సీపీఎస్‌పై స్టాక్ మార్కెట్ ప్రభావం
మానకొండూర్, న్యూస్‌లైన్ : రూపాయి విలువ పతనంతోపాటు స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు అందరినీ కలవరపెడుతున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానంలో నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులపై ఈ ప్రభావం భారీగా పడనుంది. అవసరాలకు దాచుకున్న డబ్బులు స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా అ సలు కంటే తగ్గుముఖం పట్టగా కనీసం తాము జమ చేసిన సొమ్ము కూడా చేతికి వస్తుందో లేదోననే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ప్ర భుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్) అమలు చేస్తోంది. ఉద్యోగి వేతనంలో బేసిక్‌తోపాటు డీఏలో పది శాతం మినహాయించి, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటా కింద ప్రాన్(పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్)లో జమ చేస్తోంది. ఇలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఎన్ఎస్డీఎల్ ద్వారా ఎస్బీఐ పెన్షన్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కింద, యూటీఐ సొల్యూషన్ లిమిటెడ్, ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో పెట్టుబడిగా పెడుతోంది. ఉద్యోగులకు ఆప్షన్స్ ఉన్నా ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో డీఫాల్ట్‌గా ఈ కంపెనీల్లోనే పెట్టుబడిగా వెళ్తాయి. నెల రోజులుగా ఈ మూడు కంపెనీల షేర్ల విలువలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇందుకు రూపా యి విలువ పతనం కూడా ఓ కారణమవుతోంది. దీంతో ప్రాన్‌లో జమ అయిన అసలు మొత్తం కూడా తగ్గిపోతోంది. ఉదాహరణకు 2005 నవంబర్ 21న ఉద్యోగంలో చేరిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన అప్రెంటిస్ కాలం పూర్తయిన తర్వాత 2008 ఏప్రిల్ నుంచి పెన్షన్ మొత్తాన్ని ప్రాన్‌లో జమ చేయడం మొదలెట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 20 నాటికి ఆయన ప్రాన్ అకౌంట్లో రూ.లక్షా 45 వేల 386 జమయ్యాయి. స్టాక్ మార్కెట్ ప్రభావం కారణంగా అది కాస్త రూ.లక్షా 43 వేల 769.90కి తగ్గింది. అంటే వడ్డీ పోను తన అసలు కంటే రూ.వెయ్యి 616.10 తగ్గిపోయింది. నెల క్రితం వరకు స్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. నెలరోజుల్లోనే తమ అసలు మొత్తాలు తగ్గిపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
2004 సెప్టెంబర్‌కు ముందు నియామకమైన ఉద్యోగులు వారి జీపీఎఫ్ ఖాతాల నుంచి యాభై శాతం తీసుకునే వీలుంది. కానీ సీపీఎస్ విధానంలో ఉద్యోగులు ప్రాన్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకునే వీలులేదు. ఉద్యోగి రిటైరైనా, ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా విరమణ పొందినా, మరణించినా ప్రాన్‌లో జమైన మొత్తం నుంచి 60 శాతం వరకు తీసుకునే వీలుంది. తమ కనీస అవసరాలకు పనికి రాని ఈ సొమ్ము వయసు పైబడిన తర్వాత ఎంత వచ్చినా వృథానే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సొమ్ముకు భద్రత లేని ఈ నూతన పెన్షన్ పథకం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సొమ్ముకు జీపీఎఫ్ ప్రకారం వడ్డీ ఇస్తూ అసలుకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.