
సాక్షి, విజయవాడ: ఏపీలో గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 175 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
శనివారం జరిగింది ఇదీ..
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట.
ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది.
వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం.

ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్‌కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్-2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment