
నాగచైతన్య- సాయిపల్లవి నటించిన తండేల్ సినిమా (Thandel Movie) భారీ విజయం సాధించింది. పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల జీవితాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాతో తండేల్ రామారావు బాగా పాపులర్ కావడమే కాకుండా ఆయన చిత్ర యూనిట్ నుంచి ఎక్కువగా లబ్ధి పొందాడంటూ మిగిలిన మత్స్యకారులు మీడియా ముందుకు వచ్చారు. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయని వారు చెబుతున్నారు. గనగళ్ల రామారావు, ఆయన సతీమణి నూకమ్మకు దక్కుతున్న గౌరవం, లబ్ధి.. 21 మత్స్యకార కుటుంబాలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రామారావుకు మాత్రమే గౌరవం
మత్స్యలేశం గ్రామంలో 21 మత్స్యకార కుటుంబాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తండేల్ రామారావు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. 'సినిమాలో రియల్ తండేల్ రామారావు ఒక్కడే అని చూపారు. అందులో ఎలాంటి నిజం లేదు. పాకిస్థాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేల్‌లు ఉన్నారు. కేవలం రామారావు చేసిన తప్పు వల్లే మేము పాకిస్థాన్‌కు దొరికిపోయాం. మేము హెచ్చిరించినా మాట వినకుండా రామారావు బోటును ముందుకు పోనిచ్చాడు. దీంతో పాక్ దళాలకు దొరికిపోయాం. కానీ, సినిమా విషయానికి వస్తే కేవలం రామారావు, అతడి భార్య నూకమ్మకు మాత్రమే గౌరవం దక్కుతుంది. మిగిలిన 21 మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి గౌరవం దక్కడం లేదు.

(చదవండి: దుబాయ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు)
చెప్పుతో కొట్టినట్లు..
సినిమా కథ రాసిన కార్తీక్, రామారావు మాకు తీరని అన్యాయం చేశారు. సినిమా ప్రారంభంలో మా 20 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 45 వేల చొప్పున ఇచ్చి సంతకాలు చేయించుకున్నారు. అయితే, రామారావు, ఆయన బావమరిది ఎర్రయ్యకు మాత్రం చెరో రూ. 90 వేలు ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన తండేల్ ఈవెంట్‌కు మా 20 కుటుంబాలను పిలిపించి.. కనీసం స్టేజీ మీదకు కూడా పిలవలేదు. స్టేజీ మీద రామారావు, ఆయన సతీమణి నూకమ్మ మాత్రమే ఉన్నారు. మమ్మల్ని పిలిపించి చెప్పుతో కొట్టినంత పని చేశారు. వారిద్దరికి సినిమా కథ రచయిత కార్తీక్ అండదండలు ఎక్కువగా ఉన్నాయి.

ఎవరి వల్ల రిలీజయ్యామో అందరికీ తెలుసు
ఈ సినిమాతో రామారావు జీవితం మాత్రం మారిపోయింది. ఆయనకు ఒక ఇళ్లు, రూ. 20 లక్షల డబ్బు చిత్ర యూనిట్ నుంచి అందినట్లు తెలుస్తోంది. అందుకే రామారావు కూడా వారు ఏం చెబితే అది మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అతనితో పాటు మేము కూడా పాకిస్థాన్ జైల్లో ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో మాకూ తెలుసు. ఎవరి వల్ల విడుదలయ్యామో కూడా అందరికీ తెలుసు. మేము స్టేజీ ఎక్కితే అవన్నీ చెబుతామని ఆ అవకాశం లేకుండా చేశారు. రామారావు, కథా రచయిత కార్తీక్ మమ్మల్ని మోసం చేశారు. వాళ్లు మాత్రమే లబ్ధి పొందారు. మాకు ఎలాంటి సాయం చేయలేదు' అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment