Champions Trophy
-
చాంపియన్స్ ట్రోఫీతో వాంఖడేలో మరోసారి సంబరాలు
ముంబై: ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానానికి భారత క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం వాంఖడే మైదానంలో జరిగిన వేడుకలను తానెప్పటికీ మరవలేనని... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మరోసారి అలాంటి సంబరాలు చేసుకోవాలనుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. వాంఖడే స్టేడియం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆదివారం ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... ‘2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న రోజు వచ్చిన స్పందన అనూహ్యం. సాగరతీరం మొత్తం అభిమానులతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయా. మనవాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. అది ఎలా ఉంటుందో ఒకటికి రెండుసార్లు చూశాను. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా వాంఖడే స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అప్పుడు కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. త్వరలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆడే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మా మీద ఉంటాయని తెలుసు. మరో ఐసీసీ ట్రోఫీని తీసుకువచ్చి ఇక్కడ సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... వాంఖడేకు వస్తే ఇంటికి వచ్చినట్లే ఉంటుందని అన్నాడు. వాంఖడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘2013లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో చివరి టెస్టు వాంఖడేలో ఆడాలని ఉందని చెప్పా. నా అభ్యర్థనను అంగీకరించిన బోర్డు అందుకు అనుమతిచ్చింది. అప్పటి వరకు నేను మైదానంలో ఆడుతున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇక్కడ కెరీర్ చివరి మ్యాచ్ ఆడా. ఆరోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఇక నా జీవితంలో అత్యంత మధుర క్షణాలకు కూడా వాంఖడే వేదికగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంతో సంతోషించా. ఆ స్ఫూర్తితోనే ఆటపై మరింత దృష్టి పెట్టా. అయితే ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా వరల్డ్‌కప్ చేతికి చిక్కలేదు. ఎట్టకేలకు 2011లో నా కల వాంఖడే మైదానంలోనే నెరవేరింది’ అని అన్నాడు. తాను ఇదే మైదానంలో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. వాంఖడే 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. -
‘ఈడెన్’లో టీమిండియా సాధన
కోల్‌కతా: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు... ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. గాయం కారణంగా ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. మూడు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్ సెషన్లో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, శుబ్‌మన్ గిల్, హార్దిక్‌పాండ్యా, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు ప్రాక్టీస్ చేశారు. -
‘చాంపియన్స్’ పోరుకు సిద్ధం
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య, సంచలనాలు లేకుండా చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కాస్త సందేహాలు ఉన్నా...అతడిని టీమ్‌లోకి తీసుకోగా, వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమీ కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అంటున్నాడు. నలుగురు ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని కోల్పోవాల్సి రాగా... ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైస్వాల్ తొలిసారి వన్డే టీమ్‌లోకి వచ్చాడు. ఓవరాల్‌గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్ సాధించే సత్తా ఉందని సెలక్షన్ కమిటీ నమ్ముతోంది. ముంబై: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ కెపె్టన్సీపై చర్చ జరిగినా...2023 వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును ఫైనల్ చేర్చిన అతని నాయకత్వంపై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత జట్టు ‘సంధి దశ’లో ఉందని వినిపించినా...వన్డేల్లో దానికి ఇంకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్‌కప్‌లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్‌లోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్ కప్ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెపె్టన్‌గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో భారత్ తలపడుతుంది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది. రెండు వన్డేలకు హర్షిత్... ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నా...ప్ర«దాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్ పర్యటనలో హర్షిత్ 2 టెస్టులు ఆడాడు. స్పోర్ట్స్ హెర్నియా గాయంతో కివీస్‌తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా టీమ్‌లో స్థానం లభించింది. గాయంనుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్ ఆడకపోయినా...జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేస్తుండటంతో ఫిట్‌నెస్‌పై స్పష్టత వచి్చంది. ఫిట్‌గా మారి ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీమ్‌లోనూ స్థానం దక్కింది. టీమిండియా తరఫున ఇప్పటికే టెస్టుల్లో చెలరేగి...టి20 ఫార్మాట్లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు తొలిసారి వన్డే టీమ్‌లో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ టాప్–5లో ఉంటారు. నలుగురు ఆల్‌రౌండర్లు... సెలక్టర్లు ఒక ప్రధాన బౌలర్‌ను తగ్గించి మరీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా...ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్‌లకు స్థానం లభించింది. ఈ ముగ్గురూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కాగా, పాండ్యాతో కలిపి భారత టాప్–6 రైట్ హ్యాండర్లే ఉన్నారు. జట్టులో ముగ్గురే ప్రధాన పేసర్లు ఉన్నారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే ప్రధమ ప్రాధాన్యత ఇచి్చనట్లుగా భావించవచ్చు. వన్డేల్లో ఎప్పుడూ రెగ్యులర్‌గా చోటు దక్కించుకోకపోయినా, పెద్దగా ప్రభావం చూపని రిషభ్ పంత్‌ను రెండో కీపర్‌గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే... సంజు సామ్సన్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్‌తో వివాదం కారణంగా విజయ్‌హజారే ట్రోఫీకి సామ్సన్ దూరం కావడం కూడా సెలక్షన్‌పై ప్రభావం చూపించి ఉండవచ్చు. ‘బోర్డు కార్యదర్శితో మాట్లాడాలి’ క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల విషయంలో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను అనుమతించే విషయంపై మరికొంత సడలింపును వారు కోరుతున్నారు. ఇదే మాట మీడియా సమావేశంలో రోహిత్ నోటినుంచి వచి్చంది. ఇది నేరుగా రోహిత్ మీడియాతో చెప్పకపోయినా... అగార్కర్‌కు చెబుతుండటం అందరికీ వినిపించింది. ‘కొత్త నిబంధనలపై మరింత స్పష్టత కావాలి.ఈ సమావేశం తర్వాత నేను బోర్డు కార్యదర్శితో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నన్నే అడుగుతున్నారు’ అని అగార్కర్‌తో రోహిత్ అన్నాడు. మరో వైపు తనకు, హెడ్ కోచ్ గంభీర్‌కు మధ్య పరస్పర నమ్మకం ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు. మైదానంలోకి దిగడానికి ముందే తమ మధ్య వ్యూహాలకు సంబంధించిన చర్చ జరుగుతుందని...ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత అన్నీ తానే చూసుకుంటానని కెపె్టన్ వెల్లడించాడు. ఈ విషయంలో తమకు స్పష్టమైన విభజన రేఖ ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
చాంపియన్స్ ట్రోఫీకి నోర్జే దూరం
జొహన్నెస్‌బర్గ్: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్న రెండు రోజులకే పేసర్ ఆన్రిక్ నోర్జే కథ మారింది! వెన్ను నొప్పి గాయంతో అతను ఈ టోరీ్నకి దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించింది. సోమవారం ప్రకటించిన టీమ్‌లో నోర్జే పేరు కూడా ఉంది. ఫిట్‌గా ఉన్నాడని సెలక్టర్లు నోర్జేను ఎంపిక చేయగా... స్కానింగ్‌తో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. టోర్నీ ప్రారంభమయ్యే లోగా అతను కోలుకునే అవకాశం లేదని తేలింది. గత ఆరు ఐసీసీ టోర్నీల్లో మూడు సార్లు అతను గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 2019, 2023 వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఇప్పుడు మరో వన్డే టోర్నీకి దూరమయ్యాడు. ఈ మధ్య కాలంలో జరిగిన మూడు టి20 వరల్డ్ కప్‌లు (2021, 2022, 2024)లలో అతను జట్టులో భాగంగా ఉన్నాడు. నోర్జే స్థానంలో మరో ఆటగాడి పేరును దక్షిణాఫ్రికా ఇంకా ప్రకటించలేదు. -
భారత్ వర్సెస్ పాక్.. నెట్‌ఫ్లిక్స్‌లో దాయాది జట్ల డ్రామా
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ, ఉత్సాహమే వేరు. ఈ రెండు దాయాది జట్ల మధ్య ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు జరిగాయి. టెస్టులైనా, వన్డేలైనా, టి20లైనా ప్రతీ పోరు ప్రత్యేకమే. మైదానంలో ఇరు జట్ల వైరానికి సంబంధించి ఎన్నో ఘటనలను అభిమానులు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఆసక్తికర ఘటనలు, వ్యాఖ్యలు, వివాదాలతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొత్త డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ద గ్రేటెస్ట్ రైవల్రీ’ పేరుతో సిద్ధం చేసిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న ప్రసారం కానుంది. గ్రే మ్యాటర్ ఎంటర్‌నైట్‌మెంట్ నిర్మించిన ఈ డ్రామాకు చంద్రదేవ్ భగత్, స్టివార్ట్ సగ్ దర్శకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, జావేద్ మియాందాద్, వకార్ యూనిస్, సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్, వీరేంద్ర సెహా్వగ్, షోయబ్ అక్తర్, రవిచంద్రన్ అశి్వన్ ఇంటర్వ్యూలు ఇందులో ఉంటాయి. ‘రెండు దేశాల మధ్య మ్యాచ్‌లలో ఉండే భావోద్వేగాలు, తీవ్రతవంటివి ఇందులో చూపించాం. మీ అంచనాలకు తగ్గకుండా ఉత్కంఠభరితంగా దీనిని రూపొందించాం. మైదానంలో ఆట మాత్రమే కాదు. మైదానం బయట ఎన్నో ఆసక్తికర అంశాలను ఇందులో చూడవచ్చు’ అని రూపకర్తలు పేర్కొన్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి ఈ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఈ టోర్నీ కోసం ఎంపికయ్యారు. ఈ జట్టులో టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, వియాన్ ముల్దర్ లాంటి కొత్త ముఖాలు ఉన్నాయి. ఈ ముగ్గురికి ఇదే తొలి 50 ఓవర్ల ఐసీసీ టోర్నీ.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టు..టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 21న ఆడనుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 25న రావల్పిండిలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. తదనంతరం మార్చి 1న కరాచీలో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌తో పోటీపడనుంది.కాగా, సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఐసీసీ ఈవెంట్లలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. సౌతాఫ్రికా గత రెండు ఐసీసీ ఈవెంట్లలో చేసిన ప్రదర్శనలే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రిపీట్ చేయాలని భావిస్తుంది. సౌతాఫ్రికాకు ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనుభవం కూడా ఉంది. ఈ జట్టు 1998 ఇనాగురల్ ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా తాజాగా స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి పాక్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ అనంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు అర్హత సాధించింది. బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్‌ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కరుణ్.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్‌లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కరుణ్‌తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్‌లోనే ఉన్నాడు. వీహెచ్‌టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్‌టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.వీహెచ్‌టీ సింగిల్ ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్‌తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడి రీఎంట్రీ
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కాదని ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కావాల్సినంత ఫిట్నెస్ లేకపోడంతో ముజీబ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్‌కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్‌లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్‌లో) తలపడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ -
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించాడు. విండీస్‌తో సిరీస్‌ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్‌పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్‌తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్‌లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు.బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్‌తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.గత వారం జరిగిన బౌలింగ్ అసెస్మెంట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్‌కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య పాకిస్తాన్‌తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
అరివీర భయంకరమైన ఫామ్‌లో అయ్యర్.. టీమిండియాలో చోటు పక్కా..!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ఈ ఏడాది దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. దేశవాలీ క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్నాడు. శ్రేయస్ మిగతా టీమిండియా ఆటగాళ్లలా బీరాలకు పోకుండా తనను తాను తగ్గించుకుని దేశవాలీ క్రికెట్ ఆడాడు. శ్రేయస్ ఈ ఏడాది రంజీల్లో 90.4 సగటున, 88.8 స్ట్రయిక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 188.5 స్ట్రయిక్‌రేట్‌తో 49.3 సగటున 345 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ పట్టపగ్గాల్లేకుండా బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. వీహెచ్‌టీలో శ్రేయస్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీల సాయంతో 325 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ యావరేజ్ చూస్తే కళ్లు చెదురుతాయి. శ్రేయస్ 325 సగటున పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్‌రేట్ 131.6గా ఉంది. ఈ గణాంకాలతో శ్రేయస్ భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. పలు నివేదికల ప్రకారం శ్రేయస్ ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఇదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు తిరుగే ఉండదు. శ్రేయస్ టీమిండియా తరఫున చివరిగా గతేడాది ఆగస్ట్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రేయస్ తన చివరి టీ20ను 2023 డిసెంబర్లో ఆడాడు. బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ శ్రేయస్‌కు చివరి టీ20. టెస్ట్‌ల విషయానికొస్తే..శ్రేయస్ టెస్ట్‌ల రికార్డు అంత బాలేదు. 2021 నవంబర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ (న్యూజిలాండ్‌తో) ఆడిన శ్రేయస్.. 2024 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్ మ్యాచ్ (ఇంగ్లండ్) ఆడాడు. 33 ఏళ్ల శ్రేయస్ టీమిండియాలో చోటే లక్ష్యంగా దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్‌తో పరిమత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్లను ఈనెల 12వ తేదీలోపు ప్రకటించనున్నారు. చాలా నివేదికలు రెండు ఫార్మాట్లలో శ్రేయస్‌కు చోటు పక్కా అని అంటున్నాయి. శ్రేయస్ రాకతో మిడిలార్డర్లో టీమిండియా అత్యంత పటిష్టంగా మారుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీలో చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్లో మొదటి నుంచి శ్రేయస్‌కు తిరుగులేదు. ఈ ఫార్మాట్లో అతను 62 మ్యాచ్‌లు ఆడి 47.47 సగటున, 101.21 స్ట్రయిక్‌రేట్‌తో 2421 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లోనూ శ్రేయస్‌కు మెరుగైన రికార్డే ఉంది. పొట్టి ఫార్మాట్లో శ్రేయస్ 51 మ్యాచ్‌లు ఆడి 136.12 స్ట్రయిక్‌రేట్‌తో, 30.66 సగటున 1104 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అంతంతమాత్రంగా రాణించిన శ్రేయస్.. 14 మ్యాచ్‌ల్లో 36.86 సగటున 811 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20(చెన్నై)జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20(పుణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్.. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్ మార్చి 4న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-ఏ టాపర్, గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు పోటీపడతాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గ్రూప్-బి టాపర్, గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉండే జట్టును ఢీకొంటుంది. సెమీస్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాకు కొత్త తలనొప్పి..!
-
అజయ్ జడేజాతో కటీఫ్.. అఫ్గానిస్తాన్ మెంటార్‌గా పాక్ దిగ్గజం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు మెంటార్‌గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్‌ను ఏసీబీ నియమించింది. ఈ విషయాన్నిఏసీబీ అధికారికంగా బుధవారం ప్రకటించింది."ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అఫ్గానిస్తాన్ మెంటార్‌గా పాకిస్తాన్ లెజెండ్ యూనిస్ ఖాన్‌ను ఏసీబీ ఎంపిక చేసింది. అతడు ఈవెంట్ ఆరంభానికి ముందు జట్టుతో అతడు కలవనున్నాడు" అని అఫ్గాన్ క్రికెట్ అధికార ప్రతినిధి సయీద్ నసీమ్ సాదత్ పేర్కొన్నాడు. కాగా యూనిస్ ఖాన్ గతంలో 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.అజయ్ జడేజాతో కటీఫ్..ఇక వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గాన్ జట్టు మెంటార్‌గా పనిచేసిన భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాతో ఈసారి ఏసీబీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అతడి మార్గదర్శకత్వంలో అఫ్గానిస్తాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లను ఓడించి అడుగు దూరంలో తొలిసారి సెమీస్ చేరే అవకాశాన్ని అఫ్గాన్లు కోల్పోయారు. వరల్డ్‌క్లాస్ జట్లను అఫ్గాన్ ఓడించడంలో అజయ్ జడేజాది కీలక పాత్ర అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో జడేజాకు వీసా సమస్యలు తలెత్తే అవకాశముంది. అంతేకాకుండా పరిస్థితుల అనుగుణంగా యూనిస్ వైపు ఏసీబీ మొగ్గు చూపినట్లు సమాచారం. అఫ్గానిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా సంచలన ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్‌లను ఓడించి తొలిసారి పొట్టి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు.కోచ్‌గా అనుభవం..పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన యూనిస్ ఖాన్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ,అబుదాబి T10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌తో కూడా కలిసి పనిచేశాడు. పాక్ తరపున 118 టెస్టులు ఆడిన యూనిస్ ఖాన్ 10,099 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే 2009 టీ20 ప్రపంచకప్‌ను పాక్ సొంతం చేసుకుంది.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్ బోర్డును (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, ఈసీబీ) కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ పొలిటీషియన్స్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని చెప్పిన ఈసీబీ.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.కాగా, 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అడ్డగోలు అంక్షలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు ఆరవ తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో (జిమ్‌లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని.. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అంక్షలు విధించింది. ఈ అంక్షల కారణంగానే ఇంగ్లండ్ ప్రజాప్రతినిధులు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలాగే..!మహిళలపై తాలిబన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు నిరాకరించింది. అయితే ఆతర్వాత ఇరు జట్లు 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో తలపడ్డాయి.జింబాబ్వేతో మ్యాచ్‌ను బహిష్కరించిన ఇంగ్లండ్ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ 2003 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయించింది.ఇదిలా ఉంటే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో దాయాదుల సమరం ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్‌లలో తలపడనుంది. 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.అయితే ఈ సిరీస్‌లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు.జస్ప్రీత్ బుమ్రా గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్పై వర్క్‌లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సదరు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.వన్డేల్లో ఆడనున్న రోహిత్-కోహ్లిఇక ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడి తమ రిథమ్‌ను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్‌తో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.చదవండి: గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం -
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత జట్టుకు మరో కఠిన సవాలు ఎదురు కానుంది. పాకిస్తాన్, యూఈఏ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గోనేందుకు టీమిండియా సిద్దం కానుంది.50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా రన్నరప్ హోదాలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి షూరూ కానుంది. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే?ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఐసీసీ నిర్దేశించిన గడువుకు ఒక రోజు ముందు (జనవరి 11)న భారత జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినవెంటనే జట్టు ఎంపికకు కసరత్తులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకేసారి భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అయ్యర్‌కు ఛాన్స్కాగా ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదే విధంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మహ్మద్ షమీ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు స్వదేశంలో జరగనున్న ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లతో షమీ పునరాగమనం చేసే అవకాశముంది.ఇంగ్లీష్ జట్టుతో టీ20 లేదా వన్డే సిరీస్‌కు ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సైతం సెలక్టర్లు తిరిగి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లను అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. -
2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
మెల్బోర్న్ టెస్ట్‌లో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్ట్‌తో కొత్త ఏడాదిని (2025) ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి.మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 జరుగుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ఇలా ఉండనుంది.జూన్ 20-24: తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6: రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14: మూడో టెస్ట్ (లండన్, లార్డ్స్)జులై 23-27: నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4: ఐదో టెస్ట్ (లండన్, కెన్నింగ్స్టన్ ఓవల్)షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో కూడా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.2025లో టీమిండియా ఆడే వన్డేలుఇంగ్లండ్తో 3ఛాంపియన్స్ ట్రోఫీలో 5బంగ్లాదేశ్‌తో 3 (బంగ్లాదేశ్‌తో)ఆస్ట్రేలియాతో 3 (ఆస్ట్రేలియాలో)సౌతాఫ్రికాతో 3 (భారత్‌లో)వచ్చే ఏడాది టీమిండియా ఆడే టెస్ట్లుఆస్ట్రేలియాతో ఒకటి (బీజీటీ)క్వాలిఫై అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ఇంగ్లండ్తో 5 (ఇంగ్లండ్‌లో)వెస్టిండీస్‌తో 2 (భారత్‌లో)సౌతాఫ్రికాతో 2 (భారత్‌లో) -
పాక్ ఎత్తులకు చెక్
-
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్
-
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్ జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో) జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో) జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో) -
ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే కీలకమైన వైట్‌బాల్ సిరీస్‌లకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్థార్ ఆటగాడు, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా పై రెండు ఈవెంట్లకు దూరమయ్యాడు. 33 ఏళ్ల స్టోక్స్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురయ్యాడు. భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్, యాషెస్ సిరీస్ 2025-26 దృష్ట్యా స్టోక్స్‌కు విశ్రాంతి కల్పించారని తెలుస్తుంది.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు టీమిండియాతో జరిగే వైట్‌బాల్ సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. టెస్ట్ జట్టు కీలక సభ్యుడు జో రూట్, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి సారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. వికెట్కీపర్లు జేమీ స్మిత్, ఫిల్ సాల్ట్.. రైజింగ్ స్టార్ జేకబ్ బేతెల్ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.భారత్‌తో సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా మెక్‌కల్లమ్‌కు ఇవే తొలి అసైన్మెంట్స్ అవుతాయి. ఇప్పటివరకు మెక్కల్లమ్ కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే హెడ్ కోచ్‌గా ఉన్నాడు.భారత్‌తో జరిగే వన్డే సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీల కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్తో జరిగే టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్భారత్లో ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు..జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరుగనుంది. టోర్నీకి సంబంధించిన మ్యాచ్ తేదీలను, వేదికలను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగనున్నాయి. -
ఐసీసీ వేదికపై మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్
-
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖారారు చేసిటనట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'రెవ్‌స్పోర్ట్జ్' అనే స్పోర్ట్స్ వెబ్ సైట్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.రెవ్‌స్పోర్ట్జ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే టీమిండియా తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్ధ వేదికపై జరుగుతాయి అని సదరు వెబ్సైట్ పేర్కొంది.దాయాదుల పోరు ఎప్పుడంటే?రెవ్‌స్పోర్ట్జ్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్ధిలు పాకిస్తాన్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లను ఆడనుంది. న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న ఆడనుంది.మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీమిండియా తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్ వేదికలగా ఆడే అవకాశముంది.కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. భారత మ్యాచ్‌లు మినహా మిగితా అన్నీ పాక్‌లోనే జరగనున్నాయి. టీమిండియా ఒకవేళ నాకౌట్స్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా తటస్థవేదిక గానే జరగనున్నాయి.చదవండి: VHT 2024: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ.. 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్‌ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్‌నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్‌లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్‌లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌లు ఆడే అన్నీ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్‌లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్‌కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్‌లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్‌ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్‌లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు యూఏఈ (దుబాయ్)లో... భారత్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. -
పాకిస్తాన్ తలవంచినట్లే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ–2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తపడింది. ‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించేది లేదని, మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహిస్తామని చెబుతూ వచి్చన పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నారు. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మేం ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే’ అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా... నఖ్వీ మాటలను బట్టి చేస్తూ ‘హైబ్రిడ్’ మోడల్ ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్‌కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.. ‘హైబ్రిడ్’ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. ఐసీసీ టోరీ్నల విషయంలో తాము ‘సమానత్వం’ కోరుకుంటున్నట్లు నఖ్వీ వెల్లడించారు. దీని ప్రకారం మున్ముందు భారత్‌లో జరిగే ఐసీసీ టోరీ్నలకు కూడా ‘హైబ్రిడ్’ మోడల్ అమలు చేయాలని పీసీబీ కోరింది. అంటే తాము కూడా ఇకపై భారత్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడమని...తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేసింది. 2026లో టి20 వరల్డ్ కప్, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఆసియా కప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో వైపు ఐసీసీ నుంచే తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని, ‘హైబ్రిడ్’కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరగనుంది. పాక్‌లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండలను నిర్ణయించారు.