
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడాన్ని పాకిస్తాన్ వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ ఒకే వేదికపై ఆడి లబ్ది పొందిందని కొన్ని భారత వ్యతిరేక శక్తులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రాతినిథ్యమే లేని విండీస్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం మొదలుపెట్టింది.
భారత్ దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటాన్ని విండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ తప్పుబట్టాడు. మిగతా జట్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించి మ్యాచ్‌లు ఆడితే, టీమిండియా మాత్రం కాలు కదపకుండా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడిందని అన్నాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చినా పాకిస్తాన్ కూడా టీమిండియాతో మ్యాచ్‌కు దుబాయ్‌కు వెళ్లిందని గుర్తు చేశాడు.

ఇలాంటప్పుడు పాక్ జట్టుకు ఆతిథ్య సౌలభ్యం ఎక్కడ లభించిందని ప్రశ్నించాడు. ఒకే వేదికపై టీమిండియా మ్యాచ్‌లు షెడ్యూల్ చేసినందుకు ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. బీసీసీఐ ప్రతి కోరికను తీర్చడాన్ని ఐసీసీ మానుకోవాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక (దుబాయ్) విషయంలో ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డాడు.
ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడటం ద్వారా టీమిండియా లబ్ది పొందిందని ఆరోపించాడు. ఈ విషయంలో మిగతా జట్లకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇకనైనా ఐసీసీ బీసీసీఐకి సహకరించడం మానుకోవాలని అన్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఓ విషయంలో ఐసీసీ బీసీసీఐకి సహకరించిందని నిరాధార ఆరోపణ చేశాడు. టీమిండియా కోసం బీసీసీఐ చేసే ప్రతి అభ్యర్థనను నెరవేర్చకూడదని ఐసీసీకి సూచించాడు.
అప్పుడప్పుడైనా బీసీసీఐకి నో చెప్పాలని వ్యంగ్యంగా అన్నాడు. ప్రపంచంలో బీసీసీఐ ధనిక బోర్డు కావడంతో ఐసీసీ వారి చెప్పినట్టల్లా ఆడుతుందని అన్నాడు. తనవరకు ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని ఎద్దేవా చేశాడు. బీసీసీఐ ప్రతి విషయంలో ఐసీసీని శాశిస్తుందని తెలిపాడు. రేపటి రోజుల్లో బీసీసీఐ నో బాల్స్ వద్దు, వైడ్ బాల్స్ వద్దన్నా ఐసీసీ తలూపుతుందని అన్నాడు.
బీసీసీఐని తృప్తి పరిచేందుకు ఐసీసీ ఏమైనా చేస్తుందని అన్నాడు. 74 ఏళ్ల ఆండీ రాబర్ట్స్ తొలి మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడింటిలో విండీస్ తొలి రెండు ప్రపంచకప్‌లను గెలిచింది. 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో విండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. నేడు రాబర్ట్స్ చేసిన వ్యాఖ్యలు నాటి ప్రపంచకప్ అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుంది.
కాగా, రాబర్ట్స్ లేవనెత్తిన విషయాన్నే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా లేవనెత్తాడు. ఒకే వేదికపై ఆడి, ఎలాంటి ప్రయాణ బడలికలు లేకుండా టీమిండియా లబ్ది పొందిందని సోషల్‌మీడియా వేదికగా ఆరోపించాడు.
అయితే ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు అదనంగా ఒరిగిందేమీ లేదని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అనడం విశేషం. ఈ టోర్నీలో భారత్ వేదికతో సంబంధం లేకుండా చాలా బలంగా ఉండిందని అక్రం అన్నాడు. ఈ జట్టుతో భారత్ పాకిస్తాన్‌లో కూడా గెలిచేదని తెలిపాడు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో అడి అన్నింటా విజయాలు సాధించింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో పర్యటించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ టీమిండియా మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చింది.
Comments
Please login to add a commentAdd a comment