breaking news
-
మరో పొలిటికల్ బాంబు పేల్చిన కవిత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కొత్త పార్టీపై ఎలాంటి ఆలోచన చేయలేదు. అలాగే, కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. ఇదే సమయంలో తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తోంది. బీఆర్ఎస్లో అందరూ నన్ను ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. నా రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చాను. స్పీకర్‌కు ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగాను. అవసరమైతే మళ్ళీ రాజీనామా లేఖను పంపిస్తాను. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీలు పెట్టుకునే హక్కు ఉంది. నాకు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే.కాళేశ్వరం విషయంలో తప్ప హరీష్ రావుపై వేరే కోపం లేదు. ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతాయి. చాలా విషయాల్లో హరీష్ రావు తనకు సంబంధం లేదన్నారు. అంతా కేసీఆర్ నిర్ణయమే అన్ని హరీష్ చెప్పినట్టు నివేదికలో ఉంది. వివిధ శాఖల ఫైల్స్ నేరుగా కేసీఆర్‌కు వెళ్తున్నాయి.. ఇది చూసుకోవాలని 2016లోనే కేటీఆర్‌కు సూచించాను. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాలి. నేను రాజీనామా చేసిన తర్వాత.. నాతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు పెద్దదిగానే ఉంది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి.మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదు. నాకు కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనే లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నన్ను సంప్రదించలేదు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలి. బీసీల కోసం కోట్లాడుతున్నాం.. ముందు రిజర్వేషన్లను సాధించుకుందాం. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
‘రేవంత్‌రెడ్డి అరగంట లైబ్రరీలో కూర్చొని చదవగలరా?’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కనీసం ఒక అరగంట కదలకుండా కూర్చొని ఏకాగ్రతతో చదవాలని, నిరుద్యోగ యువత సమస్యలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని.. కోర్టు తీర్పును అమలు చేయకుండా గ్రూప్-1 అభ్యర్థులను మోసం చేస్తోందంటూ నిరసనకు దిగారు.ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని వట్టికోట ఆళ్వారు స్వామి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో కలిసి గంటన్నర పాటు పుస్తక పఠనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లైబ్రరీకి వెళ్లి చదువుకోవడానికి, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి లైబ్రరీకి వస్తే కూడా ఆంక్షలు విధించడం ఏంటని ప్రభుత్వాన్ని విమర్శించారు. గంటన్నర చదవడానికే చాలా ఇబ్బందిపడ్డానని నిరుద్యోగులు 4 ఏళ్ల నుండి చదువుతున్నారని,వారెంత బాధ పడుతున్నారో తెలుసుకోవాలన్నారు. చదువు, నిరుద్యోగుల కష్టం గురించి తెలియాలంటే రేవంత్ రెడ్డి లైబ్రరీకి వచ్చి కనీసం అరగంట ఏకాగ్రతతో చదవాలని సవాల్ విసిరారు.చదవకుండా క్రిమినల్ కేసులున్న వ్యక్తి రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత చాలా కష్టపడి, గత మూడు, నాలుగేండ్లుగా ఉద్యోగ్ల కోసం చదువుతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైందని, జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఏం మాట్లాడినా రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడం సరైంది కాదన్నారు. బి ఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరపున నిరంతరం కొట్లాడుతుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేనపుడు పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు.గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర హై కోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. కోర్టు 222 పేజీల తీర్పును ఇచ్చిందని, కోర్టు తీర్పులో చివరి 15 పేజీల రిపోర్టు చదివితే నిరుద్యోగ యువత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై ఖచ్చితంగా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ కోర్టును సంప్రదించడం అంటే,నిరుద్యోగులను అవమానపరచడమేనన్నారు. -
కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందని.. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తుంది.. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు, సంతోషే.. వారి కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే వ్యతిరేకిస్తానన్న రేవంత్.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారన్నారు.‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కిషన్‌రెడ్డి ఆపుతున్నారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్‌రెడ్డి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు వేయకపోవడమే నిదర్శనం. కిషన్‌రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచే కిషన్‌రెడ్డి సలహాలు తీసుకుంటారు. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇస్తాం. కమిషన్ నివేదిక సీబీఐకి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి రియాక్షన్
సాక్షి, వరంగల్: తాను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ నోటీసులపై స్పందించారు. నోటీసులపై తన సమాధానం స్పీకర్ ముందు ఉంచుతానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కనపెట్టాల్సి వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.తన రాజీనామాపై ఎవరి ఆశలు వాళ్లవి అని.. రిప్లై కోసం స్పీకర్ నోటీస్‌లో ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చారని ఆయన తెలిపారు. తప్పనిసరిగా తన సమాధానం స్పీకర్ ముందు ఉంచుతానని.. నేను ఏ పార్టీలో ఉన్నానో అప్పుడే స్పీకర్ తేలుస్తారన్నారు. ఎప్పుడైనా.. పార్టీ మారి నేను సెటిల్మెంట్, కబ్జాలు, అక్రమాలు చేయలేదు. తాను అక్రమాలు చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాదని నా నిజాయితీ అనుభవం చూసే కేసీఆర్ నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారు. నేను ఎన్నడూ ఎవరికీ పాదాభివందనాలు చేయలేదు’’ అని కడియం చెప్పుకొచ్చారు. -
వీడిన సస్పెన్స్.. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సతీమణిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థిపై ప్రకటన చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాదులో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మార్చిన బీఆర్ఎస్ను అన్ని స్థానాల్లో గెలిపించారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చింది. అందరూ ఆమెను ఆశీర్వదించండి అని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. మరిన్ని ఆధారాలు సమర్పించాలంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ నోటీసులు జారీ కావడం గమనార్హం. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం)లకు తాజాగా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫిరాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ స్పీకర్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి.. కాంగ్రెస్‌లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో.. స్పీకర్ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేయగా.. 10 మంది ఎమ్మెల్యేల్లో.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), సంజయ్(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ) ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. . తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు. దీంతో వీళ్ల వివరణపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11న స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. అయితే.. వీరితోపాటు నోటీసులు స్వీకరించిన శాసనసభ్యులు కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్(ఖైరతాబాద్) మాత్రం ఇంకా సమాధానాలివ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు.. నోటీసులపై సమాధానాలిచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని.. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు పేరిట లేఖలు వెళ్లాయి. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా.. నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలుంటాయి. కాబట్టి.. తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన మూడు రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. -
బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతోందో తెలుసుకో కేటీఆర్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం జిల్లా: జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సంగతి తెలుస్తుందంటూ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో కేటీఆర్ తెలుసుకోవాలన్న పొంగులేటి.. రెండుసార్లు బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు‘‘మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇటీవల ఒక మహిళ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందినప్పుడు జరిగిన ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో స్థానంలో ఉందొ లెక్క పెట్టుకో....త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ పార్టీ స్థానం ఎక్కడ వుంటుందో ఆలోచించుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకో.. నీ దయా దాక్షిణ్యాలతో బీ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్.. పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడు నువ్వెంత’’ అంటూ కేటీఆర్‌పై పొంగులేటి మండిపడ్డారు. -
‘ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు ముడుపుల రేవంత్‌రెడ్డి’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నడపడం లేదని సర్కస్ నడుపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ జరిపారు. ఈ చిట్‌చాట్‌లో.. త్వరలోనే పాదయాత్ర ఉంటుంది. పబ్లిక్‌లోకి కేసీఆర్ ఎప్పుడు రావాలో.. అప్పుడే వస్తారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే పెట్టుకొనివ్వని వారు నియంత.సర్కార్ నడపడం లేదు సర్కాస్ నడుపుతున్నారు. మంత్రులది ఓమాట సీఎంది మరో మాట. కోర్ట్ చెప్పిన సీఎం వినరు. సృజన్‌రెడ్డికి సింగరేణిలో రూ.300 కోట్ల టెండర్లు ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ చేసిన పనినీ చెప్పలేక పోయాం కాబట్టే ఓడిపోయాం. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చాం.. కేటీఆర్ పైన కోపం సిరిసిల్ల పైన చూపిస్తున్నారు. నేతన్నపై జీఎస్టీ వేసీని ఘనత సీఎం రేవంత్‌దే. పది నియోజక వర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు పోవాలి. బీసీ బిల్లుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఆర్ఆర్ఆర్ సౌత్ సైడ్ అలైన్ మెంట్ మార్చారు.. సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారు. అలైన్ మెంట్ మార్చితే ఆర్ఆర్ఆర్కి డబ్బులు ఇవ్వం అని కేంద్రం చెప్పింది.సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ మేమే కడతామని రేవంత్ కేంద్రానికి చెప్పారు. సౌత్ సైడ్ ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అలైన్ మెంట్ మార్చే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల భూములు రెట్లు పెంచేందుకు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్చారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, వారి బంధువుల డ్రామాలు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. ఎల్అండ్టీ వాళ్ళని ముడుపుల కోసం సీఎం రేవంత్ ప్రయత్నించాడు. అందుకే మెట్రో నడపం అని వెళ్ళిపోతాం అంటున్నారు.ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటుంది. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నది. రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్అండ్టీ తప్పుకుంటుంది. గతంలో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని జైల్లో పెడతా అన్నారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటాయి. గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. రేవంత్ పీసీసీ పదవి కొన్నాడు.సీఎం సీట్ కొన్నాడు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీకి అమ్మారు. రేవంత్ అన్నిట్లో దిట్ట. 8మంది ఎంపీలను అమ్మాడు. హైడ్రా కాస్త హైడ్రామా అయింది. హైడ్రాకు పెద్ద వాళ్ళ ఇళ్ళు కనిపించవు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలిరేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని ఎవరూ అనుకోవడం లేదు, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డిని పొగుడాలంటే బట్టి విక్రమార్కని తొక్కేయాలా..?ప్రజా పాలనా అంటూ కోటి అప్లికేషన్లు తీసుకున్నారు. ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం లేదు కానీ ఎనుముల ఫ్యామిలీలో మాత్రం వికాసం ఉంది’ -
కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్‌లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, గన్‌పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులు అధైర్య పడకండి నిరసనలు ధర్నాలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్నగర్కి నేనే వస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు తెలంగాణ యువత కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అనుకున్న స్థాయితో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. నిరుద్యోగులకు అండగా ఉంటా అధైర్య పడకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో సాకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయిప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తాను. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా.. నిరుద్యోగులు అధైర్య పడకండి. నిరసనలు, నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు. -
బీజేపీకి చరిత్రే లేదు.. కవిత ఎక్కడ పుట్టారు?: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. కవిత ఎపిసోడ్‌పై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలో సెప్టెంబర్ 17పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం?. రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా?. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి. నెహ్రు సూచనల మేరకే పటేల్ సైన్యాన్ని పట్టుకొని వచ్చాడు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్రనే లేదు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.. సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు.కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది?. బీజేపీ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఇది. గుజరాత్‌లోని జునాఘడ్ కూడా సెప్టెంబర్ 17న ఇండియాలో విలీనం అయింది. జునాఘడ్ గురించి ఒక్క మాట మాట్లాడని బీజేపీ హైదరాబాద్ గురించి మాట్లాడడం రాజకీయం కాదా?. మోదీ వచ్చిన తర్వాత జరిగిన అనేక ఘటనలు ఎన్నికల ముందే జరిగాయి. ఎన్నికల ముందు జరిగిన ఘటనలపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలే ముఖ్యం అన్నట్టు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక వచ్చిన ఘటనలపై చర్చ జరిగి నిజాలు నివృత్తి కావాలి. పహల్గాం వద్ద మిలిటరీ ఫోర్స్ ఎందుకు తొలగించారు. పహల్గాం ఘటనలో మోదీ, అమిత్ షా ఫెయిల్యూర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పందిస్తూ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ బోల్డ్‌గా మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై నాకు కూడా ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. కవిత ఎప్పుడు పుట్టారు?. కవిత పుట్టిన తేదీ ఎప్పుడు?. కవిత పార్టీ ఎప్పుడు పుట్టింది. జరిగింది విలీనం కాబట్టే కవిత విలీన దినోత్సవం చేస్తోంది. కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టి ఆ లైన్లో కవిత ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
సంక్షేమ రాజ్యం కోసం పోరు తప్పదు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.తెలంగాణ భవన్లో జరిగిన సెప్టెంబర్ 17 వేడుకల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రాజ్యాన్ని సాధించేందుకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17వ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ బిడ్డలు రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన రోజని అన్నారు. ఈ రోజును విమోచనమని అన్నా, విలీనమని అన్నా ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన దినం అన్నది వాస్తవమని చెప్పారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్ఎస్ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా కేటీఆర్..‘తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం.. అన్నింటినీ తెలంగాణ చూసింది’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని గ్రూప్-1 విద్యార్థులు తమ ఆకాంక్షను వ్యక్తం చేసుకునేందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో దాడి చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ తన పోరును కొనసాగిస్తుందని, సెప్టెంబరు 17వ తేదీని సమైక్య దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కృష్ణా, గోదావరి జలాలు, మూసీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు అని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం.బతెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం. స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంది. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం. విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్ఆర్బీఎం నుంచి తొలగించాలి.అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటున్నాం. వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజికన్యాయ సాధన ప్రక్రియకు మీరు అడ్డుపడొద్దు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు. మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.హైదరాబాదే మన బలం.. హైదరాబాద్‌ను గేట్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చి దిద్దుతాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చుతాం. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుతాం. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు. మూసీ నదిని ప్రక్షాళన చేసి.. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం. మూసీ చుట్టూ బ్రతుకుతున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తాం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మార్చుతాం. మూసీకి ఇరువైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం. ఈ ఏడాది డిసెంబర్లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫోర్తు సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి’ అని కోరారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌కు అస్వస్థత
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాయలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లారు. అయితే శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన మధుయాష్కీ స్పృహతప్పి కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధుయాష్కీకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పాక్‌తో క్రికెట్ ఆడితే బీజేపీకి నొప్పి లేదా?: కేటీఆర్
భారత రాజ్యాంగమన్నా.. సుప్రీంకోర్టు అన్నా.. బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనం అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారాయన. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. మరి ఆ పార్టీ నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదు’’ అని ఆయన అన్నారు. బీజేపీది నకిలీ జాతీయవాదమన్న కేటీఆర్.. తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో చిందిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం అన్నారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.As expected, some BJP bhakts are rattled by BRS Party welcoming the Supreme Court’s interim order on the Waqf Amendment Act 2025. They respect neither the Indian Constitution nor the orders of the apex court!Let me remind them of their shameless hypocrisyBarely five months… pic.twitter.com/qXGWp5YRMz— KTR (@KTRBRS) September 16, 2025 -
జూబ్లీహిల్స్‌తో ‘బిహార్’ మెలిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ‘బిహార్ కూటమి’కి మెలిక పెట్టేందుకు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మజ్లిస్ గత మూడు పర్యాయాలుగా అక్కడ పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు మిత్ర పక్షం కానప్పటికీ... ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(ఇండియా)లో చేరేందుకు అసక్తి చూపుతున్నా....కూటమి నుంచి సానుకూల స్పందన రాక పోవడాన్ని మజ్లిస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను సాకుగా చూపించి మహా కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ అక్కడ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌కు గుణ పాఠం చెప్పాలా..? లేక స్థానిక అవసరాల కోసం సహకరించాలా? అని సందిగ్దంలో పడినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగితే అధికార కాంగ్రెస్‌కు గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ముస్లిం ఓటర్లు అధికం.. గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు మజ్లిస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్... ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి జూబ్లీహిల్స్ (Jubilee Hills) మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగి పరాజయం పాలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అధికారం చేజారగా, కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఆ దిశగా ప్రయత్నాలుత్వరలో జరుగనున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(మహా ఘట్బంధన్) లో చేరేందుకు ఏఐఎంఐఎం శతవిధాల ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సీమాంచల్‌లో ఆరు స్థానాలు కేటాయిస్తే కలిసి వస్తామని ఇప్పటికే ప్రకటించింది. మహా కూటమి తమతో కలిసిరాని పక్షంలో బిహార్‌లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధినేత ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. వాస్తవంగా తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత బిహార్‌ను పార్టీ విస్తరణకు అనుకూలంగా మజ్లిస్ భావిస్తోంది. తొలిసారిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్‌లోని ఆరు స్థానాల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించలేక పోయినప్పటికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లను దక్కించుకుంది. ఐదుగురు శాసనసభ్యుల్లో నలుగురు పార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇటీవల మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ ఇటీవల సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్న్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీలిపోయి మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదనే కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లు, గత అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల సమయంలో మహా కూటమిలో చేరాలనే ఆసక్తి కనబర్చామని కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదు‘ అని లేఖలో పేర్కొన్నారు అయితే మహా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఒత్తిడి తెచ్చేందుకు మజ్లిస్ సిద్దమైనట్లు సమాచారం. -
రాజ్యాంగం కంచెను రాజకీయం మేసేస్తోంది!
దేశంలో రాజ్యాంగం తరచూ అపహాస్యం పాలవుతోంది అనేందుకు ఇదో తాజా ఉదాహరణ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదిమంది తాము అదే పార్టీలో ఉన్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఇచ్చిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. బీఆర్ఎస్ జెండాతో 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచిన తరువాత వీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం బహిరంగ రహస్యం. వీరి అనర్హత కోరుతూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించడం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశం త్వరగా తేల్చాలని కోరడం అందరికీ తెలుసు. అయితే... చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తాము అసలు పార్టీ మారనేలేదని బుకాయిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా దగ్గరపడటంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ తీరున సమాధానమిచ్చారు. వీరు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఆ ఉప ఎన్నికలలో గెలుస్తామో, లేదో అన్న అనుమానం కావచ్చు.. లేక ఎందుకు ఖర్చు అన్న భావన కావచ్చు. వీరు ఇలా కధ నడుపుతున్నారని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణకు ప్రతిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సూచన మేరకు మళ్లీ కొత్త సాక్ష్యాధారాలు ఆయన ఆఫీస్‌లో సమర్పించారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారా? లేదా అన్నదానిపై స్పీకర్‌కు, అన్ని పార్టీలకు క్లారిటీ ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇందులో ఉన్న వాస్తవాలనండి, మతలబు అనండి తెలియకుండా ఉండదు. అయినా ఈ డ్రామా అంతా నడవాల్సిందే. అదే మన రాజ్యాంగ బలహీనతేమో! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పక్షాన గెలిచినా, తదుపరి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో దానం పరిస్థితి కాస్త అగమ్యగోచరమే అని చెప్పాలి. అయితే అనర్హత వేటుకు గురి కావాలి. లేదా రాజీనామా చేయాల్సి రావచ్చు. కాకపోతే స్పీకర్ ఎటూ అధికార పార్టీ వారే కాబట్టి కొంతకాలం జాప్యం చేయడానికి యత్నించవచ్చు. స్పీకర్ మరీ ఎక్కువకాలం పెండింగులో పెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తరపున లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారు. వీరిద్దరూ నేరుగా ఆధార సహితంగా ఫిరాయించినట్లు కనిపిస్తుండడంతో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో నేరుగా చేరకపోయినా, పలు విచారణల తర్వాత ఆలస్యంగా అయినా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి వారిపై అనర్హత వేటు వేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఎంతకాలం తీసుకుంటారో, ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ అయి మంతనాలు సాగించారు.న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఎనిమిది మందితో స్పీకర్ నోటీసులకు బదులు ఇప్పించారు. ఆ జవాబులు చూస్తే మన ఎమ్మెల్యేలు ఇలా తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారా? లేక ప్రజలను మోసం చేస్తున్నారా? లేక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వస్తాయి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కేవలం అభివృద్ది కోసమే సీఎంను కలిశామని, ఆ సందర్భంలో సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటే తిరస్కరించడం సంస్కారం కాదని నిరాకరించ లేదని, పైగా అది కాంగ్రెస్ కండువా కాదని బుకాయించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తన ఇంటిలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. అంతేకాక తాను కేటీఆర్‌ను కలిసిన ఫోటోలు కూడా తన సమాధానంతోపాటు జతపరిచారట. కొంతమంది తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఫ్లెక్సీలు కట్టారని, వాటితో తనకు సంబంధం లేదని, దాని ఆధారంగా తనపై ఫిరాయింపు ఆరోపణ చేశారని ఆయన వివరణ ఇచ్చారట. ఇవన్ని చూస్తుంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరు కావడం విశేషం. స్పీకర్‌గా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీల వారిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్వయంగా పోచారమే పార్టీ ఫిరాయించి, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతుండడం విశేషం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం టీఆర్ఎస్లో చేరడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. కాని ఇప్పుడు మాత్రం వెనుకాడుతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తప్ప మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ సీనియర్లే. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్ఎస్లో చేరితే, ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి అనధికారికంగా మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం గండిపేట వద్ద జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ వివిధ పత్రికలలో ఫుల్ పేజీ ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. వీరు తమంతట తాముగా రాజీనామా చేసినా, లేదా కాంగ్రెస్ నాయకత్వం రాజీనామా చేయించినా బాగుండేది. కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఒకపక్క విమర్శలు చేస్తూ, మరో పక్క తెలంగాణలో అదే రకంగా వ్యవహరించడం ఏపాటి విలువలతో కూడినదన్న ప్రశ్న వస్తుంది. మరో సంగతి ఏమిటంటే ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పది మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారట. దానిని సాక్ష్యంగా తీసుకోవాలని, అప్రూవర్ గా ఆయనను పరిగణించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని టూర్ చేస్తున్నారని, తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీని ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతున్నాయని కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ కింద బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అప్పుడు కూడా కొందరికి ఆయన బీఆర్ఎస్ కండువా కప్పారు.అయినా వారిలో ఎవరిపైన అనర్హత వేటు పడలేదు.అప్పట్లో బీఆర్ఎస్ విలీనం డ్రామా నడిపితే, దానికి ఆనాటి స్పీకర్ పోచారం ఆమోద ముద్రవేశారు. బీజేపీ కేంద్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని పిరాయింపులను ప్రోత్సహించడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 టర్మ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దానిపై న్యాయపోరాటం జరిగినా అది ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ఆనాటి రాజకీయ పరిణామాలలో పార్టీని వీడినప్పుడు రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా తిరిగి గెలిచారు. అలాగే ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో 15 మంది విజయం కూడా సాధించారు. ముగ్గురు ఓటమి చెందారు.అయినా విలువలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చివరికి ఏ రూపు దాల్చుతుందో, అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేకపోయినప్పటికి, సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల ఈ నోటీసుల తతంగం అయినా సాగుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, వారెవ్వరూ గట్టిగా నిరసన చెప్పలేని స్థితి ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్- ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే తమ పార్టీ నుంచి గెలిస్తే బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమిలకు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దీన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో భాగంగా ఆ ఎమ్మెల్యేల సమాధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆదారాలు సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పాల్గొన్న మరిన్ని ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జగదీష్‌రెడ్డి, వివేక్ గౌడ్ చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘ వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే ాపార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్‌తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. -
జూబ్లీహిల్స్ బైపోల్.. కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధి దాదాపు ఖాయం అయ్యాడనుకున్న తరుణంలో.. మహమ్మద్ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి అభ్యర్థి ఎంపిక విషయంలో మళ్లీ మల్లాగుల్లాలు పడుతూ మొదటికొచ్చింది. ఈలోపు.. బీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రొజెక్టు చేస్తూ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో నెగ్గి.. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర హైదరాబాద్‌లో తమ బలం ఏమాత్రం తగ్గలేదని రాజకీయ ప్రత్యర్థులకు చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఈలోపు.. సోమవారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పీజేఆర్ తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ అరగంటకు పైగా చర్చ జరపడంతో జూబ్లీహిల్స్ టికెట్ కోసమేననే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పీ జనార్ధన్ రెడ్డి తనయుడు పీ విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి మరణానంతరం 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2009లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవచ్చనే సంకేతాల నడుమ.. ఆయన కవితతో భేటీ అయ్యారన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయితే.. ఈ పుకార్లకు విష్ణు పుల్‌స్టాప్ పెట్టారు. పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితకు ఆహ్వాన పత్రిక అందించడానికే వచ్చినట్లు చెప్పారాయన. ‘‘కేటీఆర్‌తోనే నా ప్రయాణం. ఎప్పుడు నేను ఇదే చెబుతా. కేటీఆర్‌కు ప్రమోషన్ ఉంటుంది.. నాకూ ప్రమోషన్ ఉంటుంది’’ అని ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణు తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రెస్మీట్లో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. వేరే పార్టీలో చేరిక.. సొంత పార్టీ గురించి స్పష్టత ఇవ్వని ఆమె.. ఇక నుంచి రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫొటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించడం గమనార్హం. -
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ చూసుకుంటుంది: సీఎం రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 14వ తేదీ) జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులు , అభ్యర్థి ఎంపిక పై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్‌లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్‌ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’ అని పేర్కొన్నారు.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
పార్టీ ఫిరాయింపులు.. దానం విషయంలో కీలక ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్.. పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వారంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు. మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచినా కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు తెలిపారు.హిమాయత్ నగర్ డివిజన్లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదు. స్పీకర్ నుంచి నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి తగ్గట్టు సమాధానం ఇస్తున్నారు. నాకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని సమాధానం ఇస్తాను. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో దానం నాగేందర్ పేరు ప్రముఖంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానంపై వేటు పడటం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ ఆయన స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఆ స్థానానికి రాజీనామా చేస్తానని పట్టుపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు రాజీనామా చేసి.. ఇప్పటికే ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని కోరుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని.. అభ్యర్థి ఎంపిక కోసం హైకమాండ్ సర్వేల మీద సర్వేలు చేయిస్తురని సమాచారం. ఇక, ఏ సర్వేలో కూడా టికెట్ రేసులో ఉన్న నేతలు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని రిపోర్ట్ వచ్చిందని తెలుస్తోంది. -
‘చోటే భాయ్’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. ఇంకా కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదంటు కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్‌ని కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. More than 200 days since the Srisailam Left Bank Canal tunnel collapsed, killing 8 hapless workers due to the criminal negligence of the corrupt Revanth GovtThis inefficient Congress govt couldn’t even retrieve the bodies of 6 victims, and hasn’t paid any compensation to the… pic.twitter.com/Rl11OwVJvf— KTR (@KTRBRS) September 14, 2025 -
భారత్-పాక్ మ్యాచ్.. మోదీ, బీజేపీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్-2025లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుతో భారత్ క్రికెట్ ఆడటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన ప్రధాని మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించారు. ఈ క్రమంలో తాజాగా అసద్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ ఎలా ఆడుతారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలి. 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా?. దీనికి కేంద్రంలోని బీజేపీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు.. నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారు. పహల్గాం బాధితులకు మోదీ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దేశభక్తి పేరుతో బీజేపీ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వాహణపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఇరు జట్లు మాత్రం ఆడకూడదని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక, మాజీ క్రికెటర్లు కూడా దీనిపై స్పందిస్తూ, “అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడాలి. లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్–పాక్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. #BoycottPakistanMatch హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, యువత భారీ స్థాయిలో ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
నీ అభివృద్ధి కోసం పార్టీ మారావా...?: కేటీఆర్
జోగులాంబ గద్వాల్: తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గద్వాలను జిల్లా చేసింది.. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగుమార్చి ప్రారంభించిందన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో కూడ గద్వాల ముందుంది. కాంగ్రెస్ నాయకులు మాయామాటలు మాట్లాడుతున్నారు. రైలుకింద తలపెట్టిన చనిపోతా కాని కాంగ్రెస్‌లో చేరనన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎందుకు మారాడు. నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావా ఎమ్మెల్యే. కాంగ్రెస్ హయంలో నియోజకవర్గానికి పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఒక్క రూపాయ తెచ్చాడా?, కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. సిగ్గులేని విధంగా రేవంత్ రెడ్డి సంకలచిక్కి సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు స్దానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి. సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది పార్టీ పిరాయింపు చేసిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు.6 నుంచి 9 మాసాల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయం. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్ది 50 వేల మెజారిటీతో గెలవటం ఖాయం. దొంగలముఠాలో బండ్ల చేరాడు..ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించాలి. స్కూటీలు మరిచి సీఎం లూఠీలు చేస్తున్నారు. స్దానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించాలి. ఉపఎన్నికల్లో డంకామోగించాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
‘నాకు టికెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలి’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్‌పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ విషయంలో కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాహుల్‌పై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా?. ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?. ఓట్ చోరీ గురించి రాహుల్ ఆధారాలతో నిరూపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదు.బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారు. ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కూడా ఎందుకు స్పందించడం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు మానసికంగా ఒక్కటే కానీ.. భౌతికంగా ఒక్కటి కావాల్సి ఉంది. అందుకే రాహుల్‌పై కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.