
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కింది మొదలు వ్యవస్థల్ని ఎడాపెడా తొక్కుకుంటూ పోతున్న డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచ దేశాలకు ఉదారంగా సాయం అందించే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్)పై పడింది. గత నెల 27నే ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపేస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. దాన్నుంచి విడుదలయ్యే నిధుల గురించి సమీక్షించి ఆ పంపిణీని ‘మరింత సమర్థంగా’, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగా వుండేలా రూపుదిద్దుతామని ఆ సందర్భంగా ప్రకటించారు.
ఇప్పుడు దాని తాలూకు సెగలూ పొగలూ మన దేశాన్ని కూడా తాకాయి. ఆ సంస్థ నుంచి లబ్ధి పొందింది ‘మీరంటే మీర’ని బీజేపీ, కాంగ్రెస్‌లు వాదులాడుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గాలించి గత చరిత్ర తవ్వి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వెనకా ముందూ చూడకుండా చొరవగా దూసుకెళ్లే బీజేపీయే ఈ వాగ్యుద్ధానికి అంకు రార్పణ చేసింది. కాంగ్రెస్, మరికొన్ని పౌర సమాజ సంస్థలూ యూఎస్ ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం.
పనిలో పనిగా ప్రపంచ కుబేరుడు జార్జి సోరోస్‌తో కాంగ్రెస్‌కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. జార్జి సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి యూఎస్ ఎయిడ్‌కు ప్రధానంగా నిధులు వస్తాయి గనుక దాన్నుంచి నిధులందుకున్నవారంతా మచ్చపడినవారేనని బీజేపీ అభియోగం. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరో అడుగు ముందుకేసి యూఎస్ ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని తేల్చారు.
దేశద్రోహులు అనే మాటైతే వాడలేదుగానీ... ఆ చట్రంలో ఇమిడే కార్యకలాపాలన్నిటినీ పరోక్షంగా కాంగ్రెస్‌కూ, ఇతర సంస్థలకూ అంటగడుతూ ఏకరువు పెట్టారు. అటు కాంగ్రెస్ ఊరుకోలేదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఒకప్పుడు యూఎస్ ఎయిడ్ రాయబారిగా పనిచేయటం, నీతి ఆయోగ్, స్వచ్ఛభారత్ వంటి సంస్థలకు నిధులు రావటం వగైరాలను ప్రస్తావించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యా లయం వెబ్‌సైట్ సమాచారం ప్రకారం యూఎస్ ఎయిడ్ మన ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయం, తాగునీరు, ఇంధనం వగైరాలకు సాయపడుతున్నది.
ఇదంతా చూస్తుంటే ‘గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏర డం’ నానుడి గుర్తుకొస్తుంది. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఏలుబడిలో ప్రారంభమైన ఈ సంస్థనుంచి నిధులందుకున్న పార్టీలూ, స్వచ్ఛంద సంస్థలూ కొల్లలుగా ఉన్నాయని భావించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమా లకు కూడా అది సాయపడింది. అమెరికా తన బడ్జెట్‌లో ఒక శాతాన్ని అంతర్జాతీయ సాయానికి కేటాయిస్తున్నది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మానవతా సాయాన్ని అందించే ఏకైక దేశం అమెరికాయే.
అంతర్జాతీయంగా నిరుడు వివిధ దేశాలకు అందిన సాయంలో అమెరికా వాటా 40 శాతం. 2025 ఆర్థిక సంవత్సరానికి యూఎస్ ఎయిడ్ ద్వారా 5,840 కోట్ల డాలర్లు వ్యయం కావొచ్చన్న అంచనా ఉంది. ట్రంప్ ప్రస్తుతం దాన్ని నిలుపుదల చేశారు గనుక ఇందులో ఎంత మొత్తానికి కత్తెరపడుతుందో అంచనా వేయటం కష్టం. మనకైతే ఇకపై రాక పోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశంలో భారత్ సంపన్న దేశం.
2021 నుంచి నిరుడు డిసెంబర్ వరకూ మన దేశానికి 2 కోట్ల డాలర్లు కేటాయించగా అందులో కోటీ 25 లక్షల డాలర్లు అందించి నట్టు లెక్కలున్నాయి. ఇదంతా ‘ప్రజాతంత్ర భాగస్వామ్యం’, పౌర సమాజం కోసం అని యూఎస్ ఎయిడ్ అంటున్నది. ఇందులో 55 లక్షల డాలర్లు నిరుడు జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున వోటర్లు పాల్గొనేలా చూడటానికి అందించారు. ఏ సంస్థ ఎంత పొందిందన్న వివరాలు మాత్రం లేవు.
దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల రక్షణ, ఆఫ్రికాలో వ్యాధులు అరికట్టడానికి, ఆడపిల్లల విద్యకు, ఉచిత మధ్యాహ్న భోజనానికి సాయం చేయగా... రష్యా ఇరుగు పొరుగు దేశాల్లో దాని ప్రభావం తగ్గించటానికి, యుద్ధక్షేత్రమైన సిరియాలో ఆస్పత్రుల కోసం, ఉగాండాలో అట్టడుగు తెగల అభ్యున్నతికి, కంబోడియాలో మందుపాతరల తొలగింపునకు, బంగ్లాలో పౌరసమాజం కోసం... ఇలా భిన్నమైన పథకాలకూ, కార్యక్రమాలకూ అమెరికా తోడ్పడుతోంది.
అసలు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? వ్యక్తుల వరకూ చూస్తే తమ ఎదుగుదలకు కారణమైన సమాజానికి తిరిగి ఏదో ఇవ్వాలన్న కృతజ్ఞతా భావన కారణం కావొచ్చు. కానీ ఏ ఉద్దేశమూ లేకుండా అయా చితంగా ఖండాంతరాల్లోని సంపన్న దేశాలు వేరే దేశాలకు ఎందుకు తోడ్పాటునిస్తున్నాయి? చరిత్ర తిరగేస్తే దీని వెనకున్న మతలబు అర్థమవుతుంది.
అప్పట్లో సోవియెట్ యూనియన్ ప్రభావం నుంచి ప్రపంచాన్ని ‘రక్షించే’ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని అమెరికా ఈ సాయం మొద లెట్టింది. అటు సోవియెట్ సైతం ఆ పనే చేసేది. ప్రపంచం దాదాపు రెండు శిబిరాలుగా చీలిన ఆ కాలంలో అమెరికా, సోవియెట్‌లకు ఈ ఉదారత ఎందుకంటిందో సులభంగానే గ్రహించవచ్చు.
సాధారణ ప్రజానీకంలో తమపట్ల అనుకూల భావన కలిగితే అవతలివారిని సగం జయించినట్టేనని ఆ రెండు దేశాలూ భావించేవి. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యర్థులుగా కనబడుతున్న వర్తమానంలో అమెరికాకు ఉదారత అవసరం ఏముంది? ‘నేను ఆదేశించింది పాటించటమే తప్ప నాతో తర్కానికి దిగొద్ద’ని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనదేశం ఈ సాయాన్ని ముందే తిరస్కరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. కానీ ఇవ్వబోమని అమర్యాదకరంగా చెప్పించుకోవటం ఆత్మాభిమానం గల భారతీయులందరికీ చివుక్కుమనిపించే సంగతి. పాలకులు గ్రహిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment