Anakapalle
-
బాబు సర్కార్ సిత్రాలు.. జిమ్‌కు ‘కోటి’ కరెంట్ బిల్లు!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి పాలనలో కొత్త సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పవర్ బిల్లులు చూపి ప్రజలు అవాక్కవుతున్నారు. తాజాగా జిమ్‌కు కోటి రూపాయలు కరెంట్ బిల్లు(Power Bill) రావడంతో నిర్వాహకుడు ఖంగుతున్నాడు. సదరు బిల్లుపై అధికారాలను ప్రశ్నించగా.. ఈ విషయం బయటకు చెప్పవద్దని అధికారులు ఆదేశించడం గమనార్హం.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని జిమ్‌కు ఏకంగా కోటి రూపాయలు కరెంట్ బిల్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరెంట్ బిల్లు చూసి బిల్లు చూసి నిర్వాహకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రతీ నెలా 18 నుంచి 20వేల బిల్లు వస్తుండేది. ఈనెల కోటి 15వేల రూపాయల కరెంటు బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. అనంతరం, బిల్లుపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు. అయితే, విద్యుత్ బిల్లుపై మీడియాతో మాట్లాడవద్దని నిర్వాహకుడిని అధికారుల ఆదేశించారు. బిల్లు పెరిగిన విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని హెచ్చరించారు. కాగా, అధికారులు తప్పిదం కారణంగానే తనకు ఇంత బిల్లు వచ్చిందని చెప్పడానికి వెళ్లిన వ్యక్తి మరలా అధికారులే బెదిరించడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది.కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. ఇక, ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు రావడం విశేషం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా ఎక్కువ బిల్లు వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
No Headline
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సస్పెండైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ పల్లా గంగరాజు వ్యవహారం వెనుక ఓ ఏసీపీ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సదరు ఏసీపీ ద్వారానే వ్యవహారాలన్నీ ఈ కానిస్టేబుల్ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కూటమి ఎమ్మెల్యేల పాత్రపైనా ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు బంధువు, పీఏగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తికి ఉన్న లింకులపైనా కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మొన్నటి వరకు అనకాపల్లిలో విధులు నిర్వహించిన ఈ కానిస్టేబుల్.. ఏసీపీ ద్వారానే బదిలీ చేసుకుని విశాఖ సిటీకి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కానిస్టేబుల్ సెల్ నంబరు ద్వారా జరిపిన లావాదేవీలన్నీ గుర్తించే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా కేవలం కానిస్టేబుల్ అకౌంటు ద్వారా లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కానిస్టేబుల్ ద్వారా నిరంతరాయంగా సంభాషిస్తూ.. ప్రతి నెలా మామూళ్లు దండుకుంటున్న ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యే పీఏ వ్యవహారం కూడా త్వరలో బయటపడే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. -
నెల నెలా మామూళ్లు...!
స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌తో అవినాభావ సంబంధం ఉన్న కూటమిలోని ఓ ఎమ్మెల్యేకు నెల నెలా మామూళ్లు ముడుతున్నాయని కూడా తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ ముఠా నుంచి మామూళ్లు అందజేయడంలో ఈ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలక ఎమ్మెల్యే పీఏనని చెప్పుకునే దూరపు బంధువు పాత్ర కూడా కీలకంగా ఉంది. వాస్తవానికి క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న తర్వాత టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించిన వ్యవహారంలో ఈ పీఏ వ్యవహారశైలిపై కూడా సీపీ సీరియస్‌గా ఉన్నట్టు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ‘చిట్టి’గా కాకుండా ‘గట్టి’గా విచారణ జరిపితే దొంగలందరూ బయటకు వస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
జాతరలో చల్ చల్ గుర్రం!
చోడవరం : జిల్లాలో క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పోటీలు సంక్రాంతి తీర్ధాల్లో ప్రత్యేక ఆకర్షణ. గ్రామదేవతల పండగల వరకు అన్ని ఉత్సవాలు గుర్రాల జాతరను తలపిస్తాయి. కొందరు పోటీల కోసమే గుర్రాల పెంపకం చేపడుతుండడం విశేషం. జైపూర్ మహారాణి పాలనలో మాడుగులలో దసరా రోజున ప్రత్యేకంగా గుర్రాల సంత కూడా జరిగేది. ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు వెళ్లేందుకు మైదాన గిరిజన గ్రామాలకు చెందిన వారు నేటికీ గుర్రాలనే రవాణాకు ఉపయోగిస్తున్నారు. దీంతో మైదాన గిరిజన గ్రామాల్లో వీటి పెంపకం పెరిగింది. ప్రస్తుతం సంక్రాంతి తీర్థాలు కనుమ పండగ నుంచి ప్రారంభం కావడంతో గ్రామీణ తీర్థాల్లో గుర్రాల దౌడు మొదలైంది. మైదానాలు రెడీ చోడవరం, కొత్తకోట, దొండపూడి, టి.అర్జాపురం, రావికమతం, మాడుగుల, అచ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం, కోటవురట్ల, రాంబిల్లితోపాటు రాజరిక కీర్తిని సంతరించుకున్న పద్మనాభం, ఎస్.కోట, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో గుర్రాల పరుగు పోటీలు జోరుగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా మేలు రకం గుర్రాల ధర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, హైదరాబాద్, జైపూర్, కటక్ ప్రాంతాల నుంచి మేలు రకం గుర్రాలను కొనుగోలు చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. రేస్‌లు...ఇలా... గుర్రాల పోటీలను మూడు రకాలుగా నిర్వహిస్తారు. పోటీకి వచ్చిన గుర్రాల సంఖ్యను బట్టి రెండు మూడు గ్రూపులుగా విభజించి ఒకేసారి 5 నుంచి 7 గుర్రాలను బరిలోకి దించి స్వారీ చేస్తారు. ముందుగా గమ్యం చేరిన గుర్రాలను వరుసగా గెలుపొందినట్టుగా ప్రకటిస్తారు. రెండో రకం పోటీలో రెండేసి గుర్రాలను బరిలోకి దించి దౌడు తీయిస్తారు. గెలుపొందిన వాటికి మరలా పోటీపెట్టి తుది విజేతలను ప్రకటిస్తారు. ఇక మూడో రకం పోటీల్లో ఒక్కో గుర్రాన్ని దౌడు తీయించి తక్కువ సమయంలో నిర్దేశించిన గమ్యాన్ని చేరిన గుర్రం గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఎక్కువ మైదానం ఉన్న చోట మొదటి రకం పందాలు నిర్వహిస్తుండగా, ఇపుడు తక్కువ స్థలంలో నిర్వహించాల్సి రావడంతో టైమింగ్ పందాలే ఎక్కువగా జరుగుతున్నాయి. నేటి నుంచి పోటీలు ఈనెల 17వ తేదీ జిల్లాలో అతి పెద్ద పండగైన చోడవరం మండలం నర్సాపురం తీర్థ మహోత్సవం, బుచ్చెయ్యపేట మండలం రాజాం, ఆనందపురం గ్రామాల్లో పండగలు సందర్భంగా జిల్లా స్థాయి గుర్రాల పరుగుల పోటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈనెల 18న భోగాపురంలోను, 20న శీమునాపల్లి గ్రామాల్లో జరిగే గ్రామ దేవతల పండగల సందర్భంగా జిల్లా స్థాయి గుర్రాల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఒకప్పుడు రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం జట్కా బళ్లే ప్రధాన రవాణా వాహనంగా ఉండేవి. మారిన కాలంలో జట్కా బళ్లు కనుమరుగైపోవడంతో కొంతకాలం గుర్రాల గిట్టల శబ్దాలు కనుమరుగుయ్యాయి. ఇప్పుడు మళ్లీ చల్ చల్ గుర్రం...చలాకీ గుర్రం... అంటూ గుర్రాలు పరుగులు తీస్తున్నాయి. రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన గుర్రపు స్వారీ, పరుగు పోటీలు ఇప్పుడు మరలా గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. కేవలం క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పోటీలు ఇటీవల కాలంలో గ్రామాల్లో జరిగే ప్రతి ఉత్సవాల్లో సందడి చేస్తున్నాయి. దౌడుకు సిద్ధమైన గుర్రాలుఎడ్ల బళ్ల పోటీలకు దీటుగా మైదానాలు సిద్ధంసంక్రాంతి తీర్థాల్లో పోటీల సందడి -
పేట భూములపై కన్ను!
నక్కపల్లి : పరిశ్రమల కోసం భూసేకరణకు 4(1) నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా రైతులతో బేరసారాలు సాగించి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. భూసేకరణ జరిపితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మార్కెట్ విలువ కంటే మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. దీనికి తోడు ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ, పునరావాసం కల్పించి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలి. ఇవన్నీ చేయాలంటే సాధ్యం కాని పని. ఈ ప్రక్రియలో భూసేకరణ జరిపితే రైతుకు రూ.1.50 కోట్లు పైనే చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డైరెక్ట్ పర్చేజింగ్ పేరుతో రైతులతో మాట్లాడుకుని డీ ఫారం భూములకు ఎకరా రూ.25 లక్షలు, జిరాయితీ భూములకు రూ.50 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. ఇప్పటికే నక్కపల్లి మండలం పెద బోదిగల్లంలో సేకరిస్తున్న భూములకు ఇదే ఫార్ములా పాటిస్తున్నారు. నేరుగా రైతుల నుంచి ఎకరా రూ.30 లక్షలు చెల్లించి ఏపీఐఐసీ పేరున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. పాయకరావుపేట మండలంలో ప్రతిపాదిత గ్రామాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల పైబడే ఉన్నాయి. మండలంలో ఐదు గ్రామాలు గుర్తింపు.. పాయకరావుపేట మండలంలో భూముల కోసం తీరప్రాంతం వెంబడి ఇప్పటికే ఐదు గ్రామాలను ఏపీఐఐసీ వారు గుర్తించారు. పెంటకోటలో 1280 ఎకరాలు, రాజవరంలో 1117 ఎకరాలు, కేశవరంలో 712ఎకరాలు, ఈదటంలో 1951 ఎకరాలు, కందిపూడిలో 188 ఎకరాలు, కుమారపురంలో 1882 ఎకరాలు, మాసయ్యపేటలో 206 ఎకరాలు.. మొత్తం 8386 ఎకరాలు ప్రాజెక్టు కోసం గుర్తించారు. ఇప్పటికే రాజవరం, కేశవరం గ్రామాల్లో సుమారు 260 ఎకరాల్లో డక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. పెంటకోట సమీపంలో టౌన్ షిప్ ఏర్పాటు కోసం 452 ఎకరాలను సైతం గుర్తించినట్టు సమాచారం.ఇవేకాకుండా శ్రీరాంపురంలో కూడా మరో 1046 ఎకరాలు సేకరించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా 8386 ఎకరాలకు సంబంధించి ఏపీఐఐసీ వారు లేఅవుట్ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ గ్రామాల రైతులతో మాట్లాడి నేరుగా కొనుగోళ్లు ప్రారంభించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ వారు విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా 4500 ఎకరాలు భూములు సేకరించారు. వీటిలో 2200 ఎకరాలను రూ.1877 కోట్ల వ్యయంతో నిర్మించే బల్క్ డ్రగ్ పార్క్‌కోసం కేటాయించారు. ఈ పార్క్ నిర్మాణానికి ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు పోర్టు ఆధారిత స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న రాజయ్యపేటలో 2400 ఎకరాలు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. మొదటి విడతలో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. రెండో విడతలో మరో 3600 ఎకరాల్లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. నక్కపల్లి మండలంలో ఒకేసారి బల్క్ డ్రగ్‌పార్క్, స్టీల్‌ప్లాంట్‌కు భూములు కేటాయించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం పాయకరావుపేట మండలంలో కూడా భూములు సేకరించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ ఐదు గ్రామాల్లో భూములను గుర్తించి లేఅవుట్ సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏపీఐఐసీ ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూ సేకరణ తగదు పాయకరావుపేట మండలంలో తీరప్రాంత గ్రామాల్లో భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సమాచారం వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూములు సేకరించడం తగదు. రైతులైతే ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారంతో వేరొక చోట భూములు కొనుక్కుంటారు. మత్య్సకారులు చేతివృత్తులవారు ఎక్కడకెళ్లి జీవనోపాధి పొందాలి. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే నక్కపల్లి మండలంలో భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి భూసేకరణ సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఉన్న ఫళంగా గ్రామాలను ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఈ మండలంలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కాబోతోంది. మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. –చోడిపల్లి శ్రీనివాస్, మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మత్స్యకారుల నుంచి వ్యతిరేకత పాయకరావుపేట మండలంలో భూసేకరణకు ప్రతిపాదిత గ్రామాల్లో అధికంగా మత్స్యకారులే జీవిస్తున్నారు. వేటనే ప్రధానంగా చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. పరిశ్రమల పేరుతో తమ గ్రామాల్లో భూములు లాక్కొంటే మేమెక్కడికి వెళ్లి బతకాలంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ విడుదల చేస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాల్సి వస్తుందన్న సాకుతో ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి డైరెక్ట్ పర్చేజ్ పేరుతో భూములు కారు చౌకగా లాక్కొవాలని చూస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేయించాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చౌకగా పరిశ్రమలకు కట్టబెట్టే యత్నంఐదు గ్రామాల గుర్తింపు ప్రభుత్వం కళ్లు పాయకరావుపేట మండలంపై పడ్డాయి. పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు ఈ మండలంలో 8 వేల ఎకరాల సేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఏపీఐఐసీ మధ్యవర్తిత్వం వహించి నేరుగా రైతుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూసేకరణ కొరకు పాయకరావుపేట మండలంలో తీర ప్రాంతంలో ఐదు గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే ఏపీఐఐసీ వారు లే అవుట్కూడా సిద్ధం చేశారన్న సమాచారం మండలంలో వ్యాపించడంతో తీరప్రాంత గ్రామాల్లో నివసిస్తున్న మత్య్సకారులు, బడుగు బలహీన వర్గాలు, పేదల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తీర ప్రాంతంలో 8వేల ఎకరాలు సేకరణటౌన్షిప్ కోసం మరో 452 ఎకరాలులేఅవుట్ సిద్ధం చేసిన ఏపీఐఐసీ -
సెల్ ఫోన్ లింకులపై సీపీ దృష్టి
వాస్తవానికి స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) కానిస్టేబుల్ ఫోన్ నంబరును పరిశీలిస్తే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సదరు కానిస్టేబుల్ అకౌంట్ ద్వారా కోట్లలో లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. డిపార్టుమెంటులో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు పోలీసులకు కూడా తన ఫోన్ పే ద్వారా నగదును బదిలీ చేశారని సమాచారం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌లోని కొంత మందికి కూడా క్రికెట్ బెట్టింగ్ ముఠాలోని సభ్యుల నుంచి ఫోన్ పే ద్వారా నగదు బదిలీ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా విచారణ జరిపితే మరింత మంది డిపార్టుమెంటు దొంగలు బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న లగుడు రవిని పట్టుకున్న సమయంలో కూడా భారీగానే నగదు దొరికిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ నగదును చూపకుండా తప్పించిన వ్యవహారం ఇప్పుడు పోలీసుశాఖలో హాట్ టాపిక్‌గా మారింది. -
ఎన్నో బహుమతులు కొట్టాను...
సంక్రాంతి తీర్థాలు వచ్చాయంటే పరుగుల పోటీ కోసం నా గుర్రాన్ని ముందుగానే సిద్ధం చేస్తాను. మంచి ఆహారం పెట్టడంతో పాటు పరుగులో కూడా శిక్షణ ఇస్తాను. గత రెండేళ్లల్లో తూర్పుగోదావరి జిల్లా తుని, సామర్లకోటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో నా గుర్రం మొదటి స్థానం సాధించింది. రుద్ర రైడర్ పేరుతో నా గుర్రాన్ని పోటీకి దించుతాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో మొత్తం 150 గుర్రాల వరకు వివిధ జిల్లాల నుంచి పాల్గొంటాయి. అతి తక్కువ సమయంలో 3.11.6 నిమిషాల్లో 4 కిలోమీటర్ల మేర పరుగుపెట్టి అన్ని గుర్రాల కంటే ముందుగా నా గుర్రం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది కూడా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో నా గుర్రాన్ని పరుగుల పోటీకి దించాలని సిద్ధం చేశాను. –దాడి కోటేశ్వరరావు, గుర్రపు రౌతు, రాయపురాజుపేట భలే మజా.. గుర్రపు స్వారీలో ఉండే ఆనందమే వేరు. పోటీలో పాల్గొనే గుర్రాలకు మంచి దానా పెట్టాల్సి ఉంటుంది. మేలు జాతి గుర్రాలైతే రూ.2, 3 లక్షలు వరకు ధర ఉంటుంది. ఇటువంటి గుర్రంపై స్వారీ చేస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. నేను సుమారు రూ1.30 లక్షలు పెట్టి గుర్రాన్ని కొన్నాను. అనేక సార్లు పోటీల్లో పాల్గొని చాలా బహుమతులు కూడా కొట్టాను. పోటీల్లో గుర్రంపై దౌడుతీస్తుంటే ఆ జోష్ చాలా బాగుంటుంది. – రాజేష్, గుర్రం పెంపకందారు, గోపాలపట్నం -
No Headline
గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన సమయంలోనూ సదరు ఏసీపీ ఈ కానిస్టేబుల్‌ను తన వద్దనే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. అప్పటినుంచి వీరి బంధం రోజురోజుకీ బలపడినట్టు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన సమయంలో ఎక్కడెక్కడ ఎంత మొత్తం వసూలు చేయాలి? తనకు ఎక్కడ ఇవ్వాలనే వివరాలన్నీ సదరు ఏసీపీ డైరెక్షన్లోనే పనిచేసేవారనే పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. స్పాలు మొదలుకుని, బ్లాక్ ఆయిల్ దందా, పేకాట డెన్ నిర్వాహకులతో పాటు గంజాయి బ్యాచ్ నుంచి కూడా వసూళ్లకు తెగబడినట్టు విమర్శలున్నాయి. ఈ విధంగా వసూలు చేసిన మొత్తాన్ని ఏసీపీకి అందజేయడంలో కీలకపాత్ర ఈ కానిస్టేబుల్ పోషించారనే తెలుస్తోంది. ఆ వీరిద్దరి డిపార్టుమెంట్లు వేరువేరుగా ఉన్నప్పటికీ..ఆర్థిక బంధం మాత్రం యథావిధిగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. తాజా వ్యవహారంలో కూడా ఏసీపీ పాత్రపైనా ‘గట్టి’ విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసుశాఖలో వినిపిస్తోంది. -
చెర్లపల్లి–విశాఖ–భువనేశ్వర్ ప్రత్యేక రైలు
విశాఖ విద్య: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం– చెర్లపల్లి– భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు(08549/08550) నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైలు నంబర్ 08549 విశాఖపట్నంలో ఈ నెల 18న సాయంత్రం 7.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8.18 గంటలకు దువ్వాడ చేరుకుని, 8.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. రైలు నంబర్ 08550 ఈ నెల 19న ఉదయం 9 గంటలకు చెర్లపల్లిలో బయలుదేరి సాయంత్రం 6.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. దువ్వాడలో 6.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున 2.15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. గిరిజన మ్యూజియంకు రూ.6.8 లక్షల ఆదాయం అరకులోయ టౌన్: గిరిజన మ్యూజియంకు ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజుల్లో ఎంట్రీ టికెట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేశ, విదేశాల నుంచి విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ రైలుతోపాటు సొంత వాహనాల్లో అరకు అందాలు తిలకించేందుకు భారీగా రావడంతో ఇంత ఆదాయం సమకూరిందని నిర్వహకులు తెలిపారు. పండగ మూడు రోజుల పాటు ఎంట్రీ టికెట్ల ద్వారా మొత్తం రూ.6 లక్షల 80 వేలకు పైగా ఆదాయం సమకూరినట్లు మ్యూజియం ఇన్చార్జి మణికుమార్, గిరిజన మ్యూజియం ప్రొటోకాల్ ఇన్చార్జి గణపతి తెలిపారు. -
అదిగో పులి!
