Womens ODI World Cup
-
50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు
ఎనిడ్ బెక్వెల్.. ఇంగ్లీష్ మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్ బెక్వెల్ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది. ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్వెల్ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్ బెక్వెల్.. వరల్డ్‌కప్ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్ బెక్వెల్ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్ బెక్వెల్ క్రికెట్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్ బెక్వెల్ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే -
భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్
దుబాయ్: భారత్ మరో క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు. ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. ఇవన్నీ రొటీన్ ఈవెంట్లు... అయితే ఈ ఎఫ్టీపీలో కొత్తగా మహిళల చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి చోటిచ్చారు. ఈ టోర్నీని 2027లో శ్రీలంకలో నిర్వహిస్తారు. టి20 ఫార్మాట్లో ఆరు జట్లే పాల్గొనే ఈ టోర్నీలో శ్రీలంక అర్హత సాధిస్తేనే ఆతిథ్య వేదికవుతుంది. లేదంటే మరో దేశానికి ఆతిథ్య అవకాశం దక్కుతుంది. -
Starc-Healy: నాడు భర్త, నేడు భార్య.. చరిత్ర సృష్టించిన ఆసీస్ జంట
మహిళల వన్డే ప్రపంచకప్ 2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీకి జతగా మరో ఓపెనర్ రేచల్ హేన్స్ (68), వన్ డౌన్ బ్యాటర్ మూనీ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నతాలీ స్కీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ (3/64), జెస్ జోనాస్సెన్ (3/57), మెగాన్ షట్ (2/42) ధాటికి 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో పాటు వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ శతకం (129) బాదిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. Alyssa Healy gives another master class in a World Cup final. 170 runs from 138 balls as Australia fly high @cricketworldcup #CWC22 #Final #TeamAustralia pic.twitter.com/ZcXNrvLMDY — Anjum Chopra (@chopraanjum) April 3, 2022 కాగా, 2022 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 56.56 సగటున 2 సెంచరీలు, 2 హాఫసెంచరీల సాయంతో 509 పరుగులు చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అలీసా హీలీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 🔥 Player of the Match of #T20WorldCup 2020 Final 🔥 Player of the Match of #CWC22 Final Champion, @ahealy77 👑 pic.twitter.com/TxvRbbffDy — ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హీలీ తాజాగా ఆ ఘనతను మరోసారి సాధించింది. ఇదిలా ఉంటే.. హీలీ భర్త, స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2015లో భర్త ఆసీస్ వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. తాజాగా భార్య తన దేశాన్ని ఏడోసారి జగజ్జేతగా నిలిపింది. చదవండి: World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా -
వారెవా వ్యాట్... సిక్సర్ సోఫీ..!
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్ జట్టు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో ఓడి ఒక దశలో లీగ్ స్థాయిలోనే నిష్క్రమించేలా కనిపించిన టీమ్...మ్యాచ్ మ్యాచ్‌కు పదునైన ఆటను ప్రదర్శిస్తూ ఆరో సారి మెగా టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్యానీ వ్యాట్ (125 బంతుల్లో 129; 12 ఫోర్లు) శతకంతో చెలరేగగా, సోఫీ డన్‌క్లీ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్ (30)దే అత్యధిక స్కోరు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. శతక భాగస్వామ్యం... ఓపెనర్ బీమాంట్ (7), కెప్టెన్ హీతర్ నైట్ (1), సివర్ (15) విఫలం కాగా, ఎమీ జోన్స్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అయితే వ్యాట్, డన్‌క్లీ కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరిని నిలువరించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా వ్యాట్ ఇచ్చిన ఐదు క్యాచ్‌లు వదిలేసి (22, 36, 77, 116, 117 పరుగుల వద్ద) సఫారీ టీమ్ ప్రత్యర్థికి మేలు చేసింది! ఈ క్రమంలో 98 బంతుల్లోనే వ్యాట్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు పార్ట్నర్షిప్ వంద పరుగులు దాటిన తర్వాత 45వ ఓవర్లో వ్యాట్ వెనుదిరిగింది. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 75 పరుగులు చేసింది. టపటపా... 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో సెమీస్‌లోనే ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారీ అదే తరహాలో వెనుదిరిగింది. ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీలో టాప్ స్కోరర్ అయిన లౌరా వాల్వార్ట్ (0) డకౌట్‌తో దక్షిణాఫ్రికా పతనం మొదలు కాగా, ఆ తర్వాత ఒక్కరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయారు. 67/4 తర్వాత ఎకెల్‌స్టోన్ జోరు మొదలైంది. తర్వాతి ఆరు వికెట్లూ ఆమె ఖాతాలోనే చేరడం విశేషం. -
మిథాలీ రాజ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు .. ప్రపంచకప్ చరిత్రలో..!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (84 బంతుల్లో 68; 8 ఫోర్లు) చేసిన ఆమె.. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన భారత మహిళా బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించింది. Youngest Indian to score 50 in WC - Mithali Raj Oldest Indian to score 50 in WC - Mithali Raj Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P — BCCI Women (@BCCIWomen) March 27, 2022 యాదృచ్చికంగా ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత చిన్న వయసులో, ఇదే ప్రత్యర్ధిపై (దక్షిణాఫ్రికా) హాఫ్ సెంచరీ (2000 వన్డే ప్రపంచకప్‌లో) చేసిన భారత మహిళా బ్యాటర్ రికార్డు కూడా మిథాలీ పేరిటే నమోదై ఉంది. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో అతి చిన్న వయసులో, అతి పెద్ద వయసులో ఒకే ప్రత్యర్ధిపై హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డుల్లోకెక్కింది. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ (68), హర్మాన్‌ప్రీత్ కౌర్ (48) రాణించంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఛేదనలో లారా వోల్వార్ట్ (80), లారా గూడాల్ (49), డుప్రీజ్ (51 నాటౌట్) రాణించడంతో సఫారీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి బంతి వరకు పోరాడినప్పటికీ ఫలితంగా లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL 2022: లేటు వయసులో లేటెస్ట్ రికార్డు నెలకొల్పిన ధోని -
గెలిచి నిలిచాం.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ముందుకెళ్లేందుకు అవసరమైన విజయాన్ని సాధించింది. స్నేహ్ రాణా (27 పరుగులు; 4/30) ఆల్‌రౌండ్ షోతో... బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాల్ని సజీవంగా నిలబెట్టుకుంది. టాస్ నెగ్గిన మిథాలీ బృందం మొదట బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో టాపార్డర్ బ్యాటర్ యస్తిక భాటియా (80 బంతుల్లో 50; 2 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 30; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. ఒకే స్కోరు వద్ద 3 వికెట్లు... షఫాలీతో తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించాక స్మృతి అవుటైంది. ఆ వెంటే 5 బంతుల వ్యవధిలో అదే స్కోరు వద్ద షఫాలీ, మిథాలీ రాజ్ కూడా (0) వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో యస్తిక కీలకమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. తొలుత హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 14; 1 ఫోర్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. తర్వాత రిచా ఘోష్ (36 బంతుల్లో 26; 3 ఫోర్లు) అండతో ఐదో వికెట్‌కు 54 పరుగులు జతచేసింది. ఇన్నింగ్స్‌ను కుదుట పరిచిన యస్తిక 79 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. మరుసటి బంతికే జట్టు స్కోరు 176 పరుగుల వద్ద ఆమె ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. అనంతరం పూజ వస్త్రకర్ (33 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు), స్నేహ్ రాణాలు జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకుకెళ్లారు. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా 2 వికెట్లు తీశారు. తిప్పేసిన స్నేహ్ ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా తన బౌలింగ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను కనీసం లక్ష్యం దరిదాపుల్లోకి అయినా వెళ్లకుండా కట్టడి చేసింది. టాపార్డర్‌ను పూనమ్ యాదవ్ (1/25), రాజేశ్వరి గైక్వాడ్ (1/15), పూజ (2/26) కలిసి దెబ్బతీయడంతో బంగ్లా 35 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. ఈ ఐదుగురిలో ముర్షిదా ఖాతున్ (19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మిడిలార్డర్లో లతా మండల్ (24), సల్మా ఖాతున్ (32) కాస్త మెరుగనిపించడంతో బంగ్లాదేశ్ 100 పరుగులు దాటింది. వెటరన్ సీమర్ జులన్ గోస్వామి 2 వికెట్లను పడగొట్టింది. తాజా విజయంతో భారత జట్టు రన్‌రేట్ పెరగడమే కాదు... 6 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా (12 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) ముందు వరుసలో ఉన్నాయి. ఈనెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మిథాలీ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. -
సెమీస్‌కు చేరువయ్యేందుకు...
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ముందుకెళ్లేందుకు మంచి అవకాశాలున్నాయి. వీటిని మెరుగుపర్చుకోవాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు... బంగ్లాదేశ్‌పై తప్పకుండా గెలవాలి. గత మ్యాచ్‌లో ఓపెనర్లు, బౌలర్ల వైఫల్యంతో భారత్‌కు పటిష్టమైన ఆస్ట్రేలియాతో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ సీనియర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడం జట్టుకు శుభ పరిణామం. కీలక తరుణంలో వీళ్లంతా ఫామ్‌లో ఉంటే ఒక్క సమష్టి ప్రదర్శన ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మలు కూడా రాణిస్తే ప్రత్యర్థిపై భారీ స్కోరు సాధ్యమవుతుంది. దీంతో పాటు బౌలర్లు కూడా బాధ్యత తీసుకుంటే జట్టు విజయానికి బాట పడుతుంది. ‘సెమీస్’ చేజారకుండా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో... మిథాలీ సేన వరుసగా ఓడిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇంగ్లండ్‌తో బ్యాటర్ల వైఫల్యం, ఆస్ట్రేలియాతో పసలేని బౌలింగ్ జట్టు ఫలితాలను మార్చేసింది. ఇప్పుడు ఈ లోపాలపై దృష్టిపెట్టిన టీమ్ మేనేజ్మెంట్... జట్టుపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేసే పనిలో పడింది. వెటరన్ సీమర్ జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇరకాటంలో పడేస్తే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా మన బ్యాటర్స్ పరుగులు సాధిస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించొచ్చు. మరో వైపు బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క పాకిస్తాన్‌పై మాత్రమే గెలిచి మూడు పరాజయాలతో రేసుకు దాదాపు దూరమైంది. ఆ గెలిచిన మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో బంగ్లా అత్యధిక స్కోరు 175. ఇలాంటి ప్రత్యర్థితో భారత్‌కు గెలుపు ఏమంత కష్టం కాదు. తర్వాత ఈ నెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ సేన పొరపాటున ఓడినా కూడా మూడు విజయాలతో సెమీస్ రేసులో ఉంటుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ అనూహ్యంగా పాక్ చేతిలో ఓడిపోవడం భారత్ కలిసొచ్చింది. మూడు విజయాలతో రేసులో ఉన్న విండీస్ రన్‌రేట్ దారుణంగా ఉంది. మంచి రన్‌రేట్ ఉన్న భారత్... బంగ్లాపై గెలిస్తే మరింత మెరుగవుతుంది. దీంతో రన్‌రేట్‌తో ముందంజ వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
ఇంగ్లండ్ కెప్టెన్ అద్భుత విన్యాసం.. నోర్లెళ్లబెట్టిన ప్రత్యర్ధులు.. రెప్పపాటులోనే..!
NZW VS ENGW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆతిధ్య న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 20, ఆదివారం) జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ వికెట్ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ఆల్‌రౌండర్ నతాలీ స్కివర్ (108 బంతుల్లో 61; 5 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు మ్యాడీ గ్రీన్ (52) అజేయమైన అర్ధశతకంతో రాణించడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోరైనా చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చేసిన ఓ అద్భుతమైన విన్యాసం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ పవర్ హిట్టర్ లీ తహుహు భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. రెప్పపాటు సమయంలో నైట్ చేసిన ఈ విన్యాసాన్ని చూసి మైదానంలో ఉన్న వాళ్లంతా నోర్లెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్ విజయం.. న్యూజిలాండ్‌కు ఇక కష్టమే! -
ఇదేం షాటయ్యా ఇది.. ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ బాదిన టీమిండియా బ్యాటర్
Womens World Cup 2022: టీమిండియా బ్యాటర్ పూజా వస్త్రాకర్ మహిళల ప్రపంచకప్ 2022లో అతి భారీ సిక్సర్ బాది రికార్డుల్లోకెక్కింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వస్త్రాకర్.. ఆసీస్ పేసర్ మెగాన్ షట్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఏకంగా 81 మీటర్ల అతి భారీ సిక్సర్ బాది ఔరా అనిపించింది. ప్రస్తుతప్రపంచకప్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత భారీ సిక్సర్ కాగా, అంతకుముందు ఈ మెగా టోర్నీలో భారత బ్యాటర్ స్మృతి మంధాన, సౌతాఫ్రికా క్రీడాకారిణి క్లో టైరన్లు 80 మీటర్ల సిక్సర్లు బాదారు. తాజాగా వస్త్రాకర్ వీరిద్దరిని అధిగమించి 2022 వన్డే ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యస్తికా భాటియా (59), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా, ఛేదనలో ఆసీస్ మహిళా జట్టు మరో 3 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుని సూపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టును విజయపుటంచులదాకా తీసుకురాగా, ఓపెనర్లు అలైసా హీలీ (72), రేచల్ హేన్స్ (43) విజయానికి గట్టి పునాది వేశారు. ఆఖర్లో బెత్ మూనీ (30 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్ -
ఆసీస్‌ను నిలువరించేనా?
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గెలుస్తూ, ఓడుతూ సాగిన పయనం ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో మిథాలీ బృందం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. నాలుగు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి మరో రెండు ఓడింది. ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. ఇప్పుడు సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతీ పోరు కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో కఠిన సవాల్‌కు మిథాలీ సేన సిద్ధమైంది. అయితే నిలకడలేమి జట్టును ఆందోళన పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ రంగాల్లో భారత్ స్థిరంగా రాణించాలి. అప్పుడే మిగతా మ్యాచ్‌ల్ని గెలవొచ్చు. సెమీస్ చేరొచ్చు. లేదంటే లీగ్ దశలోనే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు 12 సార్లు తలపడ్డాయి. భారత్ 3 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 49 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. విండీస్ బ్యాటర్ అనిసా మహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్టన్ (39 వికెట్లు)ను అధిగమించి వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్‌గా అవతరించింది. 🚨 RECORD ALERT 🚨 Wicket No. 4⃣0⃣ in the WODI World Cups for @JhulanG10! 🔝 🙌 What a champion cricketer she has been for #TeamIndia ! 👏 👏 #CWC22 | #WIvIND Follow the match ▶️ https://t.co/ZOIa3L288d pic.twitter.com/VIfnD8CnVR — BCCI Women (@BCCIWomen) March 12, 2022 ఫుల్స్టన్ 20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టగా, ఝులన్ 31 వన్డేల్లో ఫుల్స్టన్ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్‌లు ఆడిన 39 ఏళ్ల ఝులన్, వన్డే ఫార్మాట్లో 198 మ్యాచ్‌ల్లో 249 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, సెడాన్పార్కు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 155 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 123; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. స్నేహ్ రాణా(3/22), మేఘనా సింగ్ (2/27)ల ధాటికి 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విండీస్ జట్టులో ఓపెనర్ డియాంద్ర డొటిన్(62) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: World Cup 2022: శెభాష్ స్మృతి, హర్మన్.. ఇదే అత్యధిక స్కోరు! -
ఉత్కంఠపోరులో దక్షిణాఫ్రికా విజయం
మౌంట్ మాంగనుయ్: మహిళల వన్డే ప్రపంచకప్ లో పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. చేతిలో రెండు వికెట్లు ఉండగా పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ షబ్నిమ్ (3/41) ఐదు బంతుల్లో మిగిలిన రెండు పాక్ వికెట్లు తీసి తమ జట్టును గెలిపించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 49.5 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటై ఈ టోర్నీలో వరుసగా మూడో ఓటమి చవిచూసింది. ఒమైమా (65; 7 ఫోర్లు), నిదా దార్ (55; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు సాధించింది. లౌరా వోల్వార్ట్ (75; 10 ఫోర్లు), సునె లుస్ (62; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. -
విండీస్ రూపంలో సవాల్!
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు భారత జట్టు సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో వెస్టిండీస్‌తో మిథాలీ బృందం తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఘన విజయం సాధించినా... గత మ్యాచ్‌లో కివీస్ చేతిలో భారీ పరాజయం బ్యాటింగ్‌లో మన పరిమితులు చూపించింది. ముఖ్యంగా హర్మన్ మినహా ఇతర బ్యాటర్లంతా విఫలం కావడం ఆందోళన కలిగించేదే. బౌలర్లు రెండు మ్యాచ్‌లలోనూ చక్కటి ప్రదర్శన కనబర్చగా, బ్యాటింగ్ వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తిక శుభారంభం అందిస్తేనే తర్వాతి బ్యాటర్లు దానిని కొనసాగించగలరు. పేలవ స్ట్రయిక్‌రేట్‌తో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌లోనైనా ధాటిగా ఆడి రాణిస్తే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. హర్మన్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... రిచా ఘోష్ కూడా చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉంది. జులన్, మేఘన, రాజేశ్వరి, పూజ, దీప్తిలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు విండీస్ జోరు మీదుంది. ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలు సాధించిన విండీస్ భారత్‌నూ ఓడించాలని పట్టుదలగా ఉంది. జట్టులో క్యాంప్‌బెల్, డాటిన్, హేలీ మాథ్యూస్, స్టెఫానీ, అనీసా కీలక ప్లేయర్లుగా ఉన్నారు. -
INDW Vs PAKW: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
-
INDW Vs PAKW: పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకునేనా..?
India Take On Pakistan In Womens ODI World Cup 2022: గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు (మార్చి 6) పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. Pakistan and India captains exchanging greetings on the eve of their match. How excited are you? #CWC22 #BackOurGirls pic.twitter.com/fTEawDeiUI — Pakistan Cricket (@TheRealPCB) March 5, 2022 వార్మప్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, విండీస్లపై విజయాలు సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న మిథాలీ సేన.. పాక్‌తో రేపు జరగబోయే మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని ఆశిస్తుంది. మరోవైపు భారత్‌ను ఓడించేందుకు బిస్మా మహరూఫ్ నేతృత్వంలోని పాక్ సైతం ఉవ్విళ్లూరుతుంది. భారత్‌కు కలిసొచ్చే విషయం ఏంటంటే పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. గత రికార్డులను పరిశీలిస్తే.. మహిళల వన్డే క్రికెట్లో భారత్-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే కావడం విశేషం. ఇక పొట్టి క్రికెట్లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకేసారి ఓడిపోయింది. చదవండి: బంగ్లాకు షాకిచ్చిన అఫ్ఘానిస్థాన్.. టీ20 సిరీస్ సమం -
ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే..
సాక్షి క్రీడా విభాగం: క్రికెట్లో మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా జరగబోతున్న మహిళల వన్డే ప్రపంచకప్ పోరుకు రేపటితో తెర లేవనుంది. అందమైన న్యూజిలాండ్ వేదికగా ఎనిమిది జట్లు 31 రోజుల పాటు తమ సత్తాను చాటేందుకు సన్నద్ధమయ్యాయి. మహిళల క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు ఆతిథ్య కివీస్ కూడా తమ వరల్డ్‌కప్ విజయాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతుండగా... భారత్ సహా మిగిలిన ఐదు జట్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయనేది ఆసక్తికరం. గత రెండేళ్ల పరిస్థితితో పోలిస్తే న్యూజిలాండ్ వేదికగా కోవిడ్ కట్టుబాట్లను దాటి కాస్త స్వేచ్ఛగా క్రికెటర్లు బరిలోకి దిగనుండటం ఈ మెగా టోర్నీలో ఊరట కలిగించే అంశం. ఐదేళ్ల తర్వాత జరగబోతున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి విశేషాలు. టోర్నీలో 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మిగిలిన మూడు స్థానాలను క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా... కోవిడ్ ప్రభావంతో ఆ టోర్నీ రద్దయింది. దాంతో మళ్లీ వన్డే ర్యాంకింగ్ ప్రకారమే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. క్వాలిఫయింగ్‌లో పోరాడేందుకు సిద్ధమైన శ్రీలంక జట్టు వరల్డ్‌కప్ అవకాశం కోల్పోయింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడం ఇదే తొలిసారి. టోర్నీ తేదీలు/వేదికలు: మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు 6 వేదికల్లో టోర్నీ (మొత్తం 31 మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫార్మాట్: ప్రతీ టీమ్ మిగిలిన ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్–4లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్లపరంగా రెండు జట్లు సమంగా నిలిస్తే రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. లీగ్ దశలో ‘టై’ మ్యాచ్‌లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం ‘సూపర్ ఓవర్’ ఉంది. సూపర్ ఓవర్ కూడా సమమైతే ఫలితం తేలే వరకు మళ్లీ మళ్లీ ఆడిస్తారు. ఈ సారి లీగ్ దశ నుంచి కూడా అన్ని మ్యాచ్‌లలో ‘డీఆర్ఎస్’ అమల్లో ఉంటుంది. ఆశల పల్లకిలో... 2017లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఫైనల్ చేరిన భారత జట్టు చివరకు 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితం తర్వాత మన అమ్మాయిల వేదనతో కూడిన దృశ్యాలు క్రికెట్ అభిమానుల దృష్టిలో నిలిచిపోయాయి. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో మన జట్టు టైటిల్ గెలుచుకోగలదా అనేది ఆసక్తికరం. గత టోర్నీ సమయంతో పోలిస్తే ఈ సారి భారత జట్టు ఫామ్ అంత గొప్పగా లేదు. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు కూడా టీమ్ సాధించలేకపోయింది. పైగా న్యూజిలాండ్ గడ్డపై ఆడటం మన యువ క్రీడాకారిణులకు పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో మన జట్టు మొదటి లక్ష్యం సెమీస్ చేరడమే. 2005 వరల్డ్‌కప్‌లో కూడా ఫైనల్లో ఓడిన మన టీమ్ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి భారత్ తమ తొలి మ్యాచ్‌ను 6వ తేదీన పాకిస్తాన్‌తో ఆడుతుంది. అనంతరం 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్‌తో, 16న ఇంగ్లండ్‌తో, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, 27న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్ , తానియా, రాజేశ్వరి, పూనమ్ యాదవ్. గత రికార్డు: మహిళల వన్డే వరల్డ్‌కప్ 11 సార్లు జరగ్గా... ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి. ప్రైజ్‌మనీ ఎంతంటే: 2017 కంటే ఈసారి ప్రైజ్‌మనీని రెట్టింపు చేశారు. విజేతకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్ జట్టుకు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 54 లక్షలు), సెమీస్‌లో ఓడిన జట్లకు 3 లక్షల డాలర్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) చొప్పున లభిస్తాయి. -
World Cup 2022: టీమిండియా స్టార్ బ్యాటర్ తలకు గాయం.. బీసీసీఐ అప్డేట్
మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షబ్నీమ్ ఇస్మాయిల్ విసిరిన బౌన్సర్.. వేగంగా వచ్చి మంధాన హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో మంధాన రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరి, ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో మంధాన తలకు పెద్ద గాయమైందేమోనని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కీలక టోర్నీకి ముందు మంధాన జట్టుకు దూరమైతే టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. 🚨 UPDATE 🚨: Smriti Mandhana stable after being struck on the head in #CWC22 warm-up game. #TeamIndia Details 🔽— BCCI Women (@BCCIWomen) February 28, 2022 అయితే మంధాన తలకు తగిలిన గాయం పెద్దది కాదని, కన్కషన్ ఏమీ జరగలేదని జట్టు వర్గాలు ఇవాళ వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..! -
ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..!
మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2022కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మెగా టోర్నీ సజావుగా సాగాలనే ఉద్దేశంతో నిబంధనలు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఏదైనా జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసీసీ అనుమతిచ్చింది. అలాగే ప్లేయర్స్‌ను బయో బబుల్స్‌లో ఉంచడం, బంతి బౌండరీ లైన్ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేయడం, ఓ ప్లేయర్ కరోనా బారిన పడితే జట్టులో ప్రతి ప్లేయర్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం వంటి నిబంధనలను యధాతథంగా కొనసాగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియా సహా పలు జట్లలో కరోనా కేసులు నమోదై, కనీసం 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేని పరిస్థితి ఏర్పడింది. ఓ జట్టైతే ఆటగాళ్లు అందుబాటులో లేక టోర్నీలో నుంచే వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనలను సవరించింది. ఇదిలా ఉంటే, మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు న్యూజిలాండ్ ఆతిధ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: టీమిండియా స్టార్ క్రికెటర్లకు అరుదైన గౌరవం -
ఉన్నపళంగా ఫామ్ అందుకోలేం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నపళంగా ఫామ్‌ను అందుకోవడం చాలా కష్టమని భారత మహిళల క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఏకైక అంతర్జాతీయ టోర్నీలో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా రద్దు కావడంతో పూనమ్ నిరాశ వ్యక్తం చేసింది. చివరగా ఈ ఏడాది మార్చిలో టి20 ప్రపంచకప్‌లో తలపడిన భారత్ కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైంది. తాజాగా ఇంగ్లండ్ టూర్ కూడా ఆగిపోవడంతో నేరుగా వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటాలంటే అంత సులువు కాదని పూనమ్ పేర్కొంది. న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భవితవ్యంపై రానున్న రెండు వారాల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఇదో కఠిన సవాల్. నాలుగైదు నెలల విరామానంతరం మునుపటి ఫామ్ కొనసాగించలేం. చివరగా మార్చిలో బరిలో దిగాం. ఇప్పటికీ మేం ఆడబోయే తదుపరి సిరీస్‌పై స్పష్టత లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి వన్డే ప్రపంచకప్ జరిగితే సన్నద్ధతకు సమయమే ఉండదు’ అని భారత్ తరఫున ఒక టెస్టు, 46 వన్డేలు, 67 టి20లు ఆడిన పూనమ్ పేర్కొంది. -
ప్రపంచ కప్ అర్హత టోర్నీలు వాయిదా
దుబాయ్: కరోనా (కోవిడ్–19) ధాటికి ఇప్పటికే ఒలింపిక్స్, యూరో కప్‌లు వచ్చే ఏడాదికి తరలిపోగా... ఐపీఎల్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కరోనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈవెంట్లపైనా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 2021లో జరిగే టి20 ప్రపంచ కప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ ఈవెంట్లకు సంబంధించి ఈ ఏడాది జూన్ 30లోపు జరగాల్సిన అన్ని అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దాంతో పాటు శ్రీలంక వేదికగా జరగాల్సిన 2021 మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌ను అనుకున్న తేదీల్లో జరపాలా వద్దా అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని క్రిస్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఏప్రిల్‌లో ఆరంభం కావాల్సిన ట్రోఫీ టూర్‌ను కూడా ఐసీసీ వాయిదా వేసింది. -
ఇంగ్లండ్... కాచుకో!
►మిథాలీ రాజ్ సవాల్ ► ఆతిథ్య జట్టుకు అంత సులువు కాదన్న భారత కెప్టెన్ డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఇదే ఊపులో తొలిసారి విశ్వ విజేతగా నిలవాలని మన జట్టు పట్టుదలగా ఉంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌కు తమ నుంచి గట్టి పోటీ తప్పదని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉందని ఆమె, ఆతిథ్య జట్టును హెచ్చరించింది. టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 35 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ‘ప్రపంచ కప్ ఫైనల్ ఆడబోవడంపై మా జట్టు సభ్యులందరూ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ టోర్నీ కష్టమైనదని మాకు తెలుసు. కానీ జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలో అందరూ తమ సత్తా చాటారు. కాబట్టి ఫైనల్లో మమ్మల్ని ఓడించడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదని గట్టిగా చెప్పగలను. ఆ రోజు ఎలా ఆడతామన్నది ముఖ్యం. మాతో ఓడిన తర్వాత ఆతిథ్య జట్టు ఆట కూడా మారింది కాబట్టి ఈ మ్యాచ్ కోసం మా వ్యూహాలు మార్చుకోవాలి. దీని కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం’ అని మిథాలీ చెప్పింది. మహిళల క్రికెట్ రాత మారుతుంది... భారత జట్టు ప్రపంచ కప్ గెలిస్తే అది దేశంలో మహిళా క్రికెట్ దశ, దిశను మార్చగలదని మిథాలీ అభిప్రాయపడింది. ‘మేం లార్డ్స్‌లో విజయం సాధిస్తే అది గొప్ప ఘనత అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే మహిళల క్రికెట్లో విప్లవంలాంటిది రావచ్చు. మహిళలు కనీసం ఒక ఐసీసీ టోర్నీ అయినా గెలవాలని ఇప్పటి వరకు అంతా చెబుతూ వచ్చారు. దానికి ఇప్పుడు ఇదే సరైన వేదిక. భారత్ గెలిస్తే ఆ ఘనతను వర్ణించేందుకు నాకు మాటలు చాలవేమో’ అని ఈ హైదరాబాద్ అమ్మాయి పేర్కొంది. సెమీస్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లుగా కూడా చాలా బాగా ఆడారని సహచరిణులపై మిథాలీ ప్రశంసలు కురిపించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో కండరాల గాయంతో బాధపడిన హర్మన్‌ప్రీత్ కోలుకుంటుందని మిథాలీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాలని హర్మన్ కూడా పట్టుదలగా ఉంటుందని నేను చెప్పగలను. ఇది జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం. మేమందరం కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’ అని మిథాలీ తన మనసులో మాట చెప్పింది. హర్మన్ ఇంట్లో సంబరాలు... ప్రపంచ కప్ సెమీస్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్వస్థలం మోగా (పంజాబ్)లో గురువారం రాత్రి నుంచి వేడుకలు కొనసాగాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున పండగ వాతావరణం ఉండగా, ఆ ఊర్లోని మిత్రులు, సన్నిహితులు కూడా పంజాబీ సాంప్రదాయ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. తమ కూతురి ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నామని... ఆడపిల్లను సరిగ్గా ప్రోత్సహిస్తే అద్భుతాలు జరుగుతాయని ఆమె నిరూపించిందని హర్మన్ తల్లిదండ్రులు హర్మందర్ సింగ్ భుల్లర్, సతీందర్ కౌర్ వ్యాఖ్యానించారు. సెహ్వాగ్ శైలిలో బ్యాటింగ్ చేసే హర్మన్, మైదానంలో కోహ్లి తరహాలో దూకుడుగా వ్యవహరిస్తుందని ఆమె సోదరి హేమ్‌జిత్ కౌర్ చెప్పింది. తన తోటి అమ్మాయిలు సరదాగా గడుపుతున్నా, వాటికి దూరంగా కఠోర సాధన చేసిన హర్మన్ శ్రమ ఫలితాన్ని ఇచ్చిందని ఆమె వెల్లడించింది. బీసీసీఐ అభినందన ప్రపంచకప్‌లో ఫైనల్ చేసిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. టోర్నీలో నిలకడగా రాణించిన మిథాలీ బృందాన్ని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి అభినందించారు. హర్మన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన... ఫైనల్ మ్యాచ్ కోసం జట్టుకు బెస్టాఫ్ లక్ చెప్పారు. -
ధనాధన్ కౌర్...
‘ఒంటి చేత్తో’ విజయం అందించడం అంటే ఏమిటో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చాలా బాగా తెలుసు! గత ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం కోసం చివరి 2 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో ఆమె ఐదో బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలచడంతో పాటు మరో రెండు పరుగులు కూడా సాధించి గాల్లో బ్యాట్ విసిరేసి సంబరాలు చేసుకుంది. ఆ సమయంలో కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న కౌర్ నొప్పిని భరిస్తూనే చివరి వరకు పట్టుదలగా ఆడి గెలిపించింది. ‘ఆ సమయంలో నన్ను నేను ధోనీలా భావించాను’ అని మ్యాచ్ అనంతరం కౌర్ వ్యాఖ్యానించింది. కౌర్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడం, అలవోకగా బౌండరీలు, భారీ సిక్సర్లు బాదడం కొత్త కాదు. ఇది ఆమె సహజశైలి మాత్రమే. ఈ తరహా దూకుడైన బ్యాటింగ్ వల్లే బిగ్‌బాష్ జట్టు సిడ్నీ థండర్స్ హర్మన్‌ను ఏరికోరి ఎంచుకుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి కౌర్ కావడం విశేషం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కౌర్ తొలి మ్యాచ్‌లోనే 28 బంతుల్లో 47 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె లాఫ్టెడ్ కవర్ డ్రైవ్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచడం చూసి కామెంటరీలో ఉన్న గిల్‌క్రిస్ట్ ‘నేను చూసిన అత్యుత్తమ క్రికెట్ షాట్. ఆమె ఆటతో నేను అచ్చెరువొందాను’ అని వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడాది అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై టి20ల్లో భారత్ అత్యుత్తమ లక్ష్య ఛేదనలో కూడా కౌర్ (31 బంతుల్లో 46)దే కీలక పాత్ర. టి20 క్రికెట్ ఎలా ఆడాలో కౌర్ తమకు చూపించిందని మ్యాచ్ తర్వాత ఆసీస్ కీపర్ ఎలీసా హీలీ చెప్పింది. ఇప్పుడు తాజా ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్ ఎలా ఆడాలో కూడా ఆస్ట్రేలియన్లకు హర్మన్ బాగా నేర్పించింది! తొమ్మిదేళ్ల క్రితమే భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన హర్మన్ చాలా వేగంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. 2013లో జరిగిన గత ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ కౌర్‌కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా ఆమె మెరుపు బ్యాటింగ్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిసాయి. చాలా మంది భారత మహిళా క్రికెటర్ల తరహాలో హర్మన్‌కు సినిమా కష్టాలేమీ లేవు. పంజాబ్‌లోని మోగాకు చెందిన క్లబ్ స్థాయి క్రికెటర్ అయిన తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన హర్మన్ ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు. కౌర్ కెరీర్‌ను తీర్చి దిద్దడంలో స్థానిక కోచ్ కమల్దిష్ సింగ్ అన్నింటా తానై కీలక పాత్ర పోషించారు. వివిధ వయో విభాగాల్లో రాణించి పంజాబ్ జట్టులోకి వచ్చిన ఆమెకు భారత టీమ్ తలుపు తట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌ను పిచ్చి పిచ్చిగా అభిమానించే కౌర్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సరిగ్గా అదే సెహ్వాగ్‌ను మరిపించింది. బంతిని చూడటం, బలంగా బాదడమే తనకు తెలిసిన విద్య. ‘టీవీలో నేను క్రికెట్ మ్యాచ్‌లు చూసిందే సెహ్వాగ్ కోసం. అతడిని తప్ప మరే ఆటగాడిని నేను అభిమానించలేదు. అతడు ఫోర్లు, సిక్సర్లు కొట్టే శైలి నాకు చాలా ఇష్టం. ఎన్నో సార్లు వీరూ షాట్లను ఆడే ప్రయత్నం కూడా చేశాను’ అని 28 ఏళ్ల కౌర్ తన ఆటపై ఎవరి ప్రభావం ఉందో చెప్పేసింది. బిగ్‌బాష్ తర్వాత తాజాగా ఇంగ్లండ్ టి20 సూపర్ లీగ్‌లో కూడా సర్రే స్టార్స్ తరఫున ఆడే అవకాశం హర్మన్‌కు దక్కింది. – సాక్షి క్రీడావిభాగం ‘84 మాత్రం వద్దు’ హర్మన్ ఇప్పుడు 17 నంబర్ జెర్సీ ధరిస్తోంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమె 84 నంబర్‌తో ప్రపంచ కప్ ఆడింది. ఆమె తండ్రి ఏదైనా పెట్టుకో కానీ 84 మాత్రం వద్దని చెప్పినా... అప్రయత్నంగా ఆమె రాసిన అంకె 84 కావడంతో బీసీసీఐ అదే నంబర్‌ను ఇచ్చింది. దీనికి తండ్రి చాలా బాధ పడ్డారు. 1984 అల్లర్ల సమయంలో కౌర్ తండ్రి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సంఖ్య చూస్తే అదే గుర్తుకొస్తుంది కాబట్టి ఆయన దానిని వద్దన్నారని తర్వాత కౌర్ వివరించింది. చాలా ఆనందంగా ఉంది. మేం గెలవడం వల్లే నా ఇన్నింగ్స్ విలువ పెరిగింది. టోర్నీకి ముందు సెమీస్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత అది ఫైనల్‌గా మారింది. టోర్నమెంట్లో నాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావించాను. దొరికిన బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాను. నా వ్యూహం ఫలించింది. – హర్మన్‌ప్రీత్ కౌర్ ►పరుగులు 171 ►బంతులు 115 ►ఫోర్లు 20 ►సిక్స్‌లు 7 -
'హర్మన్' తుఫాన్
►ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ►సెమీస్‌లో 36 పరుగులతో ఆసీస్ చిత్తు ►ఆదివారం ఇంగ్లండ్‌తో టైటిల్ పోరు ఎప్పుడైనా చూశారా మహిళల క్రికెట్లో ఇంతటి వీర విహారాన్ని... మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ తీరును... ఎప్పుడైనా ఊహించారా మన అమ్మాయినుంచి ఈ తరహా మెరుపు ఆటను... అన్ని ప్రశ్నలకు తన బ్యాట్‌తోనే హర్మన్‌ప్రీత్ కౌర్ సమాధానం చెప్పింది. ఆడుతోంది ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్... అయితేనేం ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా చెలరేగిన ఆమె అద్భుతాన్ని ఆవిష్కరించింది. బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన ఈ పంజాబ్ సివంగి భారత్‌కు అపురూప విజయాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1983లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్‌దేవ్ ఇన్నింగ్స్‌తో పోల్చదగిన ప్రదర్శనతో కౌర్ ఆసీస్ ఆట కట్టించింది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో మరే భారత క్రికెటర్ కూడా సాధించని ఘనతను తన పేరిట లిఖించుకున్న హర్మన్, ఆల్‌టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఆరుసార్లు చాంపియన్ ఆసీస్‌ను ఇంటిదారి పట్టించి ఈ మెగా ఈవెంట్లో రెండోసారి ఫైనల్ చేరింది. డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు మరో చిరస్మరణీయ రోజు... అంచనాలకు అందని రీతిలో అద్భుతంగా ఆడిన మిథాలీ సేన సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్ ప్రీత్ కౌర్ (115 బంతుల్లో 171 నాటౌట్; 20 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆసీస్ భరతం పట్టింది. అనంతరం తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ బ్లాక్వెల్ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలాని (58 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. హర్మన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో భారత్ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది. చేతులెత్తేశారు... భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కష్టాలు రెండో ఓవర్ నుంచే మొదలయ్యాయి. మూనీ (1)ని పాండే అవుట్ చేసి ఆ జట్టును దెబ్బ తీసింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్ (0)ను జులన్, బోల్టన్ (14)ను దీప్తి అవుట్ చేశారు. అనంతరం విలానీ, పెర్రీ (38) నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్ల ధాటికి స్వల్ప వ్యవధిలో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. స్మృతి మళ్లీ విఫలం... టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగిస్తూ స్మృతి మంధన (6) తొలి ఓవర్లోనే వెనుదిరిగింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (14) కూడా కొద్ది సేపటికే వెనుదిరిగింది. అనంతరం మిథాలీ రాజ్ (61 బంతుల్లో 36; 2 ఫోర్లు) కూడా క్రీజ్‌లో ఉన్నంత సేపు అసౌకర్యంగా కనిపించింది. చివరకు బీమ్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత్ పరిస్థితి చూస్తే సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఆ తర్వాత దీప్తి శర్మ (35 బంతుల్లో 25; 1 ఫోర్) అండగా హర్మన్‌ప్రీత్ చెలరేగిపోయింది. వీర విధ్వంసం... గత మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్ ఈసారి అసలైన తరుణంలో తన మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. షుట్ వేసిన 23వ ఓవర్లో మోకాళ్లపై కూర్చొని కౌర్ ఆడిన షాట్ ఇన్నింగ్స్ హైలైట్లలో ఒకటి. ఇదే ఓవర్లో కౌర్‌ను స్టంపౌంట్ చేసే సునాయాస అవకాశాన్ని హీలీ చేజార్చింది. ఆ సమయంలో కౌర్ స్కోరు 35. ఆ తర్వాత ఇక ఆమెను ఆపడం ఆసీస్ తరం కాలేదు. గార్డ్నర్ వేసిన 37వ ఓవర్లో కౌర్ పండగ చేసుకుంది. తొలి బంతికి శర్మ సింగిల్ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో కౌర్ 6, 6, 4, 4, 2 బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరి 10 ఓవర్లలో భారత్ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం. సంబరాలు లేవు! అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ తన చిరస్మరణీయ సెంచరీ క్షణాన్ని మాత్రం ఆస్వాదించలేకపోయింది. నాన్‌స్ట్రైకర్ దీప్తి శర్మతో సమన్వయ లోపం ఆమెను తీవ్ర అసహనానికి గురి చేసింది. 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో బీమ్స్ బౌలింగ్‌లో కౌర్ మిడ్ వికెట్ దిశగా ఆడింది. వేగంగా సింగిల్ పూర్తి చేసుకున్న ఆమె, రెండో పరుగు కోసం ప్రయత్నిం చింది. దానికి దీప్తి సరిగా స్పందించలేదు. చివరకు ప్రమాదం లేకుండా ఆ పరుగు పూర్తయి కౌర్ సెంచరీ సాధించింది. అటువైపు దీప్తి కూడా రనౌట్ కాకుండా బయటపడింది. కానీ కౌర్ మాత్రం తన కోపాన్ని దాచుకోలేక సహచరిణిపై ప్రదర్శించింది. భారత ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ... ఆ సమయంలో తన ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోయానని, ఆ తర్వాత దీప్తికి సారీ చెప్పినట్లు కౌర్ వెల్లడించింది. -
తొలి బెర్త్ ఎవరిదో!
బ్రిస్టల్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య నేడు తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌తో ఒక్క ఆరంభ మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. పైగా లీగ్ దశలో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆత్మవిశ్వాసం కూడా జట్టులో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా పడుతూ లేస్తూ సెమీస్ చేరింది. ఆతిథ్య జట్టుతో పాటు పటిష్టమైన ఆసీస్ చేతిలో ఓడింది. అయితే విండీస్, భారత్‌లపై భారీ విజయాలతో సత్తా చాటుకుంది. 17 ఏళ్ల తర్వాత (2000) సెమీస్ చేరిన సఫారీ జట్టు టైటిల్‌తో మెగా టోర్నీని ముగించాలనే పట్టుదలతో ఉంది. నేటి మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
‘హ్యాట్రిక్’పై గురి
♦ నేడు పాకిస్తాన్‌తో భారత్ ‘ఢీ’ ♦ దుర్భేద్యంగా మిథాలీ రాజ్ బృందం ♦ మహిళల వన్డే ప్రపంచకప్ దాయాదుల మధ్య ఇది మరో క్రికెట్ యుద్ధమే కానీ ఈసారి మహిళలది. జైత్రయాత్ర కొనసాగించేందుకు ఓ జట్టు... బోణీ కొట్టాలన్న ఆశతో మరో జట్టు ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో భారత మహిళలు దూసుకెళుతుంటే... వరుస వైఫల్యాలతో పాక్ పరువు కోసం పాకులాడుతోంది. ఎలాగైనా దాయాదిని ఓడించి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. కానీ ఆల్‌రౌండ్ నైపుణ్యమున్న మిథాలీ సేనను పాక్ ఏ మాత్రం నిలువరిస్తుందో చూడాలి. డెర్బీ: ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు సమరానికి సై అంటున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం లీగ్ పోరు జరగనుంది. వరుస విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన ఉండగా ... అసలు బోణీనే చేయని పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ కీలకం. విజయంతో గెలుపు బాట పడితే తర్వాత సెమీస్ లక్ష్యంపై ఆలోచించవచ్చనే ధైర్యంతో ఉంది. తిరుగులేని రికార్డు... పాకిస్తాన్‌పై భారత మహిళలది తిరుగులేని రికార్డు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది. మిథాలీ సారథ్యంలోనే ఏకంగా 8 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక ప్రపంచకప్ చరిత్ర కూడా భిన్నంగా ఏమీ లేదు. ఈ మెగా ఈవెంట్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ సేననే విజయం వరించింది. ఇక ఈ చరిత్రను పక్కనపెట్టి... కేవలం ఈ టోర్నీనే పరిశీలిద్దామంటే... ఇందులోనూ భారత్ జోరు, హోరు ఏమాత్రం తక్కువలేదు... ప్రత్యర్థులకు తలొగ్గలేదు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను, రెండో మ్యాచ్‌లో గత రన్నరప్ విండీస్‌ను కంగుతినిపించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మొదలు బౌలర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడం లేదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధన అసాధారణరీతిలో రాణిస్తోంది. ఇంగ్లండ్‌తో కేవలం 10 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన ఆమె ఆ వెంటనే విండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసింది. విజయసారథి మిథాలీ రెండు మ్యాచ్‌ల్లోనూ నిలకడగా ఆడింది. మిడిలార్డర్లో దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌లు కూడా పాక్ బౌలర్ల భరతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకనొక దశలో లక్ష్యంవైపు దూసుకెళుతున్న ప్రత్యర్థి జట్టును స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు సమర్థంగా కట్టడి చేశారు. గెలుపే లక్ష్యంగా పాక్ మరోవైపు సనా మీర్ సారథ్యంలోని పాక్ పరిస్థితి భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది. టీమిండియా రెండు విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే... పాక్ రెండు పరాజయాలతో డీలా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాక్ లక్ష్యం సెమీసో... ఫైనలో కాదు. ఒక్క గెలుపే! ఎందుకంటే ఒక్కసారి గెలుపుబాట పడితే తమ ప్లేయర్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ముందు జరిగే మ్యాచ్‌ల్లో ధీమాతో ఆడే అవకాశం ఏర్పడుతుంది. పైగా జోరుమీదున్న మిథాలీ సేనను ఓడిస్తే వచ్చే కిక్కే వేరు. జట్లు (అంచనా) భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మోనా మేశ్రమ్, వేద కృష్ణమూర్తి, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్, సుష్మ వర్మ. పాకిస్తాన్: సనా మీర్ (కెప్టెన్), అయేషా జాఫర్, నహిదా ఖాన్, జవేరియా ఖాన్, బిస్మా మరూఫ్, నయిన్ అబిది, కైనత్ ఇంతియాజ్, అస్మావియా ఇక్బాల్, సిద్రా నవాజ్, నష్రా సంధు, సాదియా యూసుఫ్. మధ్యాహ్నం గం. 2.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం