‘విరాట్‌’ పరుగుల పర్వాలు | Virat Kohli Complete Test Cricket Career Best Stats And Records In Telugu | Sakshi
Sakshi News home page

Virat Kohli Test Records: ‘విరాట్‌’ పరుగుల పర్వాలు

May 13 2025 3:54 AM | Updated on May 13 2025 2:56 PM

Virat Kohli Complete Test Cricket Stats and Records

‘నేను టెస్టు క్రికెట్‌ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్‌ షాట్‌ ఆడితే నేను సింగిల్‌ ఆపేందుకు అవసరమైతే డైవ్‌ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్‌ అంటే అదే’... ఇది విరాట్‌ కోహ్లికి టెస్టు ఫార్మాట్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్‌ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్‌లో ఫిట్‌నెస్‌ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్‌ చేద్దాం.

అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్‌... టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్‌లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్‌నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్‌ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్‌లో అది ఎవరూ పూరించలేని లోటు.   –సాక్షి క్రీడా విభాగం 

‘భారత్‌ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్‌’... విరాట్‌ కోహ్లి దూకుడును ఆసీస్‌ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్‌ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.

తన బౌలింగ్‌లో అద్భుతమైన కవర్‌ డ్రైవ్‌లు, పుల్‌ షాట్‌లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్‌ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్‌ చూసింది. 

2011–12 టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్‌వంటి స్టార్‌ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్‌ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్‌ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్‌లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్‌లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది.  

అలా మొదలై... 
వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్‌ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్‌ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్‌తోనే రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్‌ అవకాశం దక్కగా అడిలైడ్‌లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్‌పై వెల్లింగ్టన్‌లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్‌ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్‌ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్‌ పర్యటన.  

ఆరేళ్లు అద్భుతంగా... 
విరాట్‌ టెస్టు కెరీర్‌ అక్టోబర్‌ 2014 నుంచి డిసెంబర్‌ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్‌గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్‌తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్‌తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.

ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్‌వన్‌ టెస్టు బ్యాటర్‌గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్‌ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్‌ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్‌మన్‌ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.  

కాస్త పదును తగ్గి... 
అసాధారణ బ్యాటింగ్‌ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్‌లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్‌ కారణంగా మ్యాచ్‌ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్‌ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. 

ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్‌లోనైతే పెర్త్‌ మినహా అతని బ్యాటింగ్‌ చూస్తే కెరీర్‌ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్‌ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్‌కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్‌గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్‌ను హడావిడి లేకుండా ముగించాడు.  

పడి... పైకి లేచి... 
కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌. స్వింగ్‌కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్‌వర్క్‌ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్‌ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్‌వన్‌ బ్యాటర్‌గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్‌ఫ్రెండ్‌ అనుష్క శర్మను టూర్‌కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.

అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్‌ టాపర్‌గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది.  

4 భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్‌ (15,921), ద్రవిడ్‌ (13,288), గావస్కర్‌ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్‌ (51), ద్రవిడ్‌ (36), గావస్కర్‌ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు.  

  4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌ (53), రికీ పాంటింగ్‌ (48), స్టీవ్‌ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు.  

 7 కోహ్లి డబుల్‌ సెంచరీల సంఖ్య. ఓవరాల్‌ జాబితాలో బ్రాడ్‌మన్‌ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్‌) తర్వాత వాలీ హామండ్‌ (7; ఇంగ్లండ్‌), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement