సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య | ICC Fines Suryakumar Yadav 30% For Political Comment After India’s Win Over Pakistan In Asia Cup | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య

Sep 27 2025 1:37 AM | Updated on Sep 27 2025 10:54 AM

ICC action against Suryakumar Yadav

మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా

శిక్షపై అప్పీల్‌ చేసిన భారత్‌

రవూఫ్‌కు 30 శాతం జరిమానా  

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై విజయాన్ని భారత సైనికులకు  అంకితం ఇస్తున్నట్లుగా  భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ వ్యాఖ్య రాజకీయపరమైనదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అతనిపై చర్య తీసుకుంది. సూర్యకుమార్‌ మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. సెప్టెంబర్‌ 14న లీగ్‌ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ‘పహల్గామ్‌ ఉగ్రవాద దాడి బాధితులకు మేం అండగా ఉంటాం. మా విజయం భారత సైనికులకు అంకితం’ అని సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో ఆర్మీ ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రశ్నిస్తూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలోనూ రాజకీయపరమైన, గాజాపై ఇజ్రాయిల్‌ దాడివంటి అంశాలపై క్రికెటర్లు స్పందించకుండా ఐసీసీ ఆంక్షలు పెట్టిన విషయాన్ని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. 

ఈ ఘటనపై మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ విచారణ జరిపారు. రిఫరీ ముందు హాజరైన సూర్యకుమార్‌ తాను ఎలాంటి తప్పూ చేయలేదని సమాధానమిచ్చాడు. సూర్య వివరణపై విభేదించిన రిఫరీ ఇక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ 30 శాతం జరిమానా విధించారు. ఈ శిక్షపై బీసీసీఐ అప్పీల్‌ చేసినట్లు సమాచారం. అయితే మళ్లీ ఎప్పుడు విచారణ జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఇక్కడా కూడా సూర్యదే తప్పని నిర్ధారణ అయితే శిక్ష మరింత పెరుగుతుంది.  

ఫర్హాన్‌కు హెచ్చరికతో సరి! 
సూపర్‌–4 దశలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు హారిస్‌ రవూఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ప్రవర్తన గురించి బీసీసీఐ చేసిన ఫిర్యాదుపై కూడా రిచర్డ్సన్‌ విచారణ జరిపారు. ప్రేక్షకుల వైపు చూస్తూ యుద్ధంలో భారత విమానాలు కూలినట్లుగా, వాటి సంఖ్య ఆరు అన్నట్లుగా రవూఫ్‌ పదే పదే సైగలు చేశాడు. తాను కూడా తప్పేమీ చేయలేదని, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకే అలా చేశానని రవూఫ్‌ ఇచ్చిన వివరణతో కూడా సంతృప్తి చెందని రిఫరీ అతనికి కూడా 30 శాతం జరిమానా విధించారు. 

అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఏకే–47 తరహాలో బ్యాట్‌ను ఎక్కు పెట్టి సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌పై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. తాను అలా చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తాను ఉండే ప్రాంతంలో ఏదైనా సంబరాల సమయంలో ఇలా గన్‌ను సరదాగా ఎక్కు పెడతారని అతను చెప్పాడు. గతంలో ధోని, కోహ్లి కూడా మైదానంలో ఇలాంటిదే చేసిన విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు. దాంతో ఫర్హాన్‌ను రిఫరీ కేవలం హెచ్చరికతో వదిలి పెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement