రణస్థలం: చేపల వేట కోసం గుజరాత్‌లోని వీరావల్ తీర ప్రాంతానికి వెళ్లిన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులకు పెను ముప్పు తప్పింది. వేట కోసం తీరం నుంచి సముద్రంలోకి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లిన వారి పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. తోటి మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సకాలంలో స్పందించి పడవలో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించారు. రణస్థలం మత్స్యశాఖ అధికారి గంగాధర్, జీరుపాలెం సర్పంచ్ ఎం.రాముడు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ ప్రాంతానికి వేట కోసం రాష్ట్రం నుంచి మత్స్యకారులు బృందాలుగా ఏర్పడి వెళుతుంటారు.
సుమారు మూడు నెలలు అక్కడ వేట సాగించి తర్వాత స్వగ్రామాలకు వస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం వీరావల్ తీర ప్రాంతంలో ఉంటున్న రణస్థలం మండలంలోని జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం కొర్లయ్య (పడవ డ్రైవర్), కేశం పండువాడు, సూరాడ చిన్న, అంబటి రాముడు, పుక్కల్ల అసిరయ్య, ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామానికి చెందిన బడి తోటయ్య, కాకినాడకు చెందిన టి.వీరబాబు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస బర్రి అప్పన్న వేట కోసం పడవలో గురువారం తెల్లవారుజామున సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక బోటు సైడ్‌లు విరిగిపోయాయి.
అనంతరం ఇంజిన్ పాడైపోయింది. క్రమంగా పడవ మునిగిపోతోంది. దీంతో ప్రమాదం గురించి పడవ డ్రైవర్ కేశం కొర్లయ్య తమతోపాటు మరో రెండు పడవల్లో సముద్రంలో వేట సాగిస్తున్న జీరుపాలెం గ్రామానికి చెందిన కేశం అప్పన్న, అమ్మోరు, మైలపల్లి పెద్దయ్యతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. జీరుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎనిమిది మందిని కాపాడారు.
మునిగిపోతున్న పడవలో ఉన్నవారిని తాడు సాయంతో తమ పడవల్లోకి తీసుకువచ్చి రక్షించారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ప్రమాద స్థలాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు అందరూ గురువారం సాయంత్రానికి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారి స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment