వైఎస్సార్‌ మత్స్యకార భరోసా చెల్లింపులు ప్రారంభం​ | YS Jagan Launches Financial Assistance To Fishermen Under YSR Matsyakara Bharosa | Sakshi
Sakshi News home page

మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Published Wed, May 6 2020 1:42 PM | Last Updated on Wed, May 6 2020 2:36 PM

YS Jagan Launches Financial Assistance To Fishermen Under YSR Matsyakara Bharosa - Sakshi

సాక్షి, అమరావతి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి చెల్లింపులను బుధవారం సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హాజరు అయ్యారు. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 10 వేలు  జమ చేయనుంది. దీంతో మొత్తం లక్షాల 9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. గతంలో మత్స్యకారుల విరామ భృతి 4 వేలు ఉండగా.. సీఎం వైఎస్ జగన్ దానిని 10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ప్రభుత్వం తమను ఆదుకోవడంతో లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాగా, పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం మత్స్యకారులతో మాట్లాడారు.
 
‘కరోనాతో పోరాడుతున్న సమయంలో కష్టాలు ఉన్నాసరే.. ఈ కష్టాలకన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నాం. గతంలో వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4 వేలు ఇచ్చేవారు. అదికూడా అందరికీ ఇచ్చేవారు కాదు. నా మత్స్యకార సోదరులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వారి బతుకులు మారాలని తలచి... ఈ కార్యక్రమాన్ని తీసుకవచ్చాం. గత ఏడాది మే 30న మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వేట నిషేధ సమయం ముగిసింది కదా.. మత్స్యకారులకు సాయం ఇవ్వకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి. అయినా సరే నవంబరులో మత్స్యకార దినోత్సవం రోజున మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం. ముమ్మడివరంలో ఈ కార్యక్రమానికి ప్రారంభించాం. అప్పట్లో నేను అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు జీఎస్‌పీఎల్‌ డ్రిల్లింగ్‌ వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న డబ్బు ఇవ్వలేదని వాళ్లు చెప్పినప్పుడు.. వారికిచ్చిన మాట ప్రకారం గత నవంబరులో 70.53 కోట్ల రూపాయలు వారికి పరిహారం చెల్లించాం. ఇప్పటికీ ఆడబ్బు ఇంకా రాలేదు. ఆ డబ్బుకోసం ఎదురుచూడకూండా ఈలోగా మనం చేయాల్సిన మేలు చేశాం. మత్స్యకారులకు మంచి జరగాలని ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం.

పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించారని మన వాళ్లను అరెస్టుచేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీలతో ఒత్తిడి తీసుకువచ్చి వారిని విడుదల చేయించాం. వారు జీవనం కొనసాగించడానికి ఒక్కొక్కరికి రూ. 5లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. ఇలా ప్రతి విషయంలోకూడా మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశాం. మొన్న గుజరాత్‌లో 4,500 మందికిపైగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోతే... వారు పడుతున్న ఇబ్బందులు తెలిసిన వెంటనే వారికి తోడుగా ఉండడానికి గుజరాత్‌ సీఎం, కేంద్ర మంత్రులతో మాట్లాడి, రూ.3 కోట్లమేర మన సొంత ఖర్చుచేసి వారిని తీసుకు వచ్చాం. పరీక్షలు చేసి ఒక్కొక్కరికి రూ.2వేల రూపాయలు ఇచ్చాం. వారికి మేలు చేయడానికి ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15వరకూ ఉన్న వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడు ఇచ్చేవారు కాదు. అదికూడా అరకొరగా ఇచ్చేవారు, అందరికీ ఇచ్చేవారు కాదు. కరోనా కష్టాలు ఉన్నాకూడా... మే 6న ఇవాళ 1,09,231 మందికుటుంబాలకు రూ. 10 వేలు ఇస్తున్నాం. 

ఇదే కాదు.. డీజిల్‌ సబ్సిడీ ఇస్తామని చెప్తారు.. కానీ, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని పాదయాత్రలో మత్స్యకారులు నాతో చెప్పారు. దీంతో డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9 చేశాం. డీజిల్‌ పట్టుకున్నప్పుడే సబ్సిడీ వచ్చేలా చేశాం. మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే.. రూ. 5లక్షలు సరిపోదని రూ.10 లక్షలు ఇస్తున్నాం. దేవుడి దయతో ఇవన్నీకూడా చేయగలిగాం. మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని.. గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని, శాశ్వత పరిష్కారంగా మంత్రి మోపిదేవి మంత్రిగా బాధ్యతలు చేపట్టినుంచి కృషిచేసి... వీటికి అనుమతులు కూడా తీసుకొచ్చారు. 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నాం. 1 ఫిష్‌ ల్యాడింగ్‌ కేంద్రాన్ని కట్టబోతున్నాం. ఈ తొమ్మిందింటికి దాదాపు రూ. 3వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 3 సంవత్సరాల్లో ఈ 9 నిర్మాణాలను కూడా పూర్తిచేస్తాం. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం. శాశ్వతంగా మంచిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూఈ కార్యక్రమాలు చేస్తున్నాం’ అని సీఎం జగన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement