Donald Trump
-
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
ట్రంప్‌తో చర్చలకు పుతిన్ రెడీ: రష్యా
మాస్కో: డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే ఈ విషయమై అమెరికా నుంచి స్పందన కోసం వేచి చేస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల అధినేతల మధ్య భేటీ త్వరలో ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం రష్యా స్పష్టత ఇవ్వలేదు.దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ట్రంప్ వర్చువల్‌గా మాట్లాడారు. అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా,చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ వాదనతో రష్యా మాత్రం ఏకీభవించలేదు. చమురు ధరలకు తాము యుద్ధం ఆపడానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.అమెరికా-రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. -
ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!
అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానమైన ఉత్తర్వులు జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం రద్దు, ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు. వాటిలో ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అయితే జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం (US Citizenship) రద్దు కార్యానిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టు (US Court) తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి సమస్య లేకపోయినా.. ట్రంప్ మాత్రం ఈ ఉత్తర్వు ఎలాగైనా అమలు చేయాలనే పంతంతో ఉన్నారు. మరి అలాంటప్పుడు అక్కడే ఉన్న మన భారతీయ అమెరికన్లకు, చదువుకుంటున్న విద్యార్థులకు ఇక తిప్పలు తప్పవా అంటే..తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఇది వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చట్టాన్నే రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. అయితే ట్రంప్ సహా మరే ఇతర యూఎస్ అధ్యక్షుడు ఈ రాజ్యంగ హక్కును రద్దు చేయడం అనేది అంత సులభం కాదు. ముందు అమలు చేయనున్న ఈ బిల్లుకి అమోదం లభించాలంటే హౌస్(దిగువ సభ), సెనెట్(ఎగువ సభ) రెండింటిలోనూ మూడింట రెండో వంతు ఓట్లు అవసరం. ఆ తర్వాత మూడు వంతుల అమెరికా రాష్ట్రాలు అమోదం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అమలు అవ్వడం అనేది అంత సులభం కాదనేది విశ్లేషకులు అభిప్రాయం. నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల విషయంలో మాత్రం కఠినంగా నిబంధనలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో.. F1 (స్టూడెంట్ వీసాలు), H1 (వర్క్ వీసాలు), L1 (ఇంట్రా-కంపెనీ బదిలీలు), B1/B2 (టూరిస్ట్/బిజినెస్ వీసాలు)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే అధికారులు మాత్రం పాలసీ మార్పులు ఏవైనా అమల్లోకి తెచ్చే ముందు.. రెండువైపులా అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతోంది. ఇక.. టైర్ 1, టైర్-2లకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే..విశ్వవిద్యాలయానికి, చేసే కోర్సులతో సంబంధం లేని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని F1 వీసాదారులకు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే F1 నిబంధనలకు లోబడిన పనులే చేసుకోవాలని, ఆ పరిధి దాటి పనులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. చదవండి: ట్రంప్ దూకుడు.. వారి గుండెల్లో రైళ్లుఇక.. హెచ్1, ఎల్1 వీసాల విషయంలో కొన్ని చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీలు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. దీంతో ఆ పాలసీలకు సమీక్షలు జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తంగా చూసుకుంటే.. ఉద్యోగార్థం నిజాయితీగా ప్రయత్నాలు చేసేవాళ్లకు మార్పులన్నీ ప్రయోజనకారిగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో వీసాల విశ్వసనీయతను బలోపేతం చేసే ప్రయత్నంగానూ నిపుణులు అభిప్రాయపడున్నారు. చివరిగా.. మెరిట్ ఆధారిత గ్రీన్ కార్డ్ వ్యవస్థ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇది గనుక అమలైతే.. కొత్త దరఖాస్తులుదారులు 10-15 ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది. ప్రత్యేకించి ఇది భారతీయ కమ్యూనిటీకి మేలు చేసేదిగానే ఉంటుంది కూడా.-వేణు చిత్వేల్గమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్ఆర్ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.(చదవండి: ట్రంప్‌కు షాక్, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట) -
ట్రంప్ ఆదేశాలు.. అమెరికాలో ఎక్కడికక్కడ అరెస్టులు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారుల్ని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ అరెస్ట్‌ల నుంచి తప్పించుకుని సరిహద్దులు దాటే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ అరెస్ట్‌లపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. యుఎస్ అధికారులు ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, సైనిక విమానాల్ని ఉపయోగించి వందల మందిని బహిష్కరించినట్లు చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సైనిక విమానం ద్వారా వందలాది అక్రమ వలస దారుల్ని బహిష్కరించింది. చరిత్రలో అక్రమ వలస దారుల బహిష్కరణ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నారని తెలిపారు. -
ట్రంప్ రాకతో అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరం
-
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తొలి షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. దీంతో జన్మతః పౌరసత్వం చట్ట రద్దుతో బెంబేలెత్తుతున్న భారతీయులకు (NRI) భారీ ఊరట లభించింది. జన్మహక్కు పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును గురువారం యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నిలిపివేశారు. "ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు" అని న్యాయమూర్తి జాన్ కఫ్నౌర్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ దీనిపై "అప్పీల్" చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?ఫిబ్రవరి 19 తర్వాత ఆ ఉత్తర్వు తేదీ నుండి 30 రోజుల తర్వాత యుఎస్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే 14వ సవరణ యొక్క ఈ కొత్త వివరణ వర్తిస్తుంది.ట్రంప్ ఆదేశంఅమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా నవజాత శిశువులకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది?అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే బర్త్‌రైట్ సిటిజెన్షిప్ రద్దు భారతీయ కుటుంబాలపై చాలా ప్రభావం పడుతుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే, ఎన్ఆర్ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత సంవత్సరం ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.జనవరి 20న, 47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులతీసుకొస్తానన్న వాగ్దానం చేసిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వు ప్రకారం, పత్రాలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ పౌరసత్వానికి అర్హులు కారు.కాగా 1868 నుంచేఅమెరికాలో ఈ చట్టం అమల్లో ఉంది.దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. -
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : విదేశీయుల ప్రవేశానికి అమెరికా (USA) కొత్త నిబంధనలు విధించింది. విదేశీయులకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసింది. అమెరికా వచ్చే వారికి రిటన్ ఎయిర్ టికెట్ తప్పని సరి చేసింది. ఈ నింబధనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (U.S. Department of Homeland Security) జారీచేసింది. కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డీహెచ్ఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ ఆదేశాలతో రిటన్ టికెట్ లేని కారణంగా నిన్న ఒక్కరోజే వందమంది భారతీయుల్ని వెనక్కి పంపింది. నిబంధనల మేరకు కనీసం 3వేల డాలర్లు లేని మరో వంద మంది భారతీయుల్ని (Indians) డీహెచ్ఎస్ అనుమతించలేదు.అంతకుముందు, 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్తన కార్యచరణ ప్రకటించారు. తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది.అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. చదవండి: ట్రంప్ దూకుడు.. వారి గుండెల్లో రైళ్లుజాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది. -
నెలలు నిండకముందే సిజేరియన్లు.. ఆస్పత్రులకు భారతీయ దంపతుల క్యూ
-
ట్రంప్‌కు ఝలక్.. పౌరసత్వం ఉత్తర్వుకు కోర్టులో చుక్కెదురు
సియాటెల్: అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత ఆర్భాటంగా ట్రంప్ ఇచ్చిన ‘జన్మతః పౌరసత్వం రద్దు’ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టులో అవరోధాన్ని ఎదుర్కొంది. ఉత్తర్వు అమల్లోకి రాకుండా ఆపాలంటూ 4 రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ జడ్జి జాన్ సి. కఫెనర్ నిలిపివేశారు.ఈ సందర్బంగా.. ‘ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకిరాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలిస్తున్నా. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం’ అని కేసు విచారణ సందర్భంగా జడ్జి కఫెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయీస్, ఒరేగాన్ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన జడ్జి ఆ తర్వాత ఈ ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీ పాలిత 22 రాష్ట్రాలు విడిగా వేసిన ఐదు పిటిషన్లలో ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి వేసిన సియాటెల్ కోర్టులో వేసిన ఈ పిటిషన్ కూడా ఉంది. మరోవైపు.. ఈ కేసులో ప్రాథమిక విజయం సాధించాం అని వాషింగ్టన్ అటార్నీ జనరల్ నికొలస్ బ్రౌన్ వ్యాఖ్యానించారు. అనంతరం, దీనిపై ట్రంప్ స్పందించారు. తాము అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమూర్తి ఉత్తర్వులపై మా కార్యవర్గం అప్పీల్ చేస్తుందని తెలిపారు. ఇక, అంతకుముందు.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావం చూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
బడికి పంపాలన్నా భయపడుతున్నారు
శాన్ఫ్రాన్సిస్కో: అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అక్రమవలసదారుల్లో భయందోళనలు ఎక్కువయ్యాయి. తమ పిల్లలను బడికి పంపడానికి కూడా అక్రమ వలసదారుల కుటుంబాలు భయపడుతున్నాయి. పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలు అని అక్కడి విద్యావేత్తలు వలస తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పాఠశాలలు, చర్చిలు, ఆసుపత్రులనూ క్షుణ్ణంగా తనిఖీచేసి అక్రమవలసదారులుంటే అక్కడే అరెస్ట్ చేసే అధికారం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో వీరిలో ఆందోళనలు మరింత పెరిగాయి. సున్నితమైన ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టరాదన్న మార్గదర్శకాలను అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తుడిచిపెట్టేశాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో తలదాచుకోలేరని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా విధానం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు పాఠశాలల్లోకి ప్రవేశించొచ్చు. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 7,33,000 మంది పాఠశాల వయస్సు పిల్లలు అమెరికాలో అక్రమంగా ఉన్నారు. ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వం నిబంధనతో వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ వీళ్ల తల్లిదండ్రులకు పౌరసత్వం లేదు. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక వలస కుటుంబాలు బహిరంగంగా తిరిగేందుకు భయపడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించకపోవడంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతుందంటున్నారు విద్యావేత్తలు. తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్న పాఠశాలలు కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు అక్రమవలసదారుల పిల్లలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాఠశాలలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు సహాయం చేయవని చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. క్రిమినల్ వారెంట్ లేకుండా అధికారులను పాఠశాలల్లోకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసింది. విద్యార్థి ఇమ్మిగ్రేషన్ స్థితిపై సమాచారం సేకరించకూడదనే విధానాలను గత నెలలో న్యూయార్క్ నగర ప్రధానోపాధ్యాయులకు గుర్తు చేసింది. అయితే కొన్ని చోట్లా కుటుంబాలకు ఇలాంటి భరోసా దక్కట్లేదు. ట్రంప్ చర్యతో విద్యార్థులు, కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని జార్జియా రెఫ్యూజీస్ అకాడమీ చార్టర్ స్కూల్ అధ్యాపకులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతారని భావించి, వారు ముఖ్యమైన పరీక్షలను కోల్పోకుండా ఉండటానికి పరీక్ష షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారని అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ రైట్స్ అధికారి మైఖేల్ ల్యూకెన్స్ తెలిపారు. వలసదారులు తమంతట తాముగా అమెరికాను వీడేలా ప్రభుత్వం భయపెడుతోందని ఆయన ఆరోపించారు. కంటి మీద కునుకు లేదు‘‘ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 14 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి వచ్చి బోస్టన్‌లో ఉంటున్నాం. మా పిల్లలు బోస్టన్ స్కూళ్లలో చదువుతున్నారు. అక్రమవలసదారులని ముద్రవేసి ఇప్పుడు మమ్మల్ని పనిచేసుకోనివ్వకపోతే ఏం చేయాలి. న్యాయం కోసం కోర్టుకెళ్లలేను. లైసెన్స్ ఉన్నాసరే కారులో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి. తలచుకుంటే నిద్రకూడా పట్టట్లేదు. చట్టబద్ధత రుజువు కోసం స్కూళ్లో మా పిల్లలను అధికారులను నిలదీస్తే ఏం చేయాలో పాలుపోవట్లేదు’’అని ఐరిస్ గొంజాలెజ్ అని మహిళ వాపోయారు. ఇలా చేస్తారని ఊహించలేదు : కార్మెన్ ‘‘వాళ్లు ఇలా చేస్తారని నేను ఊహించలేదు’’అని మెక్సికో నుంచి వలస వచ్చిన కార్మెన్ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో బే పాఠశాలకు నా ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడెలా తీసుకెళ్లాలి?. అండగా ఉంటామని పాఠశాల హామీ ఇచ్చింది. అయినా భయంగానే ఉంది. తరిమేస్తే సొంతదేశం అస్సలు వెళ్లలేం. డ్రగ్స్ ముఠాలు రాజ్యమేల మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం నుంచి వచ్చాం. రెండేళ్ల క్రితం అక్కడ మా అల్లుడిని కిడ్నాప్‌చేశారు. బెదిరింపులు పెరగడంతో అమెరికాకు వలసవచ్చాం. శాన్ఫ్రాన్సిస్కోలో ఉండటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. దేవుడా మా ప్రాణాలి్న, మా పిల్లల్ని కాపాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఇలా పేద అక్రమవలసదారుల వ్యథలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వినపడుతున్నాయి. -
అమెరికాలో ఉత్పత్తి చేయండి లేదంటే టారిఫ్ కట్టండి
దావోస్: అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోగానే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరి కన్లనేకాదు ప్రపంచదేశాలనూ విస్మయపరిచిన వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల ఖడ్గాన్ని ఈసారి పారిశ్రామికవేత్తలపై ఝలిపించారు. ఏకంగా ప్రపంచ వాణిజ్య సదస్సు వార్షిక సమావేశం సాక్షిగా అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు తనదైన శైలిలో ‘సూచనలు’ చేశారు. అమెరికాలో వస్తూత్పత్తిని పెంచాలని, ఈ మేరకు తమ కర్మాగారాలను అమెరికాకు తరలించాలని పిలుపునిచ్చారు. అమెరికాలో తయారు చేయకపోతే దిగుమతిచేసుకునే వస్తువులపై మరింత టారిఫ్ భారం మోపుతామని పరోక్షంగా హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో గురువారం ట్రంప్ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘ ప్రపంచంలోనే ప్రతి వస్తూత్పత్తి సంస్థకు నేను చాలా సులభమైన సలహా ఇస్తున్నా. అమెరికాకు వచ్చి ఇక్కడే ఉత్పత్తి మొదలెట్టండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యల్ప పన్నులను విధిస్తాం. అయితే తమ ఉత్పత్తులను ఏ దేశంలో తయారు చేయాలనే పూర్తి స్వేచ్ఛ ఆయా కంపెనీలకు ఉంది. అయితే అమెరికా ఆవల తయారయ్యే ఉత్పత్తుల విషయంలో, వాటి ఆర్థికఅంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది అమెరికానే నిర్ణయిస్తుంది. నేను ఇంతచెప్పినా మీరు అమెరికాలో తయారుచేయబోమని భీష్మించుకుని కూర్చుంటే, మీరు అధిక టారిఫ్ చెల్లించక తప్పదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌదీ.. రేట్లు తగ్గించుకో..‘‘చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాలి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినట్లు 600 బిలియన్ డాలర్లుకాకుండా సౌదీ మా దేశంలో ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. హాస్యాస్పదమైన, ఏకపక్షంగా ఉన్న పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించా. అమెరికాలో మొత్తం వాహనాల్లో నిష్పత్తిలో కొంతమేరకు అత్యంత ఖరీదైన విద్యుత్ వాహనాలనే తప్పకుండా వాడాలనే నిబంధనను రద్దుచేశా. అధిక చమురు ధరలను సౌదీ అరేబియా తగ్గించాల్సిందే. చమురు ధరలు తగ్గితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక ముగింపునకు వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. -
‘ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’
వాషింగ్టన్: అక్రమ వలస దారుల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమర్థించారు. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలస దారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే అందుకు స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్‌కు తీసుకువెళ్లేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని అన్నారు. పత్రాలు లేని వలసదారుల (Undocumented immigrants)ల విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు తెలిపారు.భారత్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇది మంచిది కాదని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలస దారుల విషయంలో మా వైఖరి స్పష్టం ఉందని చెప్పారు. #FPLIVE: External Affairs Minister (EAM) S. Jaishankar, has clarified India's stance, saying that New Delhi is open to the "legitimate return" of Indian nationals living 'illegally' abroad, including in the US. https://t.co/JWyTTCKgXV— Firstpost (@firstpost) January 23, 2025 కాగా, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరుఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే సమయంలో ట్రంప్‌నకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను జై శంకర్‌ను ట్రంప్‌కు అందించారు. -
వలసదారుల పాలిట సింహస్వప్నం లేకెన్ రిలే చట్టం
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి.. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.. అంటూ 1976లో సి. నారాయణరెడ్డి రాసిన పాటను ఎవరైనా ట్రంప్ కు వినిపిస్తే బాగుణ్ణు. పోనీ పాట పాడడం రాకపోతే అప్పట్లో సోక్రటీస్ చెప్పిన మాటను అయినా అమెరికా అధ్యక్షుడికి ఆయనకు వినిపించండి. సోక్రటీస్ ఏమన్నారా... ఆనాటి సమాజంలో పెద్ద నేరంగా పరిగణించబడిన తప్పిదానికి పాల్పడిన ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని ఆనాటి గ్రీకు రాజు తీర్పు ఇచ్చారు.ఆమె ప్రాణభయంతో పరుగుపరుగున సోక్రటీస్ వద్దకు వచ్చిందట.. ఆమెను వదిలిపెట్టి తమకు అప్పగిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామని గ్రామస్తులు సోక్రటీసును కోరారట. అయితే అప్పుడు సోక్రటీస్.. అలాగే .. మీరన్నట్లుగానే ఆమెను మీకు అప్పగిస్తాను.. అయితే 'మీలో ఏనాడూ.. చిన్న పొరపాటు.. తప్పిదం.. ఏ పాపం చేయని వాళ్ళు మొదటి రాయి విసరండి. దీనికి మీ అంతరాత్మే రుజువు' అని కండిషన్ పెట్టారట. దీంతో వచ్చినవాళ్లలో ఎవరూ ఒక్క రాయి కూడా విసరాలేకపోయారట.. వచ్చినవాళ్లంతా ఏదోనాడు చిన్నదో పెద్దదో తప్పు చేశారట.. అందుకే అందరూ రాళ్లు అక్కడ పడేసి వెళ్లిపోయారట ఈ ఎపిసోడ్ కూడా ట్రంప్ కు చెప్పాలి .. ఎందుకంటేఅమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పూటపూటకూ కొత్త చట్టాలు.. నిబంధనలు తీసుకొస్తూ.. అమెరికాలో నివసిస్తున్న వలసజీవులకు నిద్రలేకుండా చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంతమాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరు అంటూ టీజర్ రిలీజ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇంకో టీజర్ సిద్ధం చేసారు. వలసదారులపాలిట సింహస్వప్నంలాంటి లేకెన్ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఇక అమెరికాలో చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తారన్నమాట.చిన్న నేరానికి కూడా వెలివేస్తారా?అమెరికాలో 2022లో లేకెన్ రిలే అనే అమెరికా అమ్మాయిని వెనిజులా నుంచి వచ్చిన ఒక వలసదారుడు హత్య చేసాడు. వాస్తవానికి ఆ హత్య చేసిన అంటొనియా ఇబర్రా అనేవ్యక్తి మీద గతంలో కూడా కేసు నమోదైంది. కానీ అరెస్ట్ చేయలేదు. అప్పుడే వాణ్ని జైల్లో పడేసి ఉంటె ఈ లేకెన్ రిలే హత్యకు గురయ్యేది కాదు కదా.. వలసదారులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం వాళ్ళ స్థానిక అమెరికన్లకు భద్రతా లేకుండా పోతోంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లొసుగులు.. కొన్నికొన్ని మినహాయింపులు ఇలా వలసదారులకు వరంగా మారుతున్నాయి అనే వాదన మొదలైంది.ఇదీ చదవండి: చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం.. లేకెన్ రిలే చట్టం గురించి తెలుసా?దీంతో ఆమె పేరిట ఒక చట్టాన్ని తీసుకురాగా దానికి ట్రంప్ మద్దతుపలుకుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా విచ్చలవిడిగా ఉంటె వెంటనే అరెస్ట్ చేస్తారు.. అంతేకాకుండా వాళ్ళను వెనువెంటనే వారి స్వదేశానికి తరిమేస్తారన్నమాట. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న.. ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతోబాటు పలు విదేశీయులకూ ప్రమాదంగా మారుతోంది.చిన్న చిన్న తప్పులు చేసి అరెస్ట్ అయినంతమాత్రాన అమెరికాలో చదువుకుంటున్న.. జాబ్ చేస్తున్నవాళ్లను వెనువెంటనే వారి స్వదేశానికి పంపేయడం ఏమిటన్న వాదన మొదలైంది. యువత.. విద్యార్థులు తెలిసో.. తెలియకో.. ఏదో చిన్న చిన్న నేరాలు చేసినంతమాత్రాన మొత్తం దేశబహిష్కరణ చేసేసి వారి ఆశలను చిదిమేస్తారా.. అవసరం ఐతే కేసు పెట్టి.. విచారించి శిక్ష వేయాలి కానీ ఇలా ఏకంగా వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.-సిమ్మాదిరప్పన్న -
ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’
ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు.. ఇప్పుడిదే అక్కడ ట్రెండ్!. రేపటి పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. భారతీయులకు ఎంత ఖర్మ... ఎంత దురవస్థ... ఎన్ని అగచాట్లు... ఎంతటి దుర్గతి!. ‘అమెరికా విధాత’ ట్రంప్ గీసిన కలం గీతకు ఒక్క రోజులోనే మారిపోయింది మనోళ్ల తలరాత. పగవాడికి కూడా రాకూడదు ఈ దీనావస్థ... సీన్ ఇప్పుడే ఇలా ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్... మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కు(Birth Right Citizenship)ను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు వెలువరించాడు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకొస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(Executive Order) నేపథ్యంలో ఫిబ్రవరి 20లోపే.. గర్భిణులకు నెలలు నిండక మునుపే... సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలి‘వర్రీ’తో ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ప్రసూతి ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ ఎస్.డి.రామాకు గత రెండు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ‘ముందస్తు డెలివరీ’(Pre Delivery) అభ్యర్థనలు ఎక్కువయ్యాట. ముఖ్యంగా 8వ నెల, 9వ నెల గర్భిణులు ‘సి-సెక్షన్’ (సిజేరియన్ శస్త్రచికిత్స) కోసం హడావుడి పడుతున్నారట. ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలసి తనను సంప్రదించినట్టు డాక్టర్ రామా చెబుతున్నారు. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. ‘డెడ్ లైన్’ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది ఈ పరిణామంతోనే అర్థమవుతోంది. అయితే.. ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.జి.ముక్కాలా (టెక్సాస్) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టే శిశువులో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపొందవని, శిశువు తక్కువ బరువుతో ఉంటుందని, పోషణతోపాటు నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయని ఆయన తెలిపారు. ఈ అంశాలన్నిటినీ ఆయన తన వద్దకు వస్తున్న భారతీయ జంటలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన గత రెండు రోజుల్లో సుమారు 15-20 భారతీయ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారతీయ దంపతులు వరుణ్, ప్రియనే (పేర్లు మార్చాం) తీసుకుంటే... ప్రియ వచ్చే మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. వరుణ్ H-1 B వీసాపై భార్యతో కలసి ఎనిమిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. గ్రీన్ కార్డుల కోసం ఆ జంట ఆరేళ్లుగా నిరీక్షిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. ప్రస్తుతం తాము నిశ్చింతగా ఉండాలంటే ప్రియ ముందస్తు డెలివరీకి వెళ్లడం ఒక్కటే మార్గమని వరుణ్ భావిస్తున్నాడు. “మేం ఇక్కడికి రావడానికి ఎంతో త్యాగం చేశాం. కానీ మా ఎదుటే తలుపు మూసుకుపోతోంది అనిపిస్తోంది’ అని బాధపడ్డాడు ఓ 28 ఏళ్ల ఇండియన్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం. కాలిఫోర్నియాలో ఎనిమిదేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న విజయ్ (పేరు మార్చాం) తాజా ఫిబ్రవరి 20 ‘డెడ్ లైన్’తో నెత్తిన పిడుగుపడ్డట్టు బెంబేలెత్తుతున్నాడు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: The Economic Times) -
ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్గేట్’పై మస్క్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మద్దతు ఉన్న స్టార్గేట్ ఏఐ(Stargate) ప్రాజెక్టును ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. దాంతో ఓపెన్ఏఐ(OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌తో సామాజిక మాధ్యమాలు వేదికగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్‌ల జాయింట్ వెంచర్ అయిన స్టార్గేట్ ఏఐ ప్రాజెక్టు 100 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు సన్నిహితుడు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ కార్యక్రమానికి అధిపతిగా ఉన్న మస్క్ స్టార్గేట్ ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన సందేహాలను వ్యక్తం చేశారు. ‘వారి(ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్) వద్ద నిజంగా డబ్బు లేదు. సాఫ్ట్ బ్యాంక్ 10 బిలియన్ డాలర్ల వరకే వెచ్చించనుంది. నాకు దానిపై పూర్తి అవగాహన ఉంది’ అన్నారు. వెంటనే స్పందించిన ఆల్ట్‌మన్, మస్క్ వాదనలను ఖండిస్తూ టెక్సాస్‌లోని ప్రాజెక్ట్ తొలి నిర్మాణ స్థలాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఆల్ట్‌మన్ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ‘ఇది దేశానికి గొప్ప ప్రాజెక్ట్. దేశానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టైనా మీ కంపెనీలకు అనువైనది కాదని నాకు అర్థం అయింది. కానీ మీరు కొత్త స్థానంలో(డిపార్ట్మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ) అమెరికాను ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.ఇద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు..ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’స్టార్గేట్ ప్రాజెక్ట్అధ్యక్షుడు ట్రంప్ స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో ‘అమెరికా సామర్థ్యంపై విశ్వాసం కలిగించే గొప్ప ప్రకటన’గా అభివర్ణించారు. అధునాతన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్లు, విద్యుదుత్పత్తి సౌకర్యాలను నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే టెక్సాస్‌లో నిర్మాణాన్ని ప్రారంభించింది.సత్య నాదెళ్ల వద్ద 80 బిలియన్ డాలర్లుసీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్లను స్టార్గేట్ ప్రాజెక్టుకు సంబంధించి మస్క్ వాదనలపై ప్రశ్నించగా..‘వారు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు ప్రత్యేకంగా తెలియదు’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం డబ్బు లేదని ఎక్స్‌లో మస్క్ చేసిన పోస్టుల గురించి అడిగినప్పుడు ‘మా వద్ద ఉన్న 80 బిలియన్ డాలర్లతో మేము ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాం’ అని చెప్పారు. నాదెళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మస్క్ ‘సత్య దగ్గర కచ్చితంగా డబ్బుంది’ అని బదులిచ్చారు. -
ట్రంప్ ఆదేశాలు.. బంగ్లాదేశీయులపై ఉక్కుపాదం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆదేశాల మేరకు స్థానిక చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) న్యూయార్క్‌లో అక్రమంగా ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది.న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బరోలోని ఫుల్టన్ ప్రాంతంలో నలుగురు బంగ్లాదేశీయులను ఐసీఈ అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ వలసలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసినప్పటి నుండి అక్రమ వలసదారుల్లో ఆందోళన మొదలయ్యిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.న్యూయార్క్‌లో బంగ్లాదేశీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లోని వీధులు, రెస్టారెంట్లు ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారాయని ఆ పత్రిక నివేదించింది. చట్ట అమలు అధికారి ఖాదీజా ముంతాహా రూబా తెలిపిన వివరాల ప్రకారం తగిన ధృవపత్రాలు లేకుండా సంచరిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. ఇక్కడి బంగ్లాదేశీయులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చట్ట అమలు సంస్థ సభ్యులు వారిని ప్రశ్నిస్తే వారు సహకరించాలని ముంతాహా రూబా సూచించారు. కాగా గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాకు వస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య మరింతగా పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ఆసియా జాతి సమూహాలలో బంగ్లాదేశీయులు పెద్దసంఖ్యలో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి -
ట్రంప్ దూకుడు.. ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!
అమెరికా అన్నిట్లో ముందుంటుంది! అభివృద్ధికి ప్రామాణికమని చెప్పుకుంటారు! ఏ మార్పైనా అక్కడే మొదలవుతుందని, దాన్ని ఏ దేశమైనా అనుసరించొచ్చనే నమ్మకం ఆ దేశానిది.. ప్రపంచానిది కూడా! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేశం ప్రపంచానికేమని సెలవిస్తోంది.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే? ముఖ్యంగా జెండర్ విషయంలో! సాధారణంగా థర్డ్ జెండర్ హక్కుల విషయంలో అమెరికా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. భద్రమైన, గౌరవప్రదమైన గమ్యంగా ప్రపంచంలోని ఎందరో ట్రాన్స్‌జెండర్స్‌కి ఆశ్రయం ఇచ్చింది. ఆ స్పృహ మనతో సహా ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చింది. వాళ్ల హక్కుల కోసం మన దగ్గరా ఉద్యమాలు సాగాయి. ప్రభుత్వాలు వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌గా నియమించింది. ట్రాన్స్‌మన్ ఐఆర్సెస్ ఆఫీసర్ అయ్యాడు. గవర్నమెంట్ డాక్టర్ కొలువొచ్చింది. ఇది కొంత మనం అగ్రరాజ్యం నుంచి నేర్చుకున్నదే! అలాంటిది ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు తాము ‘థర్డ్ జెండర్‌ను గుర్తించం’ అంటూ పాలనా ఉత్తర్వుల మీద సంతకం చేశాడు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ట్రంప్ చేసిన ముఖ్య సంతకాల్లో అదొకటి. ఇప్పుడిప్పుడే సమాన హక్కుల వైపు అడుగులు వేస్తున్న దేశాలకిది విస్మయమే! ఇప్పటికే మన ఐపీసీలోని 377 సెక్షన్‌కు కొత్త చట్టం బీఎన్నెస్( భారతీయ న్యాయ సంహిత) ప్రత్యామ్నాయం చూపక చాలా ఆందోళనలు తలెత్తాయి. దానికిప్పుడు అమెరికా నిర్ణయాన్ని వత్తాసుగా తీసుకునే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యం, సందర్భంలో ట్రాన్స్ జెండర్స్, వాళ్ల హక్కుల కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ..స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయిఅంతకుముందు అమెరికాలో మొదలైన మీ టూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్లాంటి మూవ్మెంట్స్ ప్రభావం మన దగ్గరా (దళిత్ లైవ్స్ మ్యాటర్) ఉండింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ డెసిషన్ వల్ల ఎల్జీబీటీక్యూని వెస్టర్న్ కాన్సెప్ట్ అని అభిప్రాయపడుతున్న వాళ్లంతా ఇక్కడ దాని రిలవెన్స్నే జీరో చేసే చాన్స్ ఉంది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించిన పాలసీలన్నీ కార్పొరేట్ కంపెనీల్లోనే కనిపిస్తాయి. వాళ్లకు ఉద్యోగాలుండేవీ వాటిల్లోనే! ఇవన్నీ చాలావరకు అమెరికా బేస్డ్‌గానే ఉంటాయి. మిగతా ఎక్కడైనా ఎల్జీబీటీక్యూ వాళ్ల ఐడెంటిటీని దాచుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ కోసం ఇండియన్ బిజినెసెస్ కూడా వాళ్ల పాలసీలు కొన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్లే తీసేస్తే వీళ్లూ అనవసరమనుకుంటారు. ఉద్యోగాలుండవు. దానివల్ల వాళ్ల ఏజెన్సీలు కూడా పోతాయి. మళ్లీ మునుపటి స్థితికి వచ్చేస్తారు. స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి. మన దగ్గర థర్డ్ జెండర్‌కి సంబంధించిన చట్టాలు కొంచెం భిన్నంగా, బలంగా ఉన్నాయి. వాటిని మార్చక΄ోతే పర్వాలేదు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిస్తే మాత్రం ఇబ్బందే! ఇంకో విషయం.. రెండే జెండర్లని గుర్తించడం వల్ల ఆ రోల్స్ కూడా రిజిడైపోయి స్త్రీని ఇంటికే పరిమితం చేసే ప్రమాదం, స్త్రీ మీద హింస మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.– దీప్తి సిర్లా, జెండర్ యాక్టివిస్ట్హింస పెట్రేగే ప్రమాదంజెండర్ విషయంలో ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎల్జీబీటీక్యూ, లైంగికత విషయంలో సందిగ్ధంలో ఉన్న పిల్లలు హింసకు లోనయ్యే ప్రమాదం ఉంది. పితృస్వామ్య వ్యవస్థ మరింత బలపడి స్త్రీల మీదా హింస పెట్రేగొచ్చు. ఇప్పుడిప్పుడే జెండర్ రైట్స్ మీద అవగాహన, చైతన్యం పెరుగుతున్న క్రమంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ట్రాన్స్ జెండర్ల జీవితాలకు రిస్క్ నుంచి ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని నిలువరించడానికి అమెరికా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అయితే అదొక్కటే సరి΄ోదు. ట్రంప్ నిర్ణయ పర్యవసానాలను తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీలవాదులందరూ సామాజిక పోరాటంతో మద్దతు తెలపాలి. – రచన ముద్రబోయిన, ట్రాన్స్ రైట్స్, హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్ఫండ్స్, ఉద్యోగాలు ప్రశ్నార్థకమే!చాలా విషయాల్లో మాదిరి జెండర్ విషయంలోనూ ట్రంప్ ఆ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఎన్నో అమెరికన్ కంపెనీలు మన దగ్గర, ఇతర దేశాల్లో ‘డైవర్సిటీ ఈక్విటీ ఇన్‌క్లుజన్’ కింద ఎల్జీబీటీక్యూ వాళ్లకు ఫండ్స్, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ΄ాలసీల వల్ల అవి ప్రశ్నార్థకమవచ్చు! అంతేకాదు తమకు భద్రమైన ప్లేస్‌గా భావించి అమెరికా వెళ్లిన ఎల్జీబీటీక్యుల పరిస్థితేంటి? ΄ాస్΄ోర్ట్‌లో కూడా ట్రాన్స్‌జెండర్ అనే పదం వాడకూడదని చె΄్పాడు. ఆ నేపథ్యంలో వేరే దేశాల నుంచి చదువు కోసం, టూరిజం కోసం వెళ్లే ట్రాన్స్జెండర్ల సంగతేంటి? భయాందోళనలను కలిగించే విషయమే! ఇంకా చె΄్పాలంటే హింసను ప్రేరేపించే నిర్ణయమిది!– తాషి చోడుప్, బౌద్ధ సన్యాసిని, క్వీర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్ -
‘ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?’
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్‌టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్‌ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.టిక్ టాక్ బ్యాన్పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్‌ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..). 👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్‌గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్‌కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది. 👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది. -
చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.లేకెన్ రిలే యాక్ట్ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు. జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్ ప్రకటించింది.అయితే.. లేకెన్ రిలే యాక్ట్ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్‌లో డెమోక్రటిక్ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.అమెరికా జార్జియా స్టేట్ ఏథెన్లో కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన లేకెన్ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు -
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
-
అమెరికా జన్మతః పౌరసత్వంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
వాషింగ్టన్: వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి. 22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచుసెట్స్‌లోని ఫెడరల్ డిస్టిక్ట్ర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడిగానీ పార్లమెంట్‌లోని ప్రజా ప్రతినిధులసభ(దిగువ సభ) లేదంటే సెనేట్(ఎగువ సభ)కు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్‌లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. మీకు ఉన్న ‘తాత్కాలిక నిలుపుదల’, ‘ముందస్తు ఆదేశం’అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలుకాకుండా అడ్డుకోండి’’అని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ష్ట్రాలు అభ్యర్థించారు. ‘‘పుట్టగానే పౌరసత్వం రాదు అని ప్రకటించడమంటే మీరంతా అమెరికన్లు కాబోరు అని వివక్షచూపడమే’’అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావంచూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుపై వలసదారుల హక్కుల సంఘాల కూటమి కోర్టులో దావావేసింది. -
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్‌ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్‌లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్‌ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్‌తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్‌తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పటిష్టం
న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో భారత్–అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పటిష్టం కాగలవని దేశీ పరిశ్రమ దిగ్గజాలు ఆశాభావం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, ఫార్మా, ఎల్రక్టానిక్స్ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మరిన్ని అమెరికా ఉత్పత్తులను దేశీ మార్కెట్లో అనుమతించడం, స్టార్‌లింక్.. టెస్లాకు స్వాగతం పలకడం, అమెజాన్ విషయంలో ఉదారంగా వ్యహరించడం మొదలైనవి భారత్ చేయాల్సి రావచ్చని .. ట్రంప్ ప్రమాణానికి కొద్ది గంటల ముందు ఎక్స్‌లో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా పోస్ట్ చేశారు. దీనికి ప్రతిగా ఏరోస్పేస్ .. డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు సహకరించడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి మద్దతునివ్వడం, భారతీయులకు వీసా నిబంధనలను సడలించడం మొదలైనవి ట్రంప్ చేయొచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపరంగా ట్రంప్ తొలి విడత పాలన సానుకూలంగానే ఉండేదని, ఆయన తిరిగి అధికారం చేపట్టడంతో ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్‌డీసీసీఐ డిప్యుటీ సెక్రటరీ జనరల్ ఎస్పీ శర్మ తెలిపారు. ఫార్మా పరిశోధనలు, తయారీ మొదలైన అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను పరిశీలించవచ్చని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని, స్మార్ట్ఫోన్లు .. ఎల్రక్టానిక్స్ మొదలైన ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్యం గణనీయంగా పెరగవచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అమెరికా డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నిస్తే భారత్ కూడా భాగంగా ఉన్న బ్రిక్స్ కూటమిపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో దేశీ కార్పొరేట్ల ఆశాభావం ప్రాధాన్యం సంతరించుకుంది.