ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సంతోషించాల్సిన వార్తే కానీ.. ఇంకో పది రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఈయన ఒక్కరినే మంత్రిని చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అజహర్‌పై తీవ్రమైన అభియోగాలు మోపుతూ, మతపరంగా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేరుగా ఆరోపణలు చేయకుండా, రేవంత్ ఈ పదవి మైనార్టీలను మోసం చేయడానికి ఇచ్చారని, ఇది ఆరు నెలల పదవేనని వ్యాఖ్యానిస్తోంది.
మైనార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసిందన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల సంఖ్య సుమారు లక్ష. పైగా రాష్ట్ర కేబినెట్‌లో మైనార్టీలెవరూ లేకపోవడంపై అసంతృప్తి ఉందని సీఎం రేవంత్‌కు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధంగా మంత్రి పదవి ఇవ్వడమేమిటని బీజేపీ ప్రశ్నించింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ కూడా ఉప ఎన్నికల సమయంలోనే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో ఈ వాదన వీగిపోయినట్లయింది. బీజేపీ మైనార్టీల ప్రయోజనాలకు అడ్డుపడుతోందని, గవర్నర్‌పై కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం జరక్కుండా చూసే ప్రయత్నమూ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ అనుభవం లేకపోతే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఉండేదేమో.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లోనే అధికారం చేపట్టినప్పటికీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో కేబినెట్‌లో ఈ వర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశించినా సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజహర్‌ను మంత్రిని చేయడం మైనార్టీ ప్రాతినిథ్యం కోసం కాదని, ఉప ఎన్నికల్లో పరిస్థితి అంత బాగాలేదన్న సమాచారంతోనేనని కొందరు విశ్లేషకుల అంచనా. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు సీఎం రేవంత్‌ను సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచార సభే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెబుతున్నా లోలోపలి అనుమానం కారణంగానే మైనార్టీ వర్గానికి చెందిన అజహర్‌ను మంత్రి చేశారని వీరు అంటున్నారు.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణంగా జరిగేదే కానీ.. ఓటమి ప్రభావం రాష్ట్రం మొత్తమ్మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని అంచనా. ఇప్పటివరకూ జరిగిన సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. కొందరు మైనార్టీ నేతలను కూడా ఆకర్శించడం కూడా కాంగ్రెస్ దృష్టిని మీరిపోలేదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున సీఎం సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావులు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. దీంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మైనార్టీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నాయి.
ఇంతకీ అజహర్ నియామకం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమా? కాదా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా వ్యవహరించరాదనే చెప్పాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు రాకపోయినా, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయయపడ్డారు. అయితే ఈ కాలంలో రాజకీయ పార్టీల నుంచి నైతికత ఆశించడం అత్యాశే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అజహర్‌పై దేశద్రోహంతోపాటు తీవ్రమైన కేసులున్నాయని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన అజహర్‌కు ఆ తరువాత ఫిక్సింగ్ అభియోగాల మరకలూ అంటాయి. క్రికెట్‌కు దూరమయ్యారు. రాజకీయాలకు దగ్గరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత రాజస్థాన్ నుంచి పోటీ చేశారు కానీ గెలవలేదు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ ప్రముఖుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగాలని ఆశించినా టిక్కెట్ నవీన్ యాదవ్‌కు ఇవ్వాలన్న రేవంత్ నిర్ణయంతో అది జరగలేదు. అజహర్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం కూడా వ్యతిరేకించిందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది కానీ.. దానికి ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అంటే.. ఎమ్మెల్సీ కాకముందే అజహర్ నేరుగా మంత్రి అయ్యారన్నమాట. ఇంకో ఆరు నెలల్లోపు అజహర్ ఎమ్మెల్సీ కాలేకపోతే మంత్రి పదవి వదలుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి మూడు నెలల క్రితమే అజహర్‌ను మంత్రిని చేయడంపై నిర్ణయం జరిగిందని మహేష్ గౌడ్ చెబుతున్న మాటలు నమ్మ శక్యంగా లేవు. ఎందుకంటే కొంత కాలం క్రితమే ఆయన అజహర్‌కు మంత్రి పదవి ఇస్తున్న సంగతి తనకు తెలియదని చెప్పారు. ఏతావాతా... అజహర్‌కు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? లేదా? అన్నది ఇంకో పది రోజుల్లో తేలనుంది!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


