భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్ను సైతం కొనియాడారు.
అయితే తమ టీమ్ రన్నరప్గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్గా నిలిచిన భారత మహిళల టీమ్పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.
స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.


