NTR
-
No Headline
ఎన్టీఆర్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు నరకానికి నకళ్లుగా మారాయి. ఇక్కడ ‘సంక్షేమం’ కానరావడం లేదు. శిథిలమైన భవనాలు, పెచ్చులూడుతున్న శ్లాబులు, తలుపులు లేని మరుగుదొడ్లు, ఫెన్సింగ్ లేని ప్రహరీలు ఇలా అనేక సమస్యలు ఇక్కడ తిష్ట వేశాయి. దుప్పటి నుంచి కంచం వరకు అనేక అవస్థలను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. హాస్టళ్లలో డైట్‌కు సంబంధించి బడ్జెట్ కూడా విడుదల కాలేదు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి. -
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనే
లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు లబ్బీపేట(విజయవాడతూర్పు): లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ బెంజిసర్కిల్లోని సంఘం హాల్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వెసులుబాటు వస్తుందని వాహన యజమానులు అందరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రగతి నుంచి వాహన్‌కు డేటా మైగ్రేషన్‌తో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. నాలుగు నెలల నుంచి ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. రవాణాశాఖ, ఎన్ఐసీ అధికారులు ఎంత చేసినా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని వివరించారు. దీంతో కొన్ని లారీలు నెలల పాటు ఆగిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వెహికల్ ఈ ప్రగతిలో స్టాపేజీ వేసి తదుపరి వెహికల్ రీ ఒకేషన్ పెట్టుకుంటే నాలుగు నెలల నుంచి ఆ పని కాలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాసిన కేసులు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్లు ఈశ్వరరావు తెలిపారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
24న ఉమ్మడి కృష్ణాజిల్లా బాడీబిల్డింగ్ జట్టుకు ఎంపికలు
పెనమలూరు: బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనటానికి క్రీడాకారులను ఎంపిక చేస్తామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి ఈ నెల 24వ తేదీన కానూరు అశోక్ జిమ్‌లో జరగనున్న జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ నెల 30న గుంటూరు జిల్లా రామన్నపేటలో రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తారని, రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడా కారులు వచ్చే నెల 13, 14 తేదీల్లో తమిళనాడులో జరిగే సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 24న జిల్లా జట్టు ఎంపికకు వచ్చే క్రీడాకారులు ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86867 71358 ఫోన్లో సంప్రదించాలని అన్నారు. సంఘ అధ్యక్షుడు బత్తుల మనోహర్, గోల్డ్ ఫిట్నెస్ రాజు పాల్గొన్నారు. -
బాలికల బంగరు భవితకు పునాది
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కిశోరి వికాసం–2 బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం కిశోరి వికాసం–2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిధిమీనా మాట్లాడుతూ కిశోరి వికాసం పునఃప్రారంభం బాలికలకుమంచి అవకాశమని పేర్కొన్నారు. 11 నుంచి 18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. దీనికి గ్రామాల్లో ప్రతి బాలికల సంఘాలను ఏర్పాటుచేసి.. అవగాహన కల్పించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాలికల కోసం ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, డిజిటల్ భద్రత, సైబర్ క్రైం, ఆన్లైన్ వేదికలపై జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. సరైన విజ్ఞానం అందించాలి జిల్లా న్యాయ సేవల అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు.. ప్రపంచానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని.. వీటిని అరికట్టేందుకు సరైన అవగాహనతో సమష్టి కృషి అవసరమన్నారు. పటిష్ట భాగస్వామ్యంతో బాలికల ఎదుగుదలకు తోడ్పడుదామన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం–2006, బాలల లైంగిక దాడి నుంచి రక్షణ చట్టం (పోక్సో) –2012 తదితరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి జి.ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఇంటర్మీడియెట్ విద్య అధికారి సి.శివ సత్యనారాయణరెడ్డి, మార్పు ట్రస్ట్ ఆర్.సూయజ్, స్కిల్ డెవలప్మెంట్ జెడ్డీఎం సుమలత, యోగా ట్రైనర్ శిరీష, డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నిధిమీనా -
దుర్గమ్మ సేవలో శివాచార్య మహాస్వామి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను శ్రీశైల జగద్గురు శ్రీ 1008 చెన్న సిద్దరాం పండితారాధ్య శివాచార్య మహాస్వామి బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆశీర్వచన మండపంలో పండితులు వేదస్వస్తి పలికారు. ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. డిసెంబర్ 15 వరకు ‘బ్రూసెల్లోసిస్ టీకా’గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆడ పశువుల్లో గర్భస్రావానికి, మగ పశువుల్లో కీళ్ల వాపులు, వంధ్యత్వానికి కారణమయ్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు డిసెంబర్ 15 వరకు బ్రూసెల్లోసిస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా.. పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ పశువుల నుంచి మనుషులకు సోకే గుణం ఈ వ్యాధికి ఉందని.. పశు వ్యాధుల నియంత్రణ ద్వారా 4 నుంచి 8 నెలల వయసు ఆడ దూడలకు టీకా వేస్తారన్నారు. ఒకసారి టీకా వేస్తే జీవితంలో మరెప్పుడూ వ్యాధి రాదని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్, సీడీవో వెంకటేశ్వరరావు, డాక్టర్ మనోజ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ టెన్నిస్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టెన్నిస్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వి.రాకేష్ వెంకటేశ్వరచౌదరి (జీఎస్ఎల్ కళాశాల, రాజమండ్రి), జి.విష్ణుసాహిత్ (జీఎస్ఎల్ వైద్య కళాశాల, రాజమండ్రి), సి.హెచ్.ప్రభవ్ (ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం), సి.హెచ్.జనార్దన్ సాగర్ (సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ), ఎం.శివకుమార్(ఎన్ఆర్ఐ వైద్య కళాశాల, చినకాకాని) జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్ కేరళలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. రైతులకు తక్షణమే సాగుసాయం అందించాలని, అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతులు, కౌలురైతులు తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలను మాఫీ చేయాలని, తక్షణమే కౌలురైతుల రక్షణ, సంక్షేమం కోసం సమగ్రమైన కౌలు చట్టం తీసుకురావాలి వంటి డిమాండ్ల సాధనకు ఏపీ రైతుసంఘం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్వోకు ఏపీ కౌలురైతుల సంఘం, రైతు సంఘాల ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యలమందారావు, నేతలు చెరుకూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో సమస్యల తిష్ట
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. వీటిని దశాబ్దాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్జిల్లాలోని వివిధ యాజమాన్యాల్లో 68 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 33, వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్స్ 27, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్ 8(గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్‌తో కలుపుకుని) ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 6,551 మంది బాలబాలికలు వసతి పొందుతున్నారు. చాలా వరకు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. జగ్గయ్యపేటలో.. ‘పేట’లోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్లో 200 మంది వసతి పొందుతున్నారు. వసతి గృహానికి ప్రహరీ లేదు. స్థానిక బోర్ వాటర్‌నే వినియోగిస్తున్నారు. 20 మరుగుదొడ్లు ఉంటే వీటిలో పది మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటికి తలుపులు కూడా సరిగా లేవు. భవనానికి సమీపంలో దీపాలు లేక ఆవరణ చీకటిగా ఉంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం బెడ్ షీట్లు, కార్పెట్లు ఇవ్వలేదు. శానిటరీ నాప్కిన్స్ కాల్చేందుకు మిషన్ ఏర్పాటు చేయలేదు. బాలికల గదికి తలుపులు లేవు. డైట్ బిల్లుల బడ్జెట్ విడుదల కాలేదు. తిరువూరులో.. తిరువూరులో మొత్తం 7 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి మినహా మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. తిరువూరు బస్టాండు సెంటర్లో శిథిలమైన ప్రైవేటు భవనంలో బాలికల స్పెషల్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. 80 మంది విద్యార్థులకు 5 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. పాతతిరువూరులోని బీసీ బాలుర వసతిగృహం శిథిలం కావడంతో ప్రైవేటు భవనంలోకి మార్చారు. గంపలగూడెంలో సమీకృత సంక్షేమ వసతిగృహంలో 400 మందికి 108 మంది మాత్రమే చేరారు. సోమవారం ‘సాక్షి’ విజిట్ చేసిన సమయంలో 40 మంది మాత్రమే ఉన్నారు. ఈ హాస్టల్ పక్కాభవనం కింది ఫ్లోర్ చెదలు పట్టి తలుపులు, కిటికీలు పూర్తిగా పాడయ్యాయి. పై ఫ్లోర్‌కు కూడా చెదలు వ్యాపిస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. 8, 9 తరగతుల్లో విద్యార్థులకు 25 మందికి ఇంకా దుప్పట్లు ఇవ్వలేదు. విస్సన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో 34 మంది కళాశాల విద్యార్థినులు, పాఠశాల వసతిగృహంలో 35 మంది విద్యార్థినులు ఉన్నారు. పురాతన భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఏ కొండూరు మండలంలోని కంభంపాడులో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఉంది. 36 మంది విద్యార్థులకు 14 మంది మాత్రమే సోమవారం హాజరయ్యారు. ప్రహరీ లేకపోవడంతో ప్రాంగణంలోకి కుక్కలు వస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. కిటికీలకు మెష్‌లు లేవు. మైలవరంలో... మైలవరం మండలంలో ఎస్సీ బాలురు, ఎస్సీ బాలికలు, బీసీ బాలురు, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయి. హాస్టల్‌కు తాగు నీటి సమస్య ఉంది. టాయిలెట్స్ సమస్య ఉంది. కొండపల్లిలో ఏపీ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయంలో 405మంది విద్యార్థులు ఉన్నారు. 18 ఇరుకు గదుల్లో సర్దుకుంటున్నారు. టాయిలెట్లను నాడు నేడు పథకంలో అభివృద్ధి చేసినా కొన్నింటికి డోర్లు పగిలి ఉన్నాయి. జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 156 మంది ఇంటర్, పాఠశాలకు 493మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 64 బాత్రూమ్లు ఉండగా 38 మాత్రమే పని చేస్తున్నాయి. భవనం శిథిలావస్థకు చేరింది. కొంతకాలం క్రితం వచ్చిన వరదల్లో ప్రహరీ కూలిపోయింది. విజయవాడ సెంట్రల్.. ప్రకాష్‌నగర్ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మొత్తం 67 మంది వసతి పొందుతున్నారు. భవనం శ్లాబు పెచ్చులూడుతోంది. దుప్పట్లు,బెడ్షీట్లు, పుస్తకాలు అందచేయలేదు. మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేదు. పాయకాపురంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 105 మంది విద్యార్థులు ఉన్నారు. కాస్మెటిక్ చార్జీలు అందలేదు. టాయిలెట్స్ సమస్య ఉంది. ప్రహరీ లేదు. సీసీ కెమెరాలు లేవు. ● ప్రభుత్వ దివ్యాంగుల హాస్టల్లో 30 మంది ఉన్నారు. దుప్పట్లు, కార్పెట్ అందలేదు. మరుగుదొడ్లు డోర్లు పగిలిపోయాయి. మొదటి అంతస్తులో శ్లాబు దెబ్బతిని వర్షం పడితే కారుతోంది. విజయవాడ పశ్చిమంలో.. భవానీపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 63 మంది వసతి పొందుతున్నారు. భవనం పాతది. ఇటీవల రోడ్లు వేయడంతో హాస్టల్ భవనం పల్లమైంది. ప్రహరీ ఎత్తు పెంచాల్సి ఉంది. ఫెన్సింగ్, సీసీ కెమెరాలు లేవు. మరుగుదొడ్లకు తలుపులు లేవు పెచ్చులూడుతున్న శ్లాబులు బాలికల హాస్టల్స్‌కు సీసీ కెమెరాలు, ప్రహరీకి ఫెన్సింగ్ లేదుబడ్జెట్ విడుదల కాలేదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు, డైట్‌కు బడ్జెట్ విడుదల కాలేదు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కావడంతో హాస్టల్లో విద్యార్థులు చేరారు. వీరికి తరగతులను బట్టి రూ.1150, రూ. 1400, రూ.1600 చొప్పున మెస్ చార్జీలు చెల్లిస్తారు. జిల్లాలో కేవలం నాలుగు హాస్టల్స్‌కు మాత్రమే మొదటి త్రైమాసికానికి బడ్జెట్ విడుదల చేశారు. -
‘నా చావుకు తహసీల్దార్, ఆర్ఐ కారణం’
ఇబ్రహీంపట్నం: ‘పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా. నాకు చావే శరణ్యం’ అంటూ ఓ వీఆర్వో సూసైడ్ లెటర్ రాసి, అదృశ్యమవడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, రాఘవాపురం గ్రామానికి చెందిన పెసరమిల్లి అశోక్, కంచికచర్ల మండలం పేరికలపాడు గ్రామ వీఆర్వోగా పనిచేశారు. గత నెల 14న బదిలీపై 4వ సచివాలయానికి వచ్చారు. ఈనెల సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఓ వృద్ధురాలికి పింఛన్ ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తహసీల్దార్ జోక్యంతో పింఛన్ సొమ్మును ఆమెకు అందజేశాడు. ఈ క్రమంలో అశోక్ సోమవారం రాత్రి తన చావుకు మండల తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, ఆర్ఐ వరప్రసాద్ కారణం అంటూ రాసిన ఓ సూసైడ్ లెటర్ రెవెన్యూ ఉద్యోగుల గ్రూప్‌లో పోస్టు చేశారు. మంగళవారం ఉదయం ఇతర వాట్సాప్ గ్రూపుల్లో ఆలేఖ ప్రత్యక్షమవడంతో కలకలం రేగింది. రెవెన్యూ అధికారులు అశోక్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ‘నాకు హార్ట్ సర్జరీ జరిగింది. 75 పీజీఆర్ఎస్ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని తహసీల్దార్, ఆర్ఐ నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మధ్య ఫిట్స్ వచ్చి చికిత్స పొందాను. నన్ను కలెక్టర్ కార్యాలయంలో సరెండర్ చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పారు. వీరి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. నా చావుకు తహసీల్దార్, ఆర్ఐ కారణం’ అని సూసైడ్ లెటర్లో రాశాడు. ఈ విషయంపై తహసీల్దార్ వెంకటేశ్వర్లుని వివరణ కోరగా.. అశోక్ విధి నిర్వహణలో అలసత్వం వహించాడని, ఆయన వల్ల కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలిపారు. ఈనెల 5న అశోక్‌ను కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశానని, ప్రస్తుతం ఆయనతో తమ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయినా అశోక్ స్వగ్రామానికి సిబ్బందిని పంపించి వాకబు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ● సూసైడ్ లెటర్ రాసిన వీఆర్వో ● ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు ● ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం -
కంకిపాడులో ఉద్రిక్తత
ఉత్సాహంగా కేక్ మిక్సింగ్ ● వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు ● పరామర్శకు వెళ్లనీయకుండా అడ్డగించిన పోలీసులు గుణదలలోని హోటల్ హయత్ ప్లేస్‌లో మంగళవారం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, వైన్, విస్క్, గ్రేప్ జ్యూస్‌తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ను తయారు చేశారు. 40 రోజుల పాటు నిల్వ ఉంచి క్రిస్మస్తో పాటు నూతన సంవత్సర కేక్ తయారు చేసి అతిథులకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు, యువత హుషారుగా పాల్గొన్నారు. – పవన్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ కంకిపాడు: వైఎస్సార్ సీపీ నేతల అరెస్టుతో కంకిపాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి సర్కారు ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించటం వివాదాస్పదం అయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరులు ఒ.మోహనరంగా, ఎంపీపీ అనగాని రవి, బిహెచ్ యతీంద్ర రామకృష్ణ (రాము), మేచినేని బాబు, సూరపనేని అనిల్, గొన్నూరి సీమయ్య, గుర్రం నాని, కె.నిరంజన్కుమార్లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసి కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అదనపు ఎస్పీ వివి నాయుడు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సీఐలు, ఎస్ఐలు పోలీసుస్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా పోలీసులు వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు వ్యవహారంలో వ్యవహరించారు. పోలీసుస్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ మాదిరిగా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు స్టేషన్‌కు తలుపులు వేసి రోడ్డు మీద కాపలా కాయటం విడ్డూరం. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నేతలు స్టేషన్ రోడ్డులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కమ్మ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామినేని రమాదేవి స్టేషన్లో ఉన్న తమ నేతలను కలుస్తానని, కాళ్లు పట్టుకుంటా ఒప్పుకోండి అంటూ బతిమాలారు. మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి, అనగాని రవి తనయుడు సుందర్ చైతన్య, ఎంపీటీసీ చిట్టూరి ప్రసాద్, నేతలు శీలం రంగారావు, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. -
నగరంలో
విజయవాడ నగరం మంగళవారం కోలాహలంగా మారింది. గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరి శారదాపీఠానికి మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతిస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు పార్టీ నాయకులు దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు స్వాగతం పలికారు. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. పేరు పేరునా వారిని ఆప్యాయంగా పలకరించారు. చిరునవ్వుతో అభిమానులతో కరచాలనం చేశారు. – గాంధీనగర్(విజయవాడసెంట్రల్) -
నీటి కోసం ఎదురుచూస్తున్న కృష్ణా డెల్టా రైతులు
రైతుకు సార్వా పంట కంటే దాళ్వా పంటలోనే దిగుబడి, ఆదాయం ఉంటాయి. సార్వా పంట తుఫాను, చీడ పురుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో బంటుమిల్లి కాలువ శివారు భూములన్నీ అపరాలు పండవు. దాళ్వా ఒకటే రెండో పంటగా సాగు చేయాల్సి ఉంది. రైతు బాధను అర్థం చేసుకుని రెండో పంటకు నీరు ఇస్తే బాగుంటుంది. వెంట్రపాటి సురేష్, పెందుర్రు, బంటుమిల్లి మండలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో రైతులు దాళ్వా సాగుపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది వరి నాట్ల ప్రారంభ సమయంలో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారు. ఆగష్టు, సెప్టెంబరు నెలలో అధిక వర్షాలతో రైతన్నలకు నష్టం వాటిల్లింది. బుడమేరు పరివాహక ప్రాంతంలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. దీనికితోడు వరి పంటను తెగుళ్లు అశించాయి. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వరి దిగుబడులు సైతం తగ్గాయని వ్యవసాయ రంగ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1,65,789 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 1,51,718 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. అధిక వర్షాలు, బుడమేరు వరదల కారణంగా 24,162 హెక్టార్లలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 161.29 టీఎంసీలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 295.99 టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు లో 43.26 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం పట్టిసీమ నీటిని కూడా తీసుకొంటున్నారు. ఈనేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో డెల్టాలోని బంటుమల్లి, కృత్తివెన్ను, పెడన , మచిలీపట్నం, గుడూరు మండలాల పరిధిలో సుమారు 30 వేల హెక్టార్లకు దాళ్వాకు నీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ భూములన్నీ సముద్రతీర సాల్ట్ భూములు చౌడు భూములుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. కంకిపాడు, పెనమలూరు మండలాల్లో రెండవ పంటగా వరి 10 వేల హెక్టార్లలో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో ఇంత కన్నా తక్కువ నీరు ఉన్నా రెండవ పంటకు నీరు ఇచ్చారు. కరువు వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఆయకట్టుకు నీరు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తప్పక కుండా నీరు ఇవ్వాలని, లేకపోతే ఒక్క పంటకే పరిమితమయ్యే పరిస్థతి వస్తుందని అందోళన చెందుతున్నారు. ఈ మండలాల్లో వరి తప్ప మిగతా పంటలు పండే పరిస్థితి లేదని చెబుతున్నారు. త్వరలో జరిగే నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీనుకొంటారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగర్ మేజర్, మైనర్ కాలువలకు మరమ్మతులు లేక నీరు పారే పరిస్థితి లేదు. సాగునీరు సరఫరా చేసే ముందే కాలువలు బాగు చేయాలి. చిట్టడవిని తలపిస్తున్న మేజర్లను వెంటనే బాగుచేయకపోతే సాగర్ జలాలు వృథాగా పోతాయి. కె.నాగిరెడ్డి, అక్కపాెం, తిరువూరు మండలం ఎన్ఎస్పీ పరిధిలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైనం నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు రబీలో 85 వేల ఎకరాల్లో వరిపంట సాగవుతుందని అంచనా రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోతే మా భూములన్నీ బీడు వారిపోతాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో మా ప్రాంతంలో నేల స్వభావం అధికంగా లవణ సాంద్రత కలిగి ఉంటుంది. దాళ్వాకు నీరు ఇవ్వకపోతే దాని ప్రభావం తరువాత వచ్చే సార్వాపై తీవ్రంగా ఉంటుంది. పాశం శ్రీనివాసరరావు (రాము), నీలిపూడి, కృత్తివెన్ను మండలం ఎన్ఎస్పీ ఎడమ కాలువ పరిధిలో ఆరుతడి పంటలకు డిసెంబరు 1నుంచి నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున ఎడమ కాలువ పరిధిలో తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో 2.52 లక్షల ఆయకట్టు ఉంది. ప్రధానంగా మిరపతో పాటు ఆరుతడి పంటలకు సంబంధించి రెండు నెలలకు సరిపడా 15 టీఎంసీల నీరు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తరువాత అవసరాన్ని బట్టి నీటి విడుదల కోసం ప్రయత్నిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మైలవరం, నందిగామ వంటి ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలువల్లో పూడిక, తూటికాడ, మరమ్మతులు వంటి పనులు చేపట్టి, నీరు కాలువల గుండా ఇబ్బంది లేకుండా పారేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారునికి వడ్డీతో బీమా మొత్తాన్ని చెల్లించాలని వినియోగదారుల కమిషన్ కార్యనిర్వహణ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల మంగళవారం తీర్పునిచ్చారు. మచిలీపట్నం నగరానికి చెందిన చలువాది ఓంప్రకాష్ స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 2021లో తమతో పాటు కుటుంబ సభ్యులకు హెల్త్ పాలసీని తీసుకున్నారు. 2023లో ఓంప్రకాష్‌కు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి హెర్నియా ఆపరేషన్ చేయించుకోవటంతో రూ.63,256 ఖర్చు అయ్యింది. ఈ మొత్తాన్ని క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా హెర్నియా ఆపరేషన్‌ను తమ పరిధిలో లేని ఆస్పత్రిలో చేయించారని క్లయిమ్‌ను తిరస్కరించారు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పూర్వాపరాలను విచారించిన అనంతరం కమిషన్ సభ్యులు ఓంప్రకాష్ కు రూ.58,714 లు బీమా మొత్తాన్ని 2023 సెప్టెంబరు 13వ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు రూ.15 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి
కనుమూరు(పామర్రు): రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ మృతి చెందిన సంఘటన పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కురుమద్దాలి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఆర్ఎంపీ పిడుగు సురేంద్ర(45) విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిలో ఉయ్యూరు వైపు వెళ్తున్నాడు. కనుమూరు చెక్‌పోస్టు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టి వెళ్లి పోయింది. దీనితో సురేంద్ర రహదారిపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పామర్రు ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎంపీ మృతితో కురుమద్దాలి గ్రామం ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వేలమూరు గ్రామవాస్తవ్యులు కోయ వెంకట గౌరీ రత్నకుమారి రూ. 1,01,116 విరాళంగా ఆలయ సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణకు అందజేశారు. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌శర్మ సమక్షంలో ఈ విరాళాన్ని నగదు రూపంలో అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారులు బర్మా ప్రసాద్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్‌రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని ఆలయ ఈవో కెఎస్.రామరావు తెలిపారు. ఘాట్‌రోడ్డులో కొండ రాళ్లు జారిపడకుండా రక్షణ చర్యల్లో భాగంగా పనులు జరుగుతున్నాయి. పనులు వేగవంతంగా చేపట్టేందుకు మూడు రోజుల పాటు ఘాట్‌రోడ్డులో రాకపోకలను పూర్తిని నిలిపివేస్తామని అధికారులు పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఘాట్‌రోడ్డు మీదగా సాధారణ భక్తులతో పాటు వీఐపీలను అనుమతించబోమని స్పష్టం చేశారు. భక్తులందరూ కనకదుర్గనగర్, మహా మండపం మీదగా లిప్టు, మెట్ల మార్గం ద్వారా అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని క్యూలైన్లలో దర్శనానికి వెళ్లాలని సూచించారు. పాఠశాలలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం ఉంగుటూరు: గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు, దావాజిగూడెంలో పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం ఆత్కూరులో అన్నే సీతారామయ్య జెడ్పీ హైస్కూల్, దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో విద్యావిధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయ బోధన పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. ఆర్థికవేత్త, టాస్క్ టీమ్ లీడర్ క్రిస్టెల్, దక్షిణ ఆసియా ప్రతినిధి కికో ఇనోయూ, జుంకో ఒనిషి (లీడ్ సోషియల్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లీడర్ ఇండియా), డి.హెచ్.సి. అటూరుపనే (లీడ్ ఆర్థికవేత్త), కార్తిక్ పెంటల్ (సీనియర్ ఎడ్యూకేషన్ స్పెషలిస్ట్), తనుజ్ మథూర్ (సీనియర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్), కన్సల్టెంట్ ప్రియంకా సాహూ, మన బడి మన భవిష్యత్తు జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, శామో అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, ఏపీఈడబ్ల్యూడీసీ ఎంపీ దివాన్రెడ్డి, డీఈవో రామారావు, సత్త్వాకై వల్య టీచ్ టూల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ కోశాధికారి ఎన్.సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో పనిచేస్తూ గురుకులాలు రూపొందించే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామన్నారు. గత వది సంవత్సరాల నుంచి తమ సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ నేతలు మల్లిఖార్జున నాయక్, యన్ పరమేష్, యం.విజయ్ కుమార్ నాయక్, జి. బ్రహ్మయ్య, టీచర్లు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024u8లో యార్డుకు 43,356 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,356 మిర్చి బస్తాలు వచ్చాయి. 39,948 బస్తాలు అమ్మకాలు జరిగాయి.శివయ్యకు అన్నాభిషేకం నాగాయలంక: నాగాయలంక కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీరామ లింగేశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు. బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లో మంగళవారం యుఎఫ్బీఆర్వో ఆధ్వర్యంలో ధర్నా చేశారు.7 -
పెడనలో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
పెడన: పెడన బైపాస్ రోడ్‌లోని రైల్వే గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం రైలు ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలు కిందపడి ఓ వ్యక్తి చనిపోయినట్లు రైలు డ్రైవర్ పెడన రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారన్నారు. వారు రైల్వే పోలీసులకు సమాచారమివ్వవడంతో మచిలీపట్నంకు చెందిన తాను సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టామని చెప్పారు. మృతుడి వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, ఒంటిపై లైట్ గ్రీన్ షర్టు, ఎరుపు రంగు షార్ట్ ధరించి ఉన్నా డన్నారు. రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు వ్యక్తిని ఢీకొందా లేక ఆ వ్యక్తి కావాలని రైలు కింద పడ్డాడా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. -
బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అలంకార్ సెంటర్లో మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ (యుఎఫ్బీఆర్వో) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మంది రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. పెన్షన్ మెరుగుపరచాలని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి ఎఐబీఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌నాయక్ మాట్లాడుతూ బ్యాంక్‌లు జాతీయం చేసిన నాటి నుంచి దేశాభివృద్ధికి బ్యాంక్‌లు చేసిన సేవలను వివరించారు. 1993 నుంచి ఇప్పటి వరకు పెన్షన్ అప్డేట్ చేయలేదని, ఇది ప్రభుత్వాలు, బ్యాంకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. పన్నులు విధించడం అన్యాయం.. ఎం.ఎన్. రావు మాట్లాడుతూ బ్యాంక్ రిటైర్ ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తం బ్యాంకులే భరించాలన్నారు. పాత పెన్షన్ అప్డేట్ చేయకుండా పన్నులు విధించడం అన్యాయమని చెప్పారు. ఏపీ బీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బీవీవీ కొండలరావు మాట్లాడుతూ.. రిటైర్ ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో పెన్షన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మద్దతు తెలిపారు. ధర్నాలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్లారావు, వి.జగన్మోహన్రావు, బి.ఆంజనేయరాజు, ఎంబీ శంకరరావు, పి.వీరారెడ్డి, చంద్రశేఖర్, హరిబాబు, రాజేశ్వరరావు, రామచంద్రరావు, నారాయణరావు, నరేంద్రదేవ్, కామేశ్వరరావు, ఏ.రమణ, ఎంఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 10 వరకు ప్రచార కార్యక్రమం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): హమారా శౌచాలయ్ – హమారా సమ్మాన్ పేరిట మంగళవారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్(డీడబ్ల్యూఎస్ఎం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్చార్జి కలెక్టర్ నిధిమీనా మన మరుగుదొడ్లు – మన గౌరవం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి – ఆనందంగా జీవించండి అంటూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సమాజానికి విశేష సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడంతో పాటు లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇన్చార్జి కలెక్టర్ నిధిమీనా మాట్లాడుతూ.. మంగళవారం ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమాలు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో వినూత్న ఆలోచనలతో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం అమలుకు కృషి చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈడీ బి.అర్జున్‌రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎస్.విద్యాసాగర్, డీపీఓ పి.లావణ్య కుమారి, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని, జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. హమారా శౌచాలయ్ – హమారా సమ్మాన్పై ప్రచారం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా -
వ్యాపార నిర్వహణపై రేపటి నుంచి శిక్షణ తరగతులు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహించడం ఎలా అనే అంశంపై ఈ నెల 21వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్‌బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఎనిమిది రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలనే అంశాలను అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎనిమిదో తరగతి పాస్, ఫెయిల్ అయిన 18 నుంచి 40 ఏళ్లలోపు వారు హాజరు కావాలన్నారు. వివరాలకు 97000 25833 సెల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కార్మికుడి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష
విజయవాడస్పోర్ట్స్: పౌండ్రీ కార్మికుడిని లారీతో ఢీ కొట్టి, అతని మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ విజయవాడ మూడో అడిషనల్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి పి.తిరుమలరావు మంగళవారం తీర్పునిచ్చారు. ఎనికేపాడులోని ఓ పౌండ్రీలో స్టోర్ కీపర్‌గా పని చేసిన తిరుమలరావును అదే ప్రాంతంలోని హైవేపై గన్నవరం నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సహోద్యోగి అప్పారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 2017 జూన్ ఏడో తేదీన జరిగిన ప్రమాదంలో తిరుమలరావు అక్కడికక్కడే మరణించాడు. నిర్లక్ష్యంగా లారీని నడిపి తిరుమలరావు మృతికి కారణమైన లారీ డ్రైవర్ వాడపల్లి బాలజోజప్పను పటమట పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ప్రాసిక్యూషన్ తరుఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.గంగాధర్ కోర్టుకు వాదనలు వినిపించారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో లారీ డ్రైవర్‌కు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
శబరిమలకు 16 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి – కొల్లం(07143) డిసెంబర్ 6, 13, 20, 27(శుక్రవారాలు) తేదీల్లో ఉదయం 11.30 గంటలకు మౌలాలిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07144) డిసెంబర్ 8, 15, 22, 29(ఆదివారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మౌలాలి చేరుకుంటుంది. మచిలీపట్నం టు కొల్లం మచిలీపట్నం – కొల్లం(07145) డిసెంబర్ 2, 9, 16(సోమవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07146) డిసెంబర్ 4, 11, 18(బుధవారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం – కొల్లం(07147) డిసెంబర్ 23, 30(సోమవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07148) డిసెంబర్ 25, జనవరి 1(బుధవారాలు) తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. విజయవాడ డివిజన్లో పలు రైళ్ల దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని గన్నవరం – ముస్తాబాద్, చేబ్రోలు సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19 నుంచి 23, 25 నుంచి 30 వరకు దన్బాద్ – అలప్పుజ(13351), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా – యశ్వంత్‌పూర్(18111), ఈ నెల 20, 27 తేదీల్లో జసిదీహ్ – తాంబరం(12376), ఈ నెల 23, 30 తేదీల్లో హతియ – బెంగళూరు(18637), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా – బెంగళూరు(12889), ఈ నెల 25న హతియ – యర్నాకులం(22837), ఈ నెల 19, 26 తేదీల్లో హతియ – బెంగళూరు(12835), ఈ నెల 28న విశాఖపట్నం – షిర్డీ సాయినగర్(18503), ఈ నెల 29న విశాఖపట్నం – హజరత్ నిజాముద్దీన్(12803) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తాయని చెప్పారు. -
పెళ్లి రిజిస్ట్రేషన్‌కూ తిప్పలే !
లబ్బీపేట(విజయవాడతూర్పు): పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు ఖర్చుతో కూడుకున్న అంశంగా తయారైంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లే ఉన్నా, మధ్యవర్తులు రూ.వేలల్లో తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డులో భార్య ఇంటిపేరు మార్చడం, కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసేందుకు ఇప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. అంతేకాదు భర్త ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగి అయితే, పీఎఫ్, ఈఎస్ఐ రికార్డుల్లో భార్య పేరు ఎక్కించేందుకు కచ్చితంగా ఇంటిపేరు మార్చాలని చెబుతున్నారు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నిబంధనలతో పాటు, రూ.వేలల్లో తీసుకోవడంతో ఆర్థిక భారంతో చేయించుకోలేని స్థితి నెలకొంది. ఇబ్బందులు ఇలా.. ● సింగ్‌నగర్‌కు చెందిన వెంకట్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకమ్మలకు గతేడాది అక్టోబరులో విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెళ్లి జరిగింది. ఇప్పుడు వాళ్లు రిజిస్ట్రేషన్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబరులో వచ్చిన వరదల్లో వారి పెళ్లి ఫొటోలు అన్నీ తడిసిపోయాయి. కార్డులు కూడా లేవు. దీంతో మధ్యవర్తులను సంప్రదిస్తే రూ.5 వేలు అడుగున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం వెళితే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నట్లు చెబుతున్నారు. ● మధురానగర్‌కు చెందిన శ్రావణ్, కంకిపాడుకు చెందిన మాధురిని ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు కోసం వెళితే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారని, రిజిస్ట్రేషన్‌కు వెళితే రూ.3 వేలు అడుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది నిత్యం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కోసం తిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ నిబంధనలు ఇలా.. హిందూ పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే భార్య, భర్త తరఫున ముద్రించిన వెడ్డింగ్ కార్డులు, వయసు నిర్థారణ ధ్రువపత్రాలు,(10వ తరగతి మార్కుల లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లలో ఏదొకటి), పెళ్లి కల్యాణ మండపంలో జరిగితే సంబంధిత రసీదు, పెళ్లి ఫొటోలు జీలకర్ర బెల్లం పెట్టేవి, తాళి కట్టేవి, పెద్దలు ఆశీర్వదించే ఫొటోలు, భార్య భర్తలతో పాటు, మరో ముగ్గురు ఆధార్ కార్డులు ఉండాలి. పెళ్లి జరిగి రెండు నెలలు దాటితే రూ.10ల స్టాంప్‌పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500లు ఆన్లైన్లో చెల్లిస్తే స్లాట్ బుక్ అవుతుంది. ఆ తేదీన వెళితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలా చేసినా మధ్యవర్తులు రూ.3,500ల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాదు వయసు ధ్రువీకరణపత్రం లేకుంటే దానికోసం మరో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ లేని వారికి రిజిస్ట్రేషన్ పెద్ద సమస్యగా మారింది. క్రిస్టియన్ మ్యారేజీకి మరింత ఇబ్బంది క్రిస్టియన్ మ్యారేజీ చేసుకున్న వారు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అందుకోసం పెళ్లి సమయంలో పాస్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లు, పెళ్లి ఫొటోతో పాటు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పాస్టర్ పంపిన లిస్టు ఫొటోస్టాట్ పెట్టాలి. చాలా మంది పెళ్లి చేసిన తర్వాత ఆ లిస్టులను జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపడం లేదు. దీంతో క్రిస్టియన్ పెళ్లి రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కుదరని వాళ్లు డబ్బు ఖర్చు చేసి స్పెషల్ మ్యారేజీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ప్రతి పనికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో ముడి రేషన్ కార్డు, భార్య ఇంటిపేరు మార్పు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌కు రూ.3,500 పైనే వసూలు చేస్తున్న మధ్యవర్తులునిబంధనలు సులభతరం చేయాలి.. ప్రస్తుతం అన్నింటికీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. ముఖ్యంగా పేదలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు అవసరమవుతుంది. దీంతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి పెళ్లి రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనలను సులభతరం చేయాలి. – వడ్లమూడి సంపత్, మొగల్రాజపురం -
టెన్నిస్ సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో స్వర్ణం
విజయవాడస్పోర్ట్స్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో విజయవాడ క్రీడాకారుడు ఎం.మల్లికార్జునరావు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పాలకొల్లులో జరిగిన ఈ పోటీల్లో 75 ప్లస్ డబుల్స్ విభాగంలో మల్లికార్జునరావు(విజయవాడ) – వై.భాస్కరరావు(హైదరాబాద్) జోడి ఫైనల్స్‌లో ప్రత్యర్థి శేషసాయి(బెంగళూరు) – వీఏఎస్ నాయుడు(అనకాపల్లి) జోడిని ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకున్నారు. జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో మెడల్ సాధించిన వారిని పలువురు క్రీడా ప్రముఖులు అభినందించారు. -
ఉద్యోగుల పనిష్మెంట్పై 70, 71 జీఓలను రద్దు చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్పై 70, 71 జీఓలను రద్దు చేయాలని ఏపీ పీటీడీ(ఆర్టీసీ) బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీ శేషగిరిరావు, సలహాదారు ఎం.తిరుపతిరావు ఆధ్వర్యంలో సభ్యులు మంగళవారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని)ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల పనిష్మెంట్కు సంబంధించి అధికారుల సమగ్ర పరిశీలన అనంతరం 2019లో ఒక సర్క్యులర్ విడుదల చేశారని, తద్వారా ఉద్యోగులకు మేలు జరిగేదని ఎంపీ చిన్నికి వివరించారు. ఆ సర్క్యులర్ అమలులో ఉండగానే మళ్లీ 70, 71 జీఓలను జారీ చేసి వాటి ద్వారా పాత పద్ధతుల్లోనే చర్యలు తీసుకుంటూ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు జీఓలను రద్దు చేసి 2019 సర్క్యూలర్‌ను మాత్రమే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు శేషగిరిరావు తెలిపారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27.5 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. భవానీపురం పోలీసు స్టేషన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ ఎం.రాజారావు వెల్లడించారు. ఈనెల 12న భవానీపురం సభాపతి రోడ్డుకు చెందిన ఓ మహిళ ఉదయం ప్రసన్న కాళీ గుడికి బయలుదేరింది. స్వాతి సెంటర్ శ్రీలక్ష్మి టిఫిన్ బండి పక్క వీధిలోకి వచ్చే సరికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో నానుతాడు లాక్కొని వెళ్లిపోయారు. దీనిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వెంకటేశ్వర ఫౌండ్రీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి బైక్ వెనుకకు తిప్పుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారిని హైదరాబాద్‌కు చెందిన సిగడం కుమార్, అమలాపురానికి చెందిన యాలాంగి కృష్ణగా గుర్తించారు. వీరిద్దరు పాత నేరస్తులని, వీరిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దొంగిలించిన బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వెళ్తూ పట్టుబడ్డారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఉయ్యూరు: ఉయ్యూరు పుల్లేరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఉయ్యూరు పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటరులో వంతెన వద్ద స్థానికులు కాలువలో మృతదేహాన్ని గుర్తించి, తమకు సమాచారం అందించారన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించమని చెప్పారు. మృతుడు వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, ఎరుపు, నలుపు రంగు గళ్ల చొక్కా, జీన్స్ నిక్కరు ధరించి, 5.3 అడుగులు ఎత్తు ఉన్నాడన్నారు. మృతుడి వివరాలకు ఉయ్యూరు పట్టణ పోలీసులను సంప్రదించాలని కోరారు.