● రాంబిల్లిలో వదంతులు ● సోషల్ మీడియాలో వీడియోలు , ఫొటోలు వైరల్రాంబిల్లి నేవీ కాలనీ గుడి వద్ద పులిగా భావిస్తున్న జంతువు రాంబిల్లి యలమంచిలి) : మండలంలోని నేవీ కాలనీ శివారు నిర్మాణంలో ఉన్న ఆలయానికి సమీపంలో పులి సంచరిస్తున్నట్టు గరువారం వదంతులు తలెత్తాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కొందరు స్థానికులు అటువైపుగా వెళుతుండగా దూరంలో పులిలాంటి జంతువును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు యువకులు గుడి పక్క కూర్చుని ఉన్న జంతువుకి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పులి సంచరిస్తున్నట్టు పోస్ట్ చేశారు. ఈ వీడియో భాగా స్ధానికంగా వైరల్ కావడంతో అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పులి సంచరిస్తున్న సమాచారంపై యలమంచిలి అటవీశాఖ బీట్ అధికారి వెంకటరమణను సంప్రదించగా అది పులికాకపోవచ్చునని, ఒక వేళ పులి సంచరిస్తున్నట్టయితే ఆహారం కోసం ఏదో ఒక జంతువును వేటాడుతుందన్నారు. శుక్రవారం నేవీ కాలనీ ప్రాంతాన్ని పరిశీలించి స్పష్టతనిస్తానన్నారు. దీనిపై రాంబిల్లి పోలీసులు కూడా తమను సంప్రదించారని ఆయన సాక్షికి ఫోన్లో తెలిపారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఎస్.రాయవరం: మండలంలోని రేవుపోలవరం తీరంలో గల్లంతైన కాకర్ల మణికంఠ(22) మృతదేహం గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల తీరం సమీపంలో లభ్యమైంది. ఎస్ఐ విభీషణరావు వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన మణికంఠ తుని మండలం లోవ కొత్తూరులో తన మేనమామ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చి గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీరంలో మునిగిన సాత్విక్‌ను మణికంఠ కాపాడబోయి కెరటానికి కొట్టుకుపోయాడు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేత తురువోలు
విజేతకు నగదు బహుమతులను అందజేస్తున్న స్థానిక పెద్దలు, యూత్ దేవరాపల్లి: జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా తురువోలు నిలిచింది. మండలంలోని తారువలో మర్లమాంబ తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఈ పోటీలు అర్ధరాత్రి వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 30 జట్లు పాల్గొనగా, హోరా హోరీగా సాగాయి. ప్రథమ స్థానంలో తురువోలు, ద్వితీయ స్థానంలో పెదగంట్యాడ, తృతీయ స్థానంలో తారువ, నాల్గో స్థానంలో వావిలపాడు జట్లు నిలిచాయి. వీటికి వరుసగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేల చొప్పున బహుమతులను గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు అందజేశారు. ఈ పోటీలను తిలకించేందుకు మండల వ్యాప్తంగా ప్రజలు, క్రీడా అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
ఆదుకుంటాడనుకుంటే.. అసువులు బాసాడు
● జలపాతంలో మునిగి యువకుడి మృతి ● ఎన్.జి.నగరంలో తీర్థం పూట విషాదం ● ఉద్యోగంలో చేరి రెండు నెలలు కూడా గడవక ముందే మృత్యువాత ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దేవరాపల్లి: మండలంలోని ఎన్.గజపతినగరంలో గ్రామ దేవత తీర్థం పూట పెను విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన యువకుడు వంటాకు శ్యాంప్రసాద్ (21) పాడేరు మండలం ఐనాడ పంచాయతీ గుల్లి గిరిజన గ్రామ సమీపంలోని జలపాతంలో బుధవారం ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం జరగాల్సిన గ్రామ దేవత తీర్థానికి దూరమయ్యారు. ఈ కుటుంబం జీవనోపాధి నిమిత్తం విశాఖలో ఉంటున్నారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు ఈ కుటుంబ సభ్యులు, శ్యాంప్రసాద్ గ్రామ దేవత నారితల్లమ్మకు దీపారాధన చేసేవారు. అమ్మవారి తీర్థం కోసం మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన శ్యాంప్రసాద్ అదే రోజున మృతి చెందడాన్ని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి శ్యాంప్రసాద్ మంగళవారం జలపాతం సందర్శనకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి మృతి చెందాడు. శ్యాంప్రసాద్ అంత్యక్రియలు గురువారం ఎన్.జి.నగరంలో జరిగాయి. ఉద్యోగంలో చేరి రెండు నెలలు గడవక ముందే.. డిగ్రీ చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన శ్యాంప్రసాద్ రెండు నెలల క్రితమే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. విశాఖలోని పట్టాభిరామ్ గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న ఇతని తండ్రి శ్రీధర్ జీవీఎంసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భర్తతో పాటు కుమారుడి జీతం కూడా కలిసి వస్తుందని, ఇక తమ కష్టాలు తీరుతాయని శ్రీధర్ భార్య లక్ష్మి ఎంతో ఆనందించింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలు కూడా గడవక ముందే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి కంటతడి పెట్టించింది. కన్నీటిపర్యంతమైన తండ్రి.. ఎన్.గజపతినగరం గ్రామానికి చెందిన శ్రీధర్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో దివ్యాంగుడైన ఓ కొడుకు ఇటీవలే మృతి చెందాడు. ఆ బాధ నుండి ఇంకా తేరుకోక ముందే ఎదిగి వచ్చిన కొడుకు జలపాతంలో మునిగి చనిపోవడంతో గుండెలు పగిలేలా రోదించిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకులు ఇద్దరు మృతి చెందారని, తాము ఎవరి కోసం బ్రతకాలని, కన్న కొడుకు చితికి తలకొరివి పెడతానని కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. -
దత్తత మీ ఇష్టం..!
జంతు ప్రపంచం... ఆరిలోవ : ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకొంటే వాటి ఎన్‌క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అవి సందర్శకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకొన్న వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద సిద్ధం చేశారు. ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు జూకి వెళుతున్న సందర్శకులను అలరిస్తుంటాయి. ఆయా ఎన్క్లోజర్ల వద్ద దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూలో వందల కొలది వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయి. వాటిపై ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి బాధ్యతగా తీసుకొని సహాయపడుతున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని చిన్న జంతువులు, పక్షులను కూడా కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు. ● ఫ్లూయంట్ గ్రిడ్ లిమిటెడ్ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకొంది. దీంతో ఆ కంపెనీ పేరు, జిరాఫీ చిత్రపటంతో దాని ఎన్‌క్లోజరు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు.. ● ఎన్‌క్లోజరు వద్ద ఐఓసీఎల్ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకొన్నారు. దాన్ని మళ్లీ మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. ఖఢ్గమృగం ఉన్న చిత్రపటంపై లిమిటెడ్ పేరుతో బోర్డును దాని ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేశారు. ● ఆర్సిలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్(ఏఎన్/ఎంఎస్) తెల్ల పులిని ఒక సంత్సరం పాటు దత్తత తీసుకొంది. తెల్లపులుల ఎన్‌క్లోజరు వద్ద ఆ కంపెనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. ● వీటితో పాటు మరికొందరు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, ఒక్కరోజు కూడా ఇక్కడ వన్యప్రాణులకు ఆహారం అందించడానికి దత్తత తీసుకొన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎంత మొత్తం చెల్లించాలంటే.. జంతువు / పక్షి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం జంతువు/ పక్షి రోజుకు ఏడాదికి ఏనుగు రూ.1200 రూ.4,30,000 ఖడ్గమృగం రూ.820 రూ.3,00,000 నీటి ఏనుగు రూ.600 రూ. 2,00,000 సింహం రూ.600 రూ.1,90,000 పెద్ద పులి రూ.600 రూ.1,90,000 జిరాఫీ రూ.500 రూ.1,80,000 చిరుత పులి రూ.400 రూ.1,25,000 ఎలుగుబంటి రూ.300 రూ.1,10,000 చింపాంజీ రూ.210 రూ.75,000 అడవి దున్న రూ.200 రూ.73,000 జీబ్రా రెండింటికి రూ.330 రూ.60,000 (ఒక జీబ్రాకు) తోడేళ్లు రెండింటికి రూ.300 రూ.55,000 (ఒక తోడేలుకు) రేచుకుక్క రూ.135 రూ.50,000 చుక్కల దుప్పి రూ.100 రూ.36,500 రింగ్‌టైల్డ్ లెమూర్కు రూ.100 రూ.36,500 ఇవి కాకుండా... మొసలి/ఘరియల్ రెండింటికి రోజుకు రూ.150 రూ.24,000 హంసలు (రెండింటికి (ఏడాదికి ఒకదానికి) 2 రోజులకు) రూ.100 రూ.18,000 నక్షత్ర తాబేళ్లు (పదింటికి (ఒక హంస) ఐదు రోజులకు) రూ.150 రూ.11,000 సారస్ కొంగ/నిప్పుకోడి/ పాములు (నాలుగు రోజులకు) రూ.100 రూ.10,000 (ఒకదానికి) గుడ్లగూబలు (నాలుగింటికి రూ.100 రూ.9,500 ఒకరోజుకు ) (ఒక దానికి) మకావ్‌లు (నాలుగింటికి మూడు రోజులకు) రూ.100 రూ.3,000 (ఒక దానికి) పీజియన్/నెమళ్లు (నాలుగింటికి నాలుగు రోజులకు) రూ.100 రూ.2,200 (ఒక దానికి) ఆఫ్రికన్ చిలుకలు/రామచిలుకలు (ఐదు రోజులకు) రూ.100 రూ.1500 (ఒకదానికి) లవ్ బర్డ్స్ (పదింటికి ఐదు రోజులకు) రూ.100 రూ.1,000 (ఒకదానికి) దాతలు ముందుకు రావాలి జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు. ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. – జి.మంగమ్మ, జూ క్యూరేటర్ ఆహారం ఇలా... సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఆదాయం పన్ను మినహాయింపు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికై నా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు. -
అత్తారింట విందు... భలే పసందు
మునగపాక : గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త అల్లుళ్ల కోసం అత్తవారు పలు రకాల పిండివంటలతో విందు భోజనం ఏర్పాటు చేయడం అనవాయితీగా వస్తుంది. ఇదే సంప్రదాయం ఇపుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు పాకుతుంది. గవర్ల అనకాపల్లిలో బ్రాంచి పోస్టుమాస్టర్ పొలమరశెట్టి జగ్గారావు ఇంటిలో సంక్రాంతి సందడి కనిపించింది. జగ్గారావు–అన్నపూర్ణ దంపతుల కుమార్తె జిషితను అనకాపల్లికి చెందిన చదరం చిన నూకరాజు–ప్రభావతి దంపతుల కుమారుడు వంశీతో వివాహం చేశారు. ఈ దంపతులకు 78 రకాల పిండివంటలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. అలాగే మునగపాకకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెలగా సూర్యనారాయణ ద్వితీయ కుమారుడు అర్మీ రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు–గీత కుమారుడు సూర్యతేజకు గవర్ల అనకాపల్లికి చెందిన పొలమరశెట్టి చందు–వరలక్ష్మి దంపతుల కుమార్తె జ్యోష్ణకు వివాహం జరిగింది. కొత్త జంట కావడంతో అత్తమామలు వారికి 78 రకాల పిండివంటలతో తయారు చేసిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఇరు దంపతులు అత్తవారింట జరిగిన మర్యాదల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నోరూరించే వంటకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని అల్లుళ్లు సూర్యతేజ, వంశీలు హర్షం వ్యక్తం చేశారు. చిన్నబాబు కాలనీలో 120 వంటకాలతో... అనకాపల్లి : అనకాపల్లి మండలం చిన్నబాబు కాలనీకి చెందిన వేగి విశ్వేశ్వరరావు శారదా దంపతుల కుమార్తె వర్థినికి వివాహం జరిగింది. మొదటి సంక్రాంతికి రావడంతో కుమార్తె వర్థిని అల్లుడు ఆడారి భరత్వాజ్లకు 120 రకాల పిండివంటకాలతో విందును ఏర్పాటు చేశారు. పసందైన విందుతో కొత్త అల్లుడికి స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రజలు ఈ కొత్త సంప్రదాయాన్ని ఆసక్తిగా తిలకించారు. ● కొత్త అల్లుళ్లకు 78 వంటకాలతో భోజనం -
No Headline
ఎమ్మెల్యే రాజుకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం (ఫైల్) రోలుగుంట : మండలంలో ప్రజలకు ఇబ్బందికరంగా నడుస్తున్న నల్ల రాతి క్వారీ గుప్పెట్లో రాజన్నపేట గ్రామస్థుల పరిస్థితి దినదిన గండంగా మారిందని వైఎస్సార్సీపీ మండల మహిళా నాయకురాలు కిమిడి శివాలక్షి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజన్నపేట గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లరాతి క్వారీ చెరువును పూడ్చి క్వారీ రోడ్డు నిర్మాణం చేసుకున్నారని, అర్హత లేని సిబ్బందితో బ్లాస్టింగ్ చేస్తున్నారని తెలిపారు. బ్లాస్టింగ్లతో రాళ్లు పంట పొలల్లో పడుతుండడంతో పశువులు బెదిరి పారిపోతున్నాయని తెలిపారు. బ్లాస్టింగ్ల అదురుకు సమీపంలో గల రాజన్నపేట గ్రామానికి చెందిన పలువురి ఇళ్ల గోడలు దెబ్బ తిన్నాయని తెలిపారు. పరిమితికి మించి బండరాళ్ల భారీ లోడుతో జరుగుతున్న రవాణా కారణంగా రోడ్లు గుంతలు పడుతున్నాయని, కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయన్నారు. జలవనరులు కూడా ఇంకిపోతున్నాయని అన్నారు. ఇటీవలే మండలానికి వచ్చిన చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దృష్టికి, అలాగే ఎమ్మెల్యే కె.ఎస్,ఎన్,ఎస్, రాజుకు కూడా ఈ సమస్యపై వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీటిపై అధికారులు, పాలకులు దృష్టి సారించి బాధిత గ్రామాలను సందర్శించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే బాధిత గ్రామాల ప్రజలు, వామ పక్షాలతో కలసి అందోళనకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
చిత్తశుద్ధితో రహదారి భద్రతా చర్యలు
తుమ్మపాల : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా, చిత్తశుద్ధితో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై రవాణా, పోలీసు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి మాసోత్సవాలు– 2025 పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు చాలా ముఖ్యమైనవన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షిత డ్రైవింగ్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. రహదారి భద్రత కార్యక్రమాలు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా చేపట్టాలన్నారు. ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుక్రవారం నుంచి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్స్, రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందితో వలంటీర్లను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ ఈనెల 18 నుంచి 21వ వరకు మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించడం, అధిక వేగంతో నడిపే వాహనాలను స్పీడ్ గన్‌తో గుర్తించడం, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి వాటిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జేసీ తెలిపారు. ఈనెల 22 నుంచి 23వ వరకు జాతీయ, రాష్ట్ర రహదారులలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఈనెల 24న డ్రైవర్లకు హెల్త్ చెకప్ చేయించడం, 25న అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, 26, 27 తేదీలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వాకథాన్‌లు నిర్వహించడం, 30, 31వ తేదీలలో బైక్ ర్యాలీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని జేసీ తెలిపారు. కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి జి. మనోహర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం.వెంకట నారాయణ, మోటార్ వెహికల్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా, పోలీస్, శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభం పోస్టర్, కరపత్రాలను విడుదల చేసి జేసీ -
అయ్యన్న ముంగిట్లో సీఎం రమేష్ హడావుడి రగులుతున్న కుంపటి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అయ్యన్న ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందడి చేశారు. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్టులో గత మూడు రోజులుగా మకాం వేసిన రమేష్... సంక్రాంతి వేడుకలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. ఇటువైపు కనీసం టీడీపీ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జరుగుతున్న మకర జ్యోతి మహోత్సవాలకు సీఎం రమేష్‌ను ఆహ్వానించలేదు. ఒకవైపు నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను తనకు తెలియకుండా బీజేపీలో చేర్చుకోవడంతోపాటు పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కనీస సమాచారం లేకుండా జరుగుతున్న చేరికలపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ప్రధాని సభ సందర్భంగా కూడా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని ఆయన కినుక వహించినట్టు తెలుస్తోంది. ప్రధాని సభకు జన సమీకరణ సందర్భంగా... నర్సీపట్నంలో మీరు చేర్చుకున్న నేతల ద్వారా జనాలను తరలించుకోండంటూ సీఎం రమేష్‌కు అయ్యన్న గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం. మొత్తంగా నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు రిసార్టు కేంద్రంగా జరిగిన సంక్రాంతి వేడుకలు కాస్తా కూటమిలో భోగి మంటలను మించి వేడిని రాజేశాయని అర్థమవుతోంది. కొరివితో తలగోక్కున్నట్టు...! వాస్తవానికి అనకాపల్లి ఎంపీ పోటీలో స్థానికేతరుడైన దిలీప్‌కుమార్‌కు సీటు ఇవ్వాలని టీడీపీ భావించింది. ఈ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్నపాత్రుడు... స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే మాట్లాడారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యరి్థగా సీఎం రమేష్‌ను బీజేపీ ప్రకటించింది. అనూహ్యంగా అయ్యన్నపాత్రుడు రమేష్‌ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియతిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్ తో సఖ్యతగా మెలిగారు. తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారు. దీంతో కొరివితో తలగొక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని అయ్యన్న వాపోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జనసమీకరణపై సీఎం రమేష్ అయ్యన్నను కదిపే ప్రయత్నం చేశారు. మీరు చేర్చుకున్న నాయకులతో జనాలను తరలించుకువెళ్లండంటూ అయ్యన్న గట్టిగానే బదులిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సంక్రాంతి సందర్భంగా సీఎం రమేష్ నర్సీపట్నంలో మకాం వేయడం చర్చనీయాంశమవుతోంది. సీఎం రమేష్ సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లతో పాటు ఓ డాక్టర్, జనసేన నేతలు సదరు ప్రైవేటు రిసార్టు వద్ద హడావుడి చేస్తున్నారు. అయితే, అటువైపు ఏ ఒక్క టీడీపీ నేత కానీ కార్యకర్త కానీ వెళ్లకపోవడం గమనార్హం. విశాఖ డెయిరీ డైరెక్టర్ల చేరికపై...! విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడిగా అసెంబ్లీలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్న ఏర్పాటు చేశారు. దీనిపై పార్టీలోని నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు తమ పార్టీలో విశాఖ డెయిరీ నేతలను చేర్చుకుంటున్నట్టు సీఎం రమేష్.... అయ్యన్నకు సమాచారమిచ్చినప్పటికీ ఆ విషయంలో ముందుకు వెళ్లడంపై కూడా సీఎం రమేష్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలోని ఇద్దరు విశాఖ డెయిరీ డైరెక్టర్లు సూర్యనారాయణ, రాజకుమారిలను బీజేపీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలోని డాక్టర్ కిలాడి సత్యనారాయణను కూడా తాజాగా ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ చేరిక వెనుక కూడా సీఎం రమేష్ ఉన్నట్టు అయ్యన్న మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియని సందర్భంలో ప్రతీ చోట పరిచయం చేసిన తననే లెక్కచేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్తా కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని చెప్పవచ్చు. అది నేనే.. ఇది నేనే..! -
ఘనంగా ముగిసిన ధనుర్మాసోత్సవాలు
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. నెలరోజులపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు మంగళవారం తిరువీధి సేవలతో ముగిశాయని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. ఉదయం కొండపై, కొండ దిగువన గల ఆలయాలు, ఉపాలయాల్లో అర్చక బృందం అభిషేకాలు, నిత్యపూజలు ధూపదీప నైవేద్యాలు విశేష హోమాలు, నిత్యసేవాకాలములు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి పుష్పతోటలో నీరాట ఉత్సవాలలో భాగంగా విశేష ఆరాధనలు నివేదనలు, సేవాకాలము నిర్వహించిన తర్వాత 30వ పాశురాన్ని విన్నపం చేశారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడంతో సంక్రాంతినాడు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మూలవిరాట్‌కు తెల్లవారు జామున పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కొండ దిగువన వేణుగోపాల స్వామి ఆలయంలో, ఆండాళ్లమ్మవారి సన్నిధిలోను స్వామివారు ఉత్సవమూర్తుల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండగ సందర్భంగా పద్మావతి, అలువేలుమంగా సమేతుడైన వేంకటేశ్వరస్వామి వారిని ఆంజనేయవాహనంలోను,గోదాదేవి అమ్మవారిని రాజాధిరాజవాహనంలోను వేంచేయింపజేసి గ్రామ మాడవీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు.రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు మంగళవారం ఉభయ దేవేరులతోకూడిన స్వామివారి ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంలో అధిష్టింపజేసి తిరువీధి సేవ నిర్వహించారు. మకర సంక్రాంతి, ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. -
జాతీయ సదస్సుకు మంచాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
అవార్డు అందుకుంటున్న వెంకటలక్ష్మి చీడికాడ: ఉత్తమ విద్యా విధానంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఏపీ నుంచి మంచాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ‘ఎక్సెంప్లర్స్ ఆఫ్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్–2025’ సదస్సు నిర్వహించింది. రాష్ట్రం నుంచి ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆమె ఉత్తమ విద్యా విధానాల అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఉపాధ్యాయులు ఎన్నో వినూత్న స్ఫూర్తిదాయకమైన విషయాలను నేర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడిందన్నారు. -
ఉత్సాహంగా గుర్రపు పరుగు పోటీలు
● విజేతలకు బహుమతులు అందజేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మునగపాక: మండల కేంద్రం మునగపాకలో కనుమ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలకు విశేష స్పందన వచ్చింది. మునగపాక నుంచి వాడ్రాపల్లికి వెళ్లే మార్గంలో సంతబయల యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ప్రారంభించి, విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా కనుమ పండగ రోజున రాజకీయాలకు అతీతంగా గుర్రపు పరుగు పోటీలు నిర్వ హించడం సంతోషకరమన్నారు. ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని చెప్పారు. హుషారుగా సాగిన ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన వారితో క్రీడాస్థలం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడుపాల్గొన్నారు.న్యాయనిర్ణేతగాఆడారిగోవింద్వ్యనహరించారు. నూక హనుమాన్ గ్రుర్రానికి ప్రథమ బహుమతి :జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీల్లో నూక హను మాన్ గుర్రం ప్రథమస్థానం పొందింది.పవన్ వాయుపుత్ర, ఉదయ్ దిలీప్,నవీన్,నవీన్ ధర్మలకు చెందిన గుర్రాలు ద్వితీయ,తృతీయ, చతుర్థ,పంచమ బహుమతులు పొందాయి. -
ఘనంగా పారువేట ఉత్సవం
● స్వయంభూ శ్రీ వరాహలక్ష్మీ నృసింహాస్వామి చీడికాడ: మండలంలోని అర్జునగిరిలో శ్రీదేవి,భూదేవి సమేత స్వయంభూ శ్రీవరాహలక్ష్మీ నృసింహాస్వామి పారువేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆలయానికి సమీపంలో గల దేవుని పనుకు వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వరుణదేవుని కరుణకోసం గొర్రె పిల్లకు తొక కోసి విడిచిపెట్టారు. ఆ గొర్రె పిల్ల ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కున ఈ ఏడాది అధిక వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయన్నది నమ్మకమని ఆలయ అర్చకులు పానంగిపల్లి శ్రీనివాసాచార్యులు చెప్పారు. ఈ ఏడాది పుట్టిన మగగొర్రె పిల్లనే ఈ వేటలో వినియోగిస్తారు. తోక కోసి విడిచిపెట్టిన గొర్రెను పట్టుకుని పనుకుపైకి తీసుకు వచ్చిన యువకులను ఉలవకాయల దండలతో సత్కరించారు.దీంతో స్వామి పారువేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవాన్ని వందల సంవత్సరాలనుంచి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ బి.రమాదేవి,ఎంపీటీసీ అమ్మతల్లినాయుడు తదితరులు తెలిపారు.అనంతరం స్వామి ఉత్సవమూర్తులతో పల్లకీ సేవ నిర్వహించారు. -
మాజీ డిప్యూటీ సీఎం బూడి కారుకు ప్రమాదం
● వేగంగా వచ్చి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనందేవరాపల్లి: మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కారును ద్విచక్ర వాహనం ఢీ కొట్టిందని స్థానిక ఎస్ఐ టి. మల్లేశ్వరరావు తెలిపారు. మాజీ మంత్రి తనయుడు బూడి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తారువ నుంచి మాజీ మంత్రి బూడి తన వాహనంలో బుధవారం మధ్యాహ్నం దేవరాపల్లి వస్తుండగా.. మారేపల్లి సమీపంలోని రోడ్డు మలుపు తిరిగే సమయంలో.. ఎదురుగా మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించి ముందుగానే తమ వాహనాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి నిలిపివేసిన తమ కారును బలంగా ఢీకొట్టడంతో తమ వాహనం ముందు భాగంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణిస్తుండగా, వేపాడ కిశోర్ ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారును ఢీకొట్టి పడిపోయిన యువకులను మాజీ డిప్యూటీ సీఎం తనయుడు వెంకటేష్ మానవతా దృక్పథంతో దేవరాపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పరీక్షించిన అనంతరం ఇంటికి పంపించేశారు. -
బడిలో రాజకీయ పాఠాలా?
దేవరాపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో రాజకీయ, మత, వివాహ కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సెలవు రోజుల్లో సైతం ఈ తరహా కార్యకలాపాలు నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని విద్యాశాఖ అధికార్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్‌లో జీవో సైతం జారీ చేసింది. అయితే ఆ జీవోకు కూటమి పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. దేవరాపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు పేరిట మంగళవారం రాజకీయపరమైన కార్యక్రమంతో పాటు పాఠశాల ఆవరణలోనే కోళ్ల పందెం ఏర్పాటు చేయడం వివాదస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడంపై మరింత దుమారం రేగింది. పాఠశాల భవనాలన్నింటికి రాజకీయ నాయకులతో కూడిన ఫ్లెక్సీ, బ్యానర్లను సైతం అతికించి రాజకీయాలకు వేదికగా మార్చడం పట్ల ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంత్రి లోకేష్ జీవోను అమలు చేసి తీరు ఇదేనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాంటప్పుడు జీవోలు జారీ చేయడం ఎందుకంటూ బాహాటంగా విమర్శిస్తున్నారు. కూటమికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాఠశాల ఆవరణలో రాజకీయ కార్యక్రమంతో పాటు బహిరంగంగా కోళ్ల పందెం నిర్వహించగా, ఇకపై ప్రతీ గ్రామంలో ఇదే పంథాలో నాయకులు, కార్యకర్తలు పయనించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదేనా జీవో అమలు తీరు.. కూటమి నేతల ఫ్లెక్సీలు, కోడి పందేల నిర్వహణపై సర్వత్రా నిరసన -
వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి
యలమంచిలి, కోటవురట్ల, అనకాపల్లి, రాంబిల్లి మండలాల్లో వేర్వేరు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని ఇంటర్ విద్యార్థి... యలమంచిలి రూరల్: మండలంలోని రేగుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం రైలు పట్టాలు దాటుతున్న ఓ విద్యార్థిని గుర్తుతెలియని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో పీఎన్ఆర్ పేటకు చెందిన అన్నం వరప్రసాద్(18) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక్కడ డౌన్ లైన్లో 711/23 వ నంబరు కిలోమీటరు వద్ద రైల్వే గ్యాంగ్మన్.. మృతదేహాన్ని చూసి తుని రైల్వే పోలీసులకు,రేగుపాలెం రైల్వేస్టేషన్లో స్టేషన్ సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.బహిర్భూమికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి యలమంచిలిలో ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు తుని ప్రభుత్వ రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.రేగుపాలెం రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. డివైడర్‌ను ఢీకొని.. అనకాపల్లి: జోనల్ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన నిమ్మకాయల ప్రకాష్(30) అనే వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందు తూ మృతిచెందినట్టు ఎస్ఐ రషీద్ తెలిపారు. పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏఎంసీ కాలనీకి చెందిన నిమ్మకాయల ప్రకాష్ మంగళవారం ద్విచక్రవాహనంపై ఏఎంసీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళుతున్న సమయంలో జోనల్ కార్యాలయం వద్ద వాహనానికి కుక్క అడ్డురావడంతో తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను స్థానికులు హుటాహుటిన ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడు తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. మెట్లపై నుంచి జారిపడి వృద్ధురాలు ... రాంబిల్లి (యలమంచిలి): ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి ఒక వృద్ధురాలు మృతి చెందినట్టు రాంబిల్లి సీఐ సీహెచ్. నరసింగరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు... రాంబిల్లి మండలం మురకాడ గ్రామానికి చెందిన గనిశెట్టి సత్యవతి (69)ఈనెల 13వ తేదీ ఉదయం ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నర్సింగరావు తెలిపారు. గాయపడిన వ్యక్తి మృతి యలమంచిలి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని తెరువుపల్లి గ్రామానికి చెందిన తుమ్మపాల నాగేశ్వరరావు(54) అనే వ్యక్తి విశాఖప ట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. ఈ నెల 13న నారాయణపురం కెనరా బ్యాంకుకు వెళ్లి యలమంచిలి–అచ్యుతాపురం రోడ్డు దాటుతున్న నాగేశ్వరరావును అచ్యుతాపురం నుంచి యలమంచిలి వైపు వస్తున్న స్కూటీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. యలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. వరాహనదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కోటవురట్ల: అన్నవరం శివారు వరాహనదిలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడంతో అటు నర్సీపట్నం రూరల్, ఇటు కోటవురట్ల పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో అప్పారావు అక్కడకు చేరుకుని కోటవురట్ల పరిధిగా తేల్చడంతో ఎస్ఐ రమేష్ మృతదేహాన్ని బయటకు తీయించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచినట్టు చెప్పారు. వివరాలు తెలిసిన వారు కోటవురట్ల పోలీసు స్టేసన్‌లో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.