
బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా షాన్ టైట్ నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ 42 ఏళ్ల మాజీ ఫాస్ట్ బౌలర్ 2027 నవంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. టైట్ తన కోచింగ్ ప్రయాణంలో పాకిస్తాన్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు సేవలందించాడు.
టైట్.. 2007లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్లలో 59 మ్యాచ్‌లు ఆడిన టైట్.. 95 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా షాన్ టైట్ నియామకంతో ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన ఆండ్రీ ఆడమ్స్ వైదొలిగాడు.
ఆడమ్స్ గతేడాది మార్చిలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆడమ్స్ ఆథ్వర్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పేలవ ప్రదర్శనలు చేసింది. ఈ కారణంగా అతనిపై వేటు పడింది.
క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్
షాన్ టైట్ పేరిట క్రికెట్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డు నమోదై ఉంది. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు.
టైట్‌తో పాటు మరో ఆసీస్ పేసర్ బ్రెట్ లీ కూడా 161.1కిమీ వేగంతో బంతిని సంధించాడు. 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ ఈ వేగాన్ని అందుకున్నాడు.
క్రికెట్ చరిత్రలో నాలుగో వేగవంతమైన డెలివరీ రికార్డు కూడా ఆసీస్‌కే చెందిన జెఫ్ థాంప్సన్ పేరిట ఉంది. థామ్సన్ 1975-76 సిరీస్లో విండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 160.6కిమీ వేగంతో బంతిని వేశాడు. క్రికెట్ చరిత్రలో ఐదో వేగవంతమైన బంతి రికార్డు కూడా ఆసీస్ పేసర్ పేరిటే ఉంది. 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో స్టార్క్ 160.4కిమీ వేగంతో బంతిని సంధించాడు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ జట్టు మే 17 నుంచి యూఏఈలో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లా టీమ్ యూఏఈతో రెండు టీ20లు (మే 17, 19) ఆడనుంది. అనంతరం మే 25 నుంచి బంగ్లా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌తో యుద్దం తర్వాత పాక్‌లో జరగాల్సిన ఈ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.