Eluru
-
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
ఉంగుటూరు: ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులు పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టరు కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. మంగళవారం ఉంగుటూరు మండలంలో వ్యవసాయ అనుబంధ శాఖలైన పశుసంవర్ధక శాఖ, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానవన శాఖల పనితీరుపై పరిశీలన చేశారు. కై కరం, చేబ్రోలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని సందర్శించి ధాన్యం అమ్మకంలో ఇబ్బందులు తెలుసుకున్నారు. కలెక్టరు మాట్లాడుతూ రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది స్పష్టం చేశారు. చేబ్రోలులో అగ్రి ల్యాబ్‌ను పరిశీలించారు. తేమ శాతం లెక్కింపులో కొంతమంది మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమన్నారు. ఇబ్బంది పెట్టే మిల్లర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేబ్రోలు గొడౌన్లో గోనె సంచులు పరిశీలించారు. బాదంపూడి మత్స్య శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టరు వెంట వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఏడిఏ ఉషా రాజకుమారి, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టరు నాగలింగాచార్యులు, తహసీల్దారు పూర్ణచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రాగన్ సాగు అభినందనీయం : డ్రాగన్ పంట సాగు అభినందనీయమని కలెక్టరు వెట్రిసెల్వి రైతు మురళీకృష్ణంరాజును అభినందించారు. చేబ్రోలులో డ్రాగన్ పంట పండిస్తున్న విధానాన్ని పరిశీలించారు. యాంత్రీకరణతో అధిక దిగుబడులుభీమడోలు: సాగులో యాంత్రీకరణతో అధిక దిగుబడులు సాధ్యమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. భీమడోలు, పూళ్లలో మంగళవారం ఆమె పర్యటించారు. పూళ్ల గ్రామంలో రైతు పైడి వెంకట్రాజు పొలంలో యంత్రాల ద్వారా ధాన్యం నూర్పిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలంలోని కోతకు సిద్దంగా ఉన్న పొలంలో కలెక్టర్ కొడవలి పట్టి కోత కోశారు. యాంత్రీకరణ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు. -
పంట నియంత్రణ పాటించాలి
జంగారెడ్డిగూడెం/కొయ్యలగూడెం: రైతులు పంట నియంత్రణ పాటించాలని వర్జీనియా పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ అన్నారు. జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రంలో మంగళవారం ఆయన రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పొగాకు పండించే దేశాల్లో ఈ ఏడాది పొగాకు అధికంగా ఉత్పత్తయిన కారణంగా రైతులు పంట నియంత్రణ పాటించాలని కోరారు. ప్రస్తుత అంతర్జాతీయ పొగాకు మార్కెట్ పరిస్థితిని వివరించారు. పొగాకు సాగుకు అనువైన నేలలను ఎంపిక చేసుకుని నాణ్యమైన పొగాకు పండించాలని, లో గ్రేడ్ నివారించుకుంటూ ఎన్ఎల్ఎస్ బ్రాండ్ వాల్యూను కాపాడేలా అధిక నికోటిన్ ఇచ్చే కండ కలిగిన ఆరెంజ్ స్టైల్ పొగాకును పండించేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు బోర్డు నిర్దేశించిన పంట విస్తీర్ణం, పరిమాణానికి కట్టుబడి సాగు చేట్టాలన్నారు. రెండు వేలం కేంద్రాల అధికారులు, రైతు సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో రైతు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. -
21న నీటిపారుదల సలహా మండలి సమావేశం
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం ఈ నెల 21న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో నిర్వహిస్తారని ఇరిగేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్.దేవప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో గోదా వరి పశ్చిమ డెల్టాకు రబీ సీజన్‌కు సంబంధించి నీటి లభ్యత, 2024–25 రబీ పంట అనంతరం కాలువలు మూసివేత తేదీ నిర్ణయం, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పంట విస్తీర్ణం, సాటు ప్రణాళిక వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. -
హమాలీల జీతాలు పెంచాలి
ఏలూరు (టూటౌన్): పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీలకు ప్రతి రెండేళ్ల ఒకసారి జీతాలు పెంచుతూ ఒప్పందం చేసుకున్నారని, 2024 జనవరి కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ పౌరసరఫరాల సంస్థ గోడౌన్స్ జట్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా హమాలీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, యూనియన్ జిల్లా అధ్యక్షులు శేఖర్ మాట్లాడుతూ యూనియన్‌తో చర్చలు జరిపి తక్షణమే హమాలీల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కాలం పూర్తయి 11 నెలలైనా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. పౌరసరఫరాల శాఖలో మండల గ్రామ స్థాయిలో నిత్యావసరాలను రేషన్ షాపులకు చేరవేసే కార్మికుల కష్టానికి వెలకట్టలేమన్నారు. కార్మికులు ఎంతో కష్టపడి సరుకులను మండల స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాల్లో ఉన్న రేషన్ షాపులకు చేరవేస్తున్నారని తెలిపారు ఒక్కరోజు కూడా లేట్ కాకుండా పనిచేస్తున్నామని తమ కష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఏలూరు జిల్లాలోని ఏలూరు, పాతూరు, ధర్మాజీ గూడెం, జంగారెడ్డిగూడెం, కుకునూరు, కేఆర్ పురం, నూజివీడు, కై కలూరు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాంబాబు, దుర్గారావు, మస్తాన్ వలి, తదితరులు నాయకత్వం వహించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా జెట్టి గురునాథరావు
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు జెట్టి గురునాథరావు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జెట్టి గురునాథరావు ఎన్నికల ముందు పోలవరం నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. ఇటీవల పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధిష్టానం ఆయన సేవలు గుర్తించి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. 23న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఏలూరు (టూటౌన్): ఈ నెల 23న జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ హాలులో జరిగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో కరపత్రాల్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారోగ్యంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆప్కాస్ విధానాన్ని రద్దుచేసి కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న జంగారెడ్డిగూడెంలోని లయన్స్ క్లబ్ హాల్లో జనరల్ బాడీ సమావేశం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దొడ్డికార్ల నాగబాబు, యలగాడ దుర్గారావు, కసింకోట నాగేంద్ర, ఇంటి అశోక్, డి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మద్యం దుకాణం ఏర్పాటుపై దళితుల ఆందోళన పాలకోడేరు: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో దళిత వాడకు దగ్గరగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో దళిత వాడకు చెందిన మహిళలు, యువకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రార్ధన మందిరానికి దగ్గరగా, విద్యార్థులు, మహిళలకు ఇబ్బందికరంగా ఉండేలా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ షాపునకు పంచాయతీ ఎలా అనుమతులు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్మశాన వాటికకు వెళ్లడానికి వీలు లేకుండా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ మద్యం దుకాణాన్ని జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. లేసు పార్కు అభివృద్ధిపై చర్చలు నరసాపురం రూరల్: లేసు, అల్లిక పనులు చేసే మహిళల ఆర్థికాభివృద్ధి ప్రణాళికలపై నాబార్డు డీడీఎం అనిల్ కాంత్ మార్కెంటింగ్ రుస్తుంబాద లేసుపార్కు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. లేసు పార్కులో లేసు అల్లికల మహిళలకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు డీఆర్డీఏ సహకారంతో గతంలో లేసు పార్కులో మహిళలకు నిర్వహించిన చేతి వృత్తులకు సంబంధించి ఇచ్చిన శిక్షణ, తదితర అంశాలపై చర్చించారు. చేతి వృత్తుల అల్లికలతో పాటు ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఉత్పత్తుల విక్రయాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తామని నాబార్డు అధికారులు డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్‌కు హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన శిక్షణకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకునేందుకు ఎగ్జిమ్ బ్యాంకు సిబ్బంది కూడా లేసుపార్కును సందర్శించి డాక్యుమెంటేషన్ పూర్తి చేసే పనులు చేపట్టారు. -
వివిధ హోటళ్లపై కేసుల నమోదు
కార్తీక దీపోత్సవం కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మంగళవారం శివాలయాలు హర నామస్మరణతో మార్మోగాయి. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8లో uఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా పలు హోటళ్లపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి వీ.శ్రీరాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దెందులూరు మండలం, సింగవరంలో నిర్వహిస్తున్న గరుడ ఫుడ్ కోర్ట్‌లో కృత్రిమ రంగులు కలుపుతున్నారని వచ్చిన సమాచారం మేరకు తమ విజిలెన్సు అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆహార పదార్థాల తనిఖీ అధికారులు మంగళవారం తనిఖీ చేయగా నిల్వ ఉంచిన మాంసాహారం గుర్తించారన్నారు. ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు కలిపినట్లుగా వచ్చిన అనుమానంతో నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. గరుడ ఫుడ్ కోర్ట్‌లో లైసెన్స్ లేని రెండు ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలు, కేఎఫ్‌సీ ఫుడ్ కోర్ట్‌లో లైసెనన్స్ లేని ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాన్ని గుర్తించి లీగల్ మెట్రాలజీ అధికారి కేసులు నమోదు చేశారన్నారు. పెదపాడు మండలం, కలపర్రు టోల్ గేటు వద్ద నిర్వహిస్తున్న మురుగన్ హోటల్లో తనిఖీ చేయగా నిల్వ ఉంచిన మాంసాహారం గుర్తించామని, ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగులు కలిపినట్లుగా వచ్చిన అనుమానంతో నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు. ఈ హోటల్లో లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాన్ని గుర్తించి లీగల్ మెట్రాలజీ అధికారి కేసులను నమోదు చేశారన్నారు. -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ఏలూరు(మెట్రో): ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, బహిరంగ మలవిసర్జన నివారించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. సత్కారం పొందిన వారిలో ఏలూరు కార్పొరేషన్‌కు చెందిన ఎం.దుర్గారావు, జి.రంగారావు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మరుగుదొడ్డి అనేది ఆత్మగౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 19 నుంచి డిసెంబరు 10 వరకు హమారా సౌచాలయ్ – హమారా సమ్మాన్ నినాదంతో జిల్లా అంతటా రోజుకో కార్యక్రమాన్ని జరిపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. డిసెంబరు 5 వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్ల వాడకంపై, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామన్నారు. డిసెంబరు 10న మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. -
మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు విచ్చేసిన ఆయనకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి క్రైం రికార్డులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లాలో అభయ పేరుతో ఈ టీం పనిచేస్తుందన్నారు. కాలేజీలు, పాఠశాలలు, బస్టాప్‌లు ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు జరగకుండా ఈ టీంలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్‌గా కాలేజీలు, పాఠశాలల్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగా వారిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరిచి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి కేసుల్లో త్వరితగతిన విచారణను పూర్తి చేసి, ముద్దాయిలను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపి, చార్జ్షీట్లను దాఖలు చేస్తున్నామన్నారు. ఐదు, పదేళ్లుగా తమ రికార్డుల్లో ఉన్న గంజాయి, దొంగతనాలు, పోక్సో కేసుల్లోని నేరస్తుల ఫొటోలు, వారి వేలిముద్రలను డిజిటలైజ్ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శనివారం, ఇతర పర్వదినాల్లో జేబు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయానికి భద్రత కల్పించడంతో పాటు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వేళల్లో, ముఖ్యంగా పర్వదినాల్లో జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్ పరిధిలో పెద్ద సమస్యలేమీ లేవని, శాంతి భద్రతలు కూడా బాగానే ఉన్నాయన్నారు. చిన్న వెంకన్నను దర్శించుకున్న ఐజీ చినవెంకన్న ఆలయాన్ని ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్‌లు మంగళవారం సందర్శించారు. వారికి దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పు రాజగోపురం వద్ద మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి శ్రీవారి శేష వస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి స్వామివారి మెమెంటోలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్, భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల, భీమడోలు ఎస్సైలు టి.సుధీర్, సుధాకర్ ఉన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘాభీమడోలు: పాత నేరస్తుల కదలికలపై నిఘా మరింత పెంచుతున్నామని ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. భీమడోలు పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఆయన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌తో కలిసి తనిఖీ చేసారు. తొలుత పోలీసులు నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ -
కేసులా.. లైట్ తీస్కోండి!
సాక్షి, భీమవరం: మద్యం అమ్మకాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, ఏకంగా లైసెన్సే రద్దులంటూ పైకి కబుర్లు చెబుతారు. తీరా.. బెల్టు షాపు నిర్వాహకుడు దొరికితే ఐదారు బాటిల్స్‌తో పట్టుకున్నట్టు చూపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఆ బెల్టు నిర్వాహకుడికి బాటిల్స్ ఇచ్చి అమ్మకాలు చేయిస్తున్న మద్యం షాపు జోలికి మాత్రం పోరు. ఇది జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ తీరు. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు చేసినా, బెల్టు షాపులు ఏర్పాటు చేసినా మొదటిసారి రూ.ఐదు లక్షలు జరిమానా విధించాలని, రెండో సారి తప్పుచేస్తే షాపు లైసెన్స్ రద్దుచేయాలని ఇటీవల ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం విదితమే. లిక్కర్ బిజినెస్‌లో ఇలాంటి హెచ్చరికలు మామూలే అన్నట్టుగా సిండికేట్ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. షాపుల వద్ద పర్మిట్ రూంల మాదిరి సదుపాయాలు, గ్రామాల్లో బెల్టు షాపులు, అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిపోతున్నాయి. షాపులు ఏర్పాటయినప్పటి నుంచి ఇంతవరకు ఎకై ్సజ్ అధికారులు జిల్లాలో బెల్టుషాపు నిర్వాహకులపై దాడులు నిర్వహించి 71 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 289 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. బాటిల్స్ ఏ షాపులోవో తెలిసినా.. మద్యం బాటిల్స్‌పై ఉన్న బ్యాచ్ నెంబర్ల ఆధారంగా అవి ఏ షాపు నుంచి వచ్చాయనే విషయాన్ని ఎకై ్సజ్ అధికారులు ఇట్టే గుర్తిస్తారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో బెల్టు షాపునకు మద్యం బాటిల్స్ ఇచ్చిన షాపునకు రూ.5 లక్షల ఫైన్ వేయాలి. వాటి జోలికి వెళ్లడం లేదు. బెల్టు నిర్వాహకుడిపై నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. మద్యం సిండికేట్లకు స్థానిక ఎమ్మెల్యేల అండదండలు పుష్కలంగా ఉండటంతో వాటి జోలికి వెళ్లడం లేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చేలా కేసుల నమోదు చట్ట విరుద్దమే అయినా సంక్రాంతి పండుగల మూడు రోజులు కోడిపందేలు నిర్వహించడం తెలిసిందే. పందేలను అడ్డుకుని అరెస్టులు చేసినట్టుగా బైండోవర్ చేసేందుకు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, నాలుగైదు కోడిపుంజులు అప్పచెప్పాలని బరి నిర్వాహకులకు పోలీసులు ముందే చెబుతుంటారు. కోడి పందేలకు తెరవెనుక జరిగే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు సిండికేట్ నిర్వాహకులతో ఎకై ్సజ్ శాఖ నడుపుతోందన్న అనుమానాలున్నాయి. బెల్టు నిర్వాహకులపై దాడులు జరుగుతున్న తీరు, అక్కడ దొరికినట్టుగా చూపిస్తున్న బాటిళ్ల సంఖ్య ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇప్పటివరకు ఎకై ్సజ్ అధికారుల దాడుల్లో రెండు మూడు చోట్ల మాత్రమే పదికిపైగా బాటిళ్లు దొరికినట్టుగా చూపించగా మిగిలిన అన్ని చోట్ల తొమ్మిది బాటిళ్ల లోపే ఉంటున్నాయి. సాధారణంగా పదికి పైగా బాటిళ్లు దొరికితే నిందితుడ్ని, బాటిళ్లను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుందని న్యాయవాది ఒకరు తెలిపారు. పది బాటిల్స్ లోపు ఉంటే సెక్షన్ 34 (ఏ) కింద కేసు నమోదుచేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయవచ్చు. కోర్టులో నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జురిమానా పడుతుంది. మధ్యవర్తుల సాక్ష్యం లేకుండా లోపభూయిష్టంగా కేసులు నమోదు చేయడం వల్ల నేరం రుజువై శిక్ష పడిన ఘటనలు చాలా అరుదు. నేరం రుజువుకాకపోవడం వల్ల ఈ కేసులను కోర్టు కొట్టివేస్తుంది. ఎకై ్సజ్ అధికారులు కేసుల్లో తమ టార్గెట్లను చేరుకునేందుకు సిండికేట్ వర్గాల ద్వారానే ఒకరిద్దరిని పట్టుకుని తూతూమంత్రంగా కేసులు నమోదుచేయించి చేతులు దులుపుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఎం హెచ్చరికలను పట్టించుకోని మద్యం సిండికేట్ తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది మద్యం షాపుల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన గ్రామ గ్రామాన బెల్టుషాపులు, అధిక ధరలకు మద్యం విక్రయాలు -
రేషన్ బియ్యం పట్టివేత
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో పామర్తి రమేష్‌కు చెందిన కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ డీటీ వెంకటేశ్వర రావు తన సిబ్బందితో కలిసి దాడి పట్టుకున్నారు. రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్ లింగపాలెం: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. వివరాల ప్రకారం ధర్మాజీగూడెంకు చెందిన మేకల హరి గోపాల్ తన ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి బంగారపు నల్లపూసల గొలుసును అపహరించాడు. బాధితులు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
No Headline
భీమవరం (ప్రకాశంచౌక్), పెనుమంట్ర: కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మంగళవారం శివాలయాలు హర నామస్మరణతో మార్మోగాయి. పంచారామక్షేత్రం శ్రీఉమా సోమేశ్వర జనార్దనస్వామి వారి దేవస్థానంలో శ్రీఉమాసోమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, అష్టోత్తర దీపాలంకరణ పూజలు నిర్వహించారు. భీమవరం మెంటేవారి తోటలోని విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో లక్ష దీపోత్సవం, మహా లింగార్చన నిర్వహించారు. దీపోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రవత్తులతో దీపాలను వెలిగించారు. మార్టేరు గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల ఆవరణలో పార్దివ లింగేశ్వరునికి లక్ష బిల్వార్చన, జ్యోతిర్లింగార్చన పూజలు జరిపారు. -
ఆర్టీసీ కార్గో సేవల్లో ‘పశ్చిమ’ భేష్
తణుకు అర్బన్: ఆర్టీసీ కార్గో సేవల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు అన్నారు. మంగళవారం తణుకు ఆర్టీసీ డిపో ఆవరణలోని కార్గో కార్యాలయంలో కార్గో ఏజెంట్లకు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్గో కార్యాలయాలకు వచ్చే వినియోగదారులకు సత్వరమే సేవలందించాలని, మర్యాదపూర్వక సమాధానం అందించాలని ఏజెంట్లకు సూచించారు. కార్గో సేవలపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఏజెంట్లు కృషిచేయాలన్నారు. కార్గో సేవలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 25 శాతం గ్రోత్ సాధించి మొదటి స్థానంలో ఉండడానికి జిల్లాలోని 4 డిపోల మేనేజర్లు, కార్గో ఏజెంట్ల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. కార్గో బుకింగ్ ఏజెంట్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న వారికి కేవలం రూ.వెయ్యి డిపాజిట్‌తో ఈ అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్ సప్పా గిరిధర్‌కుమార్, సూపరింటెండెంట్ వెన్నా రమణమూర్తి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, సింగ్ సొల్యూషన్ టీం లీడర్ నవీన్, తణుకు నియోజకవర్గ కార్గో ఏజెంట్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు -
రూ.252 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ పనులు
కై కలూరు: రాష్ట్రంలో రూ.252 కోట్లతో అగ్నిమాపకశాఖ ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ జి.శ్రీనివాసులు చెప్పారు. కై కలూరు ఫైర్స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘ నిధుల్లో అగ్నిమాపక శాఖకు రూ.252 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర వాటా ఉందన్నారు. ఈ నిధులతో 100 నూతన ఫైర్ వెహికల్స్, 17 నూతన అగ్నిమాపక కేంద్రాలు, మరో 37 అగ్నిమాపక కేంద్రాల ఆధునికీకరణ పనులు చేయనున్నట్లు చెప్పారు. భారీ వాహనాలు చేరుకోలేని ఇరుకు ప్రాంతాల్లో మంటలను అదుపు చేయడానికి 300 లీటర్ల కెపాసిటీ కలిగిన 50 క్విక్ రెస్పాండ్ వెహికల్స్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. ముఖ్యంగా 108 మాదిరిగా 112 కాల్ కమాండ్ సెంటర్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాలకు ఏర్పాటు చేసిన జీపీఎస్ సిస్టం ద్వారా కాలర్ లొకేషన్‌ను గుర్తించి త్వరగా ఘటనా స్థలానికి చేరే అవకాశం ఉందన్నారు. విజయవాడలో 15 అంతస్తుల వరకు చేరే యంత్రాన్ని జపాన్ నుంచి కొనుగోలు చేశామన్నారు. అదే విధంగా విశాఖపట్టణంలో 30 అంతస్తులు చేరే యంత్రాన్ని పిన్‌ల్యాండ్ నుంచి తీసుకొచ్చామన్నారు. విపత్తు సమయంలో పనిచేసే విధంగా నైపుణ్యాలు పెంపొదించుటకు సిబ్బందికి నాగపూర్, బెంగుళూరు, ఒరిస్సాలో శిక్షణ అందించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. విపత్తుల కాలంలో కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక శాటిలైట్ వ్యవస్థతో ఫైర్ వెహికల్స్‌ను అనుసంధానం చేస్తామన్నారు. కొల్లేరు ప్రాంత ఆక్వా దుకాణాల్లో బ్లీచింగ్ నిల్వ వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. వ్యాపారులందరికీ ప్రమాద నివారణలపై అవగాహన కలిగిస్తామన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి త్వరలో ఫైర్‌స్టేషన్ అందుబాటులోకి వస్తాయన్నారు. కై కలూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల నివేదిక అందిస్తే మరో ఫైర్ స్టేషన్ ఏర్పాటుపై ఆలోచన చేస్తామన్నారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ కె.క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ శ్రీనివాసులు -
పోక్సో కోర్టులో ముద్దాయికి జీవిత ఖైదు
ఏలూరు (టూటౌన్): ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచార యత్నం చేసి ఆపై హత్య చేసిన ఘటనలో ఏలూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. గణపవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 38/2017కు సంబంధించి కేశవరం గ్రామానికి చెందిన బొడ్డు ఏసుపై నేరం రుజువు కావడంతో 302 ఐపీసీ సెక్షన్ల కింద జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. సాక్ష్యాలను తారుమారు చేసిన నేపథ్యంలో 7 సంవత్సరాలు జైలు, రూ.2 వేల జరిమానా విధించారు. బాధితురాలు కుటుంబానికి రూ.రెండు లక్షలు పరిహారం చెల్లించే విధంగా న్యాయమూర్తి ఎస్.ఉమా సునంద తీర్పును వెలువరించారు. 2017 మార్చి 29న రెండున్నర సంవత్సరాల బాలిక కేశవరం గ్రామంలో సంతమార్కెట్ వద్ద ఉన్న ఇంటి బయట మంచంపై నిద్రిస్తుంది. ఆ సమయంలో బాలిక తాతయ్య బొడ్డు ఏసు(50) పక్కనే ఉన్న పంట పొలాల వద్దకు బాలికను తీసుకెళ్లి ఆమైపె అత్యాచార ప్రయత్నం చేశాడు. బాలికకు రక్తస్రావం కావడంతో ఎవరికై నా చెబుతుందనే భయంతో ఆమెను పంట బోదెలో కి పలుమార్లు తొక్కి చంపేశాడు. ఈ విషయంపై బాలిక తల్లి బొడ్డు పోచమ్మ అప్పట్లో గణపవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై ఎం.వీరబాబు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ ఎం.వెంకటేశ్వరరావు దర్యాప్తు చేశారు. ఇదేకేసులో సీఐ దుర్గాప్రసాద్ ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో తదుపరి విచారణను రిటైర్డ్ డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు తన వాదనలను వినిపించారు. సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చిన సీఐ ఎంవీ సుభాష్, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై మణికుమార్లను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు. -
2,800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
నూజివీడు: చాట్రాయిలో మంగళవారం ఎకై ్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2,800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, బానోతు రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. అలాగే దాడులు నిర్వహిస్తుండగా పారిపోయిన బాణావతు కృష్ణ, అజ్మీర శ్రీనులపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు వై ఈశ్వరరావు, ఎం ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. బయ్యన్నగూడెంలో చైన్ స్నాచింగ్ కొయ్యలగూడెం: బయ్యనగూడెంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుంకర సత్యవతి మెయిన్ రోడ్డు లోని తన కుమారుడి షాపు నుంచి సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి వెళుతుండగా ఎస్సీ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేసరికి హెల్మెట్ పెట్టుకుని ఉన్న దుండగుడు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని సుమారు నాలుగు కాసుల బంగారు తాడును లాక్కోని పారిపోయాడు. ఈ ఘటనపై సత్యవతి భర్త సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సౌత్‌జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు విష్ణు విద్యార్థి భీమవరం: సౌత్‌జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి వి ప్రదీప్‌చంద్ర ఎంపికై నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. విజయవాడలోని వీఆర్ సిద్ధార్ధ కళాశాలలో ఈనెల 15వ తేదీన నిర్వహించిన జేఎన్టీయూకే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ప్రదీప్‌చంద్ర ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యాడన్నారు. డిసెంబర్లో పంజాబ్ రాష్ట్రంలోని ఛండీగడ్ యూనివర్సిటీలో నిర్వహించే సౌత్‌జోన్ పోటీల్లో ప్రదీప్‌చంద్ర పాల్గొంటాడన్నారు. అనంతరం క్రీడాకారుడ్ని కళాశాల ప్రిన్సిపాల్ ఎం వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. పాందువ్వలో చోరీ ఉండి: ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వివరాల ప్రకారం ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన అల్లూరి రవికుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోంలో భాగంగా పాందువ్వలోని ఇంటివద్దనే ఉండి విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పిల్లలకు పరీక్షలు ఉండడంతో ఈ నెల 15వ తేదీన కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి 18వ తేదీ ఉదయం 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.50 వేలు, రూ.45 వేల విలువైన వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఎక్కడికక్కడ బెల్టు షాపులు
జిల్లాలో 175 మద్యం దుకాణాలకు 61 షాపులు పట్టణ ప్రాంతాల్లో, మిగిలిన 114 షాపులు పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టు షాపులు, పాయింట్ల పేరిట అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వేలం పాటలు, మరికొన్ని చోట్ల రూ. 50 వేలు నుంచి రూ.1.5 లక్ష వరకు డిపాజిట్లు చెల్లించిన వారికి, కూటమి కార్యకర్తలకు సిండికేట్లు బెల్టు నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. చిన్న దుకాణాలు, కిళ్లీ బడ్డీల్లో బాటిళ్లు ఉంచి క్వార్టర్, బీర్ బాటిల్‌కు ఎమ్మార్పీపై అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు అమ్మకాలు చేస్తున్నారు. -
కోళ్ల వ్యర్థాల వాహనాల సీజ్
పెదపాడు: అక్రమంగా తరలిస్తున్న 3 కోళ్ల వ్యర్థాల వాహనాలను సీజ్ చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. నాయుడుగూడెం, వెంకటాపురం, రాజుపేట గ్రామాల వద్ద మూడు వాహనాల్లో కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. వాహన యజమాని, డ్రైవర్, చెరువు యజమానులపై చర్యలు చేపడతామన్నారు.పాఠశాలల్లో ప్రస్తుత పనివేళలే కొనసాగించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాలల్లో ప్రస్తుత పనివేళలే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బీఏ సాల్మన్ రాజు, ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీ రామారావు, బీ రెడ్డి దొర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో చదువుకోవడానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు వస్తారని, సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు కొనసాగించడం వలన వారు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. పాఠశాలల పనివేళలు పెంచడం వలన క్రీడలకు కూడా సమయం ఉండదని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని కోరారు. -
యువతి అదృశ్యంపై కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ పీసీహెచ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన యువతి ఏలూరు డెంటల్ కాలేజీలో చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 18న స్పెషల్ కేసు ఉందని చెప్పి ఏలూరు వెళ్లిందని, అనంతరం యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి అదృశ్యం వెనుక శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సీహెచ్ దిలీప్, మరో ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు. -
కన్నాపురం.. యువతకు ఆదర్శం
కొయ్యలగూడెం: ఆ యువకులు తమ ఆలోచనా, ఆచరణలతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాభాపేక్ష లేకుండా వ్యాపారం నిర్వహించడమే కాకుండా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించి శభాష్ అనిపించుకుంటున్నారు. కన్నాపురం గ్రామానికి చెందిన యువకులు సమిష్టిగా ఏర్పడి దీపావళి వేడుకకు గ్రామంలో ఫ్రెండ్స్ దీపావళి టపాసుల షాప్ పేరిట బాణసంచా దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో వచ్చిన లాభాన్ని గ్రామ సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తుండడంతో దాదాపు రూ.ఆరున్నర లక్షల వరకు పొదుపు పెట్టారు. దీంతో గ్రామంలో రూ.రెండున్నర లక్షలతో శ్రీ సత్యసాయి వాటర్ ట్యాంక్, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంవద్ద 1.20 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్, ప్రమాదకరంగా ఉన్న కాలువలో ప్రయాణికుల రక్షణార్థం రూ.1.10 లక్షలతో పడమటి కాలువకు ఇరువైపులా సేఫ్టీ పోల్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రంథాలయం, అదేవిధంగా పీహెచ్సీ ఏర్పాటు చేయాలని సంకల్పంతో కొనసాగుతున్నామన్నారు. యువకుల లాభాపేక్ష లేని ఆలోచనలకు గ్రామ పెద్దలు కూడా ఒకే మాట మీద నిలబడి పార్టీలకు అతీతంగా వారికి సహకరిస్తూ బాణాసంచా దుకాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. గ్రామస్తులంతా ముందుగానే తీర్మానం చేసి వేరొక షాపునకు అవకాశం లేకుండా వీరిని ప్రోత్సహిస్తున్నారు. ఆ యువకులే వీరంతా ఫ్రెండ్స్ టీమ్‌లో బొమ్మ జయ సూర్య వినయ్‌కుమార్, నల్లజర్ల అనిల్ కుమార్, వీఎం సాయికుమార్, గుడిమెట్ల సుబ్రహ్మణ్యం, మట్టే వెంకట శ్రీనివాసరావు, అద్దేపల్లి కేశవ సత్యనారాయణ, బొమ్మ తేజా సాయికుమార్, ఉప్పల మణికంఠ సతీష్, గుడిమెట్ల నరసింహరావు, గుడిమెట్ల రాంబాబు, నల్లజర్ల సునీల్‌కుమార్, వెత్సా రాజేష్‌కుమార్, మద్దు మణికంఠ, కేవిబి శ్రేష్టి, అద్దేపల్లి సాయి మణితేజ, బొమ్మ వంశీకృష్ణ, బొమ్మ ఫణిరాజా తదితరులు ఉన్నారు. గ్రామంలో దీపావళి బాణసంచా దుకాణాన్ని నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ టీం వచ్చిన లాభాన్ని గ్రామాభివృద్ధికి వెచ్చిస్తూ స్ఫూర్తి నింపుతున్న యువత గ్రామస్తులంతా ప్రోత్సహిస్తున్నాం ఫ్రెండ్స్ దీపావళి టపాసుల షాప్ టీం సభ్యులను గ్రామస్తులంతా ఏకమై ప్రోత్సహిస్తున్నాం. మేమంతా అదే షాపు వద్ద బాణసంచా కొనుగోలు చేసి మా వంతు సహాయం అందిస్తున్నాం. పోటీ కోసం వేరొక షాపు పెట్టుకునే వారిని అనునయించి గ్రామ పెద్దల సహకారంతో ఏకాభిప్రాయాన్ని సాధిస్తున్నాం. – కొల్లంశెట్టి కళ్యాణ్. కన్నాపురం గ్రామస్తుడు అందరికీ మేలు కలిగేలా.. దీపావళి వేడుక ఏ ఒక్క మత సామాజిక వర్గానికి చెందినది కాకుండా మా గ్రామంలో అన్ని సామాజిక వర్గాల వారు ఆనందంతో నిర్వహించుకుంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా ఉండే వనరులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. – మట్టే శ్రీనివాసరావు, ఫ్రెండ్స్ దీపావళి టపాసుల షాప్ టీం సభ్యుడు, కన్నాపురం -
11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
ఏలూరు (టూటౌన్): భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 11న అయోధ్య – కాశీ పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని రైల్వే స్టేషన్లలో ఆగుతుందన్నారు. వచ్చే నెల 11న సికింద్రాబాద్‌లో బయలుదేరి తిరిగి 20వ తేదీన సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. మొత్తం యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటాయన్నారు. యాత్రలో భాగంగా పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయాలోని విష్ణుపాద దేవాలయం, వారణాసిలోని కాశీ విశ్వనాధ ఆలయం, కాశీవిశాలాక్ష్మి, అన్నపూర్ణదేవి ఆలయాల సందర్శన ఉంటుందన్నారు. కాశీలో సాయంత్రం గంగా హారతి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. అయోధ్యలోని సరయు నది ఒడ్డున రామజన్మభూమి, హనుమాన్ గర్హి, ఆరతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దర్శనాలు ఉంటాయన్నారు. రైలులో మూడు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. స్లీపర్ క్లాస్ నందు ఒక్కొక్కరికి టిక్కెట్ వెల పెద్దలకు రూ.16,800, పిల్లలకు రూ.15,600, స్టాండర్డ్ ధర్డ్క్లాస్ ఏసీ ప్రయాణానికి పెద్దలకు రూ.26,650, పిల్లలకు రూ.25,340, సెకండ్ ఏసీ క్లాస్ టిక్కెట్ పెద్దలకు రూ.34,916, పిల్లలకు రూ.33,330గా నిర్ణయించడం జరిగిందన్నారు. -
గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మట్టి మాఫియాకు కేంద్రంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని తాడిపూడి కాల్వ గట్లకు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తూట్లు పొడుస్తున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వందలాది లారీల మట్టిని స్వాహా చేస్తున్నారు. ఇందులో దాదాపు 300కు పైగా లారీల మట్టితో ఎమ్మెల్యేకు చెందిన స్కూల్ గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు. దీని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని అంచనా. నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట, గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని తెలికిచర్లలో గ్రావెల్ తవ్వకాలకు ఎమ్మెల్యే తెగబడ్డారు. వారం రోజుల క్రితం వరకు జనసేన, టీడీపీ చోటా నేతలు గ్రావెల్ తవ్వకాలు కొనసాగించగా.. ఆ తరువాత ఎమ్మెల్యే బొలిశెట్టి రంగంలోకి దిగి సొంతంగా దందా నిర్వహిస్తున్నారు. జగ్గన్నపేటలో ఉన్న తాడిపూడి గట్లను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జికి గ్రావెల్ వంతు వచ్చింది. సోమవారం నుంచి ఆయనకు చెందిన లేఅవుట్లు, స్థలాలకు జగ్గన్నపేట నుంచే గ్రావెల్ తవ్వకం ప్రారంభమైంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు పోలీస్ కౌన్సెలింగ్పార్టీ కోసం తాము తంటాలు పడుతుంటే.. తమ ఊళ్లోకి ఎవరో వచ్చి మట్టి తవ్వకుంటున్నారంటూ జగ్గన్నపేటకు చెందిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న ఐదుగురినీనాలుగు రోజుల నుంచి తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి పంపుతూ కౌన్సెలింగ్ పేరిట పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.స్పందించని జిల్లా కలెక్టర్ఈ విషయంపై కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేయడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ పలుసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించని పరిస్థితి నెలకొంది. స్థానికులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. -
నిందితులకు రాజకీయ అండ
చాట్రాయి : మండలంలోని పోతనపల్లికి చెందిన వై ఎస్సార్ సీపీ కార్యకర్త కాణంగుల చందూపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపర్చి మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు చర్య లు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. ఈనెల 15న మంకొల్లుకి చెందిన టీడీపీ కార్య కర్తలు బి.మధు, మరో నలుగురు కలిసి చందూపై రాడ్లతో దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి వాంగ్మూలం తీసుకుని 108లో చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. అక్క డి నుంచి మెరుగైన వైద్యం కోసం చందూను ఏలూ రు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాధితుడు ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. నిందితులు గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీని పై ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా కేసు న మోదు చేశామని, ఆస్పత్రి నుంచి బాధితుడి మెడికల్ రిపోర్ట్ రాలేదని వచ్చిన తర్వాత నిందితులను రిమాండ్‌కు పంపిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణుల దాడి పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు -
82 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు
ఏలూరు(మెట్రో): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 82 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించినట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈనెల 23న ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నా రు. డిసెంబర్ 9 వరకు క్లయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. 30 వేల ఎకరాల్లో మామిడి ఏలూరు(మెట్రో): జిల్లాలో 30 వేల ఎకరాల్లో మా మిడి తోటలు సాగుచేస్తున్నారని, రైతు సేవ కేంద్రా ల ద్వారా సూచనలు, సలహాలు అందిస్తున్నామని జిల్లా ఉద్యాన అధికారి ఎస్.రామ్మోహన్ తెలి పారు. 250 హెక్టార్లలో మామిడి తొడుగులు (ఫ్రూట్ కవర్స్) లక్ష్యంగా నిర్దేశించామని, రాయితీలు ఇస్తామని, దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
చందూకు పరామర్శ
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కె.చంద్రశేఖర్ (చందూ)ను సోమవారం రాత్రి నూజివీడు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరా మర్శించారు. మూడు క్రితం బియ్యం అక్రమ వ్యాపారి, టీడీపీ నాయకుడు బుల్లినేని మధు, తన మేనల్లుడు మురళీ అనుచరులతో కలిసి చందూపై దాడి చేసి గాయపర్చారు. వారు చేసే అక్రమ వ్యాపారానికి అడ్డువస్తున్నాడన్న కక్షతో గోనెల వాగు దగ్గర దాడి చేశారు. టీడీపీ నేతలు చేసే అక్రమ బియ్యం రవాణాను ప్రశ్నిస్తున్నారన్న కారణంగా చందూపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. -
మద్యం దుకాణంతో మూడు గ్రామాలకు ఇబ్బందులు
కై కలూరు: మద్యం దుకాణం ఏర్పాటుతో మూ డు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారంటూ సోమవారం వదర్లపాడు గ్రామంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వదర్లపాడు శ్మశాన వాటిక సమీపంలో రైస్‌మిల్లు వద్ద మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా సర్పంచ్ వడుపు లక్ష్మీ నాగదేవి ఆధ్వర్యంలో ని రసన తెలిపారు. వదర్లపాడు, నరసాయిపాలెం, శీతనపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారని, ఇటుగా విద్యార్థులు పాఠశాలలకు వెళతారన్నారు. సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయన్నారు. విషయం తెలిసిన కై కలూరు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ ఎస్కే రమేష్, ఎస్సై ఆదినారాయణ ఇక్కడకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించారు. ‘చింతలపూడి’ నిర్వాసితుల ఆందోళన ఏలూరు (టూటౌన్): చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు కొత్త అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలని, ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలంటూ చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూ ముల విలువ పెరుగుతున్నా తొమ్మిదేళ్లు క్రితం ప్రకటించిన అవార్డును ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణం అన్నారు. తక్కువ పరిహారం ఇస్తూ అన్యాయం చేయాలనుకోవడం సరికాదన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు ఎస్.వరలక్ష్మి, కుప్పాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వేతన బకాయిలు చెల్లించాలి నూజివీడు: ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, ఆయాలకు, నైట్ వాచ్మెన్లకు ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఏఐసీసీటీయూ) జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఏఐసీసీటీయూ అనుబంధ మధ్యాహ్న భోజన, శానిటేషన్, నైట్‌వాచ్ మెన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అఖిలభారత ప్రగతి శీల మహిళా సంఘం సభ్యురాలు పల్లిపాము భవాని, కార్మికులు పాల్గొన్నారు. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎస్ఎస్సీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్టు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 వరకు ఫీజులు చెల్లించవచ్చని, రూ.50 ఫైన్ తో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 9 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 16 వ రకు ఫీజులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ.110, ఒకేషనల్ విద్యార్థులు రూ.125తో పాటు అదనంగా రూ.60 చెల్లించాలని, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం రూ.125తో పాటు అదనంగా రూ.80 చెల్లించాలని సూచించారు. ‘ఓపెన్’ ప్రవేశాలకు గడువు పెంపు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో (2024–25) ప్ర వేశాలకు గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుకు రూ.600 అపరాధ రుసుంతో ఈనెల 25 వరకు గడువు ఉందని తెలిపారు.