రిజర్వాయర్లలో చేప పిల్లల్ని వదలని సర్కారు
జనవరి పూర్తవుతున్నా ఖరారు కాని టెండర్లు
ప్రభుత్వ నిర్వాకంతో మురిగిపోయిన రూ.12 కోట్లు
కూటమి గద్దెనెక్కగానే జీవో 217 రద్దు
సొసైటీ మత్స్యకారుల కడుపుకొట్టిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం మరోసారి మత్స్యకారుల కడుపు కొట్టింది. గద్దెనెక్కిన మరుక్షణమే జీవో 217 రద్దు చేసి మత్స్యకార సొసైటీల్లోని సభ్యుల జీవనోపాధికి గండికొట్టింది. రిజర్వాయర్లలో చేప పిల్లలు విడుదల చేయకుండా చేతులెత్తేసి వారికి ఉపాధిని దూరం చేసింది. సహజ మత్స్య సంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా మంచినీటి వనరుల్లో పెద్దఎత్తున చేప పిల్లలను వదులుతుంటుంది.
రాష్ట్రంలో 2.22 లక్షల ఎకరాల్లో భారీ రిజర్వాయర్లు, 70 వేల ఎకరాల్లో మధ్యతరహా రిజర్వాయర్లు, 3.75 లక్షల ఎకరాల్లో చిన్నతరహా రిజర్వాయర్లు ఉన్నాయి. వీటితో పాటు 2.25 లక్షల ఎకరాల్లో కొల్లేరు మంచినీటి సరస్సుతో పాటు 11,514 కిలోమీటర్ల మేర నదులు, కెనాల్స్ ఉన్నాయి.
వీటిపై ఆధారపడి రాష్ట్రంలో 2,536 మత్స్యకార సొసైటీల్లోని 3.10 లక్షల మంది జీవనోపాధి పొందుతారు. రూ.7–10 కోట్ల ఖర్చుతో 6–9 కోట్ల చేప పిల్లలను ప్రధాన రిజర్వాయర్లలో ఏటా జూలై–ఆగస్టు నెలల్లో వదులుతుంటారు. 3–6 నెలల తర్వాత ఈ మత్స్యసంపదను పట్టుకుని మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతుంటారు.
మంచినీటి వనరుల నుంచే 55 శాతం మత్స్య దిగుబడులు
రాష్ట్రంలో మత్స్య దిగుబడులు 51.58 లక్షల టన్నులు వస్తుండగా.. వాటిలో 55 శాతం మంచినీటి వనరుల నుంచి లభిస్తున్నాయి. ‘ఇన్‌ల్యాండ్ క్యాచ్‌మెంట్ వాటర్ రిసోర్సెస్’లో చేపల్ని పెంచడం ద్వారా మత్స్యకార సొసైటీల పరిధిలోని మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా గడచిన ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.
ఏటా క్రమం తప్పకుండా ప్రధాన రిజర్వాయర్లలో బొచ్చలు, రాగండి, మోసు చేప పిల్లలను వదులుతూ సహజ మత్స్యసంపద వృద్ధికి ఇతోధికంగా కృషి చేసింది. గిరిజన ప్రాంత మత్స్యకారులకు సైతం చేప పిల్లలను అందజేసేది.
2022–23 నుంచి చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా ఈ రిజర్వాయర్లలో వదలడం మొదలుపెట్టింది. ఫలితంగా 2018–19లో 13.42 లక్షల టన్నులున్న ఈ దిగుబడులు గడచిన ఐదేళ్లలో గరిష్టంగా 29.32 లక్షల టన్నులకు పెరిగింది.
ఈ ఏడాదంతా అస్తవ్యస్తం
చేప పిల్లల కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని డీపీసీ (జిల్లా కొనుగోలు కమిటీ) ద్వారా మే, జూన్‌లలో టెండర్లు పిలిచే వారు. తక్కువ ధరకు చేప పిల్లలను సరఫరా చేసే వారిని ఎంపిక చేసి చేప పిల్లల్ని కొనుగోలు చేసేవారు. వాటిని ఎంపిక చేసిన రిజర్వాయర్లు, మంచినీటి చెరువుల్లో క్రమం తప్పకుండా ఆగస్టులో వదిలేవారు. ఈ ఏడాది చేప పిల్లల్ని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రహసనంగా మార్చారు.
ఇందుకోసం కేంద్రం మంజూరు చేసిన రూ.12 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా.. చేపపిల్లల సరఫరాపై కనీస అవగాహన లేని మత్స్య శాఖ కమిషనర్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు మత్స్యకారుల కడుపు కొడుతున్నాయి. తనకు పదవి కట్టబెట్టిన మంత్రి అనుచరులకు మేలు చేయడమే లక్ష్యంగా జిల్లాస్థాయి టెండరింగ్ విధానం స్థానంలో రాష్ట్రస్థాయి టెండరింగ్, ఈ ప్రొక్యూర్‌మెంట్ అంటూ హడావుడి చేశారు.
చివరకు కొటేషన్ పద్ధతిలో అప్పగించాలనే యోచన కూడా చేశారు. పైగా గతంలో రూ.1.20కే చేప పిల్లను సరఫరా చేయగా, ఈసారి రూ.2వరకు సరఫరా చేసేలా మార్గదర్శకాల్లో మార్పు తీసుకొచ్చారు. ఇదంతా అడ్డగోలు దోపిడీ కోసమేనన్న విమర్శలొచ్చాయి.
ఇలా తరచూ నిబంధనలు మారుస్తూ 45 రోజుల పాటు కాలయాపన చేశారు. ఈలోగా కేంద్రం మంజూరు చేసిన రూ.12 కోట్ల నిధులు మురిగిపోయాయి. దీంతో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది.
ఆశగా ఎదురు చూశాం
సోమశిల ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని నిల్వ చేసే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై ఆధారపడి మా సొసైటీ సభ్యులు జీవనోపాధి పొందుతుంటాం. 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్‌లో చేపల పట్టుబడి ద్వారా ఏటా రూ.30–40లక్షల ఆదాయం వస్తుంది.
ఈ ఏడాది మత్స్యశాఖ చేప పిల్లలు విడుదల చేస్తుందని ఆశగా ఎదురు చూశాం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్‌లోనూ ఒక్క పిల్ల కూడా వదలలేదు. – వట్టికాల బాలయ్య, ప్రధాన కార్యదర్శి, మత్స్యకార సొసైటీ, సోమశిల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెల్లూరు జిల్లా
మత్స్యకారులకు తీరని నష్టం
సొసైటీ మత్స్యకారులకు మేలు చేకూర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచి్చన జీవో 217పై ఎన్నికల్లో కూటమి నేతలు లేనిపోని దు్రష్పచారం చేశారు. అధికారంలో రాగానే ఈ జీవోను రద్దుచేసి మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారు. మంచినీటి వనరుల్లో చేప పిల్లలు వదిలే విషయంలో చేతులెత్తేయడంతో మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లే అవకాశం ఉంది. – కొండూరు అనిల్‌బాబు, కో–ఫిషర్‌మెన్ ఫెడరేషన్, మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment