Economy
-
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
ఇంధన పరివర్తనపై జాగ్రత్త అవసరం
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా దీన్ని సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన పేరుతో వృద్ధిని పక్కన పడేయకూడదు. వృద్ధి అనేదే లేకపోతే, పర్యావరణ మార్పులను నియంత్రించడం కోసం పెట్టుబడులు పెట్టేందుకు వనరులు కూడా ఉండవు‘ అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ విషయాలు వివరించారు. పారిశ్రామిక విద్యుత్ ధరలు ఒక్కసారిగా ఎగిసి యూరప్ ఆర్థికంగా సంకట స్థితిలో పడటానికి .. పునరుత్పాదక విద్యుత్, ఇంధన పరివర్తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం కూడా పాక్షికంగా కారణమన్నారు. ఈ అంశం కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పెద్ద సవాలని, భారత్‌తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలపైనా ప్రభావం చూపుతోందని నాగేశ్వరన్ చెప్పారు. దేశీయంగా మందగమనం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5–7 శాతం వృద్ధిని సాధించే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. -
అగ్రోకెమికల్స్ ఆదాయంలో వృద్ధి
ముంబై: వ్యవసాయ రసాయనాల రంగం ఆదాయం భారత్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. స్థిరంగా దేశీయ డిమాండ్, ఎగుమతుల పరిమాణంలో పునరుద్ధరణ ఇందుకు కారణమని వివరించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ స్వల్పంగా 5–6 శాతం వృద్ధిని సాధిస్తుంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఇవి 100 బేసిస్ పాయింట్లు పెరిగి 12–13 శాతానికి చేరాయి. ఇప్పటికీ కోవిడ్ ముందస్తు స్థాయి 15–16 శాతం కంటే ఇది తక్కువ. ఇది సంస్థలను మూలధన వ్యయం విషయంలో జాగ్రత్తగా ఉంచుతుంది. నగదు ప్రవాహాలు, బ్యాలెన్స్ షీట్లను స్థిరంగా నిర్వహించడానికి వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఈ రంగం మొత్తం ఆదాయంలో సగభాగాన్ని కలిగి ఉన్న ఎగుమతుల నుండి వచ్చే ఆదాయంలో మార్పు కనిపిస్తోంది. తక్కువ–ధర కలిగిన చైనా ఉత్పత్తులకు సంబంధించిన అదనపు నిల్వల సమస్యలను గ్లోబల్ సంస్థలు పరిష్కరించాయి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్‌ని మెరుగ్గా నిర్వహించడానికి పంటల సీజన్‌కు దగ్గరగా ఆర్డర్ చేస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. ధరల ఒత్తిడి ఉన్నా.. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన పరిమాణ వృద్ధిని ఆశిస్తున్నప్పటికీ, పోటీ ధర కలిగిన చైనీస్ ఉత్పత్తుల నుండి ధరల ఒత్తిళ్ల మధ్య రాబడి వృద్ధి 3–4 శాతం వద్ద స్వల్పంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఒత్తిళ్లు తగ్గినందున రాబడి 7 శాతానికి పైగా మెరుగుపడవచ్చు. మంచి రుతుపవనాలు, తగినంత రిజర్వాయర్ల స్థాయిల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆదాయం 8–9 శాతం పెరిగింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతున్నాయి. చైనాలో అధిక సరఫరా నుండి ధరల ఒత్తిడి ఉన్నా.. గత సంవత్సరం కంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా. ఇన్వెంటరీ రైట్ ఆఫ్‌ల సంఘటనలు తగ్గుతాయి. ఈ రంగం యొక్క ఆపరేటింగ్ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతానికి, వచ్చే ఏడాది 13 శాతానికి కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అధిక విక్రయాల పరిమాణం ఉన్నప్పటికీ కొనసాగుతున్న ధరల ఒత్తిడి ఈ వృద్ధిని పరిమితం చేస్తుంది’ అని క్రిసిల్ నివేదిక తెలిపింది. -
రైతులకు తనఖా లేకుండా రూ.2 లక్షల రుణం
న్యూఢిల్లీ: రైతులకు తనఖా లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ఇది 2025 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆదేశించింది. ఇప్పటి వరకు తనఖా లేని రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉంది. ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణాలు సులభంగా రైతులకు చేరేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలోని చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఈ సందర్భంగా సూచించింది. వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలను పెంపొందించడానికి, వ్యవసాయ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి ఈ చొరవ ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు. వ్యవసాయ ముడిసరుకు ఖర్చులపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పరిష్కరించడం, రుణ లభ్యత పెంచడం, వ్యవసాయ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ చొరవ కీలక దశగా ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. -
UPI Transactions: 11 నెలల్లో రూ.223 లక్షల కోట్లు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) 2024 జనవరి నుంచి నవంబర్ వరకు ఏకంగా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనడానికి ఈ లావాదేవీలు ఓ ఉదాహరణ అనే చెప్పాలి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా.. నేపాల్, భూటాన్, యూఏఈ, సింగపూర్, శ్రీలంక, మారిషన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016లో ప్రారంభమైన యూపీఐ.. మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ద్వారా చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు తక్షణ నగదు బదిలీలకు మాత్రమే కాకుండా.. వ్యాపార లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటియూపీఐ అనేది భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అక్టోబర్ 2024లోనే రికార్డు స్థాయిలో 16.58 బిలియన్ ఆర్థిక లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. దీని విలువ మొత్తం రూ.23.49 లక్షల కోట్లు. రాబోయే రోజుల్లో ఈ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది.Driving the #DigitalPayment revolution, UPI achieved 15,547 crore transactions worth Rs. 223 lakh crore from January to November, 2024, showcasing its transformative impact on financial transactions in India.⁰#FinMinYearReview2024⁰#BankingInitiatives⁰#ViksitBharat pic.twitter.com/Bkbag6542k— Ministry of Finance (@FinMinIndia) December 14, 2024 -
ఎన్పీఏ కేసులు.. ఆర్థిక శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), జాతీయ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) వద్ద ఎన్పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్సీఎల్టీ ముందుకు బ్యాంక్‌లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్సీఎల్టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్ఏఆర్సీఎల్, ఎన్సీఎల్టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్ఏఆర్సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్పీఏ ఖాతాలను బ్యాంక్‌లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. -
జోరుగా వంట నూనెల దిగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు భారత్‌లో 2024 నవంబర్‌లో 15.9 లక్షల టన్నులు నమోదైంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఇది 38.5 శాతం అధికం. ముఖ్యంగా విదేశాల నుంచి ముడి పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయాబీన్ నూనెలు భారత్‌కు వెల్లువెత్తడం ఇందుకు కారణం.సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. 2024–25 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరం మొదటి నెలలో వివిధ దేశాల నుంచి భారత్‌కు వెజిటబుల్ ఆయిల్స్ సరఫరా 40 శాతం అధికమై 16,27,642 టన్నులకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం 11,60,590 టన్నులుగా ఉంది. 2023 నవంబర్‌లో నమోదైన 12,498 టన్నులతో పోలిస్తే నాన్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి గత నెలలో 37,341 టన్నులకు పెరిగింది. ఆర్బీడీ పామోలిన్ 1,71,069 టన్నుల నుంచి 2,84,537 టన్నులకు ఎగసింది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ 1,28,707 టన్నుల నుంచి 3,40,660 టన్నులకు చేరింది. పెరిగిన సాఫ్ట్ ఆయిల్స్.. గత నెలలో భారత్‌కు ముడి సోయాబీన్ ఆయిల్ రాక 1,49,894 టన్నుల నుంచి 4,07,648 ట న్నులకు దూసుకెళ్లింది. విదేశాల నుంచి భారత్‌కు ముడి పామాయిల్ సరఫరా 6,92,423 టన్నుల నుంచి గత నెలలో 5,47,309 టన్నులకు పడిపోయింది. గత నెలలో ముడి, శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి 8,69,491 టన్నుల నుండి 8,41,993 టన్నులకు వచ్చి చేరింది. విదేశాల నుంచి భారత్‌కు సాఫ్ట్ ఆయిల్ సరఫరా 2023 నవంబర్‌తో పోలిస్తే 2024 నవంబర్‌లో 2,78,601 టన్నుల నుంచి ఏకంగా 7,48,308 టన్నులకు దూసుకెళ్లింది.పామాయిల్ వాటా 76% నుంచి 53 శాతానికి పడిపోయింది. సాఫ్ట్ ఆయిల్స్ 24 నుంచి 47 శాతానికి పెరిగాయి. ఇండోనేషియా, మలేషియా నుంచి ఆర్బీడీ పామోలిన్, ముడి పామాయిల్ ప్రధానంగా సరఫరా అవు తోంది. సోయాబీన్ నూనె ప్రధానంగా అర్జెంటీ నా, బ్రెజిల్, రష్యా నుండి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ర ష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుండి భారత్‌కు వస్తోంది. -
7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పలు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా, ‘ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్: రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్’ శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2030 నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరం‘ అని నివేదికలో పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వివరించిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే... → 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడానికి దేశం 2024– 2030 మధ్య 10.1 శాతం పురోగతి సాధించాలి. → మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. ఈ విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (ఎల్పీఐ) విషయంలో భారత్ ర్యాంకింగ్ 2023లో 54కు ఎగసింది. 2014లో ఇది సూచీ 54 వద్ద ఉంది. → గత కొన్ని సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. → దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ సంస్థలకు దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. → అయితే మౌలిక రంగం పురోగతికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చూస్తే, ద్రవ్యలోటు పరంగా ఎదురయ్యే సవాళ్లను ఇక్కడ ప్రస్తావించుకోల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు తీవ్రం కాకుండా చూసుకోవడంలో భాగంగా మౌలిక రంగంపై పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంటుంది. → భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది, 2009–13 మధ్య 160 బిలియన్ల (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. 2019–23 మధ్య ఈ విలువ దారుణంగా 39.2 బిలియన్ (మొత్తం పెట్టుబడుల్లో 7.2 శాతం)క డాలర్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ విభాగంలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇది ద్రవ్యలోటు సమస్యలకూ దారితీస్తున్న సమస్య. ప్రైవేటు రంగంలో మౌలిక విభాగ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రభుత్వాలు ద్రవ్యలోటు సమతౌల్యతను రక్షించగలుగుతాయి. → మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే చర్యల విషయంలో ప్రభుత్వ వ్యయాన్ని వినియోగించవచ్చు. ప్రజారోగ్య సంరక్షణ, మానవ వన రుల పురోగతి, రుణ చెల్లింపులు వంటి ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వం వ్యయాన్ని మళ్లించవచ్చు. → రంగాల వారీగా చూస్తే పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, రోడ్డు రవాణా రహదారులు, గోడౌన్లు, రవాణా రంగాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన కీలక విభాగాలు. → వేగవంతమైన పట్టణీకరణ, యువత అధికంగా ఉండడం, పట్టణ ప్రాంతాల పురోగతి, ఎయిర్‌పోర్ట్‌లు, విద్యుత్ సరఫరా వంటి రంగాలు భారీ పెట్టుబడి అవకాశాలను కలిగి ఉన్నాయి. -
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
దిగుమతులపై ఆందోళన అక్కర్లేదు
ఎగుమతుల వాటా పెరుగుతున్నంత వరకూ దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఎలాంటి వాణిజ్య అసమతుల్యత ఏర్పడడం లేదన్నారు. వాణిజ్యానికి, ఉత్పత్తుల రవాణాకు ప్రతిబంధకాలు సృష్టించే ధోరణులను ప్రపంచ దేశాలు నివారించాలని ఆయన పేర్కొన్నారు.‘ప్రపంచమంతా 3–3.5 శాతం వృద్ధి చెందుతోంటే భారత ఎకానమీ 7 శాతం వృద్ధి సాధిస్తోంది. అలాంటప్పుడు భారత్‌లో వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దిగుమతులూ పెరుగుతాయి. అయితే, ఎగుమతుల్లో దిగుమతుల పాత్ర కూడా చాలా కీలకం. ఎగుమతుల్లో దిగుమతుల వాటాను (దిగుమతి చేసుకున్న వాటిని మరో రూపంలో ఎగుమతి చేయడం) మెరుగుపర్చుకుంటున్నంత వరకు మనం దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు‘ అని సునీల్ బరత్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: సినిమా చూసి భావోద్వేగానికి గురైన సింఘానియాఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఉత్పత్తుల ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 5.77 శాతం పెరిగి 416.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, సంపన్న దేశాల్లో వలసలు, మొబిలిటీ విషయంలో గందరగోళం నెలకొందని బరత్వాల్ తెలిపారు. భారతీయులు లేదా భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయా దేశాలకు ప్రొఫెషనల్స్ రాకపోకలు సాగించాల్సిన (మొబిలిటీ) అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరాటంకమైన మొబిలిటీకి వెసులుబాటు కల్పించాలని భారత్ అడుగుతోందే తప్ప వలసలను అనుమతించమని కోరడం లేదని బరత్వాల్ స్పష్టం చేశారు. -
వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్‌పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
వృద్ధి తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్‌పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 డెడ్‌లైన్!
ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు.డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కించడంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి.ఆన్లైన్లో అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు చేయడం ఎలా?● ఆన్లైన్లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలనుకునే వారు 'ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా' (భారత ఆదాయపు పన్ను శాఖ) ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఓపెన్ చేయాలి.● అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు క్విక్ లింక్స్ కింద కనిపించే 'ఈ-పే ట్యాక్స్' (e-Pay Tax)పై క్లిక్ చేయాలి. ● ఈ-పే ట్యాక్స్ ఓపెన్ చేసిన తరువాత పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.● ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ● 'ఇన్కమ్ ట్యాక్స్' కింద ట్యాక్స్ కేటగిరి ఎంచుకుని.. కంటిన్యూ అవ్వాలి.● అడ్వాన్స్ ట్యాక్స్ 100కు చెల్లించాలనుకుంటే.. కేటగిరి 100ను ఎంచుకోవాలి. ● ట్యాక్స్ మొత్తాన్ని ఎంచుకున్న తరువాత.. ఏ విధంగా చెల్లింపులు చేస్తారో సెలక్ట్ చేసుకోవాలి. ● ట్యాక్స్ చెల్లించడానికి ముందు.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ట్యాక్స్ చెల్లించాలి. -
మొండిబకాయిలు రూ.3 లక్షల కోట్లు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (సెప్టెంబర్ 30) ముగిసే నాటికి రూ.3,16,331 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 3.09 శాతమని వివరించారు.ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు రూ.1,34,339 కోట్లని తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 1.86 శాతంగా వివరించారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... 2024 మార్చి 31 నాటికి 580 మంది ప్రత్యేక రుణగ్రహీతలు (వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా), ఒక్కొక్కరు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ రుణ బకాయిలను కలిగి ఉన్నారు. వీరిని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించాయి.ప్రస్తుత దివాలా కేసుల తీరిది... మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది. బ్యాంకులతో సహా రుణదాతల మొత్తం క్లెయిమ్ రూ. 11.45 లక్షల కోట్లు కాగా, మొత్తం లిక్విడేషన్ విలువ రూ. 2.21 లక్షల కోట్లు. -
సారొచ్చారు.. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు
బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేశారు. సంజయ్ మల్హోత్రా పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు.‘ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, విశ్వాసం, వృద్ధి మూడు మూల స్థంభాల్లాంటివి. వీటిని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అందుకు భారత సెంట్రల్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఆర్బీఐ పనితీరు, అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. ఇందుకోసం చాలామంది సిబ్బంది శ్రద్ధతో పని చేశారు. వారు కాపాడుతూ వచ్చిన ఆర్బీఐ ప్రతిష్టను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను. 2047 వరకు ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని సాధించేందుకు సమర్థమంత నిర్ణయాలు అవసరం. ఈ సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్తుంది’ అని సంజయ్ మల్హోత్రా చెప్పారు.అపార అనుభవం..56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇదీ చదవండి: కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్నిన్నటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషించారు. -
ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది. రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి. రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు. -
ట్రిలియన్ డాలర్లకు ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలానికిపైగా విదేశీ పెట్టుబడులకు భారత్ కీలకంగా నిలుస్తోంది. దీంతో భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) భారీగా తరలివస్తున్నాయి. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకూ చూస్తే ఎఫ్‌డీఐలు ట్రిలియన్ డాలర్లను అధిగమించాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక కీలక పెట్టుబడుల ప్రాంతంగా భారత్ నిలుస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం విదేశీ పెట్టుబడులలో భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా ఈక్విటీలు, ఆర్జనతోపాటు ఇతర మూలధనాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం తదితరాల ద్వారా భారత్ ఆకట్టుకున్న ఎఫ్‌డీఐలు 1,033.4 బిలియన్ డాలర్లను తాకాయి. మారిషన్ కీలకం మొత్తం ఎఫ్‌డీఐలలో 25 శాతం మారిషస్ నుంచి లభించగా.. 24 శాతంతో తదుపరి సింగపూర్ నిలిచింది. ఈ బాటలో యూఎస్ వాటా 10 శాతంకాగా.. నెదర్లాండ్స్ 7 శాతం, జపాన్ 6 శాతం, యూకే 5 శాతం, యూఏఈ 3 శాతం, కేమన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ 2 శాతం చొప్పున తదుపరి ర్యాంకులను ఆక్రమించాయి. విలువపరంగా బిలియన్ డాలర్లలో మారిషన్ వాటా 177.18కాగా.. సింగపూర్ 167.47, యూఎస్ 67.8గా నమోదయ్యాయి. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకున్న ప్రధాన రంగాలలో సరీ్వసెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ నిలిచాయి. 2014 నుంచి స్పీడ్ వాణిజ్య శాఖ వివరాల ప్రకారం 2014 నుంచి పదేళ్లలో భారత్‌కు మొత్తం 667.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు తరలివచ్చాయి. అంతక్రితం దశాబ్ద కాలం(2004–2014)లో నమోదైన విదేశీ పెట్టుబడులతో పోలిస్తే ఇవి 119 శాతం అధికం. 2014–24 కాలంలో తయారీ రంగంలోకి తరలి వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 165.1 బిలియన్ డాలర్లు. ఇది అంతక్రితం పదేళ్లలో నమోదైన 97.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే 69 శాతం వృద్ధి. పెట్టుబడిదారుల సానుకూల దేశంగా నిలవడం ద్వారా భారత్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. సంబంధిత వర్గాలతో చర్చలు, సమావేశాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్‌డీఐ విధానాలను సవరిస్తోంది. ఇది సానుకూల అంశంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2025లోనూ వచ్చే కేలండర్ ఏడాది(2025)లోనూ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు పటిష్ట స్థూల ఆర్థిక గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి బలిమి, పీఎల్ఐ పథకాలు ప్రభావం చూపనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లున్నప్పటికీ విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ ప్రాంతంగా నిలుస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అయితే యూఎస్‌లో విధానాల సవరణ, చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతికి మద్దతుగా సహాయక ప్యాకేజీలు వంటి అంశాల కారణంగా భారత్‌కు ఎఫ్‌డీఐల రాక మందగించే వీలున్నట్లు డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త ఆర్.మజుందార్ అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుతం కొన్ని రంగాలలో ఎఫ్‌డీఐలపై నిషేధం అమలవుతోంది. లాటరీ, గ్యాంబ్లింగ్, చిట్ పండ్స్, నిధి కంపెనీ, సిగార్ల తయారీ, పొగాకుతో తయారయ్యే సిగరెట్లు తదితర విభాగాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించడంలేదు. -
మళ్ళీ పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు.. ఈ సారి ఎంతంటే?
దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మరోమారు పెంచుతూ ప్రకటించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచిన తరువాత.. ఎంసీఎల్ఆర్ రేట్లు 9.20 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ ప్రకటించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 2024 డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ను 5 పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరింది. ఒక నెల టెన్యూర్ రేటు (9.20 శాతం), మూడు నెలల టెన్యూర్ రేటు (9.30 శాతం) యధాతదంగా ఉంచింది.ఆరు నెలలు, 12 నెలలు (ఒక సంవత్సరం) టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద ఉంది. రెండు సంవత్సరాల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం అయితే.. మూడేళ్ళ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.50 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఓవర్‌నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రమే 5 పాయింట్లు పెరిగినట్లు తెలుస్తోంది.కొత్త ఎంసీఎల్ఆర్లుఓవర్ నైట్: 9.20 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 26వ గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆయన పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. బుధవారం మల్హోత్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ మంగళవారం పదవీ విరమణ చేస్తారు.అపార అనుభవం... 56 సంవత్సరాల మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 1990 బ్యాచ్ రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 33 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో విద్యుత్, ఫైనాన్స్, పన్నులు, సమాచార సాంకేతికత, గనులుసహా పలు రంగాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇంతక్రితం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో ఆర్థిక, పన్నుల విషయంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు.సమన్వయానికి మారుపేరు... ఉర్జిత్ పటేల్ ఆకస్మిక ని్రష్కమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద మిగులు నిధుల బదిలీ సమస్యపై ఆర్బీఐ– ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ నేపథ్యంలోనే పటేల్ ఆకస్మిక రాజీనామా చోటుచేసుకుందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. ఉర్జిత్ రాజీనామా నేపథ్యంలో అనిశి్చతిని ఎదుర్కొన్న మార్కెట్‌కు తిరిగి విశ్వాసాన్ని అందించిన వ్యక్తిగా శక్తికాంతదాస్ నిలిచారు. పలు క్లిష్ట సందర్భాల్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య చక్కటి సమన్వయం సాధించడంలో ఆయన విజయం సాధించారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేశారు. -
ఎఫ్‌పీఐల స్పీడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా అమ్మకాల బాటలో సాగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. దేశీ స్టాక్స్‌లో నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు. వెరసి ఈ నెల తొలి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 24,454 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్‌లో కొత్త రికార్డుకు తెరతీస్తూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో కొంత వెనకడుగు వేసి రూ. 21,612 కోట్ల అమ్మకాలకు పరిమితమయ్యారు. అయితే సెపె్టంబర్లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇకపై యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ విధానాలు, వడ్డీ రేట్లు, రాజకీయ భౌగోళిక అంశాల ఆధారంగా ఎఫ్‌పీఐల పెట్టుబడులు నమోదుకానున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. -
తయారీ రంగం, ఆహార ద్రవ్యోల్బణంపై సూచనలు
బడ్జెట్ రూపకల్పనకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. గతంలోకంటే మరింత మెరుగ్గా అభివృద్ధి సాగించేందుకు అవసరమైన బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమగ్ర తయారీ విధానం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహకాలు, వ్యవసాయ వృద్ధిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, ద్రవ్యోల్బణం నిర్వహణపై ఆర్థికవేత్తలతో చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు గ్రీన్ ఎనర్జీ వనరులను అన్వేషించాలని, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను పెంచాలని ప్రముఖులు సూచించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఉత్పాదక రంగంలో దిగుమతి సుంకాలు, పన్నులు, సాంకేతికత బదిలీ, ఇతర అంశాల పురోగతిపై ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని తెలిపారు. ప్రభుత్వం మూలధన పెట్టుబడులపై స్థిరాదాయం సమకూరాలని పేర్కొన్నారు.స్తబ్దుగా తయారీ రంగందేశీయ తయారీ రంగ వాటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15-17% వద్ద కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీన్ని 25% పెంచడానికి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే వాదనలున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగతున్నప్పటికీ, ప్రభుత్వం మూలధన వ్యయంపై స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కంపెనీలను ప్రోత్సహించాలని కొందరు ఆర్థికవేత్తలు సిఫార్సు చేశారు. 2025-26లో ప్రభుత్వ మూలధన వ్యయం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జపాన్ కంపెనీల హవా.. కొరియన్, చైనా బ్రాండ్లకు దెబ్బ!ఆహార ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలుసమగ్ర ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణం ప్రధాన అడ్డంకిగా మారుతుందనే వాదనలున్నాయి. ఆహార ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా నియంత్రణలో ఉంచడానికి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని ప్రముఖులు విశ్లేషించారు. దాంతోపాటు ఆయా ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడానికి ఇండియా అనుసరిస్తున్న విధానాలు ప్రశంసనీయం అయినప్పటికీ, గ్రీన్ ఎనర్జీలో మరిన్ని ఆవిష్కరణలు రావాలని తెలిపారు. -
పూచీకత్తు లేకుండా రైతులకు రూ.2 లక్షలు రుణం
చిన్న, సన్నకారు రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఊరట కల్పించింది. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ.1.66 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.“వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు రుణ లభ్యతను మరింత పెంచుతుంది.’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితి పెంపునకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేయనుంది. ఈ రుణాలను రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంక్ సవరించింది. అప్పట్లో రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచింది.రైతుల మేలు కోసం..చిన్న, సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో రూ.3 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అంతకు ముందు 2014లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసి) నుండి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లను (సిఐఆర్) పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్లు/లోన్ పాలసీలలో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టమ్‌లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి.