India
-
తల్లి కాబోతున్న సీమా హైదర్
ఢిల్లీ : ఆన్లైన్ గేమ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భర్త సచిన్ మీనాతో కలిసి సీమా హైదర్ బేబీ బంప్‌తో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ఏడాది జులైలో పబ్జీ (pubg) వీడియోగేమ్‌లో గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సచిన్ మీనాకు దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.పాక్ నుంచి భారత్‌కు వచ్చిన హైదర్ ఆరోపణలు,కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో మతం మార్చుకుని సచిన్‌ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన నలుగురు పిల్లల పేర్లు మార్చారు. నలుగురు పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. తాజాగా, త్వరలో తాను పండంటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. -
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024 ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ‘షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్ హుస్సేన్ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. మహ్మద్ యూనిస్ హెచ్చరికలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనిస్.. మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. -
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్ జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో) జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో) జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో) -
ఐసీసీ వేదికపై మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్
-
జర్మనీ క్రిస్మస్ మార్కెట్లో దారుణం
న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ వేళ జర్మనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మగ్దెబర్గ్ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లో జనంపైకి ఓ ఆగంతకుడు కారును వేగంగా నడిపాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల సమయంలో ఓ కారు మార్కెట్లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా వెళ్లినట్లు సీసీఫుటేజీలో నమోదైంది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో కనీసం 41 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని మీడియా తెలిపింది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్.ఎ.(50)అనే వ్యక్తిని సాయుధ పోలీసులు వెంటనే చుట్టుముట్టి, అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన దారినే తిరిగి వెళ్లేందుకు కారును మళ్లించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదంతా కేవలం మూడే మూడు నిమిషాల్లో జరిగిపోయింది. కారు ముందుభాగం, విండ్ స్క్రీన్ ధ్వంసమైంది. రద్దీగా మార్కెట్లో పాదచారుల మార్గంపైకి బీఎండబ్ల్యూ కారు వెళ్తున్న దృశ్యం అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయింది. తాలెబ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారని అధికారులు తెలిపారు. భయానక విషాద ఘటన ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న బాధితులను తరలించేందుకు 100 మంది పోలీసులు, వైద్య సిబ్బంది, ఫైర్ ఫైటర్లతోపాటు 50 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించారు. దారుణం తెలిసిన వెంటనే ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ మగ్దెబర్గ్ వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. దాడిని భయానక విషాద ఘటనగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆనందానికి మారుపేరుగా ఉన్న మగ్దెబర్గ్లో ఘోరం చోటుచేసుకుందన్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు దారి తీసిన కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో జర్మనీ వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ వారాంతపు మార్కెట్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. 7 Indian nationals have been injured in Magdeburg, Germany. 3 have been discharged from the hospital. Indian Mission is in touch with all those injured in the attack: Sources— ANI (@ANI) December 21, 2024ఖండించిన భారత్క్రిస్మస్ మార్కెట్లో జరిగిన దాడిని భారత్ ఖండించింది. దుండగుడు జనంపైకి కారు నడిపిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు మరణించారు. ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, గాయపడిన భారతీయులందరితో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు మాట్లాడుతున్నట్లు వెల్లడించింది. గాయపడిన భారతీయులతో, అలాగే వారి కుటుంబాలతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. సాధ్యమైన మేరకు వారికి సహాయ సహకారాల్ని అందిస్తామని ’ తెలిపింది. -
దేశానికి మన విత్తన పాదు
(యెన్నెల్లి సురేందర్) గజ్వేల్: భారత్ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. కోట్లమంది రైతులు, కోట్ల ఎకరాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. మంచి పంట రావాలంటే అతి ప్రధానమైనది విత్తనం. పంటలు పండే ప్రతి చోటా విత్తనాన్ని ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. అందుకు సమృద్ధిగా నీరు ఉండాలి.. మంచి నేలలు కావాలి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి.. వీటన్నింటినీ చక్కగా వాడుకోగల నిపుణులైన రైతులు ఉండాలి. ఈ వనరులన్నింటికీ ఇప్పుడు తెలంగాణ ఆలవాలమైంది. అందుకే రాష్ట్రం నుంచి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతున్నాయి. దేశానికి అవసరమైన మొత్తం విత్తనాల్లో 55 శాతం తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయటం ఎంత ముఖ్యమో.. దానిని పాడవకుండా దీర్ఘకాలం నిల్వచేయటం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ వాతావరణం విత్తన నిల్వకు చక్కగా సరిపోతోంది. అందుకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా తెలంగాణకు తరలించి నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారి ఇక్కడే సీడ్ పార్కును ఏర్పాటుచేసింది. ఏటా విత్తనోత్పత్తి పంటల సాగు పెరుగుతున్న తీరుపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..ఒక్కో జిల్లాలో ఒక్కో విత్తనం విత్తనోత్పత్తి రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాలకు విస్తరిస్తోంది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తోపాటు సిద్దిపేట జిల్లా విత్తనోత్పత్తికి హబ్‌గా అవతరించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, భూత్పూర్ ప్రాంతాల్లో పత్తి విత్తనోత్పత్తి భారీగా జరుగుతోంది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో విత్తన పత్తి పంట దాదాపు 35 వేల ఎకరాల్లో సాగవుతోంది. మిగితా జిల్లాల్లో వరి, మొక్కజొన్న, సోయా, సజ్జలు, పచ్చ జొన్న తదితర పంటల విత్తనోత్పత్తి జోరుగా సాగుతోంది. నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో సజ్జ విత్తనాల ఉత్పత్తి అధికంగా ఉంది. 2014–15లో వరి విత్తన ఉత్పత్తి 3 లక్షల కిలోలకుపైగా ఉండగా, ఇప్పుడు రెట్టింపైంది. ఇలా అన్ని రకాల విత్తనోత్పత్తి పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడు మరింత పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. విత్తనోత్పత్తితో మంచి ఆదాయం నాకు పదెకరాల భూమి ఉంది. సాధారణ పద్ధతిలో ఎంత కష్టపడినా ఎకరాకు 25–30 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదు. ఆ వడ్లను అమ్మితే ఖర్చులు పోను రూ.20–25 వేలు కూడా మిగిలేవి కాదు. అందువల్ల విత్తనోత్పత్తి వైపు వచ్చాను. ఖ ర్చులు పోను ఒక సీజన్లో ఎకరాలో రూ.60–80 వేల వరకు ఆదాయం వస్తోంది. చిమ్ముల సీతారాంరెడ్డి, వేలూరు, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లామూడేళ్లుగా సజ్జ విత్తనోత్పతి చేస్తున్న మూడేళ్లుగా సజ్జ పంటలో విత్తనోత్పత్తి చేస్తున్న. ఖర్చులు పోను ఎకరాకు రూ.50 వేలకుపైనే ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు మంచి ఫలితాలే వచ్చినయ్. – చంద్రం, దండుపల్లి, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లావిత్తనోత్పత్తికి తెలంగాణ నేలలు అనుకూలం తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూలమైన నేలలు ఉన్నాయి. చౌడు నేలలు మినహా మిగితా నేలల్లో విత్తన సాగు చేపట్టవచ్చు. విత్తన సాగు రైతులకు లాభదాయకమే అయినప్పటికీ కంపెనీలతో సరిగ్గా అగ్రిమెంట్లు చేసుకోకపోతే నష్టపోవడం ఖాయం. – డాక్టర్ విజయ్‌కుమార్, సిద్దిపేట జిల్లా డాట్ సెంటర్ శాస్త్రవేత్తలక్షల టన్నులవిత్తనాల ఎగుమతి రాష్ట్ర వ్యవసాయశాఖ, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,400లకు పైగా గ్రామాల్లో 3.10 లక్షల మంది రైతులు 7.5 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా 80 వేల టన్నుల విత్తనోత్పత్తి జరుగుతోంది. 20 లక్షల టన్నుల విత్తనాల నాణ్యతను ఈ సంస్థ ధ్రువీకరించి ఎగుమతి చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు మరో 11.200 లక్షల టన్నుల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 12 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు అంచనా. మరో 12 లక్షల టన్నుల విత్తనాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. దేశంలో సుమారుగా 44 లక్షల టన్నులకుపైగా విత్తనాల అవసరం ఉండగా.. తెలంగాణ నుంచే 24 లక్షల టన్నులు సరఫరా అవుతుండటం విశేషం. చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం తదితర 20 దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. విత్తన సాగుపై రైతుల ఆసక్తి సాధారణ పంటలకంటే విత్తనోత్పత్తి పంటల సాగులో ఆదాయం అధికంగా వస్తుండటంతో రైతులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులుపోను రూ.20–30 వేలు మిగలడమే గగనం. కానీ విత్తనోత్పత్తి పంటలు వేస్తే ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్షకుపైగా ఆదాయం వస్తోంది. ఈ పంటల సాగు క్లిష్టమైనదే అయినప్పటికీ.. నిష్టాతులైన కూలీలతో సులువుగా సాగు చేపడుతున్నారు. విత్తన వడ్లకు క్వింటాలుకు వివిధ కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ధర చెల్లిస్తున్నాయి. ఒకవేళ 10 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వస్తే సదరు కంపెనీ రైతుకు పరిహారం కింద ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష చెల్లిస్తోంది. ఇదే తరహాలో పంట రకాలను బట్టి ధరను చెల్లిస్తున్నారు. మంచి లాభం ఉండటంతో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 5 వేల ఎకరాల్లో వరితోపాటు ఇతర విత్తన పంటల సాగు చేస్తూ ఏటా రూ.80 కోట్లకుపైగానే లాభం పొందుతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సేకరించే విత్తనాలపై క్వింటాల్‌కు కనీస మద్దతు ధ రకంటే వరికి 20 శాతం అధికంగా ఇన్సెంటివ్స్ ఇ స్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తృణధా న్యాలకు 17 శాతం, సోయాబీన్స్‌కు 25 శాతం, ఇతర పంటలకు 15 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. విత్తనోత్పత్తిలో అగ్రిమెంట్లే కీలకం విత్తనోత్పత్తి విధానంలో రైతులు, కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలు సక్రమంగా లేకుంటే నష్టాలు తప్పవు. అగ్రిమెంట్లు సరిగా లేకపోతే కంపెనీ ముందుగా చెప్పే దిగుబడుల కంటే తక్కువ వస్తే పరిహారం ఇవ్వటంలేదు. అందువల్ల రైతులు విత్తనోత్పత్తి చేపట్టే సందర్భంలో ప్రాంతీయ విత్తన అధికారి వద్ద తమ పంటకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, ప్రైవేటు కంపెనీలు భారీ ఎత్తున విత్తనోత్పత్తి చేపడుతున్నా.. ప్రభుత్వం వైపు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విత్తనోత్పత్తికి సంబంధించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఆరేళ్ల క్రితం వరకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
భారత పరిశోధనా రంగంలో కొత్త అధ్యాయం
భారతదేశ పరిశోధనా రంగంలో ఒక కొత్త అధ్యాయం ‘నూతన విద్యా విధానం– 2020’. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం భారతదేశంలోని విద్యా, పరిశోధన రంగాలను బలోపేతం చేయడానికి ఇది కృషి చేస్తుంది. ఈ దిశలోనే ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’ (ఓఎన్ఓఎస్) పథకం ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. భారతదేశ పరిశోధనా రంగాన్ని బలోపేతం చేయడంలో నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దిశలో, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఓఎన్ఓఎస్ దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు నాణ్యమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించే దిశగా పనిచేస్తోంది.భారతీయ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి పత్రికలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పరిశోధన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ‘ఆత్మనిర్భర భారత్’ కల సాకారం కావడానికి అవసరమైన దేశీయ పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. దేశంలోని అట్టడుగు స్థాయి విద్యా సంస్థ నుండి ఉన్నత స్థాయి విద్యా సంస్థ వరకు సమాచారాన్ని సమానంగా అందిస్తుంది. ఓఎన్ఓఎస్ కింద 2025 జనవరి 1 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నల్స్‌లో ప్రచు రితమైన పరిశోధనా పత్రాలను మన విద్యార్థులు, పరిశోధకులూ పొందనున్నారు. మొదటి దశ కింద 13,400 కంటే ఎక్కువ అంతర్జాతీయ పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం కింద, 451 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 4,864 కళాశాలలు; అలాగే జాతీయ ప్రాముఖ్యం కలిగిన 172 సంస్థలూ, 6,380 ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలూ వీటిని ఉపయోగించుకోనున్నాయి. ఇవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పబ్లిషర్స్ (ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, వైలి తదితర)తో సహా 30 ప్రచురణ సంస్థలు ప్రచురించే అగ్ర జర్నల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే మూడేళ్లపాటు ఇలా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.రెండవ, మూడవ దశల్లో ప్రభుత్వ–ప్రైవేట్ నమూనా ద్వారా చొరవను ప్రైవేట్ విద్యా సంస్థలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూడవ దశలో పబ్లిక్ లైబ్రరీలలో ఏర్పాటు చేసిన యాక్సెస్ పాయింట్ల ద్వారా అంతర్జాతీయ పత్రికలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.మూడు సంవత్సరాల కాలానికి 6,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించబడుతుంది. ప్రపంచంలో జర్మనీ, చెకోస్లోవేకియా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ దిగ్విజయంగా నడుస్తోంది. ఈ పథకం పరిశోధనలు కేంద్రీకృతం కాకుండా అన్ని రాష్ట్రాలలో, అన్ని పరిశోధనా సంస్థలలో, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ఆవిష్కరణాత్మక పరిశో ధనలను ప్రోత్సహిస్తుంది. పట్టణ – గ్రామీణ పరిశోధనా సంస్థల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ పథకం అమలులో పలు సవాళ్ళూ ఎదురు కానున్నాయి. ప్రధానంగా, అంతర్జాతీయ పత్రికల చందా ఖర్చులు సంవత్సరానికొకసారి పెరుగుతుండడం కీలక సమస్య. రూ. 6,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, అన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల అవస రాలను తీర్చడం సవాలుగా మారవచ్చు. అలాగే సంపాదకీయ హక్కులు, మేధా సంపత్తి సమస్యలు ముందుకు రావచ్చు. ఈ తరహా అంత ర్జాతీయ ఒప్పందాలు చాలాసార్లు సాంకేతికత, భాష, మరియు అవసరాల ఆధారంగా వివిధ సంస్థలకు అసమాన అనుభవాలను కలిగించ వచ్చు. అనేక స్థాయుల్లో సమాచార కొరత వల్ల పథకం గురించి అవగాహన లేని పరిస్థితి తలెత్తవచ్చు. ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోవసతుల కొరత వల్ల వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం భారతదేశంలోని విద్య– పరిశోధన రంగాలకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే అగ్ర పరిశోధనా కేంద్రంగా మారే అవకాశం ఉంది. డా‘‘ రవి కుమార్ చేగోని వ్యాసకర్త తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి -
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
బంధం బలపడేలా...
డిసెంబర్ 21, 22 తేదీలలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ వెళ్లనున్నారు. 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. విశ్వసనీయమైన చమురు సరఫరాదారు అయిన కువైట్‌లో 21 శాతం జనాభాతో అతిపెద్ద విదేశీ సమూహంగా భారతీయులు ఉంటున్నారు. భారత్‌లో కువైటీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం, అనూహ్య పరిస్థితులలో ఉపయోగపడటానికి భారత్‌లో కువైటీ చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేయడం, కువైట్ ఆధునికీకరణలో భారత కంపెనీలకు భాగస్వామ్యం కల్పించడం, రక్షణ, భద్రత లాంటి అంశాలు చర్చకు రానున్నాయి.స్థిరమైన, బాగా వృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాల పట్ల ఉన్నత స్థాయి శ్రద్ధ అనేది దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాలలో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. 1981లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కువైట్‌ను సందర్శించిన 43 ఏళ్ల తరువాత, 2013లో కువైట్ ప్రధానమంత్రి భారతదేశ పర్యటనకు వచ్చిన 11 ఏళ్ల తరువాత మొదటిసారిగా భారతదేశం నుండి కువైట్‌కు ప్రధాని స్థాయి పర్యటన జరగడానికి గల కారణం ఇదే అయి ఉండవచ్చు.అతిపెద్ద విదేశీ సమూహంగా భారతీయులుకువైట్తో భారతదేశ సంబంధాలు రెండు దేశాలు స్వాతంత్య్రం పొందడానికి ముందు నుండీ ఉన్నాయి. బస్రా నగరం పేరుతో ప్రసిద్ధి చెందిన బస్రా ముత్యాలను సాహసవంతులైన కువైట్ డైవర్లు సేకరించి బస్రా పోర్టు నుండి భారత్‌కు తెచ్చేవారు. వీటిని రాజవంశీ యులు, సంపన్నులు ఆభరణాల రూపంలో ధరించేవారు. వారి తిరుగు ప్రయాణంలో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదా ర్థాలు, ఇతర ఉత్పత్తులను తమ పడవల్లో తీసుకువెళ్లేవారు. శిలాజ ఇంధన వనరులను గుర్తించడానికి ముందు, గల్ఫ్ ప్రాంతంలో నిపుణులైన కువైట్ వ్యాపారస్తులకు భారత్‌తో వాణిజ్యం అనేది సంపదకు ముఖ్య వనరుగా ఉండేది. ఈ సంబంధాలు కేవలం వాణిజ్యం వరకు పరిమితం కాలేదు. బొంబాయిని సందర్శించాలనే ఆకాంక్ష వారిలో ఉండేది. కువైట్‌కు చెందిన అమీర్ ఒకరు వర్షాకాలంలో గడపడానికి తనకు బాగా నచ్చిన బొంబాయి నగరంలోని మెరైన్ డ్రైవ్‌లో విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేశారు. ఆ ఆస్తి ఇప్పటికీ ఉంది. ఇరు దేశాలకు చెందిన ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, 1961లో కువైట్ స్వతంత్ర దేశంగా మారిన ప్పుడు, దానితో మొదటగా దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.1970ల దశకం నుండి శిలాజ ఇంధనాల ద్వారా భారీగా ఆదాయం రావడంతో, తమ సాంకేతికత, విద్య, రక్షణ, భద్రత, పెట్టుబడులు, వినోదం కోసం పశ్చిమ దేశాలపై కువైట్ ఆధార పడసాగింది. భారత్‌తో సంబంధాలు కొనసాగినప్పటికీ, వాటి ప్రాధాన్యత అదే విధంగా కొనసాగలేదు. కానీ గత రెండు దశా బ్దాలుగా భారత్‌లో వేగంగా జరిగిన ఆర్థికాభివృద్ధి, సాంకేతికత– రక్షణ రంగాలలో పెరిగిన సామర్థ్యం, ప్రాంతీయ బలం కారణంగా భారత్, కువైట్ మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటింది. కువైట్‌లో పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు నివసి స్తున్నారు. అతి పెద్ద విదేశీ సమూహంగా కువైట్ జనాభాలో 21 శాతంగా ఉన్నారు. ఆ దేశం కార్మిక శక్తిలో 30 శాతంగా ఉన్నారు. భారత్ చమురు దిగుమతి చేసుకునే మొదటి ఆరు దేశాలలో కువైట్ ఒకటి. విశ్వసనీయమైన సరఫరాదారుగా కువైట్ నిలిచింది. ఇండి యాలో కువైట్ సంస్థాగత పెట్టుబడులు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా.రెండు బిలియన్ డాలర్ల ఎగుమతులుఇండియాతో దీర్ఘ కాలంగా వ్యాపార సంబంధాలు నెరుపుతున్న అల్ ఘనిమ్, అల్ షాయా వంటి వ్యాపార సంస్థలు ఇక్కడి తయారీ, సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాయి. అదేవిధంగా భారత్‌కు చెందిన ఎల్ అండ్ టి, శాపూర్జీ పల్లోంజి, కల్పతరు, కేఈసీ, ఇఐఎల్, మేఘా, అశోక్ లేల్యాండ్, విప్రో, టాటా, టీసీఐఎల్, కిర్లోస్కర్ వంటి సంస్థలు కువైట్ మౌలిక వసతులు, అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. ఆర్థిక, సంబంధిత రంగంలో ఎల్ఐసీ, న్యూ ఇండియా ఎస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు అనేక సంవత్సరాలుగా కువైట్‌లో క్రియాశీల కార్యకలాపాలు నిర్వహి స్తున్నాయి. 2023–24లో మొదటిసారిగా కువైట్‌కు భారతీయ ఎగుమతులు 34 శాతం పెరిగి 2 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటాయి. ప్రవాస భారతీయుల నుండి భారత్‌కు వస్తున్న రెమి టెన్సులు ఇప్పుడు 5 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. కువైట్‌లో భారతీయ ఉత్పత్తులు, బ్రాండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది.కానీ ఇంకా ఎంతో సాధించవచ్చు. ఇదొకసారి చూడండి: 18,000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ భౌగోళిక వైశాల్యం కలిగిన కువైట్ (వైశాల్యంలో అనేక భారతీయ జిల్లాలు దానికంటే పెద్దవి) 105 బిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ చమురు నిక్షేపాలు కలిగి ఉండి ప్రపంచంలోనే 6వ స్థానంలో ఉంది. దాని సావరిన్ ఫండ్‌లో సుమారుగా ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. భారత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకు అత్యధిక తలసరి ఆదాయ దేశంగా కువైట్ ఒక లాభసాటి మార్కెట్. పైగా రానున్న పదేళ్లలో మౌలిక సదుపాయాలపై 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళిక ఉన్నందున భారతీయ సంస్థలకు గొప్ప అవకాశం. అంతే కాకుండా, భారతదేశంలో విలాస వంతమైన పర్యాటకం, పోర్ట్ ఫోలియో పెట్టుబడులకు సంపన్న కువైటీలు ఒక మంచి వనరుగా ఉండగలరు.సంబంధాలు మరో స్థాయికి...విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ 2024 ఆగస్ట్‌లో కువైట్‌ను సందర్శించారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో కువైట్ యువ రాజు, ప్రధాని మోదీ భేటీ జరిగింది. కువైట్ విదేశాంగ మంత్రి ఈ నెల ఆరంభంలో భారత్ వచ్చారు. ఇప్పుడు మోదీ కువైట్ పర్యటనతో సంబంధాలు మరో స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.పర్యటనను ఫలవంతం చేయటానికి అనేక ముందస్తు చర్యలు ఇప్పటికే చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, రక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆహార భద్రత, వ్యవసాయం, ఉప దౌత్య అంశాలపై పనిచేసే ఏడు కొత్త జాయింట్ వర్కింగ్ గ్రూపు (జేడబ్ల్యూజీ)లకు ఇరువురు విదేశీ మంత్రులు ఆమోదించారు. చమురు, కార్మికులు, ఆరోగ్యంపై ఇదివరకే ఉన్న జేడబ్ల్యూజీలతో కలిసి పనిచేస్తూ విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఈ కొత్త గ్రూపులు సహాయపడతాయి. భారత్‌లో కువైటీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం, అనూహ్య పరిస్థితులలో ఉపయోగపడటానికి భారత్‌లో కువైటీ చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేయడం, భారతీయ పెట్రో కెమికల్స్ రంగంలో కువైట్ పాల్గొనడం, కువైట్ ఆధునికీకరణ ప్రణాళికలలో ప్రపంచ స్థాయి సామర్థ్యాలు కలిగిన భారతీయ మౌలిక సదుపాయాల కంపెనీలు ఎక్కువగా పాలుపంచుకునే విధంగా మార్గం సుగమం చేయడం లాంటివి ఈ సంబంధాల నుంచి ఆశిస్తున్న ఫలితాలు. కువైట్‌లో భారతీయ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, వారి సమస్య లను వేగంగా పరిష్కరించడం మరో ముఖ్యమైన అంశం.రక్షణ, భద్రతా సమస్యలు కూడా చర్చించాల్సి ఉంది. భారత్, కువైట్ పరస్పర సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు క్రమం తప్పకుండా కువైట్ పోర్ట్‌ను సందర్శిస్తున్నప్పటికీ, రక్షణ, భద్రత సహకారంపై మరింత శ్రద్ధ, సంప్రదింపులు అవసరం. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాల కారణంగా, ఈ ప్రాంతంలో ఆందోళన భావన నెలకొంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) అధ్యక్ష స్థానంలో కువైట్ ఉన్నందున, భారత సౌహార్ధత, దౌత్య సంబంధాల సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. సతీశ్ సి. మెహతా వ్యాసకర్త కువైట్‌కు భారత మాజీ రాయబారి -
చిప్ చిప్ హుర్రే
అడవుల సంరక్షణ కోసం చేసిన ‘చిప్కో’ ఉద్యమం గురించి విన్నాం... అయితే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో భారత్‌ను పవర్‌హౌస్‌గా నిలిపేలా మరో ‘చిప్’కో ఉద్యమం నడుస్తోంది. దేశాన్ని సెమీకండక్టర్స్ శకంలోకి నడిపించేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పారిశ్రామిక అగ్రగాములు రంగంలోకి దూకడంతో ప్రపంచ దిగ్గజాలన్నీ భారత్‌లో చిప్స్ తయారీకి సై అంటున్నాయి. టాటా నుంచి అదానీ వరకు టాప్ కార్పొరేట్ గ్రూప్‌లన్నీ సెమీకండక్టర్ ఉద్యమంలో తలమునకలయ్యాయి. అమెరికా దిగ్గజం మైక్రాన్ నుండి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కొత్త ఏడాది ఆరంభంలోనే సాక్షాత్కరించనుంది. ఈ భారీ ప్రణాళికల నేపథ్యంలో కొంగొత్త కొలువులకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాబోయే రెండేళ్లలో ఏకంగా 10 లక్షల ‘చిప్’ జాబ్స్ సాకారమవుతాయనేది విశ్లేషకుల అంచనా!నిర్మాణంలో ఉన్న చిప్ ప్లాంట్లు...మైక్రాన్ టెక్నాలజీస్ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: 2.75 బిలియన్ డాలర్లు. తొలి దశ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2025 నాటికి ఈ ప్లాంట్ నుంచి తొలి మేక్ ఇన్ ఇండియా చిప్ కల సాకారం కానుంది.టీటీపీఎల్–పీఎస్ఎంసీ ఎక్కడ: గుజరాత్–ధోలేరా మొత్తం పెట్టుబడి: రూ. 91,000 కోట్లు. తైవాన్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్ప్ (పీఎస్ఎంసీ) భాగస్వామ్యంతో టాటా ఎల్రక్టానిక్స్ (టీఈపీఎల్) ఈ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను నిర్మిస్తోంది. అదానీ–టవర్ (ఐఎస్ఎం ఆమోదం లభించాల్సి ఉంది)ఎక్కడ: పన్వేల్–మహారాష్ట్ర మొత్తం పెట్టుబడి: రూ.84,000 కోట్లుఇజ్రాయెల్ చిప్ తయారీ సంస్థ టవర్ సెమీకండక్ట్టర్, అదానీ భాగస్వామ్యంతో దీన్ని నెలకొల్పనుంది. టీశాట్ ఎక్కడ: అస్సాం–మోరిగావ్ మొత్తం పెట్టుబడి: రూ.27,000 కోట్లు. టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ్ల అండ్ టెస్ట్ (టీశాట్) ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. అత్యాధునిక స్వదేశీ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెక్నాలజీలను టీశాట్ అభివృద్ధి చేస్తోంది.కేన్స్ సెమికాన్ ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: రూ. 3,307 కోట్లు. మైసూరుకు చెందిన ఈ కంపెనీ రోజుకు 63 లక్షల చిప్‌ల తయారీ సామర్థ్యం గల ఓశాట్ (అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.సీజీ పవర్, రెనెసాస్ ఎల్రక్టానిక్స్, స్టార్స్ మైక్రోఎల్రక్టానిక్స్ఎక్కడ: గుజరాత్–సాణంద్ మొత్తం పెట్టుబడి: రూ.7,600 కోట్లు. జపాన్‌కు చెందిన రెనెసాస్, థాయ్‌లాండ్ సంస్థ స్టార్స్ భాగస్వామ్యంతో సీజీ పవర్ ఈ చిప్ ఏటీఎంపీ యూనిట్‌ను నెలకొల్పుతోంది.భారత్‌ను సెమీకండక్టర్ తయారీ హబ్‌గా మార్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో విదేశీ చిప్ దిగ్గజాలు దేశంలో ల్యాండవుతున్నాయి. దేశీ కంపెనీలతో జట్టుకట్టి ఇప్పటికే భారీ పెట్టుబడులను కూడా ప్రకటించాయి. గుజరాత్ అయితే దేశంలో ప్రత్యేక సెమీకండక్టర్ పాలసీ తీసుకొచి్చన తొలి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)లో ప్రకటించిన రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాల చలవతో ఇప్పటికే రూ.1.52 లక్షల కోట్ల విలువైన 5 భారీ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. దీంతో చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు జోరందుకున్నాయి.ఈ స్కీమ్ ద్వారా కంపెనీల ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్రం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సదుపాయాలు కలి్పస్తున్నాయి. కాగా, మరో 20కి పైగా ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. దీంతో రెండు మూడు నెలల్లోనే మరింత భారీ స్థాయిలో ఐఎస్ఎం 2.0 స్కీమ్‌ను ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 5,000కు పైగా కంపెనీలు సెమీకండక్టర్ పరిశ్రమ పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ డేటా క్లౌడ్ సంస్థ చెబుతోంది.ఇందులో ప్రత్యక్ష చిప్ తయారీ సంస్థలు, పరికర (కాంపొనెంట్) ఉత్పత్తిదారులతో పాటు ఎల్రక్టానిక్స్ డిజైన్, తయారీ, డి్రస్టిబ్యూషన్ డిస్ప్లే డిజైన్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్ ఇలా మొత్తం సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్)కు సంబంధించిన కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి. 2023–24లో భారత్ దిగుమతి చేసుకున్న సెమీకండక్టర్ల విలువ అక్షరాలా 33.9 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ డిమాండ్ 148 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందనేది నోమురా అంచనా. ఇక చిప్ డిజైన్ జోరు.. త్వరలో కేంద్రం ప్రకటించనున్న సెమికాన్ 2.0 స్కీమ్‌లో చిప్ డిజైనింగ్‌తో పాటు సెమికండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ వృద్ధికి పెద్ద పీట వేయనుంది. దిగ్గజ సంస్థలకూ ప్రాజెక్టుల వ్యయంలో సబ్సిడీ అందించే అవకాశముంది. ప్రస్తుత స్కీ మ్ (రూ.1,000 కోట్లు) చిప్ డిజైన్ స్టార్టప్‌లకు మాత్రమే 50 శాతం సబ్సిడీ (రూ.15 కోట్ల పరిమితితో) అమలవుతోంది. తదుపరి స్కీమ్‌లో ఈ పరిమితి పెంపుతో పాటు బడా కంపెనీలకూ వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఎల్అండ్టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్, క్వాల్కామ్, మీడియాటెక్, ఎన్ఎక్స్పీ వంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే, చిప్ మేధోసంపత్తి హక్కులు (ఐపీ) భారత్‌లోనే ఉండేలా షరతు విధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.నిపుణులకు ‘చిప్’కార్పెట్! భారత్‌ను సెమీకండక్టర్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలంటే నిపుణులైన సిబ్బందే కీలకం. అందుకే అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమవర్గాలు ఈ రంగంలో నైపుణ్యాలు పెంచేపనిలో పడ్డాయి. ఎన్ఎల్బీ సరీ్వసెస్ డేటా ప్రకారం 2026 నాటికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ 10 లక్షల కొత్త కొలువులను సృష్టించనుందని అంచనా. ఇందులో చిప్ ఫ్యాబ్రికేషన్‌లో 3 లక్షలు, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ)లో 2 లక్షల జాబ్స్ లభించనున్నాయి.ఇంకా చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, తయారీ సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితర రంగాల్లో దండిగా ఉద్యోగాలు రానున్నట్లు ఎన్ఎల్బీ నివేదిక పేర్కొంది. ‘సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన సిబ్బందిని అందించడంలో రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. భారీ డిమాండ్‌ను తీర్చాలంటే కనీసం ఏటా 5 లక్షల నిపుణులను పరిశ్రమకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అని ఎన్ఎల్బీ సరీ్వసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అభిప్రాయపడ్డారు.ప్రధానంగా ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు, స్పెషలిస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని చిప్ తయారీ కంపెనీలు ఇప్పటికే నైపుణ్యాభివృద్ధి చర్యలు మొదలుపెట్టాయి. ఏఎండీ, మైక్రాన్ ఇండియా, ఎల్ఏఎం రీసెర్చ్ తదితర కంపెనీలు కొత్త నియామకాల కోసం టెక్నికల్ బూట్క్యాంపులు, యూనివర్సిటీల్లో రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటు, మెంటార్షిప్ అవకాశాల కల్పనకు నడుంబిగించాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగ్లాదేశ్ సోషల్‌మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్‌హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
ఇండియాపై ట్రంప్ భారీ బాంబు
-
అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం. అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగంసుందర్కే చాన్స్ ఎక్కువ...ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది. సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు. రేసులో కుల్దీప్ యాదవ్ ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. అక్షర్‌కు అవకాశం లేనట్టే! గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తనుశ్పై దృష్టి...ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు. -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్‌ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్‌నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్‌లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్‌లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌లు ఆడే అన్నీ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్‌లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్‌కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్‌లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్‌ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్‌లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు యూఏఈ (దుబాయ్)లో... భారత్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. -
మెరిసిన త్రిష... భారత్ ఘనవిజయం
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ‘సూపర్ ఫోర్’ దశలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించి నెగ్గింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (46 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కమలిని (0), సనిక చాల్కె (1) వెంటవెంటనే అవుటైనా కెపె్టన్ నిక్కీ ప్రసాద్ (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ త్రిష టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే మరో ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది -
పార్లమెంటు ఆవరణలో తన్నుకున్న ఎంపీలు
-
Balidan Diwas: నవ్వుతూ ఉరికంబం ఎక్కిన విప్లవవీరులు
ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు నాడు జరిగిన ఉద్యమంలో ఎందరో మహనీయులు ప్రాణం త్యాగం చేశారు. వారిలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు కూడా ఉన్నారు. వీరు ఆంగ్లేయుల దురాగతానికి బలయ్యారు. ఈ ఘటన జరిగింది ఈరోజే(డిసెంబరు 19). అందుకే వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం.అది 1927, డిసెంబర్ 19.. భారతదేశానికి చెందిన ముగ్గురు విప్లవ వీరులు ఉరికంబాన్ని ముద్దాడారు. ఆంగ్లేయులు వీరిని ఉరితీశారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లను ఎప్పటికీ మరువలేం. వీరిని గుర్తుచేసుకుంటూ దేశంలో డిసెంబర్ 19ని బలిదాన్ దివస్‌గా జరుపుకుంటారు.రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు కాకోరి ఘటనకు కారకులుగా పేర్కొంటూ నాటి బ్రిటీష్ ప్రభుత్వం వారికి ఉరిశిక్ష విధించింది. 1925, ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్‌లోని కాకోరి- అలంనగర్ మధ్య చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, సింగ్ తదితర విప్లవవీరులు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో వీరు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటన అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ పోలీసుల నుండి తప్పించుకున్నారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్‌లు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో బ్రిటీషర్లు వారికి ఉరిశిక్ష విధించారు. ఈ సంఘటనను చరిత్రలో కాకోరి సంఘటనగా పిలుస్తారు. ఈ ఉదంతంలో పాల్గొన్న మరికొంతమంది విప్లవవీరులను బ్రిటీషర్లు జైలులో బంధించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు స్వాతంత్యోద్యమంలో బ్రిటీషర్లను ఎదురించిన తీరు విషయానికొస్తే..ఠాకూర్ రోషన్ సింగ్ఈయన 1894, జనవరి 22న యూపీలోని షాజహాన్‌పూర్‌లోని నెవాడా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు జగదీష్ సింగ్ అలియాస్ జంగీ సింగ్. ఠాకూర్ రోషన్ సింగ్ చదువు పూర్తిచేశాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. అలాగే గురితప్పని షూటర్‌గానూ పేరొందారు. కాకోరి ఘటనలో భాగస్వామి అయిన అతనిని తొలుత ఆంగ్లేయులు విచారించారు. న్యాయమూర్తి హామిల్టన్ అతనికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. తరువాత దానిని మరణశిక్షగా మార్చారు. ఈ నేపధ్యంలో రోషన్ సింగ్ నవ్వుతూ ఉరికంబం ఎక్కారు.రామ్ ప్రసాద్ బిస్మిల్ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పోరాట యోధునిగా పేరుగాంచారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జన్మించారు. కాకోరి సంఘటనలో ప్రధాన పాత్ర పోషించారు. 1918లో జరిగిన మెయిన్‌పురి ఘటనలో కూడా రామ్ ప్రసాద్ బిస్మిల్ కీలకంగా వ్యవహరించారు. ఈయన గేయ రచయితగానూ పేరొందారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ తన 30 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్అష్ఫాఖుల్లా ఖాన్ కూడా షాహన్జహాన్పూర్లో జన్మించారు. కాకోరి ఘటనలో కీలక పాత్ర పోషించారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్ ఉర్దూ భాషలో ఉత్తమ కవిగా పేరొందారు. ఈయన పండిట్ రాంప్రసాద్ బిస్మిల్‌కు అత్యత సన్నిహితుడు.ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం 2024లో ఊపందుకుంది. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాలను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. 2024లో గూగుల్‌లో కొన్ని పర్యాటక ప్రాంతాలు నిరంతరం ట్రెండింగ్‌లో నిలిచాయి. వీటిలో స్విట్జర్లాండ్, లండన్‌తో పాటు ఐదు దేశాల పేర్లు వినిపించాయి. ఇందులో భారత్‌కు కూడా స్థానం దక్కింది.అజర్బైజాన్2024లో భారత్‌కు చెందిన పర్యాటకలు అజర్‌బైజాన్‌కు సందర్శించేందుకు గూగుల్‌లో విస్తృతంగా సెర్చ్ చేశారు. దీనిని చూస్తుంటే అజర్బైజాన్ భారత పర్యాటకులకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్‌గా తెలుస్తోంది. భారతదేశం నుండి అజర్‌బైజాన్‌కు విమాన టిక్కెట్లు అందుబాటు ధరల్లో ఉంటాయి. అజర్బైజాన్ వెళ్లాలనుకునేవారు ఈ వీసాను మూడు రోజుల్లో సులభంగా పొందవచ్చు. అజర్బైజాన్లో చూడదగిన అద్భుతమైన ప్రదేశాలలో బాకు, అస్తారా, షెకి, క్యూబా, గోయ్గోల్ సరస్సు మొదలైనవి ఉన్నాయి.బాలిబాలి.. భారతీయులు అమితంగా ఇష్టపడే మరో పర్యాటక ప్రాంతం. బాలి ఇండోనేషియాలోని ఒక ప్రావిన్స్. ఇక్కడ కుటా బీచ్, లోవినా బీచ్‌లను సందర్శించవచ్చు. బాలి బర్డ్ పార్క్, బొటానికల్ గార్డెన్, మంకీ ఫారెస్ట్ ఇక్కడి ఆకర్షణ కేంద్రాలు. ప్రకృతి అందించిన సహజ సౌందర్యంతో పాటు, ట్రెక్కింగ్ తరహా సాహసాలను ఇష్టపడేవారికి బాలి పర్యాటక గమ్యస్థానంగా నిలిచింది.మనాలిహిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి అందమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచింది. మనాలీలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇక్కడి మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పలు సాహస క్రీడలు అందుబాటులో ఉంటాయి. అద్భుతమైన ఫోటోషూట్ చేసుకునేందుకు బాలి అనువైన ప్రాంతం. శీతాకాలంలో మనాలిని సందర్శిస్తే ఆ అనుభూతులు జీవితాంతం మదిలో నిలిచివుంటాయి. 2024లో లెక్కలేనంతమంది పర్యాటకులు మనాలీని సందర్శించారు.కజకిస్తాన్కజకిస్తాన్ ఆసియాలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఇక్కడ కరెన్సీ చాలా చౌకగా ఉంటుంది. భారత్ నుండి కజకిస్తాన్ చేరుకునేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇది ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. లోయలు, పర్వతాలు, సరస్సులను అతి దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.జైపూర్2024లో పర్యాటకులు గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రాంతాలలోభారత్లోని జైపూర్ కూడా ఉంంది. విదేశీ పర్యాటకులను జైపూర్ అమితంగా ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌ను పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. అమెర్ ఫోర్ట్, హవా మహల్, నహర్‌ఘర్ కోట బిర్లా టెంపుల్‌తో సహా అనేక చారిత్రక ప్యాలెస్‌లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు జైపూర్‌లో అనేకం ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో సంబ్రమాశ్చర్యాలు కలుగుతాయి. ఇది కూడా చదవండి: మౌంట్ అబూపై చంపేస్తున్న చలి.. అయినా తగ్గని పర్యాటక జనం -
సైబర్ దాడుల కలకలం.. మీరు ఈ సంస్థ రౌటర్లను వినియోగిస్తున్నారా?
వాషింగ్టన్: అమెరికాలో సైబర్ సెక్యూరిటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్ రౌటర్ల ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో చర్యలు ఉపక్రమించింది. సైబర్ సెక్యూరిటీ దాడులపై అమెరికా అప్రమత్తమైంది. టీపీ-లింక్ టెక్నాలజీ కార్పొరేషన్‌కు చెందిన ఇంటర్నెట్ రౌటర్లు సైబర్ దాడులతో ముడిపడి ఉన్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే చైనీస్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సంస్థ రూటర్లు ఉన్నాయని తెలిపారు. Mayorkas: “China has, in fact, hacked into our telecommunications providers…and the extent of it is quite serious…and it is still going on.”Their response? Publish a “best practices” document they hope people in positions of responsibility will read.pic.twitter.com/77Pg0tUvYG— Julia 🇺🇸 (@Jules31415) December 18, 2024దేశంలోని వాణిజ్యం, రక్షణ, న్యాయ శాఖలు టీపీ-లింక్ సంస్థపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగాయి. అదే సమయంలో డ్రాగన్ దేశానికి చెందిన సదరు సంస్థ అమ్మే టీపీ-లింక్ ఇంటర్నెట్ రూటర్ అమ్మకాలపై బ్యాన్ విధించేలా అధికారులు చర్యలు తీసుకోననున్నట్లు తెలుస్తోంది.సైబర్ దాడులపై అనుమానంతో విచారణ చేపట్టేందుకు అమెరికా ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు కంపెనీ వివరాలు చెప్పేందుకు టీపీ-లింక్ టెక్నాలజీ ఆశ్రయించారు. కానీ ఆ సంస్థ వివరాలు చెప్పలేదని సమాచారం. ఈ పరిణామంతో రక్షణ శాఖ సైతం చైనా కంపెనీ తయారు చేసిన రూటర్లపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. టీపీ-లింక్ రూటర్లను వినియోగిస్తే దేశంలో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ అమెరికన్ చట్ట సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు లేఖ రాశారు. అనంతరం జోబైడెన్ చైనా కంపెనీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
తీర భద్రతా 'నిర్దేశక్'
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాగర గర్భంలో ఏం జరుగుతోంది? ఉపరితలంపై ముంచుకొస్తున్న మప్పు ఏంటి? సముద్రంలో శత్రుదేశాల నుంచి తలెత్తే ఆపదలేంటి? ఇలా సుదీర్ఘ భారత సముద్ర తీరంలో అణువణువూ సర్వే చేసి... నావికాదళానికి అందించేందుకు నిర్దేశకుడు వస్తున్నాడు. సంధాయక్ క్లాస్‌లో రెండో అతి పెద్ద సర్వే వెసల్‌గా ఐఎన్ఎస్ నిర్దేశక్ బుధవారం జల ప్రవేశం చేసింది. 2014 వరకూ సేవలందించిన నౌక నిర్దేశక్‌ను గుర్తుచేసుకుంటూ ఈ కొత్త నౌకకూ అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం నుంచి సేవలందించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతోంది. కోల్‌కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్... విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో...! దేశంలోనే అతిపెద్ద సర్వేనౌక ఐఎన్ఎస్ సంధాయక్ తర్వాత... రెండో అతి పెద్ద సర్వే వెసల్ ఐఎన్ఎస్ నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) సంస్థ 2020లో దీని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం జీఆర్ఎస్ఈ తయారుచేస్తున్న నాలుగు అధునాతన సర్వే నౌకల్లో నిర్దేశక్ రెండోది కావడం విశేషం. ఓడరేవులు, నావిగేషనల్ ఛానెళ్లు, ఎకనమిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుంది. దీంతోపాటు శోధన– రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తు సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్‌గానూ నిర్దేశక్‌ను తయారు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో బలీయమైన శక్తిగా తూర్పు నౌకాదళం ఎదుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక సర్వే వెసల్ని విశాఖపట్నం కేంద్రంగా సేవలందించేందుకు కేటాయించాలని భారత నౌకాదళం నిర్ణయించినట్టు సమాచారం. అయితే.. తొలి షిప్ సంధాయక్ ఇప్పటికే విశాఖ కేంద్రంగా సేవలందిస్తున్న నేపథ్యంలో రెండింటిలో ఒక నౌకని పశ్చిమ నౌకాదళానికి కేటాయించే అవకాశం ఉందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. రూ.2,435 కోట్లతో 4 సర్వే వెసల్స్ నిర్మాణం 1968 నుంచి సంధాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఇండియన్ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ 2017లోనే నాలుగు సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,435.15 కోట్లతో బిడ్‌ను జీఆర్ఎస్ఈ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ షిప్‌లను నిర్మిస్తున్నారు. ఈ క్లాస్ షిప్‌లలో మొదటిది జే18 పేరుతో ఐఎన్ఎస్ సంధాయక్‌ను 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించగా... జే 19 పేరుతో ఐఎన్ఎస్ నిర్దేశక్ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత ఐఎన్ఎస్ ఇక్షక్, ఐఎన్ఎస్ సంశోధక్ షిప్‌లు 2025 నాటికి భారత నౌకాదళంలోకి చేరనున్నాయని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశక్కు గుర్తుగా...!గతంలో నిర్దేశక్ పేరుతో సర్వే నౌక దేశానికి సుదీర్ఘంగా 31 ఏళ్ల పాటు సేవలందించింది. అనంతరం దీన్ని 2014 డిసెంబర్ 19న ఉపసంహరించారు. 1983 అక్టోబర్ 4న దీన్ని జాతికి అంకితం చేశారు. కేవలం సర్వే సేవలతో పాటు ఆపద సమయాల్లో ఇది ఆస్పత్రి నౌకగా కూడా మారిపోయింది. ప్రధానంగా కాండ్లాలో వచ్చిన భూకంపం సమయంలో, శ్రీలంకలో సంభవించిన సునామీ సమయంలో ఈ నౌక విశేష సేవలందించింది. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ కేంద్రంగా ఇది పనిచేసింది. 18 మంది అధికారులతో పాటు 160 మంది సిబ్బంది ఇందులో సేవలందించేవారు. 1980 టన్నుల బరువు, 87.8 మీటర్ల పొడవైన ఈ నౌక... గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే పేరుతో వస్తున్న కొత్త నౌక మాత్రం 3,800 టన్నుల బరువు కలిగి ఉండటంతో పాటు 110 మీటర్ల పొడవు ఉంది. ఇది గంటకు 33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. జాతికి అంకితంవిశాఖ సిటీ: హిందూ మహాసముద్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక సేవలు దోహదపడతాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ పేర్కొన్నారు. భారీ అత్యాధునిక సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను ఆయన బుధవారం విశాఖలోని నేవల్ డాక్ యార్డ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించిందని చెప్పారు. ఈ నౌకలో మల్టీ బీమ్ ఎకో సౌండర్‌లు, సైడ్ స్కాన్ సోనార్లు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ వంటి అధునాతన హైడ్రోగ్రాఫిక్ సిస్టమ్‌లు పొందుపరిచినట్టు వెల్లడించారు. ఓడరేవులు, నావిగేషనల్ చానల్స్, ఎకనావిుక్ ఎక్స్‌క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహణ, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుందని వివరించారు. శోధన–రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తుల సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్‌గానూ సేవలు అందించనుందని చెప్పారు. ఈ నౌక హిందూ మహాసముద్రంలో భద్రతతోపాటు పర్యావరణ, శాస్త్రీయ అన్వేషణ, శాంతి పరిరక్షక కార్యక్రమాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. అత్యాధునిక సర్వే సాంకేతికతతూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ మాట్లాడుతూ.. 110 మీటర్ల పొడవున్న నిర్దేశక్ నౌక అత్యాధునిక సర్వే సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. హిందూ మహా సముద్ర పరిసర ప్రాంతాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేస్తూ భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఈ నిర్దేశక్ నౌక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2025 నాటికి మరో రెండు నౌకలు భారత నౌకాదళంలోకి చేరనున్నాయని వెల్లడించారు. -
మైత్రీబంధంలో శుభ పరిణామం
ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు. కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన.శ్రీలంక నూతన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకె తన తొలి విదేశీ పర్యటనకు భారతదేశాన్ని ఎంచుకోవడం, ఢిల్లీ రావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు సానుకూల సూచన. శ్రీలంకలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో ప్రధాన భాగస్వామి, సైద్ధాంతికంగా మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గుచూపే రాజకీయ పక్షమైన జనతా విముక్తి పెరుమున (జేవీపీ), దానికి సారథిగా దిసనాయకె చైనా పక్షం వహిస్తారని భావించారు. పైగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు సహా అనేక అంశాలలో ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్ ప్రభావమూ తక్కువేమీ కాదు. మరోపక్క, 1980లలో ద్వీపదేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధ వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, జేవీపీ ఆది నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరించేది. పైపెచ్చు కొంత కాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ, మనకు గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకొనేందుకు అనుమతించేది లేదంటూ భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చిన హామీ మండువేసవిలో పన్నీటిజల్లు లాంటిది. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపా ల్సిన చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ప్రతిఫలించడం విశేషం.ద్వీపదేశాధ్యక్షుడికీ, భారత ప్రధాని మోదీకీ మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పు కోదగ్గ అంశం. భారత విదేశీ విధానానికి దీన్ని ఓ విజయ సూచనగానూ భావించవచ్చు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్‌ను అనుమానిస్తూ, ఉద్దేశపూర్వకంగానే చైనా గాఢపరిష్వంగంలోకి చేరిన సందర్భంలో... నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనకు చైనాను కాక భారత్‌ను ఎంచు కోవడం మళ్ళీ పల్లవిస్తున్న స్నేహరాగం అనుకోవచ్చు. వెరసి, చైనాకు స్వల్పంగా దూరం జరిగి, మళ్ళీ భారత్‌తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారు తున్న ఆలోచనా సరళికి సంకేతం. నిజానికి, కరోనా అనంతర కాలంలో ఆర్థికవ్యవస్థ కుప్ప కూలి పోయి, చేదు అనుభవాలు ఎదురుకావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ మునుపటి వంశపారంపర్య, కుటుంబపాలిత రాజకీయ పార్టీల స్థానంలో కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం మరింత తోడ్పడింది. అలాగే, ఇరుగుపొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్య మంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు 500 కోట్ల డాలర్ల పైచిలుకు మేర భారత్ సాయంమరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. హంబన్‌తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ళ లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయింది. అలాగే, నిన్నటి దాకా చైనా నౌకలు తమ గూఢచర్య యాత్రలు సాగిస్తూ, నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిష్పూచీగా లంగరు వేసేవి. కానీ, ఇప్పుడు దిసనాయకె తాజా ఆశ్వాసనతో పరిస్థితి మారింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా సులభమేమీ కాదు. ఇంతమాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిందనుకోలేం. ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడి, కొత్త అధ్యాయం మొదలైందనుకో వచ్చు. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్నా, రక్షణ సహా అనేక అంశాల్లో భారత – శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి – పవన విద్యుత్ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. అలాగే, అభివృద్ధి చెందని దేశాలతో దౌత్య పరంగా ముందుకు సాగేందుకు... భారత్ కొంతకాలంగా రుణసాయం నమూనా నుంచి పెట్టుబ డుల ఆధారిత భాగస్వామ్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీ కలిసొస్తోంది. అన్ని అంశాలకూ తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణి కాకున్నా, చేపల వేటకై శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న భారతీయ మత్స్యకారులకు ఆ దేశ నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఇక్కట్లు, శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షల లాంటివి కూడా తాజా భేటీలో ప్రస్తావనకు రావడం సుగుణం. అలాగే, భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద, దిసనాయకె తాజా పర్యటన చిరకాల భారత – శ్రీలంక మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచింది. అనేక సంవత్సరాల ఆర్థిక, రాజకీయ సంక్షోభం తర్వాత ద్వీపదేశం పునర్నిర్మాణ బాటలో సాగుతూ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టడం సంతోషకరమే కాక శ్రేయోదాయకం. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొలంబో పర్యటన జరిపి, ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. సమీప సముద్రయాన పొరుగు దేశంగా వాణిజ్యం నుంచి ప్రాంతీయ భద్రతా పరిరక్షణ వరకు అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా భారత్‌కు శ్రీలంక కీలకం. అదే సమయంలో విదేశాంగ విధానంలో దిసనాయకె ఆచరణాత్మకదృక్పథమూ అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన, భారత – శ్రీలంకల మధ్యసంబంధాలు కొంత మెరుగవడం ఇరుపక్షాలకూ మేలు చేసేవే. పరస్పర ప్రయోజనాలను అది కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలకూ కావాల్సింది అదే! -
భారత్ ‘ఖో ఖో’ కూత పాక్‌తో షురూ
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్ సీఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం జవహర్లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్‌కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ చెప్పారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
ఖో ఖో ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్
మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ టోర్నీకి భారత్ వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ప్రచారం కల్పించే క్రమంలో ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) కీలక ముందడుగు వేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించినట్లు బుధవారం వెల్లడించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాకారుల జాతీయ శిక్షణ శిబిరంలో మీడియా సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాంషు మిట్టల్, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ త్యాగితో పాటు భారత పురుషుల, మహిళా క్రీడాకారులు, కోచ్‌లు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఖో ఖో ప్రపంచ కప్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఆటతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. దేశ రాజధానిలో ప్రపంచ కప్ నిర్వహించడం ప్రశంసనీయమన్నాడు. ఖో ఖో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో థ్రిల్ అవుతున్నానని చెప్పాడు.ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే"తొలి ఖో ఖో ప్రపంచ కప్– 2025తో భాగం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది భారత నేల, ఆత్మ, బలానికి ఇచ్చే నివాళి. నాతో పాటు మనమంతా జీవితంలో ఏదో ఒక దశలో ఖో ఖో ఆడిన వాళ్లమే’ అని సల్మాన్ ఖాన్ తన సందేశంలో పేర్కొన్నారు. ‘నాన్‌స్టాప్ యాక్షన్‌తో ఉత్కంఠభరితమైన క్రీడ అయిన ఖో ఖో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వేదికపై ఖో ఖో స్ఫూర్తిని చాటేందుకు ఏకం అవుదాం’ అని పిలుపునిచ్చారు.మన మట్టిలో పుట్టిన ఆట కోసంఇక కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఉనికి ప్రపంచ కప్ వీక్షకుల సంఖ్యను పెంచుతుందని నమ్ముతున్నారు. "సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన బిజీ షెడ్యూల్లో కూడా మన మట్టిలో పుట్టిన ఆట కోసం సమయం ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.క్రీడ పట్ల ఆయన అభిరుచి నిజంగా స్ఫూర్తిదాయకం. రాబోయే ప్రపంచ కప్‌నకు సల్మాన్ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తాడని మేము విశ్వసిస్తున్నాము. ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌ను విజయవంతం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో జనవరి 13–19 మధ్య ఖో ఖో ప్రపంచకప్ జరుగనుంది. వారం రోజుల పాటు జరిగే ఖో ఖో ప్రపంచ కప్‌లో టోర్నమెంట్లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీపడతాయి. మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్ కోసం భారత్‌కు వస్తున్నాయి.కాగా, జాతీయ శిక్షణ శిబిరంలో ప్రతీక్ వైకర్, ఆదిత్య గన్‌పూలే, రామ్‌జీ కశ్యప్, దిలీప్ ఖాండ్వీ, సుయాష్ గార్గేట్, గౌతమ్ ఎంకే సచిన్ భార్ఘవ, విశాల్, అరుణ్ గుంకీ, ప్రియాంక ఇంగ్లే, మాగై మజ్హి, మీన్ ముస్కనన్, . చేత్రా బి, నస్రీన్, రేష్మా రాథోడ్, నిర్మలా పాండే వంటి స్టార్ ప్లేయర్లతో కూడిన పురుషుల, మహిళల జట్లకు డెమో మ్యాచ్‌ను నిర్వహించారు.భారత ఒలింపిక్ సంఘం మద్దతుప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని థ్రిల్లింగ్ అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుంది. కేకేఎఫ్ఐ కూడా ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోంది. అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేసింది. మరోవైపు.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఖో ఖో ప్రపంచ కప్‌నకు మద్దతు ఇస్తోంది. ఇందుకోసం ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. -
Minority Rights Day: మైనారిటీలంటే ఎవరు? జాబితాలో ఎవరున్నారు?
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మైనారిటీ కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అలాగే ఈరోజు దేశంలోని మైనారిటీల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 2013లో తొలిసారిగా మన దేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.1992, డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో జాతి, మతపరమైన, భాషాపరమైన మైనారిటీలకు ప్రత్యేక హక్కులను ఆమోదించింది. 2013లో భారతదేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మైనారిటీ సమూహాల గుర్తింపు, హక్కులను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిక్లరేషన్ రాష్ట్రాలను కోరింది.నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ (ఎన్సీఎం)ను 1992లో జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం కింద అధికారికంగా స్థాపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలతో పాటు గుర్తింపు పొందిన మైనారిటీ కమ్యూనిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించడం ఎన్సీఎం లక్ష్యం. 2014లో జైనులను ఈ జాబితాలో చేర్చారు. భారతదేశంలో మైనారిటీల హక్కులను వివిధ రాజ్యాంగ నిబంధనలలో పొందుపరిచారు. ఆర్టికల్ 29, 30 ప్రకారం వారికి హక్కులపై హామీలిచ్చారు. మైనారిటీలకు విద్య, సంస్కృతి, మతం లేదా భాష ఆధారంగా వివక్ష నుండి స్వేచ్ఛను పొందే హక్కులను రాజ్యాంగం కల్పించింది. వీటిని అమలు చేయడానికి, మైనారిటీ వర్గాల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎన్సీఎం పనిచేస్తుంది.ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైనులను ఎన్సీఎం మైనారిటీలుగా గుర్తిస్తుంది. మైనారిటీ హక్కుల దినోత్సవ ప్రాముఖ్యత విషయానికొస్తే.. మైనారిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించేందుకు, వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఈరోజు(డిసెంబరు 18)న నిర్వహిస్తుంటారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు , సామాజిక న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని మైనారిటీ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.డొనాల్డ్ ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేయడంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై చర్చించారు. ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదు. ఇకపై అలా కుదరదు. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తాం. అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయి. భారత్,బ్రెజిల్ తమ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తే, ప్రతిఫలంగా అమెరికా కూడా అదే చేస్తుంది. అమెరికాకు చెందిన ఏదైనా ఓ ఉత్పత్తిపై రూ.100 నుంచి రూ.200 వరకు భారత్,బ్రెజిల్‌లు వసూలు చేస్తున్నాయి. మేం కూడా అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు.ట్రంప్‌కు కెనడా హెచ్చరికలు ఇప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వస్తువులపై టారిఫ్ విధిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్ టారీఫ్‌లు విధిస్తే.. చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకొంటున్నారని కెనడా ప్రధాని ట్రూడో హెచ్చరించారు. హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే.. తాము ప్రతిచర్యలకు దిగుతామని ట్రూడో హెచ్చరించారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో వారు చర్చలకొచ్చారన్నారు.