
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇవాళ (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్ జరుగనుంది. గాయాలతో సతమతమవుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా.. ఇటీవలే భారత్ చేతిలో భంగపడ్డ ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-బిలో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్‌ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
కీలక ఆటగాళ్లు దూరం
ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. కీలక ఆటగాళ్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ గాయాల బారిన పడగా.. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. మరో స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ సారథ్య బాధ్యతలను మోస్తున్నాడు.
భారత్ చేతిలో భంగపాటు
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ భారత్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయి భంగపాటుకు గురైంది. భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఆసీస్‌తో మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు జేమీ స్మిత్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రూట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఆసీస్‌తో వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 161 సార్లు ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఆసీస్ 91 సార్లు గెలుపొందగా.. ఇంగ్లండ్ 65 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్‌లు టై కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిది ఆధిపత్యం..?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. చివరి రెండు ఎడిషన్లలో (2013, 2017) ఇంగ్లండ్ ఆసీస్‌పై జయకేతనం ఎగురవేసింది. ఇక ఇరు జట్లు చివరిగా తలపడిన ఐదు వన్డేల్లో ఆసీస్ 3, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
ఆసీస్ జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), మాథ్యూ షార్ట్, ట్రవిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిష్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ
Comments
Please login to add a commentAdd a comment