
ఫామ్‌లో టీమిండియా ఆటగాళ్లు
స్పిన్నర్ల ప్రభావం కీలకం
సాక్షి క్రీడా విభాగం: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు అజేయంగా తమ జైత్రయాత్రను కొనసాగించింది. వరుసగా పది విజయాలతో ఆల్‌టైమ్ గ్రేట్ వన్డే టీమ్‌లలో ఒకటిగా కనిపించింది. దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడినా... ఇప్పుడు దాదాపు పదిహేను నెలల తర్వాత ఇదే ఫార్మాట్‌లో శిఖరాన నిలిచే అవకాశం మళ్లీ జట్టు ముందుకు వచ్చింది.
ముఖ్యంగా వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్న ఆటగాళ్లే దాదాపుగా ఈ మెగా టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు. కాబట్టి చాంపియన్స్ ట్రోఫీ విజయం వారికి ప్రత్యేకంగా మారవచ్చు. ఫామ్‌పరంగా చూసినా ఇతర జట్లతో పోలిస్తే రోహిత్ సేననే బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడోసారి మన జట్టు టైటిల్ కొడుతుందా అనేది ఆసక్తికరం.
2017లో రన్నరప్‌గా నిలిచిన జట్టులోని ఐదుగురు ప్లేయర్లు ప్రస్తుత టీమ్‌లో భాగంగా ఉన్నారు. యూఏఈలో 2021 టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరడంలో విఫలమైన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ ఇక్కడ ఐసీసీ టోర్నీలో బరిలో నిలిచింది.
బ్యాటింగ్‌లో సత్తా ప్రదర్శిస్తే...
టీమిండియా వన్డే బ్యాటింగ్ కూర్పు చాలా కాలంగా అనూహ్య మార్పులు లేకుండా నిలకడగా ఉంది. అదే జట్టుకు ప్రధాన బలం కూడా. రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్‌లతో టాప్–5 విషయంలో ఎలాంటి సమస్య లేదు. 2023 నుంచి చూస్తే వీరంతా కనీసం 1000 పరుగులు సాధించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించడం కూడా సానుకూలాంశం. గిల్, అయ్యర్ చెలరేగిపోతుండగా ఫామ్‌ను అందుకున్న రోహిత్ సెంచరీతో సత్తా చాటాడు. కోహ్లి, రాహుల్ కూడా ఆకట్టుకున్నారు.
ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాల బ్యాటింగ్ మనకు ఎప్పుడూ అదనపు ప్రయోజనాన్ని అందించింది. వీరికి ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా జత కలిశాడు. ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో అక్షర్ అంచనాలకు మించి మెరుగై ఏ స్థానంలోనైనా ఆడి ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ విఫలమైతే పంత్ రూపంలో తగిన ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది కాబట్టి బెంగ లేదు.
పేసర్లు రాణిస్తారా...
జస్‌ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కావడం నిస్సందేహంగా జట్టుకు పెద్ద దెబ్బ. రవిశాస్త్రి చెప్పినట్లు అతని గైర్హాజరు జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అయితే అందుబాటులో ఉన్నవారిలో షమీ ఆ స్థాయి బౌలర్. కానీ గాయం నుంచి కోలుకొని వచ్చిన అతను ఎంత వరకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడనేది చూడాలి. పెద్దగా అనుభవం లేని అర్‡్షదీప్, హర్షిత్ రాణా ఒత్తిడిని తట్టుకొని షమీకి అండగా నిలవడం అవసరం. హార్దిక్ పాండ్యా సత్తా చాటగలడు కాబట్టి మూడో పేసర్ బెంగ లేదు.
ముగ్గురు ఖాయం!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపుపై ఆశలు రేపుతున్న కీలక విభాగం స్పిన్ బౌలింగే. మన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతుండటం కచ్చితంగా సానుకూలాంశం. అందుకే టీమ్ ఐదుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. ఫిబ్రవరి 9 వరకు ఐఎల్‌టి20 మ్యాచ్‌ల నిర్వహణలో పిచ్‌లన్నీ నెమ్మదిగా మారిపోయాయి. 11 రోజుల వ్యవధిలో జీవం ఉన్న పిచ్‌లను తయారు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి ఇవన్నీ స్పిన్‌కు అనుకూలించవచ్చు.
బౌలింగ్‌లో వైవిధ్యం ఉన్న మన స్పిన్నర్లు ఫామ్‌లో కూడా ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టంగా మారిపోనుంది. ఆరేళ్లుగా ఇక్కడ పెద్ద జట్లేవీ వన్డేలు ఆడలేదు. అయితే 2018 నుంచి ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 213 మాత్రమే. తక్కువ స్కోరింగ్‌ల మ్యాచ్‌లలో స్పిన్నర్లు ప్రభావం చూపడం ఖాయం. తుది జట్టులో కనీసం ముగ్గురిని జట్టు ఎంచుకుంటుంది.
2 చాంపియన్స్ ట్రోఫీలో రెండుసార్లు (2002, 2013)లలో విజేతగా నిలిచిన భారత్ మరో రెండుసార్లు (2000, 2017)లో ఫైనల్లో ఓడింది.
9 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత్ 9 వన్డేలే ఆడింది. ఇందులో 5 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. వీటిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై సిరీస్ నెగ్గగా... శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment