రూ. 21 కోట్లు పలికిన 1652 నాటి వెండి నాణెం
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్‌ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే.
బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్‌ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది.
ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి..
నెదర్లాండ్స్‌లో 2016లో ఒక పేస్ట్‌బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్‌లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది.
ఇంగ్లండ్‌కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్‌కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్‌కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్‌కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి.
2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment