Alluri Sitarama Raju
-
ట్రాలర్ ఢీకొని యువకుడి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ట్రాలర్ రూపంలో మృత్యువు కబళించింది. షీలానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమా దం జరిగింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలేనికి చెందిన మైలపల్లి మనోహర్ (24) మెరినో సంస్థలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం నగరం నుంచి గాజువాక వైపు బైక్‌పై వెళ్తున్నాడు. షీలానగర్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వెనుకనే వేగంగా వస్తున్న ట్రాలర్ బైక్‌ను ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పడంతో మనోహర్ తూలి లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మనోహర్ హెల్మెట్ ధరించినా.. లారీ చక్రాల కింద నలిగి హెల్మెట్ ఊడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని షీలానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మనోహర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మనోహర్‌కు తండ్రి మైలపల్లి దేముడు, తల్లి దేముడమ్మ, ఒక సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
చెట్టుపై నుంచి జారిపడియువకుడికి గాయాలు
డుంబ్రిగుడ: కట్టెల కోసం చెట్టెక్కిన ఓ గిరిజన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి గాయాలు పాలైన సంఘటన మండలంలోని లైగండ పంచాయతీ ఇసుకగరువలో చోటు చేసుకుంది. గ్రామనికి చెందిన తాంగుల ప్రశాంత్‌కుమార్ ఉదయం వంట చెసుకునేందుకు కట్టెలు సేకరణకు చెట్టెక్కాడు. కట్టెలు కొట్టె క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడ్డాడు. ప్రమాదంలో కుడి కాలు విరిగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టడుతుండగా కుటుంబీకులు హుటాహుటిన 108కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి సిబ్బంది అర్జున్, శ్యామ్ ప్రథమచికిత్స అందించిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సరియాపల్లిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది వాంతులు,విరోచనాలతో బాధపడుతున్నా రు. వాంతులు, విరోచనాలతో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.మంగళవారం ఉదయం గ్రామానికి చెంది న గోల్లోరి దనియా(56), సాయంత్రం ఏడాది బాలు డు కిలో వినయ్ వాంతులు,విరోచనాలతో మృతి చెందారు. ప్రసుత్తం గ్రామంలో కొర్రా విక్రత్,కొర్రా హర్షిత్,వంతాల సిద్ధాంత్,కొర్రా వసంత అనే ఏడాదిలోపు చిన్నారులతో పాటు మరికొంత మంది వాంతలు,విరోచనాలతో బాధపడుతున్నారు. చిన్నారు లకు శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. చాలా మంది 10 రోజులుగా అస్వస్థతతో మంచం పట్టారు. ఇటీవల కిలగాడ వైద్యసిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి, వైద్యసేవలు అందించినా అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులకు కంటిమీదకునుకు కరువైంది. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని బంగారుమెట్ట సర్పంచ్ రత్న,వైఎస్సార్ సీపీ మండల నేత మోహన్,సరియాపల్లి గ్రామస్తులు కోరారు.దీనిపై కిలగాడ వైద్యాధికారి రమేష్ వద్ద ప్రస్తవించగా సరియాపల్లిలో గత వారం వైద్య శిబి రం నిర్వహించామని, బుధవారం మరోసారి శిబి రం నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే పీహెచ్ సీకి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తామన్నారు. వాంతులు, విరోచనాలతో ఒకే రోజు చిన్నారితో సహా ఇద్దరి మృతి భయాందోళనలో గ్రామస్తులు ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి -
24 కేసుల మద్యం స్వాధీనం
చింతూరు: వై.రామవరం మండలం డొంకరాయిలోని ఓ బెల్టుషాపునకు అక్రమంగా తరలించేందుకు లోడ్ చేస్తున్న 24 కేసుల మద్యాన్ని చింతూరు ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి చింతూరులోని మద్యం దుకాణాలకు సరఫరా చేసేందుకు ఓ వ్యానులో మద్యం కేసులు వచ్చాయి. ఈ క్రమంలో ఓ దుకాణం వద్ద వ్యానులో నుంచి ఆటోలోకి మద్యం కేసులను లోడు చేస్తున్న సమాచారం అందుకున్న ఎకై ్సజ్ పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం లోడుతో ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వై.రామవరం మండలం చవిటిదిబ్బలులోని మద్యం దుకాణానికి వెళ్లాల్సిన మద్యం కేసులను డొంకరాయిలోని బెల్టుషాపునకు తరలించేందుకు చింతూరులో ఆటోలో లోడు చేస్తుండగా దాడిచేసి స్వాధీనం చేసుకున్నట్టు చింతూరు ఎకై ్సజ్ ఎస్ఐ స్వామి తెలిపారు. ఆటోలో లోడుచేసిన రూ.1.12 లక్షల విలువైన 13 బీరు కేసులు, 11 లిక్కరు కేసులను స్వాధీనం చేసుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రంగురాళ్లు తవ్వుతున్న 10 మంది అరెస్ట్
చింతపల్లి: చింతపల్లి అటవీశాఖ సబ్ డివిజన్ పరిధిలో గల సిగనాపల్లిలో అక్రమంగా రంగురాళ్లు తవ్వుతున్న 10 మందిని అరెస్టు చేసినట్టు పెదవలస రేంజ్ అధికారి శివరంజిని తెలిపారు. జీకే వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలో గల సిగనాపల్లి సమీపంలో కొండపై రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు మంగళవారం సిబ్బందితో దాడి చేసినట్టు చెప్పారు. రంగురాళ్లు తవ్వుతున్న కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన 10 మందిని అరెస్టు చేసి, వారి నుంచి 2.2 గ్రాముల రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రంగురాళ్ల క్వారీ వద్ద విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రొడక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగించినట్టు రేంజ్ అధికారి శివరంజని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ గోపి,స్టైకింగ్ ఫోర్స్,బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
ఉద్యోగ ప్రస్థానం ● 1997లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం.. ● 1998 నుంచి 2000 డిసెంబర్ వరకు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. ● 2000 డిసెంబర్ నుంచి 2002 జూన్ వరకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు. ● 2002 జూన్ నుంచి 2007 ఏప్రిల్ వరకు అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ● అనంతరం సెలవులో ఉండి వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. ● 2011 నుంచి 2019 వరకు ఖరగ్‌పూర్ ఐఐటీలోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. ● 2019 ఆగస్టు నుంచి హెచ్ఏజీ స్కేల్‌తో అదే చోట ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ● అలాగే ప్రొఫెసర్ రాజశేఖర్ ఖరగ్‌పూర్ ఐఐటీ డీన్‌గా, జేఈఈ మెయిన్స్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించినప్పుడు చైర్మన్‌గా వ్యవహరించారు. ● స్థానికుడికే దక్కిన అవకాశం ● ఏయూ ఉపకులపతిగా ఆచార్య రాజశేఖర్ నియామకం విశాఖ విద్య/సింహాచలం: ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య గంగవంశం పైడి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ సంయుక్తంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం ఖరగ్‌పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆచార్య రాజశేఖర్‌ది సింహాచలం. తమ ప్రాంతీయుడు ఏయూ వీసీగా నియామకం కావడం ఎంతో గర్వకారణమని రాజశేఖర్ స్నేహితులు, సన్నిహితులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ అడవివరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. గ్రీన్‌పార్క్ సమీపంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియడ్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసి అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. గణితంలో ఆచార్య రాజశేఖర్ చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కుటుంబ నేపథ్యం ప్రొఫెసర్ రాజశేఖర్ తండ్రి బలరామకృష్ణ అడవివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి సావిత్రి గృహిణి. రాజశేఖర్ సోదరుడు గిరిధర్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. రాజశేఖర్ కుమార్తె కూడా ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. 2017లో అడవివరంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో స్థానికులు రాజశేఖర్‌ను ఘనంగా సత్కరించారు. రాజశేఖర్ ఏయూ వీసీగా నియామకం కావడంతో అతని స్నేహితులు పాశర్ల ప్రసాద్, టి.వి.కృష్ణంరాజు, రాజనాల సత్యారావు, వై.డి.వి ప్రసాద్, గ్రామస్తులు కర్రి అప్పలస్వామి, కొలుసు ఈశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వీసీ రిలీవ్ ఏయూ ఇన్చార్జి వీసీ బాధ్యతల నుంచి ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం రిలీవ్ అయ్యారు. వర్సిటీకి నూతన వీసీని నియమించిన ప్రభుత్వం.. ప్రస్తుత వీసీ వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు శశిభూషణరావు వీసీ బాధ్యతల నుంచి వైదొలగి.. తన మాతృస్థానమైన ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. ఇదిలా ఉండగా ఆచార్య శశిభూషణరావుకు ఏయూ పూర్తిస్థాయి వీసీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. మరో పక్క వీసీ పోస్ట్ కోసమని ప్రస్తుత రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు, రెక్టార్ కిశోర్‌బాబు తమ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కానీ వీరికి అవకాశం దక్కలేదు. వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న వీరిని ఇక్కడ కాకుంటే, రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకై నా పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కూటమికి చెందిన కీలక నేతలు వీరి కి అభయం కూడా ఇచ్చారనే ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి ఆశాభంగం తప్పలేదు. కాగా.. వీసీగా నియమితులైన రాజశేఖర్ ఎప్పుడు విధుల్లో చేరుతారనేది స్పష్టత లేదు. దీనిపై వర్సిటీ వర్గాలకు కూడా సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ ధనుంజయరావు పూర్తి స్థాయిలో వర్సిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం ఆంధ్ర యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఆచార్యులను రాష్ట్రంలోని వేర్వేరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా ప్రభుత్వం నియమించింది. వర్సిటీ విద్యా విభాగంలో పనిచేస్తున్న ఆచార్య కూన రాంజీని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా యూనివర్సిటీకి, ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రసన్నశ్రీను రాజమండ్రిలోని నన్నయ యూనివర్సిటీకి వీసీలుగా నియమించింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం దక్కడం విశేషం. -
రక్తదానంపై అపోహలు వద్దు
కలెక్టర్ దినేష్కుమార్రంపచోడవరం: రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితిల్లో మరొకరి ప్రాణాలను కాపాడేవారవుతారని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్‌కుమార్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్, పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చన్నారు. అపోహలకు తావు లేకుండా రక్తదానం చేయాలన్నారు. మూడు సంవత్సరాల నుంచి 11 మండలాల్లో 2,560 యూనిట్ల రక్తాన్ని దాతల నుంచి సేకరించినట్టు చెప్పారు. జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతోందని, రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా బాల్య వివాహాలు, సికిల్ సెల్ ఎనీమియా, గంజాయి నివారణపై యువతకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. రంప గ్రామంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 45 మంది వృద్ధులకు రగ్గులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈనెల 19న చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. మొదట కళాశాల ప్రాంగణంలో అల్లూరి విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ స్టేట్ మెంబర్ బొర్ర నాగరాజు, జిల్లా వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, కార్యదర్శి సభ్యులు ప్రసాద్ నాయుడు, కోఆర్డినేటర్ లోహితాస్, ప్రిన్సిపాల్ వసుధ, డాక్టర్ స్పందన, సొసైటీ మెంబరు మహేష్‌బాబు, అధ్యాపకుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం చోరీ కేసులో నిందితుడికి రిమాండ్
అనకాపల్లి: దొంగతనం కేసులో తప్పించుకుని తిరుగుతున్న మండలంలో మాకవరం గ్రామానికి చెందిన గంజి మంగరావును మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలో పెదమాకవరం గ్రామానికి చెందిన దాసరి నారాయణరావు ఇంట్లో ఈ నెల 13న రెండు తులాలు బంగారం చోరీకి గురైనట్లు అతడి మనవరాలు కరణం రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకుని తులమున్నర బంగారంతోపాటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోరీ చేసిన బైక్(యూనీకాన్ బైక్)ను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చర్మవ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం
పెదబయలు: మండలంలోని పెదబయలు పీహెచ్సీ పరిధిలోని అరడకోట సబ్ సెంటర్ పరిధిలోని వనభంగి గ్రామంలో నలుగురు చిన్నారులకు చర్మవ్యాధులు సోకాయి. ముఖంపై తట్టు వచ్చిన తరువాత శరీరం అంత విస్తరించిందని పిల్లల తల్లితండ్రులు తెలిపారు. ఈ విషయం గ్రామస్తులు పెదబయలు పీహెచ్‌సీకి మంగళవారం సమాచారం అందించడంతో వైద్యాఽధికారి నిఖిల్, సిబ్బంది గ్రామానికి వెళ్లి పిల్లలకు వైద్యం అందించారు. ఒక చిన్నారికి శరీరంలో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడంతో మీజిల్స్ వ్యాధి అనే అనుమానంతో రక్త నమూనాలు సేకరించి పాడేరు జిల్లా ఆస్పత్రికి పంపించారు. మొత్తం 12 మంది పిల్లలను పరీక్షించామని, వీరిలో ఇద్దరు పిల్లలకు జ్వరంతో బాధపడుతుండా వైద్యం అందించామని చెప్పారు. పిల్లలకు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు అంగన్వాడీ కేంద్రానికి పంపించవద్దని సూచించారు. వైద్య సిబ్బంది వెంకటరావు, నర్సింగమూర్తి పిల్లలకు వైద్య సేవలందించారు. -
ప్రశాంత వాతావరణంలో ఇంటర్, టెన్త్ పరీక్షలు
రంపచోడవరం: ప్రశాంత వాతావరణంలో ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించేలా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖాధికారులు,గిరిజన సంక్షేమ డీడీ,ఎంఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 16 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం బోధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మాస్ కాఫియింగ్ జరగకూడదన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ,డీఎఫ్‌వో రవీంద్ర ధామలు విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి, ఇంటర్ ఆర్జేడీ నరసింహమూర్తి, డీఈవో బి.బ్రహ్మాజీరావు, డీడీ విజయశాంతి, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఏటీడబ్ల్యూవోలు మోహన్‌కృష్ణ, రామతులసి, సుజాత,ఎంఈవోలు ముత్యాలరావు, రామకృష్ణ, తాతబ్బాయి, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం -
247 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టుఅరకులోయటౌన్: మండల కేంద్రం అరకులోయలోని ఎన్టీఆర్ మైదానం సమీపంలో వ్యాన్‌లో తరలిస్తున్న 225 కిలోల గంజాయిని పట్టుకుని, ఇద్దరి అరెస్టు చేసినట్టు సీఐ ఎల్. హిమగిరి తెలిపారు. సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ మైదానం సమీపంలో ఈనెల 17న వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో బెంగళూరుకు చెందిన మారప్ప, అనకాపల్లికి చెందిన రాజేష్ గంజాయి తరలిస్తూ పట్టుబడినట్టు చెప్పారు. వీరిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు సీఐ హిమగిరి తెలిపారు. గన్నేరుపుట్టులో..జి.మాడుగుల: ఒక ఇంటి పెరటిలో దాచి ఉంచిన 22 కిలోల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో కె. కోడాపల్లి పంచాయతీ గన్నేరుపుట్టులో వంతాల మాగు ఇంటి పెరటిలో గంజాయి దాచి ఉంచినట్టు అందిన సమాచారం మేరకు సోమవారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ కుమార్‌బాబు మంగళవారం తెలిపారు.వంతాల మాగు, వంతాల జగదేశ్వరరావు అనే ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.10లక్షలు ఉంటుందని తెలిపారు. సీఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిదింతులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఇలా అయితే.. టెన్త్ ఎలా పాసవుతారు ?
జి.మాడుగుల: కనీస స్థాయిలో కూడా విద్యార్థులు సమాధానాలు చెప్పడం లేదని, ఇలా అయితే పదో తరగతి పరీక్షలు ఎలా పాసవుతారని పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఆయన మంగళవారం మండలంలోని బందవీధి, జి.మాడుగులలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందవీధి బాలికల ఆశ్రమపాఠశాలలో 8,10వ తరగతుల విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయగా ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉంటే 10వ తరగతి పరీక్షలు ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. మెరుగైన బోధన చేయాలని, విద్యా ప్రమాణాల మెరుగుపడకపోతే సస్పెండ్ చేసానని ఆయన ఉపాధ్యాయులను హెచ్చరించారు. విద్యార్థులకు పల్లీ చెక్కీ, రాగీమాల్ట్ అందజేయక పోవడంతో వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంటగదిని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జి.మాడుగుల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల–1ను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యాప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూపై విద్యార్థులను ఆరా తీశారు. చికెన్‌కు బదులు స్వీటు, వెజిటేరియన్ కర్రీ విద్యార్థులకు అదనంగా అందజేయాలని ఆదేశించారు. స్టడీ అవర్‌లో ఉండవలసిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీడీ ఎల్.రజని తదితరులు పాల్గొన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఆగ్రహం బందవీధి, జి.మాడుగుల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల తనిఖీ ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి -
విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులకు నోటీసులు
చింతపల్లి: చింతపల్లిలోని ఈఎంఆర్ ఏకలవ్య పాఠశాలలో చదువుకుంటున్న బాలికలను అక్కడే చదువుకుంటున్న విద్యార్థులు ర్యాగింగ్ చేయగా.. ఆ విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన ఈనెల 11వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏకలవ్య పాఠశాలలో కొంతమంది బాలురు..8వ తరగతి చదువుతున్న బాలికలను ర్యాగింగ్ చేసినట్టు ఉపాధ్యాయులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఉపాధ్యాయులు ఆగ్రహించి సంబంధిత విద్యార్థులను ఈనెల 11వ తేదీ రాత్రి సుమారు రెండు గంటలపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఇదిలావుండగా తమ పిల్లలను చూసేందుకు సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. దీంతో ఉపాధ్యాయులు దండించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించారు. ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు తప్పు చేస్తే సమాచారం ఇవ్వకుండా ఇలా ఇష్టానుసారం హింసించడం ఏంటని ప్రశ్నించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ, గురుకుల అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో మంగళవారం గురుకుల విభాగం వోఎస్డీ పీఎస్‌ఎన్‌మూర్తి, చింతపల్లి మండల సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి ఏకలవ్య పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. బాలబాలికలతో వేరువేరుగా మాట్లాడారు. ఉపాధ్యాయులను విచారించారు. విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశామని సంఘటపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్‌కుమార్ తెలిపారు. -
పారదర్శకంగాఎమ్మెల్సీ ఎన్నికలు
డీఆర్వో పద్మలతసాక్షి,పాడేరు: ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేసి, పారదర్శకంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత ఆదేశించారు. కలెక్టరేట్లో పోలింగ్ నిర్వహణపై పీవోలు,ఏపీవోలకు మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. బ్యాలెట్ పత్రాల వినియోగం, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ,సీళ్లు వేయడం తదితర ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సేకరించిన పోలింగ్ సామగ్రి సక్రమంగా ఉన్నదీ లేనిదీ ముందుగానే పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్డీసీ లోకేష్,మాస్టర్ ట్రైనర్లు చెల్లయ్య, సూపరింటెండెంట్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.వారం రోజుల్లో మోస్తరు వర్షాలుచింతపల్లి: రాగల వారంరోజుల్లో జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులతోపాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి మంగళవారం తెలిపారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయని, తేమతోకూడిన వాతావరణం ఉంటుందని చెప్పారు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
గజానికో గుంత..!
పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన వడ్డాది రోడ్డులో పలు చోట్ల గుంతలు వాహనచోదకులను భయపెడుతున్నాయి. పాడేరు మెయిన్‌రోడ్డు నుంచి నక్కలపుట్టు సమీపం వరకు రూ.కోటితో రోడ్డు వేసిన ఆర్అండ్బీ అధికారులు, అక్కడ నుంచి వంతాడపల్లి అటవీశాఖ చెక్‌పోస్టు వరకు కిలోమీటరు అధ్వాన రోడ్డును మాత్రం మరిచిపోయారు. ఈ రోడ్డులో గోతులు అధికంగా ఉండడంతో వాహనాలు నడిపేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే రోడ్డులోని కోట్లగరువు కాలనీ, కోట్లగరువు వంతెన సమీపంలోను గోతులను పూర్తి స్థాయిలో పూడ్చలేదు. ఒక గొయ్యిని పూడ్చి పక్కనే మరిన్ని గోతులను అలాగే వదిలేశారు. పాడేరు ఘాట్‌లోని మోదకొండమ్మతల్లి పాదాలు దాటిన తరువాత ఓనురు జంక్షన్ కాఫీతోటల వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ప్రమాదకరంగా మారింది. కొత్తగా ఘాట్‌లో ప్రయాణించే బైక్ చోదకులు ఈగొయ్యి ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైదాన ప్రాంతాలకు పోయే ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.గుంతలు లేని రహదారులే లక్ష్యం..సంక్రాంతి నాటిని రోడ్లన్నీ మెరుగుపరుస్తామని కూటమి ప్రభుత్వ ఊదరగొట్టింది. సంక్రాంతి వెళ్లి శివరాత్రి కూడా వచ్చేస్తోంది. కానీ కూటమి నేతల హామీ మాత్రం నెరవేరలేదు. మన్యంలో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. గుంతల పూడ్చివేత పనులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. – సాక్షి, పాడేరు సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులే లక్ష్యమన్న కూటమి ప్రభుత్వం శివరాత్రి వచ్చేస్తున్నా ఆ ఊసేలేని వైనం పలు చోట్ల భయపెడుతున్న గోతులు నక్కలపుట్టు నుంచి కోట్లగరువు వరకు గోతులే గోతులు పెండింగ్ పనులకుప్రతిపాదనలు పాడేరు–వడ్డాది రోడ్డులో పెండింగ్ పనులకు ప్రభుత్వానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే నక్కలపుట్టు నుంచి వంతాడపల్లి చెక్‌పోస్టు వరకు రోడ్డు అభివృద్ధి చేస్తాం. పలుచోట్ల గుంతలను పూడ్చివేస్తాం – బాలసుందరబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆర్అండ్బీ శాఖ, పాడేరు -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
● యువకుడి మృతి అచ్యుతాపురం రూరల్: మండలంలోని మడుతూరు కూడలికి కూతవేటు దూరంలో గాజువాక వెళ్లే రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాకపల్లి రమేష్ (19) యువకుడు మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం మృతుడు రమేష్ గాజువాక రహదారిలో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా మరో ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అచ్యుతాపురం వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనదారు కాలు విరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెండింగ్ పనులు సత్వరం పూర్తి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశంరంపచోడవరం/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎ.ఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. దేవీపట్నం మండలంలోని పునరావాస కాలనీలను మంగళవారం ఆయన సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఆర్అండ్ఆర్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పూర్తిస్థాయిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని కొంతమంది నిర్వాసితులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిబంధనల ప్రకారం దర్యాప్తు చేసి అర్హతలను బట్టి ప్యాకేజీ అమలుకు చర్యలు తీసుకొంటామని తెలిపారు. పినికిలపాడు, కొండమొదలు, తాళ్లూరు, మెట్టగూడెం తదితర కాలనీలను పరిశీలించారు. కొండమొదలు కాలనీలో నిచ్చెన సాయంతో మేడపైకి ఎక్కి కాలనీ అంతా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్‌కలెక్టర్ కల్పశ్రీ,తహసీల్దార్ కరక సత్యనారాయణ, ఎంపీడీవో రత్నకుమారి, డీటీ త్రిమూర్తులు, ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి రంపచోడవరం: గిరిజన రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యానవన పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అందించి తద్వారా, అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. పందిరిమామిడి కేవీకేను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన రైతుల నుంచి సేకరించిన తాటి, జీలుగు నీరా మంచి ఆరోగ్యకమైనదన్నారు. కేవీకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి, మత్స్యశాస్త్రవేత్త వీరాంజనేయులతో మాట్లాడారు. ఏడాదికి ఎన్ని వేల నారు చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారో తెలుసుకున్నారు. రైతులకు పంపిణీ చేసే కోడి పిల్లలను, మేకలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, హెచ్ఆర్ఎస్ హెడ్ పీసీ వెంగయ్య, శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, ప్రవీణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
బాలిక ఆత్మహత్య
సీతమ్మధార: నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీ, విష్ణు విల్లా అపార్ట్మెంట్లో పాల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన రామాటాకీస్ దరి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అతని భార్య పద్మావతి రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె కె.సాస(15) పదో తరగతి మధ్యలో ఆపేసింది. సాస ఎవరితో పెద్దగా కలిసేది కాదు. తల్లిదండ్రులతో కూడా ముభావంగా ఉండేది. గత ఏడాది సెప్టెంబర్‌లో స్కూల్ నుంచి టీసీ తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం తన చిన్ననాటి స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. కానీ ఆమె తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. తనకు కడుపునొప్పి వస్తోందని, నువ్వే రావాలని సాస ఆమెను కోరింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుమార్తెకు తల్లి నిమ్మరసం ఇచ్చింది. ఆ తర్వాత తల్లి, నాన్నమ్మ ఇంట్లో ఉన్న సమయంలో బాలిక నాలుగో అంతస్తుకు చేరుకుంది. వాటర్ ట్యాంక్‌పై కళ్లద్దాలు, మొబైల్ ఫోన్ పెట్టి.. అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చి సాస కోసం అడగ్గా బయటకు వెళ్లిందని వారు చెప్పారు. అంతలోనే అందరూ బయటకు వెళ్లి చూడగా సాస నిర్జీవంగా కనిపించింది. వెంటనే బాలికను రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇన్చార్జి సీఐ దాలిబాబు పర్యవేక్షణలో ఎస్ఐ చిన్నంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
పాడేరు రూరల్: మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఆరు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఐసీడీఏ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. మండల కేంద్రం పాడేరులోని శ్రీకృష్ణాపురం ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఆమె శిక్షణ తరగతులు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగిఉండాలని చెప్పారు. చిన్నారులకు మెరుగైన సేవలందించేందుకు శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. పౌష్టికాహారాన్ని చిన్నారులు, గర్భిణులు, కిషోరబాలికలు,బాలింతలకు సకాలంలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో–1 విశ్వప్రసాధ్, ఐసీడీఎస్ సీడీపీవో ఝాన్సీరాణి పాల్గొన్నారు.ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి -
మిరియం
మురిసేలా1.10లక్షల ఎకరాల్లో మిరియాల పాదులు సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీ తోటల్లో అంతరపంటగా గిరిజన రైతులు సాగుచేస్తున్న మిరియాల పంట విరగ్గాసింది. పాదులకు అఽధికంగా మిరియాల కాపు ఉండడంతో గిరిజన రైతులు మురిసిపోతున్నారు.నాణ్యతలో నంబర్–1గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మన్యం మిరియాలు ఈఏడాది కూడా గిరిజన రైతులకు అధిక లాభాలు అందించనున్నాయి. కేరళ,కర్నాటక,తమిళనాడు,ఒడిశా రాష్ట్రాలలో మిరియాల పంట ఉన్నప్పటికీ అల్లూరి జిల్లాలో గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న మిరియాలే నాణ్యతలో నంబర్ వన్‌గా నిలుస్తున్నాయి. ఘాటు అధికంగా ఉండే మన్యం మిరియాలకు జాతీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. గత ఏడాది కిలో రూ.600 నుంచి రూ.700ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. 1.10 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలను గిరిజనులు సాగు చేస్తున్నారు. వాటిలో 1.10 లక్షల ఎకరాల్లో మిరియాల పాదులను అంతరపంటగా వేశారు.ఎకరానికి తక్కువలో చూసుకున్న 100 కిలోల ఎండు మిరియాలను రైతులు మార్కెటింగ్ చేస్తారు. ఎకరానికి రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం లభిస్తుంది.గత ఏడాది 11వేల టన్నుల వరకు దిగుబడి వచ్చింది.ప్రైవేట్ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మిరియాల పాదులకు కాపు విరగ్గాసింది. దిగుబడులు మరింత పెరిగి కనీసం 12వేల టన్నుల వరకు మార్కెట్ జరుగుతుందని ఉద్యానవన,కాఫీబోర్డు,స్పైసెస్ బోర్డు అధికారులు అంచాన వేస్తున్నారు. మిరియాల సేకరణ ప్రారంభం : మిరియాల పాదులకు ఉన్న గింజల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పైసెస్ బోర్డు,పాడేరు ఐటీడీఏలు అల్యూమినియం నిచ్చెనలను పంపిణీ చేయడంతో గిరిజన రైతులకు ఎంతో మేలు జరిగింది. వాటితోనే మిరియాలను సేకరిస్తున్న గిరిజన రైతులు వెనువెంటనే వేడినీళ్లలో నానబెట్టి ఎండు మిరియాలను తయారు చేస్తున్నారు. గింజల్లో తేమ పూర్తిగా పోయిన తరువాత రైతులు సంతల్లో అమ్మకాలు చేపడుతున్నారు. కిలో రూ.550 ధరతో కొనుగోళ్లు ప్రారంభం జిల్లాలో మిరియాల వ్యాపారం ప్రారంభమైంది.ప్రారంభ దశ కావడంతో వ్యాపారులు కిలో రూ.550ధరతో కొనుగోలు చేస్తున్నారు.ఈ ఏడాది కూడా మన్యం మిరియాలకు డిమాండ్ అధికంగా ఉందని పెద్ద వ్యాపారులు చెబుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ధరలు పెంచి వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కాఫీ పంట వలే మిరియాలను కూడా జీసీసీ,పాడేరు ఐటీడీఏలు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఎండు మిరియాలు గత ఏడాది 11వేల టన్నుల వ్యాపారం ఎకరానికి రూ.60వేల ఆదాయం గత ఏడాది మోసపోయాను గత ఏడాది సీజన్ ప్రారంభంలో వ్యాపారులకు తక్కువ ధరతో మిరియాలను అమ్ము కుని మోసపోయాను. కిలో రూ.550ధరతో కొన్న వ్యాపారులు తూకంలోనూ మోసం చేశారు.ఐటీడీఏ అధికారులు సంతల్లో తూకం కేంద్రాలను ఏర్పాటు చేసి, మిరియాలకు గిట్టు బాటు ధర కల్పించాలి – దూసురి కర్రన్న, మిరియాల రైతు, హుకుంపేట గిట్టుబాటు ధర కల్పిస్తాం నాణ్యతలో నంబర్–1గా నిలుస్తున్న జిల్లాలో సాగవుతున్న మిరియాలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.మిరియాల మార్కెటింగ్‌కు సంబంధించి అధికారులతో కమిటీ వేస్తాం. జాతీయ స్థాయిలో మిరియాల వ్యాపారులతోను ఈ కమిటీ చర్చలు జరిపి అధిక ధరలతో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తాం.ఈఏడాది మిరియాల కాపు ఆశాజనకంగా ఉంది. – ఎ.ఎస్.దినేష్‌కుమార్, కలెక్టర్ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి కాఫీ గింజల మాదిరిగానే మిరియాలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించి జీసీసీ,ఐటీడీఏలతో కొనుగోలు చేయించాలి. జాతీయ మార్కెట్లో కిలో రూ.1,000 ధరతో గత ఏడాది మిరియాల అమ్మకాలు జరిగాయి. మిరియాల గింజలకు మార్కెటింగ్,గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంఘం జాతీయ నాయకుడు, గుర్రగరువు, పాడేరు మండలం -
సీజీఆర్‌ఎఫ్‌తో ‘విద్యుత్’ సమస్యల పరిష్కారం
సీతంపేట(విశాఖ): విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా, బిల్లింగ్ లోపాలు, విద్యుత్ మీటర్లలో సమస్యలున్నా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్)కు ఫిర్యాదు చేయాల్సిందిగా సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్‌లోని గౌరీ కల్యాణ మండపంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్లు కాలిపోవడం, విద్యుత్ వోల్టేజి హెచ్చు తగ్గులు, విద్యుత్ మీటర్లలో లోపాలు, అదనపు లోడు మంజూరు, యజమాని పేరు మార్పు, కొత్త విద్యుత్ సర్వీసులు వంటి ఏ సమస్య అయినా ీసీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయంలోని సీజీఆర్‌ఎఫ్‌కు నేరుగా రాత పూర్వకంగా గాని, ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీజీఆర్‌ఎఫ్‌కు 2004 నుంచి ఇప్పటి వరకు 8442 ఫిర్యాదులు రాగా వాటిలో 8367 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. -
నాలుగు వేల ఎకరాల్లోపండ్ల తోటల పెంపకం
● చింతపల్లి ఏపీడీ సీతయ్యకొయ్యూరు: చింతపల్లి క్లస్టర్ పరిధిలో 2025–26 సంవత్సరానికి సంబంధించి కొయ్యూరు, గూ డెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు ఉపాధి హామీ పథకం క్లస్టర్ ఏపీడీ లాలం సీతయ్య తెలిపారు. స్థానిక ఉపాధిహామీ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఏపీవో అప్పలరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి కొయ్యూరులో 780 ఎకరాల్లో నాటేందుకు రైతులకు పండ్ల మొక్కలు అందజేస్తున్నట్టు చెప్పారు. వీటిలో 250 ఎకరాల్లో నాటేందుకు సిల్వర్ ఓక్, 130 ఎకరాల్లో వేసేందుకు కొబ్బరి, 370 ఎకరాల్లో వేసేందుకు జీడిమామిడి మొక్కలు ఇస్తున్నట్టు చెప్పారు. గూడెంకొత్తవీధి మండలంలో 830 ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. వీటిలో అవకాడో 73 ఎకరాలు, జీడి 70 ఎకరాలు, స్వీట్ ఆరెంజ్ 150 ఎకరాలు, మిలిగిన ఎకరాల్లో సిల్వర్ ఓక్ నాటనున్నట్టు చెప్పారు.చింతపల్లిలో 1,932 ఎకరాలు కేటాయిస్తే 273 ఎకరాల్లో అవకాడో, 54 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, 84 ఎకరాల్లో సపోట, 12 ఎకరాల్లో జాఫ్రా, మిగిలిన ఎకరాల్లో సిల్వర్ ఓక్ వేయనున్నట్టు చెప్పారు.కొయ్యూరు మండలంలో 1500 ఇంకుడు గుంతలు తవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 885 మంజూరయ్యాయని, వాటిలో 300 గుంతల పనులు చేపట్టారని తెలిపారు. -
9 కిలోల కణితి తొలగింపు
అరకులోయటౌన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్, జనరల్ సర్జన్ డాక్టర్ లగుడు రాము నేతృత్వంలో ఆపరేషన్ చేసి ఓ మహిళ అండాశయం నుంచి తొమ్మిది కిలోల కణితిని తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ డుంబ్రిగుడ మండలం బల్లగెడ్డ గ్రామానికి చెందిన పాంగి చిలకమ్మ మూడు సంవత్సరాలుగా పొత్తి కడుపు నొప్పి,వాపుతో బాధపడుతోందన్నారు. ఆమెకు మంగళవారం అరకు ఏరియా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించి 9 కిలోల అండాశయ కణితి తొలగించినట్టు చెప్పారు. గత ఆరు నెలల్లో అరకు ఏరియా ఆస్పత్రిలో ఇది రెండో అతి పెద్ద శస్త్ర చికిత్స అని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మత్తు వైద్యుడు డాక్టర్ అప్పారావు, స్టాఫ్ నర్సు మంగ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
సెయింటాన్స్ ఘటనపై కలెక్టర్ సీరియస్
పాడేరు: పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేసిన ఘటనపై కలెక్టర్ దినేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. సోమవారం దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా విద్యశాఖ అధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. ఇందుకోసంప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. దీంతో డీఈవో సోమవారం పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. సంఘటన వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. నివేదిక ఆధారంగా వసతి గృహా కేర్ టేకర్ శ్రావ్యను విధుల నుంచి తొలగించారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు టెన్త్ విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించివేశారు. వసతి గృహా నిర్వాహణపై నిత్యం పర్యవేక్షణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి ఘటనలు, వివాదాలు జరిగితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.#viralvideo… pic.twitter.com/dcVm70EvT0— greatandhra (@greatandhranews) February 17, 2025 -
సిరుల చీపురు
సాక్షి, పాడేరు: మనం ఇళ్లలో వాడే చీపురు పంట గిరిబిడ్డలకు జీవనాధారం. ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల, పాడేరు, సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వేల కుటుంబాలు చీపురు పంటను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నాయి. పూర్వం దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే కొండచీపురు మొక్కలు నేడు మన్యం అంతా విస్తరించాయి.కొండపోడు, మెట్ట భూముల్లో గిరిజనులు చీపురు పంటను సాగుచేస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. చీపురు గడ్డి (Broom grass) శాస్త్రీయనామం “థైసెలోలెనా మాక్సిమా’ ఈ మొక్కలు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన ప్రాంతానికి దీన్ని వలస మొక్కగా చెప్పవచ్చు. చీపురుతో స్వయం సమృద్ధి కొండచీపుర్లకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రస్తుతం చీపురు పంట దిగుబడికి రావడంతో పుల్లలను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఎండబెట్టి, కట్టలు కట్టి మండల కేంద్రాలు, వారపుసంతల్లో అమ్ముతున్నారు. చీపురు కట్టల తయారీలో గిరిజన కుటుంబాలు ఇంటిల్లిపాదీ కష్టపడతాయి. మహిళలు కూడా చీపురు సేకరణ, కట్టలు కట్టడం అలవాటు చేసుకున్నారు.చీపురు కట్టకు మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతోంది. ఎకరానికి కనీసం 2వేల వరకు చీపురు కట్టలు తయారవుతాయి.దీంతో ప్రతి గిరిజన రైతు ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. కొంతమంది గిరిజన రైతులు నేరుగా విశాఖపట్నం,గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏటా ఏజెన్సీ అంతటా కొండచీపుర్ల అమ్మకాలు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం మన్యం (Manyam) సంతల్లో వ్యాపారులంతా పోటాపోటీగా కొనుగోలు చేస్తుండటంతో చీపురు అమ్మకాల ద్వారా గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.అడవిలోకి వెళ్లి పుల్ల, పుల్ల ఏరుకుని ఇంటికి తెచ్చి చీపురు కట్టలుకట్టి సంతల్లో అమ్ముకునేవారు. దట్టమైన అడవుల్లో చీపురు పుల్లల సేకరణ గిరిబిడ్డలకు నిరంతర సవాలే. నిత్యం క్రూర మృగాలు, విషసర్పాలతో పోరాటమే. సేకరణ మరీ కష్టంగా మారుతుండటం, రోజురోజుకూ గిరాకీ పెరుగుతుండటంతో ఆ చీపురు మొక్కల్ని తమ సమీపంలోని కొండవాలుల్లో పెంచడం మొదలు పెట్టారు. అలా ప్రారంభమైన చీపుర్ల సాగు ప్రస్తుతం ఏజెన్సీలో సుమారు వెయ్యి ఎకరాల వరకు విస్తరించింది.చీపురు పంటతో మంచి ఆదాయం కొండచీపురు పంట ద్వారా మా గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తోంది. మెట్ట,కొండపోడులో చీపురు సాగు చేస్తున్నాం.ఎకరం పంట ద్వారా సుమారు 2వేల వరకు చీపురు కట్టలు తయారు చేస్తాం. పంట సేకరణ, కట్టలు కట్టడం కష్టం తప్ప చీపురు సాగుకు ఎలాంటి పెట్టుబడి లేదు. – పాంగి అప్పన్న, మేభ గ్రామం సూకురు పంచాయతీ, హుకుంపేటమహిళలకు స్వయం ఉపాధి చీపురుపంట సాగుతో సీజన్లో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది. సంక్రాంతి పండుగ దాటిన నాటి నుంచి మే నెల వరకు చీపురు కట్టలను సంతల్లో అమ్మకాలు జరుపుతాం, వీటి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం మహిళలమే తీసుకుని ఆసొమ్ముతో పలు వస్తువులు కొనుక్కుంటాం.గత పదేళ్ల నుంచి కొండచీపురు పంటను సాగుచేసుకుంటున్నాం.చీపురు పంట ఆరి్ధకంగా ఏటా మా కుటుంబాలను ఆదుకుంటోంది. – జన్ని సన్యాసమ్మ, గిరిజన మహిళా రైతు -
డ్రాయింగ్ టీచర్కుజాతీయస్థాయి పురస్కారం
రాజవొమ్మంగి: స్థానిక అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మిరియాల కొండబాబు జాతీయస్థాయిలో మెరిట్ అవార్డు పొందారు. గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిర్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు కొండబాబుకు అవార్డు అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. ఇటీవల గుంటూరులో క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రకారులకు నిర్వహించిన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రతిభ చూపిన కొండబాబుకు ఈ పురస్కారం లభించినట్టు పాఠశాల హెచ్ఎం గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో తాను చిత్రీకరించిన పలు తైలవర్ణ చిత్రాలను కొండబాబు ప్రదర్శించారు. తోటి ఉపాధ్యాయులు కొండబాబును అభినందించారు. -
విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలి
● డీఈవో బ్రహ్మాజీరావు ముంచంగిపుట్టు: విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయా లని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. కిలగాడలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నాలు వేసి జవాబులు రాబట్టారు. పాఠ్యపుస్తకాల ను చదివించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ సెలవులు పెడుతున్న హెచ్ఎం నీలకంఠం స్థానంలో నూతనంగా భాస్కరరావును హెచ్ఎంగా నియమించినట్టు చెప్పారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ముంచంగిపుట్టులోని శారద నికేతన్ ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు,ఫీజుల వివరాలను ప్రిన్సిపాల్ మత్స్యరాజును అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల సౌకర్యాలతో పాఠశాల నిర్వహణ జరగాలని డీఈవో సూచించారు. -
డ్రాయింగ్ టీచర్కుజాతీయస్థాయి పురస్కారం
రాజవొమ్మంగి: స్థానిక అల్లూరి సీతారామరాజు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మిరియాల కొండబాబు జాతీయస్థాయిలో మెరిట్ అవార్డు పొందారు. గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిర్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు కొండబాబుకు అవార్డు అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. ఇటీవల గుంటూరులో క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రకారులకు నిర్వహించిన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రతిభ చూపిన కొండబాబుకు ఈ పురస్కారం లభించినట్టు పాఠశాల హెచ్ఎం గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో తాను చిత్రీకరించిన పలు తైలవర్ణ చిత్రాలను కొండబాబు ప్రదర్శించారు. తోటి ఉపాధ్యాయులు కొండబాబును అభినందించారు. -
గడువులోగా రీ సర్వే పూర్తి
డుంబ్రిగుడ: గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ ఆదేశించారు. ఆయన సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, రీ సర్వే ఆన్లైన్ పోర్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తమకు న్యాయం చేయాలని ఏకలవ్య పాఠశాల నిర్మాణాలకు భూములిచ్చిన భూ దాతలు జాయింట్ కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సబ్‌కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని భూదాతలు గొల్లోరి డొంబు, రామ్‌చందర్, రాందాసు తెలిపారు. ఈకార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ ముజీబ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నాటి పోరాటాలతోనే ఈ ప్రాంతానికి ఖ్యాతి
● పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు చర్యలు ● కలెక్టర్ దినేష్‌కుమార్ ● 11 మంది గాం గంటందొర వారసులకు ఫ్లాట్లు అందజేత ● లంకవీధిలో పండగ వాతావరణంకొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, మల్లుదొర తదితరలు చేసిన పోరాటాలతోనే ఈ ప్రాంతానికి గుర్తింపు లభించిందని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. మండలంలోని లంకవీధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రెండు ఎకరాల్లో నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మించిన రెండు అపార్టుమెంట్లను ప్రారంభించిన అనంతరం, వాటిలోని 11 ఫ్లాట్లను అల్లూరి సీతారామరాజు అనుచరుడు గాం గంటం దొర వారసులకు కలెక్టర్ దినేష్‌కుమార్, ఎన్సీసీ చైర్మన్ దుర్గా ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలని తెలిపారు. ఫ్లాట్లను కేటాయించడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా శిక్షణ ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. నాటి మన్యం యుద్ధంలో నేలకొరిగిన యోధుల వివరాలను నేటి యువతరానికి తెలియజేసేందుకు పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో పలు ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రపతికి ఇచ్చిన మాట నిలుపుకొన్నాం.. ఎన్సీసీ చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మిస్తామని 2023 సంవత్సరం జులైలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నామని చెప్పారు. ఈ భవనాలు వంద సంవత్సరాల వరకు చెక్కుచెదరవన్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా 2022లో భీమవరంలో నిర్వహించిన ఆజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బోడిదొరతో పాటు కొంతమందిని సన్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా అవసరమైన ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లాట్‌ను ఉంచామని తెలిపారు.త్వరలో శిక్షణను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.ఎన్సీసీ ఈడీ ఎ.జి.కె. రాజు మాట్లాడుతూ ఎన్సీసీ సీఎస్ఆర్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడంతో అక్కడి విద్యార్థులు మంచి ప్రతిభ చూపి ఐఐటీలకు ఎంపికయ్యారన్నారు. అనంతరం గంటందొర వారసులు కలెక్టర్‌ను, ఎన్సీసీ చైర్మన్‌ను సన్మానించారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. గంటందొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ను ఎన్సీసీ చైర్మన్ తదితరులు సన్మానించగా, వారిని కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణ రాజు, క్షత్రియ సేవా సమితికి చెందిన నానిబాబు, తహసీల్దారు ప్రసాద్, జేఈ రామకృష్ణ, ఎంపీడీవో ప్రసాద్,డీటీ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫ్లాట్లు అందజేయడంతో లంకవీధిలో పండగవాతావరణం నెలకొంది. -
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
● ముగ్గురు ముఠా సభ్యుల అరెస్ట్ ● పరారీలో ప్రధాన నిందితుడు గోపాలపట్నం(విశాఖ): రిజర్వ్ బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, విల్లాలు ఇప్పిస్తామని.. రూ.5 వేలు కడితే కోటి వరకు నజరానా వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సోమవారం టాస్క్‌ఫోర్స్, ఎయిర్‌పోర్టు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. రెండు రాష్ట్రాల్లో ఓ ముఠా రైస్ పుల్లింగ్, రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికెట్లు వంటి పలు రకాల మోసాలకు పాల్పడుతోంది. ఇందులో కొందరు ముఠా సభ్యులు విశాఖలో ఉన్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మర్రిపాలెం వుడా లేఅవుట్ పార్క్ సమీపంలో ఒక ఇంటిపై దాడి చేశారు. విశాఖకు చెందిన లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వరరావు, కాకినాడకు చెందిన శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన యడ్లపల్లి నారాయణ మూర్తి పరారయ్యాడు. వీరు గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేయడం, రూ.5వేలు, రూ.10 వేలు కడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. వీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని ప్రజలను ఏమార్చుతున్నారు. కాగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం
విశాఖ విద్య : యువతరం నూతన సాంకేతికతలపై మెరుగైన అవగాహన కలిగి ఉండాలని ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు అన్నారు. సోమవారం వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో జియో ఫిజిక్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘అడ్వాన్సెస్ ఇన్ జియో ఫిజిక్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, అండ్ నేచురల్ రిసోర్సెస్‘ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి సదస్సులు నూతన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయోగంగా నిలుస్తాయని చెప్పారు. జియో ఫిజిక్స్ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ మాట్లాడుతూ దేశానికి అవసరమైన విలువైన మానవ వనరులను ఏయూ జియో ఫిజిక్స్ విభాగం అందించిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై అన్వేషణలు జరగాలని సూచించారు. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీడీ జి.సుజిత్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. సుస్థిరమైన భవిష్యత్తుకు, పర్యావరణ సమస్యలకు పరిష్కారాల చూపే విధంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఏయూ వీసీ ఆచార్య శశిభూషణరావు జియో ఫిజిక్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభం -
ఉన్నత లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్
ముంచంగిపుట్టు: ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రంజిత్‌కుమార్ బల్గోత్ర అన్నారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాజేష్ పాండే ఆదేశాలతో స్థానిక సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల,బాలుర పాఠశాలలు 1,2లలో 126 మంది 10వ తరగతి విద్యార్థులకు సోమవారం పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ బల్గోత్ర మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు పదవ తరగతి ఎంతో కీలకమని, మంచి మార్కులు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణారావు,హెచ్ఎంలు లక్ష్మి, ప్రకాశం, మాణిక్యాలరావు, ఉపాధ్యాయులు శ్రీను,తిరుముల, భాగతరాం,ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రంజిత్‌కుమార్ బల్గోత్ర -
నల్లి పేసింది
● మిర్చి పైరుకు నల్లి తెగులు ● దిగుబడులు రాక వరుసగా నాలుగో ఏడాదీ నష్టాలే ● ఆందోళనలో రైతులు ఎటపాక: ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి తోటలను నల్లి తెగులు నలిపేసింది. వరసగా ఈఏడాదీ మిర్చి రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. నాలుగేళ్ల నుంచి అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ మిర్చి పంటను సాగుచేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎంతో ఆశతో సాగు చేసిన వాణిజ్య పంట మిర్చి ఈఏడాది కూడా రైతులతో కంటతడి పెట్టించింది. మొక్క నాటిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడినా.. పూత, పిందె దశకు వచ్చేసరికి వాతావరణ మార్పులతో వైరస్, నల్లి తెగులు సోకి మొక్కలు నలుపు రంగులో మారి ఎండిపోయాయి. ఈ ఏడాది నాలుగు మండలాల్లో పోలవరం ముంపు భూములతో సహా ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.ఉద్యానవన శాఖ ఈ క్రాప్ లెక్కల ప్రకారం 2,600 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్టు గుర్తించారు. దిగుబడులు,ధరలు పతనం వరుసగా నాలుగో ఏడాది మిర్చి సాగులో దిగుబడులు తగ్గాయి. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు నష్టాల పాలయ్యారు.ఎకరా మిర్చి తోట సాగుకు సుమారు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎర్ర, నల్ల నల్లి తెగులు మిర్చి తోటలపై తీవ్ర ప్రభావం చూపడంతో వాటి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. మిర్చి పూత,పిందె,ఆకుల్లోని రసాన్ని పీల్చివేయటంతో తోటలు నల్లగా మాడిపోయాయి. ఈఏడాది నెలరోజుల ఆలస్యంగా నల్లి ప్రభావం కనపడటంతో ముందుగా పండిన పంటే రైతుల చేతికందింది. ఎకరాకు 25నుంచి 30క్వింటాళ్ల వర కూ మిర్చి దిగుబడి రావలసి ఉండగా కేవలం ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే దిగు బడి వచ్చింది. క్వింటా మిర్చి ధర బహిరంగ మార్కెట్లో ఈఏడాది రూ.13 వేలు మాత్రమే పలుకుతుండడంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. గతంలో క్వింటా ధర రూ.20 వరకు ఉండేది. పెట్టుబడులకు చేసిన అప్పులు కూడా తీరవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలంలోని చూటూరు,కూటూరు,ఎటపాక మండలంలో నందిగామ,మురుమూరు, గౌరీదేవిపేట,గన్నవరం, నెల్లిపాక, తోటపల్లి, పిచుకలపాడు,రాయనపేట, గన్నవరం తదితర ప్రాంతాల్లో నల్లి ప్రభావం ఎక్కువగా ఉంది.నాలుగేళ్లుగా ఎర్ర,నల్ల నల్లి రైతులను వెంటాడుతుండటంతో వచ్చే ఏడాది మిర్చి సాగు ప్రశ్నార్థకమే. నష్టపోయాను ఎంతో ఆశతో సాగుచేసిన మిర్చి ఈఏడాది కూడా నష్టాల ఊబిలోకి నెట్టింది. 8 ఎకరాల్లో మిర్చి సాగుకు చేస్తే దిగుబడి మాత్రం ఎకరాకు 10 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇలాగే ఉంటే ఇక మిర్చి సాగు చేసే పరిస్థితి ఉండదు. – దారా రమేష్, రైతు గౌరీదేవిపేట ఎన్ని మందులు వాడినా ... ఎర్ర, నల్ల నల్లి తెగుళ్ల నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి చేతికందే సమయంలో నల్లి ప్రభావంతో నాశనమవుతోంది. వేల రూపాయలతో పురుగు మందులు కొని పిచాకారీ చేసినా కల్లెదుటే తోటలు నల్లబడిపోతుంటే తట్టుకోలేక పోతున్నాం. – యాలం సంతోష్, రైతు నందిగామ సాగు విస్తీర్ణం తగ్గింది ఎర్ర,నల్ల నల్లి ప్రభావంతో మిర్చి పంట దెబ్బతినడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీంతో పంట వేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది సాగువిస్తీర్ణం గణనీయంగా తగ్గింది.కొంత ఆలస్యంగా మిర్చి తోటలను ఈఏడాది నల్లి ఆశించింది. దీని ప్రభావంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. – ముత్తయ్య, హెచ్‌వో పురుగు మందుల పేరుతో దగా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు పురుగు మందుల దుకాణ దారులు రైతులను దగా చేస్తున్నారు. ఎర్ర,నల్ల నల్లి, ఇతర చీడపీడల నుంచి మిర్చి తోటలను కాపాడుకోవాలనే రైతుల తపన పురుగుమందుల దుకాణదారులకు కాసుల పంట పండిస్తోంది. దుకాణదారులను నమ్మి, వారు చెప్పిన అన్ని పురుగు మందులను అధిక ధరలకు కొనుగోలు చేసి పిచికారీ చేసినా ఫలితం ఉండటంలేదు. కొందరు డీలర్లు తెలంగాణ నుంచి తెచ్చిన మందులను ఈ ప్రాంత గిరిజన రైతులకు అధిక ధరలకు అంటగడుతున్నారు. పండిన కొద్ది పంట సొమ్ము డీలర్ల అప్పలు తీర్చేందుకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఖాళీ కవర్లపై సబ్ కలెక్టర్ ఆరా
● ఎంఎల్ఎస్ పాయింట్ సందర్శన ● రికార్డులు చూపడానికి తాత్సారం చేసిన జీసీసీ సిబ్బంది అడ్డతీగల: కందిపప్పు ప్యాక్ చేసిన ఖాళీ కవర్ల వ్యవహారంపై రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ సోమవారం ఆరా తీశారు. అడ్డతీగల ఎంఎల్ఎస్ పాయింట్‌ని ఆమె సోమవారం సందర్శించారు.రికార్డులు చూపమని ఆదేశించినా చాలాసేపటి వరకు జీసీసీ సిబ్బంది రికార్డులు చూపకుండా తాత్సారం చేయడంతో అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు తీసుకుని రంపచోడవరం వచ్చి కలవాలని అడ్డతీగల జీసీసీ బ్రాంచి ఇన్చార్జ్ మేనేజర్ విజయలక్ష్మిని, ఇతర సిబ్బందిని ఆదేశించారు.దీంతో జీసీసీ సిబ్బంది రికార్డులు తీసుకుని సోమవారం సాయంత్రం రంపచోడవరం వెళ్లారు. డి.భీమవరం రోడ్డులోని తుప్పల్లో పడి ఉన్న ఖాళీ కందిపప్పు కవర్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవె న్యూ సిబ్బంది పరిశీలించి, నివేదిక అందజేశారు. 318 ఖాళీ కవర్లు స్వాధీనం అడ్డతీగల–డి.భీమవరం రోడ్డు పక్కన తుప్పల్లో పడి ఉన్న 318 ఖాళీ కవర్లను సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారి విజయభాస్కర్ తెలిపారు. రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ ఆదేశాల మేరకు ఖాళీ కవర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎంఎల్ఎస్ పాయింట్లో రికార్డులు పరిశీలించినట్టు తెలిపారు.సబ్‌కలెక్టర్ తదుపరి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలి
● డీఈవో బ్రహ్మాజీరావు ముంచంగిపుట్టు: విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయా లని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. కిలగాడలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నాలు వేసి జవాబులు రాబట్టారు. పాఠ్యపుస్తకాల ను చదివించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ సెలవులు పెడుతున్న హెచ్ఎం నీలకంఠం స్థానంలో నూతనంగా భాస్కరరావును హెచ్ఎంగా నియమించినట్టు చెప్పారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ముంచంగిపుట్టులోని శారద నికేతన్ ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు,ఫీజుల వివరాలను ప్రిన్సిపాల్ మత్స్యరాజును అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల సౌకర్యాలతో పాఠశాల నిర్వహణ జరగాలని డీఈవో సూచించారు. -
దొంగహామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ ఆరోపించారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కుమారుడు జి.వి.సుందర్‌ను గెలిపించాలని ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన రంపచోడవరంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏజె న్సీ ప్రాంతంలో కొంత మంది గిరిజనులతో మాట్లాడినప్పుడు వారు వై.ఎస్.జగన్ అంటే ఇష్టమే అని, కానీ కూటమి ప్రభుత్వానికి ఓటు వేశామని తెలిపారన్నారు. అమ్మ ఒడి పథకం ఇంటిలో ఒకరికే వస్తుందని, తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ వస్తుందని ఆశపడ్డారని తెలిపారు. ఇలాంటి ఎన్నో తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తప్పుడు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన సబ్ ప్లాన్ నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదన్నారు. రాజమహేంద్రవరం లాంటి ప్రాంతంలో కనీస వసతులు లేని హాస్టళ్లలో గిరిజన విద్యార్థులు మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.హాస్టళ్ల సంఖ్యను పెంచడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏ భూమిపై కన్నుపడిందో గాని 1/70 చట్టాన్ని సవరిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాఖ్యానించారని ఆరోపించారు.గిరిజనులు ఏకతాటిపై అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ సమస్య లేదని, ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.మాజీ ఎంపీ హర్షకుమార్ -
మావోయిస్టుల బంద్‌తో పోలీసుల అలెర్ట్
చింతూరు: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సరిహద్దులో ఉన్న చింతూరు పోలీసులు అప్రమత్తమయ్యా రు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు విస్తృతంగా సోదాలు నిర్వ హిస్తున్నారు. బంద్‌నేపథ్యంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి మీదుగా తెలంగాణకు రాత్రిపూట వెళ్లే వాహనాలను కూనవరం మండలం భీమవరం మీదుగా దారి మళ్లించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అల్లిగూడెంకు ప్రతిరోజూ మండలంలోని వెళ్లే పాసింజ ర్ షటిల్ బస్సు సర్వీసును రద్దుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, సర్కిల్ పరిధి లోని రాజకీయ నాయకులకు నోటీసులు జారీచేసి, అప్రమత్తం చేసినట్టు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పాడేరు: సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్(సీఈఎంఎస్), విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) సీఎస్ఆర్ నిధులతో నిరుద్యోగ యువతకు ఇన్వేంటరీ కంట్రోలర్, వెల్డింగ్ కోర్సుల్లో రెండు నెలల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వను న్నట్టు సీఈఎంఎస్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.సేతు మాధవన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 27ఏళ్లలోపు వయస్సు గల టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ వెల్డర్, ఫిట్టర్ ఉత్తీర్ణులైన యువతీయువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీ ఉదయం 9గంటలకు పాడేరు పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో జరిగే శిబిరానికి విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలతో హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు 8688411100, 8331901237, 0891– 2704010 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
‘ఉక్కు’ మహిళా ఉద్యోగులకు అవార్డులు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ మహిళా ఉద్యోగు లు డాక్టర్ జి.సుజాత, రేష్మా సుల్తానాలకు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆది, సోమవారాల్లో జరిగిన 35వ జాతీయ ప్రభుత్వ రంగ మహిళా ఫోరం(విప్స్) సమావేశాల్లో స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (స్కోప్) డైరెక్టర్ జనరల్, ఐఎల్వో పాలకమండలి సభ్యురాలు అతుల్ సోబ్జీ చేతులమీదుగా వీరు అవార్డులు స్వీకరించారు. ఉక్కు జనరల్ ఆస్పత్రిలో గైనకాలజీ చీఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ జి.సుజాత చేసిన పరిశోధనలు, సేవలను గుర్తించి ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డుకు ఎంపిక చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన మాధారం మైన్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ రేష్మా సుల్తానా ఫార్మసీ కార్యకలాపాలు నిర్వహించడంలో చేసిన సేవలను గుర్తించి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉత్తమ ఉద్యోగిగా జాతీయ స్థాయి అవార్డు అందజేశారు. అలాగే స్టీల్‌ప్లాంట్ వుమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (విప్స్)కు ‘స్పెషల్ పార్టిసిపేషన్’అవార్డు లభించింది. -
మయూరి హిల్ రిసార్ట్స్ హౌస్ కీపర్ హఠాన్మరణం
అరకులోయ టౌన్: ఏపీ టూరిజం అరకులోయ మయూరి హిల్ రిసార్ట్స్‌లో హౌస్ కీపర్‌గా పని చేస్తున్న పూజారి లలిత్(45) సోమవారం హఠాత్తుగా మృతి చెందారు. రిసార్ట్స్ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు శుభ్రం చేస్తూ కళ్లు తిరిగి కింద పడిపోయిన ఆయనను సహచర సిబ్బంది హుటాహుటిన అరకు ఏరియా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 2007 నుంచి పర్యాటక శాఖలో లలిత్ పని చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న టూరిజం శాఖ డివిజినల్ బ్రాంచి మేనేజర్ జగదీష్ హుటాహుటిన అరకులోయకు చేరుకొని ఏరియా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని టూరిజం డీబీఎం చెప్పడంతో అంగీకరించని కటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, యూనియన్ ప్రతినిధులు ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని మయూరి హిల్ రిసార్ట్స్‌కు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో అరకులోయ తహసీల్దార్ ఎంవీవీ ప్రసాద్, డీబీఎం జగదీష్, గిరిజన సంఘం, టూరిజం కార్మికులతో చర్చలు జరిపారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ టూరిజం అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. రాత్రి 9 గంటల వరకు మృతదేహాంతో మయూరి హిల్ రిసార్ట్ వద్దే నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగితే తప్పా మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రసక్తి లేదని కార్మికులు, గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ నాయకులు కమిడి అశోక్, పరశురాం, స్వాభి రామమూర్తి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పొద్దు బాలదేవ్, తదితరులు పాల్గొన్నారు. మృతదేహంతో కుటుంబీకులు, గిరిజన సంఘాలు ఆందోళన రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ డీబీఎం, తహసీల్దార్‌తో కార్మికులు జరిపిన చర్చలు విఫలం -
చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
రంపచోడవరం: ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మండలంలో బూసిగూడెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడిి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు రక్తహీనతకు గురికాకుండా మంచి ఆహారం అందజేయాలన్నారు. సికిల్ సెల్ ఎనిమియా బాధితులు ఎంత మంది ఉన్నారు, రక్తహీనత లేకుండా ఎప్పకప్పుడు వైద్య పరీక్షలు చేయించి ఏ స్టేజిలో ఉందో తెలుసుకుని రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. మెనూ అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి చదువు ఎలా చెబుతున్నదీ ఆరా తీశారు. విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించాలన్నారు. పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీ, డీడీ విజయశాంతి, ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, ఈఈ ఐ.శ్రీనివాసరావు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సుండం శ్రీనివాసుదొర, తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం బూసిగూడెం ఆశ్రమ పాఠశాల సందర్శన -
కేర్ ఆస్పత్రిలో రోగి మృతిపై ఆందోళన
● మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్ ఆరిలోవ(విశాఖ): హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో ఒక రోగి మృతి చెందడం ఆందోళనకు దారి తీసింది. ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5లక్షలు డిమాండ్ చేయడంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి.. చోడవరానికి చెందిన బండి శ్రీధర్ (55) గుండెనొప్పితో బాధపడుతుండగా, ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ముందుగా ఆస్పత్రికి రూ.60 వేలు చెల్లించారు. అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటి గంట మధ్య సమయంలో ఐసీయూలో ఉన్న శ్రీధర్‌ను చూడటానికి కుటుంబ సభ్యులు వెళ్లగా.. అతను మృతి చెందినట్లు గుర్తించారు. వైద్యులను సంప్రదించగా వారు పరిశీలించి శ్రీధర్ మరణించినట్లు నిర్ధారించారు. శ్రీధర్‌కు రెండు శస్త్రచికిత్సలు చేశామని, వాటికి సంబంధించిన ఫీజు చెల్లించాలని వైద్యులు సూచించారు. మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన శ్రీధర్ కుమారులు ‘గుండె జబ్బు నయం చేస్తామని చెప్పి మా నాన్నను చంపేశారు’ అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో చోడవరం నుంచి సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహం కోసం డబ్బులు చెల్లించమని, వెంటనే మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ కృష్ణ సిబ్బందితో కలిసి కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులు, ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ముందు చెల్లించిన రూ.60వేలతో పాటు అదనంగా రూ.1.10 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు అంగీకరించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. శస్త్రచికిత్స చేసే సమయంలో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. -
అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం అవసరం
అనంతగిరి(అరకులోయ టౌన్): అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అరకులోయ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి కోరారు. ఎంపీపీ శెట్టి నీలవేణి అధ్యక్షతన సోమవారం జరిగిన అనంతగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కిషోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. మండల, గ్రామ పంచాయతీల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో జరిగే అభివృద్ధి పనులను సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు తెలియకుండా ఎలా చేస్తారని అధికారులను ఆమె ప్రశ్నించారు. ఎస్ఎంఐ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో వివిధ పీహెచ్సీలలో ఉన్న అంబులెన్స్‌లు మరమ్మతులకు గురయ్యాయని, కొత్త అంబులెన్స్‌లు మంజూరు చేయాలని ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు కోరాగా.. ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఎంపీపీ శెట్టి నీలవేణి మాట్లాడుతూ మండలంలోని కుడియా, చిట్టంపాడు, గుజ్జెలి గ్రామాలలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదంపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసేందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఆ పనులు త్వరితగతిన పూర్తి చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండలంలో ఇసుకను తక్కువ ధరకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ దీసరి గంగరాజు కోరారు. లారీ యజమానులతో చర్చించి తక్కువ ధరకు ఇసుకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌కు ఎంపీ సూచించారు. మండల సర్వసభ్య సమావేశాలకు కింది స్థాయి అధికారులు కాకుండా మండల స్థాయి అధికారులు పాల్గొనాలని పాలకవర్గం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వి.మాణిక్యం, ఏఈఈలు గౌతమ్, గణేష్, సీడీపీవో సంతోష్ కుమారి, ఎంఈవో కె.బాలాజీ, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, వైద్యాధికారులు జ్ఞానేశ్వరి, మంజు భార్గవి, ఏపీవో సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ శకుంతల, ఎంపీటీసీలు టి.మితుల, శిరగం అశోక్ కుమార్, తౌటి నాయుడు, ఎం.సన్యాసిరావు, వెంకటరామలక్ష్మి, శోభ తిరుపతమ్మ, కో ఆప్షన్ సభ్యుడు మధీనా, సర్పంచ్‌లు రూతు, పాగి అప్పారావు, జన్ని అప్పారావు, కిల్లో మొష్యా, తదితరులు పాల్గొన్నారు. ఎంపీగా ఎన్నికై మొట్టమొదటి సారిగా మండలానికి విచ్చేసిన ఎంపీ తనూజారాణిని ఎంపీపీ శెట్టి నీలవేణి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, అరకు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, మాజీ జెడ్పీటీసీ గంగన్నదొర, పార్టీ నాయకులు సన్మానించారు. వేసవిలో తాగునీటి సమస్య రానీయొద్దు అరకులోయ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి -
జీతాలు పెంచాలని అంగన్వాడీల ఆందోళన
చింతూరు: వేతనాలు పెంచాలని, మినీ సెంట ర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక ఐసీడీఎస్ కేంద్రం వద్ద అంగన్వాడీ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ ఆందోళనలో సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్ మాట్లాడు తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ వర్కర్లు ఎన్నో సేవలందిస్తున్నారని తెలిపారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రమోషన్ల కోసం నిబంధనలను రూపొందించాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయా లని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరత్నం, వసంత, పార్వతి, సుక్కమ్మ, లలిత పాల్గొన్నారు. రాజవొమ్మంగిలోరాజవొమ్మంగి: తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ఆందోళన చేశారు. సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల హామీలను నెరవేర్చాలి ముంచంగిపుట్టు: అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకరరావు అన్నారు. ముంచంగిపుట్టులోని ఐసీడీఎస్ కార్యాలయం సూపర్వైజర్లకు సోమవారం సోమవారం సీఐటీయూ నేతలు, అంగన్వాడీలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాలు పెంచి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షన ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
విశాఖ జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ పత్రాలు
మహారాణిపేట(విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫొటోలు, ఇతర వివరాలను ఇక్కడి నుంచి అధికారులు పంపించగా, సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సోమవారం కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. 10 శాతం రిజర్వ్‌తో కలిపి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యకు సరిపడా పత్రాలను అధికారులు సేకరించి భద్రపరిచారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సంబంధిత వాహనానికి పోలీసులు, ఇతర లైజనింగ్ అధికారుల సమక్షంలో సీలు వేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించేశారు. -
గ్రావెల్ తరలిస్తున్న మూడు వాహనాల సీజ్
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి సెక్షన్‌లోని తెల్లకొండ బీటు నుంచి అక్రమంగా మైదాన ప్రాంతానికి గ్రావెల్(ఎర్రమట్టి) తరలిస్తున్న రెండు టిప్పర్లను, ఒక ప్రొక్లెయినర్‌ను సోమవారం సీజ్ చేసినట్టు ఎఫ్ఎస్వో రాము తెలిపారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 30 ట్రిప్పుల మట్టి తరలించనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పా రు. కాగా అటవీ అధికారులను చూసి వాహనా లు నడుపుతున్న కొంత మంది అక్కడ నుంచి పరారైనట్టు ఆయన తెలిపారు. దీంతో 12 మంది అటవీ అధికారులు చీకటి పడిన తరువాత కూడా ఆ వాహనాల వద్ద కాపలా ఉన్నారు. -
తెలుసుకుంటే లాభం...మలుచుకుంటే అ'ధనం'
గిరిజనుల ఆర్థిక పరిస్థితిలో మార్పు తేవాలి, వారి ఆదాయం రెట్టింపుకావాలన్న లక్ష్యంతో పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Vigyan Kendra) పనిచేస్తోంది. ఇందుకోసం గిరిజనులకు అందుబాటులో ఉండే వనరుల వినియోగం, విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో లభించే పనస పండ్లతో పసందైన వంటకాల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ అందిస్తోంది. మార్చి నెలలో రెండో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. పసన పండ్ల లాభాలు తెలియజేసి, వాటి నుంచి అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా శిక్షణ అందజేయనున్నారు.రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విరివిగా లభించే పనసకాయలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పందరిమామిడి (Pandarimamidi) కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. పనస తొనలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇప్పటికే ఒక దఫా 30 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కేవీకే ప్రణాళిక సిద్ధం చేసింది. రెండు లక్షల చెట్లు జిల్లాలో రెండు లక్షల వరకు పనస చెట్లు ఉన్నట్టు ఉద్యానవన శాఖాధికారుల అంచనా. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, పాడేరు, చింతపల్లి, అరకు (Araku) తదితర 19 మండలాల్లో పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు తోటలుగానే కాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల్లో కూడా పనసను పెంచుతారు. పనస కాయల (Jack Fruit) దిగుబడి ఫిబ్రవరిలో ప్రారంభమై మే వరకు లభిస్తాయి. పనస మొదటి దశలో తొనలు, విత్తనాలు(పనస పిక్కలు) తయారు కావు. వీటిని ఎక్కువగా కూరలు, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. గింజలు అభివృద్ధి చెందే దశలో కూడా కూర పనసగా ఉపయోగిసా్తరు. తొనలు వచ్చినా తీí³, వాసన లేకుండా ఉంటాయి. వీటిని చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. పనస తొక్కు పచ్చడి, బజ్జీలు, పకోడి, బిర్యానీ, హల్వా, చాక్లెట్స్, తాండ్ర, జామ్, జ్యూస్, ఐస్‌క్రీమ్, పనస పిక్కల పిండితో పూరీలు, అప్పడాలు తయారు చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు వీటి తయారీపై ఇప్పటికే గిరిజన యువతకు శిక్షణ ఇచ్చారు. ఆర్థిక భరోసా జిల్లాలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్లో లభిస్తాయి. అనేక పోషక విలువలు ఉన్న పనసను గిరిజనులు వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. గిరిజన రైతులు గరిష్ట ధర పొందలేకపోతున్నారు. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు ఉప ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పోషక విలువలెన్నో.. పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది. గిరిజన యువత కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయలతో పచ్చడి, చిప్స్, పనస జ్యూస్, జామ్తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నోరూరించే చాక్లెట్లు పనస తొనలతో తయారు చేసే చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. కేజీ పనస తొనలను వేడి నీటిలో ఉడికించి, గుజ్జుగా తయారు చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసుకుని పనసగుజ్జు, కరిగించిన పాలపొడి, వేయించిన కోకో పౌడరు, పంచదార వేసి కాసేపు వేయించుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. అంతే.. పనస చాక్లెట్లు సిద్ధమవుతాయి.చదవండి: వైజాగ్‌పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!కరకరలాడే చిప్స్పచ్చి పనస తొనలతో వీటిని తయారు చేస్తారు. అర కేజీ తొనల నుంచి పిక్కలు వేరు చేయాలి. తరువాత అర ఇంచీ మందంతో పొడవుగా కోయాలి. కోసిన పనస తొనల ముక్కలను గుడ్డలో కట్టి మరిగించిన నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉంచి బయటకు తీయాలి.తరువాత వాటిని అరబెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి తగినంత పసుపు వేసి మరిగించాలి. నూనె బాగా మరిగిన తరువాత అరబెట్టుకొన్న పనస తొనల ముక్కలను వేయించాలి. వాటిపై ఉప్పు,కారం జల్లుకుంటే వేడివేడి చిప్స్ రెడీతాండ్ర తయారీ ఇలా పిక్కలు వేరు చేసిన కేజీ పనస తొనలను వేడినీళ్లలో వేసుకుని మరిగించుకోవాలి. మెత్తబడిన పనస తొనలను మిక్సర్‌లో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ట్రేలలో సమాంతరంగా ఈ గుజ్జును వేసుకోవాలి. తేమ ఆరే వరకు ఎండలోగాని, డ్రయర్ల గాని ఉంచుకోవాలి. తేమ ఆరిపోతే తాండ్ర ట్రేలో నుంచి సులభంగా వస్తుంది. వీటితో పాటు మరికొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు.మార్చిలో మరోదఫా శిక్షణ పందిరిమామిడి కేవీకేలో మార్చి నెలలో మారోమారు పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ ఏడాది ఏజెన్సీలో 25 ఎకరాల్లో పనస మొక్కలు నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో అధిక సంఖ్యలో పనసపండ్లు లభిస్తున్నా గిరిజనులు పూర్తిస్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గిరిజన యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేవీకే కృషి చేస్తోంది. – క్రాంతి, ఉద్యానవన శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి -
కవర్లు ఇక్కడ.. కందిపప్పు ఎక్కడ ?
అడ్డతీగల: ప్రజావసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే కంది పప్పు ప్యాక్ చేసిన ఖాళీ కవర్లు తుప్పల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అడ్డతీగల శివారు డి.భీమవరం రోడ్డులో ఇవి ఉన్నాయి. పౌరసరఫరాలశాఖ మండల లెవిల్ స్టాక్ పాయింట్‌కి సమీపంలో ఈ కవర్లు పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఒక కిలో కందిపప్పు పట్టేంతగా ఉన్న కవర్లపై బ్యాచ్ నంబర్ 10/2024, ప్యాకింగ్ తేదీ అక్టోబర్ 2024, ఐదు నెలల్లో వినియోగించాలని ముద్రించి ఉంది. ఇలా తుప్పల్లో ఖాళీ కవర్లు కనిపించడంతో అందులో ఉండవలసిన కందిపప్పు ఏమైందో తెలియాల్సి ఉంది.పౌరసరఫరాల శాఖ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్‌కి వచ్చే సరకును అక్కడి నుంచి రేషన్‌డిపోలకు చేరవేయాలి. రేషన్ డీలర్లు వాటిని కార్డుదారులకు పంపిణీ చేయాలి. పేదలకు అందవలసిన కందిపప్పును మాయం చేసి, వేరే బ్యాగ్‌లో వేసుకుని ఖాళీ కవర్లు ఊరికి దూరంగా పడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వీటి నిగ్గు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. తుప్పల్లో వందకుపైగా కవర్లు అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు -
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
ఎటపాక: స్థానిక నవోదయ పాఠశాల సమీపంలో జామాయిల్ కర్రల లోడు ట్రాక్టర్ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం చెందారు. సీఐ కన్నపరాజు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన సోయం రాంబాబు(45),ముత్యాలమ్మ(40) ద్విచక్రవాహనంపై భద్రాచలం వచ్చారు. పని ముగించుకుని ఆదివారం రాత్రి ఎటపాక మండలం బొజ్జిగుప్ప గ్రామం మీదుగా స్వ గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యారు. ఈసమయంలో ఎదురుగా జామాయిల్ కర్ర లోడుతో ట్రాక్టర్ భద్రాచలం వస్తోంది. సింగిల్‌రోడ్డు కావడంతో వారు నవోదయ పాఠశాల సమీపంలో ట్రాక్టర్‌ను దాటి వెళ్లేక్రమంలో ట్రాక్టర్లో ఉన్న కర్ర ద్విచక్రవాహనానికి తగలడంతో ఈప్రమాదం జరిగింది. భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పడిపోయిన వీరిని 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహానికి వెళ్లి వస్తూ బాలుడు మృతి జి.మాడుగుల: మండలంలోని నుర్మతి రోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదంలో విశాఖ జిల్లా పెందుర్తికి చెందని ఓ బాలుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ అనర్భ గ్రామంలో జరిగిన వివాహానికి పెందుర్తి నుంచి కర్రి సాయి చరణ్(17) అనే బాలుడు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనం మీద వస్తుండగా గుదలం వీధి వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. కిందపడిన సాయి చరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఘటన మృతులు తెలంగాణ వాసులు -
పర్యాటక ప్రాంతాలు కిటకిట
జిల్లాలో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. ప్రకృతి అందాలనుతిలకించేందుకు భారీగా టూరిస్టులు తరలిరావడంతో సందర్శిత ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. లంబసింగి,తాజంగి జలాశయం,చెరువులవేనం వ్యూపాయింట్, కొత్తపల్లి, పిట్టలబొర్ర జలపాతాలు.. తదితర ప్రాంతాలకు ఆదివారం భారీగాసందర్శకులు తరలివచ్చారు. చింతపల్లి: ఆంధ్రాకాశ్మీరు లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. మైదాన ప్రాంతాల నుంచి కుటుంబాలతో ఇక్కడికి వచ్చి ప్రకృతి అదాలతో పాటు మంచు సోయగాలను ఆస్వాదించారు. పర్యాటకుల రద్దీతో లంబసింగి, తాజంగి జలాశయం వద్ద ఉదయం నుంచి సందడి వాతావరణం ఏర్పడింది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పాల సముద్రాన్ని తలపించే మంచు అందాలకు పరశించిన సందర్శకులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. పెదబయలు: మండలంలో గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర జలపాతాన్ని ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులను కట్టి పడేసింది. జలపాతం దగ్గర వరకు వాహనాలు వెళుతుండడంతో ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల్లో పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. జి.మాడుగుల: పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన పర్యాటకులు కొత్తపల్లి జలపాతం వద్ద సందడి చేశారు. పెద్దపెద్ద బండరాళ్లపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహంలో స్నానాలు చేశారు. వ్యూ పాయింట్ వద్ద ఫొటోలు,సెల్ఫీలు దిగారు. రోజంతా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. థింసా కళాకారులను ఆదుకోవాలి డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం వద్ద సందర్శకులను అలరిస్తున్న థింసా కళాకారులను అధికారులు ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. ఆదివారం ఆయన చాపరాయి జలపాతాన్ని సందర్శించి, అక్కడి థింసా నృత్య కళాకారులతో మాట్లాడారు. ఐటీడీఏ నుంచి అందించే ప్రోత్సాహం కోసం ఆరా తీశారు. చాపరాయి జలపాతానికి వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని థింసా నృత్య కళాకారులకు కేటాయించాలని అధికారులను కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడు కూడా సుభ్రమణ్యం పాల్గొన్నారు. -
విద్యార్థినిపై టెన్త్ విద్యార్థినుల దాడి
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థినిపై అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు జనవరి 5న దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన దృశ్యాలను సెల్ఫోన్లో బంధించారు. ఈ వీడియో ఈ నెల 16న వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. దీంతో విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదివారం సాయంత్రం స్థానిక సెయింటాన్స్ పాఠశాల వసతి గృహాన్ని సందర్శించారు. పాఠశాల నిర్వాహకులు, విద్యార్థినులతో మాట్లాడి, సంఘటన గురించి ఆరా తీశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెయింటాన్స్ పాఠశాల వివాదాలకు నిలయంగా మారిందని, తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉందన్నారు. విద్యార్థినులపై యాజమాన్యం పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునారావృతం కాకుండా చూడాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఎంఈవో విశ్వప్రసాద్ వసతి గృహాన్ని సందర్శించారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని మీడియాకు ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి వైరల్‌గా మారిన వీడియోలో టెన్త్ విద్యా ర్థినుల్లో కొందరు సిగరెట్ తాగిన వ్యవహారంపై 7వ తగరతి విద్యార్థినిని ప్రశ్నిస్తూ దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పాడేరు సెయింటాన్స్ పాఠశాలలో ఘటన 7వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు దాడి తాము చేసిన తప్పుల్ని వేరే విద్యార్థినులకు చెబుతోందని ఆరోపణ పాఠశాలను సందర్శించినఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సంఘటనపై సమగ్ర విచారణజరిపించాలని డిమాండ్ -
పెరిగిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి: మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా ఉదయం 9 గంటలు దాటే వరకూ మంచు కురుస్తుండడంతో దారి కనిపించక వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం జీకే వీధిలో 9.6 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.6 డిగ్రీలు, జి.మాడుగులలో 11.0 డిగ్రీలు, అరకులోయలో 11.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.1 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీలు, పెదబయలులో 13.2 డిగ్రీలు, హుకుంపేటలో 13.9 డిగ్రీలు, పాడేరులో 14.1 డిగ్రీలు, అనంతగిరిలో 14.8 డిగ్రీలు, కొయ్యూరులో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. -
‘బిడ్డకు జన్మనిచ్చిన బాలిక ’
హుకుంపేట: స్థానిక ప్రభుత్వ కళాశాలకు చెందిన ఓ బాలిక బిడ్డకు జన్మనిచ్చినట్లు గిరిజన సంఘం అనుబంధ ఐద్వా జిల్లా కార్యదర్శి సొంటేన హైమావతి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని భూర్జా పంచాయతీ కొడయ్యపాడు గ్రామానికి చెందిన గిరిజన బాలిక ఇటీవల విశాఖ కేజీహెచ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బాలిక స్థానిక ప్రభుత్వ కళాశాలలో చదువుతూ, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో ఉండేదని తెలిపారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ కన్యాకుమారిని వివరణ అడగగా నెల రోజులు మాత్రమే హాస్టల్లో ఉండి, ఫీజు కట్టలేక గ్రామానికి వెళ్లిపోయిందని, ఆ బాలికతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరంలో కూడా హాస్టల్లో ఇదే పరిస్థితి జరిగినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని, ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
క్యాన్సర్‌ను జయిద్దాం
8లోఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికలకు ఏర్పాట్లు మహారాణిపేట(విశాఖ): ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం అభ్యర్థులు నామినేషన్లో పేర్కొన్న మేరకు తొలి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజుల ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 18 నుంచి తొలి విడత శిక్షణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి(పీవో)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. 27 జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం 18న తొలి విడత శిక్షణ తరగతులు 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ -
అరకు క్వెస్ట్‌లో విజేతలకు బహుమతుల ప్రదానం
పాడేరు: అరకు చలి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించి ద గ్రేట్ అరకు క్వెస్ట్‌లో గెలుపొందిన వారికి కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి పొందిన ధృవ అండ్ టీంకు రూ.50వేలు, రెండో బహుమతి పొందిన మంగతల్లి అండ్ టీంకు రూ.30వేలు, మూడో బహుమతి పొందిన హెచ్.బి. భాస్కర్‌రెడ్డి అండ్ టీంకు రూ.20వేల నగదు అందజేశారు. బొర్రా గుహల నుంచి అరకులోయ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సుంకరమెట్ట పంచాయతీ గుమ్మకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న పెట్టెలి అజయ్ అనే విద్యార్థికి సైకిల్, కిట్‌ను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ మురళి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూరిమాండ్ ఖైదీ మృతి
మహారాణిపేట (విశాఖ)/కొయ్యూరు: హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భూ సరి రాజబాబు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. గతేడాది నవంబర్‌లో కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ మెహర్‌కుమార్ తెలిపారు. విశాఖ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అండ మరిచారు
కొండ దించారు...ఐటీడీఏ ఫామ్ ప్రవేశ ద్వారం ఆర్చి తాగునీటి కోసం తంటాలు పడుతున్నకొండరెడ్డి మహిళలుకష్టాల వలయంలో కొండరెడ్లు పునరావాస కేంద్రాల్లో ఇక్కట్లుకూనవరం: పచ్చని ప్రకృతి ఒడిలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఎత్తైన కొండలపై నివసిస్తున్న కొండరెడ్లు మైదాన ప్రాంతానికి తరలివచ్చి కష్టాల సుడిగుండంలో చిక్కి కొట్టు మిట్టాడుతున్నారు. మండల పరిధిలో పైదిగూడెం, ఐటీడీఏ ఫారం, భైరవపట్నం, బండారుగూడెం, గండికొత్తగూడెం తదితర గ్రామాల్లో కొండరెడ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొండలు దిగిరండీ... అండగా మేముంటాము అని రెండు దశాబ్దాల క్రితం అప్పటి ఐటీడీఏ అధికాలు ఇచ్చిన హామీతో సుమారు 50 కుటుంబాలకుపైగా విలీన మండలాల్లోని మైదాన ప్రాంతానికి తరలి వచ్చాయి. ఇళ్లు కట్టిస్తాం, తాగునీరు, సాగునీరు, వ్యవసాయ భూమి వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని వారికి అధికారులు నమ్మబలికారు. అధికారుల మాటలు నమ్మి మైదాన ప్రాంతానికి తరలి వచ్చిన కొండరెడ్లను పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల మాటలు నీటిమీద రాతలు అన్న చందంగా మారాయి. తోతులగుట్ట సమీపంలోని ఐటీడీఏ ఫారం పునరావాస కేంద్రంలో ఉన్న కొండరెడ్ల బాధలు వర్ణనాతీతం. మౌలిక వసతులకు నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు. కూటూరు గట్టు పరిధిలో ఎత్తైన కొండల్లో కళింగమిద్ది, చింతగండి, పెద్దవాగు తదితర గ్రామాలకు చెందిన 21 కొండరెడ్ల కుటుంబాలు 2000 సంవత్సరంలో పైదిగూడెం ఐటీడీఏ ఫారంకు తరలివచ్చారు. ప్రభుత్వం వారికి పక్కాగృహాలు నిర్మించి, మౌలిక వసతులను గాలికి వదిలేసింది. వ్యవసాయ భూమి సమకూర్చక పోవడంతో కూలిపనులకు వెళుతూ పూట గడుపుతున్నారు. వ్యవసాయ సీజన్ ముగిసిందంటే, వారికి బతుకుదెరువు కరవుతుంది. వేసవిలో తాగునీటి ఎద్దడి తప్పడం లేదని మదనపడుతున్నారు. పాతికేళ్ల కిందట ఇక్కడి వచ్చిన తమకు పిల్లాజల్లాతో మరో 20 కుటుంబాలు తోడయ్యాయని వారికి ఇప్పటి వరకు ఇల్లు, వాకిలీ లేదని వాపోతున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నచందంగా ఐటీడీఏ ఫాంలో 105 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నా తాము సాగుచేసుకునేందు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. -
బెంజ్ లారీ ఢీకొని బతుకు ఛిద్రం
అనకాపల్లి : చేతికి అంది వస్తాడనుకున్న కుమారుడు గుణ తేజశ్వంత్ (17) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. పట్టణంలో వేల్పులవీధికి చెందిన గుణ తేజశ్వంత్ విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి హర్షవర్ధన్‌లు పట్టణంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గుణ తేజశ్వంత్ శనివారం యలమంచిలి మండలం పద్మనాభపేట గ్రామంలో ఓ శుభకార్యానికి తన తల్లి యశోదతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుని వారి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం కోసం జాతీయ రహదారి ఉమ్మలాడ జంక్షన్ వద్ద హాటల్‌కు వెళ్లి బిరియాని తీసుకుని వస్తామని చెప్పి స్నేహితులైన విజయరామరాజుపేటకు చెందిన హర్షవర్ధన్, ధనుష్‌లతో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై హోటల్‌కు వెళ్లారు. హర్షవర్థన్ బైక్‌పై గుణ తేజశ్వంత్, హర్షవర్థన్‌లు బయలు దేరారు. మరో బైక్‌పై ధనుష్ వెళ్లిపోయాడు. ముగ్గురూ ఉమ్మలాడ జంక్షన్ వద్ద హోటల్ల్లో భోజనం చేసి, తల్లికి భోజనం పట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. జంక్షన్ వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయంలో యలమంచిలి నుంచి విశాఖ వెళుతున్న బెంజ్ లారీ గుణ తేజశ్వంత్, హర్షవర్థన్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తేజశ్వంత్ అక్కడిక్కడే మృతిచెందగా, హర్షవర్ధన్ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రుడు హర్షవర్ధన్‌కు ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై మృతుడు తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్ఐ డి.శేఖరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు -
జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తుంగమడుగుల విద్యార్థి
అడ్డతీగల: మండలంలో తుంగమడుగులకు చెందిన పీరు ప్రణవ రుద్రేష్‌రెడ్డి జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటాడు. 97.45 పర్సంటైల్‌తో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్టు రుద్రేష్‌రెడ్డి తండ్రి పీరు చింతలబ్బాయి తెలిపారు. మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసి, అనంతరం సివిల్స్ సాధించి, పేద ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యమని రుద్రేష్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పాడు. తండ్రి ఫిజికల్ డైరెక్టర్‌గా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. తల్లి ఎస్జీటీ టీచర్‌గా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. -
నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందించాలి
చింతపల్లి: గురుకుల విద్యార్థులతో పాటు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని చింతపల్లి ప్రథమశ్రేణి జుడీషియల్ మెజిస్ట్రేట్ రోహిత్ అన్నారు. స్థానిక గిరిజన గురుకుల జూనియర్ కళాశాల,ఏకలవ్య పాఠశాలతో పాటు బాలురు,బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆదివారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. బోధన, భోజన సౌకర్యం,తాగునీరు,మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏయూలో రాజకీయ క్రీడ
విశాఖ విద్య: ఖ్యాతిగడించిన ఆంధ్ర యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ చెదలు పడుతున్నాయా..?. పీహెచ్డీ స్కాలర్స్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వర్సిటీ వర్గాలతో పాటు, విద్యావేత్తల్లోనూ ఇదే చర్చసాగుతోంది. వర్సిటీ పురోభివృద్ధి కోసమని గత వీసీ ప్రసాద్ రెడ్డి టీడీఆర్ హబ్ ఏర్పాటు చేయగా, దీన్ని నిర్యీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా ప్రస్తుత పాలకులు తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్‌కు ప్రశ్నార్థకమౌతున్నాయి. పీహెచ్డీ స్కాలర్స్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో కొంతమంది అవినీతి ఆచార్యులు తమ స్వలాభం కోసం వేస్తున్న ఎత్తుగడలకు పరిశోధక విద్యార్థులు బలిపశువులవుతున్నారు. టీడీఆర్ హబ్ ద్వారా ప్రవేశాలు పొందిన పరిశోధక విద్యార్థులకు పరీక్షలను నిలిపివేస్తూ, వర్సిటీ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2023 వరకు ఏయూ టీడీఆర్ హబ్ ద్వారా సుమారుగా 680 మంది పరిశోధక విద్యార్థులు ప్రవేశం పొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఫార్సుతో చేరిన కొద్దిమంది మిగతా వారంతా ఉన్నత విద్యామండలి నిర్వహించే ఏపీఆర్–సెట్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు. వీరికి ఇప్పటికే ప్రీ పీహెచ్డీ, వైవా నిర్వహించాలి. వాటిని పూర్తి చేసిన వారికి అవార్డు ప్రదానం చేయాలి. కానీ, గత వీసీ ప్రసాద్ రెడ్డిపై రాజకీయ కక్షతో పరిశోధక విద్యార్థులకు పరీక్షలను సైతం నిలిపివేశారు. అవినీతి ఆచార్యులతో అపఖ్యాతి పీహెచ్డీ స్కాలర్స్ నుంచి పరీక్షల పేరిట డబ్బులు వసూలు చేసే ఆనవాయితీకి నాటి వీసీ ప్రసాదరెడ్డి బ్రేక్ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని వర్సిటీలోని ఓ వర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పనిగట్టుకొని ఫిర్యాదులు చేయడంతో, ఆ ప్రభావం పరిశోధక విద్యార్థులపై పడింది. టీడీఆర్ హబ్ ద్వారా జరిగిన ప్రవేశాలపై వర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి, 40 మంది పరిశోధకుల ప్రవేశాల విషయంలో లోపాలను ఎత్తి చూపినట్లు తెలిసింది. మిగతా వారంతా యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశాాలు పొందారని తేల్చినా, పరీక్షలు జరగనివ్వకుండా వర్సిటీలోని కొంతమంది అవినీతి ఆచార్యులు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిశోధక విద్యార్థుల్లో పెరుగుతోన్న అసంతృప్తి ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న క్రేజ్‌తో పీహెచ్డీ కోసమని చేరితే, అధికారులు ఇబ్బందులు గురి చేస్తుండటంపై వారిలో అసంతృప్తి పెరుగుతోంది. పరీక్షలు ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశోధక విద్యార్థులతో ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటైంది. పరీక్షలను వెంటనే నిర్వహించాలని కోరుతూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి వర్సిటీ వైస్ చాన్సలర్ భవనం ముందు శాంతియుత నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పరిశోధక విద్యార్థులు ఇప్పటికే నగరానికి చేరుకున్నట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. పీహెచ్డీ స్కాలర్స్‌పై ఎందుకీ కక్ష పరీక్షల నిర్వహణకు చొరవ చూపని అధికారులు పరిశోధకులను ఇబ్బంది పెడుతోన్న ఓ వర్గం వర్సిటీ అధికారుల తీరుపై పెరుగుతోన్న అసంతృప్తి నేడు శాంతియుత ఆందోళన -
నేడు రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ(విశాఖ): విశాఖ వేదికగా రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టును సోమవారం ఎంపిక చేస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర కబడ్డీ సంఘం సెలక్షన్ కమిటీని నియమించిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్ ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం 19 మంది క్రీడాకారులకు నగరంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 12 మందిని కమిటీ తుది జట్టుకు ఎంపిక చేస్తుంది. ఈ జట్టు కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. -
సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ పోటీలకు పీడీ పోతురాజు
రంపచోడవరం: ముసురుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్(పీడీ)గా పనిచేస్తున్న కలుముల పోతురాజు ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2024–25కు సంబంధించి ఈ నెల 19 నుంచి 21 వరకు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సెక్టార్ –7లో జరిగే మీట్‌కి ఏపీ నుంచి ఆయన పాల్గొననున్నారు. అథ్లెటిక్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో ఎంపికై నట్లు పోతురాజు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో పాల్గొనేందుకు ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్‌లు, ఖర్చులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందాయి. స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై న ఆయనను హెచ్ఎం ఆదివిష్ణుదొర, అల్లూరి వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారావు, పీడీ చిన్నస్వామిరెడ్డి, తిరుపతిరావు, ధర్మరాజు, నాగిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
విశాఖలో ఐపీఎల్ పండగ
● మార్చి 24, 30న రెండు టీ–20 మ్యాచ్‌లు ● ఊపందుకున్న స్టేడియం ఆధునికీకరణ పనులు విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ మ్యాచ్‌లకు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి హోమ్ పిచ్‌గా వైఎస్సార్ స్టేడియాన్ని ఎంచుకోవడంతో ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తంగా స్టేడియం ఎలివేషన్ మారిపోనుండగా, కార్పొరేట్ బాక్సులు, ఆటగాళ్ల గ్రీన్ రూంల్లోనూ ఆధునిక వసతుల కల్పన చకచకా సాగిపోతోంది. స్టేడియంలోని స్టాండ్స్‌లో కుర్చీలను కూడా ఏసీఏ మారుస్తోంది. దీంతో వైఎస్సార్ స్టేడియం సరికొత్త రూపుతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో హోమ్ పిచ్‌గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకుందని, ఈ సీజన్లోనూ రెండు మ్యాచ్‌లకు వైఎస్సార్ స్టేడియం వేదిక కానుందన్నారు. అందుకు తగిన విధంగా స్టేడియంలో వసతులను సమకూరుస్తున్నట్లు చెప్పారు. మార్చి 24న డీసీతో ఎల్ఎస్జీ ఢీ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మార్చి 30న మరో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ జట్టు తరఫున స్థానిక ఆటగాడు నితీష్‌కుమార్ బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకోనుంది. -
అథ్లెటిక్స్‌లో నేవీ ఉద్యోగికి బంగారు పతకం
దేవరాపల్లి : దేవరాపల్లి మండలం రైవాడ పంచాయితీ శివారు శంభువానిపాలేనికి చెందిన నేవీ ఉద్యోగి ఉగ్గిన అప్పన్నదొర జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన అప్పన్నదొర రాజస్థాన్‌లో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 45 సంవత్సరాల విభాగంలో 4‘‘400 రిలే పరుగు పందెంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే 4‘‘100 రిలే పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాలను సాధించారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకాలను సాధించారు. అప్పన్న దొరకు ఘనంగా పౌర సన్మానం క్రీడా పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు తెచ్చిన అప్పన్నదొరను శంభువానిపాలెం గ్రామస్తులు ఆదివారం పౌర సన్మానం చేశారు. అభినందనలతో ముంచెత్తారు. అప్పన్న దొర క్రీడా స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ పౌర సన్మానంలో పాల్గొన్న పంచాయతీ పెద్దలు చల్లా నాయుడు, చల్లా నానాజీ, ఉగ్గిన దేముళ్లు స్థానిక యువతకు సూచించారు. -
క్యాన్సర్‌ను జయిద్దాం
ఏయూక్యాంపస్ : క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి...ఆరోగ్యంగా జీవించండి అంటూ సినీనటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆదివారం బీచ్‌రోడ్డులో రోహిత్ మోమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ సఖి శారీ వాక్‌లో ఆమె ప్రసంగించారు. క్యాన్సర్ వస్తే జీవితం అక్కడితో ఆగిపోతుందనే అపోహ నుంచి ముందుగా బయటపడాలన్నారు. సరైన చికిత్స తీసుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు అనడానికి ప్రతక్ష ఉదాహరణగా నేనేనని పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించాలని ప్రజలకు సూచించారు. మీపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే విషయం మరువకూడదన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి మహిళలకు ఉందన్నారు. క్యాన్సర్ ఎటువైపునుంచైనా, ఎవరికై నా వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం, నిండైన జీవితాన్ని అనుభవించడం ఎంతో అవసరమన్నారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాది వేలాది మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారన్నారు. మహిళలు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రజల్లో మరింత చైతన్యం, అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రాథమిక దశల్లో క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స అందించడం, ప్రాణాలను రక్షించడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జి.అనంత రామ్ మాట్లాడుతూ మరింత విస్తృత అవగాహన ప్రజల్లో కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. తాము చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి సంపూర్ణ సహాయం అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పీసీవోడీపై వైజాగ్ వలంటీర్స్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమానికి ముందుగా యాంకర్, సినీనటి శిల్పా చక్రవర్తి వ్యాఖ్యానంతో సాగిన జుంబా డాన్స్, ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, చిన్నారులు పింక్ సఖి శారీ వాక్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు పాఠశాల చిన్నారులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళలు, క్యాన్సర్‌ను జయించిన వారిని వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఉపాద్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరామ్, డైరెక్టర్ ప్రాజెక్ట్ (ఆర్‌ఎంటి) గుర్మీత్ కోహ్లి, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎం.డి డాక్టర్ జి.సాంబశివ రావు, గురుద్వార సాఽథ్ సంగత్ అధ్యక్షుడు డాక్టర్ డి.ఎస్ ఆనంద్,ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్ రాజు, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, అభిజ్ఞ, హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు డాక్టర్ ఆదిత్య, మహాత్మ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు వి.మురళీకృష్ణ, రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావు పాల్గొన్నారు. సినీనటి గౌతమి బీచ్‌రోడ్డులో విజయవంతంగాపింక్ సఖి శారీ వాక్ దేశంలో తొలిసారిగా విశాఖ వేదికగా నిర్వహణ -
అప్పన్నకు రెండు శఠగోపాల బహూకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం హరేకృష్ణ మూవ్మెంట్ సుమారు రూ.10 లక్షలు విలువ చేసే రెండు బంగారు శఠగోపాలు(వెండిపై బంగారు పూత) బహూకరించింది. గ్లోబల్ హరేకృష్ణ మూవ్మెంట్ చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మధుపండితదాస సింహగిరికి వచ్చి శఠగోపాలను ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులకు అందజేశారు. సంస్థ సభ్యులతో కలిసి స్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం తరపున అధికారులు మధుపండిత దాసకు, ఆయనతో వచ్చిన సంస్థ సభ్యులకు స్వామి దర్శనం కల్పించి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
ఏజెన్సీకి సైతం పాకిన ర్యాగింగ్ భూతం
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: ర్యాగింగ్ భూతం ఏజెన్సీకి సైతం పాకింది. పాడేరు సెయింటెన్స్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి బాలికలపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. వసతి గృహంలో ర్యాగింగ్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేట్టారు. ఈ ఘటనపై డీఈవో గోప్యంగా విచారణ జరుపుతున్నారు -
జేఈఈ మెయిన్స్‌లో ‘జై’ కిసాన్
రంపచోడవరం: జేఈఈ మెయిన్స్ –2025 పరీక్ష ఫలితాల్లో 97 పర్సంటైల్‌తో కింటుకూరి జైకిసాన్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన జైకిసాన్ ఎస్టీ రిజర్వ్డ్ విభాగంలో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచాడు. మారుమూల ప్రాంతమైన కోట గ్రామం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కలెక్టర్ దినేష్‌కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా జైకిసాన్ మాట్లాడుతూ సివిల్స్ సాధించి గిరిజన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని తెలిపారు. తాను ఐదో తరగతి చదివేటప్పుడు రంపచోడవరం ఐటీడీఏ పీవో పని చేసిన ఇప్పటి కలెక్టర్ దినేష్‌కుమార్ గిరిజనులకు ఎంతో సేవ చేశారని, ఆయనే తనకు ఆదర్శమన్నారు. -
తాగునీటి బోర్ల మరమ్మతులకు సామగ్రి సిద్ధం
● రక్షిత తాగునీటి పథకాలకు ముందస్తు మరమ్మతులు ● ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్ సాక్షి,పాడేరు: కలెక్టర్,తమశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగునీటి బోర్ల మరమ్మతులకు సామగ్రిని సిద్ధం చేశామని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్ తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేతిపంపుల మరమ్మతుల పనులను అన్ని మండలాల్లో ప్రారంభించినట్టు చెప్పారు.రక్షిత తాగునీటి సరఫరా పథకాలకు ముందస్తుగానే మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి నెల మొదటి, మూడవ శనివారాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాగునీటి పథకాలు ట్యాంకులు,ఆయా నీటి వనరుల్లో క్లోరినేషన్‌కు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు,బోర్ల మెకానిక్‌లు గ్రామాల్లో పర్యటిస్తూ పాడైన బోరుబావులు,తాగునీటి పథకాలను గుర్తించి, వినియోగంలోకి తెస్తున్నారని తెలిపారు. జల్‌జీవన్ మిషన్ కింద మంజూరైన పనులను మార్చి 15నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు. -
జేఈఈ మెయిన్స్‌లో ‘జై’ కిసాన్
రంపచోడవరం: జేఈఈ మెయిన్స్ –2025 పరీక్ష ఫలితాల్లో 97 పర్సంటైల్‌తో కింటుకూరి జైకిసాన్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన జైకిసాన్ ఎస్టీ రిజర్వ్డ్ విభాగంలో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచాడు. మారుమూల ప్రాంతమైన కోట గ్రామం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కలెక్టర్ దినేష్‌కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా జైకిసాన్ మాట్లాడుతూ సివిల్స్ సాధించి గిరిజన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమని తెలిపారు. తాను ఐదో తరగతి చదివేటప్పుడు రంపచోడవరం ఐటీడీఏ పీవో పని చేసిన ఇప్పటి కలెక్టర్ దినేష్‌కుమార్ గిరిజనులకు ఎంతో సేవ చేశారని, ఆయనే తనకు ఆదర్శమన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం
సాక్షి,పాడేరు: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పంచాయతీ కేంద్రం మినుములూరులో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ వారి తో ప్రతిజ్ఞ చేయించారు. పలువురి గిరిజనుల నివాసాలను కలెక్టర్ సందర్శించారు.పారిశుధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.మినుములూరులోని సంపద తయారీ కేంద్రం సేవలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. సంపద కేంద్రాలకు బదులుగా గ్రామాల్లో షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. సర్పంచ్ లంకెల చిట్టెమ్మ, డీపీవో లవరాజు, డీఎల్పీవో పి.ఎస్.కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కు మార్, ఈవోపీఆర్డీ రమేష్, పంచాయతీ కార్యదర్శు లు చిన్ని,అనూష పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత పరిసరాల పరిశుభ్రతలో అన్నిశాఖల అధికారులు,ఉద్యోగులు భాగస్వా ములు కావాలని డీఆర్వో కె.పద్మలత కోరారు.కలెక్టరేట్లో శనివారం స్వర్ణాంఽధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై అధికారులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.అనంతరం కలెక్టరేట్లోని అన్ని విభాగాల్లోను అధికారులు,సిబ్బంది చెత్తాచెదారాన్ని తొలగించారు. డీఆర్వో పద్మలత మొక్కలు నాటారు. కలెక్టరేట్లోని సమాచార పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీపీ ఆర్వో గోవిందరాజులు,డివిజనల్ పీఆర్వో పండు రాములు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో మినీషెడ్ల ఏర్పాటుకు చర్యలు కలెక్టర్ దినేష్‌కుమార్ -
నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించాలి
సాక్షి,పాడేరు: పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధిత కుటుంబాలను నూతనంగా నిర్మించిన పునరావస కాలనీలకు తరలించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుజేస్తామన్నారు.రంపచోడవరం డివిజన్లో 2, చింతూరు డివిజన్లో 4 ఆర్అండ్ఆర్ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముంపు బాధితులకు ల్యాండ్ టూ ల్యాండ్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.గిరిజనేతరుల్లో చాలా మందికి గోకవరంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో గృహాలు నిర్మించామని,మిగిలిన అర్హులకు గృహాలు నిర్మిస్తామన్నారు. చింతూరు డివిజన్లో జులై,ఆగస్టు నెలల్లో వచ్చే వరదల కంటే ముందుగానే కాలనీలు పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హులైన ముంపు బాధితులను గుర్తించి సమగ్ర పరిశీలన అనంతరం నివేదికల ఆధారంగా ప్యాకేజీ అమలుజేయాలని,వెలగపూడి కాలనీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్,ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఏర్పాటు చేసే సమావేశాలకు ప్రత్యేక ఉప కలెక్టర్‌కు గైర్హాజరు అవడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు.ఇకపై సమావేశాలకు హాజరుకాని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ప్రత్యేక కలెక్టర్ సరళవందన, పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అడ్మినిస్ట్రేటివ్ అఽధికారి వి.అభిషేక్,రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ,ఎస్డీసీలు,ఇతర అధికారులు పాల్గొన్నారు. భూమికి భూమి బదలాయింపునకు భూసేకరణ వేగవంతం నష్ట పరిహారం చెల్లింపునకు చర్యలు కలెక్టర్ దినేష్‌కుమార్ -
తగ్గిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లా మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన రెండు వారాలుగా స్థిరంగా ఉన్న ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు భారీగా కురుస్తోంది. జి.మాడుగులలో 7.6 డిగ్రీలు, జీకే వీధిలో 7.9 డిగ్రీలు, చింతపల్లిలో 8.5 డిగ్రీలు, అరుకులోయలో 8.6 డిగ్రీలు,హుకుంపేటలో 9.3 డిగ్రీలు, పాడేరులో 9.6 డిగ్రీలు,పెదబయలులో 9.6 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.8 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 11.0 డిగ్రీలు, కొయ్యూరులో 13.2 డిగ్రీలు, అనంతగిరిలో 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.భూగర్భ జలాలను పెంచడంఅందరి బాధ్యత ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం వై.రామవరం(అడ్డతీగల) : భూగర్భ జలాలను పెంపొందించడం అందరి బాధ్యతని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర పథకంలో భాగంగా వై.రామవరం మండలం ఎర్రంరెడ్డిపాలెంలో శనివారం ఇంకుడు గుంతల ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంత ను ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుందని చెప్పారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందామనుకునే వారు ఉపాధిహామీ అధికారులకు దరఖాస్తులను అందజేయాలని తెలిపారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకుంటామని గిరిజనులతో ప్రతి జ్ఞ చేయించారు.ఉపాధిహామీ ఏపీడీ జి.శ్రీనివాస్,ఎంపీడీవో రవికిశోర్,ఉపాధిహామీ ఏపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
వారసుల కల సాకారమైన వేళ...
● ఎట్టకేలకు అల్లూరి అనుచరులవారసులకు సమకూరిన ఆవాసాలు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు ఎకరాల కేటాయింపు ● క్షత్రియసేవా సంఘం చొరవతో రూ.3.5 కోట్లతో భవనాలు నిర్మించిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ● రేపు ప్రారంభోత్సవం కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరులైన గాం గంటందొర, మల్లుదొర వారసులకు శాశ్వత ఆవాసాలు సిద్ధమయ్యాయి. పూరిళ్లలో జీవనం సాగిస్తున్న సమరయోధుల వారసుల దుర్భర పరిస్థితిని జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పడాల వీరభద్రరావు, మరి కొంతమంది నాయకులు గతంలో ప్రభుత్వం, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం... వారసులు నివాసముంటున్న లంకవీధి వద్ద సుమారు రెండు ఎకరాల స్థలం కేటాయించింది. క్షత్రియసేవా సమితి వినతి మేరకు ఇళ్ల నిర్మాణానికి నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ ముందుకు వచ్చింది. 2023 నవంబర్‌లో అప్పటి అరకు ఎంపీ గొడ్డేడి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో అభిషేక్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో రూ.3.5 కోట్లతో రెండు భవనాల్లో 12 ఫ్లాట్లు నిర్మించారు. ఒక్కో ఫ్లాట్‌లో 1,250 చదరపు అడుగుల్లో ఒక హాలు, రెండు బెడ్రూమ్లు, ఒక వంట గది నిర్మించారు. మల్లుదొర ముని మనుమడు బోడిదొర కిందటి సంవత్సరం అనారోగ్యంతో మరణించగా, ఆయన భార్య అచ్చియ్యమ్మ నాలుగు సంవత్సరాల కిందట మరణించారు. అల్లూరి సీతారామరాజు అమరుడైన వందేళ్ల తరువాత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సొంత ఇళ్లు సమకూరాయి. బోడిదొర,అచ్చియ్యమ్మ దంపతులు మరణించేంత వరకూ లంకవీధిలో పూరి గుడిసెలోనే ఉన్నారు. ఫ్లాట్లు అందుకోనున్న వారసులు గాం గంటం దొర, మల్లుదొర వారసులైన గాం సన్యాసమ్మ, బాబూరావు, నీలకంఠం, రాంబాబు, ధార మల్లేశ్వరి, సీతారామయ్య, సీతమ్మ, రాజుబాబు, శివ, దేశగిరి మల్లమ్మ, యర్రయ్యమ్మలకు ఫ్లాట్లను అందజేయనున్నారు. అల్లూరి విగ్రహం ఏర్పాటు రెండు భవనాలకు మధ్యన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్,తాగునీరు, మరుగుదొడ్లను సమకూర్చారు. సమరయోధుల వారసుల కోసం నిర్మించిన భవనాలను సోమవారం ఉదయం పదిన్నర గంటలకు కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.అల్లూరి–1,2 గా నామకరణం చేసిన భవనాలు -
అథ్లెటిక్స్‌లో మెరిసిన గిరిజనుడికి అభినందనలు
ముంచంగిపుట్టు: రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్‌లో ఇటీవల నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పరుగుల పోటీల్లో సత్తా చాటిన పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన అథ్లెటిక్స్ కుర్తాడి ప్రసాద్‌కు శనివారం అభినందన సభ నిర్వహించారు. 800, 400, 1500 మీటర్ల విభాగాల్లో వెండి, రెండు కాంస్య పతకాలు సాధించిన ఆయనను ఇన్చార్జీ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఎంఈవో కృష్ణమూర్తి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రమేష్, గిరిజన మహిళా సంఘం అధ్యక్షురాలు ఈశ్వరి సన్మానించారు. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి, ఇంత వయసులోనూ పరుగులో అంతర్జాతీయ స్థాయిలో పతాకాలు సాధించి, మండలానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని, మరిన్ని పతాకాలు సాధించాలని వారంతా ఆకాంక్షించారు. -
రోడ్డు విస్తరణలో మోదమ్మ ఆలయాన్ని మినహాయించాలి
● సబ్ కలెక్టర్‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విజ్ఞప్తి సాక్షి,పాడేరు: జాతీయ రహదారి విస్తరణలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధికారులను కోరారు.పాడేరు సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,జాతీయ రహదారి అధికారులు శనివారం మోదకొండమ్మ ఆలయానికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఆలయ కమిటీ సభ్యులు వారిని కలిశారు. మోదకొండమ్మతల్లి ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సబ్‌కలెక్టర్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈమేరకు సబ్‌కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబునాయుడు, సభ్యులు ఉడా త్రినాథ్, చల్లా రామకృష్ణ, డి.పి.రాంబాబు,లకే రత్నాబాయి,రమణ,హరి,సతీష్ పాల్గొన్నారు.ఈ–శ్రమ్‌తో అసంఘటిత కార్మికులకు భద్రత పాడేరు : అసంఘటిత రంగ కార్మికులు తప్పనిసరిగా ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని, తద్వార సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు పొందవచ్చునని జిల్లా కార్మిక శాఖ అధికారి టి.సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–శ్రమ్‌లో నమోదు చేసుకున్నవారికి 12 అంకెల గుర్తింపు(యూఏఎన్) యూనివర్సల్ అకౌంట్ నంబర్ లభిస్తుందన్నారు. ఈ కార్డుతో ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ముఖ్యంగా కార్మికులకు బీమా పథకం వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2లక్షలు, పూర్తి అంగ వైకల్యం చెందిందే రూ.2 లక్షలు, పాక్షిక అంగ వైకల్యం కలిగితే రూ.లక్ష బీమా సదుపాయం పొందవచ్చన్నారు. జిల్లాలో ఉన్న అసంఘటిత కార్మికులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
మలుచుకుంటే అధనం
తెలుసుకుంటే లాభం...పనస కాయలతో విలువ ఆధారితఉప ఉత్పత్తులు తయారీ, మార్కెటింగ్ ద్వారా అధిక ఆదాయం రంపచోడవరం: జిల్లాలో విరివిగా లభించే పనసకాయలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పందరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. పనస తొనలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇప్పటికే ఒక దఫా 30 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చేందుకు కేవీకే ప్రణాళిక సిద్ధం చేసింది. రెండు లక్షల చెట్లు జిల్లాలో రెండు లక్షల వరకు పనస చెట్లు ఉన్నట్టు ఉద్యానవన శాఖాధికారుల అంచనా. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు,పాడేరు,చింతపల్లి, అరకు తదితర 19 మండలాల్లో పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు తోటలుగానే కాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల్లో కూడా పనసను పెంచుతారు. పనస కాయల దిగుబడి ఫిబ్రవరిలో ప్రారంభమై మే వరకు లభిస్తాయి. పనస మొదటి దశలో తొనలు, విత్తనాలు(పనస పిక్కలు) తయారు కావు. వీటిని ఎక్కువగా కూరలు, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. గింజలు అభివృద్ధి చెందే దశలో కూడా కూర పనసగా ఉపయోగిస్తారు. తొనలు వచ్చినా తీపి, వాసన లేకుండా ఉంటాయి. వీటిని చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. పనస తొక్కు పచ్చడి,బజ్జీలు, పకోడి, బిర్యానీ, హల్వా, చాక్లెట్స్,తాండ్ర, జామ్,జ్యూస్, ఐస్‌క్రీమ్, పనస పిక్కల పిండితో పూరీలు, అప్పడాలు తయారు చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు వీటి తయారీపై ఇప్పటికే గిరిజన యువతకు శిక్షణ ఇచ్చారు. ఆర్థిక భరోసా జిల్లాలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్లో లభిస్తాయి. అనేక పోషక విలువలు ఉన్న పనసను గిరిజనులు వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. గిరిజన రైతులు గరిష్ట ధర పొందలేకపోతున్నారు. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు ఉప ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పోషక విలువలెన్నో.. పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది. గిరిజన యువత కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయలతో పచ్చడి, చిప్స్, పనస జ్యూస్, జామ్తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నోరూరించే చాక్లెట్లు పనస తొనలతో తయారు చేసే చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయా రు చేయవచ్చు. కేజీ పనస తొనలను వేడి నీటిలో ఉడికించి, గుజ్జుగా తయారు చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసుకుని పనసగుజ్జు, కరిగించిన పాలపొడి, వేయించిన కోకో పౌడరు, పంచదార వేసి కాసేపు వేయించుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. అంతే.. ఆహా ఏమి రుచి అనేలా పనస చాక్లెట్లు సిద్ధమవుతాయి.ఆ దిశగా శిక్షణ ఇస్తున్న పందిరి మామిడి కేవీకేమార్చిలో మరో బ్యాచ్‌కు శిక్షణ తాండ్ర తయారీ ఇలా పిక్కలు వేరు చేసిన కేజీ పనస తొనలను వేడినీళ్లలో వేసుకుని మరిగించుకోవాలి. మెత్తబడిన పనస తొనలను మిక్సర్‌లో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ట్రేలలో సమాంతరంగా ఈ గుజ్జును వేసుకోవాలి. తేమ ఆరే వరకు ఎండలోగాని, డ్రయర్ల గాని ఉంచుకోవాలి. తేమ ఆరిపోతే తాండ్ర ట్రేలో నుంచి సులభంగా వస్తుంది. వీటితో పాటు మరికొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో మరోదఫా శిక్షణ పందిరిమామిడి కేవీకేలో మార్చి నెలలో మారోమారు పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ ఏడాది ఏజెన్సీలో 25 ఎకరాల్లో పనస మొక్కలు నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో అధిక సంఖ్యలో పనసపండ్లు లభిస్తున్నా గిరిజనులు పూర్తిస్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గిరిజన యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేవీకే కృషి చేస్తోంది. – క్రాంతి, ఉద్యానవన శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి -
వైద్య విద్యార్థులు భావితరాలకు ఆదర్శం కావాలి
సాక్షి,పాడేరు: వైద్య విద్యార్థులు సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ భావితరాలకు ఆదర్శం కావాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. అనాటమి విభాగంలోని బయో కెమిస్ట్రీ, హిస్టోలజీ ల్యాబ్, బోధన తరగతుల గదులను ఆయన పరిశీలించారు. వైద్య విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సామాజిక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. క్లబ్‌ల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వైద్య విద్యార్థులకు ఆసక్తి ఉంటే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. నెట్వర్కు కవరేజి, కాలేజీ బస్సులు, ఆడిటోరియం, ఆట స్థలం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. కళాశాల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష మెడికల్ కళాశాల భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ దినేష్‌కుమార్ నిర్మాణ సంస్థ ఎన్సీసీ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అదనపు వర్కర్లను నియమించి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మెడికల్ కళాశాలను సందర్శించి, మురుగు కాలువల నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. బ్లాక్–1ను ఏప్రిల్లోను, బ్లాక్–2ను ఆగస్టులోను, వైద్య విద్యార్థుల వసతి గృహాలు, సిబ్బంది నివాస గృహాలను మే నెల నాటికి పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మికుమారి, ప్రొఫెసర్ డాక్టర్ శిరీషా, ఈఈ అచ్యుంనాయుడు, డీఈఈలు వర్మ, ఫణికుమార్, జేఈ సురేష్, డీజీఎం మధుబాబు పాల్గొన్నారు.