తటస్థ వేదికపై భారత్ ‘చాంపియన్స్’ పోరు
అధికారికంగా వెల్లడించిన ఐసీసీ
యూఏఈలో టీమిండియా మ్యాచ్‌లు?
త్వరలోనే షెడ్యూల్ విడుదల
దుబాయ్: భారత్‌ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది.
వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్‌నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్‌లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్‌లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి.
‘2024–2027 సైకిల్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌లు ఆడే అన్నీ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్‌లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్‌కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది.
ఇక్కడితోనే అయిపోలేదు!
భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్‌లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్‌ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్‌లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతాయి.
వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు యూఏఈ (దుబాయ్)లో... భారత్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment