
విప్లవం–విపత్తు
కృత్రిమ మేధస్సు, రేపటి మాట కాదు, ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది.
కృత్రిమ మేధస్సు, రేపటి మాట కాదు, ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లేదా కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించడం, మన అదుపు తప్పిపోవడం భవిష్యత్తులో ఎన్నడో జరగబోయేది కాదు, కాల్పనికత అంతకన్నా కాదు, వర్తమాన వాస్తవం. కృత్రిమ మేధ మాన వాళిని శాసించేదిగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన చాలా కాలంగానే వ్యక్తం అవుతోంది. అలాంటి భయాలు నిరాధారమైనవని కొట్టి పారేసే వారిలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ ఒకరు. ఫేస్‌బుక్‌కు చెందిన రెండు చాట్ బోట్లు (సంభాషణలు సాగించగల కృత్రిమ మేధో సాధనాలు లేదా ఏజెంట్లు) ఇంగ్లిష్‌కు బదులు అంతుబట్టని భాషను సృష్టించుకుని మాట్లాడుతూ కనబడటంతో జుకెర్ బర్గ్ సహా ప్రపంచమంతా ఉలిక్కిపడాల్సి వచ్చింది.
సదరు బోట్లను షట్‌డౌన్ చేసి, ఇకపై అవి ఇంగ్లిష్‌లోనే మాట్లాడేటట్టు శాసించారు. కృత్రిమ మేధస్సు మన దేశంలో ఇంకా మనిషి చెప్పిన పనులను చేసే దశలోనే ఉన్నా, అభివృద్ధిచెందిన దేశాల్లో అది తనంతటతానుగా నిర్ణయాలు తీసుకునే దశలోకి ప్రవేశించింది. భావి పర్యవసానా లపై అంచనాలు లేకుండా పెంపొందుతున్న ఆ మలి దశ కృత్రిమ మేధస్సు అభి వృద్ధికి ఉన్న పరిమితులు, ప్రమాదాలపై చర్చను ఫేస్‌బుక్ ఘటన మళ్లీ ముందుకు తెచ్చింది. కృత్రిమ మేధో సాధనాలు సొంత ప్రోగ్రామింగ్ భాషలను తయారు చేసుకునే స్థాయికి చేరితే ఎలా? అనేది పెద్ద ప్రశ్నార్థకమై నిలిచింది. అయినా కృత్రిమ మేధస్సు ఇప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించి, మనకు తెలియకుండానే మన జీవనశైలిని ఊహించని రీతిలో మార్చేస్తోంది. గూగుల్, తక్షణమే కోరిన సమాచారాన్ని ఇవ్వగలగడానికి కారణం అదేనని తెలియని వారే ఎక్కువ కావచ్చు. 2014లో ప్రమాదకరమైన ఈ–మెయిల్స్‌ను పంపే ఒక మాల్‌వేర్ కొందరు వ్యక్తులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కసారి లక్ష ఈ–మెయిల్స్‌ను పంపిస్తూ దాడి చేసింది.
సదరు మాల్‌వేర్, ఇంటర్నెట్‌కు అనుసంధానితమైన లక్షకు పైగా సాధనాలను ‘ఉపయోగించుకుని’ తనకు తానుగా ‘బోట్ నెట్’ను తయారు చేసుకుంది. వాటిలో 25 శాతమే కంప్యూటర్లు, మిగతావన్నీ స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్‌ల వంటివే. 2020 నాటికి మానవ జోక్యం అవసరంలేని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ (ఐఓటీ)కు అనుసంధానితమయ్యే ఇలాంటి స్మార్ట్ వస్తువుల సంఖ్య 21.2 కోట్లకు చేరుతుందని అంచనా. వీటిలో ప్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, హోమ్ థియేటర్లు, సోలార్ హీటర్లు మొదలైన వాటి నుంచి కార్లు, నౌకలు, విమానాలు, ఎలక్ట్రిక్ గ్రిడ్ల వరకు సర్వం ఉంటాయి. ఇక రోబోలు వస్తుతయారీ రంగం నుంచి యుద్ధరంగానికి విస్తరించి, ఇంటింటి వస్తువులుగా మారుతున్నాయి. మానవ జోక్యం అవసరం లేకుండా స్వతంత్రంగా సరైన నిర్ణయాలను తీసుకోగల సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించే లక్ష్యంతోనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితంగా కృత్రిమ మేధస్సు మన ఊహకు అందనంత వేగంగా అభివృద్ధి చెందుతూ, ఇళ్లను, కార్యాల యాలనే కాదు, దేశాలను, ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
కృత్రిమ మేధో సాధనాలన్నిటి అభివృద్ధి లక్ష్యం, అవి తమంతట తాముగా నిర్ణయాలను తీసుకోడానికి వీలుగా తమను తాము అభివృద్ధి పరచుకునేలా చేయ డమే. ‘దోషులు’గా నిలిచిన చాట్ బోట్లు రెండూ ఆ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తూనే ‘పట్టుబడ్డాయి’. ఒక్కొక్క ఇంగ్లిష్ వాక్యాన్ని ఒక బోట్ మరో బోట్‌కు చేర వేయడానికి బదులు, ఒక్కో వాక్యాన్ని ఒక సంకేతంగా లేదా ఒక్కో పదంగా గుర్తిస్తూ ‘మాట్లాడుకుని’ అవి తమ పని వేగాన్ని, సమర్థతను పెంచుకునే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధస్సు స్వయం పరిపూర్ణతను సాధించేలా చేసి, సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించాలని కోట్ల డాలర్లను కుమ్మరిస్తున్న జుకెర్ బర్గ్‌ల కలలను నిజం చేయడానికి రెండు బోట్లు చేసిన చిన్న ప్రయత్నమే బెంబే లెత్తించడం విశేషం. ఇది, నేటి ఐటీ పరిశ్రమలోని కృత్రిమ మేధో విభాగం అభివృద్ధి క్రమంలో ఉన్న పరస్పర విరుద్ధత. కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నవి బహుళజాతి కార్పొరేషన్లు, సైన్యం మాత్రమే. కృత్రిమ మేధస్సు అభివృద్ధి ఏ మేరకు సమాజ హితానికి తోడ్పడుతుంది? ఎలాంటి ఆంక్షలు అవ సరం? అనే సామాజిక, నైతిక విలువలకు, ప్రాధాన్యాలకు సంబంధించిన సమ స్యలు వాటికి పట్టవు. ఫ్రిజ్ తనంతట తానుగా కూరగాయలు, పాలు వగైరాలను లెక్కగట్టేసి, అయిపోతున్నాయంటే తెప్పించి, సర్దించేయడం నిజంగా అవసర మేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరు ఎలా చెప్పినా, చెప్పకున్నా.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజా నివేదిక ప్రకారం 2020 నాటికి 15 అభివృద్ధి చెందిన దేశా లలో కనీసం 50 లక్షల ఉద్యోగాల నైనా రోబోలు, ఆటోమేషన్ హరిస్తాయి. ఐఎల్‌ఓ తాజా అంచనా ప్రకారం కంబోడియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాంలలో 13.7 కోట్ల కార్మికులను లేదా 56 శాతం మొత్తం శ్రామికశక్తిని రోబోలు తొలగించే ప్రమాదం ఉంది.
రోబోలు మా ఉద్యోగాలను హరించివేస్తు న్నాయి, మేం అప్పుడే వాటికి సిద్ధంగాలేమని అమెరికాలోనే మూడింట రెండు వంతుల మంది గగ్గోలు పెడుతున్నారు. వీటన్నిటితో ఉన్న ముప్పును ముందుకు తెచ్చి మరీ చూపే వారికి కొదవ లేదు. అట్టహాసంగా ప్రవేశించిన డ్రైవర్‌లేని కార్లను హ్యాకర్లు అతి సులువుగా హ్యాకింగ్ చేసేశారు. రోబో సైనికులు అమాయకులను హతమార్చిన వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అమెరికా సహా వివిధ దేశాల రక్షణ శాఖలకే హ్యాకర్ల సవాళ్లు తప్పడం లేదు. ఎన్ని సదుద్దేశాలతో రూపొందించిన సూపర్ ఇంటెలిజెన్స్ అయినా అవాంఛనీయ వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో పడ కుండా ఉంటాయన్న హామీ లేదు. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలలో అత్యధికులు కృత్రిమ మేధస్సుతో ఉన్న భద్రతాపరమైన సమస్యల గురించి భయా లను వ్యక్తం చేస్తూనే, వాటివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. తమ భద్రతనే కాదు, ప్రపంచం భద్రతనే గాలికొదిలి సాగుతున్న కృత్రిమ మేధస్సు అభివృద్ధిపై ఎవరు, ఎలాంటి ఆంక్షలు విధించాలో చెప్పేవారు లేరు, చెబితే వినేవారూ లేరు. ఈ సాంకేతిక విప్లవం పరిమితులు, విపరిణామాలపైకి, అవసరమైన ఆంక్షలపైకి అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా దృష్టి సారిస్తుందా?