భారత్‌ రాదు... నిర్ణయం మీదే! | India will not travel to Pakistan for Champions Trophy, ICC informs PCB | Sakshi
Sakshi News home page

భారత్‌ రాదు... నిర్ణయం మీదే!

Published Tue, Nov 12 2024 8:32 AM | Last Updated on Tue, Nov 12 2024 8:34 AM

India will not travel to Pakistan for Champions Trophy, ICC informs PCB

కరాచీ: వచ్చే ఏడాది పాకిస్తాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్‌లో ఆడేందుకు భారత్‌ ససేమిరా అంటోంది. మరోవైపు హైబ్రిడ్‌ మోడల్‌ (భారత్‌ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహణ)కి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో భారత్‌ మెగా టోర్నీ ఆడే విషయమై ఐసీసీని మరింత స్పష్టత కోరాలని పీసీబీ భావిస్తుండగా... ఐసీసీ నాన్చకుండా తేల్చేసింది. భారత్‌ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో... ఫైనల్‌ పోరు దుబాయ్‌లో నిర్వహించే హైబ్రిడ్‌ పద్ధతికే తాము అంగీకరిస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమకు స్పష్టం చేసిందని పాక్‌ బోర్డుకు ఐసీసీ తేల్చిచెప్పింది. 

భారత్‌ ఆడే మ్యాచ్‌లు కోల్పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా భర్తీ చేస్తామని ఐసీసీ హామీ ఇచి్చంది. ఇక కాదు... కూడదంటే... మీ ఇష్టమని పాక్‌ బోర్డుకు స్పష్టం చేయడంతో పీసీబీ కినుక వహించింది. నిరసనగా ఆతిథ్య హక్కులు వదిలేసుకోవాలని బోర్డు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. టోర్నీ ఆతిథ్యం నుంచి ఒకవేళ పాక్‌ తప్పుకుంటే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాలని ఐసీసీ భావిస్తోంది. ఎలాగైనా పాక్‌లో భారత క్రికెట్‌ జట్టు అడుగుపెట్టాలనే ఉద్దేశంతో హైబ్రిడ్‌ మోడల్‌కు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తోంది. 

‘హైబ్రిడ్‌ పద్ధతిలో చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించే ఆలోచన పీసీబీకి లేదు. ప్రస్తుత పరిస్థితిని బోర్డు అంచనా వేస్తోంది. (పాక్‌) ప్రభుత్వాన్ని  సంప్రదించాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది’ అని పీసీబీ అధికారి ఒకరు చెప్పారు. కాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య గడిచిన 16 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీసే జరగడం లేదు. 2008లో ముంబైపై పాక్‌ ఉగ్రదాడి అనంతరం రాజకీయ, క్రికెట్‌ బంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి భారత్, పాక్‌ జట్లు కేవలం ఐసీసీ ప్రపంచకప్‌ టోరీ్నల్లో, చాంపియన్స్‌ ట్రోఫీల్లోనే తలపడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement