ఉదారవాదులూ, వామపక్షవాదులూ ‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్...’ అనుకోక తప్పని సమయం వచ్చినట్టుంది. మొన్న అర్జెంటీనాలో, ఇప్పుడు నెదర్లాండ్స్‌లో జరిగిన ఎన్నికల్లో మితవాద నేతలు విజయకేతనాలు ఎగరేయటం...యూరప్ ఖండంలోని చాలాచోట్ల నానాటికీ మితవాద పార్టీలకు ఆదరణ పెరుగుతుండటం ప్రపంచం ‘కుడి’వైపు మళ్లుతున్న సూచనలు అందిస్తున్నాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఇటీవల తీవ్ర మితవాద పక్ష నేత జేవియర్ మిలీ వామపక్ష నేత సెర్జియా మాసాను ఓడించి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
సెంట్రల్ బ్యాంకు మూసివేత, స్థానిక కరెన్సీ పెసో రద్దు ఆయనగారి వాగ్దానాలు. దేశ సాంఘిక, ఆర్థిక విధానాలను ధ్వంసం చేసి నవ అర్జెంటీనా నిర్మించటమే తన ధ్యేయమని చెప్పుకొన్నారు. తాజాగా నెదర్లాండ్స్‌లో తీవ్ర మితవాద పక్షమైన పార్టీ ఫర్ ఫ్రీడమ్ (పీవీవీ) 37 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 150 స్థానాలున్న దిగువ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 76 స్థానాలకు దూరంలోనే వున్నా ఆ పార్టీ నేత గీర్డ్ వైల్డర్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే పీవీవీ ప్రవచించే ఇస్లాం వ్యతిరేకత అక్కడ రాజ్యాంగ విరుద్ధం కావటంవల్ల ప్రధాన స్రవంతి పార్టీలు ప్రభుత్వంలో చేరేందుకు నిరాకరిస్తున్నాయి. మసీదుల మూత, ఖురాన్ నిషేధం, ముస్లిం దేశాల నుంచి వలసలు అరికట్టడం వైల్డర్స్ వాగ్దానాలు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ యూరప్‌లో మితవాద పక్షాలకు కాలం చెల్లి, ఉదార వాద పార్టీల ఆధిక్యతే సాగింది. ఒక్క ఇటలీలోని సోషల్ మూవ్‌మెంట్ పార్టీ (ఎంఎస్‌ఐ)కి తప్ప ఎక్కడా మితవాదులకు ఆదరణ దొరకలేదు. 1955–80 మధ్య అక్కడక్కడ మితవాద పార్టీలు తలెత్తి కొద్దో గొప్పో స్థానాలు గెల్చుకున్న ఉదంతాలున్నా అవి ఒకటి రెండు దఫాలకు మించి నిలబడ లేకపోయాయి. 1956లో ఫ్రాన్స్‌లో యూనియన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రెటర్నిటీ (యూఎఫ్‌ఎఫ్) 13 శాతం ఓట్లు గెల్చుకుని, 52 స్థానాలు సాధించినా చాలా త్వరగానే కనుమరుగయింది.
అంతవరకూ దుందు డుకువాదులుగా పేరుబడిన అతి మితవాద పక్షాలు 1980–2000 మధ్య అంతక్రితంతో పోలిస్తే ఎంతోకొంత మెరుగయ్యాయి. ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్‌పీ), నెదర్లాండ్స్‌లో సెంటర్ పార్టీ (సీపీ) ఓటర్లను ఆకట్టుకోవటం మొదలెట్టాయి. అయితే ఉదారవాద పార్టీలు, వామపక్ష పార్టీల తర హాలో వీటికి నిర్దిష్టమైన సిద్ధాంతమేమీ ఉండదు. స్థానికత, జనాకర్షణ, అవినీతి, పెరుగుతున్న నేరాలు, వలసలు, ముస్లింలపై వ్యతిరేత వంటివే ఈ పార్టీలకు ఊపిరి. 1980కి ముందు ఒక శాతం అంతకన్నా తక్కువ ఓట్లు మాత్రమే రాబట్టుకునే మితవాదులు 2010 నాటికి 10 శాతం ఓట్లు తెచ్చు కునే స్థితికి ఎదిగారు.
ఒక్క ఆస్ట్రియా దీనికి మినహాయింపు. అక్కడ తీవ్ర మితవాద ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్‌పీ) 1999లో 27 శాతం ఓట్లు సాధించి కూటమి ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామం యూర ప్‌కు మింగుడుపడలేదు. ఆ దేశంపై పలు ఆంక్షలు సాధించటంతోపాటు చాలా దేశాలు అక్కడికి దౌత్య పర్యటనలు మానుకున్నాయి. 2019లో ఎఫ్‌పీ నేత అవినీతి ఆధారాలతోసహా బట్టబయలు కావటంతో దానికి ఆదరణ సన్నగిల్లింది. కానీ మొన్న ఫిబ్రవరిలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో అది 24 శాతం ఓట్లతో బలం పుంజుకుంది. వేరే దేశాల్లో కూడా మితవాదులకు ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనబడుతూనే వున్నాయి.
స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది మొదట్లో ఇటలీలో నియో ఫాసిస్ట్ పార్టీగా ముద్రపడిన ఎంఎస్‌ఐ అధికారం చేజిక్కించుకోగా, నిరుడు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో అతి మితవాది మెరిన్ లీ పెన్ రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఆమె పార్టీ దిగువ సభలో భారీగా స్థానాలు గెల్చుకుంది. జర్మనీలో నియో నాజీ పార్టీ ఏఎఫ్‌డీ ప్రస్తుతానికైతే ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్క పోలాండ్ ఇందుకు మినహాయింపు. అక్కడ 2019 ఎన్నికల్లో 43.6 శాతం ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్)ని మొన్న అక్టోబర్ ఎన్నికల్లో అధికారంలో నుంచి దించలేకపోయినా, ఆ పార్టీ ఆధిక్యతను 35 శాతానికి తగ్గించటంలో ఉదారవాద పార్టీలు విజయం సాధించాయి.
నెదర్లాండ్స్‌లో వైల్డర్స్ సాధించిన ఆధిక్యత సహజంగానే యూరప్ అంతటా రాజకీయ ప్రకంప నలకు కారణమైంది. ఎందుకంటే ఇంతవరకూ నెదర్లాండ్స్‌లో ఏ మితవాద పార్టీ 20 శాతం దాటి ఓట్లు సాధించలేదు. తొలిసారి వైల్డర్స్ 23.6 శాతం ఓట్లు గెల్చుకున్నారు. అంతేకాదు... ఇటలీ మిత వాద నేత మెలొని, ఫ్రాన్స్ మితవాద నేత మెరైన్ లీ పెన్ మాదిరి తన తీవ్రవాద భావాలను కాస్త యినా సవరించుకోలేదు. అధికారంలోకి రాగానే ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ నిర్వహిస్తానని వైల్డర్స్ హామీ ఇచ్చారు.
ఇది ఆచరణలో సాధ్యమా కాదా అన్న సంగతలావుంచి వర్తమాన స్థితిగతుల నుంచి గట్టెక్కటం ఎలాగో తెలియక అన్ని దేశాల్లోనూ పాలకులు తలలు పట్టు కుంటున్నారు. ఒకపక్క ఉక్రెయిన్ నుంచి రోజూ వేలాదిమంది శరణార్థులు వస్తున్నారు. పశ్చిమా సియా, ఆఫ్రికా ఖండ దేశాల నుంచి సైతం నిత్యం వలసలుంటున్నాయి. ఇందుకు ఈయూనే తప్పు బట్టాలి.
వివిధ దేశాల్లో మంటరాజుకోవటానికి కారణమవుతున్న అమెరికా వైఖరిని నిలువరించక పోగా దానికి సహకారం అందించటమే వలసలు పెరగటానికి కారణం. అశాంతితో దహించుకుపో తున్న దేశాలను వదిలి సహజంగానే జనం సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటారు. ఇతరత్రా విషయా లెలావున్నా వలసలపై ఓటర్లలో ఉన్న భయాందోళనలకు పరిష్కారం వెదకటంలో ప్రధాన స్రవంతి పార్టీలు విఫలమైతే అన్నిచోట్లా రాగలకాలంలో అతి మితవాద పక్షాలదే పైచేయి అవుతుంది.
రైట్...రైట్!
Published Tue, Nov 28 2023 12:51 AM | Last Updated on Tue, Nov 28 2023 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment