
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ నిలదీశారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగులేమైనా బిక్షగాళ్ళా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కోసం పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.
‘‘ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు చాలా జీవితం కోల్పోతున్నారు. గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. కూటమి ప్రభుత్వమంటే పెద్ద అబద్ధం. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని కూటమి ప్రభుత్వం అవసరమా?. గ్రూప్-2 అభ్యర్థులను తీవ్ర కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. చిన్న అంశాన్ని తేల్చుకోలేక నిరుద్యోగులను బలిచేస్తారా?. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?. 40 ఏళ్ల సీనియర్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నా వినడం లేదంటాడు. సీఎం మాట ఏపీపీఎస్సీ ఛైర్మన్ వినకపోవడమేంటి?’’ అంటూ జూపూడి ప్రశ్నించారు.
‘‘సీఎంగా చంద్రబాబు అన్ ఫిట్. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటున్నారు. లోపాలుంటే ఎందుకు సరిచేయలేకపోతున్నారు. వైఎస్ జగన్‌పై అపవాదు వేయాలని చూస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయ్యింది గాడిదలు కాస్తున్నారా? ఇన్ని రోజులూ. గందరగోళం సృష్టించడానికి కాదు.. మీకు అధికారం ఇచ్చింది. పది రోజుల నుంచి అభ్యర్ధుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎగ్జామ్‌కి ఒక రోజు ముందు నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరుసటిరోజు చంద్రబాబు ఆడియో లీక్ చేశారు. సీఎం మాట విననప్పుడు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను తక్షణమే ఆమెను తొలగించండి’’ అంటూ జూపూడి ప్రభాకర్ అన్నారు.
ఇంత గందరగోళం నడుస్తుంటే.. ఏపీపీఎస్ ఛైర్మన్ ఎందుకు నోరువిప్పడం లేదు. వైఎస్ జగన్ బయటికెళితే కేసు. ఆయనకి సెక్యూరిటీ తీసేస్తారు. నిరుద్యోగుల తరపున మాట్లాడితే అరెస్టులు. చిన్న సమస్యకు పరిష్కారం చూపలేనోళ్లు పోలవరం కడతారంట. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ స్వతంత్రంగా పనిచేసిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారు. నిరుద్యోగులు టెర్రరిస్టులు కాదు. ప్రభుత్వమే నిరుద్యోగుల గొంతు కోసేస్తే ఎలా?. నిరుద్యోగుల తరపున వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.. ఉద్యమాన్ని చేపడతాం. చంద్రబాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’’ అని జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment