‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’ | Virat Kohli announces Test retirement after 14-year career | Sakshi
Sakshi News home page

‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’

May 13 2025 3:47 AM | Updated on May 13 2025 5:45 AM

Virat Kohli announces Test retirement after 14-year career

టెస్టులకు కోహ్లి వీడ్కోలు

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం త్వరలోనే టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్‌ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్‌ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు.  2011 జూలైలో కింగ్‌స్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. గత ఏడాది వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత టి20 ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్‌ మధ్యలోనే స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్‌ నుంచి ని్రష్కమించినట్లయింది.  

ఎందుకీ వెనకడుగు? 
రోహిత్‌ టెస్టులకు గుడ్‌బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్‌ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్‌ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్‌ బంగర్‌ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్‌నెస్‌ ఒక కారణం కాగా, ఇంగ్లండ్‌లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది.  

రిటైర్మెంట్‌పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్‌ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌ సిరీస్‌తో కొత్తగా 2025–27 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌íÙప్‌ సైకిల్‌ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు.  

ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్‌లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్‌లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్‌ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్‌లాంటి సాధారణ బౌలర్‌ బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్‌ శర్మలాంటి బ్యాటర్‌ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్‌పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.

టెస్టు క్రికెట్‌లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్‌ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్‌ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్‌కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్‌ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్‌ కోహ్లి

‘కెప్టేన్‌ ఫైర్‌’
టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్‌ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్‌ ధోని ‘కూల్‌ కెప్టేన్‌’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్‌ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్‌ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.

కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్‌ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్‌ను తగ్గించి అయినా అదనపు బౌలర్‌ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడం, మ్యాచ్‌ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది.

 కోహ్లి కెప్టేన్సీలో పేస్‌ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్‌ రిచర్డ్సన్‌ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89)  ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్‌లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్‌గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్‌ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు.  

  మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్‌  
115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు.  

119, 96 (జొహన్నెస్‌బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ సెంచరీతో భారత్‌కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్‌ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు.  

153 (సెంచూరియన్‌ 2018): కఠినమైన పిచ్‌పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్‌ విలువ అర్థమవుతుంది.  

123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్‌కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్‌ బౌలింగ్‌ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే.  

254 నాటౌట్‌ (పుణే, 2019): కెరీర్‌లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్‌ సెంచరీలతో జట్టుకు విజయం.  

సచిన్‌ ‘100’ పదిలం!
అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్‌ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్‌ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.

ఆపై పెర్త్‌ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో సచిన్‌ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్‌నెస్, ఇష్టమైన ఫార్మాట్‌ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్‌ కప్‌ కొనసాగి ఆపై రిటైర్‌ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్‌ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు.  

నీ క్రికెట్‌ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు
నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్‌ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్‌కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్‌ టెండూల్కర్‌

నువ్వు రిటైర్‌ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్‌ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు.       –రవిశాస్త్రి

ఆధునిక క్రికెట్‌ యుగంలో టెస్టు ఫార్మాట్‌ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్‌ కోహ్లి. టెస్టు క్రికెట్‌ అతనికి ఎంతో రుణపడి ఉంది.   –సంజయ్‌ మంజ్రేకర్‌  

సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్‌ గంభీర్‌

‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది.     –అనిల్‌ కుంబ్లే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement