Group-2 exams
-
పేపర్–1 కఠినం.. పేపర్–2 మధ్యస్థం..
సాక్షి, హైదరాబాద్/అనంతగిరి: టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలు ఆదివారం మొదటిరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో మొదటి, రెండో పేపర్ పరీక్షలు నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీజీపీఎస్సీ ఇప్పటికే జారీచేసిన గ్రూప్స్ నోటిఫికేషన్లలో ఇదే చివరిది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–3 పరీక్షలు పూర్తికాగా.. గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ కూడా చేశారు. కాగా, ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ కఠినంగా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు.అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని లోతుగా పరిశీలించేలా ్రçపశ్నపత్రం ఉందని మెజార్టీ అభ్యర్థులు చెప్పారు. ఇస్త్రో, జాతీయ అవార్డులు, ఖేలో ఇండియా, కాగ్, విద్యుత్ వాహనాలు, నీతి అయోగ్, వికలాంగులు, సీనియర్ సిటీజన్స్, జాగ్రఫీ, ఐఐటీలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని వెల్లడించారు. దీంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని ఎక్కువ మంది అభ్యర్థులు తెలిపారు.పేపర్–2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించిన ప్రశ్నల్లో హిస్టరీ కఠినంగా ఉండగా, పాలిటీ కాస్త సులభంగా ఉందని పేర్కొన్నారు. సొసైటీపై ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ప్రధానంగా తెలంగాణ హిస్టరీపై అడిగిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలరని పేర్కొన్నారు. 46.3 శాతమే హాజరు గ్రూప్–2 పరీక్ష మొదటిరోజు సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. మొత్తం 783 ఉద్యోగాల కోసం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 74.96 శాతం మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. పేపర్–1 పరీక్షకు 2,57,981 మంది (46.75%), పేపర్–2 పరీక్షకు 2,55,490 మంది (46.30%) మాత్రమే హాజరయ్యారు. అయితే పరీక్షల నిర్వహణ పూర్తయ్యి జవాబు పత్రాలు మొత్తం అందిన తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ సెంటర్ (కేంద్రం కోడ్ 4419) లో ఓ అభ్యర్థి వద్ద మొబైల్ ఫోన్ లభించటం కలకలం రేపింది. హాల్‌టికెట్ నంబర్ 2284419441 కలిగిన అభ్యర్థి వద్ద మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వా«దీనం చేసుకు న్నారు. ఆ అభ్యర్థి పరీక్ష రాయకుండా అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అతడిపై మాల్‌ప్రాక్టీస్ చట్టం 25/97 కింద చర్యలు తీసుకొంటామని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలు ఏర్పాటుచేశారు. -
TS: గ్రూప్–2 వాయిదాకే ఛాన్స్!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–2 అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ ఈ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థులు కలవరపడుతున్నారు. గ్రూప్–2 అర్హత పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 2–3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావడంతోపాటు ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది. ఈ లెక్కన మరో 10 రోజుల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీకి మరో సమస్య ఎదురైంది. టీఎస్సీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డితోపాటు ఐదుగురు సభ్యులు గవర్నర్‌ను కలసి రాజీనామాలు సమర్పించాలనుకున్నా ఆమె సమయం ఇవ్వకపోవడంతో గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖలు పంపారు. అయితే రాజీనామాలు పంపి వారం దాటినా గవర్నర్ కార్యాలయం నుంచి వాటిని ఆమోదిస్తున్నట్లుగానీ.. తిరస్కరిస్తున్నట్లుగానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సమాచారం. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే తప్ప కొత్తగా చైర్మన్‌ను, సభ్యులను నియమించే అవకాశం లేదని అంటున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వారి రాజీనామాలతో సంబంధం లేకుండా అప్పటికే ఖాళీగా ఉన్న మరో ఐదుగురు సభ్యులను నియమించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొత్త చైర్మన్, సభ్యులు వచ్చాకే పరీక్షలు? ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం పాలనా వ్యవహారాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. పరీక్షల నిర్వహణ, నియామకాలకు సంబంధించిన అంశాల్లో చైర్మన్, సభ్యుల నిర్ణయమే కీలకపాత్ర పోషించనుంది. దీంతో జనవరిలో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కష్టమేనని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటై మరోమారు తేదీలు ప్రకటించే వరకు అభ్యర్థులు పరీక్షల సన్నద్ధతను కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో వెలువడిన నోటిఫికేషన్... రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు నెలపాటు అవకాశం కల్పించింది. దీంతో 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్–2 అర్హత పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పలు పరీక్షలను కమిషన్ రీషెడ్యూల్ చేసింది. దీంతో గ్రూప్–2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా పడగా... అభ్యర్థుల ఒత్తిడి, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రెండోసారి జనవరికి వాయిదా పడ్డాయి. -
Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్‌పోన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పరీక్ష తేదీ రీ షెడ్యూల్ చేస్తారా.. లేక కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలపై రివ్యూ చేసిన ప్రభుత్వం.. గ్రూప్ ఎగ్జామ్స్‌పై స్పష్టత ఇవ్వలేదు. కాగా తెలంగాణలో గ్రూప్-2కు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని మోదీతో భేటీ -
గ్రూప్–2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచన లు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల ఆందోళనకు చెక్ ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఐదు నెలల క్రితమే తెలిపింది. కమిషన్ షెడ్యూల్ ఆధారంగా ఆగస్టులో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలకు గురుకుల బోర్డు సన్నద్ధమై పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించి నిర్వహిస్తోంది. వరుసగా ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తుండటం... ఆ తర్వాత 29, 30 తేదీల్లో 5.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే గ్రూప్–2 పరీక్షలుండటంతో అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రమవుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఈక్రమంలో పలు రకాలుగా కమిషన్‌కు వినతులు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కమిషన్ కార్యాలయ ముట్టడికి సైతం అభ్యర్థులు దిగడం... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం... మరోవైపు కొందరు అభ్యర్థులు న్యాయపోరాటానికి సైతం ఉపక్రమించడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో అభ్యర్థుల ఆందోళనకు చెక్ పడింది. -
ఒకే నెలలో ఇన్ని పరీక్షలా?
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రి: గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ గురువారం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగ అభ్యర్థులు ప్రయత్నించారు. వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు నిరసన గళంతో కదం తొక్కారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించగా మరికొందరు కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ స్వయంగా వచ్చి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్లబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. వీరికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. ఆగస్టులో గురు కుల, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, ఒకేసారి నాలుగు పరీక్షలు నిర్వహిస్తే ఎలా సిద్ధం కావాలని ప్రశ్నించారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన గ్రూప్–2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి అభ్యర్థులను అక్కడ నుంచి పంపించి వేశారు. ఉదయం నుంచీ ఉద్రిక్తత గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పరీక్షలు దాదాపుగా ఒకే సమయంలో నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కొందరు సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. అయితే కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం టీఎస్పీఎస్సీ ముట్టడికి టీజేఎస్, కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో ఉదయం నుంచీ ఉద్రిక్తత నెలకొంది. ఓయూ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కోదండరాంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులు నిరుద్యోగులకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్–2 పరీక్షల వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సీహెచ్ చంద్రశేఖర్‌తో పాటు 149 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్.. తదితర నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్–2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జూన్ 26న, జూలై 24న రెండుసార్లు టీఎస్పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించలేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. -
టీఎస్పీఎస్సీ ఉక్కిరిబిక్కిరి.. పరీక్షల నిర్వహణ పరీక్షే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సతమతమవుతోంది. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను వాయిదా వేయాలంటూ ఒకవైపు ఒత్తిడి పెరుగుతుండగా... మరోవైపు ఇప్పటివరకు తేదీలు ప్రకటించని పరీక్షల నిర్వహణ ఎలా అనే అంశం కమిషన్‌కు తలనొప్పిగా మారుతోంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముంచుకొస్తోంది. ఆ తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు, అనంతరం పార్లమెంటు ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం అత్యంత కీలక కార్యక్రమాల్లో బిజీ కానుంది. దీంతో ఆలోపు అర్హత పరీక్షలను నిర్వహించాలని మొదటినుంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్న టీఎస్పీఎస్సీకి ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడటం లేదు. తాజాగా టీఎస్పీఎస్సీని గ్రూప్–2 వాయిదా డిమాండ్ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నాలుగు నెలల క్రితమే ప్రకటించింది. ఈ క్రమంలో సమయం తక్కువగా ఉన్నందున గ్రూప్–2కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, మరికొంత సమయం ఇవ్వాలని, ఇందులో భాగంగా పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో పాటు కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం టీఎస్పీఎస్సీని ఇరకాటంలో పడేసినట్లయింది. ‘లీకేజ్’తో గందరగోళ పరిస్థితులు.. గురుకుల విద్యా సంస్థల్లో దాదాపు 9వేలకు పైబడి ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రస్తుతం అర్హత పరీక్షలను నిర్వహిస్తోంది. అన్ని పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తున్న టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 23వ తేదీ వరకు విరామం లేకుండా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి వేగంగా పరీక్షలను పూర్తి చేస్తోంది. మరోవైపు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సైతం ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా పరీక్షల నిర్వహణలో బిజీ అయ్యింది. దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీతో వివిధ రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ... షెడ్యూల్‌ను రూపొందించి పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్న కమిషన్... ఇదివరకే నిర్వహించిన నాలుగు రకాల పరీక్షలను రద్దు చేయడం... మరో రెండు పరీక్షలను వాయిదా వేయడం... మరికొన్నింటిని రీషెడ్యూల్ చేయడంతో రూపొందించుకున్న ప్రణాళిక గాడి తప్పింది. ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ క్రమంగా పరీక్షలను నిర్వహిస్తూ ముందుకెళ్తుండగా... ఇప్పుడు గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఇరకాటంలో పడింది. వాయిదా వేస్తే... మరో రెండు నెలల్లో ఎన్నికల సమయం ఆసన్నం కానుంది. వరుసగా ఎన్నికలుండటంతో కొంతకాలం పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం, ఇతర పరిపాలనాధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీ అయితే, పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షల వాయిదా ఒక డిమాండ్ అయితే... ఇంకా కొన్ని రకాల పరీక్షలకు తేదీలు ప్రకటించకపోవడం మరో అంశం. గ్రూప్–3 పరీక్షతో పాటు డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓలతో పాటు డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ తదితర పోస్టులతో పాటు చిన్నాచితకా పోస్టులకు ఇంకా టీఎస్పీఎస్సీ తేదీలే ఖరారు చేయలేదు. ఇప్పుడున్న డిమాండ్‌ను పరిగణించి పరీక్షను వాయిదా వేస్తే ఆ ప్రభావం మిగతా పరీక్షల నిర్వహణపైన పడుతుంది. ఎన్నికల సమయం నాటికి పరీక్షలు పూర్తిచేయకపోతే, ఆ తర్వాత కొంతకాలం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని కమిషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఎంతో శ్రద్ధతో పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు అసహనానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
గ్రూప్-2 ఎగ్జామ్.. విషాదం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చీడికాడ మండలం ఖండివరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాత్రూమ్లో విద్యుత్ షాక్‌తో గ్రూప్-2 విద్యార్థిని కోమలి మృతి చెందింది. పరీక్ష రాసేందుకు ఆటోనగర్‌లో ఉన్న తండ్రి వద్దకు విద్యార్థిని వచ్చింది. మరికాసేపట్లో ఏపీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జగరనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కోసం పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయి.. సిద్ధంగా ఉన్న కోమలి ఆకస్మికంగా మరణించడంతో ఖండివరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఇన్విజిలేటర్ల వల్లే డబుల్ బబ్లింగ్
సాక్షి, హైదరాబాద్: ఇన్విజిలేటర్లకు తగిన అవగాహన లేకపోవడం వల్ల గ్రూప్–2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్ చోటు చేసుకుందని పలువురు అభ్యర్థులు హైకోర్టుకు నివేదించారు. వ్యక్తిగత వివరాలను ఎలా నమోదు చేయాలన్న విషయంలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల, వారు తమకు సరైన మార్గదర్శకత్వం చేయలేదని, దీంతో డబుల్ బబ్లింగ్ చోటు చేసుకుందని వారు వివరించారు. ఈ డబుల్ బబ్లింగ్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కూడా ఓ కారణమని తెలిపారు. గ్రూప్–2 పరీక్షలో డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను, వైట్నర్ వాడిన వారికి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయని వారికి తదుపరి ప్రక్రియలో అవకాశం ఇవ్వరాదంటూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గందరగోళం వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు సాంకేతిక కమిటీ కూడా తేల్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లను తీవ్రంగా పరిగణిస్తే అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీనియర్ న్యాయవాదుల కమిటీ కూడా డబుల్ బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. -
గ్రూప్–2 జవాబు పత్రాలు పరిశీలిస్తాం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల్లో వైట్నర్ వాడిన, బబ్లింగ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారన్న ఆరోపణల నేపథ్యంలో.. అభ్యర్థుల జవాబు పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. టాప్–5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తామని, ఇందుకోసం ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ వ్యవహారంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘వైట్నర్’తో వివాదం టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2015లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్ల)పై వైట్నర్ ఉపయోగించరాదని, వివరాల నమోదులో తప్పులు చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పరీక్ష నిబంధనల్లో స్పష్టం చేసింది. అయితే పరీక్ష నిర్వహించిన అనంతరం.. వైట్నర్ వినియోగించిన, బబ్లింగ్‌లో, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినవారిని కూడా టీఎస్పీఎస్సీ అర్హులుగా గుర్తించిందంటూ వివాదం తలెత్తింది. దీనివల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోయారని, గ్రూప్–2 నియామకాలను నిలిపేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు వైట్నర్ వాడిన వారి సంఖ్య తక్కువని, ఆ కారణంతో మొత్తం నియామక ప్రక్రియను నిలిపేయవద్దంటూ మరికొందరు పిటిషన్లు వేశారు. ఆ వ్యాజ్యాలన్నింటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు.. తాజాగా బుధవారం మరోసారి విచారణ జరిపారు. మార్గదర్శకాలను ఉల్లంఘించడమే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఓఎంఆర్ షీట్లలో సమాధానాల బబ్లింగ్, వైట్నర్ వినియోగం విషయంలో టీఎస్పీఎస్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని కోర్టుకు వివరించారు. వాటి ప్రకారం వైట్నర్ను ఉపయోగించకూడదని.. కానీ వైట్నర్ వాడి న, బబ్లింగ్‌లో తప్పులు చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా గుర్తించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 1,032 పోస్టుల భర్తీ కోసం 1:3 పద్ధతిన 3,096 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని కోర్టుకు వివరించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఓఎంఆర్ షీట్ల పరిశీలనకు సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్పీఎస్సీ అధికారుల సహాయంతో.. టాప్ 5 వేల మంది మెరిట్ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలించాలని సూచించారు. అనంతరం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. శని, ఆదివారాల్లో కమిటీ పరిశీలన జరుపుతుందని.. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, సంబంధిత రికార్డులను అందుబాటులో ఉంచాలని టీఎస్పీఎస్సీ అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదికను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. -
గ్రూపు-2 పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
-
గ్రూప్-2 కోసం అదనంగా 1000 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 13 తేదీల్లో జరుగనున్న గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 1000 బస్సులు అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తారని, ఎన్ఫోర్స్మెంట్ కోసం 6 జీపులలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని, బస్సుల సమాచారం కోసం కోఠి బస్‌స్టేషన్ 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్ 99592 26154 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
మంగళసూత్రాల ప్రస్తావన తేలేదు!
⇒ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్: ఈ నెల 11వ తేదీన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రంలో 8 లక్షల మంది హాజరవుతున్నారని, అంతమంది ఒకేసారి పరీక్ష రాయడం ఇదే మొదటిసారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఎలాంటి సమస్య లేకుండా పరీక్ష నిర్వహిస్తామని, మహిళా అభ్యర్థులు మంగళసూత్రం ధరించి పరీక్షకు వెళ్లవద్దని కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నాయని, అది చాలా దౌర్భాగ్యమైన విషయమని, తాము ఎక్కడా మంగళసూత్రాల ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మెహిందీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు చర్మంపై మెహిందీ ఉంటే ఫింగర్‌ప్రింట్స్ సరిగ్గా రికార్డ్ కావని, దానికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బ్లూటూత్ లాంటి పరికరాలను అనుమతించడం లేదని తెలిపారు. తమ వద్ద అభ్యర్థుల పూర్తి సమాచారం ఉందని, కేవలం ఆధార్‌కార్డు తీసుకుని రావాలని వెల్లడించారు. పరీక్షరాసే 8 లక్షల మంది అభ్యర్థుల్లో మూడున్నర లక్షలమంది హైదరాబాద్‌లోనే సెంటర్ కావాలని అడిగారని, కాని హైదరాబాద్‌లో కేవలం లక్షా 20 వేలమందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయని మిగిలిన వారికి మిగిలిన ప్రాంతాల్లో కేంద్రాలు కేటారుుంచామని తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ అడిగితే ఇతర జిల్లాలకు వేశారని ప్రశ్నిస్తున్నారని, వారు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం వస్తే రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సి వస్తుందని, రెండురోజులు పరీక్షరాయడానికే ఇబ్బందిపడితే ఉద్యోగం వస్తే 30 సంవత్సరాలు తెలంగాణ మొత్తం తిరగాల్సి వస్తుందని అన్నారు. పరీక్షహాల్లో ఎవరైనా ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని, అలా సృష్టించేవారిని వదిలిపెట్టే అవకాశం లేదని, జాతీయ స్థాయిలో ఉన్న పరీక్షలతో సహా అన్ని పరీక్షలు రాయకుండా చేసే అధికారాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. -
11, 13 తేదీల్లో గ్రూపు-2 రాత పరీక్ష
⇒ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ ⇒ ఉదయం 9.45 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 గంటల వరకే పరీక్ష హాల్లోకి అనుమతి ⇒ నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు ⇒ ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి ఈనెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 రాత పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 7.83 లక్షల మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తిచే సినట్లు వెల్లడించారు. ఈనెల 7 వరకు 6.32 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌డెస్క్‌లో (040-24655555, 040-24696666, 7288896611) సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను తమ వెబ్సైట్ ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాటిని విద్యార్థులు మరోసారి జాగ్రత్తగా చదువుకుని పాటించాలన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని ఉదయం 9.45 గంటల వరకే అనుమతిస్తామని, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 2.15 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. వీలైనంత ముందుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇవీ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ప్రభుత్వ ఉద్యోగి అరుుతే సంస్థ ఐడీ కార్డు) తప్పనిసరిగా తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తెచ్చుకోవాలి. పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, డిజిటల్ ఫొటో తీసుకుంటారు. ఆ వివరాలను టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తారు. అభ్యర్థులు షూస్ వేసుకొని రావద్దు. ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించి రాకూడదు. ఎలక్టాన్రిక్ గాడ్జెట్లు, మొబైల్ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటుపుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ పరికరాల వంటివి తీసుకురావొద్దు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు (మెహిందీ), ఇంక్ వంటివి ఉండకూడదు. ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలి. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్‌లను మూల్యాంకనం చేయరు. ఇదీ షెడ్యూలు.. 11న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. పేపరు-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) 11న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ) 13న ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) 13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్). -
గ్రూప్-2 పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: జిల్లాలో డిసెంబర్ 1న నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీపంలో జెరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలు, సెల్‌ఫోన్ విక్రయ కేంద్రాలకు నోటీసులు జారి చేసి పరీక్ష రోజున మూసి వేసేలా చూడాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా నిషేధించాలని తెలిపారు. అభ్యర్థులను నిర్ణీత సమయం కంటే ముందుగా పంపవద్దన్నారు.