కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్‌ శర్మనే..! | Wisden Picks Rohit Sharma As The Captain In Team Of Tournament In Champions Trophy 2025 | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్‌ శర్మనే..!

Published Thu, Mar 13 2025 11:07 AM | Last Updated on Thu, Mar 13 2025 1:05 PM

Wisden Picks Rohit Sharma As The Captain In Team Of Tournament In Champions Trophy 2025

ప్రతిష్టాత్మక విజ్డన్‌ సంస్థ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా టీమిండియా సారధి రోహిత్‌ శర్మను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి విజ్డన్‌ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీకి ఎంపికయ్యారు. 

ఈ జట్టుకు న్యూజిలాండ్‌ నుంచి నలుగురు.. ఇంగ్లండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌ నుంచి రచిన్‌ రవీంద్ర, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌, ఫైనల్‌కు ముందు గాయపడిన స్పీడ్‌స్టర్‌ మ్యాట్‌ హెన్రీ విజ్డన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌ నుంచి జో రూట్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ విజ్డన్‌ జట్టుకు ఎంపికయ్యారు.

రోహిత్‌కు జతగా రచిన్‌ రవీంద్ర ఓపెనర్‌గా ఎంపిక కాగా.. విరాట్‌ వన్‌డౌన్‌లో, జో రూట్‌ నాలుగో స్థానం కోసం ఎంపిక చేయబడ్డారు. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఎంపిక కాగా.. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోటాలో ఒమర్‌జాయ్‌, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా బ్రేస్‌వెల్‌, సాంట్నర్‌ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తి.. స్పెషలిస్ట్‌ పేసర్లుగా మహ్మద్‌ షమీ, మ్యాట్‌ హెన్రీ ఎంపికయ్యారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టును ఎంపిక చేయడంతో పాటు విజ్డన్‌ టీమిండియా ఆటగాళ్లకు రేటింగ్‌లు కూడా ఇచ్చింది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా ఈ రేటింగ్‌లు ఇచ్చింది. భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌, వరుణ్‌ చక్రవర్తి అత్యధిక రేటింగ్‌ పాయింట్లు  పొందారు. వీరికి 10కి 9 పాయింట్లు లభించాయి. 

రాహుల్‌, వరుణ్‌ తర్వాత విరాట్‌ అత్యధిక రేటింగ్‌ పాయింట్లు పొందాడు. విరాట్‌కు 10కి 8.5 రేటింగ్‌ పాయింట్లు లభించాయి. ఆతర్వాత రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌కు తలో 8 పాయింట్లు లభించాయి. శుభ్‌మన్‌ గిల్‌కు 7.5.. షమీ, జడేజాలకు తలో 7.. హార్దిక్‌, హర్షిత్‌ రాణాకు 10కి 6 పాయింట్లు లభించాయి.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌ అజేయ జట్టుగా నిలిచింది. ఈ టైటిల్‌తో భారత్‌ ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. రోహిత్‌ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించింది. 

కేవలం​ ఏడాదిలోపే భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్‌ శర్మ బాధ్యతాయుతమైన అర్ద శతకం సాధించి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గానూ రోహిత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement