Jayashankar
-
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో ధీమా..
నా భార్య రోజువారీ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. నేను టైలరింగ్ పనిచేస్తా. గత ప్రభుత్వాలు భూమి ఉన్న వారికే రైతుబంధు, రుణమాఫీ లాంటి పథకాలు వర్తింపజేశాయి. మాలాంటి భూమి లేని నిరుపేదలకు ఎలాంటి సహాయమూ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయడం హర్షణీయం. – సూరం రమేష్, పీచర, వేలేరు మండలం అర్హులకు రేషన్ కార్డులు అందజేయాలి అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రేషన్ కార్డులు అందించాలి. ప్రభుత్వం అందించే రుణమాఫీ లాంటి పథకాలు అందాలంటే రేషన్ కార్డు ప్రాధాన్యం కావడంతో చాలా మందికి రుణమాఫీ కాలేదు. ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునే వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయాలి. – బంక శ్రీనివాస్, వేలేరు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక.. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం గ్రామసభలు జవాబుదారీతనంగా నిర్వహించేలా అధికారులు, సిబ్బందికి సూచించాం. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆదాయ వివరాలను సేకరించి అర్హులైన రేషన్ కార్డుల జాబితాలు గ్రామసభలో ప్రజలకు నివేదిస్తాం. గ్రామ సభలకు ఒకరోజు ముందే ప్రజలనుంచి వచ్చిన అభ్యంతరాలను సేకరిస్తాం. – పి.ప్రావీణ్య, కలెక్టర్, హనుమకొండ ● -
పారదర్శకంగా సంక్షేమ పథకాల సర్వే
రేగొండ: ఈ నెల 26నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వే ను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నా రు. గురువారం మండలంలోని భాగిర్థిపేట, దమ్మన్నపేట, కనిపర్తి గ్రామాలలో జరుగుతున్న ఫీల్డ్ సర్వేను ఆమె పరిశీలించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉండి, 20 రోజులు ఉపాధి పనిచేయడంతో పాటు వారికి వ్యవసాయ భూమి లేని వారే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని తెలిపారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఆర్ఐ, ఏఈఓలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
అర్హులను ఎంపిక చేయాలి
గణపురం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డుల జారీ వంటి పథకాలకు అధికారులు అర్హులైన అబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుందూరుపల్లిలో జరుగుతున్న రైతు భరోసా ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాకు సాగులో ఉన్న భూముల వివరాల నమోదుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలో పాల్గొంటారని తెలిపారు. గణపురం మండలంలో 691 మంది నూతన రేషన్ కార్డుల కోసం సమగ్ర కుటుంబ సర్వేలో నమోదు చేసుకున్నారని తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, ఏఈఓ కల్యాణ్, ఆర్ఐ రహ్మద్ పాషా, సర్వేయర్ నిరంజన్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని గట్టమ్మతల్లి గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆదివాసీ నాయకపోడు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ చిత్రామిశ్రాకు గురువారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆదివాసీ నా యకపోడు సంఘం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మినీ జాతరకు వెళ్లే భక్తులు మొదటగా గట్టమ్మ వద్ద మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. ఇందుకోసం భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి తాగునీరు. శానిటేషన్, పందిళ్ల ఏర్పాటు, పూజారులకు క్వార్టర్స్ నిర్మాణం, ఆలయానికి రంగులు వేయించడానికి ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించాలని కోరారు. దేవర్ల నృత్యాలతో అంగరంగ వైభవంగా ఎదురు పిల్ల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పీఓ స్పందించి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, గట్టమ్మ పూజారులు కొత్త సదయ్య, ఆకుల మొగిలి, కొత్త లక్ష్మయ్య, కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ నాయకపోడు జిల్లా అధ్యక్షుడు సురేందర్ -
బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా ఎన్.రవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆర్డీఓ మంగీలాల్ హనుమకొండకు బదిలీ కాగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆర్డీఓ రవిని భూపాలపల్లికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కోటంచలో ప్రత్యేక పూజలు రేగొండ: మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భూపాలపల్లి ఆర్డీఓ రవి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు బుచ్చమాచార్యులు స్వామి వారి శేషవస్త్రంతో ఆయనను సన్మానించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ రజాక్, సీనియర్ అసిస్టెంట్ స్పందన ఉన్నారు. ‘న్యాయ కళాశాల కోసం ఉద్యమిస్తాం’ వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమిస్తామని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ ఆదివాసీ యువతకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఆదివాసీ యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం ఆనంద్, శంకర్ పాల్గొన్నారు. అసత్య ప్రచారం నమ్మి మోసపోవద్దుములుగు: ప్రభుత్వం కొత్త మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయబోతుందని అందుకు మీసేవ వెబ్సైట్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మీసేవ సెంటర్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతూ మోసగాళ్లు నకిలీ మీసేవ పోర్టల్‌ను కూడా రూపొందించారని వెల్లడించారు. ఆ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌కి ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని, డబ్బులు చెల్లింపులు చేసి మోసపోవద్దని తెలిపారు. నాటుసారా తయారీపై ఉక్కుపాదంములుగు: జిల్లాలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపేందుకు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ఎకై ్సజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ డైరెక్టర్ ఆదేశాలతో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి వి.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నాటుసారాయి తయారీ కేంద్రాలను, తయారీదారులను గుర్తిస్తామని తెలిపారు. గుడుంబా తయారీ ముడి సరుకులు అమ్మేవాళ్లను గుర్తించి అరె స్టు చేసి కేసులు నమోదు చేస్తామని వివరించారు. బైండోవర్ చేసి, బైండోవర్ నిబంధనల ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. లేదా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇంకనూ పద్ధతి మార్చుకోని వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖల భాగస్వామ్యంతో జిల్లాలో నాటు సారాను పూర్తిగా రూపుమాపేందుకు ఎకై ్సజ్ శాఖ కృతనిశ్చయంతో ముందుకెళ్తుందని వివరించారు. -
పకడ్బందీగా సర్వే
కాటారం: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే పకడ్బందీగా చేపట్టాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ సూచించారు. కాటారం మండలకేంద్రంలోని సబ్స్టేషన్పల్లిలో అధికారులు చేపడుతున్న సర్వేను సబ్‌కలెక్టర్ పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న తీరుపై ఆరాతీశారు. సర్వే బృందాలు పారదర్శకతతో వ్యవహరిస్తూ పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని ఆదేశించారు. అవకతవకలకు చోటివ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా అధికారులు కృషిచేయాలన్నారు. లబ్ధిదారులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మండల అధికారులను సంప్రదించాలని, అర్హులైన వారికి పథకాలు అందుతాయని.. ఆందోళన చెందవద్దన్నారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న, ఎంపీఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్, ఏఈఓ సరిత ఉన్నారు. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి.. ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలపై మహాముత్తారం మండలకేంద్రంతో పాటు బోర్లగూడెంలో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న తీరుపై ఆరాతీసి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మహాముత్తారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పథకాల సర్వేపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి లబ్ధి జరిగేలా పకడ్బందీగా సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ -
మోడల్‌హౌస్
కాళేశ్వరం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతీ మండలకేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ (నమూనా ఇల్లు) నిర్మించాలని నిర్ణయించింది. మండల పరిషత్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఇంటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించగా జిల్లాలోని పలిమెల మండలం కాకుండా మొత్తం మండలాల్లో మోడల్హౌస్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. లబ్ధిదారులకు అవగాహన.. రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేస్తున్న ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. దీనిని నివృత్తి చేయడానికి ప్రభుత్వం రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నమూనా ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసిన రోజు నుంచి కేవలం 20రోజుల్లో అన్ని హంగులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంటి నిర్మాణ కొలతలను అధికారులు నిర్ధారించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. రెండు తలుపులు, రెండు కిటీకీలు, ఒక వెంటిలేటర్ ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. రేగొండలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈనెల 8న రేగొండలో మోడల్ హౌస్ నిర్మాణానికి ఽశంస్థాపన చేశారు. గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మొగుళ్లపల్లి, గణపురం, టేకుమట్ల, చిట్యాల, భూపాలపల్లిలో స్థలాలు ఎంపిక చేశారు.ఇంటినిర్మాణ కొలతలు ఇలా.. మొత్తం 400 చదరపు అడుగుల విస్తీర్ణం హాలు: 9.0x10.10 వంటగది: 6.9x10.0 బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్: 12.5x10.5ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణం మండలకేంద్రాల్లో ఇళ్ల ఏర్పాటుకు శ్రీకారం ఇప్పటికే రేగొండలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర కాటారం సబ్ డివిజన్లో త్వరలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు త్వరగా పూర్తిచేసేందుకు అధికారుల కసరత్తు97శాతం పూర్తయిన సర్వే.. ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ప్రజాపాలనలో ఇళ్లు కావాలని 1,23,419 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఇంకా 3,761 దరఖాస్తులు సర్వే చేయాల్సి ఉంది. ఇందులో సొంత స్థలం ఎంత మందికి ఉంది. ఇందిరమ్మ గృహానికి అర్హులేనా కాదా అనేది పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తూ మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాలో 97శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా.. మంథని నియోజకవర్గం కాటారం సబ్‌డివిజన్‌లోని మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో స్థలాలు ఎంపిక చేశారు. పలిమెల మండలంలో స్థలంలేక నిర్మాణం ఎంపిక కాలేదు. కాటారంలో మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడల్ ఇళ్లు త్వరగా పూర్తిచేస్తాం.. జిల్లాలో ఇందిరమ్మ నమూనా ఇళ్లను నిర్మించనున్నాం. రేగొండలో ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశాం. పలిమెల మండలంలో స్థలంలేక ఎంపిక చేయలేదు. త్వరలో కాటారంలో మంత్రితో శంకుస్థాపన చేయనున్నాం. మిగిలిన మండలాల్లో కూడా నమూనా ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండలకేంద్రాల్లోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో మోడల్ హౌస్‌లను నిర్మిస్తున్నాం. – లోకిలాల్, హౌసింగ్ పీడీ -
ఆశల పల్లకిలో అందరూ.. అర్హులు ఎందరో?
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మరో నాలుగు సంక్షేమ పథకాలకు ఈ నెల 26న శ్రీకారం చుడుతోంది. కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ, గూడులేని పేదల కలలు సాకారం చేసే విధంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతుల ఆశలకు తగ్గట్టుగా రైతు భరోసా, కూలీల ఆత్మీయ భరోసా వంటివి అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గురువారంనుంచి తుది దశ కసరత్తు మొదలైంది. ఈ నెల 20 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్న అధికారుల బృందాలు.. 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభల్లో వివరాలు ప్రదర్శించనున్నారు. 24న తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుండగా.. అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా గానీ, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని ఈ సమావేశం ఉంటుందని తెలిసింది. అర్హులకే అందేలా కసరత్తు... రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు.. ఈ నాలుగు పథకాలపై ఉమ్మడి వరంగల్‌కు చెందిన ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆచితూచి అర్హులను ఎంపిక చేసేందుకు వడపోత కొనసాగిస్తున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి అర్హులైన రైతులకు ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ.12 వేల చొప్పున నగదు జమ చేసే ప్రక్రియ మొదలుకానుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఆరువేల రూపాయల చొప్పున నగదు అందనుంది. జిల్లాలో వానాకాలం పంటల సాగు 7.15 లక్షల ఎకరాలు సాగుకాగా ప్రస్తుత యాసంగి పంటల సాగు అంచనా ప్రకారం 5.25 లక్షల ఎకరాలుగా ఉంది. 2024 యాసంగిలో 8,77,173 మంది రైతులకు రూ.880 కోట్ల రూపాయల రైతు భరోసా అందింది. ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల మేరకు ఎందరికి భరోసా దక్కుతుందో ఈనెల 26వ తేదీన తేలనుంది. ఇందిరమ్మ ఇళ్లు ఉమ్మడి జిల్లాకు 40 వేలు రానున్నాయి. ఇప్పటికే ప్రజాపాలన సభల ద్వారా సుమారు 1.58 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి సర్వే చివరి దశకు చేరుతుండగా.. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఫైనల్‌గా తనిఖీలు చేస్తున్నారు. తొలి దశలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున 12 నియోజకవర్గాలకు 40 ఇళ్లు కేటాయించనున్నారు. అలాగే భూమిలేని నిరుపేదల ప్రతి సంవత్సరం రూ. 12 వేల చొప్పున రెండు విడతలుగా ఇచ్చేందుకు అర్హులపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 18.45 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో అమలు అయ్యే ఈ పథకానికి భూమిలేని నిరుపేదల కుటుంబాన్ని యూనిట్‌గా ఎంపిక చేసి అమలు చేయనున్నామని ఓ అధికారి చెప్పారు.ఏ పథకం కోసం.. ఎందరంటే.. జిల్లా రైతు బంధు రేషన్‌కార్డుల ఉపాధి పనులకు (గతంలో దరఖాస్తులు వెళ్తున్న కూలీలు లబ్ధిదారులు) హనుమకొండ 1,50,982 5650 2,57,968 వరంగల్ 1,54,405 4820 2,73,913 భూపాలపల్లి 1,16,574 15,625 2,92,446 ములుగు 76,692 12,158 2,06,211 జనగామ 1,85,937 43,370 2,78,838 మహబూబాబాద్ 1,92,583 76,197 5,35,950 మొత్తం 8,77,173 1,57,820 18,45,326నాలుగు సంక్షేమ పథకాలకు 26న ముహూర్తం ఉమ్మడి వరంగల్‌లో మొదలైన అధికారుల కసరత్తు 20 వరకు గ్రామాలలో క్షేత్రస్థాయి సర్వే.. 24న ప్రభుత్వానికి తుది నివేదిక అదేరోజు కలెక్టర్లతో సీఎం సమావేశం? -
జాతర పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మినీ జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని మేడారంలో కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. దేవాదాయశాఖ క్యూలైన్, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచాలని సూచించారు. భక్తులు క్యూలైన్లో గద్దెల ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు. అక్కడ తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జంపన్న వాగు ప్రాంతంలో పుణ్య స్థానాలు ఆచరించిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీపీఓ దేవరాజ్, ఎంపీడీఓ సుమనవాణి, పంచాయతీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు. -
మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
భూపాలపల్లి అర్బన్: మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా రవాణాశాఖ అధికారి మహ్మద్ సంధాని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏరియాలోని కేటీకే ఓసీ–2లోని కార్మికులకు గురువారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వలన ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అతివేగం, ఓవర్ టేకింగ్, మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ వినియోగించకుండా, సీట్ బెల్ట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డుపై నడిచే ప్రతి వ్యక్తి బాధ్యతగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓసీ–2 మేనేజర్ కృష్ణప్రసాద్, అధికారులు సుందర్‌లాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
గోవిందరావుపేట: క్రీడల్లో గెలుపోటములు సహజం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని చల్వాయిలో ‘చల్వాయి వాలీబాల్ యూత్’ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా.. చివరి రోజు మంగళవారం రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. చివరి రోజు ఫైనల్ మ్యాచ్‌లో మురుమురు గ్రామ జట్టు గెలుపొందగా.. వారికి రూ.15,016 రుపాయలు ప్రథమ బహుమతి, కొంగల గ్రామ జట్టుకు రూ.10,016 ద్వితీయ బహుమతి, చల్వాయి గ్రామ జట్టుకు రూ.5,016 తృతీయ, గంగారం గ్రామ జట్టుకు 3,016 నాలుగో బహుమతిని సీతక్క అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆటలు ఆడడం వల్ల మానసిక, శరీరక, సామాజిక, భావోద్వేగ, అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఇండియా వాలీబాల్ మహిళా జట్టు కోచ్ కోసరి కృష్ణప్రసాద్, భేతి రవిందర్‌రెడ్డి, చుంచు రమణ, తమ్మివెట్టి శ్రీను, ఏదుల వేణు, మేకల కృష్ణ, తాటి సుమన్, కన్నెబోయిన సతీశ్, మద్దెల శ్రీనివాస్, సాయబోయిన భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలు ఐకమత్యాన్ని పెంచుతాయి
భూపాలపల్లి రూరల్: క్రీడలు ఐకమత్యాన్ని పెంచుతాయని, క్రీడల్లో గెలుపోటములు సహజమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో సీనియర్, జూనియర్ గెట్ టు గెదర్ –2025 క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. యువత క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ఓటమిని తొలిమెట్టుగా తీసుకుని ముందుకెళ్లాలని తెలిపారు. అలాగే, భూపాలపల్లి జిల్లాలో క్రీడా సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలో వివిధ కారణాలతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ క్రికెట్ జట్టు
కేయూ క్యాంపస్: చైన్నెలోని మద్రాస్ యూనివర్సిటీలో ఈనెల 16 నుంచి నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌కు కేయూ క్రికెట్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య బుధవారం తెలిపారు. జట్టులో బి.విశాల్‌యాదవ్, బి.వరుణ్, జి.హరిప్రసాద్, షేక్ సమీర్పాషా(వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ హనుమకొండ), కె.నిఖిల్ (యూఏఎస్సీ హనుమకొండ), కె.రోహిత్‌రెడ్డి, మహ్మద్ ఇబ్రహిమ్(కిట్స్ వరంగల్), బి.కిరణ్ (యూసీపీఈ కేయూ వరంగల్), షేక్ అజహర్, బి.సంతోష్(ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ఖమ్మం), ఆర్.శ్రీచరణ్(జేఆర్బీ డిగ్రీకాలేజీ ఆదిలాబాద్), బి.సచిన్ (యూసీఈ కేయూ ఖమ్మం), ఆమ్గోత్ డివిన్(కేఎండీసీ ఖమ్మం), మహ్మద్పర్హాన్(మాస్టర్జీ డిగ్రీకాలేజీ హనుమకొండ) ఉన్నారు. వీరికి హనుమకొండలోని కేశవ డిగ్రీకాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎం.కుమారస్వామి కోచ్‌గా, హనుమకొండలోని గీతాంజలి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ మహ్మద్ మహమూద్‌అలీ మేనేజర్‌గా వ్యహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. -
వైభవంగా కనుమ వేడుకలు
హన్మకొండ కల్చరల్ : సంక్రాంతి పండుగలో భాగంగా బుధవారం కనుమ వేడుకలను ప్రజలు ముఖ్యంగా రైతులు వైభవంగా జరుపుకున్నారు. హనుమకొండ వేయిస్తంభాల దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయశాఖ సౌజన్యంతో గోపూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోమాతను పూమాలతో అలంకరించి పచ్చగడ్డి, శనగపిండి, అరటిపండ్లు సమర్పించి హారతి ఇచ్చారు. అంతకు ముందు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన అర్చకులు శ్రీరుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేపూజలు చేశాారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. గోవులు లక్ష్మీస్వరూపమం.. పశువులను దైవంగా పూజించాలని అన్నారు. కార్యక్రమంలో వేదపండితులు గంగు మణికంఠ, అర్చకులు ప్రణవ్, శ్రవణ్, గణపతి, సిబ్బంది పాల్గొన్నారు.వేయిస్తంభాల ఆలయంలో గోపూజ -
కాళేశ్వరం రాజగోపురం నుంచి మెట్ల మార్గం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం తూర్పు రాజగోపురం నుంచి శ్రీరామాలయం రోడ్డు వరకు మెట్ల మార్గం పనులను పంచాయతీరాజ్ అధికారులు ప్రారంభించారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఆలయ అభివృద్ధికి రూ.25కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ నిధుల నుంచి రూ.50లక్షల వ్యయంతో 100మీటర్ల పొడవుతో సెంట్రల్ లైటింగ్‌తో అధునాతనంగా నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. పనుల్లో భాగంగా ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డు డ్రిల్లింగ్ చేసి తొలగిస్తున్నారు. ఆ మెట్ల మార్గంలో సీసీతోపాటు టైల్స్ వేయనున్నారు. కాగా, తూర్పు రాజగోపురం వద్దకు గోదావరి నుంచి, ఇటు బస్టాండ్ మీదుగా వచ్చే వాహనాలు ఇక మీదట అనుమతి లేదు. సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు ఫణీంద్రశర్మ, పీఆర్ ఇంజనీర్లు ఉన్నారు.పనులు ప్రారంభించిన అధికారులు -
మండలాలకు ప్రత్యేక అధికారులు
భూపాలపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి మండల ప్రత్యేక అధికా రిగా వి.నారాయణరావు(డీపీఓ), చిట్యాలకు కె.చిన్నయ్య(డీడబ్ల్యూఓ), గణపురం మండలా నికి కుమారస్వామి(డీవీఏహెచ్‌ఓ), కాటారం మండలానికి పి.నరేష్(డీఆర్డీఓ), మల్హర్‌కు ఆర్.అవినాష్(డీఎఫ్ఓ), మహదేవ్పూర్కు ఎం.వీరభద్రయ్య(డీఎల్పీఓ), మహాముత్తారానికి ఎ.వెంకటేశ్వర్లు(ఈడీఎస్సీ), మొగుళ్లపల్లికి డి.సునీత(డీఎస్సీడీఓ), రేగొండకు ఎ.సునీల్(హార్టికల్చర్ ఆఫీసర్), పలిమెలకు ఎం.విజయభాస్కర్(డీఏఓ), టేకుమట్ల మండల ప్రత్యేక అధికారిగా టి.శైలజ(డీబీసీడీఓ)ను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలి భూపాలపల్లి అర్బన్: కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమానులు స్పందించి లారీ ఓనర్ల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ లారీ ఓనర్ తుమ్మేటి రాంరెడ్డి ప్రకటనలో కోరారు. లారీల కిరాయిలు పెంచాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం, ట్రాన్స్పోర్టర్లు స్పందించడం లేదని తెలిపారు. లారీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4వేల మంది ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. సమ్మె వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాసీంపల్లి వాసికి అవార్డు భూపాలపల్లి రూరల్: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు పరిరక్షణకు కృషిచేస్తూ కవితలు, పాటలు, కథలు రాస్తున్న యువ రచయితకు అవార్డు దక్కింది. భూపాలపల్లి మున్సిపాలిటీ కాసీంపల్లికి చెందిన బేతు సునీల్ యాదవ్ జాతీయ యువ తేజం పురస్కారానికి ఎంపికై నట్లు శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ బుధవారం ప్రకటనలో తెలిపారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ వరల్డ్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే సాహితీ సంబురాల్లో సునీల్ యాదవ్ ఈ అవార్డు అందుకోనున్నారు. ఇదిలా ఉండగా.. తను రాసిన పుస్తకాలు మట్టిచిప్ప, తునికాకు త్వరలో ప్రచురించనున్నట్లు సునీల్ యాదవ్ తెలిపారు. 20న జరిగే కేయూ దూరవిద్య పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యకు సంబంధించి ఈనెల 20న జరగాల్సిన పీజీ ఫస్ట్ సెమిస్టర్(నాల్గవ పేపర్ ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జూవాలజీ, మ్యాథ్‌మెటిక్స్) పరీక్షలు ఈనెల 24వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆరోజు టీజీటెట్ పరీక్ష ఉన్నందున తేదీ మార్చినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మిగితా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోలార్ ప్లాంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి ఏటూరునాగారం: ములుగు, జయశంకర్ భూ పాలపల్లి జిల్లాలోని పోడు భూముల హక్కు పత్రాలను కలిగిన గిరిజన రైతులు సోలార్ ప్లాంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీ ఏ పీఓ చిత్రామిశ్ర బుధవారం అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష పవం ఉత్తమ్ మహాబియాన్ (పీఎం కుసుమ్) పథకం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సహం కలిగిన గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పీఓ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల కౌలు రైతులకు ఆదా యం వస్తుందన్నారు. అర్హులైన రైతులు ఈనెల 19లోపు ఐటీడీఏ, డీడీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కోటలో పర్యాటకుల సందడి ఖిలా వరంగల్: సంక్రాంతి, కనుమ పండుగ నేపథ్యంలో బుధవారం కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటకు భారీగా సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. సనాతన్ ధర్మ కాలేజీ, న్యూఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర జిల్లాలతోపాటు నగర ప్రజలు కోటను సందర్శించారు. మధ్యకోట శిల్పాల ప్రాంగణం సందడిగా మారింది. శిల్ప సంపద, ఖుష్‌మహల్, ఏకశిల గుట్ట, రాతి మట్టికోట అందాలను తిలకించారు. కాకతీయుల విశిష్టత, నిర్మాణ శైలిని కోట గైడ్ రవియాదవ్ పర్యాటకులకు వివరించారు. అనంతరం టీజీ టీడీసీ ఆధ్వర్యాన నిర్వహించిన సౌండ్ అండ్ లైటింగ్ షో వీక్షించారు. -
సంబురంగా సంక్రాంతి
కన్యకాపరమేశ్వరీ ఆలయంలో లక్ష పసుపుకొమ్ముల నోములో పాల్గొన్న వైశ్యులుభూపాలపల్లి అర్బన్: చూడముచ్చటైన రంగవల్లులు.. వాటి మధ్య అలంకరించిన గొబ్బెమ్మలు.. హరిదాసుల గీతాలాపనలు.. పిల్లలు, యువకుల గాలిపటాల ఆటలు.. పిండివంటల ఘుమఘుమలు.. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రజలు మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలు గ్రామాల్లో మహిళలు సంప్రదాయ బద్దంగా నోములు నోముకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు ముంగిళ్లలో సంప్రదాయమైన ముగ్గులను వేసి రంగులతో అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఆర్యవైశ్యులు లక్ష పసుపుగొమ్ములతో పంచవతి నోములు నిర్వహించారు. ముగ్గుల పోటీలతో మహిళలు, క్రీడాపోటీలు, కోడిపందేలతో యువకులు హోరెత్తించారు. జోరుగా పతంగుల ఎగురవేత ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ సమావేశపు హాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి విచారణ, గ్రామసభలు నిర్వహణపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, డీఆర్డీఓ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ, గ్రామసభలు నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి, లబ్ధిదారుల తుది జాబితా ఖరారు చేయాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో 16 నుంచి 20వ తేది వరకు క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించే విధంగా షెడ్యూల్ తయారు చేసినట్లు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయి విచారణ, గ్రామసభల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
‘సహకార’ పునర్విభజన
భూపాలపల్లి రూరల్: జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా టేకుమట్ల, పలిమెల, ఇటీవల కొత్తపల్లి(గోరి) కొత్త మండలాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయా మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ మండలాల రైతులు పాత మండలాల పీఏసీఎస్‌లకు వెళ్లి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తీసుకొని రావడానికి కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మండలాల్లో పీఏసీఎస్ ఏర్పడితే వారికి ఈ వ్యయప్రయాసలు తొలిగే అవకాశం ఉంది. నూతన మండలాలతోపాటు పలుచోట్ల వెసులుబాటును పరిశీలించిన కోఆపరేటీవ్ అధికారులు జిల్లాలో కొత్తగా పలు పీఏసీఎస్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు. కోఆపరేటివ్ శాఖ పరిధిలోకి వచ్చే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ల పునర్విభజన చోటు చేసుకుంటుంది. కొత్త మండలాల్లో సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరాయి. జిల్లాల వారీగా వివరాలను అధికారులు ఆన్లైన్ ద్వారా అందజేశారు. అందులో ఎన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. వేచి చూడాలి. సాధ్యసాధ్యాల పరిశీలన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో నిబంధనల మేరకు అక్కడ పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని కోరింది. ఒక్కో పీఎసీఎస్ పరిధిలో కనీసం 300 నుంచి 500వరకు రైతులకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలి. అలాగే అక్కడ పీఏసీఎస్ ఏర్పాటు చేస్తే బిజినెస్ నడుస్తుందా.. ఆర్థికంగా సొసైటీ నిలదొక్కుకోగలుగుతుందా... ఇలాంటి 47 అంశాలను పరిశీలించాలని సూచించింది. దానికి అనుగుణంగా డీసీఓలు వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించి ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా అందజేశారు. ప్రతిపాదనలు పంపించాం నూతన పీఏసీఎస్‌లకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాం. అందులో ఎన్నిటికి ఆమోదం లభిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌ల పరిధిలో కొన్ని గ్రామాలను విభజించి కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. – వాల్యానాయక్, డీసీఓ జిల్లాలో పీఏసీఎస్‌లు ఇలా..పాత పీఏసీఎస్‌లు పీఏసీఎస్ ప్రతిపాదిత ప్రాంతాలు 1) భూపాలపల్లి జంగేడు, పంబాపూర్ 2) మల్హర్ తాడిచర్ల కొయ్యూరు 3) మహదేవ్పూర్ పలిమెల 4) మహాముత్తారం బోర్లగూడెం 5) మొగుళ్లపల్లి మొట్లపల్లి 6) చిట్యాల టేకుమట్ల, ఒడితెల 7) రేగొండ కొత్తపల్లి (గోరి) 8) కాటారం దామెర కుంట 9) గణఫురం 10) చెల్పూరు కొత్త మండలాలతో పాటు ప్రతిపాదిత ప్రాంతాల్లో ఏర్పాటు ప్రతిపాదనలు పంపిన సంబంధిత అధికారులు సభ్యుల నుంచి తీర్మానాల సేకరణ పరిశీలన తర్వాత గ్రీన్ సిగ్నల్‌కు అవకాశం ప్రయోజనాలు.. కొత్త పీఏసీఎస్‌లు ఏర్పడితే కొన్ని గ్రామాలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర సొసైటీ నుంచి కొనుగోలు చేసేందుకు దూరభారం, ఆర్థిక భారం తగ్గుతుంది. సొసైటీకి అనుబంధంగా కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఏర్పడుతుంది. ఆ బ్యాంక్ పరిధిలో రైతులు రుణాలను సులువుగా పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతే కాకుండా ఒక పీఏసీఎస్ ఏర్పడితే దానికి సంబంధించి పాలకవర్గం కూడా ఏర్పాటవుతుంది. అందులో 13 మంది సభ్యులు ఉంటారు. తద్వారా దాని పరిధిలోకి వచ్చే గ్రామాల వారికి రాజకీయంగా కూడా ఒక హోదా పొందేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలోని 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మరో 9 పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానం చేసిపంపినట్లుగా సమాచారం. -
పులకించిన మల్లూరు
మంగపేట: మండలంలోని మల్లూరులో సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వరపూజ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనృసింహస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మూడు గంటల పాటు కొనసాగిన ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జయజయద్వానాలతో మల్లూరు పులకించింది. స్వామివారికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ, ప్రధానార్యకులు రాఘవాచార్యులు దేవతా మూర్తుల తరఫున శ్రీ మల్లూరు శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయ పూజారి అనిపెద్ది నాగేశ్వర్రావు పెద్దలుగా వ్యవహరించి స్వామికి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను అందజేశారు. ప్రతీ ఏటా హేమాచల క్షేత్రంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని మే 12న నిర్వహించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. భక్తులు అర్ధరాత్రి తర్వాత కూడా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కాంతులీనిన మల్లూరు జాతరకు తరలివచ్చిన భక్తులు స్వామివారి వరపూజా మహోత్సవాన్ని తిలకించేందుకు ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి వరపూజా మహోత్సవ మండపం నుంచి బొడ్రాయి సెంటర్ వరకు జాతర జరిగే రోడ్లకు ఇరువైపులా రంగుల లైట్లతో అలంకరించారు. స్వామివారి వరపూజా మహోత్సవం మంగళవారం రాత్రితో ముగిసినప్పటికీ బుధవారం సాయంత్రం వరకు జాతర కొనసాగుతూనే ఉంది. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు గా హాజరైన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి సీతక్క తనయుడు ధనసరి సూర్యను అర్చకులు సన్మానించారు. స్వామవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్సై టీవీఆర్ సూరి పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. జయరాంరెడ్డి, యానయ్య, శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు. మల్లూరుగుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వయంభుగా వెలిసిన స్వామివారికి ఆలయ అర్చకులు కై కర్యం రాఘవాచార్యులు, ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. వైభవంగా హేమాచలుని వరపూజా మహోత్సవం కొనసాగుతున్న జాతర -
సంక్రాంతి వస్తే ఆంధ్రాలోనే..
చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగ వస్తే చాలు మా ఇళ్లంతా సందడే. వారం రోజుల నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధం అవుతాం. మా అక్క, బావలు రాజమండ్రిలో ఉంటారు. అక్కడ గోదావరి ఒడ్డున పండుగ జరుపుకుంటే ఆ సంతోషమే వేరు. మా అక్కా, బావలను బతుకమ్మ పండగకు మా ఇంటికి పిలుస్తా.. వారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. – రేసు స్పందన, మహబూబాబాద్పదేళ్ల నుంచి వెళ్తున్నా.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గడిచిన పదేళ్లుగా భీమవరం వెళ్తున్నం. ఇంటి వద్ద భోగి పండుగ చేసుకుని.. మిత్ర బృందంతో కలిసి సంక్రాంతి పండుగ రోజు భీమవరంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటాం. గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి.. కోడిపందెల్లో పాల్గొంటాం. అక్కడ జరిగే సంక్రాంతి సంబురాలు చూస్తాం. – మల్లిగారి రాజు, జనగామ, అంబేడ్కర్‌నగర్ -
గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి వద్ద హారతి కార్యక్రమాన్ని అర్చకులు, వేదపండితులు ఘనంగా ని ర్వహించారు. సోమవారం కాళేశ్వరం దేవస్థానం నుంచి కాలినడకన గోదావరికి చేరుకున్నారు. అనంతరం గోదావరిమాతకు పూలు, పండ్లు, పా లు, పసుపు, కుంకుమ, వస్త్రాలతో సారె, నైవేద్యాన్ని సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఆధ్వర్యంలో హారతి తంతును చేశారు. ఈకార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకు బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
గుబులు రేపుతున్న ఎర్రజెండాలు
● చిన్న కాళేశ్వరం పనులతో ఆందోళనలో రైతులు కాళేశ్వరం: మొన్న ఎలికేశ్వరం, నేడు రాపల్లికోట రైతులు చిన్న కాళేశ్వరం పనులతో ఆందోన చెందుతున్నారు. తమకు సమాచారం లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సర్వేచేసి తమ చేతికొచ్చిన పత్తి చేన్లలో ఎర్ర జెండాలు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహదేవపూర్ మండలంలో చిన్నకాళేశ్వరం కెనాల్లో మొత్తం 60 ఎకరాల వరకు గతంలో అధికారులు సర్వే చేసి భూమికి డబ్బులు చెల్లించినట్లు పేర్కొంటున్నారు. కానీ రైతులు మాత్రం తమకు పరిహారం అందలేదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సూరారం వద్ద రెండు రోజుల కిందట పత్తిచేనులో ట్రెంచ్ తవ్వకాలు జరిపారని రైతులు తెలిపారు. అధికారులు పంట పూర్తయిన తరువాతనే తమకు పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరతున్నారు. లేనిపక్షంలో పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. -
కలల ప్రయాణం
కాల గమనంపండుగంటే ఆనందాల్ని మూటగట్టుకోవడం.. సంతోషాల్ని నెమరు వేసుకోవడం.. సంప్రదాయాల్ని కాపాడడం.. సంస్కృతిని ముందు తరాలకు అందించడం.. ●కాలగమనంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సూర్యుడు మారుతుంటాడు. అలా మారుతున్నదాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణమంటే కదలిక అని అర్థం. ఆ మాదిరిగా ప్రతీ మనిషి తన ఆలోచన, నడవడిక, వైఖరిలో సంక్రమించాలి. ఎప్పటికప్పుడు మార్పు చెందాలి. ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆప్యాయత, అభిరుచి, ఆనందాల కలబోతతో జరుపుకునే సంక్రాంతి నేర్పే పాఠమిదే. – హన్మకొండ కల్చరల్ఆధ్యాత్మికం.. కాస్తంత పని చేస్తేనే అలసిపోతారు. విశ్రాంతి తీసుకుంటారు. మరి నిత్యం లక్షల ఆలోచనలు చేసే మనసుకెక్కడుంది విశ్రాంతి. మనసు ఆహ్లాదంగా మారాలంటే.. ఆధ్యాత్మికతతో నిండాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కుటుంబంతో కలిసి దేవాలయాలను సందర్శించడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల ఆధ్యాత్మికత అలవడుతుంది. ఆలయాల్ని సందర్శించడం ద్వారా మనసుకు కావాల్సిన కాస్మిక్ ఎనర్జీ అందుతుంది. దేవాలయాల్లో వినిపించే ప్రవచనాలు, మంత్రాలు, సంగీతం మనసును తేలికపరుస్తాయి. ఆరోగ్యం.. షడ్రుచులతో భోజనం చేస్తే పొట్టకు పండగే. అలాగని బయట దొరికే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. మార్కెట్లో కల్తీ పెరిగిన నేపథ్యంలో ఇంటి వంటలకు పరిమితమైతేనే మంచిది. ఇంట్లో చేసే పిండి వంటల్లో ఆరోగ్య సూత్రాలు ఎన్నో దాగున్నాయి. నువ్వులతో చేసిన పిండి వంటలు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అరిసెలు అనారోగ్యాన్ని దూరం చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఇలా ప్రతీ వంటకం ఆరోగ్యాన్ని కలుగజేసేదే. అనుబంధం ఉపాధి కోసం ఊరు విడిచి వెళ్లిన వారంతా పండుగ నేపథ్యంలో ఇళ్లకు చేరుతుంటారు. ఈసమయంలో అందరూ కలిసి కష్టసుఖాలు పంచుకుంటే పండుగ కలకాలం గుర్తుండిపోతుంది. అందరూ ఒక చోట చేరిన సమయంలో ఫోన్లను దూరం పెడితే మంచిది. ఉమ్మడిగా భోజనాలు చేయడం.. సామూహికంగా పూజలు చేయడం వల్ల ఆప్యాయతలు పెరుగుతాయి. అంత్యాక్షరి, చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం వల్ల మళ్లీ పండుగ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తారు. మమేకం.. ఈ సృష్టిలో ప్రతీ జీవిలో కదలిక ఉంటుంది. దాన్ని సైంటిస్ట్‌లు తరంగాలు అన్నారు. ఎక్కడో ఉన్న వ్యక్తి వీడియో కాల్లో ఇక్కడ కనిపించడమేంటి? అదే మాదిరిగా.. ప్రతీ జీవీ మనిషికి ఏదో సమయంలో ఏదో విధంగా సాయపడుతూనే ఉంటుంది. మనుషులు ఆహారాన్ని సంపాదించడానికి పరుగులు పెడతారు. రేపటి కోసం దాచుకుంటారు. మూగజీవా లు, పశుపక్ష్యాదులు మాత్రం అలా కాదు.. ఏరోజుకారోజు ఆహారాన్ని తెచ్చుకుంటాయి. వాటికి మనుషులతో విడదీయలేని బంధం. వాటిపై కృతజ్ఞత చూపాలి. వ్యవసాయంలో ఇతోదికంగా సహాయపడే పశువులను సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ రోజు పూజించడం ఆనవాయితీ అందుకే. వ్యాయామం ఈ మధ్య ఇన్స్టంట్ ముగ్గులూ వచ్చాయి. మహిళలకు శ్రమ లేకుండా మార్కెట్లో దొరికే ఫ్రేమ్‌లపై రంగు పోస్తే చాలు.. ముగ్గు రెడీ అవుతుంది. కానీ.. రోజూ ముగ్గు వేయడం వల్ల శరీరానికి తగిన వ్యాయామం దొరుకుతుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. వంగి లేవడం వల్ల శ్వాస తీసుకోవడం, వదలడం ఎక్కువ సార్లు చేస్తారు. దీంతో ప్రాణాయామం చేసినట్లు అవుతుంది. -
సంబరాల సంక్రాంతి
భూపాలపల్లి అర్బన్: సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. హరివిల్లులాంటి రంగవల్లులు, సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు, డూడూ బసవన్నల విన్యాసాలు, భోగ భాగ్యాలు ఇచ్చే విధంగా మంటలు, గొబ్బెమ్మల పాటలు, సంప్రదాయ ఆటలతో పెద్ద పండగ కొలువు దీరింది. కొత్త కోడళ్లు.. అల్లుళ్లతో చకినాల రుచులు, విందు భోజనాల ఘుమఘుమలతో రంగులు.. ముగ్గులు.. నోములతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. జిల్లావ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో ఇంటి ముంగిళ్లు రంగులతో ఇంద్రధనుస్సును తలపించాయి. చిన్నారులకు తల్లిదండ్రులు భోగి పండ్లను తలపై పోసి దీవించారు. అనుబంధాలు, ఆత్మీయత.. ప్రేమ పూర్వక పలకరింపులతో పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఘనంగా భోగి వేడుకలు జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన భోగి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. భోగి పండుగలో భాగంగా మహిళలు ఇంటి ముందు ఉదయాన్నే ముగ్గులు పెట్టి ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, రేగుపండ్లు, ఇతర గరిక ఆకులు, నవధాన్యాలు, పండ్లతో కలిపి ప్రతిష్టించారు. జిల్లా కేంద్రంలో పలు కాలనీలలో మహిళలు, యువకులు భోగి మంటలు ఏర్పాటు చేసి మంటల చుట్టూ తిరుగుతూ డీజే పాటలతో నృత్యాలు చేశారు. పాత వస్తువులను మంటల్లో వేశారు. మహిళలు తమ ఇండ్లలో కుటుంబ సభ్యులతో కలిపి తీపి, పిండి పదార్థాలను తయారు చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రైతన్నల పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. దీన్నే రైతన్నల పండుగగా పిలుస్తారు. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే శుభవేళ కూడా ఇదే. ఉదయాన్నే ఆవు పేడతో ఇంటి వాకిట అలుకులు చల్లి.. రంగురంగుల రంగ వల్లికలను తీర్చిదిద్ది సంక్రాంతి లక్ష్మిని మహిళలు సాదరంగా ఆహ్వానిస్తారు. నూతన వస్త్రధారణతో ఆనందంగా గడపడం.. కొత్త అల్లుళ్లు.. ముగ్గుల పోటీలు ఈ పండుగ ప్రత్యేకత. ఆలయాల్లో ప్రత్యేక పూజలు భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాకేంద్రమైన శ్రీభక్తాంజనేయస్వామి ఆలయం, కోదండరామాలయం, కాళేశ్వరం, గణపురం కోటగుళ్లు, కోటంచ శ్రీలక్ష్మినర్సింహాస్వామి, నైన్పాక గ్రామంలోని నాపాక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు ఆధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.తెల్లవారు జామునే భోగి మంటలు సందడిగా మారిన ఊరూవాడ రంగవల్లులతో వాకిళ్లకు అందాలు ధాన్యలక్ష్మి గృహ ప్రవేశం.. ఆలయాల్లో పెరిగిన రద్దీ