
సాక్షి, విశాఖపట్నం: గ్రూపు–2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవైపు పరీక్ష వాయిదా వేయిస్తున్నామని చెప్పి.. మరో వైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ‘అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు విద్యా శాఖ మంత్రి లోకేశ్ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము వాయిదా వేయమనే చెప్పామంటూ సీఎం పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఆడియోను ప్రజలంతా విన్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్ల మీద కేసులు పెట్టారు.
ఇంత అయోమయం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. చివరిదాకా వాయిదా వేస్తున్నామని నమ్మించి ఈ ప్రభుత్వం గ్రూప్–2 అభ్యర్థులను మోసం చేసింది. ప్రభుత్వ వైఖరిని, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. సీఎం వెంటనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్ష వాయిదా వేయాలి. అభ్యర్థుల ఆందోళనపై స్పష్టతనిచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment