచ్చాయి. తన కుటుంబం తునిలో ఉన్నప్పుడే 1915లో ఉద్యోగాణ్వేషణ పేరుతో రామరాజు ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ యాత్రలోనే రామరాజు కలకత్తా వెళ్లి ప్రముఖ జాతీయ ఉద్యమ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. ఆ తరువాత అల్లూరి తూర్పు కనుమలలోని కృష్ణ్ణదేవిపేటకు 1917 జూలై 24న ఒక ఆధ్యాత్మికవేత్తగా చేరుకున్నారు. ఈ ఊరే ఆయన కార్యక్షేత్రమయింది. ఇక ఆయన ఆయుధం పట్టి, ఉద్యమం ప్రారంభించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ► 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపూ, ‘ఒక్క ఏడాదిలోనే స్వాతంత్య్రం’ అన్న నినాదమూ ఇచ్చారు. రాళ్లపల్లి కాశన్న, నర్సీపట్నం ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలోనూ సహాయ నిరాకరణోద్యమ ప్రచారం చేశారు. 1921లో రామరాజు కాలినడకన నాసికాత్రయంబకం వెళ్లారు. అక్కడ ‘అభినవ్ భారత్’ విప్లవ సంస్థ ప్రభావం ఆయనపై గాఢంగా పడింది. అప్పటికే రామరాజు మన్యవాసులలో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోను మద్యపాన నిషేధం, కోర్టుల బహి ష్కారం... ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఇవే రామరాజు ‘సహాయ నిరాకరణ వాది’ అన్న అనుమానం కలిగించాయి. ► మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన తర్వాత కరవు విజృంభించ డంతో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆకలి దాడులు జరిగాయి. ప్రభుత్వం ఉపాధి కల్పన ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. ఆసియా చరిత్రలోనే ఈ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. ఇందుకు బాధ్యుడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ అల్ఫ్ బాస్టియన్. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. పెద్దవలస మాజీ ముఠాదారు కంకిపాటి బాలయ్యపడాలు (ఎండు పడాలు), బట్టిపనుకుల మునసబు గాం గంతన్న దొర, అతని తమ్ముడు గాం మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటివారు 1922 జనవరిలో రాజు దగ్గరికి వచ్చి గోడు వినిపించుకున్నారు. ► బాస్టియన్ మీద పై అధికారులకు శ్రీరామరాజు ఫిర్యాదు రాశారు. రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణకు ఈ ఫిర్యాదు దోహదం చేసింది. రామరాజును ఆ ఫిబ్రవరి 3న నిర్బంధంలోకి తీసుకున్నది కూడా సహాయ నిరాకరణవాది అన్న ఆరోపణతోనే! ఆ ఒకటో తేదీనే సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 5వ తేదీన జరిగిన ‘చౌరీచౌరా’ ఉదంతంతో గాంధీ ఆ పిలుపును ఉపసంహరించుకున్నారు. అహింసాయుతంగా పోరాడే సంస్కారం భారతీయులకు లేదని నింద మోపారు. ఇదే యువతను ఇతర పంథాల వైపు నడిపించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. ► సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో గెరిల్లా పోరు జరపాలని అనుకున్న రాజు... ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని నిర్ణయించారు. అనుచరులను మూడు దళాలుగా విభజించారు. 1922 ఆగస్ట్ 22న పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. ఆయుధాలు తీసుకు వెళుతున్నానని ఒక లేఖ రాసి వచ్చారు రాజు. తొలి దాడితోనే మన్య ఉద్యమ తత్త్వం తెలుస్తుంది. కొండదళం ‘వందేమాతరం... మనదే రాజ్యం’, ‘గాంధీజీకి జై’ అంటూ నినదించింది. ► ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఆగస్ట్ 24న రాజవొమ్మంగి స్టేషన్ (తూర్పు గోదావరి)ను ఎంచు కున్నారు. లాగరాయి పితూరీని సమర్థించిన నేరానికి అరెస్టయిన మొట్టడం వీరయ్యదొర అప్పుడు ఆ స్టేషన్లోనే ఉన్నారు. ఆయనను విడిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. తొలి రెండు దాడులతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహవ్ుకు టెలిగ్రావ్ులు వెళ్లాయి. 26 తుపాకులు, వేలాది తూటాలు కొండదళం చేతికి చిక్కాయి. ఎంత ప్రమాదం! ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరిం టెండెంట్ సాండర్స్, కలెక్టర్ వాయువేగంతో నర్సీపట్నం చేరు కున్నారు. నర్సీపట్నం కేంద్రంగా మన్యం ఖాకీవనమైంది. ► అలాంటి వాతావరణంలోనే జైపూర్ మహారాజు ఐదు ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరి ఘాట్‌లో రాజుదళం వశం చేసుకుంది. తరువాత జరిగిన ఘటన మద్రాస్ ప్రెసిడెన్సీని మరీ కలవరపెట్టింది. రామరాజు పేరు మొదటిసారి తెలుగునేలంతా వినిపించింది. దామనపల్లి అనే కొండమార్గంలో 1924 సెప్టెంబర్ 24న గాలింపు జరుపుతున్న స్కాట్ కవర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులను రాజు దళం చంపింది. వీరిలో హైటర్ మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత అడ్డతీగల, చోడవరం, మల్కనగిరి, పాడేరు స్టేషన్ల మీద చేసిన దాడులు విఫల మయ్యాయి. బ్రిటిష్‌వాళ్లు ఆయుధాలను ట్రెజరీలకు పంపి జాగ్రత్త పడ్డారు. మన్యం మీద పట్టు బిగించడానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మరొక అడుగు ముందుకు వేసి, 1922 సెప్టెంబర్ 23న మలబార్ పోలీసు దళాలను దించింది. కానీ రామవరం అనే చోట ఆ దళమూ వీగిపోయింది. ► 1922 డిసెంబర్ 6న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనేచోట్ల రాజుదళం మీద లూయీ ఫిరంగులతో మలబార్ దళం యుద్ధానికి దిగింది. ఎనిమిది మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఆ డిసెంబర్ 23న ఉద్యమకారుల తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. నాలుగు మాసాల అనంతరం 1923 ఏప్రిల్ 17న రామరాజు దళం ఆకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. ఆ సంవత్సరం డిసెం బర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. నడిపేది గిరిజనోద్యమమే అయినా, ఆయన మైదాన ప్రాంత ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నారు. ► 1924 జనవరికి అస్సాం రైఫిల్స్‌ను దించారు. వీరికి మొదటి ప్రపంచ యుద్ధంలో అనుభవం ఉంది. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న థామస్ జార్జ్ రూథర్‌ఫర్డ్‌ను ఆ ఏప్రిల్‌లో మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమిం చారు. మే ఐదు లేదా ఆరున ‘రేవుల కంతారం’ దగ్గర పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న రాజు ఒక్కడే రాత్రివేళ ‘మంప’ అనే గ్రామం వచ్చి, ఒక చేనులోని మంచె మీద గడిపారు. మే 7వ తేదీ వేకువనే ఓ కుంటలో స్నానం చేస్తుండగా రాజును ఈస్ట్‌కోస్ట్ దళానికి చెందిన కంచుమేనన్, ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్‌నాయుడు అరెస్టు చేశారు. రాజును ఒక నులక మంచానికి కట్టి, కృష్ణదేవిపేటకు పయన మయ్యారు. దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడే మేజర్ గుడాల్... రాజుతో మాట్లాడాలని గుడారంలోకి తీసుకువెళ్లాడు. ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. జూన్ 7న గాం గంతన్నను కాల్చి చంపారు. ► దాదాపు రెండేళ్ల ఉద్యమం, పోలీస్ వేధింపులతో మన్యవాసులు భీతిల్లి పోయారు. కొందరు ఉద్యమకారులను స్థానికులే చంపారు. పోలీసు లకు పట్టించారు. సరైన విచారణ లేకుండానే 270 మంది వరకు ఉద్యమకారులకు శిక్షలు విధించింది మిలిటరీ ట్రిబ్యునల్. 12 మందిని అండమాన్ పంపారు. చివరిగా... దేశం కోసం పోరాడిన ఏ వర్గం త్యాగమైనా విలువైనదే. అవన్నీ నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్రకు పరిపూర్ణత. ఉద్యమ నూరేళ్ల సందర్భం ఇచ్చే సందేశం అదే! డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (అల్లూరి సీతారామరాజు పోరాటానికి నూరు వసంతాలు) -
ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ
టెహ్రాన్: యుద్ధాన్ని నిరోధించడానికి, శత్రువుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్ ఇంకా బలంగా తయారు కావాలని ఆ దేశ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దశాబ్దాలుగా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ బలమైన వైమానిక దళాన్ని తయారు చేసుకోగలిగిందన్నారు. శనివారం వైమానిక దళం కమాండర్స్, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ భయం, శత్రు భయం లేకుండా మనం పటిష్టంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. -
మనుస్మృతి స్థానంలో మనస్మృతి
విప్లవాలు రాజ్యాంగాలకు పురుడుపోస్తాయి. విప్లవాల కాలంలో వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షలు తరువాతి కాలంలో రాజ్యాంగాలుగా రూపుదిద్దుకుంటాయి. నేటి తిరుగుబాటు సాహిత్యమే రేపటి రాజ్యాంగం అనేది ఈ అర్థంలోనే.1789లో ఆరంభమైన ఫ్రెంచ్ విప్లవం పదేళ్ళు కొనసాగింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే నూతన సామాజిక విలువల్ని... ఇది ప్రధాన నినాదాలుగా మార్చింది. అమెరికా అంతర్యుధ్ధం ముగింపు సందర్భంగా అప్పటి దేశాధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1863 నవంవరు 19న పెన్సిల్వేనియాలోని గెటిస్ బర్గ్‌లో అమరుల సమాధుల వద్ద ప్రసంగిస్తూ ‘‘ప్రజల యొక్క–ప్రజల చేత– ప్రజల కొరకు’’ పనిచేసేది అంటూ ప్రజాస్వామిక ప్రభుత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. భారత రాజ్యాంగ ఆవిర్భావం భిన్నమైనది. అది ఫ్రాన్స్ మాదిరి విప్లవంలో పుట్టినది కాదు. అమెరికాలా అంతర్యుద్ధంలో పుట్టిందీ కాదు. ఇది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ ఫలితం. భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని 1935లో జాతీయ కాంగ్రెస్ వలస పాలకుల్ని కోరింది. మే 1946 నాటి బ్రిటన్ కేబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా వలస పాలకులే ఎన్నికలు నిర్వహించి 389 మందితో భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికయిన వారు 292 మంది, సంస్థానాల ప్రతినిధులు 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి వచ్చిన వారు మరో నలుగురు. 1947లో భారత స్వాతంత్య్ర చట్టం వచ్చి దేశవిభజన జరగడంతో రాజ్యాంగ సభను భారత్– పాకిస్తాన్ మధ్య పునర్విభజించారు. సామాన్య ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రాజ్యాంగ సభకు సామాజిక విప్లవకర కోణాన్ని అందించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుంది. (70 ఏళ్ల ప్రస్థానంలో నిలుపే... గెలుపు) రాజ్యాంగ సభలోనికి అంబేడ్కర్ ప్రవేశం కొన్ని నాటకీయ మలుపులతో సాగింది. 1946లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో అంబేడ్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) పార్టీ అభ్యర్థ్ధిగా బొంబాయి సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు రాజ్యాంగ పరిషత్‌లోకి ప్రవేశించే మార్గం లేకుండాపోయింది. న్యాయ, రాజ్యాంగ, సామాజిక రంగాల్లో అంబేడ్కర్ చైతన్యాన్ని గుర్తించిన ముస్లిం లీగ్ ఆయన్ను ఎంపిక చేసి రాజ్యాంగ సభకు పంపింది. నాటి ముస్లిం లీగ్ నాయకులు ముహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్ తూర్పుబెంగాల్ లోని జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ పార్టీ అభ్యర్థి మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ చేత రాజీనామా చేయించారు. అక్కడి నుంచి అంబేడ్కర్ ను గెలిపించి రాజ్యాంగ సభకు పంపించారు. అంబేడ్కర్ కోసం రాజ్యాంగ సభలో తన ప్రాతినిధ్యాన్ని త్యాగం చేసిన జోగేంద్ర నాధ్ కూడా ప్రముఖ దళిత నేత, న్యాయకోవిదుడు. తరువాత పాకిస్తాన్ రాజ్యాంగ రచన బాధ్యతల్ని జోగేంద్ర నాథ్‌కే అప్పగించాడు జిన్నా. 30 ఆగస్టు 1947న జరిగిన సమావేశంలో అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వ ఆదర్శాలను మనుధర్మశాస్త్రం ఏ దశలోనూ ఆమోదించదని అంబేడ్కర్ విమర్శించాడు. సామాజిక అసమానత్వాన్ని, అణిచివేతను తీవ్రంగా వ్యతిరేకించే అంబేడ్కర్ 1927 డిసెంబర్ 25న మనుధర్మశాస్త్ర ప్రతిని బహిరంగంగా... మహాత్మా గాంధీ ఫొటో సాక్షిగా దహనం చేశాడు. రాజ్యాంగాన్ని రచించే అవకాశం తనకు దక్కినపుడు అంబేడ్కర్ నిర్ణయించుకున్న ప్రధాన కర్తవ్యం మనుధర్మశాస్త్రాన్ని బలహీనపరచడం. న్యాయం, స్వేచ్చ, సమానత్వం, సోదర భావాలను భారత రాజ్యాంగానికి నాలుగు పునాదిరాళ్ళుగా పేర్చి అంబేడ్కర్ తన లక్ష్యాన్ని సాధించాడు. రాజ్యాంగం తుది ప్రతిని రాజ్యాంగ సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌కు లాంఛనంగా అందజేశాక బొంబాయిలో జరిగిన ఒక బహిరంగ సభలో భారత సమాజంలో మనుస్మృతికి ఇక కాలం చెల్లిందని బాహాటంగా ప్రకటించాడు. భారత రాజ్యాంగం తుది ప్రతిని 1949 నవంబరు 26న ఆమోదించారు. అంతకు ముందు రోజు అంటే నవంబరు 25న రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ఒక చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. నియంతల పాలనలో దేశమంతటా అరాచకం చెలరేగిపోయే సన్నివేశాన్ని బెర్తోల్ట్ బ్రెక్ట్ ‘గుడ్ వుమన్ ఆఫ్ షేజ్వాన్’ నాటకంలో చిత్రించాడు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ‘షిన్ టీ’ మూకోన్మాదంపై నిర్లిప్తంగా ఉన్న సమాజాన్ని సహించలేక ఆక్రోశిస్తుంది. ‘‘ఓరీ మొద్దుబారిపోయిన మనుషుల్లారా! మీ సోదరుడిపై మూకోన్మాదులు దాడి చేశారు. అతన్ని పొడిచి పారిపోయారు. మీరు కళ్లు మూసుకుని మౌనంగా వుండిపోయారు. ఇదేమి నగరం? మీరేమి మనుషులు? ఇలాంటి ఘోరం జరిగినపుడు మనుషులన్నవాళ్ళు రగిలిపోవాలి. నగరమంతటా నిరసనలు వెల్లువెత్తాలి. మనుషుల్లో అలాంటి తిరుగుబాటు రాకుంటే చీకటి పడడానికి ముందే ఆ నగరం మంటల్లో మాడి బూడిదై పోవాలి’’ అంటుంది. ఆ ప్రసంగంలో జాన్ స్టూవర్ట్ మిల్, డేనియల్ ఓ కానెల్ తదితరుల్ని ప్రస్తావించిన అంబేడ్కర్ బ్రెక్ట్ పేరును ప్రత్యేకంగా పేర్కొనలేదుగానీ ‘షిన్ టీ’ ఆవేశం అందులో కనిపిస్తుంది. ‘‘జనవరి 26, 1950న మనం ఒక వైరుధ్యాల జీవితంలోనికి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక ఆర్థిక జీవితంలో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో మనం ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. మన సామాజిక ఆర్ధిక నిర్మాణం (లోని లోపం) కారణంగా సాంఘిక, ఆర్ధిక జీవితంలో ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. మరి ఎన్నాళ్ళీ వైరుధ్యాల జీవితాన్ని కొనసాగిద్దాం? మన సాంఘిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఇంకా ఎన్నాళ్లు నిరాకరిద్దాం? సాధ్యమైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాల్ని తొలగించి తీరాలి. అలా చేయకపోతే, ఈ రోజు ఈ రాజ్యంగ పరిషత్తు ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సమాజంలోని అసమానత్వ బాధితులు అందరూ కలిసి పేల్చివేస్తారు’’ అంటాడు. ఈ హెచ్చరిక ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంది. వ్యాసకర్త రచయిత, సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, మొబైల్: 90107 57776 -
వాట్సాప్ కాల్స్‌పై పన్ను.. భగ్గుమన్న ప్రజలు
-
వాట్సాప్ కాల్స్‌పై పన్ను.. భగ్గుమన్న ప్రజలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ‘వాట్సాప్ కాల్స్’ దాదాపు ఉచితమనే విషయం తెల్సిందే. అలాంటి వాట్సాప్ కాల్స్ మీద పన్ను విధించాలని లెబనాన్ ప్రభుత్వం గత అక్టోబర్ 17వ తేదీన నిర్ణయించడంతో ప్రజల్లో విప్లవం రాజుకుంది. అదే రోజు రాత్రి లక్షలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముస్లింలు, క్రైస్తవులు, డ్రజ్, అలవైట్స్ సహా మొత్తం 18 జాతుల ప్రజలు వాటిల్లో పాల్గొనడం ఓ విశేషం కాగా, అందరూ జాతీయ జెండాలనే ధరించడం మరో విశేషం. అలా రాజుకున్న ప్రజాందోళన ఆదివారం నాటికి (అక్టోబర్ 20) మరింత తీవ్రమైంది. లక్షలాది మంది ప్రజలు వీధుల్లో కదంతొక్కారు. 2005లో జరిగిన ప్రజా ప్రదర్శన తర్వాత అంతటి భారీ ప్రదర్శనగా దీన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రదర్శన పర్యవసానంగా ‘వాట్సాప్ కాల్స్’పై పన్ను విధించాలనే ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఆ మరుసటి రోజు సోమవారం నాడు లెబనాన్ సంకీర్ణ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో నానాటికి పెరిగి పోతున్న అవినీతిని అరికట్టేందుకు ఓ ప్యాకేజీని కూడా ప్రకటించింది. అయినప్పటికీ ప్రజల ప్రదర్శనలు కొనసాగడంతో సున్నీ తెగకు చెందిన ఇస్లాం ప్రధాన మంత్రి సాద్ హారిరి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజలు అదే పోరాట స్ఫూర్తితో దేశ (క్రైస్తవ) అధ్యక్షుడు మైఖేల్ అవున్, పార్లమెంట్ (షియా) స్పీకర్ నబీ బెర్రీ సహా యావత్ ప్రభుత్వం రాజీనామా చేసే వరకు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించి నేటికి బీరుట్, ట్రిపోలి, ఇతర నగరాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరుపుతున్నారు. 1943లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం సాధించిన లెబనాన్ భిన్న జాతుల దేశంగా ఆవిర్భవించింది. ప్రధానంగా మెజారిటీలైన ముస్లింలలో నాలుగు జాతులు, ఆ తర్వాత స్థానంలో ఉన్న క్రైస్తవుల్లోని ఏడు జాతులు సహా మొత్తం 18 జాతుల ప్రజలు ఉన్నారు. దాంతో వారి మధ్య వైషమ్యాలు పెరిగాయి. ఫలితంగా 1970 నుంచి 1990 వరకు దేశంలో అంతర్యుద్ధం కొనసాగింది. జాతుల మధ్య పదవుల పంపకాలతో నాటి అంతర్యుద్ధానికి తెరపడింది. ఆ ఒప్పందం మేరకు లెబనాన్‌లో మెజారిటీలైన సున్నీలకు ప్రధాని పదవిని, క్రైస్తవులకు దేశాధ్యక్ష పదవిని, షియా ముస్లింలకు పార్లమెంట్ స్పీకర్, డ్రజ్ జాతీయులకు డిప్యూటీ స్పీకర్, ఇతర జాతుల వారికి ఇతర పదవులను రిజర్వ్ చేశారు. ఏ జాతి నాయకులు, తమ జాతి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ రావడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడి అభివద్ధి కుంటుపడింది. ప్రభుత్వంలో అవినీతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ అవినీతికి వ్యతిరేకంగా ‘వాట్సాప్’లో ప్రచారం పెరిగింది. కాల్స్ ఉచితం అవడంతో ప్రజల మధ్య అవినీతికి వ్యతిరేకంగా ఐక్యత పెరిగింది. వాట్సాప్ కాల్స్‌పై పన్ను విధించడం ద్వారా ప్రజా వ్యతిరేకతను అణచివేయాలని ప్రభుత్వం భావించింది. అదే ప్రజాగ్రహానికి కారణమై వారిని విప్లవం దిశగా నడిపిస్తోంది. -
ఉనికి సైతం ఉత్త భ్రమే
‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అని తెలుసుకున్నాడు మసనోబు ఫుకుఓకా (1913–2008). ‘ఈ జనన మరణ చక్రాలలో పాల్గొని, అనుభూతి పొంది, ఆనందించగలిగితే అంతకు మించి సాధించాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు. తన ఆలోచనను ఆచరణలో రుజువు చేసుకోవడానికిగానూ నగరంలో చేస్తున్న ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు. భూమిని దున్నకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా ప్రకృతి వ్యవసాయాన్ని సాధన చేశాడు. ప్రకృతి దానికదే అన్నీ అమర్చి పెట్టిందని నమ్మి, దానిమీద ‘గెలిచి’ ఆ అమరిక చెదరగొట్టకుండా, దానితో సమన్వయంతో బతికేందుకు ప్రయత్నించాడు. ‘నేను కనుగొన్న విషయం చాలా విలువైనదయినంత మాత్రాన నాకేదో ప్రత్యేక విలువ ఉన్నట్లు కాదు’ అని ప్రకటించుకున్నాడు. ఆ ఆలోచనా ప్రయాణాన్ని వివరించే పుస్తకం జపనీస్ నుంచి ఇంగ్లిష్‌లోకి వన్ స్ట్రా రెవల్యూషన్‌గా 1978లో వచ్చింది. అది తెలుగులోకి గడ్డిపరకతో విప్లవంగా అనువాదమైంది. ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఫుకుఓకా విద్యార్థి, సాధకుడు ల్యారీ కార్న్ ఇలా అంటారు: ‘తన సిద్ధాంతం ఏ మతంపైనా ఆధారపడి లేదని ఫుకుఓకా చెపుతారు. కానీ అతని బోధనా పద్ధతిపైనా, ఉపయోగించే పదజాలంపైనా జెన్, బౌద్ధం, టావోయిజమ్ల ప్రభావం బాగా ఉంది. అప్పుడప్పుడు అతను చెపుతున్న దానిని మరింత బాగా వివరించటానికో, చర్చను ప్రేరేపించటానికో బైబిల్ నుంచీ, క్రైస్తవ మతం నుంచీ ఉదాహరణలు ఇస్తుంటాడు. ‘వ్యక్తి ఆధ్యాత్మిక ఆరోగ్యం నుంచి ప్రకృతి సేద్యం పుట్టుకొస్తుందని ఫుకుఓకా నమ్మకం. భూమిని బాగుపరచటం, మానవ ఆత్మను ప్రక్షాళన చేయటం ఒకటేనని అతని అభిప్రాయం. ఆధ్యాత్మికంగా సంతృప్తికరమయిన జీవితానికి దారితీసే రోజువారీ పనులు ప్రపంచాన్ని సుందరంగా, అర్థవంతంగా మారుస్తాయని నిరూపించటమే అతను మనకిచ్చిన కానుక.’ దీనికే రాసిన ముందుమాటలో అమెరికా రచయిత, పర్యావరణ కార్యకర్త వెండెల్ బెర్రీ ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘కేవలం వ్యవసాయం గురించే ఈ పుస్తకంలో ఉంటుందనుకొనే పాఠకులు ఆహారం గురించీ, ఆరోగ్యం గురించీ, సాంస్కృతిక విలువల గురించీ, మానవ జ్ఞాన పరిమితుల గురించీ కూడా ఇందులో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకంలోని తత్వసిద్ధాంతాల గురించి ఆ నోటా ఈ నోటా విన్న పాఠకులు దీంట్లో వరి, శీతాకాలపు పంటలు, పండ్లు, కూరగాయలు ఎలా పండించాలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు.’ ‘ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? సాధారణమయిన జీవితం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదయినా ఉందా?’ అని ప్రశ్నించే ఫుకుఓకా తత్వం ఈ హడావుడి లోకరీతికి పూర్తి భిన్నమైనది. పూర్తిగా కావాల్సినది కూడానేమో! -
ఆత్మహత్యలు వద్దని వేడుకుంటున్న: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘ఇంటర్మీడియట్లో ఫెయిలయ్యామనే బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధపడ్డా. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలైతే.. జీవితంలో ఫెయిలైనట్లు కాదు. ప్రాణం చాలా విలువైంది. పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే మీ తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. అది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమైన సంఘటనలని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉపశమనం కలిగించే చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని సీఎం చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియను వీలైలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్, అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తల్లిదండ్రుల అనుమానాల నివృత్తికి చర్యలు ‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ–వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ–వెరిఫికేషన్ చేయాలి. రీ–కౌంటింగ్ చేయాలి. పాసైన విద్యార్థులకు కూడా రీ–వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’అని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సమస్యల్లేని పరీక్షల విధానం ‘ఇంటర్మీడియట్‌తో పాటు ఎంసెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతిసారీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఏడాదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం కూడా అనవసరంగా తలనొప్పులు భరిస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో ఎలా అమలు చేయగలమో ఆలోచించాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పుల్లేని పరీక్షావిధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న తలనొప్పులు నివారించడం కూడా అసాధ్యమేదీ కాదు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సంస్థపైనా ఆరా ఇంటర్మీయట్ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ–ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యంపై సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుందని వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. -
ఒక విప్లవకారుడు
విజ్ఞానం, విప్లవం మేళవించిన విశిష్ట చరిత్రపురుషుడు వీవీఎస్. సంప్రదాయం, సమరం, సాహితీ పిపాస కలగలసిన అద్భుత జీవితం ఆయనది. ‘వీవీఎస్’ – ఈ పేరుతో టెలిగ్రామ్ వచ్చింది, ఓడలోకి. అదే పేరున్న వ్యక్తి ఆచూకీ కోసం నిఘా వేసిన స్కాట్‌ల్యాండ్ యార్డ్ గూఢచారి జాగరూకుడయ్యాడు. టెలిగ్రామ్ అందుకున్న వ్యక్తి సూట్‌కేసు మీద కూడా వీవీఎస్ అనే ఉంది. ఇక అనుమానం లేదనుకుని అడిగాడా గూఢచారి, ‘మీ పూర్తి పేరు ఏమిటి?’ సమాధానం వచ్చింది, స్థిరంగా ‘వీర్ విక్రమ్ సింగ్’ అని. మరొకసారి ఆమ్స్టర్డ్యామ్ వెళుతున్న ఓడలో రోజుకు ఐదుసార్లు నమాజు చేసే ఒక ముస్లింను కూడా పోలీసులు అనుమానించారు. కానీ ఆయన విజిటింగ్ కార్డు తీసి ఇచ్చి తాను కలకత్తాకు చెందిన వ్యాపారవేత్తనని చెప్పారు. ఇంగ్లండ్ పోలీసులు, బ్రిటిష్ ఇండియా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి వీవీఎస్ అయ్యర్. నిజానికి సిక్కు వీర్‌విక్రమ్ సింగ్, కలకత్తా ముస్లిం వ్యాపారవేత్త కూడా నిజం కాదు. ఆ వేషాలలో ఉన్న వ్యక్తి వీవీఎస్ అయ్యరే. విజ్ఞానం, విప్లవం మేళవించిన విశిష్ట చరిత్రపురుషుడు వీవీఎస్. సంప్రదాయం, సమరం, సాహితీ పిపాస కలగలసిన అద్భుత జీవితం ఆయనది. కానీ, చెప్పుకోవడానికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా, చరిత్రపుటలలో చోటు దగ్గర అన్యాయానికి గురైన వారు అయ్యర్. వరాహనేరి వేంకటేశ సుబ్రహ్మణ్య అయ్యర్ (ఏప్రిల్ 2, 1881–జూన్ 1, 1925) తిరుచురాపల్లి సమీపంలోని వరాహనేరి అనే గ్రామంలో పుట్టారు. తండ్రి వేంకటేశ అయ్యర్. శోత్రియ కుటుంబంలో పుట్టినా, ఆ రోజుల్లోనే ఎఫ్ఏ చదివారు. ఇంగ్లిష్ చదివినా ఆయన సంప్రదాయవాదిగానే ఉన్నారు. కొడుకును కూడా ఇంగ్లిష్ చదివించారు. వీవీఎస్ అయ్యర్ పద్దెనిమిదేళ్లకే బీయ్యే పూర్తి చేశారు. చరిత్ర, సాహిత్యం, లాటిన్ ఆయన ఐచ్ఛికాంశాలు. వర్జిల్, హోమర్, షేక్స్పియర్, స్పెన్సర్, హాక్స్లీ, షోపెనార్, ఎమర్సన్ వంటివారిని క్షుణ్ణంగా చదివారాయన. అయితే మాతృభాష తమిళమంటే మాత్రం మహా గౌరవం. కంబ రామాయణం కరతలామలకం. అలాగే సంస్కృతం కూడా. కాళిదాసును లోతుగా చదివారు. ఎమర్సన్ కవిత్వం మీద ఉన్న అభిమానంతో ఆయన రచనలను తమిళంలోకి అనువదించారు. చదువు అయిన తరువాత అయ్యర్ మొదట తపాలాశాఖలో చేరారు. ఆ ఉద్యోగం వదిలేసి, తిరుచ్చికి సమీపంలోనే ఉన్న వడవూర్లో బ్యాంకింగ్ వ్యాపారం ఆరంభించారు. ఇందులో రాణించారు కూడా. మళ్లీ అది కూడా వదిలేసి న్యాయశాస్త్రం చదివి, తిరుచిరాపల్లి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రవేశించారు. దీనితో ఆయనకి కావలసినంత డబ్బు, వెసులుబాటు దొరికాయి. మళ్లీ సాహిత్యం చదవడం ఆరంభించారు. ఎంతో ఇష్టమైన చదరంగం ఆడుకునేవారు. ఆ దశలోనే తన సమీప బంధువు పశుపతి అయ్యర్ బర్మా (మైన్మార్) నుంచి వచ్చారు. అక్కడ పెద్ద బట్టల వ్యాపారి. రంగూన్ వచ్చి ప్రాక్టీస్ పెట్టవలసిందని అయ్యర్‌కి ఆయనే సలహా ఇచ్చారు. అలా రంగూన్ వెళ్లిన అయ్యర్ జీవితం పెద్ద మలుపు అంచుకి ప్రవేశించింది. రంగూన్లో ఒక ఆంగ్ల బారిస్టర్ దగ్గర సహాయకునిగా చేరారు అయ్యర్. అప్పుడే ఇంగ్లండ్ వెళ్లి బారెట్లా చదవాలన్న ఆకాంక్ష కలిగింది. లండన్ వెళ్లి లింకన్ ఇన్ అనే సంస్థలో చేరారు. ఇంగ్లండ్ చేరిన తరువాత ఆయన పాశ్చాత్య సంగీతం, బాల్రూం డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అచ్చంగా ఒక పాశ్చాత్యుడిలా వేషధారణ ఉండేది. ఆయన పాశ్చాత్యుడు కాదని ఆయన దగ్గర ఉండే పెట్టి తెరిస్తే తప్ప తెలిసేది కాదు. అందులో తమిళ కావ్యాలు, సంస్కృత కావ్యాలు ఉండేవి. వేషధారణ ఎలా ఉన్నా కూడా ఆయన సంప్రదాయం వీడలేదు. ఆ సమయంలోనే శాకాహార భోజనం కోసం అన్వేషిస్తూంటే ఒక సమాచారం తెలిసింది. ఉత్తర లండన్‌లో హైగేట్ అనే చోట భారతీయ విద్యార్థులకు ఉద్దేశించిన ఒక వసతిగృహం ఉంది. అందులో శాకాహార భోజనం దొరుకుతుంది. గుజరాత్‌కు చెందిన పండితుడు, బారిస్టర్‌గా లండన్‌లో స్థిరపడిన శ్యామ్‌జీ కృష్ణవర్మ దానిని నెలకొల్పారు. మాతృదేశ విముక్తిని కోరుకుంటున్న కృష్ణవర్మ హోమ్‌రూల్ సొసైటీ పేరుతో ఒక సంస్థను స్థాపించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారతదేశం ఇంగ్లండ్ పాలన నుంచి విముక్తం కావాలన్న ఆశయం ఉన్న యువకులను సమీకరించేవారు. అందులో భాగంగానే ఆ వసతిగృహం ఏర్పాటు చేశారు. దాని పేరు ‘ఇండియా హౌస్’. అది విద్యార్థి వసతి గృహమే కానీ, వాస్తవానికి భారతీయ విప్లవకారులకు కేరాఫ్ అడ్రస్. ఈ హౌస్‌కు రాజపోషకురాలు మేడమ్ భికాజీ కామా. 1906లో అయ్యర్ ఇండియా హౌస్‌లో చేరారు. ఆ సంవత్సరమే ‘హౌస్’కి చేరుకున్నారు– వినాయక్ దామోదర్ సావర్కర్. ఎందుకో మరి కొద్దికాలం తరువాత అంటే, 1907లోనే మొదటిసారి ఆ ఇద్దరు కలుసుకున్నారు. అయ్యర్ కంటే సావర్కర్ రెండేళ్లు చిన్న. కానీ సావర్కర్ అంటే అయ్యర్‌కు గొప్ప గురి. అయ్యర్ అన్నా కూడా సావర్కర్‌కి చాలా అభిమానం. సావర్కర్ హౌస్‌లోని విద్యార్థులకు విప్లవం గురించి చెబుతూ ఉండేవారు. భారత్ నుంచి ఇంగ్లండ్ వలస పాలకులను తరిమి కొట్టాలంటే హింసామార్గం తప్ప మరొకటి లేదని ప్రవచించేవారు. ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డి గురించి చర్చించేవారు. సావర్కర్ రాసిన ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి ఏర్పడిన భారతీయ యువకుల బృందానికి నాయకుడు అయ్యరే. మిగిలిన ఆ యువకులంతా ఐసీఎస్ చదవడానికి లండన్ వచ్చినవారే. అయ్యర్ గారిబాల్డి జీవిత చరిత్రను తమిళంలో రాసి, పుదుచ్చేరి నుంచి వెలువడుతున్న ‘ఇండియా’ పత్రికకు పంపారు. విప్లవభావాలకు వేదికగా ఉపయోగపడిన ఆ పత్రిక సంపాదకుడు సి. సుబ్రహ్మణ్య భారతి. ఇంగ్లండ్‌లో భారతీయుల, వారి రాజకీయ, సామాజిక కార్యకలాపాల గురించి ‘లండన్ లెటర్’ పేరుతో అయ్యర్ ‘ఇండియా’ పత్రికలోనే ఒక శీర్షిక నిర్వహించారు కూడా. అప్పుడే కృష్ణవర్మ, మేడమ్ కామా పోలీసు నిఘా కారణంగా ఇండియా హౌస్ బాధ్యతను సావర్కర్‌కు అప్పగించి పారిస్ ప్రవాసం వెళ్లిపోయారు. అప్పుడే సావర్కర్ అభినవ్ భారత్ శాఖను ఆరంభించారు. దానికి అధ్యక్షుడు సావర్కర్. ఉపాధ్యక్షుడు అయ్యర్. అలా అయ్యర్ విప్లవపథానికి మళ్లారు. ఒకసారి దసరా ఉత్సవాలు జరిపినప్పుడు దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ ఇండియా హౌస్‌ను సందర్శించారు. అహింసా సిద్ధాంతం గొప్పదనం గురించే అక్కడి యువకులకు చెప్పారు. అందరిలాగే అయ్యర్ కూడా గాంధీ వాదనను ‘చాదస్తం’గా కొట్టి పారేశారు. ఇంతలో సావర్కర్ మీద కూడా నిర్బంధం పెరిగింది. ఆయన కూడా పారిస్ వెళ్లిపోయారు. అంతకు ముందు ఒక ఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన కీర్తికార్ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్’లో చేరాడు. ఆ హౌస్‌లోనే రాజన్ అని అయ్యర్ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్ మీద అనుమానం వచ్చింది. ఈ సంగతి సావర్కర్, అయ్యర్ల దృష్టికి తీసుకువెళ్లాడాయన. కీర్తికార్ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్ తదితరులు కీర్తికార్ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్. హౌస్‌లో వారం వారం జరిగే రహస్య సమావేశాల గురించి పోలీసులకు నివేదికలు ఇస్తున్నాడు. కీర్తికార్ కణతకు రివాల్వర్ గురిపెట్టి నిలదీశారు అయ్యర్. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్. కానీ ఇతడిని బయటకి పంపినా వేరొకరిని ఇలాగే హౌస్‌లో ప్రతిష్టించక మానరు పోలీసులు. అందుకే అతడు హౌస్‌లో ఉండటానికే కాదు, నివేదికలు పంపేందుకూ ఒప్పించారు. కానీ ఆ నివేదికలన్నీ ముందు అయ్యర్ చూడాలి. అలా కొద్దికాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు. ఆ తరువాతే ఇండియా హౌస్‌ను తాత్కాలికంగా మూసివేయవలసిన పరిస్థితి ఎదురయింది. భారత్ నుంచి వచ్చిన మదన్‌లాల్ థీంగ్రా అనే విప్లవకారుడు కర్జన్ వైలీ అనే ఆంగ్ల అధికారిని కాల్చి చంపాడు. హౌస్ మీద నిఘా పెరిగింది. అంతా చెల్లాచెదురయ్యారు. థీంగ్రాకు ఉరిశిక్ష విధించి లండన్ జైలులోనే ఉరి తీశారు. ఆయన భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకుని సగౌరవంగా అంత్యక్రియలు జరిపించినవారు అయ్యర్. ఒక ముఖ్య విషయం చర్చించేందుకు లండన్ రావలసిందని సావర్కర్‌కు అయ్యర్ సమాచారం ఇచ్చారు. ఆ పనిలో పారిస్ నుంచి లండన్ వస్తుండగానే సావర్కర్ అరెస్టయ్యారు. ఆ అరెస్టు ఆయన జీవితాన్ని, భారత విప్లవోద్యమాన్ని దారుణమైన మలుపులోకి మళ్లించింది. లింకన్ ఇన్ అధికారులు చెప్పినట్టు ప్రమాణం చేయడానికి అయ్యర్ అంగీకరించలేదు. దీనితో బారెట్లా పూర్తయినా డిగ్రీ ఇవ్వలేదు. పైగా ఈ చర్యతో అయ్యర్ ఎంత బ్రిటిష్ వ్యతిరేకో వెల్లడైంది. దీనితో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దాని నుంచి తప్పించుకోవడానికే ఆయన సిక్కు వేషంలో లండన్ వదిలి ఓడ ఎక్కారు. పారిస్‌లో మేడమ్ కామా, కృష్ణవర్మల దగ్గర చేరారు. అప్పుడే పోలీసులు సావర్కర్‌ను భారత్‌కు తరలిస్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన కామా తదితరులకు సమాచారం అందించారు. తాను మార్సెయిల్స్ ఓడ రేవులో తప్పించుకుంటానని, అక్కడ నుంచి తనను తప్పించాలని ఆ సమాచారం సారాంశం. కామా, అయ్యర్ తదితరులు మార్సెయిల్స్ రేవుకు వెళ్లారు. చెప్పినట్టే సావర్కర్ తప్పించుకున్నారు. మరుగుదొడ్డి నుంచి సముద్రంలోకి ఉండే సన్నని గొట్టం ద్వారా సావర్కర్ సముద్రంలోకి జారారు. ఈ సాహస చరిత్ర సుప్రసిద్ధం కూడా. కానీ నిషేధం ఉన్నా మార్సెయిల్స్ రేవులోకి బ్రిటిష్ పోలీసులు చొరబడి సావర్కర్‌ను మళ్లీ ఓడలోకి తీసుకుపోయారు. ఇదంతా కామా, అయ్యర్ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. తరువాతే ఆయన ఇండియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ముస్లింలా ఉండటం ఎలాగో నేర్చుకున్నారు. పార్సీ జాతీయుడిలా కనిపించడానికి కామా దగ్గర వారి ప్రార్థనలు అభ్యసించారు. కొద్దికాలం శ్రద్ధగా గెడ్డం పెంచారు. మొత్తానికి భారత్ చేరుకున్నారు. ఆ ఓడ శ్రీలంక రాజధాని కొలంబోకు వెళుతూ తమిళనాడులోని కడలూరులో ఆగింది. అయ్యర్ అక్కడే దిగి, చిన్న పడవలో గట్టుకు వచ్చారు. అక్కడ నుంచి జట్కాలో పుదుచ్చేరి చేరుకున్నారు. ఫ్రెంచ్‌వారి అధీనంలోని పుదుచ్చేరిలో, అరవిందుని సమక్షంలో ఉండేవారు. అక్కడ కూడా ఆయన తను నమ్మిన విప్లవ పథం గురించి యువకులను ఉత్తేజపరిచేవారు. ఈ బోధనలతో వాంచా అయ్యర్ అనే ఆయన ఐష్ అనే ఒక ఆంగ్ల అధికారిని చంపాడు కూడా. ఒకసారి గాంధీజీ పుదుచ్చేరి వచ్చారు. అయ్యర్ మర్యాదపూర్వకంగా కలసి మాట్లాడారు. ఒక్కసారిగా గాంధేయవాదిగా మారిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటిష్, ఫ్రెంచ్ సంబంధాలలో మార్పు వచ్చింది. అయ్యర్ అరెస్టయి, కొద్దికాలం బళ్లారి జైలులో గడిపారు. విడుదలైన తరువాత జాతీయ కాంగ్రెస్‌లో పనిచేశారు. కానీ 1922 నాటి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చి, తరువాత ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. అయ్యర్ దాదాపు రాజకీయాలు వదిలేసి విద్య వైపు, సాహిత్యం వైపు మరలారు. సర్మాదేవి అనే చోట ఒక విద్యాలయం ఏర్పాటు చేశారు. దీనికి నలువైపుల నుంచి మద్దతు వచ్చింది. కాంగ్రెస్ కూడా ఆర్థిక సాయం చేసింది. కానీ ఇందులో వచ్చిన ఒక గొడవ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వివాదంగా ముదిరి ఆయనను కలత పెట్టింది. కాంగ్రెస్‌లోని బ్రాహ్మణేతర నాయకులు సాయం ఆపేశారు. అయినా ఆయన విద్యాలయం నడిపారు. ఆ సమయంలోనే ఒకసారి పిల్లలను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న పాపనాశం అనే జలపాతం దగ్గరికి విహార యాత్రకు తీసుకువెళ్లారు. అక్కడికే ఆయన భార్య, కూతురు వచ్చారు. ప్రవాహం చిన్నగా ఉన్నచోట మగపిల్లలంతా దూకి అవతలికి వెళ్లిపోయారు. కూతురు సుభద్ర కూడా దూకుతానని అడిగింది. అయ్యర్ వారించాడు. దానికి ఆ బాలిక, ‘ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాలని నిరంతరం చెప్పే మా నాన్న నోటి నుంచే ఈ మాట వచ్చింది?’ అంది. అంటూనే దూకింది. పరికిణీ అడ్డం పడి నీళ్లలో ప్రవాహంలో పడిపోయింది. కూతురుని రక్షించడానికి అయ్యర్ దూకారు. ఇద్దరూ చనిపోయారు. ప్రపంచమంతా సముద్రం మీద తిరిగి వచ్చిన ఆ మహా విప్లవకారుడు, సొంత రాష్ట్రంలో చిన్న నీటి పాయలో పడి చనిపోవడం చాలా విచిత్రం. అన్ని మతాల వారితో, ప్రాంతాల వారితో కలసి పనిచేసిన ఆ విప్లవకారుడు చిన్న కులం గొడవతో కుంగిపోవలసి రావడం ఇంకా చిత్రం. - డా. గోపరాజు నారాయణరావు -
ఇది మా ఊరు
కోమల్ హదాలా... ఇరవై రెండేళ్ల అమ్మాయి. పేరుకు తగ్గట్టే కోమలంగా ఉంది. అంతే కోమలంగా ఓ సామాజికోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ‘ఇది మా ఊరు’ అంటూ గర్వంగా చెబుతోందిప్పుడు. కోమల్ మొదలు పెట్టిన విప్లవానికి తొలి అడుగు ఇంటి నుంచే పడింది. భర్త మీద ఒత్తిడి తెచ్చింది. అత్తకు, ఆడపడుచుకు నచ్చచెప్పింది. తన వాదనతో అత్తగారి అత్తగారిని కూడా మెప్పించింది. ఇంట్లో టాయిలెట్ కట్టాలనే ఆమె డిమాండ్ ఇంటితోనే ఆగిపోలేదు. ఊరంతటికీ టాయిలెట్లు వచ్చాయి. కోమల్ హదాలా ఢిల్లీలో పుట్టి పెరిగింది. పెళ్లితో ఉత్తరప్రదేశ్‌లోని నిథోరా గ్రామానికి వచ్చింది. ఆ మర్నాడే తెల్లవారి నాలుగు గంటల సమయంలో ఎవరో కుదుపుతూ ఉంటే మెలకువ వచ్చింది. ‘నిద్ర లేచి త్వరగా రా, అందరూ ఎదురు చూస్తున్నారు’ అని అత్తగారు నిద్రలేపారు. ఇంకా చీకటి వదల్లేదు, ఇప్పుడు లేవడం ఎందుకు, తన కోసం ఎదురు చూస్తున్నది ఎవరు... ప్రశ్నలను గొంతులోపలే మింగేసి అత్తగారి వెంట బయటకు వచ్చింది. పక్కిళ్ల మహిళలు, ఆ ఇంటి ఆడవాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు కొత్తకోడలి కోసం ఎదురు చూస్తూ. ‘చీకట్లో ఎక్కడికి’ అడిగింది. ‘మరి చీకటి వదలక ముందే వెళ్లి రావాల్సిన పనికి చీకటి వదిలాక వెళ్తావా’ పరాచికాలాడిందొకామె. ‘మగవాళ్లు నిద్రలేవక ముందే వెళ్లి రావాలి’ అంటూ మరొకామె హెచ్చరించింది. అంతా కలిసి కిలోమీటరు దూరానున్న పొలాల్లోకి వెళ్లారు. ఎక్కడ అడుగు పెడుతోందో తెలియట్లేదు కోమల్‌కి. కీచురాళ్ల రొద, తుప్పల్లో కాలు పెట్టాలంటే భయమేసింది. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె భర్తను డిమాండ్ చేసింది. ‘ఇంట్లో టాయిలెట్ కట్టాల్సిందే’ అని. రెండంతస్తుల ఇంట్లో డబుల్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉంది, వాటర్ ప్యూరిఫయర్ కూడా ఉంది. కానీ టాయిలెట్ మాత్రం లేదు. ఇంట్లో వాళ్లందరినీ తన వాదనతో సమాధానపరిచింది కోమల్. అనుకున్నది సాధించుకుంది. ఏడాది తిరిగే సరికి ఊళ్లో 250 టాయిలెట్లు కట్టించింది. ఎలా సాధ్యమైంది? అందరూ కలిసి గ్రామపెద్ద చహాత్ రామ్‌ను కలిశారు. టాయిలెట్ కట్టుకుంటామని వచ్చిన వాళ్లను చూసేసరికి చహాత్ రామ్‌కు ప్రాణం లేచి వచ్చింది. ప్రభుత్వం నుంచి నిధులున్నాయి. ప్రతి ఇంటికీ కట్టించమనే ఆదేశమూ ఉంది. ఎంత చెప్పినా టాయిలెట్ కట్టించుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లే కరువయ్యారు. ఒక అమ్మాయి అలా చొరవ చూపడంతో గ్రామ పెద్ద ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ అమ్మాయితోనే మిగిలిన ఆడవాళ్లకు నచ్చ చెప్పిస్తే పనవుతుందనుకున్నాడు. పైగా నగరం అమ్మాయి, చదువుకున్న అమ్మాయి. తెలివితేటలతో ఊరిని ఒక తాటి మీదకు తెస్తుందని ఆశించాడు. అలా కోమల్ తన ఇంటి నుంచి మొదలు పెట్టిన టాయిలెట్ విప్లవాన్ని ఊరంతటికీ విస్తరించింది. మహిళలందరినీ కూర్చోబెట్టి తెల్లవారు జామున నాలుగింటికి, రాత్రి తొమ్మిది తర్వాత పొలాల్లోకి వెళ్లడం వల్ల మహిళలకు ఎదురయ్యే ప్రమాదాల గురించి హెచ్చరించింది. బహిరంగ విసర్జన వల్ల వచ్చే అనారోగ్యాలను వివరించింది. ప్రమాదాలు వాళ్లకు అర్థమయ్యాయి, కానీ బహిరంగ విసర్జన అనారోగ్యాలకు ఎలా కారణమవుతుందో వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. స్కూలు పిల్లలను సమీకరించింది, వాళ్ల పుస్తకాల్లో ఉన్న పాఠాలను పెద్దవాళ్లకు అర్థమయ్యేలా చెప్పింది. మొత్తానికి ఊరందరి చేత మరుగుదొడ్డి కట్టించింది కోమల్. కట్టించడం వరకు ఓకే! ఊరందరినీ సమాధాన పరిచి ఇంటింటికీ టాయిలెట్ కట్టడం పూర్తయింది. కానీ వాటిని వాడుకలోకి తేవడం మరో ఘట్టమైంది. టాయిలెట్ గదుల్లో సామాను భద్రపరిచారు కొందరు. ‘అది ఆడవాళ్ల కోసం, మగవాళ్లం మేమెందుకు వాడాలి’ అని వాదించారు మరికొందరు. చివరికి బహిరంగంగా విసర్జన చేసే వాళ్లను పిల్లల చేత విజిల్ ఊదించి ఎగతాళి చేయించడం అనే టెక్నిక్ పూర్తి ఫలితాలనిచ్చింది.‘మోదీ ప్రభుత్వం టాయిలెట్ ఫస్ట్, టెంపుల్ లేటర్.. అనే నినాదంతో 2014 నుంచి తొమ్మిది కోట్లకు పైగా టాయిలెట్లను కట్టించినప్పటికీ, ఆ స్ఫూర్తితో మా నిథోరాలో ఒక్కటీ కట్టించలేకపోయాను. కోమల్ తెచ్చిన విప్లవంతోనే ఇది సాధ్యమైంది’ అని ప్రశంసించాడు గ్రామపెద్ద. – మంజీర -
మహాత్ముడిలో విప్లవం
రెండో మాట ‘ప్రజాయుద్ధం’ (పీపుల్స్‌వార్) నినాదాన్ని చేపట్టిన కమ్యూనిస్టులను స్వాతంత్య్ర పోరాటానికి శత్రువులుగా చిత్రిస్తూ జాతీయ కాంగ్రెస్ గాంధీజీ చెవులు కొరికింది. కమ్యూనిస్టు నాయకులపైన విష ప్రచారానికి సిద్ధమైంది. అప్పుడు గాంధీజీ ‘ఇది నిజమేనా?’ అంటూ ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి.సి. జోషీకి లేఖ రాశారు. జోషీ అంశాల వారీగా వివరణ ఇస్తూ లేఖ రాశారు. గాంధీజీ కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యుత్తరం కూడా రాశారు. ఉద్యమ నిర్వహణలో తన తప్పిదాలకు పలుమార్లు క్షమాపణ చెప్పారు. ‘గాంధీజీ ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక రాజనీతిజ్ఞుడే కాదు, ఆయనొక ప్రవక్త. ప్రవక్త తన కాలంలో తరచూ విఫలమవుతూ ఉంటాడు. కానీ ఆయన వైఫల్యాల నుంచీ ఆయన త్యాగాల నుంచీ మానవాళి చిరంతనమైన విలువను సంతరించుకుంటుంది. అనితర సాధ్యమైన ఆ విలువే ప్రవక్త జీవి తాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అది మానవజాతికి కాలావధులు లేని విశ్వజనీన పాఠమై సేవ చేస్తుంది.’‘కమ్యూనిస్టు మార్క్సిస్టు సిద్ధాంతాల వెలుగులో కూడా భారత కమ్యూనిస్టులు గాంధీజీని విశ్లేషించడంలో ఘోర తప్పిదం చేశారు. – ‘రివల్యూషనరీ గాంధీ’(2012) గ్రంథంలో పన్నాలాల్‌దాస్ గుప్తా (1948 వరకు అవిభక్త భారత రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి) ‘ప్రపంచ ప్రజలు ముందడుగు వేస్తున్న కొద్దీ, భూప్రపంచం శాంతి కోసం తపన పడుతున్న కొద్దీ, ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తున్న కొద్దీ గాంధీజీ వాణి ఎప్పటి కన్నా ఎక్కువగా, విస్పష్టంగా ధ్వనిస్తుంటుంది. ఆయన భావాలపైన ఎలాంటి పేరు, ఇంటి చిరునామా తెలిపే చీటీ అంటించనక్కర్లేదు– ఒక్క మానవతావాదమనే సువిశాల ముద్ర తప్ప!’ – ‘గాంధీజీ’ (పే.209) గ్రంథంలో ప్రొ. హిరేన్ ముఖర్జీ(సుప్రసిద్ధ కమ్యూనిస్టు నేత. ఎంపీ. చరిత్రకారుడు.) జాతిపిత గాంధీజీని మతోన్మాద హిందూత్వ శక్తి నాథూరామ్ గాడ్సే హత్య చేసిన రోజు ఇదే (జనవరి 30, 1948). విభిన్న జాతులు, మతాలు, భాషా మైనారిటీలు, భిన్న తెగలు, దళిత బహుజనుల సమాహారంగా ఉన్న భారతావనిని స్వేచ్ఛ కోసం ఒక్క తాటిపై నడిపించినవారు గాంధీజీ. అలాంటి గాంధీజీని ఏ మిషతో గాడ్సే, అతడి ‘హిందూరాష్ట్ర’వాదులు కొందరు హత్య చేశారో కొంత ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ‘గాంధీని నేనెందుకు హత్య చేశాను?’ పేరుతో గాడ్సే కోర్టు వాంగ్మూలం పుస్తకరూపంలో వెలువడింది. గాంధీ హత్య కేసును విచారించిన ప్రత్యేక కోర్టులో గాడ్సే ఇచ్చిన వాంగ్మూలమది. మొదట దీనిని నిషేధించారు. 1968లో బొంబాయి హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. 2014 తరువాత బీజేపీ–పరివార్ ప్రభుత్వం ఆవిర్భవించిన తరువాత ఇది మరోసారి వెలువరించారు. గాంధీజీని హత్య చేయడానికి ‘హిందూరాష్ట్ర’కు దొరికిన కారణాన్ని అందులో (పేజీ: 45) ప్రకటించారు: దేశ విభజన తరువాత పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు పరిహారం ఇవ్వాలని ఇండియాను ఒత్తిడి చేస్తూ గాంధీ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్త అన్ని దేశ భాషా వార్తా మాధ్యమాలలో ప్రసారమవుతున్న ఘడియలవి. ఆ సమయంలో నాథూరామ్ వినాయక్ గాడ్సే, నారాయణ ఆప్టే (మరాఠీ దినపత్రిక ‘హిందూ’రాష్ట్ర పత్రిక సంపాదక, మేనేజర్లు) తమ కార్యాలయంలో కూర్చుని టెలిప్రింటర్ మీద వస్తున్న ఆ వార్తను చదువుతు ‘గాంధీని చంపేయాలని ఆకస్మికంగా నిర్ణయించుకున్నారు’. అంటే అప్పటి నుంచి నేటిదాకా ఈ పరివార్ కూట రాజకీయాలకు ఉప్పు అందిస్తున్నది ఈ మత విద్వేషమేననీ ఇది దేశానికి నిరంతర చెరుపు అనీ స్పష్టం చేయడానికే ఇది చెప్పడం. రివల్యూషనరీ గాంధీ దేశ విభజనతో శాశ్వత కల్లోలానికి అంకురార్పణ చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని సహితం ఎదిరించి పరువు నిలిపిన వారు గాంధీ. ఎన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన తుది శ్వాస వరకు జాతీయోద్యమాన్ని సాగిం చారో వివరించే మరో గ్రంథం ‘రివల్యూషనరీ గాంధీ’. పన్నాలాల్‌దాస్ గుప్తా ఈ చారిత్రక గ్రంథాన్ని రచించారు. అవిభక్త బెంగాల్ రివల్యూషనరీ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1948 వరకు ఆయన పనిచేశారు. తరువాత పార్టీ నుంచి విడిపోయారు. జాతీయోద్యమ సమయంలో ఆవిర్భవించిన పార్టీలు ఎన్నో! ఎందరో ఉద్యమకారులు పనిచేశారు. అలాంటి దశలో అనుసరించవలసిన వ్యూహాలు, ఎత్తుగడల విషయంలో వ్యత్యాసాలు, వైరుధ్యాలు సహజం. అనేక దేశాల జాతీయోద్యమాలను ఇలాంటి పరిణామాలే ప్రభావితం చేశాయి. అంతా పన్నాబాబు అని ప్రేమగా పిలుచుకునే పన్నాలాల్‌దాస్ గుప్తా వేలు విడిచిన విప్లవకారునిగా, మార్క్సిస్టు మేధావిగా గాంధీజీ (విప్లవ గాంధీ)కి అర్పించిన అక్షర నివాళే ఆ రచన. ఉద్యమ అనుభవాలు ఇచ్చిన పూర్వరంగంతో చేసిన చారిత్రక విశ్లేషణ. అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించాలన్న గాంధీజీ పంథాను శంకించే వ్యాఖ్యను పన్నాబాబు ఆమోదించలేదు. అలాంటి వ్యాఖ్యను ఏ సహ రాజకీయ పక్షం చేసినా ఎదుర్కొన్నారు. అదే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు, కమ్యూనిస్టు పార్టీల కొన్ని నిర్ణయాలను విశ్లేషించారు. గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహ విధానాలనూ, ఆయన తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలతో ఉద్యమానికి కలిగిన దుష్ఫలితాలనూ పన్నాబాబు తర్కించారు. భారత జాతీయ కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ వగైరా సంస్థలన్నీ జాతీయోద్యమంలో తమ వంతు పాత్రను నిర్వహించినవే. కానీ ఇవన్నీ ఒకే మూసలో నుంచి వచ్చినవి కావు. కమ్యూనిస్టులు, సోషలిస్టులే కాదు, కొందరు వ్యక్తులు, ఇతర ఉద్యమకారులు కూడా పలు సందర్భాలలో గాంధీతో విభేదించినవారే. అదే సమయంలో గాంధీ దేశ విభజనను వ్యతిరేకించినప్పుడూ, కాంగ్రెస్ నాయకత్వం విభజనను భుజాన వేసుకున్నప్పుడూ సీఎస్పీ, కమ్యూనిస్టులు, సోషలిస్టులు గాంధీజీకి అండగా నిలిచారు. ‘హింస’ ప్రధాన ఆయుధం కాదనీ, హింసాయుత విప్లవమే ఆదర్శమనీ కూడా నాడు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించుకోలేదు. అహింస ద్వారానే సాతంత్య్రం సిద్ధిస్తుందనీ నమ్మలేదు. కానీ అహింసా ప్రయోగాన్నీ తప్పుగా అంచనా వేసి, గాంధీని ధనికవర్గ ప్రతినిధిగా, బూర్జువా వర్గ ప్రతినిధిగా ప్రచారం చేయడాన్ని పన్నాలాల్ విమర్శించారు. అందుకే రజనీ పామీదత్ (బ్రిటిష్ కమ్యూనిస్టు నేతలలో ఒకరు), ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్‌ల వైఖ రిని, కొంతమేరకు ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ లాంటి కమ్యూనిస్టు నాయకులు గాంధీ గురించి వేసిన అంచనాలను ఖండించారు. సత్యాగ్రహోద్యమంతో, అహింసా సిద్ధాంతం ప్రాతిపదికగా నిరక్షరాస్యులైన అసంఖ్యాకులను కనీస కార్యక్రమం ఆధారంగా మాత్రమే సమీకరించగలమే గానీ, స్వాతంత్య్ర పోరుకు ఉద్యుక్తుల్ని చేయగలంగానీ ఒక్కసారే సమూల మార్పునకూ హింసాత్మక విప్లవానికీ సన్నద్ధులను చేయలేమని గాంధీ విశ్వసించారు. నిరక్షరాస్యుల్ని కదిలించడానికీ, వారికి బతుకుబాట చూపగల కనీస కార్యక్రమాల వైపు ఆకర్షించేందుకూ గాంధీ వ్యూహ రచన చేశారు. వాటిలో ప్రధానమైంది– ‘15 అంశాల’తో కూడిన తక్షణాచరణ నిర్మాణ కార్యక్రమం: అవి హిందూ–ముస్లిం ఐక్యత, హరిజనోద్ధరణ, అస్పృశ్యతా నివారణ, ఆదివాసీల ఉద్ధరణ, మహిళోద్ధరణ, మద్యనిషేధం, ఖాదీ కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం, ప్రాథమిక మౌలిక విద్య, ప్రజారోగ్యం, హిందీ తదితర ప్రాంతీయ భాషల అభివృద్ధి, కార్మికోద్ధరణ, వయోజన విద్య, విద్యార్థి సంఘాల నిర్మాణం, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం వగైరా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడం. అయితే కొన్ని మార్క్స్ విప్లవ సిద్ధాంతాలకూ, గాంధీ సిద్ధాంతానికి మౌలిక సూత్రీకరణల్లో పెద్ద తేడా కనిపించదని పన్నాలాల్ భావన. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో శ్రమజీవులు పరాయీకరణకు లోనవుతారని మార్క్స్–గాంధీలు ఏకీభవిస్తారు. దోపిడీని నిరసిస్తారు. దాని నిర్మూలనకు అనుసరిం చాల్సిన మార్గాలలోనే ఉభయుల సిద్ధాంతాలు విభేదిస్తాయి. అంతమాత్రాన నాయకత్వ స్థాయిలో ఉన్న త్యాగ పురుషులకు ఉద్దేశాలు అంటకట్టకూడదన్నదే పన్నాలాల్ ఉద్దేశం. అందుకే ‘పోరాటాల ద్వారా తప్ప ప్రజా బాహుళ్యాన్ని ఉద్యమింపచేయలేమన్న వామపక్షాల నమ్మకం ఒక భ్రమ’ అని పన్నాలాల్ విశ్వసించారు. కానీ రాజకీయ సంస్థలకు, వ్యవస్థలకు దేశ, సమాజ ఆర్థిక పరిస్థితులే మూలమన్న సత్యాన్ని మనం మరవరాదు. కమ్యూనిస్టులదే కాదు, ఉద్యమ గమనంలో గాంధీజీని అనుసరించి నెహ్రూతో పాటు, కాంగ్రెస్‌లోనే జిన్నా, సుభాష్ చంద్రబోస్‌ల స్వాతంత్య్ర సాధన గమ్యం వేరైంది. మరో పోరాటం అవసరం ఉంది పన్నాలాల్ గుర్తించినట్టు స్వాతంత్య్రోద్యమంలో వామపక్షాలు సహనం కోల్పోతూ వచ్చాయి. సుభాష్ బోస్ పరిస్థితీ అంతే. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను వ్యతిరేకిస్తున్న శక్తులనుంచి సహాయం పొంది దేశాన్ని విముక్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు సుభాష్. ఆ ఊపులో బోస్ చేసిన ఘోర తప్పిదం– ఫాసిస్టు, జర్మనీ, జపనీస్‌లను కలిసి, సహాయం కోరడం (1940–42). రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ను ఎదుర్కొనేందుకు అగ్రరాజ్య మిత్రమండలిలో అమెరికా, బ్రిటన్, సోషలిస్టు సోవియెట్ యూనియన్లు భాగస్వాములైన తరువాత భారతదేశ స్వాతంత్య్ర సమరంలో భాగస్వామి అయిన కమ్యూనిస్టు పార్టీ ఆకస్మికంగా ఈ ప్రపంచ యుద్ధ స్వభావాన్ని (సోవియెట్ రష్యా పాల్గొనడంతో) ‘ప్రజాయుద్ధం’గా ప్రకటించింది. అప్పటిదాకా స్వాతంత్య్రం కోసం అజ్ఞాతవాసంలో పోరాటాన్ని సాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీపై తన స్వార్థం కోసం బ్రిటిష్ పాలకులు నిషేధాజ్ఞలు సడలించారు. ఈ సమయంలోనే ‘ప్రజాయుద్ధం’ (పీపుల్స్‌వార్) నినాదాన్ని చేపట్టిన కమ్యూనిస్టులను స్వాతంత్య్ర పోరాటానికి శత్రువులుగా చిత్రిస్తూ జాతీయ కాంగ్రెస్ గాంధీజీ చెవులు కొరికింది. కమ్యూనిస్టు నాయకులపైన విష ప్రచారానికి సిద్ధమైంది. అప్పుడు గాంధీజీ ‘ఇది నిజమేనా?’ అంటూ ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పి.సి. జోషీకి లేఖ రాశారు. జోషీ అంశాల వారీగా వివరణ ఇస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. గాంధీజీ కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యుత్తరం కూడా రాశారు. నిర్మలమైన మనస్సున్నవాడు కాబట్టి గాంధీజీ ఉద్యమ నిర్వహణలో తన తప్పిదాలకు పలుమార్లు క్షమాపణ చెప్పారు. అన్నింటికన్నా పెద్ద ఒప్పుకోలు– ‘కాంగ్రెస్ హిమాలయ పర్వతమంత తప్పులు చేసింద’న్న ప్రకటన. బహుశా అందుకే పన్నాలాల్ కూడా స్టాలిన్ మాటల్ని ఉదహరించాల్సి వచ్చింది: ‘ఒక చారిత్రక పరిస్థితికి ఫలానా పంథా సరైన మార్గమనుకున్నది మరొక చారిత్రక సందర్భానికి తగిన మార్గం కాకపోవచ్చు’. బహుశా ఈ దృక్పథం నుంచే భారతీయ ప్రొఫెసర్ శ్రీమతి అనన్య వాజ్‌పేయి (కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ: 2.10.2017) నేటి గాంధీ భారతానికి జోడించిన వ్యాఖ్య వర్తిస్తుందేమో చూడండి: ‘ఇండియా వలస పాలనా గుదిబండను వదిలించుకుంది. కానీ, స్వాతంత్య్రం తర్వాత, గాంధీజీ హత్యానంతరం మరొకసారి 70 ఏళ్ల తర్వాత స్వేచ్ఛా భారతం కోసం మరొక పోరాటాన్ని చేయక తప్పదనిపిస్తోంది’! (నేడు గాంధీజీ వర్ధంతి) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బొగ్గు, ఉప్పు పోయి ఆవాలు, పూదీన వచ్చే!
సాక్షి, న్యూఢిల్లీ : తళతళలాడే దంతాల కోసం తాపత్రయ పడే ప్రజలు మొన్న బొగ్గు, నిన్న ఉప్పు, నేడు ఆవాలు, పూదీన, ఆఖరికి పసుపుతో కూడిన మంజన్లు, పేస్టులు వాడుతున్నారు. భారత్‌లో ఈ విప్లవానికి శ్రీకారం చుట్టి దంత సంరక్షణ మార్కెట్‌ను మరెక్కడికో తీసుకెళుతన్నది నిస్సందేహంగా బాబా రామ్‌దేవ్ నాయకత్వంలోని పతంజలి ఉత్పత్తులే. సంప్రదాయబద్ధంగా ఆయుర్వేదం లేదా ఔషధ మూలికల మూలాలు కలిగిన ఉత్పత్తులతో ముందుకు వస్తున్న పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో మరెంతో ముందుకు దూసుకెళుతున్నాయి. ఒక్క భారత్‌లోనే పదివేల కోట్ల రూపాయల మార్కెట్ కలిగిన దంత సంరక్షణ రంగంలో బాబా రామ్‌దేవ్ ప్రధాన వాటా కోసం పోటీ పడుతున్నారు. ఆయన పోటీని తట్టుకొని తమ ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి కాల్గేట్, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి సంస్థలు కూడా పంతంజలి బాటను పట్టక తప్పలేదు. ‘మీరు వాడే కాల్గేట్లో ఉప్పు ఉందా?’ అంటూ ఈ దిశగా ముందుకొచ్చిన కాల్గేట్ ‘సిబాకా వేదశక్తి’ని 2016, ఆగస్టులో మార్కెట్లోని విడుదల చేసింది. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఆవాలు, రాతి ఉప్పు మూలాలు కలిగిన ‘ఆయుష్’ బ్రాండ్‌ను 2017, ఆగస్టులో విడుదల చేసింది. అయినప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధ మూలికల దంత ఉత్పత్తుల్లో అమ్ముడుపోతున్న ఐదింటిలో నాలుగు బ్రాండ్లు పతంజలి, డాబర్ ఉత్పత్తులే కావడం విశేషం. ‘హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్’ లెక్కల ప్రకారం దేశంలో దంత సంరక్షణ మార్కెట్ పదివేల కోట్ల రూపాయలకు విస్తరించగా, 10 సంవత్సరాల క్రితం వీటిల్లో ఆయుర్వేద లేదా ఔషధ మూలికల బ్రాండ్లు ఒక్కటైనను లేదు. నేడు వాటి వాటా పదివేల కోట్ల రూపాయల్లో 20 శాతానికి చేరుకొంది. భారత దేశంలో నేడు 90 శాతం ఇళ్లలో టూత్‌పేస్ట్ లేదా టూత్ పౌడర్ వాడుతున్నారు. వీటిల్లోకి ఔషధ మూలాలున్న ఉత్పత్తులు చొచ్చుకుపోవడానికి కారణం ఆరోగ్యానికి అవి మంచి చేస్తాయన్న విశ్వాసమే కాకుండా ధర తక్కువగా ఉండడం కూడా మరో కారణం. పతంజలి ఉత్పత్తులో దంత్ కాంతి బ్రాండ్‌ను ప్రతి వంద గ్రాములను 40 రూపాయలకు విక్రయిస్తుండగా, కాల్గేట్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తులను ప్రతి వంద గ్రాములను 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్ లీడర్ కాల్గేట్ కంపెనీయే. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2015 సంవత్సరంలో మార్కెట్లో కాల్గేట్ వాటా 57 శాతం నుంచి 53 శాతానికి పడిపోయింది. ప్రజలు కాస్మోటిక్ కేర్ నుంచి థెరపాటిక్ కేర్‌కు, అంటే సౌందర్య పిపాస నుంచి ఆరోగ్య సంరక్షణకు మల్లడం వల్ల మూలికల మూలాలున్న ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని డాబర్ ఇండియా సీఈవో సునీల్ దుగ్గల్ వ్యాఖ్యానించారు. భారత్‌లో డాబర్ ఇండియా రెడ్, బాబుల్, మెశ్వాక్ బ్రాండ్ల టూత్‌పేస్ట్‌ను విక్రయిస్తున్న విషయం తెల్సిందే. -
బహు‘ముఖ’ ప్రజ్ఞ
1967– రష్యా విప్లవం యాభయ్ ఏళ్ల సందర్భం. సోవియెట్ రష్యా వెళ్లిన భారత కళాకారుల బృందం సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తున్నది. రష్యన్లు ఎంతో అభిమానించే నేత హఠాత్తుగా వేదిక మీద ప్రత్యక్షమయ్యారు. ముమ్మూర్తులా ఆయనే. విస్తుపోయారంతా. ఆయన జవహర్లాల్ నెహ్రూ. కానీ నెహ్రూ 1964లోనే కన్నుమూశారు. అందుకే ఆ విస్మయం. అప్పుడు తెలిసింది– అదొక వేషధారణ. ఇంకొక చక్కని ఉదాహరణ కూడా. బసప్ప దాసప్ప జట్టి భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు (1974–1979) ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఎదురుగా వేదికవైపు చూశారు. ఆశ్చర్యంలో మునిగిపోయారు. వేదిక మీద తనకు కేటాయించిన కుర్చీలో అప్పటికే బి.డి. జట్టి ఉన్నారు. ఒక్క నిమిషం తరువాత.. వేదిక ముందు అసలు జట్టి ఇంకా తేరుకోక ముందే వేదిక మీది నకిలీ జట్టి కిందకి దిగి వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇది కూడా వేషమే. ఆ రెండు వేషాలు ధరించిన కళాకారుడు ఒక్కరే– ‘ఫన్ డాక్టర్’ వైద్యుల చంద్రశేఖరం. బెన్ కింగ్స్లే అచ్చంగా గాంధీగారిలాగే కనిపించారు. రోషన్ సేథ్ దాదాపు నెహ్రూను పోలి ఉంటారు. ఆంథోనీ క్విన్ లిబియా తిరుగుబాటు నేత ఒమర్ ముక్తార్లాగే ఉన్నారు (లైన్ ఆఫ్ డిజర్ట్). విజయ్‌చందర్ టంగుటూరి ప్రకాశాన్ని మరిపించారు (ఆంధ్రకేసరి). రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాల ఆధారంగా నిర్మించిన సినిమాలలో హిట్లర్ పాత్రధారి ముమ్మూర్తులా ఆ నాజీ నియంతనే పోలి ఉంటాడు. కానీ ఇలాంటి వేషాలన్నీ, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఒకే ఒక్క ముఖానికి అమరిపోతాయి. ఆ బహు ‘ముఖ’ ప్రజ్ఞాశాలి చంద్రశేఖరం (నవంబర్ 10, 1904–మే 29, 1996). చంద్రశేఖరం ప్రతిభ ఎంత నిరుపమానమో ఆవిష్కరించే ఒక అద్భుత వాస్తవాన్ని కూడా చెప్పుకోవాలి. ఆయన గాంధీ, నెహ్రూ, హిట్లర్ల వేషధారణే కాదు, అరవింద్ ఘోష్, రామకృష్ణ పరమహంస, కంచి కామకోటి పీఠం పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, జయేంద్ర సరస్వతి, రమణ మహర్షి, త్యాగరాజస్వామి వంటి భారతీయ ఆధ్యాత్మిక రంగ శ్రేష్టుల వేషధారణ కూడా చేసేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబుల్ కలామ్ ఆజాద్, జకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వంటి రాజనీతిజ్ఞుల ముఖాకృతులని ఆవిష్కరించగలరు. అబ్రహాం లింకన్, లెనిన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి పాశ్చాత్య మహనీయుల రూపాలనీ సంతరించుకోగలరు. రవీంద్రనాథ్ టాగూర్, షేక్స్పియర్, బెర్నార్డ్‌షా వంటి కవివరేణ్యులుగా కూడా కనిపించగలరు. ఇంకా– ప్రపంచ ప్రఖ్యాత మహిళామణులు ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా ముఖాలు కూడా చంద్రశేఖరం ముఖంలో పొటమరిస్తాయి. ఎవరి ముఖం వారిదే కదా! దేని వైవిధ్యం దానిదే కదా! ఒకరివి దయను కురిపించే నేత్రాలు. వేరొకరివి తీక్షణమైన కళ్లు. వేరొకరిది రూక్షవీక్షణం. ఒకరిది కోల ముఖం. వేరొకరివి పెద్ద బుగ్గలు. ఒకరిది చిన్న ముక్కు. మరొకరిది కోటేరు ముక్కు. వేరొకరిది తీర్చినట్టు ఉండే నాసిక. ఒకరిది విశాల ఫాలభాగం. వేరొకరిది చిన్న చిబుకం. ఇంకొరిది బట్టతల. మరొకరివి దీర్ఘకేశాలు. ఒకరిది కట్ మీసం. వేరొకరిది మీసమే లేని మూతి. కొందరిది గోటీ (చిరుగెడ్డం), ఒకరిది దీర్ఘ వెంట్రుకల గెడ్డం... ఈ వైరుధ్యాలన్నీ ఆ ఒక్క ముఖంలోనే కనిపించేవి. పైగా అవన్నీ ప్రపంచ ప్రఖ్యాతుల ముఖాలే. ఆరో ఏడో కాదు, పదో పాతికో కాదు, దాదాపు 90 ముఖాలను చంద్రశేఖరం ఒకే ప్రదర్శనలో, ఒకే వేదిక మీద ప్రదర్శించేవారు. కేవలం మూడు నిమిషాలలో ఐదారు ముఖాలుగా ఆయన ఒక్క ముఖమే మారిపోయేది. ప్రేక్షకులను సమ్మోహనపరిచేది. ఈ ప్రదర్శనలో మరొక మనిషి సాయం ఉండేది కాదు. రంగస్థలం మీద ఆయన ఒక్కరే ఇదంతా నిర్వహించేవారు. ఎలా వచ్చిందీ సమ్మోహన శక్తి? కేవలం ఆహార్యం లేదా మేకప్ కళ మీద పెంచుకున్న పట్టుతోనే అదంతా ఆయన సాధించారు. తాను పుట్టిన నెల్లూరులోనే, వీఆర్ పాఠశాలలో చదువుతున్నప్పుడే చంద్రశేఖరం నట జీవితం ఆరంభమైంది. అక్కడే పీఎన్ రామస్వామి అయ్యర్ అనే ఆంగ్లోపాధ్యాయుడు ఉండేవారు. ఆయన చెప్పిన ఇంగ్లిష్ పాఠాలే చంద్రశేఖరంలోని నటుడికి ఊపిరి పోశాయి. రామస్వామి అయ్యర్ షేక్స్పియర్ సాహిత్యం గురించి చెప్పేవారు. ఆ పాత్రలలో ఒదిగిపోయి, నటిస్తూ బోధించేవారు. ఇదంతా 1924 ప్రాంతం. అప్పుడే నెల్లూరులో ఔత్సాహిక నాటక కళాకారుల బృందంలో కలసి పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. 1929 వరకు సాగిన ఈ ప్రయాణంలో ఆయన ధరించినవన్నీ స్త్రీ పాత్రలే. తరువాత మిత్రులతో కలసి చిన్న చిన్న స్కిట్లు ప్రదర్శించేవారు. ఇవన్నీ సాంఘిక ఇతివృత్తాలు. పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించిన నేపథ్యం వల్ల కావచ్చు, షేక్స్పియర్ నాటకాలలో కూడా స్త్రీ పాత్రలు ధరించే అవకాశం వచ్చిందాయనకు. కింగ్ లియర్, మర్చంట్ ఆఫ్ వెనిస్, మేక్బెత్, ఒథెల్లో నాటకాలలో ఆయన నటించారు. కానీ ఆయన వాచకం ఇంగ్లిష్ జాతీయుల ఉచ్చారణతో పోటీ పడేది. ఆయన ఉన్నత విద్యావంతుడని అంతా అనుకునేవారు. కానీ ఆయనే సందర్భం వచ్చినప్పుడు తాను ఎస్ఎస్ఎల్సీ మాత్రమే చదివానని చెప్పేవారు. చంద్రశేఖరం ఒకవైపు నాటకాలు వేస్తూనే ఏకపాత్రాభినయ ప్రక్రియకు మరలారు. ఇది ఆయన రంగస్థల జీవితంలో పెద్ద మార్పు. ఆ ప్రక్రియలో నుంచి వచ్చినదే బహురూపధారణ.ఆయన కొత్త వేషం కోసం తెర వెనక్కి వెళ్లరు. వేదిక మీదే ఏర్పాటు చేసుకున్న టేబుల్ ఆయన గ్రీన్‌రూమ్ అయిపోతుంది. దాని మీదే మేకప్ సామగ్రి ఉంచుకునేవారు. అప్పటికే ఉన్న వేషం తాలూకు మేకప్‌ను కొద్దిగా మార్చుకుని, కొత్త ముఖంతో ఆయన దర్శనమిచ్చేవారు. ఇందుకు పట్టేది ఒకటి రెండు నిమిషాలు. కానీ ఆ వేషాలలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయేవారు. ఒకసారి ఆయన జకీర్ హుసేన్ వేషంతో వాహిని స్టూడియోలోకి వెళ్లారు. అప్పుడు జకీర్ హుసేన్ ఉప రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఆ విధంగా మందీమార్బలం లేకుండా స్టూడియోలోకి రావడం చూసి కంగుతిన్నారు లోపల ఉన్నవారు. తరువాత సంగతి తెలిసింది. అలాగే ఒకసారి విజయవాడలో టంగుటూరి ప్రకాశంగారి సభ ఏర్పాటయింది. దానికి ఆయన అరగంట ఆలస్యంగా వస్తున్నారని ప్రకటన వచ్చింది. కానీ అంతలోనే వేదిక మీద ప్రకాశంగారు దర్శనమిచ్చారు. జనం ఆశ్చర్యపోయారు. డాక్టర్ చంద్రశేఖరం గారే ప్రకాశం వేషంతో వేదిక ఎక్కారు. సరిగ్గా అరగంట తరువాత అసలు ప్రకాశం గారు వచ్చి వేదిక ఎక్కారు. అప్పుడు తెలిసింది– అంతకు ముందు కనిపించిన ప్రకాశం ఎవరో! నటనను తపస్సుగా స్వీకరించారని కొందరి విషయంలో అంటూ ఉంటారు. ఆ మాట చంద్రశేఖరంగారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన నటన, రంగస్థల నిర్వహణ, ఆహార్యం వంటి అంశాల మీద పుస్తకాలు రాశారు. వాటికి ఆయన పెట్టిన పేర్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ‘నాటక భగవద్గీత’, ‘నాటకోపనిషత్’, ‘నాటక గీతాంజలి’ వంటి పేర్లు పెట్టారాయన. అసలు పాఠశాల స్థాయిలోనే నటనకు అవకాశం ఉండాలని, అది సృజనకు దోహదం చేస్తుందని చంద్రశేఖరం అభిప్రాయం. ఏకపాత్రాభినయ కళ మీద ఆయన రాసిన పుస్తకానికి అలనాటి విద్యావేత్త డాక్టర్ కె. వెంకటసుబ్రమణియన్(పుదుచ్చేరి విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్) ఇచ్చిన ముందుమాటలో ఇదే ధ్వనిస్తుంది. ‘విద్యలోను, మంచి ఉపాధ్యాయుడు తయారు కావడంలోను నాటకం, లలితకళలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఉపాధ్యాయుడు ఏకపాత్రాభినయం రీతిలో పాఠాలు బోధిస్తే అవి విద్యార్థులకు ఎంతో ఆకర్షిణీయంగా, అర్థమయ్యేరీతిలో ఉంటాయి.’ చంద్రశేఖరం కీర్తి భారత సాంస్కృతిక రాయబారి స్థాయికి చేరుకుంది. 1953, 1967 సంవత్సరాలలో చైనా, రష్యాలు పర్యటించిన భారత కళాకారుల బృందానికి ఆయనే నాయకుడు. ఆ బృందాలలో రంగస్థల కళాకారుడు ఆయన ఒక్కరే. చంద్రశేఖరం పదిహేనేళ్ల పాటు ‘రంగజ్యోతి’ పేరుతో పత్రిక కూడా నడిపారు. ఈ పత్రిక ఉద్దేశం కూడా నాటక కళను సజీవంగా ఉంచడమే.ఇంత కృషిలో చంద్రశేఖరం గారికి ప్రభుత్వం నుంచి ఇతర సంస్థల నుంచి దక్కిన చేయూత దాదాపు ఏమీ లేదు. ఈ కృషిలోను ఆయనది ఏకపాత్రే. కానీ వ్యక్తుల వేషధారణ అనే ప్రక్రియకు ఆద్యుడు ఆయనేనని ప్రపంచం కీర్తిస్తున్నది. వేగంగా ఆహార్యం మార్చడమనేది నిశ్చయంగా ఒక విప్లవం. ఆ విప్లవంతోనే ఆయన బహువేషధారణ అనే వినూత్న ప్రక్రియకు జీవం పోశారు. నటన, కళారాధన అంటే చంద్రశేఖరం దృష్టిలో ఒక జీవిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికత పునాదిగా ఉన్న జీవన పరమార్థం కూడా. ఈ ప్రయాణంలో ఆయనకు తల్లిదండ్రులు సుబ్బారావు, సీతాబాయి; భార్య శకుంతలాబాయి చేదోడువాదోడుగా ఉన్నారు. ప్రఖ్యాత గాయని ఎస్. జానకి చంద్రశేఖరంగారి పెద్దకోడలు. ∙డా. గోపరాజు నారాయణరావు -
సంపూర్ణ విప్లవం నేటి అవసరం
1917 రష్యా విప్లవ ఘటనను సైతం బేషరతుగా సంస్మరించలేను. అయితే, దానికి సంబం ధించి కీర్తించదగినదీ ఉంది. అది విప్లవం అనే భావం. విప్లవం ఎలా జరిగిందనే దానితో నిమిత్తం లేకుండా, రష్యా విప్లవం ఒక భావం. మానవులు మునుపెన్నడూ ఎరుగని రీతుల్లో తమ సొంత భవితవ్యాన్ని మలచుకోగలరనే భావం సాధించిన విజయానికి అది మైలురాయి. ఆ స్ఫూర్తితో, 20వ శతాబ్దపు చరిత్ర వెలుగులో విప్లవం అనే భావనను తిరిగి మలచు కోవాల్సిన సందర్భంగానైతే రష్యా విప్లవ శత వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిందే. అసత్యాలతో సంస్మరణ వ్యాసాన్ని రాసేదెలా? నవంబర్ 7 రష్యా విప్లవ శత వార్షికోత్సవం సందర్భంగా నన్ను ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది. ఆ విప్లవ శిశు వైన యూఎస్ఎస్ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్) 70 ఏళ్ల తర్వాత మరణించడం వల్ల తలెత్తిన సమస్య కాదిది. మరణానికి ఎవరూ అతీతులు కారు. చివరకు ఆ సోషలిస్టు ప్రయోగం విఫలం కావడం వల్ల మాత్రమే తలెత్తిన సమస్యా కాదిది. విజయమే ప్రతిదానికీ కొలబద్ధ కాజా లదు. ఆ విప్లవం, విప్లవానంతర రాజ్యం బతికున్న కాలంనాటి, దాన్ని విజ యవంతమైనదిగా పరిగణిస్తున్న కాలం నాటిæహేయమైన వాస్తవమే నిజమైన సమస్య. ఒక వికృత రాక్షసిని సృష్టించిన విప్లవ సందర్భాన్ని ఎలా ఉత్సవంగా జరుపుకోగలం? 1917–1921 మధ్య జరిగిన ఘటనలు తెలిసివచ్చాక కూడా లెనిన్ సహా ఆ విప్లవ నాయకులను ఆదర్శమూర్తులుగా ఎలా కీర్తించగలం? సోవియట్ ప్రభుత్వ పాలనలో కార్మికులను నిర్లక్ష్యం చేసి, రైతాంగాన్ని ఊచ కోత కోశారని తెలిశాక కూడా దాన్ని కార్మికవర్గ విజయంగా ఎలా వర్ణించ గలం? సోల్జినిత్సిన్ రచనలను చదివాక రష్యా విప్లవం ప్రత్యామ్నాయ ప్రజా స్వామ్యాన్ని ఆవిష్కరించిందని చెప్పుకోవడాన్ని మనం ఎలా నమ్మగలం? యూఎస్ఎస్ఆర్కు చెందిన తూర్పు యూరప్ ‘వలసల’ను సందర్శించాక కూడా ఆ విప్లవ వలసవాద వ్యతిరేకతకు ఎలా నీరాజనాలు అర్పించగలం? ఆ వ్యవస్థ నిరంకుశ ప్రభుత్వాధికారాన్ని, అది పాశ్చాత్య అభివృద్ధి నమూ నాను వెర్రిగా అనుకరించడాన్ని చూసిన మనం... ఆ ఆర్థిక నమూనా నుంచి ఎలా ఉత్తేజాన్ని పొందగలం? అందువల్లనే, బహుశా నేను ఆ వ్యవస్థను, సోవియట్ కమ్యూనిజాన్ని కీర్తించలేకపోవచ్చు. 1917 రష్యా విప్లవ ఘటనను సైతం నేను బేషరతుగా సంస్మరించలేను. అయితే, ఆ ఘటనకు సంబంధించి కీర్తించదగినది కూడా ఉంది. అది విప్లవం అనే భావం. విప్లవం ఎలా జరిగిందనే దానితో నిమిత్తం లేకుండా, రష్యా విప్లవం ఒక భావం, మానవులు మునుపెన్నడూ ఎరుగని రీతుల్లో తమ సొంత భవితవ్యాన్ని మలచుకోగలరనే భావం సాధించిన విజ యానికి అది మైలురాయి. ఆ స్ఫూర్తితో, 20వ శతాబ్దపు చరిత్ర వెలుగులో విప్లవం అనే భావనను తిరిగి మలచుకోవాల్సిన సందర్భంగానైతే రష్యా విప్లవ శత వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిందే. చేదు అనుభవాల విప్లవం ఆశ్చర్యకరంగా, విప్లవం అనే భావన పుట్టుకొచ్చినది రాజకీయాల్లోంచి కాదు, భౌతికశాస్త్రం నుంచి. 18వ శతాబ్దిలో ఒక విచిత్రమైన పరివర్తన జరిగింది. అది భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తుండటమనే విప్లవాత్మక ఆలోచన నుంచి మానవులు తాము కోరుకున్న గమ్యానికి చేరుకోవడమనే విప్లవ భావన వరకు జరిగిన పరివర్తన. మొట్టమొదటిసారిగా 1789 ఫ్రెంచ్ విప్లవం నేప థ్యంలో ప్రయోగించిన విప్లవం అనే ఈ నూతన భావనలో నాలుగు విభి న్నమైన భావాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది అస్తిత్వంలో ఉన్న సామాజిక ఆర్థిక క్రమం ఇలాగే శాశ్వతంగా నిలిచిపోబోవడం లేదు. మౌలికంగా భిన్న మైన వివిధ రీతుల్లో దాన్ని మార్చగలం, మార్చాలి. ఈ మార్పు హఠాత్తుగా బద్దలు కావడంగా సంభవించగల అవకాశం ఉంది. పాత వ్యవస్థ ఏదో ఒక రోజుకు పతనంగాక తప్పదు. సరికొత్త జీవన విధానానికి ప్రాతిపదికను సమకూర్చే కొత్త వ్యవస్థను నిర్మించాల్సి ఉంటుంది. అలాంటి నాటకీయమైన మార్పు తనంతట తానుగా వచ్చేది కాదు. ఆ మార్పును తేగలిగేది, తేవా ల్సినది మనుషులే. అందుకు ప్రజలను సమీకరించడం, సమష్టి కార్యాచరణ అవసరం. అంతేకాదు, ఈ మార్పునకు అవసరమైన రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి సాధారణంగా హింసాత్మక కార్యాచరణ అవసరం. ఇకపై ప్రతి మనిషి, ఎవరైనాగానీ ఈ మార్పును తెచ్చే కర్తలు కావచ్చు. విప్లవానికి అగ్రగామిదళం అవసరం. అది, ఒక విప్లవ రాజకీయ పార్టీ ప్రాతి నిధ్యం వహించే కార్మికవర్గమే. నేర్పిన గుణపాఠాలు విప్లవం గురించిన ఈ అవగాహనే రష్యా విప్లవంలో ఇమిడి ఉంది. అది, యూరప్ ఖండపు 18 వ శతాబ్దపు చరిత్ర నుంచి స్వీకరించగా, 19 వ శతాబ్దపు చరిత్ర నుంచి వృద్ధి చెందినది. 20వ శతాబ్దపు విప్లవాల నిజ జీవిత అను భవం.. రష్యా, క్యూబా, వియత్నాం, కంబోడియా విప్లవాల అనుభవం ఉత్సా హాన్ని రేకెత్తించడం నుంచి భయకంపితులను చేయడం వరకు రకరకాలుగా ఉంది. ఈ 20వ శతాబ్దపు అనుభవం రష్యా విప్లవ భావన గురించి కొన్ని గుణ పాఠాలను నేర్పింది.ఒకటి, విప్లవాత్మక పరివర్తన గమ్యం ఒకే దిశగా సాగే మార్పు కాదు. విప్లవ పరివర్తన ప్రధాన లక్ష్యం ఆర్థికపరమైనది మాత్రమే అనేది మార్క్సిస్టు సైద్ధాంతిక ఆలోచన. 20వ శతాబ్దం ఈ ఆదర్శాన్ని విశాల ప్రాతిపదికగలదిగా మార్చింది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మార్పును అందులో భాగం చేసింది. జైప్రకాష్ నారాయణ్, మానవ జీవితంలోని అన్ని రంగాలకు చెందిన ఈ సంపూర్ణ విప్లవం అనే భావనను ఆవిష్కరించారు. రెండు, విప్లవం, హఠాత్తుగా, నాటకీయంగా బద్దలై జరుగుతుందనే భావన నుంచి దాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉంది. మౌలికమైన మార్పు రాత్రికి రాత్రే జరగాల్సిన అవసరం ఏమీ లేదు. నిలకడగా నిలవగలిగిన మార్పు ఏదైనా సాధారణంగా క్రమక్రమంగానే జరుగుతుంది. ఈ వ్యవస్థను ఒక్కొక్క ఇటుకగా మారుస్తూ రావాలి.మూడు, విప్లవం హింసాత్మకమైనదే కావాల్సిన అవసరమేమీ లేదు. విప్లవాత్మకమైన మార్పు సాఫీగా జరిగిపోయేదేమీ కాదని 20వ శతాబ్దపు అనుభవం చెబుతుంది. స్వీయ ప్రయోజనాలుగల శక్తుల ప్రతిఘటనను విప్లవకారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఆ సంఘర్షణ హింసాత్మక మైతే... ప్రజల పేరిట జరిగే విప్లవం ఆ ప్రజలకే వ్యతిరేకమైనదిగా మారే అవకాశం ఉంది.నాలుగు, విప్లవ అగ్రగామిదళం అనే భావనను విyì చిపెట్టాల్సిన అవ సరమేమీ లేదు. కాకపోతే ఏ ఒక్క వర్గమో చరిత్ర ఎంచుకున్న సాధనం కాదు. ఒక పార్టీయే విప్లవానికి పరిరక్షణ వహించేదిగా మారడం అంటే అది వినా శనానికి బీజం వేయడమే.చివరగా, విప్లవ కార్యాచరణకు రంగస్థలిగా యూరప్ మీది నుంచి మన దృష్టిని మరల్చుకోవాలంటూ 20వ శతాబ్దం మనకు ఆహ్వానం పలికింది. విప్లవం అనే ఆధునిక భావన పుట్టింది యూరప్‌లోనే. కాబట్టి విప్లవం ముందుగా యూరప్‌లో జరుగుతుందని, ఆ తర్వాత మిగతా చోట్ల పునరా వృతమౌతుందని అనుకోవడం సహజమే. 20వ శతాబ్దపు రెండో భాగం ఈ ఊహాత్మక ప్రమేయాన్ని తలకిందులు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర యూరప్... విప్లవాలు జరగడానికి అతి తక్కువ అవకాశం ఉన్న ప్రాంతంగా మారింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మొదలైన ప్రపం చంలోని ఇతర ప్రాంతాలపైకి ఇప్పుడు దృష్టి మళ్లింది. మరో ప్రపంచం సాధ్యమే 20వ శతాబ్దంలో విప్లవం అనే భావనలో వచ్చిన మార్పుల తర్వాత విప్లవం అనే ఆ భావంలో ఇంకా ఏమైనా మిగిలే ఉందా? ఉందనే అనుకుంటున్నా. రాజకీయ మౌఢ్యాన్ని కోల్పోయినా విప్లవం అనే భావంలోని మూల సారం ఇంకా మిగిలే ఉంది. మరో ప్రపంచం సాధ్యమే, దాన్ని మనం నిర్మించగలం అనేదే అది. రష్యా విప్లవం నుంచి 21వ శతాబ్దానికి వారసత్వంగా సంక్ర మించిన మౌలిక సారాంశ భావం అదే. ఈ సవరించిన విప్లవం అనే భావ నకు మనం స్వయంగా చేయాల్సిన దోహదం ఏమిటి? విప్లవం అనే భావాన్ని 21వ శతాబ్దం మూడు దిశలకు తీసుకుపోవచ్చని అనుకుంటున్నా.మొదటగా మనం, విప్లవానికి ముందుగా నిర్దేశితమైన లక్ష్యం ఉంటుం దనే భావంతో తెగతెంపులు చేసుకోవాలి. విప్లవాన్ని, అది సాగే క్రమంలో తన గమ్యాన్ని తాను అన్వేషించుకునేదిగా, పరివర్తన చెందించుకునేదిగా చూసి తీరాలి. రెండు, విప్లవం అనే భావన రాజకీయాలలోకి ప్రవేశించడంపై ఆధార పడినదిగా చూడటం. ఈ దృష్టి, రాజకీయ పార్టీ పట్ల, ఆధునిక రాజ్యం విప్ల వాత్మక మార్పునకు సాధనంగా చూడటం పట్ల వ్యామోహాన్ని పెంచింది. మార్పునకు ఇతర సాధనాలను గుర్తించే దిశగా మనం సాగాలి లేదా రాజ కీయాల పట్ల మన అవగాహననే మార్చుకోవాలి.చివరగా, విప్లవం గురించిన యూరోపియన్ భావన కేవలం బాహ్య మైన మార్పుపైనే దృష్టిని కేంద్రీకరించింది. మనిషి, మనిషి అంతరాత్మ కూడా విప్లవానికి సంబంధించి అంతే ముఖ్యమైన లక్షణంగా మనం జోడించాలి. ఇవన్నీ కలసి నా ప్రతిపాదనను చాలా తీవ్రమైనది, కలవరపరిచేది అనిపిం చేలా చేయవచ్చునేమో. కానీ, విప్లవమే అలాంటిది. విప్లవం అనే భావనలో విప్లవాన్ని తీసుకురావడమే రష్యా విప్లవానికి అత్యుత్తమ సంస్మరణ. - వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 - యోగేంద్ర యాదవ్ -
నాలో విప్లవ విత్తనాన్ని నాటింది రైతే
► చర్చా వేదికలో కమల్‌హాసన్ తమిళసినిమా (చెన్నై): తనలో విప్లవ విత్తనాన్ని నాటింది రైతే అని నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఇటీవల తమిళ రాజకీయాల్లో కమల్‌హాసన్ కీలకంగా మారారు. తమిళనాడులో అవినీతి పాలన నడుస్తోందని ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్నే రేపాయి. పని చేయని శాసనసభ్యులకు జీతాలు ఇవ్వరాదంటూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయరంగ ప్రవేశం తథ్యమని ప్రకటించి తమిళనాట ప్రకంపనలు పుట్టిస్తున్న కమల్ ఆదివారం చెన్నైలో జరిగిన ఒక చర్చా వేదికలో పలు విషయాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులనే వారు పోరాడేవారే కానీ, ఆకలితో మరణించేవారు కాదన్నారు. ‘అనూహ్యంగా నా కోపానికి కారణం ఏమిటి.. 62 ఏళ్ల వయసులో రాజకీయ ఆశ ఎందుకు? కూతుళ్లకు ఆస్తులు కూడబెట్టడానికా? అవినీతి గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.. అప్పుడేమయ్యారు? అని అడగవచ్చు. అప్పట్లో నాకు భయం ఉండేది. ఇప్పుడు ధైర్యం వచ్చింది’’ అని కమల్ పేర్కొన్నారు. -
విప్లవం–విపత్తు
కృత్రిమ మేధస్సు, రేపటి మాట కాదు, ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లేదా కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించడం, మన అదుపు తప్పిపోవడం భవిష్యత్తులో ఎన్నడో జరగబోయేది కాదు, కాల్పనికత అంతకన్నా కాదు, వర్తమాన వాస్తవం. కృత్రిమ మేధ మాన వాళిని శాసించేదిగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన చాలా కాలంగానే వ్యక్తం అవుతోంది. అలాంటి భయాలు నిరాధారమైనవని కొట్టి పారేసే వారిలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ ఒకరు. ఫేస్‌బుక్‌కు చెందిన రెండు చాట్ బోట్లు (సంభాషణలు సాగించగల కృత్రిమ మేధో సాధనాలు లేదా ఏజెంట్లు) ఇంగ్లిష్‌కు బదులు అంతుబట్టని భాషను సృష్టించుకుని మాట్లాడుతూ కనబడటంతో జుకెర్ బర్గ్ సహా ప్రపంచమంతా ఉలిక్కిపడాల్సి వచ్చింది. సదరు బోట్లను షట్‌డౌన్ చేసి, ఇకపై అవి ఇంగ్లిష్‌లోనే మాట్లాడేటట్టు శాసించారు. కృత్రిమ మేధస్సు మన దేశంలో ఇంకా మనిషి చెప్పిన పనులను చేసే దశలోనే ఉన్నా, అభివృద్ధిచెందిన దేశాల్లో అది తనంతటతానుగా నిర్ణయాలు తీసుకునే దశలోకి ప్రవేశించింది. భావి పర్యవసానా లపై అంచనాలు లేకుండా పెంపొందుతున్న ఆ మలి దశ కృత్రిమ మేధస్సు అభి వృద్ధికి ఉన్న పరిమితులు, ప్రమాదాలపై చర్చను ఫేస్బుక్ ఘటన మళ్లీ ముందుకు తెచ్చింది. కృత్రిమ మేధో సాధనాలు సొంత ప్రోగ్రామింగ్ భాషలను తయారు చేసుకునే స్థాయికి చేరితే ఎలా? అనేది పెద్ద ప్రశ్నార్థకమై నిలిచింది. అయినా కృత్రిమ మేధస్సు ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించి, మనకు తెలియకుండానే మన జీవనశైలిని ఊహించని రీతిలో మార్చేస్తోంది. గూగుల్, తక్షణమే కోరిన సమాచారాన్ని ఇవ్వగలగడానికి కారణం అదేనని తెలియని వారే ఎక్కువ కావచ్చు. 2014లో ప్రమాదకరమైన ఈ–మెయిల్స్‌ను పంపే ఒక మాల్వేర్ కొందరు వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కసారి లక్ష ఈ–మెయిల్స్‌ను పంపిస్తూ దాడి చేసింది. సదరు మాల్వేర్, ఇంటర్నెట్కు అనుసంధానితమైన లక్షకు పైగా సాధనాలను ‘ఉపయోగించుకుని’ తనకు తానుగా ‘బోట్ నెట్’ను తయారు చేసుకుంది. వాటిలో 25 శాతమే కంప్యూటర్లు, మిగతావన్నీ స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌ల వంటివే. 2020 నాటికి మానవ జోక్యం అవసరంలేని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ (ఐఓటీ)కు అనుసంధానితమయ్యే ఇలాంటి స్మార్ట్ వస్తువుల సంఖ్య 21.2 కోట్లకు చేరుతుందని అంచనా. వీటిలో ప్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, హోమ్ థియేటర్లు, సోలార్ హీటర్లు మొదలైన వాటి నుంచి కార్లు, నౌకలు, విమానాలు, ఎలక్ట్రిక్ గ్రిడ్ల వరకు సర్వం ఉంటాయి. ఇక రోబోలు వస్తుతయారీ రంగం నుంచి యుద్ధరంగానికి విస్తరించి, ఇంటింటి వస్తువులుగా మారుతున్నాయి. మానవ జోక్యం అవసరం లేకుండా స్వతంత్రంగా సరైన నిర్ణయాలను తీసుకోగల సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించే లక్ష్యంతోనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితంగా కృత్రిమ మేధస్సు మన ఊహకు అందనంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ఇళ్లను, కార్యాల యాలనే కాదు, దేశాలను, ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కృత్రిమ మేధో సాధనాలన్నిటి అభివృద్ధి లక్ష్యం, అవి తమంతట తాముగా నిర్ణయాలను తీసుకోడానికి వీలుగా తమను తాము అభివృద్ధి పరచుకునేలా చేయ డమే. ‘దోషులు’గా నిలిచిన చాట్ బోట్లు రెండూ ఆ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తూనే ‘పట్టుబడ్డాయి’. ఒక్కొక్క ఇంగ్లిష్ వాక్యాన్ని ఒక బోట్ మరో బోట్‌కు చేర వేయడానికి బదులు, ఒక్కో వాక్యాన్ని ఒక సంకేతంగా లేదా ఒక్కో పదంగా గుర్తిస్తూ ‘మాట్లాడుకుని’ అవి తమ పని వేగాన్ని, సమర్థతను పెంచుకునే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధస్సు స్వయం పరిపూర్ణతను సాధించేలా చేసి, సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించాలని కోట్ల డాలర్లను కుమ్మరిస్తున్న జుకెర్ బర్గ్‌ల కలలను నిజం చేయడానికి రెండు బోట్లు చేసిన చిన్న ప్రయత్నమే బెంబే లెత్తించడం విశేషం. ఇది, నేటి ఐటీ పరిశ్రమలోని కృత్రిమ మేధో విభాగం అభివృద్ధి క్రమంలో ఉన్న పరస్పర విరుద్ధత. కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నవి బహుళజాతి కార్పొరేషన్లు, సైన్యం మాత్రమే. కృత్రిమ మేధస్సు అభివృద్ధి ఏ మేరకు సమాజ హితానికి తోడ్పడుతుంది? ఎలాంటి ఆంక్షలు అవ సరం? అనే సామాజిక, నైతిక విలువలకు, ప్రాధాన్యాలకు సంబంధించిన సమ స్యలు వాటికి పట్టవు. ఫ్రిజ్ తనంతట తానుగా కూరగాయలు, పాలు వగైరాలను లెక్కగట్టేసి, అయిపోతున్నాయంటే తెప్పించి, సర్దించేయడం నిజంగా అవసర మేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరు ఎలా చెప్పినా, చెప్పకున్నా.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజా నివేదిక ప్రకారం 2020 నాటికి 15 అభివృద్ధి చెందిన దేశా లలో కనీసం 50 లక్షల ఉద్యోగాల నైనా రోబోలు, ఆటోమేషన్ హరిస్తాయి. ఐఎల్ఓ తాజా అంచనా ప్రకారం కంబోడియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాంలలో 13.7 కోట్ల కార్మికులను లేదా 56 శాతం మొత్తం శ్రామికశక్తిని రోబోలు తొలగించే ప్రమాదం ఉంది. రోబోలు మా ఉద్యోగాలను హరించివేస్తు న్నాయి, మేం అప్పుడే వాటికి సిద్ధంగాలేమని అమెరికాలోనే మూడింట రెండు వంతుల మంది గగ్గోలు పెడుతున్నారు. వీటన్నిటితో ఉన్న ముప్పును ముందుకు తెచ్చి మరీ చూపే వారికి కొదవ లేదు. అట్టహాసంగా ప్రవేశించిన డ్రైవర్‌లేని కార్లను హ్యాకర్లు అతి సులువుగా హ్యాకింగ్ చేసేశారు. రోబో సైనికులు అమాయకులను హతమార్చిన వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అమెరికా సహా వివిధ దేశాల రక్షణ శాఖలకే హ్యాకర్ల సవాళ్లు తప్పడం లేదు. ఎన్ని సదుద్దేశాలతో రూపొందించిన సూపర్ ఇంటెలిజెన్స్ అయినా అవాంఛనీయ వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో పడ కుండా ఉంటాయన్న హామీ లేదు. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలలో అత్యధికులు కృత్రిమ మేధస్సుతో ఉన్న భద్రతాపరమైన సమస్యల గురించి భయా లను వ్యక్తం చేస్తూనే, వాటివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. తమ భద్రతనే కాదు, ప్రపంచం భద్రతనే గాలికొదిలి సాగుతున్న కృత్రిమ మేధస్సు అభివృద్ధిపై ఎవరు, ఎలాంటి ఆంక్షలు విధించాలో చెప్పేవారు లేరు, చెబితే వినేవారూ లేరు. ఈ సాంకేతిక విప్లవం పరిమితులు, విపరిణామాలపైకి, అవసరమైన ఆంక్షలపైకి అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా దృష్టి సారిస్తుందా? -
నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
-
నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
జల్లికట్టును అనుమతించాలంటూ చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నది కేవలం నిరసన కాదని, అదో విప్లవమని కోలీవుడ్ హీరో విశాల్ అన్నాడు. చెన్నై మెరీనా బీచ్‌లో వినిపిస్తున్న గొంతులు కేంద్రాన్ని చేరుకోవాలని, అప్పుడైనా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని అన్నాడు. జల్లికట్టుకు అనుమతి కోసం చెన్నైలో మొదలైన నిరసన ప్రదర్శనలు.. ఢిల్లీ వరకు వెళ్లాయి. ప్రస్తుతం చెన్నైలో సినిమా షూటింగులు కూడా ఆపేయడంతో పలువురు నటులు ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నం చేశారు. సీఎం వరకు మోదీ అపాయింట్మెంట్ దొరికినా, పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్‌కు మాత్రం దొరకలేదు. దాంతో ఆయన ప్రధాని అధికారిక నివాసం ముందు బైఠాయించారు. మోదీ తనకు సమయం ఇవ్వలేదని, ఆయన తనను కలిసేవరకు ఇంటి బయట కూర్చోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని రాందాస్ అన్నారు. అయితే.. మోదీ ఇంటి ముందు బైఠాయించిన ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. -
ఇదొక విప్లవం.. త్వరలోనే తెలుస్తుంది: నటి
ముంబై: ‘ఇదొక విప్లవం. భారతదేశ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయగల గొప్ప నిర్ణయం. మార్పు జరిగి ఇంకా నెల రోజులే కదా కావస్తోంది. మున్ముందు అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. అవి అందరికీ అనుభవంలోకి వస్తాయి. తద్వారా జీవితాలు సుఖమయం అవుతాయి’ అంటూ నోట్ల రద్దు నిర్ణయాన్ని తెగ పొగిడేసింది నటి సోనాలీ కులకర్ణి. శుక్రవారం ముంబైలో ఓ ప్రీమియం స్పా ప్రారంభోత్సవానికి వచ్చిన సోనాలీ విలేకరులతో మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సుహృద్భావంతో అర్థం చేసుకున్నారని, కార్డులు, పేటీఎంలను వినియోగిస్తూ క్యాష్ లెస్ దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు ప్రేక్షకులు సినిమా చూడాలంటే లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడలాంటి శ్రమలు పడాల్సిన అవసరం లేకుండా మొబైల్స్ ద్వారా సులువుగా టికెట్లు పొందొచ్చని తెలిపారు. ఈ విషయాన్ని పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రేక్షకులకు వివరిస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దు ప్రజల జీవితాలను సులభతరం చేస్తుందని, కొంత ఆలస్యంగానైనా ఏదో ఒక సమయానికి అద్భుతమైన మార్పులు చవిచూస్తామని సోనాలి కులకర్ణి అన్నారు. ప్రస్తుతం మరాఠీలో మూడు, బాలీవుడ్ లో రెండు, ఒక గుజరాతీ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. తనకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇంతకు మించి ఏదీ కోరుకోవాల్సిన అవసరంలేదని సోనాలి వ్యాఖ్యానించారు. -
ఉద్యమ పాదంపై పుట్టుమచ్చ
...థర్టీ ఇయర్స్ రివల్యూషన్! ఉద్యమం చేయడం ఎంత నిజమో... నిజం చెప్పడం అంతే ఉద్యమం! నారాయణమూర్తికి... నిజం అంటే ఏంటి? ఉద్యమం అంటే ఏంటి? మనసులో మాట... పెదాల మీద ఉంటే అదే నిజం! అదే ఉద్యమం అంటాడు. సత్యవాక్కు పలికేవాడు... సత్యపథం పట్టక మానడు కదా! సిల్వర్ జూబ్లీ సినిమాలిచ్చినా, కోట్ల కలెక్షన్లు కొట్టినా ఇప్పటికీ... షేర్ ఆటోలో తిరుగుతాడు. కాలిబాట పడతాడు. మరి అదే కదా.. సత్యపథం! గాంధీ ఉద్యమంలో... ‘అహింస’ సత్యాగ్రహం అయితే... ఆర్. నారాయణమూర్తి గుండెల్లో... ‘విప్లవం’ సత్య ఆగ్రహం. నిప్పులా రగిలే సత్యం... జ్వాలలా ఎగసిపడే ఆగ్రహం. తెర మీద బొమ్మ పడింది! అదిగో... నారాయణమూర్తి నడుచుకుంటూ వస్తున్నాడు.ఆ ఉద్యమపాదంపై ప్రజలు పెట్టిన కాటుక చుక్కే ఈ పుట్టుమచ్చ. ఆడియన్స్... ఈలలు, చప్పట్లు, కేరింతలు... ఎర్రటి విప్లవంలా తెర మీద భగభగమండుతున్నాడు. ఇదిగో... ఈ ఇంటర్వ్యూలో... అలాగే మాట్లాడుతున్నాడు.భగ భగ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే. ‘అర్ధరాత్రి స్వతంత్రం’తో హీరోగా మొదలై, ఇప్పటికి 30 ఏళ్లయింది. సంపాదించింది ఎంత? పోగొట్టుకున్నది ఎంత? ఆర్. నారాయణమూర్తి: 30 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సమస్యలే నా సినిమాలు. కార్మిక, ఆదివాసీ, దళితుల, స్త్రీ, రైతు, భూ పోరాటం.. ఇలా ఎన్నో విషయాలపై సినిమాలు తీస్తున్నా. పోగొట్టుకున్నది ఏం ఉంటుంది? ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నా కాబట్టి, అభిమానం సంపాదించుకున్నా. 30 ఏళ్లయ్యాయని గుర్తు పెట్టుకుని, ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ వచ్చిందంటే, అది నేను సంపాదించుకున్నదే. సమస్యల్ని చూపిస్తే మార్పొస్తుందా? మార్పు అనేది వస్తుంది. సమాజం గ్యారంటీగా మారుతుంది. మార్పు కోసం డాక్టర్, సైంటిస్ట్, కార్టూనిస్ట్, పొలిటిషీయన్, మీ జర్నలిస్టులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో పోరు చేస్తారు. కళాకారుడిగా నేను నా సినిమాల ద్వారా మార్పు కోసం ఫైట్ చేస్తున్నా. నా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ చూసి ఎందరో ఉద్యమబాట పట్టారు. ‘ఎర్రసైన్యం’ చూసి భూపోరాటం చేశారు. ‘దండోరా’ చూసి సారాకొట్లు బద్దలు కొట్టారు. అది మంచి మార్పేగా. గాంధీ ‘శాంతి’ అంటే మీవి పోరాటం వైపు మళ్లిస్తున్నాయి... మళ్లిస్తున్నాయంటే పొరపాటు. ఒక్క గాంధీ వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదుగా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పోరాటం చేయమన్నారు కదా. ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రం. ఓ విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అభివృద్ధి పేరు చెప్పి, ఇండస్ట్రియలైజేషన్ చేసేస్తున్నారు. అంతా మలినం. రొయ్యల వ్యాపారానికి గండిపడింది. పర్యావరణం నాశనం. భూములు లేకుండా పోయాయి. రైతుల పరిస్థితేంటి? ఉద్యమాలు చెయ్యాలా? వద్దా? చేసినా పోలీసులు కొడుతుంటే తిరుగుబాటు చేయరా? చేయకపోతే ఆ వాయిస్ ఎలా తెలుస్తుంది? మీ ఆర్థిక లావాదేవీలన్నీ వైట్‌లోనే ఉంటాయా? సీ మై ఫ్రెండ్... ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘వేగు చుక్కలు’ వరకూ 20 ఏళ్లపాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. అది చూసి కొంతమంది ఇలాం టివి తీశారు. ఒకటీ రెండు తీశాక మొనాటనీ వచ్చిందని మానేశారు. నేను మాత్రం తీస్తూనే ఉన్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి సక్సెసవుతున్నా. మొదట్నుంచీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్, డెరైక్షన్, మ్యూజిక్ - అంతా నేనే కాబట్టి, బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. సినిమా రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. ‘ఆల్ వైట్.. నో బ్లాక్’. మొనాటనీ అని కొంతమంది మానేశారన్నారు. మరి ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు తీస్తే.. మీకు విసుగు రాలేదా? నా బతుకు ఇంతేనా? మార్పు లేదా? అనే ఆలోచన ఏ మనిషి మనసులోనైనా వస్తే, అతడికి విసుగొస్తుంది. అప్పుడు ముందుకు సాగలేడు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా తల్లిపై ఉన్న అభిమానం, ఆరాధన, ఇష్టం, గౌరవం తగ్గలేదు. సినిమాలపై అయిష్టం రాలేదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువా? ఆటోల్లో తిరుగుతుంటారు. కారుల్లో తిరిగినా మిమ్మల్ని అడిగేవాళ్లు ఎవరుంటారు? అవును. ఎందుకు అడుగుతారు? సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్‌లో కూడా నాకు రెండు జతల బట్టలే. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు. డాక్యుమెంట్లు లేవు. చాప, దిండు మాత్రమే. డబ్బులు తేనప్పుడూ నా దగ్గర ఉండేది చాపా, దిండూనే. ఊళ్లో బంగ్లా, స్థలాలు కొన్నారని విమర్శ. దానికేమంటారు? ఓసారి మా ఊరు వెళ్లండి. నేను చేసిన మంచి పనులు కనిపిస్తాయి. ఆస్పత్రి కట్టించా. విద్యాలయాలకు డొనేట్ చేశా. పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. ఆంధ్ర, తెలంగా ణాల్లో బోర్లు వేయించా. కానీ ఎక్కడా చెప్పుకోను. మీర న్నట్లు మా ఊళ్లో నా సంపాదన ఉందనుకుంటే.. బంగ్లా కట్టించానేమో చూడండి. మా అమ్మా నాన్న ఏ ఇంట్లో ఉన్నారో చూడండి. రీసెంట్గా మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకతే ఉంది. ఊళ్లో నాకు ఎకరం స్థలం లేదు. థియేటర్లు లేవు. దొంగచాటు వ్యాపారాలేవీ చేయట్లేదు. ఒకవేళ మీరన్నది నిజమైతే ఇక ‘సాక్షి’ నన్ను ఇంటర్వ్యూ చేయొద్దు. ‘ప్రజల్ని మోసగిస్తూ, పేదోడిలా నటిస్తున్న నారాయణమూర్తి’ అని హెడ్‌లైన్స్ పెట్టి రాయండి. నేను చెప్పినది కరెక్టని భావిస్తే, ‘ఎలా చెబుతున్నాడో అలానే బతుకు తున్న ఆర్. నారాయణమూర్తికి సెల్యూట్’ అని రాయండి. మీ సినిమాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కానీ... సమాజం అందుకు దాదాపు విరుద్ధంగా ఉంటోంది. యస్.. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరుగుతోంది. యువత ఆ సంస్కృతికి అలవాటు పడడం, ఆకర్షితులు కావడం సహజం. అంతెందుకు? విశాఖ బీచ్‌లో లవర్స్‌ను ఆహ్వానిస్తున్నారంట. దేశ, విదేశీ ప్రేమికుల ముద్దులాట, కౌగిలింతలను చూసి, ఎంజాయ్ చేయమంటారా? ఎంత దుర్మార్గమైన చర్య. మనకి ఆ సంస్కృతిని అలవాటు చేయడమే కదా! ఓసారి హైదరాబాద్‌లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో నడుస్తుంటే.. ఓ అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే, ‘హగ్ కల్చర్’ అట. ‘నీది ఏ దేశం?’ అనడిగా. హైదరాబాదే అని చెప్పింది. ఈ హగ్ కల్చర్, ముద్దులు, ఇవన్నీ మనకు కాదు, యూరోపియన్లకు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే ఎంత భ్రష్టు పడుతుంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన బీచ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్నా. అందాల పోటీలూ డబ్బు కోసమే. ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎలాగైతే మానవ సంబంధాల్ని కోల్పోతున్నామో, అలాగే వెస్ట్రన్ కల్చర్‌తో మన సంస్కృతి, భాషలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. రేపులు, గట్రా పెరగడానికి యూరోపియన్ కల్చర్ ప్రభావమే కారణం. చిన్నపిల్లలతో టీవీల్లో డ్యాన్సులు ఏంటమ్మా? పసిపిల్లలకేం తెలుసు? చివరికి వాళ్లు ఈ సంస్కృతికి అలవాటు పడతారు. మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా? కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ పిలిచింది. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళితే.. సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడు మనకిచ్చిన వరంగా ఫీలవ్వాలి. నిద్ర, తిండి మినహాయిస్తే మిగతా టైమంతా జనం కోసమే ఆలోచించాలి. ఓ కాలు సినిమా పడవపై, మరో కాలు రాజకీయమనే పడవపై వేసి ప్రయాణించలేను. నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తినీ కాను. ‘అయామ్ ఎ కామన్ మ్యాన్’. ప్రజల పార్టీ వ్యక్తిని. రాజకీయాల్లోకెళ్తే పొల్యూట్ అవుతామేమోనని భయమా? మీరు మీరుగా ఉన్నప్పుడు ఎవరూ మార్చలేరు. మరోలా ఉండాలనుకున్నప్పుడు మారిపోతారు. అది వాళ్ల వీక్నెస్. సినిమాల్లోకి, పాలిటిక్స్లోకెళితే నాశనమవుతారనేది కరెక్ట్ కాదు. ఓ కమిట్మెంట్తో నిజాయతీగా ఉన్నవాణ్ణి, ఉండాలనుకునేవాణ్ణి ఏదీ ప్రభావితం చేయలేదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నేనేమైనా మారానా? తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చారు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మీ అభిప్రాయం? 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎన్టీఆర్‌గారు ధైర్యంగా ‘నేను సమైక్యాంధ్రా’ అన్నారు. అది ఆయన క్యారెక్టర్. 1972లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఇండస్ట్రీ అంతా సెలైంట్‌గా ఉంటే.. కృష్ణగారు ధైర్యంగా ముందుకొచ్చి ‘జై ఆంధ్రా’ అన్నారు. అది కృష్ణగారి క్యారెక్టర్. ఇప్పుడు నేను ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అన్నాను. ఇది నా క్యారెక్టర్. తెలంగాణ అనేది ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన ఉద్యమం అని నమ్మినవాణ్ణి. అందుకే, మద్దతుగా నిలిచా. విడిపోతే, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతాయని ఉద్యమానికి మద్దతిచ్చా. అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు హ్యాపీ. అయితే... ఈ రెండు రాష్ట్రాలను విభజించిన యూపీఏ ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మొదట్నుంచి తెలంగాణ కోరుకుంటున్న బీజేపీ, వెంకయ్య నాయుడు కూడా ప్రతేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాలన్నారు. ఎన్నికల ముందు తిరుపతి సభలో మోదీగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎన్నికల్లో మోదీ నెగ్గారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? రాజ్యాంగం ప్రకారం, గత ప్రభుత్వం (యూపీఏ) ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ‘ప్రత్యేక హోదా వస్తే మీకు లాస్. ప్యాకేజీ ఇంపార్టెంట్’ అంటూ మీడియా సహాయంతో ఊదరగొడుతున్నారు. మాట తప్పడం మహా దుర్మార్గం. పాలకులకు ప్రజలంటే భయం, భక్తులు ఉండాలి. లేనప్పుడు మోనార్కిజం వస్తుంది. ఇప్పుడు మోనార్కల్లా ప్రవర్తిస్తున్నారు. వెంకయ్యనాయుడి మాటలు, చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయకపోవడం కరెక్ట్ కాదు. పలు మీటింగుల్లో ప్రత్యేక హోదా కావాలని నేనూ చెప్పా. ఈరోజు ముఖ్యంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డిగారు బీభత్సంగా ఫైట్ చేస్తున్నారు. హోదా కోసం ఫైట్ చేస్తున్నవాళ్లందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఇప్పుడు బయటి బేనర్లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా చేస్తున్నారు. సడన్‌గా బయట సినిమా చేయడానికి కారణం? యాక్టర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనుంది. యాక్టింగ్ పిచ్చితో మద్రాస్ వెళ్లినోణ్ణి. గతంలో పలువురు మిత్రులు మంచి వేషాలు ఆఫర్ చేశారు. కానీ, మొనాటనీ ఉంటే జనాలు సినిమా చూడడం మానేస్తారు. అది బ్రేక్ చేస్తూ డిఫరెంట్ వేషాలు వేయాలనుంది. ఇప్పటి వరకూ ఉద్యమకారుడు, రైతు, కార్మికుడు, నిరుద్యోగి, రిక్షావోడు, దళితుడు - ఇలా అనేక వేషాలు వేశా. ఇప్పుడు కానిస్టేబుల్, ప్యూన్, జవాను, గుమస్తా, బక్కరైతు, కులవృత్తులకు సంబంధించిన హీరో పాత్రలు చేయాలనుంది. దేవుడి దయ వల్ల ఆర్.నారాయణ మూర్తి అనే మార్క్ వచ్చింది. ముసలోణ్ణి అయినా ‘త్రిశూల్’లో దిలీప్‌కుమార్, ‘శంకరాభరణం’లో సోమయాజులుగారి తరహాలో నటిస్తా. ఏ మనిషికైనా తన అర్హత, అనర్హతలు ఏంటో ఇతరుల కంటే తనకే బాగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో మహా అయితే మరో నాలుగైదేళ్లు ఉంటా. అప్పటివరకూ నటిస్తా. ‘నా రాజ్యానికి నేనే రాజు’ అనేది నా పాలసీ. హ్యాపీగా ఉండాలంటే... అమ్మానాన్నలను మించిన దైవం లేదు. పిల్లలకు వాళ్ల తల్లితండ్రులు, తల్లితండ్రులకు వాళ్ల పిల్లలు గొప్పోళ్లు. మా అమ్మానాన్నలు పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లు. చిన్నప్పటి నుంచి కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్లడం, దెబ్బలు తినడమే నా పని. మళ్లీ ఉద్యమాల్లోకి వెళ్లేవాణ్ణి. వాళ్ల జీన్స్ నాలో ఉండడమే ఈ ప్రవర్తనకు కారణం అనుకుంటున్నా. నేను నా యాంగిల్లో వెళ్తున్నాను. మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. మన అంతరాత్మ ప్రకారం నడుచుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకే సార్... మోదీగారు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో కొంతమంది సినీ పెద్దలు ‘బ్లాక్’ని వైట్ చేసుకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారట. మీ సంగతేంటి? (గట్టిగా నవ్వుతూ)... నాకు బ్లాక్ అండ్ వైట్ తేడా తెలియదు. నల్లధనం ఉండకూడదనే ఆశయంతో మోదీగారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కానీ, మోదీగారిని నేనేం ప్రశ్నిస్తున్నానంటే... ఎన్నికలకు ముందు విదేశీ బాం్యకుల్లో ఉన్న నల్ల డబ్బుని జనానికి పంచేస్తానన్నారు కదా. ముందా పని చేయమంటున్నా. ఎందుకు చేయలేకపోయారు? 500, 1000 రూపాయిల నోటుని రద్దు చేసినప్పుడు 2000 రూపాయి నోటు ఎందుకు? మోదీ హఠాత్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులపాలు చేస్తోంది. లోయర్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉంది. అంటే.. పెద్ద నోట్ల రద్దు తప్పంటారా? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ల ఇబ్బందుల గురించి ఆలోచించాలి. దీన్నే అదనుగా తీసుకుని పెట్రోల్ బంకుల్లో, కొన్ని కిరాణా కొట్లలో 500 నోటిస్తే.. నోటుకు సరిపడా కొనాల్సిందేనంటున్నారు. మోదీగారు వాగ్దానం చేసినట్లుగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు తెచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అది ఎందుకు చేయలేకపోతున్నారని ఆయనను ప్రశ్నిస్తున్నా. గెలవడానికి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు ‘తాత్కాలిక’ అవసరాల కోసం ఓటేసి నంతవరకూ సమాజం బాగుపడదు. అందుకే ఓటేసే ముందు ‘శాశ్వతాన్ని’ దృష్టి పెట్టుకోవాలి. వారసులేనా వచ్చేది? వ్యాపారస్థుడి కొడుకు వ్యాపారస్థుడు.. డాక్టర్ కొడుకు డాక్టర్.. అవుతున్నప్పుడు హీరో కొడుకు హీరో కావడంలో తప్పేంటి? రాజకీయ నేత కొడుకు రాజకీయ నేత అయితే తప్పేంటి? అనే చర్చ ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతోంది. ఎవరి అభిరుచి, ఆసక్తి ప్రకారం వాళ్లు నడుచుకోవచ్చనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అయితే సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో రాణించాలని, అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని 90 శాతం మందికి ఉంది. వారసత్వం సరైనదని మీరే వస్తుంటే.. బయటవాళ్లెప్పుడు హీరోలవుతారు? మంత్రులవుతారు? జనాభా దామాషాలో అట్టడుగు వర్గాలూ అందలం ఎక్కాలి. - డి.జి. భవాని -
సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలి
నల్లగొండ టౌన్ : చైనా అక్టోబర్ సాంస్కృతిక విప్లవానికి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, కళాప్రదర్శనలు నిర్వహించి భారత సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలని అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు పరకాల నాగన్న పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శ్రామిక భవన్లో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికవర్గ సాహిత్య, సాంస్కృతిక విప్లవంతో పాటు పల్లె సంస్కృతిని జానపద కళారూపాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయిక్రిష్ణ మాట్లాడుతూ సామ్రాజ్యవాద, ఫ్యూడల్ సాంస్కృతిక వ్యతిరేకంగా చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో అక్టోబర్ 1 నుంచి 7 వరకు సాంస్కృతిక పోరాటం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.గంగన్న, కె.సుబ్బారావు, చంద్రన్న, కోటకొండ కృష్ణ, ఉదయ్గిరి క్రిష్ణ, వెంకన్న, నిమ్మల రాంబాబు, చందు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి ‘రివల్యూషన్’
పంతంగి రాంబాబు - సాగుబడి డెస్క్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. ‘ఏ రంగమైనా ఆగుతుంది, వ్యవసాయ రంగం మాత్రం కాదు..!’ అని చెప్పారు. ఈ 70 ఏళ్లలో ఇది చాలా వరకు వాస్తవ రూపం దాల్చింది. నెహ్రూ ప్రభుత్వం తొలి పంచవర్ష ప్రణాళిక (1951-56)లో వ్యవసాయ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తొలినాళ్లలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరిగినా.. సాంకేతికత వినియోగం, యాంత్రీకరణ మాత్రం ఇటీవలి దశాబ్దాల్లో బాగా పెరిగింది. దేశంలో పొలం దున్నడానికి, దమ్ము చేయడానికి పశువులనే చాలా కాలం వినియోగించారు. తొలుత విదేశాల నుంచి ట్రాక్టర్లను దిగుమతి చేసుకున్న మన దేశం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ట్రాక్టర్లను తయారు చేస్తున్నది, ఎగుమతి చేస్తున్నది కూడా.. అయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినా... రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారి పరిస్థితి మాత్రం దుర్భరంగానే ఉంది. పెరిగిన యాంత్రీకరణ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో వ్యవసాయం పూర్తిగా మానవ శక్తి, పశువుల వినియోగంపైనే ఆధారపడి ఉండేది. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ బాగా పెరిగింది. దుక్కి, దమ్ము వంటి పనులకు పశువులతో నడిచే కొయ్య నాగలి, రెక్క నాగలి బదులుగా.. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసిన రొటవేటర్ను ఉపయోగిస్తున్నారు. విత్తనాలు చల్లేందుకు సీడ్ డ్రిల్స్ వచ్చాయి. కూలీలతో వరి నాట్లు వేయించడం తగ్గిపోయి.. వరి నాటే యంత్రాలు వినియోగిస్తున్నారు. కలుపుతీత కోసం కలుపు నివారణ యంత్రాల (వీడర్స్) వాడకం పెరిగింది. పురుగు మందులు చల్లడానికి తొలుత చేతితో తిప్పుతూ వినియోగించే స్ప్రేయర్లు వాడేవారు. ఇప్పుడు పెట్రోల్, కిరోసిన్‌లతో నడిచే శక్తివంతమైన స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. వరి కోత, నూర్పిడి, ధాన్యంలో తాలు తీసెయ్యడానికి ఎగరబోత వంటి పనులను కంబైన్ హార్వెస్టర్ వంటి భారీ యంత్రం చిటికెలో చేసేస్తుంది. హరిత విప్లవంతో పెరిగిన స్వయం సమృద్ధి దేశంలో 1960వ దశకంలో ప్రారంభమైన హరిత విప్లవం వ్యవసాయం రూపురేఖలను మార్చేసింది. వరి దిగుబడి భారీగా పెరిగింది. విశ్వవిఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ తోడ్పాటుతో అధికోత్పత్తి గోధుమ వంగడాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. 1963లో భారత్‌ను సందర్శించిన బోర్లాగ్ పంజాబ్‌లో గోధుమ ఉత్పాదకత అనేక రెట్లు పెరిగేందుకు దోహదపడ్డారు. అధికోత్పత్తి వంగడాలు, రసాయనిక ఎరువులు, పుష్కలంగా జలవనరుల కేటాయింపుతో హరిత విప్లవానికి పంజాబ్ తొలి వేదికైంది. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇక అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ - ఫిలిప్పీన్స్) 1962లో ఐఆర్-8 వరి వంగడాన్ని రూపొందించడం హరిత విప్లవంలో ఒక మైలురాయి. ఐఆర్-8 వంగడం రాకతో భారత్‌లో ధాన్యం దిగుబడి పెరిగింది. ఒకప్పుడు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మన దేశం.. 2006లో 45 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసే దశకు ఎదిగింది. 1986-1990 మధ్య ‘ఎల్లో రెవల్యూషన్’ పేరిట నూనె గింజల ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసింది. ఆపరేషన్ ఫ్లడ్ పేరిట 1970-1996 మధ్య పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి జరిగింది. కునారిల్లుతున్న రైతులు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న 60 కోట్ల మందిలో 80 శాతం మంది జీవితాలు అరకొర ఆదాయాలతోనే కునారిల్లుతున్నాయి. ఎన్ఎస్ఎస్వో తాజా గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో రైతు నెల ఆదాయం సగటున రూ. 3 వేలు మాత్రమే. అదే ప్రభుత్వ కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగి జీతం సుమారు రూ.18,000. తాను పస్తులుండి దేశానికి తిండిపెడుతున్న భారత రైతుల ఆదాయం ఎంత అధమ స్థాయిలో ఉన్నదీ అర్థమవుతుంది. -
స్ఫూర్తితోనే ప్రజా ఉద్యమాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు గుంటూరు వెస్ట్: కమ్యూనిస్టు యోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించి సమస్యలపై పోరాడి ప్రజలకు అండగా నిలబడటమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో ఇటీవల నిర్మించిన డైనింగ్ హాలును సీపీఎం సీనియర్ నాయకుడు సింహాద్రి శివారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణా సాయుధ పోరాటంలో గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకుల పాత్ర కీలకమైందన్నారు. సరళీకత ఆర్థిక విధానాల నేపథ్యంలో మారిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అసంఘటితరంగంలో ఉన్న ప్రజల తరపున ఉద్యమాలు నిర్మించాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణం, పెరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో కార్యాలయాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో పార్టీకి విశేష సేవలు అందించిన సింహాద్రి శివారెడ్డి, బొల్లు శంకరరావులను శాలువాలతో సన్మానించారు. -
పాలవెల్లి.. అమృతవల్లి
క్షీర విప్లవం దిశగా అడుగులు జిల్లాలో 4.42 లక్షల పాడి పశువులు రోజూ 1.80 లక్షల లీటర్ల పాలసేకరణ గజ్వేల్, సిద్దిపేటలో మిల్క్గ్రిడ్లకు శ్రీకారం రూ.6 కోట్లతో మెదక్, సిద్దిపేటలో పాలప్యాకింగ్ కేంద్రాలు నేడు జాతీయ పాల దినోత్సవం సందర్భంగా సాక్షి, సంగారెడ్డి పాలవెల్లి.. అమృతవల్లి.. క్షీరవిప్లవం దిశగా మెతుకుసీమ అడుగులు వేస్తోంది. జిల్లాలో పాడిపరిశ్రమ దినదినాభివృద్ధి సాధిస్తోంది. పశుసంతతితోపాటు పాల ఉత్పిత్తి ఘననీయంగా పెరుగుతోంది. జిల్లాలో 4.42 లక్షల అవులు, గేదెలు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 1.80 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. రోజుకు 2 లక్షల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి పెంచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేట్ డెయిరీలు సైతం పెద్ద ఎత్తున పాలను సమీకరిస్తున్నాయి. పాలసేకరణలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గురువారం క్షీరవిప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం... జిల్లాలోని పాడి రైతులు క్షీరవిప్లవం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉత్పత్తి పెరగడంతోపాటు సేకరణకు డెయిరీలు సైతం భారీగా వెలిసాయి. జిల్లాలో మొత్తం 4.42 లక్షల ఆవులు, గేదెలు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 1.80 లక్షల లీటర్లకుపైగా పాల దిగుబడి ఉంటుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ ప్రాంతాల్లో పాడి అధికంగా ఉంది. ఈ పరిశ్రమతో రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రైతులు వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమవైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు యువత సైతం ఉపాధి పొందేందుకు డెయిరీకి ప్రాధాన్యతనిస్తోంది. విజయ డెయిరీ... పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. విజయ డెయిరీ మొత్తం 650 గ్రామాల్లోని 14,367 మంది పాల ఉత్పత్తిదారుల నుంచి రోజూ 98 వేల లీటర్ల పాలను సేకరిస్తోంది. ప్రైవేట్ సంస్థల కంటే విజయ డెయిరీ లీటర్‌కు నాలుగు రూపాయలను అదనంగా అందజేస్తోంది. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు జిల్లాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రోత్సాహం కరువు... రైతులు, యువత పాడివైపు మళ్లేందుకు అవసరైమన ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పథకాలు అందుబాటులో లేవు. రైతులు, మహిళలు పాడి పశువులను కొనుగోలు చేసేందుకు అవసరైమన ఆర్థిక స్థోమత లేక చాలామంది వెనకడుగు వేస్తున్నారు. నాబార్డు అప్పుడప్పుడు సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకం నిరంతం అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం డీఆర్డీఏ ద్వారా స్త్రీ నిధి కింద మహిళా సంఘాల సభ్యులు ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు కేవలం రూ.50 వేలు రుణం అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మహిళా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేల రుణమిస్తున్నారు. పశుసంవర్థక శాఖ సునందిని పథకం కింద ఆడ దూడలు ఎదిగేందుకు అవసరైమన దాణాను రెండేళ్ల వరకు ఉచితంగా అందజేస్తోంది. అయితే జిల్లాలో పాడిపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ పథకాలను అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. క్షీర విప్లవాన్ని తీసుకొస్తాం.. జిల్లాలో పాడిపరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. రోజూ 1.80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. దీన్ని 2 లక్షలకుపైగా పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతోపాటు రైతులను పాడిపరిశ్రమవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం. పాడి రైతులకు పశువైద్యులను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.జిల్లాలోని పశువైద్యశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. - డాక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ, పశుసంవర్ధక శాఖ విజయ డెయిరీ సేవలను విస్తరిస్తాం.. విజయ డెయిరీ జిల్లాలో రోజూ 98 వేల లీటర్ల పాలను సేకరిస్తోంది. 98 పాల సంఘాలతోపాటు పాడిరైతుల నుంచి నేరుగా పాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి లీటర్‌కు రూ.4 అదనంగా చెల్లిస్తోంది. ఇలా ఇప్పటివరకు ప్రభుత్వం పాడి రైతులకు రూ.5.78 కోట్ల నిధులు మంజూరు చేసింది. పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గజ్వేల్, సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా 5,700 యూనిట్లతో మిల్క్‌గ్రిడ్ చేపట్టాం. రూ.6 కోట్లతో మెదక్, సిద్దిపేటలో పాల ప్యాకింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. - మురళీమోహన్, విజయ డెయిరీ జీఎం -
ఆత్మహత్యలు మాని పోరుకు రండి
భీమవరం : రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు మాని పోరుబాట పట్టాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రథమ మహాసభలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ జరిపి బహిరంగ సభ నిర్వహించారు. సభలో విజు కృష్ణన్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల్లో దేశంలో 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచిరోజులు వస్తాయని నమ్మబలికి అధికారం సాధించిన మోదీ పాలనలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు వరాల జల్లులు కురిపించిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక రైతులు ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనడం దుర్మార్గమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కక, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి.. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న కౌలు రైతులు, రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందక అప్పుల ఊబిలో కూరుకుపోయిఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన పాలకులు ఇప్పుడు దాని ప్రస్తావనే తేవడం లేదన్నారు. కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి రైతులకు ధర ఇవ్వాలని కృష్ణన్ డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ అనేక వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీ వల్ల సన్న, చిన్నకారు, పేద, కౌలు రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రూ.7,640 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కోసం కేటాయిస్తే.. రైతులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.18 వేల కోట్లు ఉందని ఆయన చెప్పారు. దీనిని బట్టి రైతులకు రుణమాఫీ ఎంతవరకు ఉపయోగపడిందో అర్థమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, సుబ్బారావు మాట్లాడుతూ రాజధాని భూసేకరణ పేరుతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వేలాది ఎకరాల భూముల్ని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ఏపీ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య, ఏఐకేఎస్ జాతీయ నాయకులు హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యమంగా డిజిటల్ తెలంగాణ
హైదరాబాద్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఐటీ రంగ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జేఎన్టీయూలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఏర్పాటు చేసిన తెలంగాణ డిజిథాన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ బేసిక్స్‌పై అవగాహన కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువతలో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డిజిటల్ లిటరసీ దోహదపడుతుందన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. పేదరికాన్ని పోగొట్టే ఆయుధంగా డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. 90శాతం గ్రామీణ ప్రజలు, 40శాతం పట్టణ ప్రాంత ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత లేదన్నారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం బాధ్యతాయుతమైన వ్యక్తులు చేస్తేనే ఆశించిన ఫలితాలను పొందగలమన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి జరిగితేనే అవకశాలు పెరిగి అవినీతి తగ్గుతుందని, డిజిటల్ లిటరసీని పెంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. ట్రెయిన్డ్ ట్రెయినీస్ ప్రోగ్రామ్‌గా డిజిథాన్‌ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి, ఐఎస్టీ డెరైక్టర్ గోవర్థన్, టీటా ప్రతినిధులు మాధవి, సౌమ్య, మోహన్, వివేక్, ప్రదీప్, విజయ్, రామ్‌కుమార్, టీటా గౌరవాధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
మరో తెలంగాణ ఉద్యమం
-
ఘరానా దొంగ అరెస్ట్
నక్సలైట్ పేరుతో కిడ్నాప్‌లు, దొంగతనాలు తొలుత రియల్గన్తో... ప్రస్తుతం ఏయిర్గన్తో నిందితుడిపై 30కి పైగా కేసులు నమోదు చాకచక్యంగా పట్టుకున్న కేసముద్రం పోలీసులు కేసముద్రం, న్యూస్‌లైన్ : జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి డబ్బుకోసం అనేక అడ్డదారులు తొక్కాడు. సులువుగా డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత హోదాలో జీవించాలనే ఆశతో నక్సలైట్ అవతారం ఎత్తి రాష్ర్టంలోని పలు జిల్లాల్లో కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ మేరకు మానుకో ట సీఐ వాసాల సతీష్, ఎస్సై రంజిత్‌రావు బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించా రు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వానపాకుల రాంబాబు(అలియాస్ ఆజాద్, బాబు) గతంలో అదే మండలంలోని మైనేని మోహన్‌తో తొలుత 9 మందితో ప్రజాసేవా దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి 2002లో ఆరు సింగిల్ ఫోర్ పిస్టళ్లను కొనుగోలు చేసి ఖమ్మం పరిసర ప్రాంతాలైన బంగారుచిలుక, ఉలుపునూరు, రేకులగూడెం అటవీ ప్రాంతాల్లో దళ సభ్యులంతా కొద్ది రోజులుగా షూటింగ్‌పై శిక్షణ పొందారు. అనంతరం రాంబాబు పాల్వంచ ప్రాంతంలో ని కేటీపీఎస్ కాంట్రాక్టర్ రమేష్‌ను బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేశారు. అలాగే టేకులపల్లిలోని ఓ క్వారీ యజమానిని బెదిరి స్తూ డబ్బు లు డిమాండ్ చేస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకుని ఆమ్స్ యాక్టు కింద అరె స్టు చేసి 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన రాంబాబు అదే ఏడాది ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. అనంతరం 2007లో పాల్వంచలోని కృషి బార్ షాప్ యజమాని రాంమోహన్‌రావును బెదిరిం చి రూ.లక్ష, 2008లో నర్సంపేటలోని రూపా పేపర్ బైండింగ్ ఓనర్ లింగస్వామివద్ద రూ.20 వేలు వసూలు చేశాడు. అలాగే 2012లో ఖానాపురంలోని అగ్రహర్ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఎల్‌సీడీని, ఖమ్మం జిల్లాలోని మారెమ్మగుడిలో రూ.30 వేలతోపాటు 2013 జూన్ 23న వెస్ట్ గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన గుండెపల్లి పోలీస్ అనే రైస్ మిల్లు వ్యాపారిని కొట్టి రూ.6.30 లక్షలను వసూలు చేసి పరారయ్యాడు. ఇదిలా ఉం డగా, ప్రస్తుతం బీహర్‌లో కొనుగోలు చేసిన ఏయిర్గన్ను చూపిస్తూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ని వ్యాపారులను, కిరాణం షాపు యజమానులను, క్వారీ ఓనర్లను బెదిరిస్తూ రూ.2వేల నుంచి మొదలుకుని లక్షల వరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే పలు చోట్ల చైన్ స్నాచిం గ్‌కు పాల్పడుతూ చేస్తూ వచ్చాడు. హత్య కేసులో నిందితుడు.. పాల్వంచకు చెందిన నాగేంద్రమ్మ అనే మహిళ ఖమ్మం శివారులో హోటల్ నడుపుతోంది. ఆమె తన అల్లుడైన చింతల సత్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుం ది. దీంతో పెద్దకొడుకు కృష్ణ వీరి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతూ వస్తున్నాడు. అయితే నాగేంద్రమ్మ హోటల్‌కు తరచు వస్తు న్న రాంబాబును వారు సంప్రదించి తమనుం చి కృష్ణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణను చంపితే రూ.2 లక్షలు ఇస్తామని నాగేంద్రమ్మ, సత్యనారాయణలు ఆశ చూపడంతో రాంబాబు దానికి సరేనన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్ 11న రాంబాబు.. కృష్ణకు మద్యం తాగించేందుకు బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హతమార్చాడు. కేసముద్రంలో ఇలా చిక్కి... కాగా, రాంబాబు కేసముద్రం మండలంలోని తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి గతంలో పలు దొంగతనాలను పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్ అతడి నుంచి దూరంగా ఉండడంతో రాంబాబు ఒంటరిగా బెదిరింపులకు దిగుతూ దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 24 కేసముద్రం మార్కెట్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ షాపులో కాపర్ వైరు దొంగిలించాడు. అనంతరం ఓ పల్లి వ్యాపారిని బెదిరించి రూ.14 వేలు, ఈ నెల లో తిమ్మంపేటలోని ఓ ఇటుక బట్టి వ్యాపారిని బెదిరించి రూ.2వేలు వసూలు చేశాడు. అలాగే తోట పుల్లయ్య అనే పల్లి వ్యాపారిని కూడా ఏయిర్గన్తో బెదిరించి తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే వ్యాపారులందరూ ఇస్తే తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయాడు. తర్వాత పసుపు వ్యాపారి రాజన్నను కూడా బెదిరించడంతో అతడు రూ.2వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో గత జనవరి 30న సదరు వ్యాపారి రాంబాబు బెది రింపులపై పోలీసులకు ఫిర్యాదు చే శాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రాంబాబు ఎదురుపడ్డాడు. అయితే రాంబాబును పట్టుకునేందు కు పోలీసులు ప్రయత్నిస్తుండగా చేతిలో ఉన్న ఏయిర్గన్ను చూపిస్తూ బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్ మంగీలాల్ వెనకవైపు నుంచి వ చ్చి అతడిని పట్టుకున్నాడు. నిందితుడిపై మొత్తం 30కి పైగా కేసులుండడం గమనార్హం. కాగా, అంతర్ రా ష్ట్ర దొంగను పట్టుకున్న మం గీలాల్ను, మరో కానిస్టేబుల్ కుమార్‌ను సీఐ, ఎస్సైలు అభినందించారు. -
వర్గ దృష్టితో కుల నిర్మూలన
సమీక్షణం వర్గ దృష్టితో కుల నిర్మూలన పుస్తకం : పల్లవి లేని పాట రచన : రంగనాయకమ్మ విషయం : ‘ఎక్కడ ఏ ఉద్యమం, ఏ విప్లవం, అపజయం పాలైనా దానికి కారణం ప్రజలు అవరు. నాయకులే అవుతారు. ప్రజలకు ఏ నూతన చైతన్యాలూ, ఏ నూతన నియమాలూ నేర్పని, నేర్పే అర్హతలు లేని నాయకులే స్వప్పాల్ని నవ్వుల పాలు చేస్తారు.’ : రంగనాయకమ్మ కొండపల్లి కోటేశ్వరమ్మ రాసిన ‘నిర్జన వారధి’ చదివాక చెరుకూరి సత్యనారాయణ రాసిన ‘తొణికిన స్వప్నం’ అనే వ్యాసానికి సమాధానంగా ‘విరిగిన స్వప్నం’ పేరుతో రంగనాయకమ్మ రాసిన వాక్యాలు పైవి. అన్ని కమ్యూనిస్టు పార్టీలకు, విప్లవ పార్టీలకు ఉపకరించే మాటలవి. ‘పల్లవి లేని పాట’ పేరుతో ఒక నవలికా, కుల విధానం, దెయ్యాల శాస్త్రం, మార్క్సిజం గురించిన కొన్ని వ్యాసాలూ కలిపి వేసిన ఈ పుస్తకం ఓ వంద పుస్తకాలు చదివిన అనుభవాన్ని కలిగిస్తుంది. ఉన్నవి 18 వ్యాసాలే అయినప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక అంశాలపై పాఠకుడికి విస్తృత అవగాహన కలిగిస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు తాత్విక వ్యాసాలలో ఉన్న ‘బుద్ధికొలత వాదం’పై చేసిన విమర్శకు స్పందించిన విరసం నాయకులకు జవాబుగా మరో మూడు వ్యాసాలు రాసి, మార్క్సిస్టుకు ఉండాల్సిన జాగ్రత్తలు చెప్పారు. లక్ష్మింపేట మారణకాండకు ముందునించీ అటు దళిత ఉద్యమకారులకీ, ఇటు విప్లవోద్యమకారులకీ మధ్య కుల నిర్మూలనపై ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో.... ప్రజాపంథా, జనశక్తి వంటి పార్టీల ధృక్పథాలనూ, వేములపల్లి వెంకటరామయ్య, చంద్రంల ఆలోచనలనూ వివరిస్తూనే, ‘దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్సు మాత్రమే అవసరం’ అనే తన అవగాహనపై ఉసా, బిఎస్ రాములు, ఎంఎఫ్.గోపీనాథ్, పండ్ల గోపీకృష్ణ, తంగిరాల చక్రవర్తి, వైవి రమణరావులకు జవాబులు ఇచ్చారు. మానవ హక్కుల కార్యకర్త ఎన్.జీవన్‌కుమార్ పాకీపని కార్మికుల విషాద జీవనంపై రాసిన వ్యాసానికి సహానుభూతి చెందారు. చివరగా స్కైబాబా అధూరె కథలపై రాసిన ఏడు ఉత్తరాలను పొందుపర్చారు. - డా. నూకతోటి రవికుమార్ పేజీలు: 222 వెల: 100 ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866- 2431181 చావుమీద బతికేవాళ్లు... పుస్తకం : మరణానంతర జీవితం (నవల) రచన : నందిగం కృష్ణారావు విషయం : మరణానంతర జీవితం.. ఇది ఎవరూ చూడలేనిది. అయితే ఎవరైనా మరణిస్తే మూఢాచారాల పేరుతో కలచివేసే సంఘటనలు చాలామందికి ఎదురుపడే ఉంటాయి. పుట్టుక నుంచి గిట్టుక వరకు, అందులోనూ ప్రధానంగా అంత్యక్రియల మూఢాచారాల పేరుతో జరిగే దోపిడీ... ఆ తంతు చేయకపోతే బతికున్నవాడి పుట్టి కూడా మునిగిపోతుందనే పెద్దలు... గ్రామాల్ని గడగడలాడించిన దొరలు సైతం బ్రాహ్మణ్యం ముందు బానిసే అవుతారంటూ రచయిత నందిగం కృష్ణారావు రాసిన ‘మరణానంతర జీవితం’ నవల వాస్తవాల్ని కళ్ల ముందుంచింది. అయినవాడు పోయాడన్న బాధ ఒక పక్క... పంతులు చెప్పినట్టు పాడె కట్టకపోతే దెయ్యాలు, భూతాలవుతారనే భయం మరోపక్క... ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనిషి చివరికి కర్మకాండలు పూర్తి కావడమంటే చావు మీద బతికే వాళ్లని వదిలించుకోవడమనే నిజాన్ని లైవ్లీగా రాశారు రచయిత. - పెమ్మరాజు పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 040-27678430 కొత్త పుస్తకాలు వాయుగానం (కావ్యం) రచన: తాళ్లూరి లాబన్‌బాబు పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 403, విజయసాయి రెసిడెన్సీ, 16-11-20/7/1/1, సలీంనగర్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9848787284 పావని (దీర్ఘకవిత) రచన: బి.హనుమారెడ్డి పేజీలు: 94; వెల: 50 ప్రతులకు: అధ్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు-523002. ఫోన్: 9440288080 ఝాన్సీ హెచ్.ఎం. (కథలు) రచన: చెన్నూరి సుదర్శన్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: రచయిత, 1-1-21/19, ప్లాట్ నం.5, రోడ్ నం.1, శ్రీ సాయి లక్ష్మి శోభా నిలయం, రామ్ నరేష్ నగర్, హైదర్‌నగర్, హైదరాబాద్-85. ఫోన్: 9440558748 పొందూరు మరో పోర్బందర్ రచన: వాండ్రంగి కొండల్రావు పేజీలు: 108; వెల: 20 ప్రతులకు: వాసవి ప్రింటర్స్, మార్కెట్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా-532168. ఫోన్: 9573577898 కలరవాలు (కవిత్వం) రచన: ఆత్మకూరు రామకృష్ణ పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, 8-8-01, ప్రణీత రెసిడెన్సీ, గుంటుపల్లి, విజయవాడ-521241. ఫోన్: 9493405152 మనిషిలోకి ప్రవహించాలి (కవిత్వం) రచన: ద్వానా శాస్త్రి పేజీలు: 62; వెల: 50 ప్రతులకు: రచయిత, 1-1-428, ఆర్చీస్ నెస్ట్, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849293376