ఫోటో: కిషోర్, విజయవాడ
ఆకలికి ఎవరూ అతీతం కాదు.. అంతా సమానమే. తినే తిండి వేరు కావొచ్చు.. కానీ కడుపు నింపుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ తిన్నాం.. రేపు తినక్కర్లేరు అనేది ఉండదు. ఈ విషయం ఆకలికి కూడా తెలీదు. ఆకలి మనల్ని బతికిస్తుంది అనేది ఎంత వాస్తవమో.. కొన్ని సందర్భాల్లో అదే ఆకలి చంపేస్తుంది కూడా. ఆకలి గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. ఆకలి అనేది మనకు కనిపించదు.. అలానే ఆకలికి కనికరం కూడా ఉండదు.
ఆకలి తీర్చుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది. అందుకేనేమో కోటి విద్యలు కూటి కోసం అన్నారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో ఇటు జాలర్లు, అటు కొంగలు ఆకలి తీర్చుకోవడం చేపల వేటలో నిమగ్నం కావడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రకాశం బ్యారేజి దిగువన వల సహయంతో చేపలు కోసం జాలర్లు వేటాడుతుండగా, అదే సమయంలో కొంగలు కూడా చేపల కోసం తమ ముక్కుకు పదును పెడుతున్నాయి. ఈ దృశ్యంలో ఇద్దరి ప్రథమ లక్ష్యం చేపలే అంతిమ లక్ష్యం ఆకలి తీర్చుకోవడమనేది స్పష్టంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment