fishermen
-
బందరు తీరంలో భారీ చేప.. బరువు తెలిస్తే షాకే..
సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు. -
భారత మత్స్యకారులను పట్టుకున్న శ్రీలంక
తమిళనాడు తీరంలో రెండు పవర్ బోట్లతో పాటు తొమ్మిది మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకుంది. ఆ మత్స్యకారులు భారత సరిహద్దు దాటి చేపల వేట సాగిస్తున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. 535 బోట్లలో మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో చేపల వేటకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా విదేవిధంగా శ్రీలంక భారత జాలర్లను పట్టుకుంది.జూలై ఒకటిన రామేశ్వరం ద్వీపం సమీపంలోని పాల్క్ బే సముద్ర ప్రాంతంలో పాంబన్ నుంచి చేపల వేటకు వెళ్లిన 26 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నావికాదళానికి చిక్కారు. గత నెలలోనే శ్రీలంక నావికాదళం తమ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 18 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. మూడు మత్స్యకారుల బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికిముందు కూడా శ్రీలంక నేవీ నలుగురు భారతీయ జాలర్లను అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది.ఈ ఏడాది జనవరిలో శ్రీలంక నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు శ్రీలంక 180 మందికి పైగా భారత జాలర్లను అరెస్టు చేసింది. గత ఏడాది 240 నుంచి 245 మందిని అరెస్టు చేసిన నేపధ్యంలో భారత్-శ్రీలంక సంబంధాల్లో వివాదాలు తలెత్తాయి. -
సముద్రంలో తిరగబడిన బోటు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు. చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
చేప పిల్లలా? చేయూతా?
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మే నెల చివరికి వస్తున్నా ఈ పథకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా? లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది. మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించడానికి ఏ విధమైన పథకాన్ని తీసుకువస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. చేప పిల్లల పంపిణీపై గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న ఆందోళన మత్స్యకారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని మత్స్యకారులు కోరుతున్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 26,700 చెరువుల్లో 90 కోట్ల ఉచిత చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను వదిలారు. అందుకోసం ఏప్రిల్‌లోనే టెండర్లు పిలిచి.. జూన్‌లో టెండర్లు ఖరారు చేశారు. ఈ పథకం అమలు విషయంలో గతంలో అనేక విమర్శలు కూడా వచ్చాయి. దీంతో విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందా? లేక మత్స్యకారులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందా అన్న చర్చ మత్స్యకార సంఘాల్లో జరుగుతోంది. సమయం సరిపోదన్న భావనలో... గతంలోలాగా పథకాన్ని కొనసాగిస్తే ఈసారి రూ. 100 కోట్లు అవసరం అవుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చేప పిల్లల సమీకరణకు కనీసం రెండు నెలల సమయం పడుతుందంటున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిస్తే చేపపిల్లల సేకరణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, మత్స్యకారులకు చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న తరుణంలో ఈ మొత్తాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో పలు ఆరోపణలు... ఉచిత చేప పిల్లల పథకంపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. చెరువుల్లో అధికశాతం నాసిరకం చేప పిల్లలను వదిలారన్న విమర్శలు ఉన్నాయి. నాణ్యతలేని చేపపిల్లలను వదిలి తప్పుడు రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పలు గ్రామాల్లోని మత్స్యకారులు తమ చెరువుల్లో చేప పిల్లలు వదలొద్దని స్పష్టం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పథకం కింద సరఫరా చేసిన చేపలు సరిగా ఎదగలేదని అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం తిరస్కరించడం గమనార్హం. ఉచిత చేప పిల్లల కంటే చేయూత ఇవ్వడం మంచిది. మత్స్యకార సంఘాలకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేస్తే నచ్చిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ఇలా చేయడం వలన నాణ్యతతో పాటు ఏ చెరువులో ఎన్ని చేప పిల్లలను వదులుకోవాలనే నిర్ణయం కూడా మాదే ఉంటుంది. – శంకర్, మత్స్యకారుడు -
ఎన్నో విశేషాల ‘బోర మెత్తళ్లు’
సింగరాయకొండ: బోర మెత్తళ్లు చేప..తైల వర్ణంలో ఉంటుంది. ఇది వేసవిలోనే లభిస్తుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. వేటాడాలంటే సన్న కన్నుల వలను వినియోగించాలి. దాని ఖరీదు రూ.లక్ష పైమాటే. ఈ చేప ప్రకాశం జిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా చిన్నగంజాం, నిజాంపట్నం తదితర తీర ప్రాంతాల్లో లభ్యమవుతుంది. ఇది తీరానికి అర కిలోమీటర్ దూరంలో దొరుకుతుంది. దీనిని వేటాడే సమయం కూడా భిన్నంగా ఉంటుంది.అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్లి ఎక్కడ ఉందో గుర్తిస్తారు. దాని గమనాన్ని బట్టి ఆ ప్రాంత మత్స్యకారులు వేటాడుతారు. వేకువజామున 4 గంటల నుంచి వేట మొదలుపెడతారు. ఉదయం 8 గంటలకు తీరానికి తీసుకువస్తారు. మామూలు చేపలైతే పడవల్లోనే వల నుంచి వేరు చేస్తారు. దీనిని అలా వేరుచేసేందుకు కుదరదు. తీరానికి తీసుకువచ్చి ఒడ్డుకు చేరిన తర్వాతే వల నుంచి వేరు చేస్తారు. ఒక్కసారి వేటకు వెళితే టన్ను వరకూ లభ్యమవుతుంది. వేసవి, వేట నిషేధ సమయంలో దొరికే ఈ చేపను కర్రతెప్పల్లో మాత్రమే వేటాడుతారు. ఇక్కడ దీని ధర కేజీ రూ.100. కేరళలో ఇది కేజీ రూ.300–500 మధ్యలో ధర పలుకుతుంది. మే, జూన్‌ల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చేపలను ప్రత్యేక వాహనాల్లో కేరళకు పంపుతారు. -
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
కొచ్చి: ఇరాన్లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్లోనే ఇరాన్ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్‌లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్‌గార్డ్ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు. -
AP: విరామ వేళ.. వలకు భరోసా
సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 61 రోజులు బ్రేక్.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. వేట విరామ భృతి.. సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా వివరాలు.. ♦ సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు ♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు ♦ మత్స్యకార ఆవాసాలు : 64 ♦ మత్స్యకారుల జనాభా: 85వేలు ♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు ♦మొత్తం బోట్లు : 2,256 ♦ వీటిలో మెకనైజ్డ్ బోట్లు : 92 ♦ మోటరైజ్డ్ బోట్లు: 2,091 ♦ సంప్రదాయ బోట్లు : 73 ♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు ♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు సాయం చేసేందుకు గుర్తింపు.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్‌కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నంబర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్), కృష్ణా జిల్లా -
మత్స్యకారులకు అండగా..చంద్రబాబు చేయలేనిది చేసి చూపించిన సీఎం జగన్
-
మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
-
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
సీఎం జగన్ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
-
ఫిష్ ఆంధ్ర సూపర్
ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అని చేపల ప్రియులు ఆస్వాదించే వార్త..కష్టపడి వేటాడిన మత్స్యసంపదకు చక్కని మార్కెట్ లభించడంతో గంగపుత్రులు ఆనందించే సందర్భం..జిల్లాలో ఇప్పటికే 85 ఫిష్ ఆంధ్ర మినీ ఔట్లెట్లను ప్రారంభించిన మత్స్యశాఖ.. త్వరలో నాలుగు సూపర్ షాప్‌లకు శ్రీకారం చుట్టనుంది. మరో రెండు లాంజ్‌లను ఏర్పాటు చేయనుంది. మినీ ఔట్లెట్లలో చేపలు విక్రయించగా.. కొత్తగా ప్రారంభించనున్న సూపర్ షాప్‌లలో లైవ్ ఫిష్‌తోపాటు చేపలతో తయారు చేసే వంటకాలను విక్రయిస్తారు. లాంజ్‌లు రెస్టారెంట్లుగా భోజన ప్రియులకు ఆతిథ్యమివ్వనున్నాయి. అచ్యుతాపురం: మత్స్యకారులకు అండగా ఉంటూ.. మత్స్య సంపదను విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వేలాదిమంది మత్స్యకారుల తలరాత మారుతోంది. అంతేకాకుండా ఆహారంలో కీలక పోషకాలు ఉన్న చేపల ఉత్పత్తి, అమ్మకాలకు మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఫిష్ ఆంధ్ర నినాదంతో ఇప్పటికే మినీ ఔట్లెట్లు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉండగా.. అదనపు హంగులతో చేపల షాపులను ఏర్పాటు చేసే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలో 31 మత్స్యకార గ్రామాలు, 12 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 11 వేల 116 మందికి పైగా మత్స్యకారులు జిల్లాలో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో చేపల వేటపై ఆధారపడిన వారికి మేలు చేకూరనుంది. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్న మత్స్యసంపద మార్కెటింగ్‌కు సంబంధించి మరిన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో నాలుగు సూపర్ షాపులు అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపల విక్రయానికి ఏర్పాటు చేస్తున్న ఫిష్ మినీ ఆంధ్ర షాపులు జిల్లాలో 85 ఉన్నాయి. దీంతో సముద్ర తీరప్రాంతాల్లోనూ, రిజర్వాయర్, నదులు, సరస్సులు, చెరువుల్లో లభించే వివిధ రకాల చేపలకు చక్కని మార్కెటింగ్ సదుపాయం దక్కింది. ఈ క్రమంలోనే జిల్లాలో సూపర్ షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో షాపును నెలకొల్పేందుకు రూ.20 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం 40 శాతం సబ్సిడీని భరిస్తుంది. ముందుగా అచ్యుతాపురంలో ఒక షాపును, చోడవరంలో మరో షాపును ఏర్పాటు చేయనున్నారు. ఇక సూపర్ షాపులకు దీటుగా లాంజ్‌లను సైతం రూ.50 లక్షలతో జిల్లాలో రెండు ఏర్పాటు చేయనున్నారు. వీటిని అనకాపల్లి హైవేలో ఏర్పాటు చేయనున్నారు. వేల్యూ యాడ్ చేసి హైజనిక్‌గా చేపల విక్రయం చేపట్టనున్నారు. దిగువ స్థాయి ప్రజల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వారికి అవసరమైన 10 రకాల చేపలు సూపర్, లాంజ్లలో దొరకనున్నాయి. ‘సూపర్’ ప్రత్యేకతలివే... సముద్ర, చెరువు చేపలకు సంబంధించిన శీలావతి, పచ్చబోసు, సముద్ర రకాలు చందువ, కోనాలు, వంజరం వంటి చేపలను లైవ్‌లో అమ్ముతారు. ఇక్కడే ఐస్ తయారీ వ్యవస్థ ఉన్నందున చేపలు ఫ్రెష్‌గా ఉంటాయి. అవసరమైతే ప్యాక్ చేసిన చేపలను అమ్ముతారు. చేపల కట్లెట్లు, ఫ్రైలు విక్రయిస్తారు. రెస్టారెంట్‌గా లాంజ్‌లు... లాంజ్‌లు దాదాపు రెస్టారెంట్ తరహాలో ఉంటాయి. చేపలకు సంబంధించిన అన్ని వంటకాలు ఇక్కడ విక్రయిస్తారు. చేపల స్టార్టర్లు, పులుసులు, చేపల బిర్యానీ, చేపల అన్నం, చేపలతో కూడిన అన్ని రకాల ఆహార పదార్థాలను ఇక్కడ రెస్టారెంట్ తరహాలో వినియోగదారునికి అందిస్తారు. అందుబాటులో విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు జిల్లాలో ఫిష్ మినీ ఆంధ్రాలకు తోడు మరో నాలుగు సూపర్ షాపులను ఏర్పాటు చేయనున్నాం. అచ్యుతాపురంలో ఒకటి, చోడవరంలో మరొకటి నెలకొల్పుతున్నాం. రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సూపర్ షాప్‌లతో ఫిషింగ్ వేల్యూ యాడ్ చేస్తాం. షాపు ఏర్పాటులో మత్స్యకారునికి 40 శాతం సబ్సిడీ ఇస్తాం. –ప్రసాదరావు, జిల్లా మత్స్య శాఖ ఏడీ -
AP: తీరం మనదే.. వేటా మనదే
జువ్వలదిన్నె సిద్ధం మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. సాక్షి, అమరావతి: మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వలస వెళ్లాల్సి వస్తోంది. పాదయాత్ర సమయంలో వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా ఫిషింగ్ హార్బర్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.3,520.56 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జువ్వలదిన్నె హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించనున్నారు. మరో మూడు హార్బర్ల పనులు 60 నుంచి 70 శాతం పూర్తి కాగా సెప్టెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అదనంగా మత్స్యకారులు బోట్లను నిలుపుకొని చేపలు దింపుకునే విధంగా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద సమకూరుతుందని, వీటి ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9 వేల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్లో ఏర్పాటు చేసిన షెడ్లు హార్బర్ ఆధారిత పరిశ్రమలు.. హార్బర్ల ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులను ఏపీ మారిటైమ్ బోర్డు నెలకొల్పుతోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద సమకూరనుంది. వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా హార్బర్ వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, 5 ఎకరాల విస్తీర్ణంలో బోట్ల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. కొత్త బోట్లకు డిమాండ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లల్లో 10,521 బోట్లను నిలుపుకునే సామర్థ్యం ఉండటంతో కొత్త బోట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడనుంది. 9ఎం ఎఫ్ఆర్పీ రకం, 12 ఎం గిల్ నెట్టర్, 15ఎం ట్రావలెర్, 24ఎం టూనా లాంగ్ లైనర్ లాంటి అత్యాధునిక బోట్లు అవసరం కానున్నాయి. అన్ని హార్బర్ల వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. కూలీల నుంచి యజమానులుగా.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ పని కోసం చెన్నై, మంగళూరు వలస కూలీలుగా వెళ్లాం.ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకొని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ఫిషింగ్ హార్బర్, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15 వేల మందికిపైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) సురక్షితంగా ఒడ్డుకు బోట్లు ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో ఆటు పోట్లు వల్ల ఈ ఇబ్బంది అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలుపుకోవచ్చు. – పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నం. పర్యాటక ఏర్పాట్లు పరిశీలిస్తున్నాం మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ముఖ్యమంత్రి జగన్ ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించేలా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున నెలకొల్పుతున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డులతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. హార్బర్ల వద్ద పర్యాటక ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో ఏపీ మారిటైమ్‌బోర్డు, వీసీఎండీ ఏపీఐసీసీ. మినీ పోర్టు స్థాయిలో ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక అవస్థలు ఎదుర్కొన్నాం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తేవడంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ -
మత్స్యకార ‘పథకాల’ అమలులో ఏపీ సహకారం భేష్
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల అమలుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఏపీ ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల కృషి అభినందనీయమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ప్రశంసించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం మత్స్యకారులు, ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కాగా, నందివాడ మండలం రామాపురానికి చెందిన దావీదు, పెదలింగాలకు చెందిన తుమ్మల రామారావు, రవీంద్రబాబు, ప్రవీణ్‌లు కేంద్ర మంత్రికి పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను వివరించారు. మత్స్యరైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్ర మంత్రి సతీమణి సవితబెన్ రూపాల, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతుకుమార్ ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కలెక్టర్ పి.రాజాబాబు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్‌ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్‌ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్‌తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్‌గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్‌పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్‌గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
మాకు కష్టం వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆదుకున్నారు
మహారాణిపేట: మత్స్యకారులకు కష్టం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డెడ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ చెప్పారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జానకీరామ్ ఆధ్వర్యాన శనివారం విశాఖలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మత్స్యకారులు, బోటు యజమానులు క్షీరాభిషేకం చేశారు. జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారులంటే సీఎం జగన్‌కు ఎనలేని అభిమానమని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతి తక్కువ సమయంలోనే బాధిత మత్స్యకారులకు రూ.7.11 కోట్లు పరిహారం చెల్లించి సీఎం తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అసోసియేషన్ నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, మైలపల్లి నరసింహులు, జి.దానయ్య, దూడ పోలయ్య, గనగళ్ల పోతయ్య, మున్నం బాలాజీ, యాగ శ్రీనివాసరావు, ఎస్.రాము, బోటు యాజమానులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం! -
మత్స్యకారుల జీవితానికి చుక్కానిగా...
చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులు సామాజికంగానూ, ఆర్థికంగానూ అత్యంత వెనుకబడి ఉన్నారు. ఆటువంటి వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నివిధాలా ఆదుకొంటున్నారు. రాజ్యాధికారంలో వాటాను పంచారు. ఆర్థికంగా చేయుత నిచ్చారు. పార్లమెంటు మెట్లే ఎక్కని మత్స్య కార వర్గం నుంచి తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపారు. దేశ అత్యున్నత చట్ట సభలో మత్స్య కారుడికి అవకాశం కల్పించిన ఘనత జగన్‌కే దక్కింది. ఎప్పుడూ లేని విధంగా మత్స్యకార వర్గానికి 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మత్స్యకార సామా జికవర్గంలోని 14 ఉప కులాలను విభజించి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జగన్ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటే దక్క లేదు. తొలిసారిగా మొదట మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో మత్స్యకారుల సామాజిక వర్గానికి అత్యధిక పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో సముద్రంపై వేటకు వెళ్లే 1.23 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 మధ్య కాలంలో ఈ కుటుంబాలవారు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ. 123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23.45 వేల మత్స్యకార కుటుంబాలకు దాదాపు రూ. 108 కోట్ల సాయాన్ని సీఎం జగన్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం ద్వారా అందించిన సాయం రూ. 538 కోట్లుగా ఉంది. ఏటా రూ. 10 వేల చొప్పున మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి చేకూరింది. సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతు లను బాగు చేయడంతో పాటు వలసలను అరికట్టే లక్ష్యంతో రూ. 3.7 వేల కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లాండింగ్ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు మరింత ఊతమిచ్చేందుకు 4 ఏళ్ళలోనే సుమారు రూ. 16 వేల కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అర్హత, నైపుణ్యం గల మానవ వన రులను తయారు చేసేందుకు తద్వారా మెరుగైన ఫిషింగ్ చేసుకునే పరిజ్ఞానం పెరిగేలా పశ్చిమ గోదా వరి జిల్లా నరసాపురంలో ‘ఆంధ్రప్రదేశ్ ఫిషరీష్ విశ్వ విద్యాలయం’ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆర్బీకేలలో ఫిషరీస్ అసిస్టెంట్స్ నియామకాన్ని చేపట్టారు. మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకే తిక పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. మత్స్య సాగుబడి కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు విస్తరణ సేవలు, పంట సలహాలు అందిస్తున్నారు. ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50లకే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020 అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకూ ఎవరూ చేయని విధంగా జగన్ మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తూ వారి బతుకు నావకు చుక్కాని అయ్యారు. అందుకే ఆయన రుణం తీర్చు కోవడానికి వారంతా ఎదురుచూస్తున్నారు. బందన పూర్ణచంద్రరావు వ్యాసకర్త జాతీయ మత్స్యకార సంఘం వైస్ చైర్మన్ మొబైల్: 90102 01616 (నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం) -
మత్స్యకారుల పట్ల సీఎం జగన్ ఉదారత
సాక్షి, తాడేపల్లి: విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారత చాటుకున్నారు. వారికి కనీవినీ ఎరుగని రీతిలో సహాయం ప్రకటించారు సీఎం జగన్. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్తలికి మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్‌ను పంపి మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ‘ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ. వారి జీవితాను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా సాయం ఉండాలి. బోట్లకు బీమా లేదనో.. మరో సాంకేతిక కారణాలను చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదు. కష్టకాలంలో ఉన్న మత్స్యకారులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సురెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలి. జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలను వెలికితీయాలి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ? -
మత్స్యకారుల పంట పండింది ఈ చేప ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు
-
మత్స్యకారులకు మరింత మేలు
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల పెంపు, మత్స్యకారులు చేపల వేటకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తప్పించడం, వారికి అధిక ఆదాయ మార్గాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. ఇందుకు సుమారు రూ.3,500 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు హార్బర్ల ఆధారంగా పనిచేసే పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో రూ.1,522.80 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తున్నాయి. దీంతో ఈ హార్బర్ల నుంచి వచ్చే మత్స్య సంపద ద్వారా మత్స్యకారులు అధికాదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద రూ.288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తికావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్‌లను ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ఒక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ఇలా వచ్చే 30 ఏళ్లలో ఈ హార్బర్ ద్వారా మిలియన్ టన్నుల మత్స్య సంపద లభిస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. దీనికి అనుగుణంగా హార్బర్‌కు వెలుపల 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వార్షిక ఆదాయంలో వాటా లేదా వార్షిక ప్రీమియం రూపంలో ఆదాయం పొందే పద్ధతిలో ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదించింది. 30 ఏళ్ల కాలపరిమితి, ఆపైన పొడిగించుకునే విధంగా బిడ్లను ఆహ్వానించింది. బోట్ తయారీ, మరమ్మతులు కూడా.. 1,250 బోట్లు నిలుపుకునే విధంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 9ఎం ఎఫ్ఆర్పీ రకం బోట్లు 1,000, 12 ఎం గిల్ నెట్టర్ బోట్లు 100, 15ఎం ట్రావెలర్ 100 బోట్లు, 24ఎం టూనా లాంగ్ లైనర్ బోట్లు 50 నిలుపుకునేలా హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే బోట్లు తయారీ, మరమ్మతుల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతిపాదించింది. ఇందుకోసం 5 ఎకరాల్లో బోట్ బిల్డింగ్ యార్డ్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. దీన్ని కూడా 30 ఏళ్ల కాలపరిమితికి లీజు రూపంలో ఇవ్వనుంది. 555 గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి రాష్ట్రంలో మత్స్యకారులు చేపల వేట కోసం కుటుంబాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే అవసరం లేకుండా సీఎం వైఎస్ జగన్ ఏకకాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. కేవలం ఫిషింగ్ హార్బర్లు కట్టి వదిలేయడమే కాకుండా పట్టిన చేపలకు మంచి విలువతో పాటు స్థానిక మత్స్యకారులకు ఉపాధి లభించే విధంగా హార్బర్ ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్‌లతో పాటు ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నె వద్ద ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు బోట్ బిల్డింగ్ యార్డ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. ఈ హార్బర్‌ను నవంబర్‌లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే హార్బర్ల వద్ద పర్యాటకంగా ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. – ప్రవీణ్ కుమార్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు, వీసీ–ఎండీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ -
మత్స్యకారులకు కష్టాలుండవిక
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో ఆరు ఫిష్‌ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.3,500 కోట్లతో మినీ ఓడరేవులను తలపించేలా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మత్స్యకారులు వారి బోట్లను సురక్షితంగా నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మత్స్య శాఖ ఏపీ మారిటైమ్ బోర్డుకు బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు తమ పడవలను బీచ్‌ల్లోనే నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాన్లువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పడవలు, వలలు కొట్టుకుపోయి పేద మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పడవలను నిలుపుకొనేందుకు ఒక జెట్టీ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి చేపలను సురక్షితంగా మార్కెట్‌కు తరలించుకునేలా వీటిలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్లలో భారీ మెకనైజ్డ్ బోట్ల కోసం బ్రేక్ వాటర్ వంటివి ఉండాలని, కానీ ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లలో స్థానిక మత్స్యకారులు చిన్న నాటు పడవలు, మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఏపీ కోస్టల్‌జోన్ మేనేజ్మెంట్ అథారిటీల నుంచి అనుమతులు పొందడానికి కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఆరు ప్రాంతాల్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు, సముద్రపు ఒడ్డున ఎన్ని పడవలు నిలుపుతున్నారన్న అంశాలపై అధ్యయనం చేశామని, దీనికి అనుగుణంగా ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ ఆరు చోట్ల 1,732 బోట్లు నిలుపుతున్నారని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో బోట్లను నిలిపేలా వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరంతా అనధికారికంగా చేపల వేట చేపడుతుండటంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటయితే ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
మత్స్యకారులకు తప్పిన పెను ముప్పు
రణస్థలం: చేపల వేట కోసం గుజరాత్‌లోని వీరావల్ తీర ప్రాంతానికి వెళ్లిన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు పెను ముప్పు తప్పింది. వేట కోసం తీరం నుంచి సముద్రంలోకి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లిన వారి పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. తోటి మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి పడవలో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించారు. రణస్థలం మత్స్యశాఖ అధికారి గంగాధర్, జీరుపాలెం సర్పంచ్ ఎం.రాముడు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ ప్రాంతానికి వేట కోసం రాష్ట్రం నుంచి మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి వెళుతుంటారు. సుమారు మూడు నెలలు అక్కడ వేట సాగించి తర్వాత స్వగ్రామాలకు వస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం వీరావల్ తీర ప్రాంతంలో ఉంటున్న రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం కొర్లయ్య (పడవ డ్రైవర్), కేశం పండువాడు, సూరాడ చిన్న, అంబటి రాముడు, పుక్కల్ల అసిరయ్య, ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన బడి తోటయ్య, కాకినాడకు చెందిన టి.వీరబాబు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస బర్రి అప్పన్న వేట కోసం పడవలో గురువారం తెల్లవారుజామున సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక బోటు సైడ్లు విరిగిపోయాయి. అనంతరం ఇంజిన్ పాడైపోయింది. క్రమంగా పడవ మునిగిపోతోంది. దీంతో ప్రమాదం గురించి పడవ డ్రైవర్ కేశం కొర్లయ్య తమతోపాటు మరో రెండు పడవల్లో సముద్రంలో వేట సాగిస్తున్న జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం అప్పన్న, అమ్మోరు, మైలపల్లి పెద్దయ్యతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. జీరుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎనిమిది మందిని కాపాడారు. మునిగిపోతున్న పడవలో ఉన్నవారిని తాడు సాయంతో తమ పడవల్లోకి తీసుకువచ్చి రక్షించారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు అందరూ గురువారం సాయంత్రానికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారి స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.