విజయోస్తు! | India face England in ICC Women's World Cup opener | Sakshi
Sakshi News home page

విజయోస్తు!

Published Sat, Jun 24 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

విజయోస్తు!

విజయోస్తు!

► నేటి నుంచి మహిళల వన్డే ప్రపంచకప్‌
► తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ ‘ఢీ’
► టీమిండియా తొలి లక్ష్యం సెమీస్‌
► మిథాలీ రాజ్‌పైనే అందరి దృష్టి


ఆదరణలో, ఆర్జనలో భారత పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా  క్రికెటర్లు ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. పురుషుల జట్టుకు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించుకునేందుకు భారత మహిళల జట్టుకు వన్డే ప్రపంచకప్‌ రూపంలో సువర్ణావకాశం లభించింది. ఈ మెగా ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన టీమిండియా ఇక దానిని ఆచరణలో పెట్టి అనుకున్న ఫలితాన్ని సాధించడమే మిగిలింది. తాము ప్రపంచకప్‌ గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్‌కు మహర్దశ వస్తుందని నమ్మకంతో ఉన్న మిథాలీ రాజ్‌ బృందం అద్భుతం చేయాలని, కప్‌తో తిరిగి రావాలని ఆశీర్వదిద్దాం.

డెర్బీ (ఇంగ్లండ్‌) : అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షలానే ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో ఎనిమిదిసార్లు పాల్గొన్న భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన 2005లో రన్నరప్‌గా నిలువడం. 2013 ఈవెంట్‌లో స్వదేశంలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఈసారి మాత్రం ఎలాగైనా కప్‌తో తిరిగి రావాలని, దేశంలో మహిళల క్రికెట్‌కు మంచి రోజులు తేవాలని మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. శనివారం మొదలయ్యే ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే అసలు సిసలు సవాల్‌ ఎదురుకానుంది.

ఆతిథ్య జట్టు, మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. తొలి రోజు జరిగే మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో శ్రీలంక ఆడుతుంది. ఇంగ్లండ్‌తో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో భారత్‌ ఎనిమిదిసార్లు ఓడిపోయింది. అయితే అన్ని విభాగాల్లో సమతుల్యంతో ఉన్న భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేస్తే ఈ టోర్నీని విజయంతో ప్రారంభించడం కష్టమేమీ కాదు. ‘మా తొలి లక్ష్యం సెమీఫైనల్‌కు చేరడమే. ఇది నెరవేరాలంటే లీగ్‌ దశలో నిలకడగా ఆడాలి. ఇక్కడి పరిస్థితులకు జట్టు సభ్యులు అలవాటు పడ్డారు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. మరో 212 పరుగులు చేస్తే మిథాలీ రాజ్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది.

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో భారత్‌ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. గత ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో మిథాలీ బృందం విజేతగా నిలిచింది.

మిథాలీ, జులన్‌ కీలకం...
వరుసగా ఆరు అర్ధ సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిథాలీ రాజ్‌... దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో ఐర్లాండ్‌పై తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం జోడించిన ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌... మిడిల్‌ ఆర్డర్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్, మోనా మేశ్రమ్‌... వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ జులన్‌ గోస్వామిలతో భారత్‌ పటిష్టంగానే కనిపిస్తోంది.

మరోవైపు స్వదేశంలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలోనూ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ ముచ్చటగా మూడోసారి మళ్లీ గెలవాలని తహతహలాడుతోంది. సారా టేలర్, కెప్టెన్‌ హీథెర్‌ నైట్, పేసర్‌ కేథరీన్‌ బ్రంట్, సివెర్‌ రాణిస్తే ఇంగ్లండ్‌ శుభారంభం చేసే అవకాశముంది.ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్‌ జట్లు 61 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 25 మ్యాచ్‌ల్లో భారత్‌... 34 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు ముఖాముఖి తలపడగా... మూడుసార్లు భారత్, ఆరుసార్లు ఇంగ్లండ్‌ విజయం సాధించాయి.

జట్ల వివరాలు
భారత్‌: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్‌ గోస్వామి, మాన్సి జోషి, హర్మన్‌ప్రీత్‌ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతి మంధన, మోనా మేశ్రమ్, నుజత్‌ పర్వీన్, శిఖా పాండే, పూనమ్‌ రౌత్, దీప్తి శర్మ, సుష్మా వర్మ, పూనమ్‌ యాదవ్‌.
ఇంగ్లండ్‌: హీథెర్‌ నైట్‌ (కెప్టెన్‌), తమ్సీన్‌ బెమౌంట్, కేథరీన్‌ బ్రంట్, జార్జియా ఎల్విస్, జెన్నీ గన్, అలెక్స్‌ హార్ట్‌లె, హాజెల్, బెథ్‌ లాంగ్‌స్టన్, లారా మార్‌‡్ష, నటాలీ సివెర్, ష్రుబ్‌సోల్, సారా టేలర్, ఫ్రాన్‌ విల్సన్, లారెన్‌ విన్‌ఫీల్డ్, డానియెలా వ్యాట్‌.

గత చాంపియన్స్‌
ఏడాది     విజేత           రన్నరప్‌
1973    ఇంగ్లండ్‌       ఆస్ట్రేలియా
1978    ఆస్ట్రేలియా    ఇంగ్లండ్‌
1982    ఆస్ట్రేలియా    ఇంగ్లండ్‌
1988    ఆస్ట్రేలియా     ఇంగ్లండ్‌
1993    ఇంగ్లండ్‌      న్యూజిలాండ్‌
1997    ఆస్ట్రేలియా     న్యూజిలాండ్‌
2000    న్యూజిలాండ్‌    ఆస్ట్రేలియా
2005    ఆస్ట్రేలియా    భారత్‌
2009    ఇంగ్లండ్‌    న్యూజిలాండ్‌
2013    ఆస్ట్రేలియా    విండీస్‌


ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ 54 మ్యాచ్‌లు ఆడింది. 28 మ్యాచ్‌ల్లో గెలిచి, 24 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ ‘టై’ కాగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.  

గెలిస్తే ఎవరికెంత...
విజేత    రూ. 4 కోట్ల 25 లక్షలు
రన్నరప్‌    రూ. 2 కోట్ల 12 లక్షలు
సెమీస్‌లో ఓడిన జట్లకు     రూ. కోటి చొప్పున
గ్రూప్‌ దశలో నిష్క్రమించిన జట్లకు     రూ. 19 లక్షల చొప్పున

ఇదీ ఫార్మాట్‌
మొత్తం ఎనిమిది జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో తలపడతాయి. లీగ్‌ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌
తేదీ                 ప్రత్యర్థి                సమయం
జూన్‌ 24          ఇంగ్లండ్‌          మ.గం. 3.00 నుంచి
జూన్‌ 29          విండీస్‌             మ.గం. 3.00 నుంచి
జూలై 2            పాకిస్తాన్‌          మ.గం. 3.00 నుంచి
జూలై 5            శ్రీలంక             మ.గం. 3.00 నుంచి
జూలై 8            దక్షిణాఫ్రికా        మ.గం. 3.00 నుంచి
జూలై 12         ఆస్ట్రేలియా         మ.గం. 3.00 నుంచి
జూలై 15        న్యూజిలాండ్‌       మ.గం. 3.00 నుంచి
జూలై 18        తొలి సెమీఫైనల్‌   మ.గం. 3.00 నుంచి
జూలై 20        రెండో సెమీఫైనల్‌    మ.గం. 3.00 నుంచి
జూలై 23         ఫైనల్‌ (లార్డ్స్‌లో)   మ.గం. 3.00 నుంచి


మధ్యాహ్నం గం. 3.00 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement