
రాణించిన బిన్నీ, యూసుఫ్, ఇర్ఫాన్
ఐఎంఎల్ టి20 టోర్నీ
నవీముంబై: అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్)లో ఉత్కంఠ రేపిన పోరులో భారత్ మాస్టర్స్ జట్టు 4 పరుగుల తేడాతో శ్రీలంక మాస్టర్స్‌పై గెలుపొందింది. 223 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన శ్రీలంక గెలిచేందుకు ఆఖరి బంతి దాకా పెద్ద పోరాటమే చేసింది. చివరి 6 బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉండగా అభిమన్యు మిథున్ చక్కని బౌలింగ్‌తో లంక బ్యాటర్లను కట్టడి చేశాడు.
ఆఖరి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ లీగ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ మాస్టర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు సచిన్ (10), అంబటి రాయుడు (5) ఇద్దరు నిరాశపరచగా, స్టువర్ట్ బిన్నీ (68), యూసుఫ్ పఠాన్ (56 నాటౌట్), గుర్‌కీరత్ సింగ్ (44), యువరాజ్ (31 నాటౌట్) లంక బౌలర్లపై దంచేయడంతో 200 పైచిలుకు స్కోరు సాధించింది.
లంక బౌర్లలో సురంగ లక్మాల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం శ్రీలంక మాస్టర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులకు పరిమితమైంది. కుమార సంగక్కర (51), జీవన్ మెండిస్ (42) రాణించారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా, ధవళ్ కులకర్ణి 2 వికెట్లు తీశాడు.