గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్‌కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు.
‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్‌తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.
ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.
ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.
దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది.
ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు.
ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ!


